కాంత-కనకం-కరక్కాయ - వాసుదేవ్

    
"సార్, మీ మిసెస్ బయట హాల్లో వెయిట్ చేస్తున్నారండి"

    ప్యూన్ మాటలకి కంప్యూటర్ స్క్రీన్‌లోంచి  మొహం బయటపెట్టి సుబ్బారావు అడిగాడు "రంగారావ్  ఎవరితోమాట్లాడుతున్నావు? ఎవరా వచ్చింది?"

    "మీతో నండేనయ్యా! మీ మిసెస్సేనండి వచ్చింది. చాలా సేపయినట్లుంది. బేగెళ్ళండి."

    'అదేంటి ఇప్పుడే కదా ఇంటినుంచొచ్చాను. అప్పుడే కాంత రావటమేంటి -- అదీ ఆఫీస్‌కి’ తనలో తనే  గొణుక్కుంటూ సీట్లోంచి లేచాడు సుబ్బారావు. అప్పటికే కొలీగ్స్ అందరూ అదో మాదిరి క్వొశ్చన్‌మార్క్ ఫేస్ పెట్టి మరీ సగటు తెలుగువాడి ఉత్సుకతతో చూస్తున్నారు.

    సోఫాలో హాఫ్‌వైట్ చీరలో స్నిగ్ధంగా కూర్చున్న కాంత కేసి చూసాడు సుబ్బారావు.

    'హైదరాబాదీ పెర్ల్లా మెరిసిపోతుంది, అమాంత వెళ్ళి వాటేసుకోవాలనుంది, అయినా ఈ తింగరిది ఇక్కడికెందికొచ్చినట్లో’ స్వగతంలో అనుకుంటూ కాంత పక్కన కూర్చున్నాడు-

    "ఏంటి కాంతా! ఏమయ్యింది, ఫోన్ చెయ్యలేకపోయావా?"

    "మరేం, మీరు తిట్టనంటే నేనెందుకొచ్చిందీ చెప్తాను."కాంత కండిషన్స్ మొదలయ్యాయి. 

    "ఏం లేదండి, ఇవాళ రాఖీ కదా, మీ ఆఫీస్లో ఉన్న లేడీ కోలీగ్స్ అందరిచేతా మీకు రాఖీ కట్టించి మీకు అక్కచెళ్ళెళ్ళు లేరన్న బాధ లేకుండా చెయ్యాలని రాఖీలు కొనుక్కుని మరీ వచ్చాను. ముందుగా చెప్తే మీకు థ్రిల్లింగ్‌గా ఉండదని......" కొంచెం స్లో చేసింది ప్రవాహాన్ని కాంతం.

    అదిరిపడ్డాడు సుబ్బరావు.'కాంతా’ అని గట్టిగా అరవబోయి అది ఆఫీస్ లాంజ్ అనిగుర్తుకొచ్చి ఆగిపోయేడు. 
 
    "అదేంటే వాళ్ళందరూ నువు చెప్తే నాకెందుకు రాఖీలు కడ్తారు? అయినా నీకు నామీద ఇంత అనుమానం ఏంటే? ఇలా నా ఆఫీసుకొచ్చి మరీ నా పరువు తియ్యాలా?" కొంచెం గట్టిగానే కేకల్లాంటి మాటలతో కాంత మనసు మార్చాలని  చూసాడు సుబ్బారావు. కానీ ఏం లాభం లేకపోయింది. నోట్లో 'పచ్చి కరక్కాయ’ పడ్డట్లయింది సుబ్బారావుకి. అదేంటి పచ్చివెలక్కాయ అనికదా ప్రయోగం అనుకుంటున్నారా సుబ్బారావుకీ కరక్కాయకి ఉన్న అనుబంధం అలాంటిది. ఆ కరక్కాయానుబంధం తర్వాత చూద్దాం. అప్పటికే తన సెక్షన్లో అందరికీ ఈ విషయం తెల్సిపోయింది. ఒకరిద్దరు లేడీ కొలీగ్స్‌కి విషయం తెల్సి 'సంఘటనా స్ఠలా’నికి చొచ్చుకురావటం, సుబ్బరావు వైపు చిలిపిగా చూడటం చెప్పుకోదగ్గ అంశాలు. మిగతా వాళ్ళందరూ నెమ్మదిగా చేరుకున్నారు. సుబ్బరావుకి  మొత్తం వ్యవహారమంతా రంపపుకోతగా ఉంది. అక్కణ్ణుంచి "డింగ్" మని మాయమయిపోతే బాగుణ్ణు లేదా భూమి రెండుగా చీలిపోయి అందులో నేను కూరుకుపోతే బావుణ్ణు లాంటి తెలుగు నవల్లలోని బోలెడన్ని వాక్యాలు గుర్తుకొచేశాయి సుబ్బారావుకి.

    అందరూ వరసగా సుబ్బారావుకి రాఖీలు కడుతున్నారు. ఒకావిడ అడిగింది "ఏమండి కాంతగారు మీకు ఎన్ని రాఖీలు కొనాలో ఎలా తెల్సింది?" సుబ్బారావుని ఇంకా ఆటపట్టించడ కోసం.

    "నిన్న రాత్రే మా ఆయన్ని అడిగానండి మీ ఆఫీసులో ఎంతమంది లేడీ కొలీగ్స్ అని అయినా ఓ రెండు రాఖీలు ఎక్కువే కొన్నాన్లెండి." అంది కాంతం జంధ్యాల సినిమాలొ శ్రీలక్ష్మిలా అమాయకంగా!

    మొత్తానికి ఈ రాఖీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగానే ముగిసింది. ఇంతకీ ఈ సుబ్బారావుకి కాంతతో ఎలా పెళ్ళయిందో ఓ సారి గతంలోకి తొంగి చూద్దాం.
కాంతా పరిణయం

    సుబ్బారావు వైజాగ్లోని సిరిపురంలోని ఓ పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలో ఉద్యోగం. జూనియర్ సి.ఎ. గా నాలుగేళ్ళుగా ఉద్యోగం చేస్తూ నాలుగురాళ్ళు వెనకేసుకున్నాడు. డబ్బులు వెనకేయటంలో సుబ్బారావు తన చదువుని బాగానే ఉపయోగించుకున్నాడు. కానీ పెళ్ళవడానికి మాత్రం బాగా లేటయ్యింది. వెళ్ళిన ప్రతీ పెళ్ళి చూపుల్లోనూ అమ్మాయిని 'రంగు, రుచి, వాసన’ అనే ఈక్వేషన్తో కొలిచేవాడు. '

    రంగు’ అంటే అమ్మాయి తెల్లగా ఉండాలి. తెలుపు అందానికి ప్రధాన లక్షణం.

    ఇక 'రుచి’ అంటే అందం. తమిళ, తెలుగు సిన్మాల్లో బాగా పాపులర్ అయిన నటి నమిత అంటే సుబ్బారావుకి విపరీతమైన ఇష్టం. నమితలో సుబ్బారావుకి నచ్చిందేమిటంటే మనిషి అంత భారీగా ఉన్నా మూతి మాత్రం సున్నాలా గుండ్రంగా చిన్నగా ఉండడమే! ఇక 'వాసన’ అంటే  డబ్బు. అయితే కట్నం లేదా ఉద్యోగం ద్వారానైనా అమ్మాయి ద్వారా బాగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నది మూడోపాయింట్. ఇలా ఈ చట్రంలో పూర్తిగా ఇమిడిపోయిన అమ్మాయినే చేసుకోవాలన్న దృఢసంకల్పంతో ఉన్న సుబ్బారావుకి దాదాపు ఇరవై సంబంధాలు ఫెయిలయ్యాయి.

    కాంతతో పెళ్ళి చూపులు ఇరవైఒకటోది. సుబ్బారావ్ లక్కీ నంబర్ మూడు. ఎందుకో ఈ సంబంధం ఖాయం చేసుకోవాలనుకున్నాడు. పెళ్ళిచూపులకి అమ్మా, నాన్నలతోపాటు తన కజిన్ చక్రిని కూడా వెంట పెట్టుకు పోయాడు. అనవసరపు ఫార్మాలటీస్ అన్నీ పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు.అయితే అమ్మాయి ఎంట్రీలో చిన్న మార్పు. ఆమె రాకముందే ఎవరెవరు ఏం త్రాగుతారని - కాఫీ, టీ ల్లాంటివి అడిగారు. ప్రతీచోటా కొందరు తమని తాము హైలైట్ చేసుడానికన్నట్టు ఉంటారు. అలాంటివారు నిమ్మకాయ రసం అన్నారు.
కాంత గ్రాండ్ ఎంట్రీఇచ్చింది. అచ్చం నమితలా లేకపోయినా మూతిమాత్రం చిన్నగా సున్నాలానే ఉంది. ఆ క్షణంలో సుబ్బరావుకి కాంత చాలా అందంగా కన్పించింది. బహుశా లక్కీనంబరు సెంటిమెంట్ కూడా బ్యాక్‌డ్రాప్‌లో  బాగా పనిచేస్తుండొచ్చు.
    కాంత ట్రేలో అన్నీసర్ది ముందుగా సుబ్బారావు పేరెంట్స్‌కి లెమన్ జ్యూస్ ఇచ్చి సుబ్బారావుకి మాత్రం వేడివేడి  టీ ఇచ్చింది. సుబ్బారావు టీ కప్పు తీస్కుంటూ నమిత సారీ, కాంత మూతినే చూస్తూ తన ఈక్వేషన్ని టెంపరరీగా మర్చిపోయాడు. అందరూ గ్లాసులు తీసుకున్నారు కానీ ఎవరూ నోటిదగ్గర పెట్టుకునే ధైర్యంచెయ్యట్లేదు. సుబ్బరావు కజిన్ ఇలాంటి విషయాల్లో యమ యాక్టివ్. చేతిలో టీ కప్పుతో కాంతనే అలా చేష్టలుడిగి చూస్తున్న సుబ్బారావుని ఎలర్ట్ చేశాడు. " అందరూ నిన్నే చూస్తున్నారు అలా బకెట్ కట్టకు" అన్నాడు సుబ్బారావుతో.

    చప్పున టీ కప్పుని నోటికి అందించి టీ గుక్కతాగేసరికి చివ్వున మూతికాలింది. 'అమ్మా’ అని లోపలే అనుకుని "మీరేమిటి ఎవరూ ఏంతాగట్లేదు?" అని బయటకే అనేశాడు. అందరూ దానికి సమాధానంగా నవ్వి ఊరుకున్నారు. చక్రి మాత్రం " ఏం తాగుతారు, గ్లాసులో కేవలం నిమ్మకాయ పిండిన రసం మాత్రమే ఉంది.నీళ్ళు పోయటం అందులో ఉప్పో, పంచదారో వెయ్యటం మర్చినట్లున్నారు పెళ్ళికూతురు" గట్టిగానే అన్నాడు.

    ఈ హఠాత్పరిణామానికి ముందుగా తేరుకున్న కాంత తండ్రి "ఏంటమ్మా నిమ్మరసం అంటే కేవలం గ్లాసులో నిమ్మకాయ పిండి ఇచ్చేస్తారా? అందులో వెయ్యలేదా?" అన్నాడు.

    "నిమ్మరసం అంటె అంతే అనుకున్నాను నాన్నా! నీళ్ళు పోస్తే ఏమనుకుంటారోనని........"నీళ్ళు బాగా నమిలింది కాంతం. అసంకల్పితంగా సుబ్బారావు టీ కప్పుతీసుకుని ఓ గుక్క తాగి తుపుక్కున ఉమ్మేద్దామని సంస్కారం కాదని ఆపేశాడు. చిన్నప్పుడు ఒంట్లో బాగులేకపోతే బామ్మ చేసిచ్చిన కరక్కాయ రసం గుర్తుకొచ్చింది. సుబ్బారావుకి తననోటిమీద ఎవరో ఇనుప చువ్వతో వాతపెట్టినట్లయింది. కాంత ఐ.క్యూ. ఎంత ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అయినా కాంత ఐ.క్యూ. కంటే ఆమె బాడీ మాస్ ఇండెక్సే(బి.ఎమ్.ఐ) సుబ్బారావుని కట్టిపడేసింది. పరిస్ఠితిని కొంచెం ఈజ్ చేస్తూ చక్రి అన్నాడు "ఏదిఏమైనా మావాడికి అమ్మాయి బాగా నచ్చింది. తన టీ గురించి మాత్రం నో కామెంట్స్."

    అలా కాంతతో సుబ్బారావు పరిణయం జరిగిపోయింది. అయితే ఈ రాఖీకాండతో సుబ్బారావుకి సున్నా మూతి పిచ్చి వదిలిపోయింది.
కనకోపాఖ్యానం

    కనకం సుబ్బారావు పక్కింట్లో క్యారక్టర్. చాన్నాళనుంచీ పక్కపక్క పోర్షన్లలో ఉంటున్నారు. నిజానికి సుబ్బారావు బాల్యంలో కనకం ఒ ఇంపార్టెంట్ క్యారక్టర్. లావుగా, బొద్దుగా అచ్చం కుబ్జలా ఉండే కనకానికి సుబ్బారావు అంటే చాలా ఇష్టం. కనకం వాళ్ళమ్మ కడుపుతో ఉండగా చంద్రగ్రహణంరోజున చంద్రుణ్ణి చూడ్డంవల్లనే ఇలాంటి కూతురు పుట్టిందని అందరూ అనుకునేవారు. ఏదిఏమైనా లావుగా,పొట్టిగా,బొద్దుగా బియ్యంబస్తాకి అవయవాలు అతికించినట్లుగా ఉండే కనకం సుబ్బారావంటే చాలా మోజుపడేది. అతనెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది. ఏం చేస్తే అది చేస్తూ అతన్ని ఇంప్రెస్ చెయ్యటానికి ప్రయత్నించేది.

    ఇంటిపక్కనే ఉండటంతో సాయంత్రాలు సుబ్బారావు తనఈడుపిల్లల్తో ఏడుపెంకులు, కోతికొమ్మచ్చి, దొంగాపోలీసులాంటి ఆటలాడుతున్నప్పుడు తనూ దూరిపోయేది. నిజానికి కనకం సుబ్బారావు జీవితంలొ ఓ నైట్‌మేర్.  పాపం కనకానికి మరో సమస్యకూడా ఉంది. అదే క్లెప్ట్‌లిప్. తను ’ఉప్మా’ అనాలంటే ’ఊఁ ఆఁ’ అనాలి. సుబ్బారావు అనాలంటే  ’సుఁ ఆఁ’ అని విన్పడుతుంది. అయినా కూడా తనుమాట్లాడదల్చుకున్నది గడగడా మాట్లాడేసేది. ఈ మధ్యనే ఓరోజు సుబ్బారావుమీద దాది చేస్తూ "సూఁఆఁ, ఈ రోజు మా అమ్మానాన్న మీ ఇంటికి వస్తున్నారు తెల్సా" అంది.

    "ఎందుకూ?"

    "ఎందుకేంటి మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా అందుకని మీతో సంబంధం మాట్లాడ్డానికి వస్తున్నారు" అంది గోముగా.

    "మనిద్దరం ప్రేమించుకోవటం ఏంటి, ఎవరు చెప్పారు?" సుబ్బారావు ఆవేశంతో ఊగిపోతున్నాడు.

    "అదేంటి సుఁ ఆఁ! ఇది చూడు నీ పేరు నాచేతిమీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను ’సురా’ అని, ఇది చూసే మా వాళ్ళు మీఇంటికొస్తున్నారు అన్నీ మాట్లాడుకోడానికి." సుబ్బారావు హతాశుడయ్యాడు. అయినా కుబ్జ సారీ, కనకం ఒక్కర్తే చెప్తే సరిపోతుందా ప్రేమించుకున్నామని, నేనుకూడా చెప్పాలికదా, ఒప్పుకోవాలికదా!" తనలో తనే గొణుక్కుంటునట్లుగా పైకేఅనేశాడు.

    "నువు చాలాసార్లు మనం చిన్నప్పుడు దొంగాపోలీస్ ఆడుతున్నప్పుడు అందరికంటే ముందు నన్నే పట్టుకుని ’దొరికింది,దొరికింది’ అని నా అరిచేవాడివికదా సుఁ ఆఁ?"

    కుబ్జ బానే ప్లాన్ చేసిందనుకున్నాడు సుబ్బారావు.

    "ఎహే, నిన్ను ముందు పట్టుకోవడం కాదు, అందరూ సన్నగా, నాజూగ్గా ఉండి నాకు దొరక్కుండా పారిపోయేవారు. నువు మాత్రం పరిగెత్తలేక నాకు దొరికిపోయేదానివి. అంతేకానీ నీకంత సీన్లేదులే."

    "ఏమో బాబు మావాళ్ళు మాత్రం ఆ పనిమీదే ఉన్నారు" అంది కనకం. నిజానికి అలాంటిదేమీ జరగలేదు కాని సుబ్బారావు మాత్రం ఆవేశంగా కనకం బారినుండి తననుతాను కాపాడుకోవటం కోసం కాంతని అర్జంటుగా ఓకే చేసేశాడు. ఆ రకంగా కాంతం పరిణయంలో కనకం పాత్ర ఎక్కువే.
కరక్కాయోపనిషత్తు

    సుబ్బారావు బామ్మకూచి. బామ్మమాటంటే వేదవాక్కు. బామ్మే అతణ్ణి చాలా విషయాల్లో ప్రభావితం చేసింది. ఆమె వయసుకి వయసుతో పాటు వచ్చిన అనుభవానికి అతను చాలా ప్రాధాన్యమిస్తాడు. అతనికి ఏ చిన్న సుస్తీచేసినా బామ్మ వైద్యమే ఫైనల్. అలాగే అతనికి కరక్కాయ పరిచయం. మొదట్లో అతనికి ఎప్పుడు దగ్గు వచ్చినా బామ్మ కరక్కాయే ఔషధం! ఆ కరక్కాయని నోట్లో పెట్టుకుని ఆ చేదు రసాన్ని మింగలేక మింగుతూ చాలా అవస్థలు పడేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సుబ్బారావు కరక్కాయ విషయంలో కాంప్రమైజ్ అవ్వటమే కాకుండా ఓ గొప్ప విషయాన్ని రియలైజ్ చేశాడు. కరక్కాయ నోట్లో ఉన్నంతసేపూ ఎంత భయంకరమైన దగ్గైనా కంట్రోల్లో ఉంటుంది. కరక్కాయ నోట్లో ఉన్నప్పుడు నీళ్ళు తాగితే చల్లగా తియ్యగా ఉండడం సుబ్బారావుని ఆశ్చర్యపర్చిన విషయం. ఎంతో చేదుగా ఉండే కరక్కాయ రసంలో అంత తియ్యదనం ఎంతో గొప్ప డైకాటమీ. అయిష్టంగానైనా ఒప్పుకుని తీరాలి.మనిషి జీవితానికి ఓ సింబల్ ఈ కరక్కాయ. చేదుని తీపిని ఒకే వస్తువులో ఉంచడం ఈ ప్రకృతికే చెల్లింది.
* * * 

    కనకానికి మొత్తానికి పెళ్ళయింది. అతనొక ఆయుర్వేద వైద్యుడు,డా. సింహాద్రి.  కనకానికి దూరపు చుట్టం. కనకానికున్న ఆస్తికి చాలానే కంప్రమైజ్ అయ్యాడు. ఆమెకున్న క్లెప్ట్‌లిప్పే ఆమెకి ప్లస్‌పాయింటని ఆమె మాట్లాడుతుంటే వినడం సరదాగా, అహ్లాదకరంగా ఉంటుందని ఇంటికొచ్చినప్పుడల్లా అనేవాడు. అదే అదనుగా కనకం ఇంక ఆలస్యం చెయ్యకుండా పెళ్ళికి ఇరికించేసింది.
    సుబ్బారావుకి పెళ్ళయాక వేరే ఇంట్లోకి మారాడు. ఈ కథలో ఇదే ఇంట్రస్టింగ్ మలుపు. ఇంట్లోకి మారిన రెండురోజులకి గానీ తెలియలేదు ఆ ప్రక్కింట్లో ఉండేది మరెవరోకాదు కనకం ఫ్యామిలీయే అని. అంటే మన సుబ్బారావుకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. కాంతతో బాగా పరిచయం పెంచుకున్న కనకం చాలా సులభంగానే ఆమెని ’తన మనిషి’ని చేసేసుకుంది. ఓ రోజు ఆఫీసునుంచి వచ్చిన సుబ్బారావుతో కనకం " ఏంటి సుఁ ఆఁ ఇప్పుడు కాంత నాకు చాలా క్లోజ్. నీ గురించి అన్నీ చెప్పేయనా?" అంది.

    ఏంటీ బ్లాక్‌మెయిల్ అనుకుని సుబ్బారావు "అబ్బా కనకం అలా షార్ట్‌కట్‌లో సు-రా అని పిలవకు. సురాకారంలో  సగంతీసి కారం వదిలేసి సురా మాత్రమే వాడినట్లుగా ఉంది ఆ పిలుపు. నాకు మాత్రం ఆ   వదిలేసిన కారం రాసుకున్నట్లుగా ఉంది."

    "సరేకాని నాకు ఓ చిన్న సహాయం కావాలి సు-రా సారీ సుబ్బారావు!" అంది కనకం.

    "ఏంటది?"

    "ఏంలేదు పెద్దగా. మా ఆయన కరక్కాయ మీద పరిశోధన చేస్తున్నారు తన ఎమ్.డి కోసమని. దానికి ఆయనకి సబ్జెక్ట్ దొరకట్లేదని తెగ బాధపడుతున్నారు. నువు కాస్త హెల్ప్ చెయ్యాలి సుబ్బారావ్!"

    "హెల్పంటే?" కాస్త విసుగ్గానే అడిగాడు.

    " ఆఁ ఏంలేదు ఆయన రోజూ రాత్రి నీకు ఓ కరక్కాయ ఇస్తారు. నువు రాత్రంతా ఆ కరక్కాయని నోట్లో పెట్టుకుని పడుకోవాలి. దాదాపు ఓ రెండేళ్ళపాటు. ప్రొద్దున్నే వచ్చి నీ బాడీ డేటా తీస్కుంటారు. అంతే!" చాలా కూల్‌గా చెప్పింది కనకం.

    అదిరిపడ్డాడు సుబ్బారావు "ఏంటి రెండేళ్ళ పాటు నేను కరక్కాయ తినాలా కనకం. నీకేం అన్యాయం చేశాను కనకం నన్నిలా రకరకాలైన చిత్రవధలకు గురిచేస్తున్నావు?"

    "అదేంకాదు సుబ్బారావూ నిన్నుచూస్తే ముద్దపప్పు సుబ్బారావ్‌లా అన్పిస్తావు. నీకు చదువు అబ్బింది కానీ మెంటల్ మెచ్యూరిటీ రాలేదెంతమాత్రం. దానికి చాలా ఉదాహరణలు చెప్పగలను. ఎంతసేపూ నా బాహ్య అంగవైకల్యాన్నే చూశావుకానీ బెడ్లో ఎంత చురుకుగా, ఆహ్లాదంగా, చలాకీగా ఉంటానో ఊహించుకోలేకపోయావు. ఓకే నన్ను నీ పెళ్ళాంగా అందరికీ చూపించడానికి వెనుకాడి మానెయొచ్చు. కానీ ఎన్నోసార్లు ’ఆ’ హింట్ ఇచ్చాను నిన్ను పడకలో బాగానే ఎంటర్టెయిన్ చేస్తానని కానీ నీ ఇమ్మెచ్యూర్డ్ బుర్రకి ఎక్కలేదు. నేను పైకి చూడ్డానికి అందవిహీనంగా కరక్కాయ లాగా ఉన్నా కరక్కాయ లోపల ఊట ఎంత తియ్యగా ఉంటుందో అలాగే నేనూ!" ఆవేశంతో రొప్పుతోంది కనకం.

    ఓ రెండేళ్ళపాటు కరక్కాయ పరిశోధనకి సబ్జెక్ట్‌గా ఉండటానికి ఒప్పేసుకున్నాడు సుబ్బారావు! పాపం  సుబ్బారావు!

    ఓ రెండేళ్ళ తర్వాత మళ్ళీ సుబ్బారావ్‌ని కలుద్దాం.

(రచన ఇంటింటిపత్రిక అక్టోబరు 2010 సంచికలో ప్రచురితం)

Comments