కలిసుందాం రా! - సగ్గు రాజయ్య

    "అమ్మా! నాకు ఉద్యోగం వచ్చిందమ్మా!" కొరియర్ దగ్గిర నుండి కవర్ తీసుకుని చింపి లెటర్ చదువుతూ అన్నాడు సంతోషంగా శ్రీకాంత్.
 
    "ఎక్కడ నాయనా?" అంది తల్లి కూడా సంతోషిస్తూ.
 
    "రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టరుగానమ్మా, ట్రైనింగ్ అంతా పూర్తయ్యింతరువాత ఇది పోస్టింగ్ లెటరమ్మా"
 
    "ఎక్కడ ఇచ్చారురా పోస్టింగ్ ఆర్డరు?"
 
    "మహారాష్ట్రలో రోటెగావ్ అనే స్టేషనులోనమ్మా."
 
    "అబ్బో! ఆ స్టేషను ఎక్కడ ఉంటుందిరా?"
 
    "మనం... షిర్డీ వెళ్ళే దార్లోనమ్మా."
 
    "మంచిది నాయనా. ఆ షిర్డీ సాయి దయగలిగి స్వామి గుడికి వెళ్ళే దారిలో నీకు ఉద్యోగం ఇచ్చాడు. బాబా దయగలవాడు నాయనా!"
 
    "ఔనమ్మా! నేను హైదరాబాదులో ప్రయివేటులో పనిచేస్తున్నప్పుడు మ్రొక్కుకున్నానమ్మా నాకు రైల్వేలో ఉద్యోగం వస్తే షిర్డికి వస్తానని."
 
    "సరే నాయనా, ఆ స్వామిని దర్శించుకోవడానికి నేనూ వస్తాను."
 
    "అలాగేనమ్మా."

    ఓ వారం రోజుల్లో అన్నీ సర్దుకుని రోటేగావ్‌లో డ్యూటీలో జాయిన్ కావడానికి రైలెక్కాడు శ్రీకాంత్.

    చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్‌కు. జీవితంలో ఓ ముఖ్యమైన మలుపు.అందులోనూ రైల్వేలో ఉద్యోగం. ఉదయం అయిదు నలభైకి చేరుకుంది నగర్‌సోల్‌కు. సూట్‌కేస్ పట్టుకుని దిగి, ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టరుతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత నగర్‌సోల్ నుండి నాందేడ్ వెళ్లే ప్యాసింజరులో ఎక్కి రోటెగావ్ స్టేషన్‌లో దిగాడు. రోటెగావ్‌లో అజంతా ఎక్స్‌ప్రెస్ ఆగదు కాబట్టి నగర్‌సోల్ వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చాడు.

    బండి దిగి సూట్‌కేస్ పట్టుకుని రోటెగావ్ స్టేషన్‌లో అడుగు పెట్టాడు.

    బయట డ్యూటీ స్టేషన్ మాస్టరు నేంబోర్డు చూశాడు కాబట్టి "హలో కాంబ్లె సాబ్, నేను కొత్తగా జాయిన్ కావడానికి వచ్చిన అసిస్టెంట్ స్టేషను మాస్టరును" అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఇంగ్లీషులో చెబితే అతను హిందీలో సంభాషణ మొదలు పెట్టాడు.

    "మీ పేరు ఏమిటి?"

    "శ్రీకాంత్ పాలకొల్లు... ఆంధ్రా నుండి. స్టేషను మానేజరు ఎప్పుడు వస్తారు?"

    తారూర్‌కు అవుట్ రిపోర్టు ఇచ్చి; సెక్షన్ కంట్రోలర్‌కు టైమింగ్స్ ఇచ్చి కుర్చీలో కూర్చుంటూ, "ఆయన తొమ్మిది తర్వాత వస్తారు. మీ జాయినింగ్ లెటర్ చూపించండి" అన్నాడు.

    సూట్‌కేసు ఓపన్‌చేసి డైరీలో పెట్టిన జాయినింగ్ లెటరు తీసి ఇచ్చాడు. అది చూసి తన టేబుల్‌కు ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ "కూర్చోండి" అన్నాడు.

    శ్రీకాంత్ కూర్చొని గదిని కలయచూస్తున్నాడు. ఎదురుగా స్టేషన్  యార్డ్ యొక్క పొదనూర్ పానెల్ బోర్డు, దానికి రెండువైపులా కౌంటర్లమీద బ్లాక్ ఇన్స్‌ట్రుమెంట్లు, మాస్టారు గారి టేబుల్‌మీద గేట్‌ఫోను; కంట్రోలు ఫోన్లు ఉన్నాయి. గోడలకు ట్రైన్ సేఫ్టీ పోస్టర్లు, హాట్‌యాక్సిల్ డెటెక్టింగ్ పోస్టర్లు, అన్‌మాన్డ్ లెవెల్ క్రాసింగ్ దగ్గర రోడ్ వెహికిల్స్‌కు తీసుకోవలసిన జాగ్రత్త పోస్టర్లు ఉన్నాయి. అలాగే క్వార్టర్స్ పెట్టీ రిపేర్ రిజిస్టర్ బాక్సు ఉంది. ఇంకో ప్రక్కన మూలకు టికెట్ డబ్బులు దాచేందుకు ఐరన్ సేఫ్ కూడా ఉంది. 

    ఈలోపల కాంబ్లె మాస్టరు "మీకు జోనల్ ట్రైనింగ్ స్కూల్లో ఇవన్నీ నేర్పించారుగదా" అన్నాడు.

    "ఔను. స్టేషనుకు సంబంధించిన రికార్డ్సు, సిగ్నలింగ్ సిస్టమ్స్‌లో మెకానికల్ లోయర్ క్వాడ్రెంట్, అప్పర్ క్వాడ్రెంట్, ప్యానెల్ ఇంటర్‌లాకింగ్, రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్, ఇంకా డి.టి.సి(డైలీ టికెట్ చెకింగ్) టికెట్ ట్యూబ్ అరేంజిమెంట్సు, ట్రైన్ సేఫ్టీ రన్నింగ్ అరేంజిమెంట్లు నేర్పించి పరీక్ష పెట్టి పాస్ అయ్యింతరువాతనే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు. మీకు కూడా అలాగే ఉండేది కదా" 

    "అయితే ఏమీ ప్రాబ్లమ్ లేదు. మీరు ఈ స్టేషన్లో ఎన్ని రోజులు లెర్నింగ్ కావాలో తీసుకుని; మీకు వర్కింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింతర్వాతనే ఇండిపెండెంట్ చార్జి తీసుకోండి. తొందరపడి చార్జి తీసుకుంటే మన ఉద్యోగాన్ని ఎవడూ రక్షించడు!" అన్నాడు తన ఎక్స్‌పీరియన్స్‌తో.

    "ఔను సార్; సేఫ్టి ఫస్ట్, అండ్ ఆల్‌వేస్"

    "వెరీగుడ్ మీరు వెళ్లి బేడెకర్ రూములోప్రెష్ అవండి. టిఫిన్ చేసుకుని మెల్లిగా వచ్చి పెద్ద మాస్టరుగారికి జాయినింగ్ లెటరు ఇవ్వండి" అన్నాడు లెటర్ తిరిగి ఇచ్చేస్తూ.

    "ఆయన క్వార్టర్ ఎక్కడ సార్"

    "పాయింట్స్‌మాన్‌ని వెంట పంపిస్తాను" అంటూ నామ్‌దేవ్ లోపలికి రా!" అన్నాడు.

    పాయింట్స్‌మాన్ వచ్చాడు.

    "ఈయన కొత్త మాస్టరుగారు. బేడేకర్‌సాబ్ క్వార్టర్ చూపించు. ఈ బేడేకర్‌నే మీరు రిలీవ్ చెయ్యాలి. అతను మారీడ్ బ్యచిలర్. అతను వెళ్లిపోతే ఆ క్వార్టరు మీదే!" అన్నాడు.

    "సరే సార్" అన్నాడు శ్రీకాంత్.

    పాయింట్స్‌మాన్ సూట్‌కేస్ పట్టుకుని ముందునడిచాడు. అతన్ని అనుసరించాడు శ్రీకాంత్.

    వారం రోజులు స్టేషన్ విధులన్నీ లెర్నింగ్ తీసుకుని ఇండిపెండెంట్ చార్జి తీసికున్నాడు. బేడేకర్ అసిస్టెంట్ స్టేషను మాస్టర్‌ను రిలీవ్ చేశాడు. బేడేకర్ ఉన్నప్పుడు కలిసి కుక్ చేసుకునేవాళ్లు. అతను వెళ్లిపోయింతరువాత డ్యూటీ అయిపోయినతరువాత వచ్చి వంట చేసుకోవడం శ్రీకాంత్ వల్ల కావడంలేదు. డ్యూటీ అయిపోగానే అలాగే వచ్చి మంచం మీద వాలి పొయ్యాడు, అలసటతో, ఆకలితో! అమ్మ...అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి అప్పుడు!

    ఉద్యోగం వచ్చిందని తెలియగానే అమ్మ సంబంధాలు చూడటం ప్రారంభించింది.

    "నిర్మలగారూ! మీ అబ్బాయికి రైల్వేలో ఉద్యోగం వచ్చిందట కదా! మా చుట్టాల్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తూంది. మీ తాహతుకు తగ్గట్టుగా కట్నకానుకలు సమర్పించుకుంటారు. మీరు ఊఁ అంటే రేపే పెళ్లి చూపులు అరేంజిచేస్తాను" అంది అమ్మకు బాగా తెల్సినావిడ.

    "సరేనండీ. మా అబ్బాయితో మాట్లాడి చెపుతాను" అన్నది.

    "శ్రీకాంత్! నీకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే సంబంధాలు వస్తున్నాయిరా. నీవు ఔనంటే నేను ముందుకు అడుగేస్తాను."

    "ఇప్పుడే ఎందుకమ్మా. నేను డ్యూటీలో జాయిన్ అవ్వకముందే ఈ తొందర పనులు ఎందుకమ్మా."

    "నీవు పెళ్లి ఇప్పుడే చేసుకోకురా, ఇప్పుడు అమ్మాయి మనదనిపించుకుంటే చాలు!"

    "అదేం మాట. నాకు అర్థం కాలేదు."

    "దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందిరా? కట్నాలు లాంచనాలు మాట్లాడుకుని, ఎంగేజ్‌మెంటు చేసుకుంటే సరిపోతుంది!"

    "ఎందుకులేమ్మా ఉద్యోగం వచ్చి, నేను ఒక నెల జీతం కూడా తీసుకోలేదు. ఇంత హడావిడి ఎందుకమ్మా?"

    "హడావిడి అంటావేమిటిరా? చదువు, పర్మినెంటు ఉద్యోగం అంటూ ఇన్నేళ్లు సాగదీశావు. ఇప్పుడు నీ మాట వినేదిలేదు. ఇప్పుడు నేను చెప్పినట్లు నీవు వినాలి!"

    "అలాగేనమ్మా వింటాను. అమ్మాయిని కుదుర్చుకుని అన్ని విషయాలు మాట్లాడుకుని, ఎంగేజ్‌మెంటు చేసికుని ఏడాదిలోపు పెళ్లిచేసికుంటాను"

    పెళ్లిచూపులు అరేంజి చేసింది మధ్యవర్తి.

    "మీరు పెళ్లికాగానే మహారాష్ట్ర వెళ్లిపోతారా?" నిరాశతో అడిగింది అమ్మాయి.

    "నీకు మహారాష్ట్రకు రావడం ఇష్టంలేదా?"

    "మీరు ఆంధ్రాకు, అందులో హైదరాబాదుకు వస్తే బాగుంటుంది. నేను మాత్రం మహారాష్ట్రకు రాను" ఆ ఖండితత్వానికి నివ్వెర పోయాడు శ్రీకాంత్.

    సరే, ఆ చిన్నస్టేషన్లలో ఏం లైఫ్ ఉంటుందని అనుకుని; "సరే, నేను వెళ్లింతర్వాత ట్రాన్స్‌ఫర్‌కు ట్రైచేస్తాను" అన్నాడు. ఆ మాటతో అమ్మాయితో సహా, అమ్మాయి తరఫు వాళ్లందరూ సంతోషించి, అంతా మాట్లాడుకుని వరకట్నం ఇచ్చి, ఎంగేజిమెంటు చేసుకున్నారు. ఆ రెండో రోజే తాను రోటేగావ్‌కు డ్యూటీలో జాయిన్ కావడానికి వచ్చాడు.

    రెండు నెలల తర్వాత పదిరోజుల జాయినింగ్ లీవ్ తీసుకుని పాలకొల్లు వచ్చాడు శ్రీకాంత్. ఊళ్లోనే కాబట్టి తల్లిని తీసుకుని కాబోయే అత్తగారింటికి వెళ్లాడు.

    "ఎలా ఉన్నారు మహారాష్ట్రలో?" అడిగింది పద్మలత, పెళ్లికూతురు.

    "బాగానే ఉన్నాను. హిందీ వస్తే మానేజ్ చేసుకోవచ్చు" అన్నాడు.

    "మరినాకు హిందీ రాదుగా" నవ్వుతూ చెప్పింది.

    "చూద్దాం.ఈలోపల హిందీ ఏం బ్రహ్మ విద్యకాదు కదా, నేర్చుకోవచ్చు"

    "అదంతా ఏమీ వద్దు. మీరు ట్రాన్స్‌ఫర్ కావడానికి ప్రయత్నించండి"

    "అలాగే ప్రయత్నిస్తాను"

    "గట్టిగా ప్రయత్నించండి. పెళ్లి వరకు హైదరాబాద్ వచ్చేయాలి విన్నారుగా నా మాట" గోముగా చెప్పింది.

    "అలాగే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను" అని ఇద్దరూ సెలవు తీసుకుని వచ్చేశారు. 

    ఇక తనవెంటే తల్లిని తీసికెళ్లి రోటేగావ్, షిర్డి చూపించి, రిజర్వేషన్ చేయించి మన్మాడ్ - కాకినాడ బండి ఎక్కించాడు.

* * *
    వారం తర్వాత ఓ మధ్యాహ్నం "సార్ మీరు పన్నెండు గంటలు ట్రైన్ సర్వీసు చేసి, ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటే కష్టమౌతుంది కద సార్" అన్నాడు పాయింట్స్‌మాన్ సురేష్.
   
     "ఔను సురేష్! ఎవరైనా పనివాళ్లు దొరుకుతారా ఇక్కడ?"
 
    "దొరుకుతారు సార్. నేను తీసుకురానా" అన్నాడు.
 
    "తీసుకురా. ఇంటి పన్లన్నీ చేసుకుని పన్నెండుగంటలు రైల్వే డ్యూటీ చెయ్యాలంటే రెస్ట్‌లెస్ అవుతుంది" అన్నాడు.
 
    మరుసటిరోజు ఉదయం శ్రీకాంత్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తలుపుతట్టారు. వెళ్లి తలుపు తీశాడు శ్రీకాంత్.
 
    ఆమె అందమైన రూపం, డ్రెస్ చూసి షాక్ అయ్యాడు శ్రీకాంత్. పెదాలకు లిప్‌స్టిక్‌తో, ఎర్రగా కుందనపుబొమ్మలా; ఇంకా చెప్పాలంటే చూసినవారు చూపు మరల్చుకోని దివ్యసుందర విగ్రహం!
 
    "ఈమేనా పనిచేసేది?" అడిగాడు ఆశ్చర్యంగా.
 
    "ఔను సార్, ఈమె ఎం.ఏ. మరాఠీ మీడియం! ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళుతూంది. ఇంగ్లీషు కావాలని అడుగుతున్నారు. ఎక్కడ చూసినా లంచాలు, రికమెండేషన్లు! చదువుకున్నదాన్నని ఏమీ సిగ్గుపడదు. అన్ని పనులు చేస్తుంది" పాయింట్స్‌మాన్ మాటలు వింటూ ఆమెను తదేకంగా కన్నార్పకుండా చూస్తున్నాడు.
 
    "రమ్మంటారా వొద్దంటారా?" అనే మాటతో శ్రీకాంత్ ఈ లోకంలోకి వచ్చి "ఈ రోజు నుంచేనా?" అన్నాడు అనుమానంగా.
 
    "మీరు ఊఁ అంటే పని మొదలు పెడుతుంది."
 
    "సరే రమ్మను" అంటూ లోపలికి జరిగాడు. పాయింట్స్‌మన్ వెళ్లిపోయాడు.
 
    ఆమె లోపలికి వచ్చి "నా పేరు నీలు. మీపేరేమిటి?" హిందీలో అడిగింది.
 
    "నా పేరు శ్రీకాంత్. ఎం.ఏ.ఇంగ్లీష్ లిటరేచర్. పి.హెచ్.డి సంగంలో ఆపేసి ఉద్యోగానికి వచ్చాను. రోజూ ఉదయం సాయంత్రం వస్తావా?"
 
    "మీకు వేడి వేడి భోజనం కావాలంటే ఉదయం, సాయంత్రం వస్తాను."
 
    "నీకు తెల్సు గదా. స్టేషన్ మాస్టరుకు షిఫ్టు డ్యూటీలుంటాయి. నీకు ఎలా వీలుంటే అలాగే రా! జీతం ఎంతివ్వమంటావ్?"
 
    "మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి" అంది నవ్వుతూ.
 
    ఆ నవ్వుతో శ్రీకాంత్ రక్తం వేడెక్కింది. కళ్లు ఎర్రబడ్డాయి. మేకను మ్రింగే సింహంలా ఉన్నాడు. కాని ఆమె నవ్వులో చెప్పలేనన్ని భావాలున్నట్లు అనిపించిందతనికి!
 
    "నెలకు ఒక రూపాయి ఇస్తే చాలా" అన్నాడు నవ్వుతూ.
 
    "ఒకటి ప్రక్కన మూడు సున్నాలు పెట్టండి" అంది నవ్వుతూ.
 
    "ఓ.కే. అగ్రీడ్. నీ పని మొదలు పెట్టవచ్చు. నేను ఇంట్లో ఉంటే నీకేం అభ్యంతరం లేదుగా!" అన్నాడు అనుమానంగా.
 
    "భలేవారే. ఇల్లు మీది. మీకు పని చేసి పెట్టడానికి వచ్చాను. ఆ అధికారం నాకు లేదు" అంటూ చీర కుచ్చెళ్లు బొడ్లో దోపుకుని చీపురు పట్టి డ్యూటీ ఎక్కింది నీలు ఎం.ఏ.
 
    శ్రీకాంత్ బట్టలు ఉతకడ్డం, అంట్లు తోమడం, వంట చేయడం, ఇంట్లోకి కావలసిన సరుకులు; కూరగాయలు తేవడం అన్ని నీలూ చూసుకుంటూంది. నెల రోజులు గడిచిపోయాయి.
 
    "నీలు నీవు వచ్చేటప్పుడు బయటి తలుపు గొళ్లెం ఎందుకు పెడతావు" అన్నాడు నవ్వుతూ.
 
    "ఇక్కడి మనుష్యులు మహా డేంజరు మనుషులు సార్. పిలువకుండా తలుపులు తోసుకుని వచ్చి, మనం ఏం చేస్తున్నామో చూసి చిలువలు పలవలుగా చెప్పుకుంటారు."
 
    "సరే, నీ అయిడియా బాగుంది. తలుపులు వేసుకొని ఏమైనా చేసుకోవచ్చన్నమాట" అన్నాడు నవ్వుతూ.
 
    "అంటే నాకు అర్థం కాలేదు" అంది నవ్వుతూ.
 
    "ఇంతటి అందగత్తె నా ఎదురుగా తిరుగుతూంటే, కోయిల కంఠంతో తీయటి మాటలు మాట్లాడుతూంటే, నా హృదయం పట్టు తప్పిపోతోంది నీలూ! ఇక నీవు నాకు ఎటువంటి శిక్ష వేసినా సిద్ధమే" అంటూ తన బాహువుల్లో బంధించాడు. ఆమెనుండి ఎటువంటి చీదరింపుగాని, హేయ భావం రాకపోవడంతో ఫర్దర్ ప్రొసీడ్ అయ్యాడు. 
 
    "ప్లీజ్ నన్ను విడవండి. మా బస్తీ వాళ్లు చూస్తే ఊరుకోరు. నిన్ను కొడతారు" నీలు అంది భయంతో.
 
    "ఎవరూ రాకూడదు, చూడకూడదనేగా బయటి తలుపులకు గొళ్లాలు వేశావు కదా, ఇక భయం లేదు. నా యిల్లు నా యిష్టం. ఎప్పటిలాగే తలుపులు వేసుకుని పనిచేస్తున్నావు" అంటూ లాలనగా ముద్దు పెట్టుకున్నాడు.
 
    "మీ ఆంధ్రా వాళ్లు పచ్చి మోసగాళ్లు! నాలుగేళ్ల క్రితం సుమతి కొత్తగా వచ్చిన ఆంధ్ర మాష్టరు దగ్గర పనికి కుదిరింది. పెళ్లి చెసుకుంటానని మాయ మాటలు చెప్పి బాబు పుట్టింతర్వాత ట్రాన్‌ఫర్ లెటర్ తీసుకుని దొంగలాగ పారిపొయ్యాడు. తాను బ్రతకలేక, కొడుకును బ్రతికించుకోలేక ఏడుస్తూంది."
 
    "వాడెంత బుద్ధిలేని వాడు! అది తప్పుకదా, పెండ్లి చేసుకోవాలి!" అన్నాడు మోహం మత్తులో, తనకు ఎంగేజిమెంటు అయిన సంగతి తల్చుకుంటూ.
 
    "ఇంకెక్కడి పెళ్లి! ఆ మాష్టరుకు అప్పటికే పెళ్లయి ఒక పిల్లవాడు ఉన్నాడట."
 
    "ఆమె ఎలా మోసపోయింది?"
 
    "ఏం?...నీ మాయమాటలకు నేను లోబడలేదా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటే పర్వాలేదు. కాకపోతే మీ పనికి, మీకు రాంరాం!"
 
    "అలాంటిదేం లేదు. నాకు పెళ్లి కాలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను!" తనకు పద్మలతతో ఎంగేజిమెంటు సంగతి జ్ఞాఫకం ఉండి, మదిలో తొలుస్తూనే ఉన్నా మోహాతిరేకం వల్ల దాన్ని పక్కకు నెట్టాడు. ఆ ఒక్క మాటతో నీలు హృదయం చల్లబడి, అన్ని విధాల శ్రీకాంత్‌కు సహకరించింది.
 
    అప్పటినుండి నీలు శ్రీకాంత్ ఇంటిలోనే స్వంత పెళ్లాంలాగ సెటిలయిపోయింది.
 
    అయిదు నెలలు గడిచాయి.
 
    పూర్తి సంసార సుఖాన్ని అనుభవిస్తూ నీలూ చేత అన్ని సేవలు చేయించుకుంటూ స్టేషన్ మాస్టర్ విధులు నిర్వర్తిస్తున్నాడు శ్రీకాంత్.
 
    ఒకసారి నీలూతో ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టారు. వెళ్లి శ్రీకాంతే తలుపు తీశాడు.
 
    పెద్ద ఎర్ర రుమాలు కట్టిన యాభై, అరవై ఏండ్ల వ్యక్తులు నలుగురు "లోపలికి రావచ్చా మాష్టరు గారూ" అంటూ అడిగారు. 
 
    "రండి" అంటూ లోపలికి నడిచాడు శ్రీకాంత్.
 
    అందరూ ఆసీనులయ్యాక విషయాన్ని లేవదీశారు.
 
    "నీలు అయిదు నెలల నుండి నీ దగ్గరనే ఉంటుంది కదా! దాని జీవితానికి ఏదైనా మార్గం చూపించాలి!"
 
    "నేనేం దారి చూపించాలి? వంట చేసి వెళ్లిపోతుంది. నెల జీతం ఇస్తున్నాను."
 
    "ఈ ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. ముఖం పంచ్ అయిపోతుంది. ఆంధ్రాలో మళ్లీ ఎవరికీ చూపించుకోకుండా అవుతుంది."
 
    "మీరేం మాట్లాడుతున్నారు?" కోపంగా అన్నాడు శ్రీకాంత్.
 
    "సరిగ్గానే మాట్లాడుతున్నాము. ఇప్పుడు అది నాలుగు నెలల గర్భవతి! అది నీవల్లనే అయ్యింది. అందు వల్ల నీవు దాన్ని పెళ్లి చేసుకోవాలి"
 
    "నీలూ!" అంటూ నీలూవైపు తీక్షణంగా చూశాడు.
 
    "ఔను" అన్నట్లు తల ఊపింది.
 
    "నాకెందుకు చెప్పలేదు" అన్నాడు కోపంగా.
 
    "నన్ను చెప్పనిస్తేనా మీరు? ఎప్పుడూ మీ సయ్యాటలు, ముద్దు మురిపాలేగా!"
 
    "బంగారం లాంటి అమ్మాయిని పాడుచేశావు. దాన్ని పెండ్లి చేసుకోకపోతే దాని బ్రతుకు నాశనమౌతుంది."
    
    శ్రీకాంత్  ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. లోపల అల్లరి కావడంతో బయట ఇంకా జనం మూగారు. అందరూ ఒక్కటయ్యారు! మరాఠీ కాకుల్లా మాటలతో పొడుస్తున్నారు. శ్రీకాంత్ నోరు తెరిచి బిత్తరపోయాడు. నోట్లో తడిలేదు. తనవైపు మాట్లాడే వాళ్లు ఒక్కళ్లూలేరు. నీలూ బేలగా చూస్తూంది పని వదలిపెట్టి.
 
    "ఔను తప్పు నాదే! ఇద్దరం వయసు వాళ్లం. ఓకే రూములో ఉన్నందువల్ల తప్పు జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యమంటారు?" అన్నాడు ధైర్యం కూడగట్టుకుని.
 
    "దాన్ని వెంటనే పెళ్లి చేసుకోవాలి. దాని జీవితానికి మార్గం చూపించాలి." పద్మలతతో ఎంగేజిమెంటు జరిగినా, ఇక్కడ పెండ్లి చేసుకోవడం తప్పేట్టు లేదని ఆలోచించసాగాడు.
 
    "ఏం ఆలోచిస్తున్నావు? ఎట్లా మహారాష్ట్రనుండి పారిపోదామనా? అట్లా చేస్తే మేం ఏంచేస్తామో మాకే తెలియదు."
 
    "మీరు ఏం చేయక్కరలేదు. నేను నీలూను పెండ్లి చేసుకుంటాను."
 
    "ఎప్పుడు? తొందరగా కావాలి. నీవు మంగళసూత్రం తెచ్చుకో. మేం బట్టలు పూలు తెస్తాము. భోజనం ఖర్చు చెరిసగం!"
 
    "అలాగే కానివ్వండి."
 
    మరుసటి ఆదివారం రైల్వేవాళ్లు, బయటివాళ్లు, బస్తివాళ్లు కలిసి దగ్గరే ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుళ్లో పెళ్లి చేసి నీలును, శ్రీకాంత్ రైల్వే క్వార్టరులోకి అఫిషియల్‌గా పంపించారు.
 
    మరాఠీ అమ్మాయితో తెలుగు అబ్బాయి మరాఠీ ప్రాంతంలో తన వారెవరూ లేకుండా గృహస్థ జీవితం ప్రారంభించాడు ఎ.ఎస్.ఎం.శ్రీకాంత్.
 
    పెళ్లి జరిగిన మరుసటి నెలకే తల్లి నిర్మల దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఎంగేజిమెంటు చేసుకుని, ఇంకా రెండు నెలల్లో సంవత్సరం దాటిపోతుందని త్వరగా వచ్చి పెళ్లిచేసికొమ్మని - తల్లి కన్నీటి బాధ! ఆలోచనలో పడినాడు శ్రీకాంత్.
 
     అతడి వాలకం చూసి అడిగింది నీలు.
 
    "ఏమిటండీ ఎందుకలా ఉన్నారు?"
 
    "మా అమ్మకు ఒంట్లో బాగోలేదుట. రమ్మని ఉత్తరం రాసింది" అబద్ధం అలవోకగా చెప్పాడు.
 
    "వెంటనే వెళ్లండి. అత్తగారి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే, అర్జంటుగా వెళ్లకుండా ఇలా తాత్సారం చేస్తారేమిటండీ?" కోపంగా అన్నది నీలు.
 
    సూట్‌కేసులో  బట్టలు సర్దుతుంటే, "నీలూ నన్ను ఇప్పుడే పొమ్మంటున్నావా?"
 
    "ఆఁ! ఇప్పుడే వెళ్లండి. తల్లి కంటే ఎవరూ ఎక్కువ కాదు. స్టేషనుకు వెళ్లి మీ ఆఫీసరుగారితో మాట్లాడి లీవు తీసుకుని ఏదో ఓ బండి పట్టుకుని వెళ్లండి!" తొందర చేస్తూ అన్నది.
 
    ఇంకా ఇంట్లో అలాగే ఉంటే సూట్‌కేసు తీసి బయట పడేసేటట్టు ఉందని, స్టేషనుకు వెళ్లి కంట్రోలు ఫోనులో మాట్లాడి పదిరోజుల లీవు తీసుకుని సికింద్రాబాదు రైలెక్కాడు. 
 
    నిర్మల కొడుకును చూసి చాలా సంతోషపడింది. "చాలా నాళ్లయ్యింది నాన్నా నిన్ను చూసి!" అంటూ కొడుకును  కావలించుకుంది.
 
    "నాకు ఇపుడే పెళ్లేమిటమ్మా. ఇంకా కొన్నాళ్లు ఆగితే బావుంటుంది" అన్నాడు నీలూను తల్చుకుంటూ.
 
    "ఆగటమేమిట్రా, అవతల అమ్మాయి వాళ్లు ఏడాది తిరిగిపోతోందని గోల చేస్తున్నారు. అన్నీ రెడీ చేసుకున్నాము. వచ్చే లక్ష్మివారమే నీ పెళ్లి! నీవు రాకుంటే ఏంత గోలవుతుందో అని భయపడుతున్నాము"
 
    మనసులో నీలూని తల్చుకుంటూ "నన్నడక్కుండా పెళ్లి ముహూర్తాలు ఎందుకు నిర్ణయించుకున్నారమ్మా! నాకు అక్కడ లీవు ఇవ్వడంలేదు. ఇద్దరు మేష్టార్లమే ఉన్నాము. చెరి పన్నెండు గంటలు డ్యూటీ చేసుకుంటున్నాము. ఇప్పుడు కాదమ్మా, దయచేసి నన్ను వదిలేయమ్మా" అన్నాడు ప్రాధేయపడుతూ.
 
    "ఏరా? ఏం మాట్లాడుతున్నావు? నేను నలుగులో తలెత్తుకుని తిరగాలా వద్దా? నీవు తెల్లారి లేస్తే నా ఉద్యోగమో అంటూ పరిగెడతావు ఎల్లకాలం ఇక్కడ ఉండేదాన్ని నేనేకదా. నా మాట కాదని వెళ్లిపోతే నీవు రైలెక్కేలోపల చావు కబురు అందుతుంది" అంది భోరున ఏడుస్తూ.
 
    తల్లిని ఊరడిస్తూ "ఉంటాలేమ్మా. నీ ఇష్టప్రకారమే కానీవమ్మా" మదిలో నీలూ మెదులుతూనే ఉంది. నీలు ఉండగా ఇంకో అమ్మాయికి ద్రోహం ఎలా చేయాలి? మరి ఈ అమ్మాయినేకదా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా... ఎవరిని ఎలా ఓదార్చాలో? ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నాడు. 'అయినా అన్నింటికి దేవుడే ఉన్నాడు. అతని ఇష్టప్రకారమే కానీ...' అని సరిపెట్టుకున్నాడు.
    
    "మదర్ సీరియస్... అటెండింగ్ హాస్పిటల్, ఎక్స్టెండ్ లీవ్ ట్వంటీఫైవ్ డేస్" అంటూ డివిస్జినల్ ఆపరేటింగ్ మానేజర్‌కు పెయిడ్ మెసేజి ఇచ్చి రిసిప్ట్ జాగ్రత్తగా దాచుకున్నాడు శ్రీకాంత్.
    
    ఆ మెసేజి చీఫ్ కంట్రోలర్ తీసుకుని రొటెగావ్ స్టేషన్ మానేజర్‌కు రిపీట్ చేశాడు.
    ఆ సంగతి నీలూకు తెలిసింది! అత్తయ్యకు ఎలాగుందో తనుకూడ ఆయనతో వెళితే బాగుండేదేమో! అని బాధ పడింది. అయినా తనను, ఎంత పెళ్లి చేసుకున్నా పెద్దలు అంగీకరించిన పెళ్లికాదు కదా అంటూ సమాధాన పరుచుకుంది!

    శ్రీకాంత్ పెళ్లి జరిగింది. శోభనం కూడా అయిపోయింది. శ్రీకాంత్ రేడీ అయ్యాడు లీవు దగ్గర పడుతూండటంతో.

    పద్మలత ఒకటే ఏడుపు! నేను కూడా మహారాష్ట్రకు వస్తానని!

    "అప్పుడేమో రానన్నావు కదా. ఇప్పుడు వస్తానంటున్నావు! ఇది ఎట్లా?"

    "అప్పుడు భర్త అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు తెలిసివచ్చింది. నీవు ఏ చెట్టు కింద ఉన్నా సరే, నేను అక్కడే ఉంటాను. నీవు లేనిది నాకు ఇక్కడ ఏమిపని?" అంటూ భోరున విలపించింది.

    చిక్కుల్లో పడ్డాడు శ్రీకాంత్. ఇన్ని చిక్కులు వస్తాయనుకోలేదు! తాను రానన్నది కదా! పెళ్లవగానే విడిచిపెట్టి వెళ్లిపోతాను అనుకున్నాడు. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందమైంది!
 
    'స్త్రీ బుద్ధీః ప్రళయాంతకః అన్నారు పెద్దలు. ఎప్పుడు ఏమి మాట్లాడతారో తెలియదు! ఇప్పుడు నన్ను ఇరకాటంలో పడేశావు గదే పద్మలతా. నేను ఏ నుయ్యిలో దూకను? ఏం చేయను?' అంటూ లోలోపల కుమిలిపోతూ మారుమాట్లాడకుండా కుర్చీలో కూలబడ్డాడు.
 
    పద్మలత వెక్కి వెక్కి ఏడుస్తూ, భర్త పాదాల దగ్గర కూర్చుంది. ఆమె కన్నీరు అతని పాదాలను తడుపుతోంది. 
    
    "లేదండీ, నేను కూడా వస్తాను రోటెగావ్‌కు. ఒక పదిరోజులుండి మీరు నన్ను సికింద్రాబాద్ బండి ఎక్కించండి. నేను పాలకొల్లు వచ్చేయగలను!"
 
    "వద్దు... వద్దు... నేనే వీలు చూసుకుని పదిహేను రోజుల్లో వస్తాను" అంటూ బుజ్జగించి ఓ నాల్రోజుల తర్వాత రోటెగావ్ వెళ్లిపోయాడు.
 
    అప్పటినుండి ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను... మొన్ననే పెళ్లి లాంగ్ లీవె తీసుకున్నాను. ఇప్పుడిప్పుడే లీవు ఇవ్వరు అంటూ ఉత్తరాలు రాస్తున్నాడే కాని శ్రీకాంత్ జాడ లేదు పాలకొల్లుకు!
 
    "అత్తయ్యా! మనం వెళదాం నడు రోటెగావ్‌కు. ఆయనగారి దగ్గర నుండి ఉత్తరాలే వస్తున్నాయిగాని ఆయన రావడం లేదు. ఇక నేను ఇక్కడ ఉండలేను!" అంది ఏడుస్తూ.
 
    "ఎందుకమ్మా వాడు వస్తాడు. తప్పకుండా వాడు వస్తాడు... లీవుకు కష్టమౌతుంది ఇప్పుడే రాలేనని రాశాడు కదా, నేడో రేపో; ఓ నాల్రోజుల తర్వాతనైనా తప్పకుండా వస్తాడు" నమ్మబలికింది నిర్మల.

    "లేదు, మా బాబాయివాళ్లు షిర్డి వెళుతున్నారు. షిర్డి వెళ్లే రూటులోనే రోటెగావ్‌లో దింపేసి వాళ్లు షిర్డి వెళ్లిపోతారు!"

    "వాళ్లవెంబడి ఎందుకమ్మా, అబ్బాయికి చెప్పకుండా వెళితే కోప్పడతాడు" అంది భయంతో.

    "ఎందుకు కోప్పడతారు. ఆయన వెళ్లి నాలుగవ నెల నడుస్తూంది. అమ్మాయిలు అమెరికా వెళ్లి వస్తున్నారత్తయ్యా. మనం వెళ్లేది మషరాష్ట్రనే కదా!" కోడలు తెగింపుకు భరించుకోలేకపోయింది నిర్మల.

    "సరేనమ్మా. ఇవిగో డబ్బులు. వెళ్లేటప్పుడు మాత్రమే రిజర్వేషను చేయించమను. తిరిగి వచ్చే తేది మనకు తెలియదు కదా. వచ్చేటప్పటికి అబ్బాయే చేయిస్తాడు"

    డబ్బులు తీసుకుని "సరే అత్తయ్యా" అంది నవ్వుతూ భర్త దగ్గరకు వెళుతున్నాను అనే సంతోషంతో.

 

* * *
 
    రోటెగావ్ ఆన్‌డ్యూటీ స్టేషను మాస్టరుకు శ్రీకాంత్ వాళ్ల అమ్మ, ఆయన భార్య ప్యాసింజర్‌లో వస్తున్నారని నగర్‌సోల్‌నుండి ఫోను వచ్చింది. అజంతా ఎక్స్‌ప్రెస్ రోటెగా్‌లో ఆగదు కాబట్టి పైకి వెళ్లి నగర్‌సోల్ దిగి వెనుకకు (రోటెగావ్‌కు) ప్యాసింజర్‌లో వస్తున్నారని వార్త. ఆ వార్తను ఇంట్లో ఉన్న శ్రీకాంత్‌కు చెప్పాడు పాయింట్స్‌మాన్.
 
    అదివి విన్న శ్రీకాంత్ ష్టేషనుకు పరిగెత్తుకు వచ్చి కంట్రోల్ ఫోన్‌లో నగర్‌సోల్ మాష్టరు తన బ్యాచ్‌మేట్,అబ్దుల్లాతో మాట్లాడాడు. అతను నర్సపూర్ అతనే! తన పెళ్లికి వచ్చి తన భార్యను, అమ్మను చూసినవాడే!
 
    "ఔనురా; మీ అమ్మ, మీభార్య ఫ్లాట్‌ఫాం మీద కనబడ్డారు. నగర్‌సోల్-నాందేడ్ ప్యాసింజరులో వస్తున్నారు" అని చెప్పాడు.
 
    ఆ మాట విని శ్రీకాంత్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. "నీలూ ఇంట్లోనే ఉంది! అమ్మ పద్మలత ఆమెను చూసి ఎంత గొడవచేస్తారో ఏమో. ఆ సంఘటన ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తూంది. ఔను, నీలూను ఇంట్లోంచి పంపించివేయాలి! కొంపలంటుకుంటాయిరో దేవుడో...!"
 
    ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి, "నీలూ! మా అమ్మ, నా భార్య నగర్‌సోల్ నుండి వస్తున్నారట. వాళ్లు వెళ్లిపోయేదాక నీవు మీ అమ్మ వాళ్ల ఇంట్లో ఉండవా!"
 
    శ్రీకాంత్ వణకడం, కంగారు చూసి నీలు గట్టిగా నవ్వింది. "అదేమిటి? మీకు పెండ్లి కాలేదన్నారుగా. మరి ఇప్పుడు భార్య అంటున్నారు!" అన్నది సీరియస్‌గా. 
 
    "అబ్బా, అదంతా పెద్ద కథలే.ఇప్పుడు టైములేదు చెప్పడానికి. దయచేసి బట్టలు తీసుకుని మీఇంటికి వెళ్లిపో. ప్లీజ్ అమ్మ, భర్య వెళ్లిపోగానే పిలుచుకుంటాను" అన్నాడు తడబడుతూ నోట్లో తడిలేకుండా.
 
    "ఎవరైనా రానీ! నేనెందుకు పోతాను? నే ప్రాణం పోయినా ఇక్కణ్ణించి కదలను" అంది మొండిపట్టుదలతో.
 
    "నీలూ! ప్లీజ్ నీలూ, నీకు నా క్షేమం కావాలి కదా! నాల్రోజుల్లో వాళ్లు వెళ్లిపోగానే నిన్ను ఇంట్లోకి పిల్చుకుంటాను" అని ఆమె బట్టలను ఒక చీరలో మూటకట్టి, చేతికి ఇచ్చి, "నీలూ, ప్లీజ్ నీలూ నన్ను ఈ గండం నుండి గట్టెక్కించవా; నీలూ నీకాళ్లు పట్టుకుంటాను" అంటూ ఏడుస్తూ క్రిందకు వంగాడు.
 
    "ఛీ, లేవండి. నాకు పాపం అంటగట్టవద్దు. మీ ఆంధ్రా వాళ్లు ఎలా మరాఠి అమ్మాయిలను మోసం చేస్తారో ఇప్పుడు నాకు తెలిసింది. ఇటుతే" అంటూ బట్టల మూటను లాక్కొని ఏడుస్తూ వెళ్లిపోయింది.
 
    హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీకాంత్.
 
    ఓ పదినిమిషాల తర్వాత 'ట్రైన్ ఎంటరింగ్ ఇన్ టు స్టేషన్' గంట కొట్టారు. తలుపుకు గొళ్లెం పెట్టి స్టేషన్‌లోకి పరిగెత్తాడు. బండి వచ్చి ఆగింది. అత్తా కోడళ్లిద్దరు సూట్‌కేస్‌లు పట్టుకుని ప్లాట్‌ఫార్మ్ మీద నడిచి వస్తున్నారు. వారికి నవుతూ ఎదురువెళ్లి సూట్‌కేస్ ఎయిర్‌బ్యాగు తీసుకుని "అమ్మా బావున్నావా? పద్మా ఎలా ఉన్నావు?" అంటూ ప్రశ్నించాడు.
 
    మళ్లీ అతనే; "వస్తున్నామని ఉత్తరం రాయకుండానే వచ్చారేమిటమ్మా" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
 
    మాట్లాడకుండా స్టేషను ఎదురుగా ఉన్న రైల్వేక్వార్టర్‌లోకి వెళ్లారు.
 
    "నీవు ఇన్ని నాళ్లు రాకపోయేసరికి, పద్మలత ఒకటే ఏడుపురా.పెళ్లి చేసుకుని వచ్చావు. నాలుగునెలలు కావస్తున్నాయి. అది ఎట్లా ఉంటుందిరా? రోజూ నిన్ని జ్ఞాపకం చేసుకుని ఒకటే ఏడుపు!"
 
    పద్మలత మాత్రం ఇల్లు, కాంపౌండు చూసి ముక్కున వేలేసుకుని "అంతానీటుగా సర్ది ఇల్లు అద్దంలా పెట్టారత్తయ్యా మీ కొడుకు. ఇంటనీటుగా పెట్టే ఓపిక ఉందా? అందులో రైల్వే డ్యూటీ చేస్తూ."
 
    "మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది పద్మా. అదే నేను బాధ పడుతూన్నది. ఒక నిమిషం తీరిక లేకుండా ట్రైన్ వర్కింగ్ చేస్తూ తిరిగి ఇంటికి వచ్చింతరువాత ఇంటెడు పని చేసుకోవాలంటే, నాతో కావడం లేదని ఓ పనిమనిషిని పెట్టుకున్నాను"
 
    "ఎంతిస్తున్నావురా పనిమనిషికి?"
 
    "వెయ్యి రూపాయలు"
 
    "ముసిల్దా, వయసుదా?" అంది నవ్వుతూ పద్మలత.
 
    "నీకంతా నవ్వులాటగుందమ్మా!" అంటూ సమాధానం దాటవేశాడు.
 
    అదేరోజు మధ్యాహ్నం ఒక మనిషి వచ్చి, ఏదో మాట్లాడి "రేపు తప్పకుండా వస్తారట" అన్నాడు. శ్రీకాంత్ నోరు తెరచి తెల్లబోయాడు. "నేను తర్వాత మాట్లాడతాను.రావొద్దని చెప్పు"
 
    "లేదు మీవాళ్లు ఉన్నప్పుడే తేలాలట!" చెప్పుకుంటూ వెళ్లిపోయాడతను. 
 
    భయంతో శ్రీకాంత్ వణుకుతున్నాడు. చెమటలు పడుతున్నాయ్. "ఏమైందిరా? అలా భయపడుతున్నావేందిరా? ఎవరాయన?" "ఎవరండీ అతను? ఏం మాట్లాడతారట?" అత్తా కోడళ్లు ప్రశ్నలతో ఇంకా ఉక్కిరిబిక్కిరి చేయసాగారు.
 
    వాళ్లకు జవాబు చెప్పే స్థితిలో లేడు శ్రీకాంత్. అదేం సంగతో భార్యతో, తల్లితోకూడా పంచుకోలేక పొయ్యాడు. ముభావంగా ఉండిపొయ్యాడు. ఆ రోజంతా ముక్తసరిగా ఉంటూ ఏదో తీరని ఆలోచనలో మునిగి పొయ్యాడు. సాయంత్రం నాలుగింటినుండి రాత్రి పన్నెండు వరకు డ్యూటీ చేసి ఇంటికి వచ్చాడు. అత్తాకోడళ్లిద్దరు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ రాగానే బాత్‌రూంలోకి వెళ్లి స్నానం చేసి తల దులుపుకుంటూ ఇంటిలొకి వచ్చాడు.
 
    "నాన్నా, మేము కూడా భోం చేయలేదురా. నీగురించి ఎదురుచూస్తున్నాము కలిసి భోంచేద్దామని" అన్నది నిర్మల.
 
    పద్మలత ముగ్గురికి అన్నం వడ్డింపులో నిమగ్నమయ్యింది.
 
    "నాకు ఆకలిగా లేదమ్మా. మీరు తినండి"
 
    "అదేమిట్రా? అందరం కలిసి భోంచేద్దామని నీకోసం ఎదురుచూస్తుంటే, నీవు భోంచెయనంటే ఏలా నాన్నా!" అంటూ చెయ్యిపట్టి లేపింది నిర్మల.
 
    బలవంతంగా లేచి వారితో నాలుగు మెతుకులు ఎంగిలి పడి ప్రక్కమీద మౌనంగా వాలిపొయ్యాడు.
 
    "ఏమయిందిరా? ఎందుకలా ఉన్నావురా?"
 
    "మీరూరుకోండత్తయ్యా. డ్యూటీ దగ్గరి సంగతులు చెబితే మనకేం అర్థమౌతాయి. రైలు బండ్లతో పనాయె!" అంది పద్మలత.
 
    నిర్మల మారుమాట్లాడలేదు.
 
    తెల్లవారింది. టిఫిన్లు అయిపోయినంక టేబుల్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు శ్రీకాంత్.

    "సార్" గుమ్మంలో ఎవరో పిలిచారు.

    శ్రీకాంత్ ప్రాణాలు పైనే లేచిపోయినట్లయ్యింది.
 
    "ఎవరూ" అంటూ గుమ్మంలోకి వచ్చాడు.
 
    నిన్న సాయంత్రం వచ్చిన మనిషే "సార్ వాళ్లు వస్తున్నారు!" చెప్పాడు.
 
    "ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? నేను వద్దన్నానుగా!" అతడు సమాధానం చెప్పేలోపే, ఎర్రటి
పెద్దరుమాళ్లు చుట్టుకున్న పెద్దమనుష్యులు, ఇకో అయిదు మంది మరాఠి గోచి పెట్టుకుని తలపై కొంగు వేసుకున్న స్త్రీలు, ప్యాంటు షర్టు వేసుకున్న నడి యీడు వాళ్లు, షర్టు చేతులు పైకి మడిచి తన్నడానికి రెడీ అనే కుర్రవాళ్ళు వచ్చారు. తెలుగు ఏరియాలో పనిచేసి, తెలుగు నేర్చుకున్న మరాఠి మాష్టార్లు కూడా వచ్చారు.
 
    "అమ్మా వీళ్లందరు ఎందుకు వచ్చారో తెలుసా?" ఆ గుంపులో ఒక మాష్టరు అన్నాడు.
 
    "తెలియదు నాయనా, మీరే చెప్పండి. ఇంతమంది ఒక్కసారే వస్తే భయమౌతూంది."
 
    శ్రీకాంత్ పరిస్థితి చెప్పనవసరం లేదు. నోట్లో తడారిపోయింది. చెమట పట్టి వణుకు ప్రారంభమయింది.
 
    "మీ అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమె ఇప్పుడు గర్భవతి! మీరు వస్తున్నారని తెలిసి, భయంతో చీరలు, రవికలు మూటగట్టి; 'మా అమ్మ భార్య పోయిన తర్వాత రాపో' అంటూ ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు." 
 
    ఇప్పుడు నిర్మలకు, పద్మలతకు చెమటలు పట్టడంతో వణుకు ప్రారంభమైంది.
 
    "వాళ్లు చెపుతున్నది నిజమేనారా శ్రీకాంత్?" గద్దించి అడిగింది.
ఏం చెబుతాడు శ్రీకాంత్? నాలుకకు ముల్లు గుచ్చుకున్నట్లయ్యింది. మాట్లాడటానికి నోరు పెగలలేకపోతూంది!
 
    ఇంతలో శ్రీకాంత్, నీలూ పెళ్లి ఫోటోలను ఆమె చేతికిచ్చారు.
 
    "మాట్లాడు శ్రీకాంత్. నీవు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఫోటోలు కూడా తీశారు కదరా. నీకు అబద్ధమాడటానికి కూడ వీలు లేదు కదరా!" అంటూ వీపుమీద, చెంపల మీద నాలుగు దెబ్బలేసింది.
 
    "వెధవా, నేను అక్కడ అమ్మాయిని చూసి పెడితే, ఇక్కడ పెళ్లి చేసుకుని మాకు పెళ్లికి వాయిదాలు వేస్తావా?" అంటూ కొడుకును మళ్లీ కొట్టడానికి పైకి పోబోయింది. 
 
    "మీరు కొట్టకండత్తయ్యా" అంటూ పద్మలత అడ్డువచ్చి చేతులు పట్టుకుంది.
 
    "ఈ కోతి ముచ్చు వెధవ నీ పరువు తీశాడు కదమ్మా" అంటూ ఏడ్పు మొదలు పెట్టింది. ఆమెతో పాటు దెబ్బలు తిన్న శ్రీకాంత్‌ను పట్టుకుని పద్మలత ఏడ్చింది.
 
    నీలూ కూడ గడప అవతల ఉండి లోపల జరుగుతున్న తతంగాన్ని తొంగి చూస్తూ అందరి ఏడ్పులు విని లోపలికి వచ్చి తాను కూడా ఏడ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా శ్రీకాంత్ పరిస్థితి చూసి చలించిపోయింది.
అందులోంచి ఒక పెద్ద మనిషి లేచి "ఇదిగో ఈమెనేనమ్మా మాస్టర్‌సాబ్ పెళ్లి చేసుకున్నది" అంటూ చెయ్యిపట్టి అందరిమధ్యలోకి తీసుకువచ్చాడు.
 
    "ఆయనను కొట్టకండి. అది నేను చూడలేను. నాకు బిడ్డ పుట్టింతరువాత ఆయన నన్ను చూసినా ఫర్వాలేదు. చూడకపోయినా ఫర్వాలేదు. మహారాష్ట్ర వదిలి పెట్టి పారిపోయినా ఫరవాలేదు. ఆయన నా భర్త! అతనెక్కడున్నా నా పసుపుకుంకాలు చల్లగుండాలి. ఎక్కడున్నా తన బిడ్డ అని తప్పకుండా చూడటానికి వస్తాడు" అంటూ గట్టిగా ఏడ్చింది నీలు.
 
    ఈ హృదయవిదారకమైన సన్నివేశానికి అందరూ మ్రాన్పడిపోయారు. ఒకరిమీద ఒకరికి అమితమైన అప్యాయత అనురాగాలతో కన్నీళ్లు ఉబుకుతున్నాయి.  

    తల్లీ కొడుకు, ఇద్దరు పెళ్లాలు! విడదీయరాని అనుబంధం!!
 
    ఓ అయిదు నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు మాటలకందని మమతలతో.
 
    పద్మలత మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నిండుగర్భవతియైన నీలూ స్థానంలో తానే ఉంటే ఎంత బాధ పడేది! ఆమె శ్రికాంత్‌ను తన ఊళ్లో తనకంటే ముందే పెళ్లి చేసుకుంది. తను తన ఊళ్లో ఆ సంగతి తెలియకుండా తనూ పెళ్లి చేసుకుంది! శ్రీకాంత్‌తో ఇద్దరిదీ పెళ్లే! ఎవరూ కాదనలేరు. ఇప్పుడామె గర్భవతి! తానే జాలి చూపించాల్సిన అవసరం ఉంది. అతనితో తప్పు జరిగిపోయింది. ఇప్పుడు పరిష్కారమేమిటి? ఆమెను వదిలి శ్రీకాంత్ రాలేడు. ఎవరికీ తెలియకుండా పారిపోయి వచ్చినా దొరకబుచ్చుకుని మరాఠివాళ్లు ఎముకలు ఏరిపారేస్తారు! అతి ప్రమాదకరమైన పరిస్థిలో ఇరుక్కున్నాడు.
 
    ఇక మన దేవుళ్లకు మాత్రం ఇద్దరేసి పెళ్లాలు లేరా? మానవ మాత్రుడు తన భర్తకు ఉంటే తప్పేంటి? ఇక రూల్సు ఉంటే వాటి స్థానంలో అవే ఉంటాయి! తామిద్దరూ పోట్లాడి కోర్టుకు ఎక్కితే కదా ఇద్దరు పెళ్లాలున్నారని తెలిసేది! సయోధ్యగా ఉండి కలిసిమెలిసి బ్రతికితే అంతే చాలు అనుకుని శ్రీకాంత్ చెయ్యిలాగి, నీలు చెయ్యి పట్టుకుని లాగి శ్రీకాంత్ చేతిలో పెట్టి ఆమె చెయ్యిమీద తన చెయ్యివేసి "మన ఇద్దరం ఆయనకు రెండు కళ్లలాంటి వాళ్లం! అందరం 'కలిసుందాం రా' నీవెక్కడికీ వెళ్లనవసరం లేదు" అంది పద్మలత ఉద్వేగభరితంగా కళ్లనీళ్లతో. ఆంధ్రా అమ్మాయి ఔదార్యానికి అక్కడున్న మరాఠి వాళ్లు మెచ్చుకున్నారు.
 
    మరునాడు సంతోషంతో అందరూ కలిసి కారులో షిర్డిసాయి దర్శనానికి బయలు దేరారు!   
Comments