కనువిప్పు - కొవ్వలి రామకృష్ణ పరమహంస

    మార్నింగ్ వాక్ ముగించుకొని ఇంటి వరండాలో కుర్చీలో కూలబడి "ఒసేయ్ కాంతం కొంచెం కాఫీ తెచ్చి పెట్టవే" అని అరిచాడు మాధవరావు. మాధవరావు సెక్రెటేరియేట్‌లో ఎకౌంట్స్ సెక్షన్‌లో గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నాడు.
 
    ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ భర్త చేతికందించింది కాంతం. రాక్షసుడు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా భర్త బలహీనత కాఫీ అని పెళ్లయిన రెండోరోజే తెలుసుకొంది కాంతం. అప్పట్నించి కాఫీతో లొంగదీసుకుంది కాంతం.
 
    ఎడమచేత్తో పేపర్ పట్టుకొని చదువుతూ కుడిచేత్తో కాఫీ కప్పు పట్టుకొని కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు మాధవరావు.
 
    ఈలోగా గేటు చప్పుడవ్వగా అటు తిరిగిన మాధవరావుకి ఒక చేతిలో సూట్‌కేసుతో ఒక చేతిలో పళ్ళబుట్టతో కనపడ్డాడు సుందరం.
 
    వస్తూనే..."ఏం బావా కులాసానా?" అంటూ పలకరించాడు సుందరం.
 
    "అవున్రా ఇదేనా రావడం. రైలుకొచ్చావా? ప్రయాణం బాగా జరిగిందా? అక్కడ అందరూ కులాసానా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన మాధవరావుకి ఓపికగా సమాధానాలు చెప్పి...
 
    "ఏం బావా! మా మేనల్లుడు కనపడడే" అని ప్రశ్నించాడు సుందరం.
 
    "ఏమని చెప్పమంటావురా! ప్రొద్దస్తమానం సాహిత్యమంటూ చర్చలు, గోష్ఠులు అంటూ తిరుగుతూ ఉంటాడు. 'క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయంలేదు' అన్నట్లుగా ఉంది వాడి పద్ధతి. ఒక్కగానొక్క కొడుకు. ఎంతైనా చదివిద్దామనుకున్నాను. ఏదో డిగ్రీ పూర్తయినైపించాడు. సాఫ్ట్‌వేర్ చెప్పించి స్టేట్స్ పంపుదామనుకున్నా వాడికి యోగం ఉండాలి కదా!
 
    నా కొలీగ్ సుబ్బారు నీకు తెలుసుకదా! వాడి కొడుకు న్యూయార్క్‌లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. నెలకు పదివేల డాలర్లు సంపాదిస్తాడుట. అంటే సుమారు నాలుగు లక్షల రూపాయలు."
 
    వాళ్ళ మధ్య సంభాషణ అంతరాయపరుస్తూ...
 
    "ఏవండీ వేన్నీళ్ళు పెట్టాను స్నానానికి లేవండి" అంటూ అరుస్తూ బయటకొచ్చింది కాంతం.
 
    అమాంతం "ఏరా తమ్ముడూ ఇదేనా రావడం? అమ్మ, నాన్న, మా మరదలుపిల్ల, పిల్లలు అందరూ క్షేమమేనా? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏంట్రా విశేషాలు" అని అడుగుతున్న కాంతంతో
 
    "విశేషాలు నింపాదిగా మాట్లాడుకోవచ్చు. వాడి స్నానపానాదుల సంగతి చూడు" అనడంతో అక్కా తమ్ములిద్దరు ఇంట్లోకి వెళ్ళారు.
 
    "అక్కా! మరిచేపోయాను. నీకిష్టమని సున్నుండలు... జంతికలు... చేసిచ్చిందే అమ్మ" అంటూ తీసి బయటపెట్టాడు సుందరం.
 
    "ఆవిడ చాదస్తం కాకపోతే ఇప్పుడివన్నీ ఎందుకురా" అంది కాంతం.
 
    తమ్ముడికిష్టమని మినపరొట్టి చేసింది కాంతం. బెల్లం పానకం వేసుకొని మినపరొట్టె తినడం అంటే ఎంతో ఇష్టం సుందరానికి.
 
    డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ మాట్లాడుకొంటున్నారు.
 
    "బావా! మా 'యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్'వాళ్ళు జిల్లా స్థాయి నాటక పోటీలలో గెలిచి రాష్ట్ర స్థాయి నాటక పోటీలకు సెలెక్ట్ అయ్యాం.రేపట్నించి 'రవీంద్ర భారతి'లో నాటక పోటీలు ప్రారంభమవుతాయి. నువ్వు అక్క తప్పకుండా రావాలి" అని చెప్పాడు.
 
    "నీకింకా నాటకాల పిచ్చి పోలేదన్నమాట." అని అన్నాడు మాధవరావు.
 
    "మీ బావ మాటకేంగాని ఏం నాటకం ఆడుతున్నారురా, ఎవరు రాసారురా?" ఉత్సాహంగా అడిగింది కాంతం.
 
    ఈలోగా "ఏంటి మావయ్యా! ఎప్పుడొచ్చావు?" అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు రాజశేఖరం.
 
    "పొద్దున్న వచ్చానురా! అవును అంత పొద్దునే ఎక్కడకు వెళ్ళావు?" అని ఆప్యాయంగా ప్రశ్నించాడు సుందరం.
 
    "సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్ళాను మావయ్య" అని ముక్తసరిగా బదులిచ్చాడు రాజశేఖరం.
 
    "ఎవరిపిచ్చి వారి కానందం. నువ్వైనా మీ అల్లుడికి చెప్పరా సుందరం. నేను ఆఫీసుకెళ్తున్నాను. సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాను. మీరు కూడా రండి" అని చెప్పి వెళ్ళిపోయాడు మాధవరావు.
 
    మాధవరావుగారు వెళ్ళిపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మావా అల్లుళ్ళిద్దరు.
 
    "ఇప్పుడు చెప్పరా అల్లుడూ... ఏంటి ప్రోగ్రెస్స్. ఇప్పుడేంచేస్తున్నావు?" ఆత్రంగా అడిగాడు సుందరం.
జవాబు చెప్పకుండా మాట దాటేసాడు రాజశేఖరం.
 
    "అల్లుడూ! ఒక మాట చెబుతాను వినరా... మీనాన్ననెందుకు క్షోభ పెడతావు. ఒక్కగానొక్క కొడుకువి. నిన్ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను చేసి స్టేట్స్‌కి పంపించాలని ఆయన కోరిక.
 
    ఒరాకిల్స్‌తో మిరాకిల్స్ చేయొచ్చని ఇప్పటిదాకా ఉపన్యాసమిచ్చి వెళ్ళాడు. అదేదో నేర్చుకోవచ్చు కదరా" అన్నాడు సుందరం. 
 
    "నాన్న తన అభిప్రాయాలను నామీద బలవంతంగా రుద్దుతున్నారు. నేను నాకు నచ్చిన రంగంలో కృషి చేస్తాను. అనుకొన్నది సాధిస్తాను.
 
    విత్తనం నాటినపుడే ఫలాలు ఆశించకూడదు. ముందు ముందు నా విజయాలు నువ్వు కూడా చూస్తావు కదా మావయ్య" అంటూ ముసిముసిగా నవాడు రాజశేఖరం.
 
    తండ్రీ కొడుకులిద్దరికీ చెప్పలేం అనుకుంటూ, "సరే అల్లుడు రేపు మా నాటక ప్రదర్శన ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ఇప్పుడు రిహార్సల్స్ ఉన్నాయి. మా స్నేహితులంతా ఊర్వశి లాడ్జిలో ఉన్నారు. సాయంత్రం పెందలాడే వస్తాను. నువ్వు ఎక్కడ తిరిగినా సాయంత్రం త్వరగా ఇంటికిరా" అని చెప్పి బయల్దేరాడు సుందరం.
 
    'ఆ తండ్రి - కొడుకుని పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చేసి స్టేట్స్‌కి పంపాలి అనుకోవడంలో తప్పులేదు. రాజశేఖరం తనకు నచ్చిన రంగంలో తాను అనుకున్నది సాధించాలి అనుకోవడంలో తప్పులేదు. 
 
    ఏదిఏమైనా ఆ తండ్రీ కొడుకులిద్దరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదర్చాలి' అనుకుంటూ... ఆలోచిస్తూ... ఊర్వశి లాడ్జి తన ఫ్రెండ్స్ రూంలో అడుగుపెట్టాడు సుందరం.
 
    "ఏరా! ఇంత ఆలస్యం అయ్యింది?" అంటూ నాగభూషణం, ఆంజనేయులు భద్రరాజు ముక్త కంఠంతో ప్రశ్నించారు సుందరాన్ని.
 
    "అక్క బావతో మాట్లాడే సరకి ఆలస్యమయ్యింది.
 
    ఇంతకీ పోటీలకు ఎవరెవరు వచ్చారు. వారు ఏం నాటకాలు ప్రదర్శిస్తున్నారు తెలుసుకున్నారా" అని కుతూహలంగా అడిగాడు సుందరం.
 
    "ఒరేయ్ ఈసారి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చయిరా! అయితే ముఖ్యంగా మూడు నాటకాల మధ్య మంచి కాంపిటీషన్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అందులో మనది కూడా ఉంది.
 
    ఒకటి రాజమండ్రి 'బళ్ళారి రాఘవ నాటక మండలి' వారి 'అరె ఏమయిందీ'
 
    రెండోది తెనాలి 'శ్రీ వేంకటేశ్వరా నాటక కళా పరిషత్'వారి 'సూక్ష్మంలో మోక్షం' 
 
    మూడోది మన నాటకం 'సన్నాయి నొక్కులు' " అంటూ చెప్పాడు నాగభూషణం.

    "ఒరేయ్ సుందరం. ఈ మూడు నాటకాల మధ్య ఒక సామ్యం ఉందిరా. ఏంటంటే ఈ మూడు రాసింది ఒక్కరే - వాగ్దేవి." అని చెప్పాడు ఆంజనేయులు.

    ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్ చేసి, "రేపు ఉదయం 6గంటలకి వస్తానని" చెప్పి ఇంటికి బయల్దేరాడు సుందరం.

    ఇంటికి చేరేసరికి పడక్కుర్చీలో కూర్చొని ఏదో తెలుగు మ్యాగజైన్ చదువుతున్నాడు మాధవరావు.

    సుందరాన్ని చూసి "రావోయ్ సుందరం. మీ డ్రామా రిహార్సల్స్ పూర్తయ్యాయా?" అని కించిత్ వ్యంగ్యంగా అడిగాడు మాధవరావు.
 
    "మా రిహార్సల్స్ మాటకేం గాని రాజశేఖరం వచ్చాడా బావా?" అని అడిగాడు సుందరం.
 
    "వాడి సంగతే అడిగావు!" అని నర్మగర్భంగా నవ్వాడు మాధవరావు.
 
    "అలాగే నవ్వు బావా, వాడే ఏదో ఒకరోజు గొప్పవాడు అవుతాడు. ప్రపంచమంతా వాడిని చూసి మెచ్చుకుంటుంది. నువ్వు మాత్రం వాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అవ్వలేదని బాధపడుతూనే ఉంటావ్" అని చెప్పి ఊరుకున్నాడు సుందరం.
 
    ఇంతలో వేడివేడి పకోడీలు రెండు ప్లేట్ల నిండా తెచ్చి వాళ్ళమధ్య పెట్టి తనకక్కడ పని లేదన్నట్లుగా లోపలికెళ్ళిపోయింది కాంతం.
    
    బావ మంచి మూడ్‌లో ఉండడం చూసి పకోడీలు తింటూ దీర్ఘోపన్యాసం ఇవ్వడానికి సమాయత్తమయ్యాడు సుందరం.
    
    "బావా! ఒక కథ చెబుతాను విను. వెనకటికి ఒక రాజు ఉండేవాడు. అతని అందరు కష్టపడాలి... బాగా పనిచెయ్యాలి... దేశాభివృద్ధికి అందరూ కృషి చెయ్యాలి... అని ఉండేది.
 
    ఒకరోజు అతనికి కవులు, రచయితలు, నటులు, గాయకులు మొదలైన వారు కష్టపడటం లేదని అనిపించి వాళ్ళ వలన దేశానికి నష్టమే తప్పితే లాభం లేదనుకొని దేశమంతా లలితకళలు వాటి ప్రదర్శనలు రద్దు చేయించాడు ఆ రాజు.
 
    కళాకారులందరూ కూడా వ్యవసాయం ఇతరత్రా వృత్తులు చేపట్టాలని ఆదేశించాడు అదేరోజు. కొన్ని రోజుల తర్వాత దేశాభివృద్ధి పెరగకపోగా తగ్గడం గమనించాడు రాజు.
 
    ప్రజలందరూ చాలా నీరసంగా...అనారోగ్యంతో... జఢులుగా...మూఢులుగా...సోమరులుగా... ఉండడం గమనించాడు రాజు. ప్రజలలో మునుపటి హుషారు గాని... శక్తి గాని... కనిపించడంలేదు. కారణం ఏమిటా? అని తీవ్రంగా అన్వేషించసాగాడు.
 
    వివిధ శాఖలలోని ఉద్ధండులని పిలిచి ఇలా జరగడానికి కారణాలు ఏమిటా? అని ఆరా తీయగా వాళ్ళంతా చెప్పిన సమాధానం ఒకటే.
 
    'మహారాజా! మీరు లలిత కళలు... వాటి ప్రదర్శనలు... రద్దుచేయించారు. దానివలన ప్రజలకు సరైన వినోదం లభించడం లేదు. అందువల్ల వాళ్ళలో ఉత్సాహం సన్నగిల్లుతోంది.
 
    ప్రతీ మనిషికి వాళ్ళ పనులతో పాటు లలితకళలు కూడా చాలా అవసరం. అవి వారి వారి మనసులను ప్రభావితం చేస్తాయి.' అని చెప్పడంతో ఆరోజే కళాకారులందరికి క్షమార్పణలు చెప్పి తిరిగి వారి కళలు ప్రదర్శించమని కోరాడు ఆ రాజు."
 
    "కథ బాగుందా బావా" అడిగాడు సుందరం.
 
    "మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఎన్ని కథలైనా చెప్పొచ్చు.
 
    ఒకరిద్దరిని మినహాయిస్తే ఈ సాహిత్యం... సంగీతం... నాట్యం... నాటకం... ఇలా కళలను నమ్ముకున్న వాళ్ళు ఒకళ్ళు బాగుపడ్డారురా! ఉన్నవి అమ్ముకుని తినడానికి తిండి కూడ లేక అవస్థ పడుతున్న కళాకారులను ఎంతమందిని చూడడం లేదు?" అన్నాడు మాధవరావు.
 
    "సంపాదన కొలమానంగా పెట్టి మాట్లాడితే నేను చెప్పేదేమీ లేదు.
 
    బిల్‌గేట్స్ గురించి తెలియని వారికి కూడా బెర్నార్డ్ షా రాసిన కథలతో పరిచయం ఉంటుంది.
 
    డబ్బున్నవారు వారు సంపాదించిన డబ్బుతో వారి కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతారు. 
 
    అదే కళాకారుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కర్ని స్పృశిస్తాడు... ప్రేరేపిస్తాడు... ఉత్సాహపరుస్తాడు. వారి జీవన శైలికి... సరళికి... మార్గదర్శకుడౌతాడు. అందరికీ ఆరాధ్యుడవుతాడు.
 
    అంతెందుకు. మనరచయితలలో 'వాగ్దేవి' రాసిన రచనలు చదివావా?
 
    ఆ రచనలు చదివిన వారందరిపై ఆ రచనల ప్రభావం ఉంటుంది. కాదనగలవా!" 
 
    "అవును అక్కడక్కడ ఉంటారు గొప్పవాళ్ళు" అని ఊరుకున్నాడు మాధవరావు.
 
    రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత ఆరుబయట మడతమంచాలు వేసుకొని నడుంవాల్చారు మాధవరావు, సుందరం. మాటలాడుతూనే నిద్రలోనికి జారుకొన్నాడు మాధవరావు.
 
    మరుసటి రోజు వేయబోయే నాటకం గురించి ఆలోచిస్తూ అటు ఇటు మంచంపై దొర్లుతున్నాడు సుందరం.
 
    ఆ సమయంలో నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించాడు రాజశేఖరం.
 
    సుందరం లేచి "ఏరా ఇంత ఆలస్యమయ్యిందేంట్రా? నడవరా ముందు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం."
 
    "లేదు మావయ్య! సెంట్రల్ లైబ్రరీలొ 'కథాశిల్పంలో వైవిధ్యం - కథనంలో కొత్తదనం' అనే విషయంపై చర్చాగోష్టి జరిగింది. పెద్ద పెద్ద రచయితలందరూ వచ్చారు. భలే రంజుగా సాగింది.
అవును మీ నాటకం రేపే కదా! తప్పకుండా వస్తాను. నీకు తప్పకుండా బహుమతి వస్తుంది మావయ్య. ఆల్ ది బెస్ట్" అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు రాజశేఖరం.
 
    మూడు రోజుల నాటక ప్రదర్శనలు పూర్తయ్యాయి. సుందరం ట్రూప్‌కి రెండవ బహుమతి వచ్చింది. అయితే ఆ మూడు రోజులలో సుందరానికి కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆ రోజు సాయంత్రమే సుందరం ప్రయాణం.
 
    ఆ రోజు ఆదివారం కావడంతో  ఆఫీస్ లేకపోవడం వలన తీరికగా కూర్చున్నాడు మాధవరావు.
 
    నెమ్మదిగా సుందరం అతనిని సమీపించి "బావా ఈ రోజు పేపరు చదివారా!
 
    'వాగ్దేవి'కి తెలుగు విశిష్ట వ్యక్తి అవార్డు ప్రకటించారు.
 
    అంతేకాదు అతను రాసిన 'జన్మభూమికి నీరాజనం' నవల ఉత్తమ నవలగా సాహిత్య అకాడెమీ అవార్డు పొందబోతోంది.
 
    'ఆటా'(అమెరికా తెలుగు అసోసియేషన్) వాళ్ళు ఈ నెలాఖరున తలపెట్టిన ప్రపంచ మహాసభలకు ప్రత్యేక అతిథి గౌరవం దక్కింది.
 
    అతను వ్రాసిన 'వ్యక్తిత్వ వికాస వల్లరి - మనో వికాస మంజరి' పుస్తకం ఎంతో మంది యువకులను ప్రభావతం చేసింది.
 
    ఆ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అతనికి ప్రత్యేకించి ఇల్లు కట్టించి ఇస్తోంది." అని ఏకబిగిన చెప్పసాగాడు సుందరం.
 
    "ఇంతకీ ఆ 'వాగ్దేవి' ఎవరో తెలుసా... మన రాజశేఖరం... అక్షరాలా మన రాజశేఖరమే..." అని చెప్పి ఉద్వేగంతో వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయాడు సుందరం.
 
    ఒక్కసారిగా ఒక రకమైన సంతోషంతో నిండిన అచేతనస్థితికి గురయ్యాడు మాధవరావు.
 
    తానే భంగం చేస్తూ "మన రాజశేఖరం - తన ఫ్రెండు ఇంటి అడ్రస్ ఆలంబన చేసుకుని 'వాగ్దేవి' అనే కలం పేరుతో తన రచనలను సాగిస్తున్నాడు" అని చెప్పి సస్పెన్షన్‌కి తెరదించాడు సుందరం.
 
    "బావా! నిన్న మా కళాకారులందరిని ఉద్దేశించి చేసిన ఉపన్యాసంలో మన రాజశేఖరం చెప్పిన ఒక వాక్యం 'ప్రతీ కళాకారుడికి కించిత్ గర్వం ఉండాలి. అయితే అది నాగుపాము కోరల్లో విషంలా ఉండకూడదు, తలపై ప్రకాశించే మణిలా ఉండాలి.' ఆ ఉపన్యాసం నన్నే కాదు అందర్నీ ఎంత ప్రభావితం చేసిందో.
 
    అటువంటి కొడుకుని కన్న నువ్వు నిజంగా ధన్యుడవి బావా" అని ఆగాడు సుందరం.
 
    "ఒరేయ్! సుందరం నాదో చిన్న కోరిక. నాలాంటి తల్లిదండ్రులకి కనువిప్పు అయ్యేలా ఒక కథ రాయమని మీ 'వాగ్దేవి'కి....అదే మీ మేనల్లుడికి... చెప్పవా!" అంటూ మౌనముద్ర దాల్చాడు మాధవరావు.
Comments