కమ్లి - సమ్మెట ఉమాదేవి

  

    ప్రపంచం ఒక కుగ్రామం అవుతుందో... అయ్యిందో లేదో తెలియదు  గాని ప్రపంచానికి అక్కడో పల్లె ఉందన్నది తెలుసా అన్నట్టు ఉంటుందా పల్లె. దట్టమయిన అడవులకు  మద్యన నగరాలతో పని లేనట్టు ణువణువూ పచ్చదనం అలముకున్నా పస్తులు తప్పని పేదరికంలో కొన్ని తండాలు  అక్కడబతుకీడుస్తున్నాయి

    నడక... నడక... తామున్న గుడిసెల నుండి  చేలకు వెళ్ళాలన్నా  చిన్న అవసరానికి నగరానికి వెళ్ళాలన్నా నడకఅంతా కలిసి  రెండు వందల జనాభా  కూడా  ఉండని రెండు మూడు   తండాలకు నడక తప్ప మరో సౌకర్యంలేదు. అసలు వాహనాలు వెళ్లేందుకు వీలయిన దారే లేదు. నడక వాళ్ళ దిన చర్యే తప్ప నడక కష్టమని వాళ్ళు అనుకోవడమే లేదు. చీకటికి వెరపుఆకటికి తెరుపు లేని తండాలోని గుడిసెలో  తల్లి ప్రేమ వెన్నెల్లో తడిసి ముద్దవుతున్నది చిన్ని మోతి.


    "అయ్యో దునియాల ఎవ్వల్లన్నపిల్లల గన్నరా? ఒకల్లెనుక ఒక ఆడిపోర్లను నువ్వు గాక గన్నవ్ . ఇగ గా ముద్దులాడుడు  ఆపి జర పనులు జూడు.  తల్లిగారిచ్చిన జగిర్దారేమన్న ఉన్నదనుకున్నావా..? గట్ల ఆరంగా  కూకున్నావ్... మనషి పుటక బుట్టినంక  జరంత సిగ్గు శరం ఉండాలె. చేనుకు బోకుంట   కైకీల్కు బోకుంట బొత్తకు (కడుపుకు), బట్టకు ఎట్లెల్లుతదని ఆలోచనజెయ్యాలె. దునియాల నువ్వొక్కదానివే గన్నవాఅందరాడోళ్ళు పిల్లల గంటల్లెర? నకరాల్ గాకుంటే నువ్వు చేనుకు బోతే నేను పొల్లను జూడనా? ఇంట్ల పని జేయ్యంగానే సరిపాయేనా? పనిజెయ్యకుం టతిండి యెట్ల దిన బుద్దయితది..? బాలెంత అంటే అయిదు నెల్లు. కాకుంటే  ఆరునెల్లు...మీ అమ్మ గిట్ట గిట్లనే జేసిందా? లేక గిట్లనే తిని కూసోమ్మని నేర్పిందా?" మాన్సిబాయి గొంతు చుట్టు పక్కల గుడిసెల వరకు  వినిపిస్తున్నది. అక్కడి వాళ్ళందరికీ ప్రతి రోజూ ఇది కొత్తేమి కాదు.  


    తొలి కానుపులోనే పుట్టింది ఆడ పిల్లని పుత్లి పుట్టినపుడే పుట్టుమునిగినట్టు గొడవ చేసిన కమ్లి  అత్త మాన్సిబాయి ఇపుడు రెండవ కాన్పులోనూ  ఆడపిల్ల పుట్టిందని పదినెల్లనుంచి అటు ఏడు తరాలను ఇటు ఏడు తరాలను చెరిగిపోస్తున్నదిగుండెలలోని  దుఃఖం కన్నుల్లో పొంగకుండా పొంగినా భర్త సుర్యాకు తెలియనియ్యక తంటాలు పడుతుంటుంది కమ్లిఊరి నుంచి వచ్చిన చెల్లెలు కాస్సేపుండి వస్తానని ఊర్లో ఉన్న కాక ఇంటికి వెళ్ళింది. కమ్లి ఒక పక్క  పిల్లను చూసుకుంటూనే  సాయంత్రమే వాగుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చిందివాకిలి ఊడ్చి కల్లాపి  జల్లి ముగ్గేసింది. బావి నుండి నీళ్ళు తోడి గాబులు నింపింది. జొన్న రొట్టెలు కాల్చిందిఇక మోతిని నిద్ర పుచ్చుదామని వడిలో వేసుకుని పసి దాని బోసి నవ్వులకు పులకించి ముద్దులాడసాగింది. అంతే అత్త తిట్ల పురాణం అందుకుంది. ఏమనలేక "నేను తానం  జేసోస్త జర జుస్కో అత్తమ్మా" భయపడుతూనే మోతిని అత్త దగ్గర వదిలి స్నానానికి వెళ్ళింది.

       

    "అయ్యో ఇగ బోయి ఇగ గంటరా ఇసొంటి పిల్లను. సీ బతుకుల మన్నుపడఈసడిస్తూ మాన్సిబాయి పిల్లను అక్కడే  వదిలి పెట్టి పక్కింటికి వెళ్ళిందిచెంబుడు నీళ్ళు వంటిపై పడేసరికి అలసటంతా  తీరుతున్నట్టు అనిపించి హాయిగా స్నానం చేయసాగింది కమ్లికాస్సేపటికి ఎక్కడా మోతి అలికిడి గాని, అత్త అలికిడి గాని వినిపించక పోవడంతో తడిక పై నుండి  తొంగి చూసింది. మోతి పాకుతూ పొయ్యి దగ్గరకు వెళ్ళడం చూసి, "అయ్యో ..అత్తమ్మ!" అని అరుస్తూ చెంబు అక్కడ పడేసి చీర వంటికి  చుట్టుకుని ఒక్క పరుగున బయటకు వచ్చి మోతిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. 'అమ్మయ్యో జర్రంతయితే బిడ్డ ఏమౌతుండే' అనిపించి చెప్పలేని  దుఃఖం ముంచుకొచ్చిందిముందుకు సాగకుండా తనను ఎందుకు లాగారో తెలియని మోతి రాగమందుకుంది. ఎంతకు సముదాయించినా ఆగని మోతికి చుట్టుకున్న చీరతోనే పాలు పట్టసాగింది కమ్లిఅంతలోకే పెత్తనాలు  ముగించుకుని వచ్చి"అగ్గోనే గిదేమి అన్యాలం కొడుకో మగడు,మామ,మరదులు దిర్గే ఇల్లు పెయ్యి మీద సీరె జుసుకోకుండా పాలు బట్టను గంత లాడాఏడిస్తే ఏడిసింది. సీరె సుత  గట్టుకోకనే  ఉర్కొత్తరా? గింత సుతారం నేనేడ సూడలేదమ్మో!" కమ్లి చెప్పే మాటలేవి వినిపించుకోకుండా అనరాని మాటలేవేవో అంటూనే ఉన్నది ఆమె అత్త. కమ్లి ఏడుస్తున్న మోతిని నేలన వదిలి చీర సరిగ్గా కట్టుకుని బుజాన వేసుకుని నిద్రపుచ్చింది. చెల్లలు వచ్చి ఓదార్చినా ధారపాతంగా కళ్ళు వర్షిస్తూనే  ఉన్నాయిసూర్య కోసం కన్నులు ఎదురుతెన్నులు చూడసాగాయి.    

        

    సూర్య మేనమామ  మంగిలాల్  తన భార్య  చెవి పోగులు పోయినాయని ప్రశ్న చెప్పించు కోవడానికి తుల్జాబాయి దగ్గరకు వెళ్తూ "నువ్ సుత రారాదు పత్తి చేనుకు దిట్టి మంత్రం బెట్టించుకుందువ్సూర్యను వెంటరమ్మన్నాడు. "పది రూపాయలు చూసి ఎన్ని దినాలయిందోనేను రాను తియ్చేనుకు దిట్టి మంత్రం పెట్టించుకుని పైసలేమి ఇయ్యకుంటే మంచిగుందా ? నేను రాన"న్నా బలవంతంగా పాత తండా నుండి కొత్త తండాకు తీసుకువచ్చాడు."పైసల్ తర్వాత ఇద్దువులే తమ్మి" అంటూ మంత్ర బియ్యం ఇచ్చి  పొలంలో చల్లమన్నది తుల్జాబాయికమ్లి తన కోసం ఎదురు చూస్తుంటుందని వడి వడిగా నడుస్తూ ఇల్లు చేరాడునడిచే శ్రావణ  మేఘంలా  ఉన్న కమ్లిని చూస్తూ కలతపడిపోయాడు .            

       

    "ఏంది కమ్లి? మబ్బులన్నీ కండ్లల్ల నింపుకున్నట్టు గంత దుఃఖపడతాన్నవేందిగిటు బిలిస్తే గటురుకుతావ్ గటు బిలిస్తే గిటురుకుతావ్.?" కమ్లి వెనకెనకే తిరుగుతూ సూర్య అడుగుతున్న కొద్దీ కమ్లి  దుఃఖం మరింత పెరుగుతున్నది. అప్పుడే కాల్చిన రొట్టెలు, ఉల్లిపాయ ముక్కలు ఉన్న పళ్ళెం అతని ముందుకు తోసి నూరిన బండ కారపు గిన్నె పక్కన పెట్టి "ఏమి లేదు తియి రొట్టెల్ తిను" అన్నది కొంగుతో ముఖం  తుడుచుకుంకుటూ.

            

    "అగ్గో ఏమిలేదు అనబడితివి మల్ల ఏడవ బడితివిఅసలేంది కత" కలవరపడుతూ


    "అవ్ మల్ల ఆడిబిల్లను గన్నంక ఇగ ఏడుసుడు  గాక ఇంకేముంటది తియి... మొదలొక ఆడిబిల్లున్నది కదా ఈసారి మగపోరడు బుట్టుంటే మంచిగానే ఉంటుండె. పోరగాడు పుడితే అద్దంటనా.దేవుడు నన్నుగిట్ట అడిగుంటే అమ్డల్లోల్లయినా సరే మొగపోరాగాల్లనే ఇయ్యమందును. నువ్వు మీ అమ్మ ఎత్తుకుని మస్తుగా ముద్దులాడుదురు.అవ్ మల్ల నాకు దెలియక అడుగుత ఆడిబిల్ల బుట్టుడు నా తప్పా.అత్తమ్మ జుసినవ.ఒగ మాటలా! ఒగ కోట్లాటన! మా సెల్లె అచ్చిందని గూడాసూస్తల్లేదు. దినాం గిదే లోల్లాయే ఏమి జేతు?" కమ్లి వెక్కి వెక్కి ఏడువ సాగింది. 


    "గట్లేడ్వకు గామే ఇయ్యాల కొత్తగ అంటున్నద? నికియ్యాల ఒగ మంచి ముచట చెబ్దామని నేనొస్తే నువ్వేమో గిట్ల ఏడవ బట్టినవ్" కమ్లి చేయి పట్టుకుని అన్నాడు.

          

    "ఇడువ్ నా బతుక్కి మంచి ముచట్లు కూడానా?" చేయి విదిలించుకుంటూ మల్లి దుఃఖ పడుతూ అన్నది.

          

    "జర  ఆగు  నువ్వా కొంగు  తడుపుడు ఆపు. నేను నిన్ను ఇయ్యాల చేను కాడికి దొలక పోదామానుకున్నా. మంచె మీద జేరి మంచిగా ముచట్లు బెడ్తవనుకున్న" వెనక్కు విసురుగా మళ్ళిన కమ్లి ఒక్కసారిగా సూర్య వయిపు తిరిగింది. దుఃఖం తో ఎరుపెక్కిన కమ్లి కళ్ళల్లో మెరుపులు మెరిసాయి.

           

    "నిజంగా అంటన్నావా?" ఆశగా అడిగింది. అంతలోనే "అత్తమ్మ  యెడ బంపుతది" అన్నది నీరసంగా...

           

    "నీకెందుకు అత్తమ్మ  సంగతి నేను జుసుకుంట గదా"అన్నాడు. చెంగున దూక బోయి మల్లీ..."మరి పిల్లల  సంగతి?" అన్నది. దిగులుగా.

           

    "మోతి బన్నది గదా. పుత్లిని  మీ సెల్లె సుసుకుంటది తియి. నువ్ జప్పన బయలెల్లుకమ్లికి కొత్త ఉపిరి వచ్చినట్లయింది ఉత్సాహం ఉరకలు వేసింది.

           

    "అవ్వా కమ్లిని చేనుకు దిస్కబోతున్న. పొద్దుగాల్ల  చేనుకు మందు గొట్టాలె గదా.   ఇంకా  గొంతంత కలుపు దీసుడు  బాకి ఉన్నది. కమ్లినీ  ఇప్పుడే దిసక బోతే  మబ్బుల లేసి ఎల్లెం కలుపు దీసి ఇంటికి అత్తది. అంత  దాంక పిల్లలను జర జుస్కో"మరో మాటకు అవకాశం ఇవ్వకుండా దుప్పటి  తీసుకుని ముందుకు నడిచాడు.

 

    కమ్లి చెల్లెలు గౌరీ దగ్గరకు వెళ్లి "మోతి పైలం సెల్లె. మా అత్తమ్మ  సంగతి నీకు దెల్సు గదా  నువ్వు గిట్ట జాగ్రత్తగా  లేకుంటే ఏమి జేసినా జేస్తది. ఉయ్యలలో పన్నగంగ బాయక్క బిడ్డ యెట్లా మాయమైందోఇప్పటిదాంక ఎవ్వలకు దెల్వదు దునియాల ఎన్ని జుస్తల్లేము గందుకే తిట్టినా కొట్టినా పడ్డగాని మోతిని  ఇడిసి కూలికి సుత బోలెకడుపునా బుట్టిన నలుసునూ ఆడిబిల్లని పారేసుకుంటమా. బిడ్డను మంచిగా అరుసుకో తెల్లారే అచ్చెస్త " చెల్లికి వంద జాగర్తలు చెపుతూ వెన్నక్కి  తిరిగి చూస్తూనే సూర్యని అనుసరించింది.

           

    మసక వెన్నెలో  కమ్లి తన పక్కన  నడుస్తుంటే   పొన్నపూల   పరిమళమేదో  చుట్టు ముట్టినట్టు  అయ్యింది. కమ్లి  కాలి మెట్టెల సవ్వడి గజ్జెల రవళి గాజుల చిరుమోతలు హాయిగా వింటూ ఆమె సమక్షాన్ని ఆనందంగా అనుభూతిస్తూ ముందుకు నడవసాగాడు.

         

    రోజంతా అత్త  ఎన్ని సాధింపులు సాధించినా రేయి సూర్య తన  రెక్కలో పొదవుకోగానే సర్వం మరచి పోతుంది కమ్లి. కడిమి ఒలే  తన  సరసన నిలిచి మనసు మరల్చేందుకు నేనున్నాన్నంటూ చేనుకు తీసుకెలుతున్న  సూర్యని చూస్తే చిరు గర్వమేదో  గుండె  నిండింది.  ఒక్కసారిగా  ఇద్దరి మనస్సులో మంచె  గురించిన మధురోహలేవో మదిలో మెదిలినై.

                                                                                 

* * *

 

    అపుడు కమ్లికి పదేళ్ళు, సూర్యకు పదిహేడేళ్ళు ఉంటాయేమోఆరోజు  వనభోజనాలకై  మామిడితోటకి  సూర్య బంధు జనమంత తరలివచ్చారు పక్కూరు నుండి  సూర్య మేనమామ కుటుంబం కూడా వచ్చింది. తోటలోనే పూజలు వంటలు  ముగిసి ఒక పక్కన  భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.  మరోపక్కన  కమ్లి మరికొందరి పిల్లలు సూర్య  వాళ్ళ  చేనులో ఆడుకోసాగరు.   అందరు బోజనానికి రండి అని పెద్దవాళ్లు అరుస్తున్నారు. మంచె దెగ్గర  చేరి మాట్లాడుకుంటున్న  బాబులాల్ ను  మామ శ్యాంనాయక్ ను, బాబాయిలను తనని మంచె ఎక్కించమని గొడవ చేయసాగింది కమ్లిఅప్పటికే మొగపిల్లలు అందరు ఏడెనిమిది సార్లు  ఎక్కి దిగారు. కమ్లి మారాము మరింత ఎక్కువయింది. తను మంచె ఎక్కడానికి  విఫల ప్రయత్నం చేస్తూ తండ్రితోను అందరితోనూ మరింత గొడవ  చేయసాగింది. మాటల్లోపడ్డ పెద్ద వాళ్ళెవరు కమ్లి గొడవను పట్టించుకోవడం లేదుకమ్లి రాగం పెద్దది అయింది. అడిబిల్లవ్ నువ్వేడ ఎక్కుతావ్ అని తండ్రి  ఒక్క కసురు కసిరాడుమొకం చిన్నపుచ్చుకుని నుంచుంది  కమ్లి. ఊహించని రీతిలో సూర్య ఆమెని చేతులతో ఎత్తి మంచె మీద కుర్చోపెట్టాడు. అందరు తెల్లబోయి చుసారు.  ఒకింత సిగ్గు మరింత సంతోషంతో కమ్లి మోము విచ్చిన మందారం  అయింది. హిమాలయాలు ఎక్కినంత  సంబరపడింది. నువ్వు శాన మంచొడివి అన్నది.

         

    "మామ కొడుకు గద మంచోడే. మరి లగ్గం చేసుకుంటావా..? రోజు మంచె  ఎక్కిపిస్తడు"అని   పెద్దాయన అనగానే అందరు గొల్లున నవ్వారు. కమ్లి ముఖం  సిగ్గుతో యెర్ర  కమలమే అయింది. ఏమి విన్నట్టు నటిస్తూ  సూర్య ముకం అటువైపు తిప్పుకుని నుంచున్నాడుకమ్లి  తండ్రి  భోజనాలు దగ్గరకు  తీస్కెళ్ళాడు. తర్వాత వారి ఆట పాటలో కమ్లి సూర్యల మంచె ముచట్లే వచ్చి నవ్వుల పంటలు పండాయిసాయంత్రం ఇంటికి మరలి వెళ్ళే వేళ ళ్లీ పిల్లందరూ మంచె దగ్గర చేరి ఆడసాగారు. మ్లిని అందరు సూర్యను పెళ్లి చేసుకుంటావా..? అని అడుగతూ ఆట పట్టించ సాగారు. ఆడి ఆడి కమ్లి సూర్య దగ్గరకు వెళ్లి "నువ్వు నిజంగా నన్ను రోజూ మంచె ఎక్కిస్తావ?" అని సూటిగా అడిగింది. "ఎంట్కి?" సూర్య అయోమయంగా అడిగాడు. "నువ్వు నిజంగా నన్ను మంచె ఎక్కిస్తే నేను నిజంగా లగ్గం జేసుకుంట" అని చెప్పింది. విన్నపిల్లలంతా కిలకిలా నవ్వారుఐదేళ్ళు గడిచినా గానీ మాటలను అన్న కమ్లి గానీ విన్నసూర్య గానీ మరచి పోలేదుఏమయినా సరే... మంచె కోసమనో మంచి వాడనో... పెళ్ళంటూ చేసుకుంటే సుర్యనే చేసుకోవాలని కమ్లి నిర్ణయించుకుంది. ఏమయినా సరే కమ్లినే చేసుకుని కోరినపుడల్లా మంచె ఎక్కించిమంచిగా చూసుకోవాలని సూర్య అనుకున్నాడు తరువాత సూర్యా కమ్లి ఎప్పుడు కలుసుకున్నాసంబరంగా ముచ్చట్లాడు కొనేవారు.

        

    మంచి బలిష్టంగా ఉండి ముగ్గురి పని చేసే సూర్యకు చాలామంది మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని ముందుకు వచ్చారుఇక సూర్య తల్లి తరుపు చుట్టం లింగానాయక్ అయితే ఇల్లు గొర్లు చేను ఎన్నెన్నో ఎర చుపి తన కూతుర్ని చేసుకొమ్మని ఎంత బతిమాలినా సూర్య వినలేదు. సూర్య తల్లి మాన్సిబాయికి మాములు కోపం రాలేదునా కొడుక్కి ఏమి మందు పెట్టారో అంటూ తిట్టుకుంటునే అయిష్టంగా పెళ్లి చేసింది. కొడుకు లేనపుడల్లా కమ్లిని ఏదో ఒకటి అని కుళ్ళ బొడుస్తూనే ఉంటుంది. పరువాలు కూర్చుకున్న ముద్దా మందారంలా తన ఇంటికి చేరిన  కమ్లిని చూసి కౌలుకు తీసుకున్న పొలంలో కాడెద్దులా కష్టపడ్డ కష్టమంతా మరచి పోతాడుతనను కోరి చేసుకున్న కమ్లికి కంచం నిండా కూడు పెట్ట లేక పోతున్నని బాధ పడుతున్న సుర్యాకు మాన్సిబాయి పెట్టె ఆరళ్ళు చెప్పి బాధ పెట్టదు.

       

    కానీ రాను రాను మాన్సిబాయి ఆరళ్ళు ఎక్కువయినాయి. రెండో కానుపు లోను ఆడపిల్ల పుట్టిందని కొడుకు చేనుకు వెళ్ళిన దగ్గర నుండి కమ్లికి నరకం  చూపించసాగింది. తమ తండాల్లో ఆడ పిల్ల పుడితే పొత్తిల్లల్లో పిల్లలకు వడ్ల గింజలు వేసి చంపడమో అమ్ముకోవడమో అతి మాములు విషయం. అందుకే కమ్లికి భయం వేసి పనికి పోవడం మానేసి మోతిని చూసుకోసాగింది.

     

    "ఏంది  కమ్లి మా అవ్వ గట్లనే అంటది  నువ్వు గిట్ల  రంధిబడొద్దని మొదాలే  జెప్పినగానీ గట్లేడుస్తవెంది?" కమ్లిని మంచె ఎక్కించి అన్నాడు. "అవ్ ఏమి అన్న నేను మనుసుల బెట్టుకోవద్దు గానీ మీ అవ్వ మంచిగా మనసుల వెట్టుకొని నన్ను సంపుతాంటది" అంటూ మల్లీ కన్నీరు పెట్టుకోసాగింది.

      

    "అగ్గో మల్లెడ్వ బడితివి. మా అత్త అడిబిల్లను  కనకుంటే నాకు సోనాక తుకుడా గీ కమ్లి దొరుకుతున్డేనా" చిరునవ్వుతూఅన్నాడు.

     

    కమ్లి సిగ్గుల మొగ్గవుతూనే "అవ్ అవ్  నువ్ గట్లనే అంటవ్ గాని నీకు దెల్వదుగా  లింగనాయక్ కాక తేపకొకసారి వస్తాడు.  మీ అవ్వతో గుసగుసలు వెడతాడు ఆయిన ఎల్లినంక గామే నన్ను మస్తు సెరలు బెడతదిమీ అవ్వకు వరసగా ముగ్గురు ఆడిబిల్లయినక మీ అక్కలు నువ్ బుట్టుండ్రు నీకు సుత  అడిబిల్లలేనీకు మీ అమ్మ సాలె అచ్చింది. నాకూ జుడు అందరు మొగపొరలే. నీకు మల్లసుత అడిబిల్ల బుడతది. గీ నెత్తినొప్పి మాకెందుకు. నువ్వు మీ అవ్వగారింటికిబోనేను నా కొడుకుకు మల్ల లగ్గం జేత్తనని ఏమి దిట్టిన తిడ్తాందినా పాణం బోయిన గాని  నేను తల్లి గారింటికి బోను ఏమి జేసుకున్తవో జేస్కోమన్న బాంచన్. పంచాయితి బెడతదంట. నేను మంచిదాన్ని గానని జెప్పుతదంట..." కమ్లి సూర్యను పెనవేసుకుని కరువు తీర ఏడుస్తూ అన్ని చెప్పుకున్నది. "మీ అవ్వ మాట ఇని నన్ను ఇడిసిబెడ్తవా.." అని సూర్యా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తూ బేలగా అడిగింది.

          

    "పిచ్చి దాన నిన్నిడిసి బెడ్తనగామె జెప్తే నేను జేసుకున్ననా? సూర్యుడే నీ దిక్కుంటే సుక్కలకోసం ఏడుస్తావ? సూడు నీకోసం ఏమి దేచ్చిన్నో!" అంటూ మంచె మీద మూలకు దాచిన గుడ్డ మూట తీసాడు. ఏమిటా అని కమ్లి ఆసక్తిగా  చూసింది. కాడ చీల్చి మాలగా చేసిన కలువ పువ్వు మాల కమ్లి  మెడలో వేసి "ఎవ్వరు ఏమన్నా గానీ  నిన్నిడిసి బెడ్తననుకున్నావా నువ్వు నా పానం గాదె" ముద్దుల్లో ముంచెత్తుతూ అన్నాడు. ప్రపంచం మర్చిపోయి పెనవేసుకున్నదామె. ఆకసానికి నేలకు మధ్యన ఒరిగి వెన్నెల ధారల మధ్యన  ప్రేమను పండిస్తున్న జంటకు రాలు పూలు తలంబ్రాలయ్యాయిఊగుతున్న పత్తిచేను కొమ్మలు వింజామరలయినాయి. పంట కాలువల గలగలలు సన్నని సంగీతం వినిపించసాగాయి.

        

    "నీ కోసం ఈడ నులక అల్లి మంచెను మంచం జేసిన. ఎవ్వల్లకు  దెలియకుంట దాని మీన రెల్లుగడ్డి గప్పిననీకు ఇష్టమనే ఎట్లన్న జేసి మా అవ్వకు ఏదో  ఒకటి జెప్పి అపుడపుడు ఈడకు దీసుకస్తన్నమరి కమ్లి...నాకేమిస్తావ్?" ఆమె గాజులను ఒకసారి  కాలి మువ్వలను ఓసారి లయబద్దంగా మోగిస్తూ కురులతో ఆడుకుంటూ అడిగాడు.

     

    "ఏమిస్తనాతన ఏమున్నది జెప్పుఅంటూ అతని మీదకు ఒరిగి అతని చెంపలపై తన కనురెప్పల వెంట్రుకలు తగిలేలా రెప రెప లాడించిందిఅతను గలగలమని నవ్వుతున్న కొద్ది మల్లీ మల్లీ రెప్పలు తాటిస్తూ ముద్దులు పెట్టింది.

       

    "ఏంది కమ్లి సక్కలిగిలి వెడతాన్నావ్? కండ్లతో గూడా ముద్దులు బెడ్తారని గిప్పుడే దెల్సింది" పులకించిపోతూ  అన్నాడు.

 

    "సక్కని సుక్కోలె  ఉన్ననా సిన్నతల్లి  మన చిన్న బుజ్జి మోతికి ఏమి కాదు గదా" సూర్యను పదే  పదే అడిగింది. "నేను బతికి ఉండగా ఏమి కానివ్వ"నని మటిచ్చాక నిశ్చింతగా అనిపించింది కమ్లికి.

      

    రేయి ఎపుడు నిదుర పోయారో? అసలే బాధలో ఉన్న కమ్లికి తన అప్పుల బాధలుగానీ కౌలు బాధలు గానీ ఏమి చెప్పలేదు.  తెల్లారి ఎపుడు నిదుర లేచిందో సూర్య లేచే సరికే కలుపు తీస్తూనే ఉంది కమ్లిత్వరగా మందుకొట్టి ముందు కమ్లిని ఇంటికి పంపి తరువాత తను ఇల్లు చేరలనుకున్నాడు సూర్య.

       

    "నువ్ గా పక్కన మందు గొట్టుకోపో గిన్తట్లకే నేను గీయింత కలపు దీస్త" చెప్పింది కమ్లి. త్వరగా ఇల్లు చేరి మోతికి  పాలు పట్టాలని ఆరాటం. చెల్లలు కన్నుగప్పి అత్త మోతిని ఏమయినా చేసేస్తుందేమోనని భయం. తమ దరిద్రానికి పిల్లలను అమ్ముకోవడం అత్తగారి ఊర్లో ఎన్నో చూసింది. అంతేకాదు పైసలిస్తున్నారని రాంబాయి ఏదో ఉరుకు బోయి మొగ పిల్లలను కని ఇచ్చి వచ్చిందని  అందరూ  చెప్పుకుంటుంటే విన్నది. ఏ సమయానికి ఏమి జరుగుతుందోనని హడలి పోతుంటుంది కమ్లి...  

       

    సూర్య మందు కలుపుకుని  ముఖానికి  గుడ్డ కట్టుకుని మందు కొట్టసాగాడుకాస్సేపటికి కమ్లి  ఇక యింటికి వెళ్ళమని చెబుదామని వెనక్కు  తిరిగాడు. అంతే  అక్కడ దృశ్యం చూసి కుప్ప కూలి పోయాడు. భయంగా ఒక్కసారిగా 'కమ్లి' అని గట్టిగా అరిచాడు. అక్కడ  నేలపై  వాలిపోయి కమ్లి పడి ఉన్నది. కంగారు  పడిపొతూ కమ్లి కమ్లి అని అరవసాగాడు.  ఉహూ... ఎంత అరచినా కమ్లి కళ్ళు తెరవలేదునీళ్ళు  తీసుకు వచ్చి ముఖాన  కొట్టాడు.  కళ్ళు తెరవలేదు. కమ్లి కమ్లి అంటూ చెంపలపై కొట్టాడు కదలలేదుచుట్టూ చూసాడు. కనుచూపు మేరలో ఎవరు కనపడలేదునేలపయి గబా గబా వెదికాడు ఏదయినా పురుగు కుట్టిందా? అసలు కమ్లి కేమయ్యిందో ఏమి అర్థం కాలేదు. కాళ్ళ పై చేతుల పై ఎక్కడ గుర్తులు కనపడలేదుకమ్లిని  తన చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య. వడలి పోయిన కమలంలా వేళ్ళాడి  పోసాగింది కమ్లిఏమి చేయలేని నిస్సహాయతతో  దుఃఖం ముంచుకు వచ్చిందిఎలా? ఏమి చేయాలిపుడుకాలి బాట తప్ప  రోడ్డే లేని తన ఊరినుండి  కమ్లిని ఎక్కడకు ఎలా  తీసుకెళ్లాలి? పదినెల్ల పాపను వదిలి ఇంత దూరం తన కోసం నడిచి వచ్చిందినిన్నంత ఏడ్చి ఏడ్చి ఏమి తిని ఉండదు. అందుకే కళ్ళు తిరిగి ఉంటాయి అనుకున్నాడు. కలిపిన మందు డబ్బాను అక్కడే వదిలి పక్క పొలాల వాళ్ళకు వినపడేలా కేకలు పెట్టాడుకాస్సేపటికి తమ చేలల్లో పని చేసుకుంటున్న భుక్య నాయక్, చందు వచ్చారుచందుకు మందు డబ్బా అప్పజెప్పి భూక్య సూర్య కలిసి కమ్లిని మోసుకుంటూ ఇంటి దారి పట్టారు కాని  దారి పొడుగుత సూర్య పెద్దగ ఏడుస్తూనే ఉన్నాడు.

         

    "మనసు బడి నన్ను జేస్కున్నావ్ ఏమి సుఖ పెట్టిననీ నా మీద అల్గి ఎల్లి పోకు కమ్లి కమ్లి మాట్లాడే కమ్లి..." అని అరుస్తూనే ఉన్నాడు. "అరె జరంత ధయిర్నంగుండు. సుక్కి లాల్ మందు బోస్తే దెబ్బక్ లేస్తది కమ్లికి ఏమి కాదు." ఆయసపడుతునే కమ్లిని మోస్తూ ఓదార్చాడు భుక్యనాయక్ఇంతలోనే గ్రామస్తులు కొందరు ఏమయ్యింది అని కంగారుగా అడుగుతూ కలిసి సాయం పట్టారు. ఇంటికి తీసుకు వెళ్లి నులక మంచం పై పడు కొబెట్టగానే లోపలి నుండి గౌరి పరుగెత్తుకు వచ్చి 'అక్క ఏమాయెనే' అంటూ బోరు బోరున ఏడవసాగింది. "ఏమయిందో తెలియదుఒక్కసారే...పడి పోయిందిఎట్లన్నదవఖానకు దిస్కపోవలె" సూర్య ఏడుస్తూ అన్నాడుఇంతలోకే మాన్సిబాయి వచ్చి"ఏమయ్యింది కమ్లికి " అని అడిగి వడలి మంచాన పడి ఉన్న కమ్లిని చూసి.."గాలి తగలినట్టుంది  పిల్లల దూరం  బెట్టు ...." అని ఏడవడం మొదలు పెట్టిందితల్లి దగ్గరకు రాబోయిన పుత్లి బెదిరి పోయి దూరంగా నిలబడి ఏడవసాగింది. అప్పుడే పాలబువ్వ తిన్న మోతి చీర ఉయ్యలాలో తూగుతున్నది.

       

    "అవ్వ పయిసలెన్ని ఉన్నాయో సూడుగిదే మంచం మీద ఏసుకొని ఊర్లకి దిస్కబోయిదవాఖానలా జూపెట్టాలే"  ఏడుస్తూనే అన్నాడు  "పైసలేడియి కొడకా మొన్ననే గదా వడ్డీ గట్టినావ్" అన్నది. సూర్యకు మరింత  దుఃఖం ముంచుకు వచ్చింది. కమ్లి అంటూ నిస్సహాయంగా ఏడ్వసాగాడు. అరగంట గడిచిందో లేదో కొత్త తండ వాళ్ళు పాత తండ వాళ్ళు అంత అక్కడ చేరారు. ఒక్కొక్కరు ఒక్కో మాట అనసాగారురాత్రి చేనుకు ఎందుకు తీసుళ్లావని సూర్యని తిట్టారు. ఎవరో పరుగు బెట్టి సూక్యను తీసుకువచ్చారు.

      

    కమ్లి పరిస్థితి ఏమి అర్థం కాలేదు. యేవో ఆకు పసర్లు కమ్లి నుదిటిపై రాసాడుఏమి గుణం కనిపించలేదుగౌరి అరికాళ్ళు అరి చేతులు రుద్దుతూ పెద్దగ ఏడుస్తున్నదిఅంతలో మోతి లేచి ఏడ్వసాగింది. గ్లాస్ లో గేదె పాలు తీసుకు వచ్చి తాగించబోతే  అస్సలు తాగడం లేదు.  ఉండుండి విపరీతంగ ఏడుస్తున్నది. మరో వంక అమ్మ అమ్మ అంటూ పుత్లి ఏడుస్తున్నదితను ఏడుస్తూనే పిల్లలను సముదాయించ సాగింది గౌరి.  పిల్లలను దూరంగ తీసుకెళ్ళమని కసిరింది మాన్సిబాయి.

       

    ఇంతలో కమ్లి  అన్నలు వచ్చారువేప చెట్టు కింద నులక మంచం పై పడి ఉన్న కమ్లిని చూసి నిర్ఘాంత పోయారు. ప్రాణం ఉన్నట్టే ఉంది  కాని  ఎంత కదిపినా లేవడం లేదు. దిక్కు  తోచక కాస్సేపు పెద్దగ ఏడ్చారు. ఎలాగో ఒలగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళదామని ఆరాటపడ్డారు. కాని  ఎవరు ఎన్నిసార్లు లెక్కపెట్టుకున్నా అందరి దగ్గర కలిపి వంద రూపాయలు కూడా లేవునిస్సహాయంగా పడి ఉన్న కమలిని చూస్తే గుండె తరుక్కుపోతున్నది. తమ చెల్లెలు బ్రతుకుతుందా అనుమానం వచ్చింది. అంత లోనే సూర్యనే ఏదో చేసి ఉంటాడు కమ్లి మందో తాగి ఉంటుంది అన్న అనుమానం వచ్చింది.  

      

    అంతే... అకస్మాత్తుగా "చెప్పు మా చెల్లనేమి జేసినవో చెప్పు"అంటూ సూర్యపై పడి కొట్టసాగారు. ఎంతో బలిష్టుడయినా సూర్య తెల్లబోయి చూస్తూ దెబ్బలు తిన్నాడు. "కమ్లి కమ్లి" అని ఎడుస్తునాడే గానీ ఎదురు తిరగలేదుకొడుకు కోసం  మాన్సిబాయి ఏడ్చిన ఏడ్పులు విని సూర్య తరుపు వాళ్ళు వచ్చి కమ్లి అన్నలను కొట్టసాగారు. క్షణంలో అక్కడ యుద్ద వాతావరణం నెలకొందిఎవరు ఎవరిని ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. గాట్టిగా విన పడుతున్న అరుపులు ఏడ్పులు విని బెదిరిపోయి మోతి, పుత్లి  ఏడవసాగారుకొట్టుకుంటున్న వాళ్ళను ఊరి వాళ్ళంతా కలసి నానా తంటాలు పడి ఆపారు.

      

    "పైసలు జూసుకొని పొల్లను ధవకానకు దీస్క పోవాలె గానీ గీ కొట్టుకునుడేందిపెద్దలు కోపడ్డారు."మీరు ఎన్నయినా దిట్టుండ్రి గాని గానీ ఎవ్వల్న  పైసలిస్తే జప్పన దీస్కబోయి కమ్లిని మంచి డాక్టర్కు చూబిద్దాం. ఎన్క సిరి నేను ఎట్లన్న జెసి తీరుస్తా"నని బతిమాలాడు సూర్యఅందరు రోజు కూలీల వాళ్ళే ఎవరికి వాళ్ళు పైసలు లేవనే బదులిచ్చారు. తన దుఃఖంలో తానుండి మబ్బులు ముసురుకుంటున్న సంగతి సూర్య గమనించనే లేదు. "ఎవరన్న జర సాయం బట్టండి గీ మంచం మీద గిట్లనే జప్పన సర్కార్  ధవకానకు దొలక పోదాం"  అని సూర్య బతిమాలాడు. తండా నుండి టౌనుకు ఎవరు రావాలన్న పోవాలన్నా ఏడు మైళ్ళు నడిచి రావలిసిందే. అందరికీ పొలం పనులున్నాయి. అయినా ఒకరికి నలుగురు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

       

    ఇక తీసుకెళ్దామని అనుకునేంతలో కమ్లి అమ్మనాన్నా అక్కా చెల్లెలు వచ్చారు. రావడం రావడం కమ్లిపై పడి పెద్దగా ఏడవసాగారుకమ్లిలో చలనం లేదుదుఃఖం ఆపుకోలేక మాన్సిబాయిని  నోటికి వచినట్టు తిట్టసాగారు. "ఆడిబిల్ల బుట్టిందని  దాన్ని ఏమి దిట్టిన దిడుతున్నావ్. నువ్వే ఏదో చేసేవ్ నా కూతుర్ని. నా కూతురు ఏదో మింగే ఉంటది పోలీసులకు పట్టిస్తా"మని గొడవ చేసారుఊర్లో ఎవరకి బండయినాలేని  దిక్కుమాలిన ఊర్లో పిల్లను ఇచ్చామని తిట్టుకున్నారుఅరిచి గొడవ చేస్తున్న వాళ్ళను  ఊరి  వారందరూ కాస్త సముదాయించి పక్కకు జరిపారు.

     

    ఇక డాక్టర్ దగ్గరకు బయలు దేర్దామనే లోగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. "జరంత సేపట్ల వాన  బడుడే ఇగమా మన పొలాల సంగతేందని బాధ పడాల్నాకమ్లి కోసం బాధ పడాలనఒక పెద్దయన అన్నాడో లేదో మెల్లగా వాన అందుకని కాస్సేపటికి జడి వానే అయిందిఅది చూసిన సూర్య గుండెల్లో  దుఃఖం ఉప్పెనయి పొంగింది. "కమ్లి... నేనేమి జేతు కమ్లి అంటూ కమ్లినీ పట్టుకుని లే కమ్లి పిల్లలు ఏడుస్తున్నారు లే కమ్లి" అంటూ చంటి పిల్లవాడిలా ఏడవసాగాడుకమ్లి కదలను కూడా కదలలేదుపుత్లి ళ్లీ తల్లి దగ్గరకు రాబోయింది. "అదొద్దు పిల్లకు పురుగు గుట్టిందో గాలిబట్టిందో పిల్లలను దగ్గరకు రానియ్యకుండ్రి" అంటూ మాన్సి బాయి ళ్లీ  కసిరింది. కమ్లి తల్లి,అక్క చెల్లెళ్ళు పెద్దగ ఏడవసాగారు. కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ మబ్బులను వానను చూసుకుంటూ దేవుడిని  తలచుకుంటూ ఏడుస్తున్నాడు  సూర్య.

     

    గంటయింది రెండు గంటలయ్యింది. వాన తగ్గలేదు. సాయంత్రమయినా వాన తగ్గలేదు కమ్లి లేవలేదు. అంత వానలోనూ సూర్య సూక్య దగ్గర పసర్లు  తెచ్చి కాలికి చేతికి నొసటికి రాస్తూనే ఉన్నాడు. సూర్య కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే  ఉన్నాయి. ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ మిగితా వాళ్లంతా తలో ఇంటా ఒక ముద్దా తిన్నారేమో కానీ సూర్య ముద్ద ముట్టలేదు. ఆరు ఏడింటికి వాన జోరు తగ్గింది. గాని చీకట్లు ముసురుకున్నాయిదార్లన్ని బురద మాయమయి పోయాయి. అందరూ  రాత్రి గడిస్తే రేపు తెల్లవారి కమ్లికి స్పృహ వస్తుందేమో అని సూర్యకు నచ్చజెప్పారుమోకాల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు సూర్య. పిల్లలను సముదాయించలేక బావను ఓదార్చలేక గౌరి సతమతమవుతున్నది ...

     

    ఎవరి గుడిసెలో  చూసినా కమ్లి గురించే మాట్లాడుకోసాగారుకమ్లి వాళ్ళ అమ్మ అన్నలంతా వాళ్ళ కాకా ఇంట చేరారు. వానపడి అమ్ముడు కాని కల్లంతా  ఆడామగా కడుపుల్లో నిండింది. ఇంతలో ఎవరో వచ్చి చెప్పారు రాత్రి సూర్య అతని మేన మామ మంగిలాల్ రాత్రి తుల్జబాయి ఇంటికి వెళ్ళారనిమంత్ర బియ్యం  తెచ్చారని. అంతే క్షణాల్లో కమ్లి బంధువులంతా  అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. పదమంటే పదమని వానలోనే తూలుకుంటూ తుల్జ బాయి ఇంటికి పరుగెత్తుకు వెళ్లారు.

      

    "చెప్పు... మా కమ్లికి వాళ్ళ అత్త నీతో  చేతబడి చేయిస్తున్నది  దూ" అంటూ నిలదీసారు. "అయ్యో బాంచెన్. చేనుకు పురుగు దగలుతున్నది.  దిట్టి మంత్రం బెట్టమంటే  మంత్ర బియ్యం ఇచ్చిన. నాకేమి దెలియదు" అంటూ కాళ్ళ వేళ్ళ పడినా వినలేదు. ఆమెను బయటకు ఈడ్చి తలో దెబ్బ వేసారు. "మీ  కాళ్ళు మొక్కుతా బంచెన్ నాకు ఏమి దెల్వదు" అని తుల్జ బాయి "నా భర్యను ఇడిసిబెట్టున్ద్రి ఏదో కర్చుల కస్తాయని దిట్టి మంత్రమేస్తది గాని, దానికేమి రాదు బంచెన్" అని ఆమె భర్త కాళ్ళ మీద  పడ్డాడు. "ఇగో ఇప్పుడే జెప్తున్నాం రేపుపోద్దుగాల్ల ల్లా కమ్లి లేవాలే. ఎర్కయిందాలేకుంటే ముంగటి పళ్ళు రాల్గొట్టి గుండు జేపిస్తం" అంటూ బెదిరించి వచ్చారు.

      

    "పాపం వాళ్ళనెందుకు కొట్టారు..?" అని ఒకరంటే "అసలెందుకు ఎందుకు వదిలి పెట్టారు? చెట్టుకు గట్టి తన్నాల్సింది"  అని మరొకరన్నారు. "రేపు గిట్ట కమ్లి లేవకుంటే చెట్టుకు గట్టి గొట్టుడు కాదు సంపుడేకమ్లి అన్నలు అన్నారు. కమ్లిని  చూసి తట్టుకోలేక విపరీతంగా కల్లు తాగి ,కమ్లి తండ్రి ఉండుంది కమ్లి..కమ్లి అంటూ పెద్ద గొంతేసుకుని ఏడ్వసాగాడు. మిగిలిన ఆడ మొగ గొంతు కలిపి  ఏడవసాగారు.

      

    "ఇగ సాలు తియుండ్రి. మీ నోట్ల మన్ను బడఅందరు మొనగాల్లెగానిఊరికి ఒగ  రోడ్డు లేదుఒక్కల్లకు కచరం బండి లేదు. ఎవళ్ళకు ఏ  పదొచ్చినా  ఎవల్లతాన పైసా దిక్కులేదు. కొట్లాడుతానకి మాత్రం ఎగాబడ్తండ్రు. సి నీ యవ్వ తెల్లర్తే పొళ్ళను ధవఖనకు యెట్లా దిస్కపోవల్నో గది సొంచా యించుండ్రి వాన జూస్తే తగ్గే తట్లే లేదుఅది అసలు బతుకుతాదో లేదోఅంటూ రాగమందుకున్నది కమ్లి నాయనమ్మ. ఆమెతో అందరూ రాగం కలిపారు "ఏమాయెనే కమ్లి నీకు..? కమ్లి .మా కమ్లిమమ్ముల అన్యాలం జేసి పోతవ ఏంది కమ్లి..నా కమ్లి.. బిడ్డలు జుస్తే సిన్నోల్లు ..మొగడు జూస్తే వసులున్నోడు. నువ్వు బోతే నీ బిడ్డలా గతి ఏంది? కమ్లి మా కమ్లి" అంటూ పెద్దగ శోకాలు పెట్ట సాగారు. 

       

    రెండు గుడిసెల కవతల ఉన్న సూర్యా రాగాలు వింటూ ఉలిక్కి పడ్డాడు. అంటే కమ్లి ఇక బతకదా!నిలువునా వణికి పోయాడు. "కమ్లి కళ్ళు తెరువు కమ్లి. మోతిని,పుత్లిని మంచిగా జూసుకుందాం. ఈడ బతక లేకుంటే ఊర్లెకు బోయి పనులు జేస్కునన్న  బతుకుదాం. ఇగ నుండి నిన్ను ఒక్క మాట గూడా అననియ్య. ఎన్ని రోజులసంది దినలేదో పడి పోయినవ్లే కమ్లి లేసి ఒగ ముద్ద దిను. నేను దినిపిస్తా కమ్లివెక్కివెక్కి పిచ్చివాడిలా  ఏడవసాగాడు. కమ్లి ఒక్కింతయిన కదలలేదు. పరీక్షగా చూస్తే నీరసంగా ఊపిరి పీల్చుకుంటున్న విషయం తెలుస్తున్నదే తప్ప బతికి ఉన్న లక్షణాలే లేవు. కమ్లిని  చూసి తట్టుకోలేక విపరీతంగా కల్లు తాగికమ్లి తండ్రి ఉండుంది కమ్లి..కమ్లి అంటూ పెద్ద గొంతేసుకుని ఏడ్వసాగాడు. మిగిలిన ఆడ మొగ గొంతు కలిపి  డవసాగారు ఏడుపులు వింటూ సూర్య మరింత కుమిలి పోసాగాడు

    

    అతి భారంగా తెల్లవారింది. అందరు వర్షంలో తడుస్తూనే వచ్చి కమ్లిని చూసి ఏదో ఇక మాట అని వెళ్తున్నారు. లింగా నాయక్ లోనికి వెళ్ళాడు. "ఏందక్కా  నీ కోడలు చచ్చేతట్టున్నది కదా" అన్నాడు వంకరగా. "అవ్ బత్కే నమ్మకం లేదు ఏదో  గాలి  బట్టింది" మాన్సిబాయి కళ్ళు తుడుచుకుంటూ అన్నది. "నా కొడుకుకు  ఎంత వయసని అప్పడే గిన్ని కష్టాలుఅని ఏడ్వసాగింది. "ఏడవకు అక్క నా అల్లున్ని  ఆగం జేసుకుంటనా! కమ్లికి ఏమన్నా అయితే నా కూతురు నిన్ను నీ కొడుకును మంచిగా జుసుకుంటది. నువ్వు ఫిఖర్ జేయ్యక్" అన్నాడు. దాని భావం అర్ధం అయి మాన్సిబాయి కళ్ళు వెలిగి పోయాయి  "దీన్ని ఏమంట  జేసుకున్నదో నాకొడుకు అన్ని కష్టాలే" అని కళ్ళు ముక్కు తుడుచుకున్నది.

     

    తండా అంతా కమ్లి గురించే కలకలం... వానలో తడుస్తూనే  అందరు దిగులుగా తిరగసాగారు.

     

    సూర్య మనసులో వేల వేల ఆలోచనలు. ఎంతో అమాయకంగా ఎంతో చిలిపిగా ఎన్ని జ్ఞాపకాలనిచ్చింది. తమ జంటను చూసి తండాలోని వారంతా ముచ్చటపడి పోయేవారు. బయట వానే కాని సూర్య గుండెల్లో మాత్రం తుఫానే రేగుతున్నదిఒక్కో గంటా గడుస్తున్న కొద్ది సూర్య బెంగ ఎక్కువయి పోతున్నది. అందరు ఇక కమ్లి బతకడం కష్టమనే చెబుతుంటే తల కొట్టుకుని ఏడవసాగాడు. ఎవరు వస్తున్నారో ఏమి అంటున్నారో పట్టించుకోకుండా సూక్యా ఇస్తున్న పసరు మందు కమ్లి నుదుటికికాళ్ళకు, చేతులకు రాస్తూనే ఉన్నాడు. కమ్లి నోరు పెగలదీసి  పసర్లు పిండుతూనే ఉన్నాడు. ఒక గంట తగ్గితే మరో  గంట వర్షం పడుతూనే ఉన్నది. రెండవ రోజు కూడా గడిచి చీకటి పడింది.

      

    కమ్లి అన్నలు మరి కొందరు కాస్త వర్షం తగ్గగానే తుల్జబాయిని ఆమె మొగుణ్ణి చెట్టుకు కట్టి తన్నాలని కొందరు కాదు చంపేయాలని  కొందరు పథకాలు వేసుకున్నారు. లింగానాయక్ సహయంతో సూర్య అన్న తమ్ముళ్ళు కొందరు ఊరివాళ్లతో కల్సి తమ  అన్నను కొట్టినందుకు ప్రతీకారంగా తెల్లవారే చింత బరిగలతో  కమ్లి వాళ్ళ అన్నలపై దాడి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. తండా వాళ్ళంతా రెండు వర్గాలుగా విడిపోయి తన్నులాటకు పథకాలు వేసుకుంటున్నారు. సాయంత్రమే  చందునాయాక్ సూర్యా దగ్గరకు  వచ్చాడు.వీరు,ఇతర సావాసగాళ్ళు వచ్చారు.

      

    "ఏంది సూర్య.. కమ్లి ఇగ లేస్తదంటవాఏమి బతుకులు మనయితిండిగింజల కోసం అడివిల ఎలుగోడ్లోలే  దిరుగుతున్నాం. పొయ్యి మీదకుంటే  పొయ్యి కిందకుండదు. పొయ్యి కింద కుంటే పొయ్యి మీదకుండదు. జనమంతా  ఒగ దిక్కుంటే మనం గీ అడవిల జంతువులోలె బతుకుతున్నాం. అందరికి కొట్లాడుకోను తన్నులాడుకోను చ్చింది గాని కమ్లిని ధవఖనకు  దీస్కపోవుడచ్చిందా?" వీరు అన్నాడు  దుఃఖపడుతూ.

    

    "గిప్పుడు ఓట్ల ఎలచ్చున్లున్నా బాగుంటుండే. వాళ్ళ జీపులస్తయి గదా. వాళ్ళ కాళ్ళ మీద పడన్న కమ్లిని ఉర్లేకి దిసక పోయేటోల్లం" చందు అన్నాడు అమయాకంగా. "ఇగ సాలు తియి గాల్లు మల్ల అయిదేన్లకు గదా అచ్చుడు" తీసి పారేసాడు వీరు.

      

     రాత్రి సూర్య దుఃఖం చూసి కొంతా... రెండు రోజులు గడిచాయి కాబట్టి  క్షణమయినా కమ్లి ప్రాణం పోతుందేమో నన్న అనుమానంతో కొంత సూర్య  మిత్ర బృందం సూర్యాతోనే ఉంటూ అందరూ బయట చేరి దిగులుగా మాట్లాడుకోసాగారురాత్రంతా కొత్తతండాలోను, పాతతండాలోను ఎవరూ నిద్రపోలేదు. ఇంకా తుంపర పడుతుండడంతో అంతా చిత్తడిగా ఉండి ఎవరూ నడుము వాలుస్తానికి కుడా వీలులేకుండా ఉంది. 

      

    తన చుట్టూ  ఏమి జరుగుతున్నదో తెలియని కమ్లి కన్ను తెరవకుండా పడి ఉన్నది. తన చిన్న నాటి నేస్తం ..తన ప్రియ నెచ్చెలి ..తన అర్ధాంగి ..అలా పడి ఉండడం నరకంగా ఉంది సూర్యాకు. కమ్లి చేతులు పట్టుకుని మౌనంగా రోదించ సాగాడు...

        

    "లేరా  కొడుకా.. అది ఇగ బతుకుతదో సస్తదో గాని నడుమ నువ్వు ఒగ బుక్క గూడ దినకుంట..పానం మీదకు దెచ్చుకోకు బిడ్డా" మాన్సిబాయి వచ్చి సూర్యాను బతిమాలసాగింది.

      

    "లే ఒర్రక్..! నువ్వు జేయ్యబట్టి గాదూ కమ్లి గిట్లయ్యిందిఆడిబిల్ల బుడితేంది మొగ పోరడు బుడితేంది ? దాన్ని ఒక నరకం బెట్టినవా సూడు అవ్వా ..! సూడు అది కన్ను దెరవకుంట బడి ఉన్నది. నీ ఇంటికి అచ్చినంక బిడ్దోలె జుస్కోవాలే... దినం గది  డుసుడే గదా అది కడుపు నిండా దిని ఎన్ని రోజులయ్యిందో! గిట్ల పాణం మీదకు దెచ్చుకున్నది" సూర్యా ఏడుస్తూ అన్నాడు. సూర్యాతో పాటు మిగితా వాళ్ళు తలో మాట అనే సరికి మాన్సిబాయి ఏడుస్తూ మూల పడుకున్నది.

     

    కమ్లి కాళ్ళ దగ్గర కళ్ళు ముడుచుకు పడుకున్న సూర్యను చూసి తెల్లవారు జామున "ఈడు అన్నం నీళ్ళు  మాని గిట్ల ఏడుస్తున్నాడు.ఆడి పిచ్చిగానీ ఇగ అది బతుకుడు కష్టం. తెల్లారికి కమ్లి గిట్ట సస్తే వాన బడి కట్టెలన్నీ తడిసినయి కనీసం కాల్చుడు గూడ కష్టమేపెద్దలెవరో అన్న మాటలు వినపనే వినపడ్డాయి సూర్యకు. "అయ్యో..కమ్లి..అయ్యో ..ఇగ నిన్ను బతికిచ్చుకోలేనా?" పెద్దగ అంటూ హృదయ విదారకంగా రోదించసాగాడు. కుమిలి పోతున్న కొడుకును చూస్తూ  మాన్సిబాయి కమ్లి గురించి తొలిసారిగా బాధపడి శూన్యం లోకి చూస్తూ దేవుడికి దణ్ణం పెట్టుకోసాగింది.

       

    "కమ్లి  లే  కమ్లి.. ఒక్కసారి లే.. నువ్ సస్తే ఎండుకట్టెలు గూడ లేవ్వంటుండ్రు...మాట్లాడు ..కమ్లి ..లేసి మాట్లాడు ..నన్ను దిక్కు లేనోడిని జేసి పోకు..నువ్వు సచ్చుడు  ఏందే..నువ్వు బతకాలే..నా కోసం పిల్లల కోసం..బతకాలె"  అంటూ ..పెద్దగ ఏడవసాగాడు.. రెండు రోజులుగా సూర్యా ..ఏడుపులకు అలవాటు పడిన బంధువులు జాలిగా లోనికి తొంగి  చూసారు...

     

    నిద్ర నుండి ఎపుడు లేచి వచ్చిందో మోతి దోగాడుతూ తల్లి మంచం దగ్గరకు పాకి వచ్చిందికమ్లి చేతులు పట్టుకుని ఏడుస్తున్న సూర్యా గానీ నిద్రలో ఉన్న గౌరిగానీ మోతిని చూసుకోలేదు అంటూ దోగాడుతూ మోతి తల్లిని చేరుకుంది. మంచం కోడు పట్టుకుని నిల్చుంది. .. ..అమ్ అమ్.. అంటూ చిట్టి చేతులతో కమ్లి ముఖం  పై తపతప కొట్టిందిమరో లోకంలో ఉన్నట్లున్న సూర్యా తలవంచుకుని  కుమిలి కుమిలి  ఏడుస్తూనే ఉన్నాడు. మోతి మళ్లీ  మళ్లీ  అమ్ అమ్మ అంటూ చేతులతో మొదసాగిందిఅయిదు నిముషాలు గడిచాయిసూర్యా ఏడుస్తూ... ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. తన చేతుల్లో ఉన్న కమ్లి చేతుల్లో చిరు కదలిక. విధ్యుత్ ఘాతం  తగిలిన వాడిలా  చివ్వున తలెత్తి  ఆశగా ఆత్రుతగా కమ్లి ముఖం లోకి చూసాడు. కమ్లి తల దగ్గర మోతిని చూసి నిర్ఘాంత పోయడు. మోతిని ఎత్తుకోబోయి ఆగి పోయాడు. మోతి కమ్లిని అమ్ అమ్.. అని పిలుస్తూ చేతులతో తప తప కొడుతూంటే సంజీవని తాకినట్టయి ఊపిరితిత్తులు నిండి తలకు పాకిన పురుగు మందు మత్తు వదలి,  కమ్లిలో కదలికలు ఎక్కువయినాయి. కమ్లిలో చలనం చూసి ప్రాణం లేచి వచ్చి సూర్య కళ్ళు పత్తి కాయల్లా విచ్చుకున్నాయిరెప్పలు ఆర్పకుండా కమ్లి వంకే  చూడసాగాడుమోతి కమ్లి  మోముపై తన ముఖం ఆన్చి ..మం ..మ్మా అంటూ మళ్లీ మళ్లీ   తల్లిని పిలవసాగింది. ఎక్కడికో తరలి పోతున్న ప్రాణాలను కూడా కూడదిసుకున్తున్నట్లుగా అతి కష్టంగా కమ్లి కళ్ళు విప్పి చూసిందిసూర్యకు  వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. "అవ్వా.. అవ్వా..లేసింది. కమ్లి లేసింది కమ్లి  లేసింది" సంబరంగా అరిచాడుబయట చేరిన ఊరి వారంతా వడివడిగా లోనికి వచ్చేసరికి... కమ్లి వడిలో మోతి బోసి నవ్వులు  పండిస్తున్నదిమూడు రోజులుగా ముసురు పట్టి మబ్బులుమూసిన ఆకాశంలో సూర్యుడి లేవెలుగులు సూర్య మోములో  ప్రతిబింబించాయి.


(సాహితీస్రవంతి జూలై-ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం)

Comments