కల్లోలం - కె.వి.నరేందర్

    అర్థరాత్రి...

    ఊరు ఉలిక్కిపడింది...

    భారీ విస్ఫోటనంతో... భూకంపమొచ్చినట్టు ఇల్లు కదిలిపోయాయి...

    గుండెలు నిమిషం పాటు ఆగిపోయాయి...

    బయటికి రావడానికి భయపడిపోయి... తెల్లారేదాకా బిక్కు బిక్కు మంటూ ఊరంతా జాగరణ చేసింది.

    అప్పటికే పోలీసు సైరన్లు మోగుతున్నాయి.

    వరహాలమ్మ గుడిని మతోన్మాదులేవరో పేల్చేసారంటూ...జాగర్తగా వుండండి అంటూ పోలీసులు మైకుల్లో చెప్తున్నారు.

    ఊరంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరెస్ట్‌లు  మొదలయ్యాయి...
  
       గుడిని పేల్చేసారనగానే... కొందరు మసీదుల మీద రాళ్లు విసిరారు. ఒక ముస్లింని గుర్తుతెలియని వ్యక్తి పొడిచి పారిపోయాడు... గుళ్లమీద రిసెర్చి చేస్తున్నాడని ఆ వూరికి వచ్చిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదారు. అతనికి ఆశ్రయం ఇచ్చిన ముస్లిం ఫ్రెండ్ భయంతో పారిపోయాడు. అతని భార్య గర్భవతి అనికూడా చూడకుండా పోలిసులామెను వాళ్ల పద్ధతిలో ఇంటరాగేషన్ చేసారు.

    చర్చి ఫాదర్‌ని ఎవరో కొట్టారు.

    పది మంది మనవాళ్లు చనిపోయారట...అంటూ పుకార్లు షికార్లు చేసాయి. కత్తులు, బరిసెలు బయటకి తీసారు. తల్వార్లు సానబెట్టారు. 

    మతకల్లోలాలు ఇంత భయంకరంగా వుంటాయా... అంటూ పిల్లలు బిక్కు బిక్కు మంటూ కిటికీల్లోంచి చూస్తున్నారు.

    పలువురు మతపెద్దల్ని పోలీసులు నిర్భందించారు. స్టేషన్‌లోనే గొడవ మొదలైంది. "మేం ఏం అన్నామని మా గుడిని పేల్చేసారు" ఆగ్రహంతో ముస్లింలని నిలదీసారు హిందువులు.

    "మా మసీదు మీద రాళ్లు ఎందుకు విసిరారు" అంటూ నిప్పులు చెరుగుతున్నారు ముస్లింలు.

    "మా ఫాదర్‌ని మీరే చంపారు" అంటూ క్రైస్తవులు కోపంతో వూగిపోతున్నారు.

    "అదసలు గుడే కాదు... పిచ్చిదాని సమాధి...ఆదాయం కోసం దాన్ని గుడిగా చేసారు" అరెస్టయిన రిసెర్చి స్కాలర్ అరుస్తున్నాడు.

    ఊరంతా స్మశాన నిశ్శబ్దం...

    భయం తాండవిస్తోంది. పోలిసు పహారాతో స్మశానమే అయింది.

    జిల్లా నించి కలెక్టరు, ఎస్పీ లాంటి పెద్దలంతా దిగారు. స్టేషన్‌లో మత పెద్దల్ని ఎంత కౌన్సిలింగ్ చేసినా ఎవరి మంకు పట్టు వారిది.

    ఇన్నాళ్లు కలిసి వున్న వూరు మూడు మతాలుగా చీలి పోయింది. మా మంతం గొప్పదంటే... మా మతం గొప్పని వూహించుకుంటూ పగల్ని, ప్రతీకారాల్ని లోలోపలే పెంచుకుంటున్నారు.

    హైదరాబాద్‌లో వున్న రాజకీయ నాయకుడు రామిరెడ్డికి ఈ వార్త సచివాలయంకి చేరే ముందు అందింది.

    పది నిముషాలు...షాక్ తిన్నాడు.

    మరో గంటలో వరహాలమ్మ గుడి చైర్మెన్‌గా ఉత్తర్వ్లందేవి. ఘనంగా ప్రమాణ స్వీకారం చేద్దమనుకున్నాడు. లక్షలు ఖర్చు పెట్టాడు చైర్మన్ కావడానికి... కాని ఈ నిజాన్న్ని జీర్ణించుకోలేక పళ్లు పటపట కొరికాడు.

    "భూషణ రావు..." కసిగా అరిచాడు.

    అంతలో సెల్ మోగింది. ఆన్ చేయగానే అవతల్నించి భూషణరావ్ నవ్వు...

    "నాకు దక్కని ఆలయ చైర్మన్ పదవి నీకెలా దక్కనిస్తాను రామిరెడ్డి..." మళ్లీ నవ్వు.

    సెల్లు కట్టయింది.

    మతకల్లోలాలెప్పుడూ... మతాల్లోంచి పుట్టుకరావు.

    రాజకీయంలోంచి పుట్టుకొస్తాయి.

    ఈ నగ్న సత్యం ఎప్పుడూ బయటపడకుండా...  నాయకులెప్పుడూ జాగర్త పడుతుంటారు.

(పల్లవి వీక్లీలో ప్రచురితం)
  
Comments