కారులో షికారు - రాగతి రమ

    ముకుందరావు అరుగు మీద నిలబడి ఎదురుగా వున్న తన కారునే చూడసాగాడు. ఎర్రరంగు మారుతీ వేన్ నిగనిగలాడిపోతోంది. ముకుందరావు మనసు మహాగర్వంగా ఎగిరెగిరిపడుతోంది. ఉందయం ఆఫీసులో ఆఫీసరు అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

    "నువ్వు చాలా అదృష్టవంతుడివోయ్" అన్నాడు ఆఫీసరు.     "అలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు సార్" అన్నాడు ముకుందరావు.     "నీతో పాటూ మమ్మల్ని కూడా ఎక్కనిస్తావా కారు?" అన్నాడు ఆఫీసరు నవ్వుతూ.     "ఎంత మాట ఎంత మాట! మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నా కారు రెడీగా వుంటుంది సార్. నా కారు మీ కారే అనుకోండి" అన్నాడు ముకుందరావు.     "ఆమాట అన్నావు నాకు చాలా నచ్చింది. నువ్వు చాలా మంచి మనిషివోయ్" అన్నాడు ఆఫీసరు మనస్ఫూర్తిగానే.

    ఆఫీసరుగారితో కారు ఎలా సాధించి గెలిచిందీ కబుర్లు చెప్పి చెప్పి ఇవతలకి వచ్చాడు ముకుందరావు.
    ఆ సెక్షన్‌లో వున్నవారంతా గయ్యిమని పట్టుకున్నారు.     "ఆఫీసరుగారికి కారుమీద సర్వహక్కులూ ఇచ్చావు. మాకు మాత్రం ఏమీ లేదా?" హెడ్ గుమాస్తా అందుక్న్నాడు.     "మన ముకుందరావు అలాంటివాడు కాదు సార్. అందర్నీ ఒకేలాగ చూస్తాడు. మనల్ని ఎక్కనిస్తాడులెండి" అన్నాడు సూర్యం.
    "ముకుందరావూ నీ కారు మా కారు అనుకుంటున్నాం" అన్నాడు పిచ్చేశ్వరరావు ఆశగా.

    "మీ అందరికీ నా కారుమీద సర్వహక్కులు ఇస్తున్నాను" అన్నాడు ముకుందరావు మెరుస్తున్న కళ్లతో.
    "తథాస్తు, నువ్వు ఈ సందర్భంలో బ్రహ్మాండమైన పార్టీ మా అందరికీ ఇచ్చుకోవాలోయ్" అన్నాడు హెడ్ క్లర్క్.     "అలాగలాగే" అన్నాడు ముకుందరావు ముసిముసి నవ్వులతో.     "శభాష్" అన్నారంతా.     "ముకుందరావుకి మహా సంతోషంగా వుంది. గెంతాలని వుంది. పకపకనవ్వాలని వుంది.డాన్స్ చేయాలని వుంది. కానీ అన్ని భావాలు మనసు సొరుగులో దాచుకుని గుడుగుడుగుంచం గుండేరాగం పాడూకుంటూ భార్యతో పాటూ కారులో షికార్లుకెళ్లే రోజు ఎప్పుడోస్తుందా అని ఎదురుచూస్తున్నాడు ముకుందరావు.

* * *

    ఒక టీ.వీ.ఛానల్ వాళ్లు తెరుచుకోవే బుల్‌బుల్ అనే ఒక పోటీ కార్యక్రమాన్ని వారం వారం ప్రసారం చేస్తున్నారు. ముకుందరావు హైదరాబాదు వెళ్లి ఆ పోటీలో పాల్గొన్నాడు. అందులో కారు గెల్చుకున్నాడు. ముకుందరావు కారుతో సహా విశాఖపట్నం వచ్చేటప్పటికి అతనికి తెలిసినవాళ్ళు, తెలీనివాళ్లు నీరాజనాలు పలికారు. ఈ ఘనకార్యం సాధించినందుకు పార్టీపార్టీ అంటూ జనాలు పీక్కుతింటున్నారు. రోడ్డు మీద కనిపించిన ప్రతివారూ 'పద హోటల్‌కి' అని లాక్కుపోతున్నారు. కడుపెక్కా తిని, తినిపించి బిల్లు చేతిలో పెడుతున్నారు.     ఆ కాలనీ వాసులు - కనకదుర్గ, కనకారావు, పరంధామయ్య, పుల్లారావు, ఎల్లారావు, యారాడరావు, గౌరీనాథ్, సుబ్బారావు, మీనాక్షి, కామాక్షి, కామేశ్వరి, కాంతం, అప్పారావు, ఆదిలక్ష్మి, త్రినాథ్, జానకీరాం - అంతా ఒకటేమాట. "కారు ప్రైజు వచ్చింది. మాకు స్టార్ హోటల్లో డిన్నర్ ఇప్పించు ముకుందరావూ" అంటున్నారు.     ఒక రాత్రి భార్యాభర్తలిద్దరూ ఈ విషయం గురించే మాట్లాడుకున్నారు.     "జనాలు గోల పెడుతున్నారు. పార్టీ ఇచ్చేద్దామా బాలా...నువ్వేమంటావ్?" అడిగాడు ముకుందరావు.     "పోతే పోయింది డబ్బు. ఇచ్చేద్దామండీ. అందరూ మనల్ని ఎంతగొప్పగా చూస్తున్నారు. మనం ఇచ్చే పార్టీ కలకాలం గుర్తుండిపోవాలి" అంది బాలాకుమారి.     "అవును. నన్నందరూ హీరోలా చూస్తున్నారు. నేనూ అలాగే ప్రవర్తించాలి కదా!" అన్నాడు ముకుందరావు స్టయిల్‌గా తల ఊపుతూ.
* * *

    ఆ రోజు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసాడు ముకుందరావు. ఉదయమే ఆఫీసుకు శెలవు పడేసి బ్యాంకుకి పరిగెత్తి పదివేలు తీసుకొచ్చాడు. ఇంటికిరాగానే ప్రాణం ఊసురుమంది. భార్యతో అన్నాడు -     "మనం తినీ తినక పైసా పైసా కూడబెట్టిన డబ్బు అత్తరింటికి పోతుందంటే బాధగా ఉంది బాలా."

    "డబ్బు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది. రేపు పోతుంది. ఎందుకండీ బాధ మీకు? ఈ ప్రాణాలే శాశ్వతం కానప్పుడు ఈ డబ్బెంత? మళ్ళీ కూడబెట్టుకుందాం. ఆ డబ్బు హోటల్‌వాడి మొహాన కొట్టి రండి. ఎవడు అనుభవించాలని ఉంటే వాడిదే డబ్బు. మీరేం బాధ పడకండీ" అంది బాల.     సాయంత్రం ఆరుగంటలైంది. ఆశా స్టార్ హోటల్లో పార్టీకి అతిథులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. అటు ఆఫీసరుతో సహా ఆఫీసు ప్యూను వరకూ ఇటు కాలనీ వాసుల్ని, పిసరు పరిచయం వున్న వాళ్లని సహా అందర్నీ పిలిచాడు పార్టీకి. ఏడు గంటలవుతోంది. హాలంతా అతిథులతో కిటకిటలాడుతోంది. ఆఫీసరు లేచాడు. ఒకసారి చుట్టూ చూసి-     "నేను రెండు మాటలు మాట్లాడేసి కూర్చుంటాను" అన్నాడు ముకుందరావుతో.     "రెండేంటి సార్? వంద మాట్లాడండీ. మీ మాటలు వినాలని తహతహగా వుంది" అన్నాడు ముకుందరావు నమ్రతగా.

    ఆఫీసరు గొంతు సవరించుకుని మైకు ముందుకొచ్చి ఇలా అన్నాడు.     "మన ముకుందరావు చాలా అదృష్టవంతుడు. టీవీ వాళ్లు పెట్టిన పోటీలో కారు గెల్చుకోవడమనేది చాలా గొప్ప విషయం. ముకుందరావుకి తెలివుంది. ఏదైనా సునాయాసంగా చేసేస్తాడు. ముకుందరావు లాంటివాడు మా ఆఫీసులో ఉద్యోగస్తుడు కావడం మా అదృష్టం. మా ఆఫీసు అదృష్టం. ముకుందరావు మనసు వెన్నపూస. పది మందికి సహాయపడే రకం. కారు సంపాదించాడు. మచ్చుకైనా గర్వం లేదు..."

    ఆఫీసరు పొగుడుతుంటే తబ్బిబ్బు అయిపోతున్నాడు ముకుందరావు. ఆఫీసరు చండశాసనుడని చెప్పాడు భర్త. ఎప్పుడు ధుమధుమలాడుతూ మొట్టికాయలు మొడుతూ ఉంటాడట. కారు గెల్చుకున్నందుకే ఇంత గౌరవమా? భర్త ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది బాలాకుమారి. గర్వం ఏదో తన్నుకొస్తోంది.

    ఆఫీసరు ఒక్కడే కాదు అందరూ పొగిడి పొగిడి వదిలిపెట్టారు.     చివర్లో అందరూ మాట్లాడమంటే లేచి నిలబడ్డాడు ముకుందరావు. ఆనందాన్ని ఆపుకోలేక అవేశాంతో అన్నాడు. "ఈ రోజు మరుపురాని మధుర దినం. మీరంతా ఎవరు? నా మిత్రులు. నా అభివృద్ధిని కాంక్షించే అమృతహృదయులు. అందుకే ఈ కారు నా ఒక్కడిదే కాదు, మీది మీ అందరిదీ కూడా. మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. నా కారులో ఎవరిని డ్రాప్ చెయ్యమన్నా రెడీగానే ఉంటాను. కారు వచ్చినంతలో నాకు కొమ్ములు మొలవమన్నా మొలవవు. నేను సామాన్యంగా దేనికీ గర్వంతో విర్రవీగేరకాన్ని కాదు. నేను మంచి మనిషిని. అందరి మేలు కోరుకునే రకాన్ని. మీరందరూ వచ్చి పార్టీని జయప్రదం చేసినందుకు మీకందరికీ శుభాభివందనలు."     ఫెళ్లున చప్పట్లు మోగాయి. అందరూ జట్లుజట్లుగా ముకుందరావు అదృష్టాన్ని, మంచితనాన్ని పొగుడుతూ పీకలదాకా మెక్కసాగారు. ముకుందరావు పేరుపేరునా పలకరిస్తూ నవ్వుతూ తిరుగుతున్నాడు.

    అదే సమయంలో ముకుందరావూ అంటూ ఎవరో పిలిచారు.     ఆఫీసరు భార్య దగ్గరగా వచ్చింది.     "ముకుందరావూ ఆదివారం నీ కారు ఓసారి మా యింటికి పంపాలోయ్" అంది.     "అదేం భాగ్యం అలాగే మేడమ్" అన్నాడు ముకుందరావ్ మురిపెంగా.     "చిన్న మాటోయ్" అంది.     "చెప్పండి మేడమ్"
 
    "మా అల్లుడుగారు మా కారులో కాశీకి వెళ్లారు. మరేం అనుకోకపోతే నాదొక చిన్న రిక్వెస్టు."     "చెప్పండి మేడమ్, ఎన్ని అయినా చెప్పండి"     "రోజూ ఉదయం మా ఇంటికి వచ్చి నీ కారులో మీ ఆఫీసరుగారిని ఆఫీసులో డ్రాప్ చేయాలి. ఏమంటావ్?"     "ఓహ్ అంతేనా మేడమ్! ఇంకా ఏమన్నా వుంటే చెప్పండి"     "సాయంత్రం ఇంటికి జారవేయాలి"          "ఇంకా చెప్పండి"     "ఇప్పటికింతే. రేపు ఆదివారం కదా కారు పంపించు"     "అలాగలాగే మేడమ్!" అన్నాడు ముకుందరావు ముసిముసి నవ్వులు నవ్వుతూ.     పార్టీ ముగిసింది. అందరూ ముకుందరావుకి షేక్‌హ్Yఆండ్లు ఇచ్చి నవ్వుతూ తుళ్ళుతూ పోతున్నారు.     అందరూ వెళ్లాక హోటల్ బిల్లు చూసి గుండె ఠారుమంది. పర్వాలేదులెద్దూ. ఇంతటి గొప్పదినం మళ్లీ వస్తాదా ఏమన్నానా? అని మనసుని బుజ్జగించుకున్నాడు.     ఇంటికొచ్చేసాక బాలాకుమారి చిరాగ్గా అడిగింది.     "రేపు ఆదివారం మనిద్దరం కారులో షికారు కెళ్దాం అనుకుంటే ఆఫీసరు భార్యేంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ
వుంది" 

    "ఆ చిరాకే వద్దు. ఆఫీసరు నా కారు ఉపయోగించుకుంటే నాకే మంచిది. నాకు ప్రమోషన్ తగలొచ్చే బాలా"     ఆ మాట వినగానే బాలాకుమారి చిరాకు పారిపోయింది.     "అబ్బో ఏమో అనుకున్నాను కానీ ముందుచూపు వున్న బుర్రండీ మీది. అది సరేగానీ ఏమండీ మీరు రోజూ కారు మీద ఆఫీసుకు వెళతారా?" అమాయకంగా అడిగింది బాల.     ముకుందరావు ఒకసారి దీక్షగా భార్యముఖంలోకి చూసాడు.     "ఎందుకు వెళ్లను. వెళ్తాను. మహరాజులా వెళ్తాను. నేను గుమాస్తాగాడినే. గుమాస్తాగాడు కారు మీద ఆఫీసుకు వెళ్లకూడదన్న రూలేం లేదు."     "మరి డ్రైవరో?"     "వాడెందుకు పానకంలో పుడకలాగా?" పకపకా నవ్వాడు ముకుందరావు.     "నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను కదే! ఇంక డ్రైవర్‌తో ఏం పని?"     బాలాకుమారి ముకుందరావు దగ్గరగా వచ్చి రహస్యం చెబుతున్నట్టుగా అంది. "వీళ్లంతా మనకు డప్పు కొడుతున్నారండి. మనం జాగ్రత్తగా వుండాలి."     "ఎందుకు"     "వాళ్లు మన కారు ఎక్కవచ్చని"     "ఓస్ అంతే కదా. పరులకు సహాయం చేయడంలో తప్పులేదు"     "అలా అంటూ కూర్చుంటే వాళ్లంతా మన నెత్తినెక్కుతారు"     "కాదు కారు ఎక్కుతారు. అయినా పర్వా లేదు" అన్నాడు ముకుందరావు నవ్వుతూ.     భర్త ఇంత దయగలవాడా అని ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడింది బాలాకుమారి.  

* * *

    ఆరోజు రానే వచ్చింది. నెలరోజుల్లో డ్రైవింగ్‌లో మెలకువలన్నీ నేర్చుకున్నాడు ముకుందరావు. ఉదయాన్నే కారు పూజ చేసారు. తొమ్మిదికల్లా కారు ఎక్కాడు. కారు స్టార్ట్ చేయబోతూ వుంటే పక్కింటి సుబ్బారావు, పొరుగింటి పుల్లారావు, ఎదురింటి ఎల్లారావు, ఇంకా పరంధామయ్య అందరూ టిఫిన్ బాక్సులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు.

    "నువ్వొక్కడివే కారు మీద ఆఫీసుకు తుర్రుమనడం ఏమీ బాగాలేదు ముకుందరావూ" అన్నాడు సుబ్బారావు.     "చచ్చి నీ కడుపున పుడతాంగానీ మమ్మల్ని మా ఆఫీసు దగ్గర దింపు" అన్నాడు పరంధామయ్య.     "నేనెక్కవలసిన బస్సు ఒక జీవిత కాలం లేటు" అన్నాడు పుల్లారావు జాలిగా.     జాలి జాలిగా అంతా తననే చూస్తుంటే జాలేసింది ముకుందరావుకి.     "ఎక్కండయ్యా" అన్నాడు.     బిలబిలమంటూ ఎక్కారంతా. అందర్నీ వాళ్ల వాళ్ల ఆఫీసుల దగ్గర దింపి, ఆఫీసరు ఇంటికెళ్లి ఆయన్ని ఎక్కించుకుని ఆఫీసుకు చేరుకున్నాడు. గొప్ప ఘనకార్యం చేసినట్టు మనసంతా చాలా థ్రిల్లింగ్‌గా వుంది ముకుందరావుకి.

* * *
    ఆరోజు సాయంత్రం బాల, ముకుందరావు జంటగా కారులో షికారుకెళ్దాం అనుకున్నారు. ప్రొద్దుటి నుంచి ఒకటే హడావిడి పడిపోతోంది బాల. కారులో షికారు కాబట్టి తనకున్న వాటిల్లో ఖరీదైన బిన్నీ జార్జెట్ చీర తీసి కట్టుకుంది బాల. సన్నజాజులు కోసి మాలకట్టి జడలో పెట్టుకుంది. లిప్‌స్టిక్ వేసుకుంటే ఎంత బాగుణ్ణు. ఈసారి డబ్బు ఆదా చేసి కొనుక్కోవాలి అనుకుంది. ఆఫీసు నుంచి రాగానే ముకుందరావు కూడా నీట్‌గా తయారైపోయాడు.

    "ముందు రామక్రిష్ణా బీచ్‌కెళ్లి కాసేపు బీచ్ అందాలు తిలకించి ఆ తర్వాత ఊరంతా చక్కర్లు కొడదాం" అన్న భర్తని మురిపెంగా ముద్దుగా చూసింది బాల.     "మీరు ఎంత మంచివారండీ. నా మనసు మీరు తెలుసుకున్నారు" అంది.     "భార్య మనసు తెలుసుకోలేని వాడు, దున్నపోతైపుట్టున్" అన్నాడు నవ్వుతూ ముకుందరావు.     "పదండి. వేళ మించి పోతోంది."     ఇద్దరూ బయటికొచ్చి ఇంటికి తాళం వేసారు. ఇద్దరూ కారు ఎక్కారు.     "కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దానా..." అన్నాడు ప్రక్కన కూర్చున్న భార్య బుగ్గ గిల్లుతూ.     "అబ్బ కారు స్టార్ట్ చేయండీ" అంది బాల ముసిముసి నవ్వులతో.     ముకుందరావు కూనిరాగం తీస్తూ కారు స్టార్టు చేయబోయాడు.     "ఆగు..." అనే గావుకేక వినిపించింది.     త్రుళ్లి పడ్డాడు ముకుందరావు. తొందర తొందరాగా వచ్చాడు సుబ్బారావు కారు దగ్గరకు.     "నన్ను కాస్త మార్కెట్టు దగ్గర దింపవోయ్ కూరలు కొనాలి" అన్నాడు.     పోనీలే అనుకుని "ఎక్కండి సుబ్బారావుగారూ" అన్నాడు.

    సుబ్బారావు ఎక్కాడు. కారు స్టార్ట్ చేయబోయాడు ముకుందరావు.     "నాయనా ముకుందం... ముకుందం..." అంటూ అరుస్తూ దగ్గరగా వచ్చాడు పరంధామయ్య.     "నాయనా ముకుందం నన్ను సీతమ్మధారలోవున్న మా అమ్మాయి ఇంటి దగ్గర దింపవోయ్ నీకు పుణ్యం వుంటుంది" అన్నాడు.     పరంధామయ్య కారు ఎక్కబోతుండగా పక్కింటి మీనాక్షి ఆమె భర్త వచ్చారు.     "మేం షాపింగుకు వెళుతున్నాం. కాస్త మమ్మల్ని జగదాంబా సెంటర్లో డ్రాప్ చేయండి అన్నయ్యగారూ" అంది మీనాక్షి.     కాదనలేకపోయాడు ముకుందరావు.     అందర్నీ వాళ్ల వాళ్ల స్థలాల్లో దింపి కారు రామకృష్ణా బీచ్‌కి చేరుకుంది. ఇద్దరూ కారు దిగారు. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. "మురీ మసాలా తిందామా?" అడిగాడు ముకుందరావు హుషారుగా.     "కాదు, వేరుశనగ పప్పు కొనండి" అంది బాల మరింత హుషారుగా.     ఇద్దరూ పిడతకింద వేరుశనగ పప్పు కొనుక్కొని గట్టుమీద కూర్చుని తినసాగారు.     "ఆ సముద్రం చూడు ఎంత అందంగా వుందో, ఆకాశం అందం చూడు ఆకాశంలో చంద్రుణ్ణి చూడు వెన్నెల్ని గుమ్మరిస్తున్నాడు. అదిగో మన కారు చూడు. మెరూన్ కలర్‌లో ఎంత అందంగా వుందో" అన్నాడు ముకుందరావు కారునే ఆరాధనగా చూస్తూ.     "అందరి కళ్లూ మన కారు మీదే. దిష్టి తీస్తా రేపు దీనికి" బాల అంది.     "భలే మంచి రోజు. పసందైన రోజు..వసంతాలు పూచే నేటి రోజు..." ముకుందరావు పాటందుకున్నాడు హుషారుగా. తన్మయత్వంతో వింటూ వుంది బాల.

    "ముకుందరావ్. నిన్నే మిస్టర్ ముకుందరావ్..." గట్టిగా అరిచారెవరో. ముకుందరావు, బాల తుళ్లిపడ్డారు.     ఎదురుగా ఆఫీసరు, ఆయన భార్య.     "నమస్కారం సార్" అన్నాడు ముకుందరావు నవ్వుతూ.     "నేను ఇందాకటి నుంచి చెవికోసిన మేకలా అరుస్తుంటే నీకసలు వంటి మీద స్పృహ వుందా?" అన్నాడు ఆఫీసరు చిరాగ్గా.     "తప్పయిపోయింది సార్" అన్నాడు ముకుందరావు.     "అవునుగానీ నువ్వు కారు మీదేనా వచ్చావు?" అడిగింది ఆఫీసర్ భార్య.     "అవునవును మేడమ్" అన్నాడు ముకుందరావు సిగ్గుసిగ్గుగా.     "అది సరే మేం జగదాంబా సెంటర్‌కి షాపింగ్‌కి వెళ్లాలోయ్" అంది ఆఫీసరు భార్య.     "డ్రాప్ చేయాలా మేడమ్" అన్నాడు వినయంగా ముకుందరావు.     "అక్కడ నుంచి హోటల్ గ్రీన్ పార్క్‌లో పార్టీ వుంది వెళ్లాలోయ్" అంది ఆఫీసరు భార్య.     "సరే మిమ్మల్ని దిగబెడతాను" అన్నాడు ముకుందరావు మరింత వినయంగా.     "నీకెందుకు శ్రమ. నీ కారు తాళాలివ్వవోయ్ చాలు. మేం వెళ్లిపోతాం. రేప్పొద్దున ఆఫీసులో అప్పగిస్తారులే నీ కారుని. ఏవీ కారు తాళాలు?" అడిగింది ఆఫీసరు భార్య.     కొద్దిగా బాధగా అనిపించింది. మన ఆఫీసరేగా అనుకుంటూ కారు తాళాలు అందించాడు.

    "థాంక్యూ మిస్టర్ ముకుందరావు" అన్నాడు ఆఫీసర్.     వెర్రి చిరునవ్వొకటి నవ్వాడు ముకుందరావు.     ఇద్దరూ కారెక్కి తుర్రుమంటూ వెళ్లిపోయారు.     భార్య ముఖంలోకి చూసాడు ముకుందరావు. ముటముటగా వుంది. అయ్యో కటకటా అనుకుని - భార్య చెవిలో చెప్పాడు -     "కోపం తెచ్చుకోకు..కోపం తెచ్చుకోకు..మనకు మంచే జరుగుతుంది. మంచే జరుగుతుంది..మంచే జరుగుతుంది"     "ఇక ఆపండి. ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్లాలి?" అంది బాల చిరగ్గా.     "కాళ్లు వున్నాయిగా వాటితో" అన్నాడు ముకుందరావు నవ్వుతూ.

* * *
    రెండు నెలలు విసుగు చెందని విక్రమార్కుడిలా హుషారుగా జోరుగా గడిపాడు ముకుందరావు. ముకుందరావుకీమధ్య విసుగ్గా, బోరు బోరుగా అనిపిస్తూ వుంది. ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజు పెళ్లాంతో కలిసి ముచ్చటగా కారులో షికారు కెళ్లలేక పోతున్నాడు. కారు ఎక్కితే చాలు ఆ కాలనీవాసులు వెంటపడుతున్నారు. దానికి తోడు పెట్రోలుకి తడిసిమోపెడవుతూ వుంది. దిగులు పట్టుకుంది ముకుందరావుకి. వుండివుండి వొంటికి కారం రాసుకున్నట్టు భగ్గున వొళ్లు మండుకొస్తూ వుంది.     "ఎలాగే బాలా ఇలా అయితే - ఈ కారు కథ ఇలా సాగిపోవడమేనా! దినికి ఎండింగ్ లేదా?" విచారంగా భార్యతో అన్నాడు ముకుందరావు. 

    "ఇక నుంచి మనం కారుకి రెస్టు ఇద్దామండి" అన్న భార్యను విచిత్రంగా చూసాడు ముకుందరావు.     "వాళ్లంతా కారో కారో అని క్గోల పెడితే మనమేం సమాధానం చెప్తాం?" అన్నాడు.     "ఎందుకు మీకు చింత. నేనుండగా మీ చెంత. ఎవరన్నా అడిగిఏ కారు కడవలకొద్దీ పెట్రోలు తాగేస్తోందని కథలు కథలుగా చెప్పి నోరు మూయిస్తాను" అంది బాల సీరియస్‌గా.     "సరే నీ తడాఖా చూపించు" అన్నాడు ముకుందరావు సంతోషంగా.

* * *
    మర్నాడు ఉదయం తొమ్మిది గంటలైంది. సుబ్బారావు తదితరులంతా కారు దగ్గరకు చేరి ముకుందరావు కోసం ఎదురుచూస్తున్నారు. అంతలో ముకుందరావు ఇంట్లోంచి బయటికొచ్చాడు. కారు దగ్గరకు కాకుండా, కారు వైపే చూడకుండా చకచకా పోతున్నాడు టిఫిన్ డబ్బా ఊపుకుంటా.     ఇదేమి చోద్యం అనుకుంటూ సుబ్బారావు ముకుందరావు వెనక పరిగెత్తాడు. అంతా వెంబడించారు.     "ఆగవయ్యా ముకుందం ఆగు, ఏమిటా దూకుడు?" అంటూ ముకుందరావుని ఒడిసి పట్టుకున్నాడు సుబ్బారావు. అందరూ అదే పొజిషన్‌లోకి వచ్చారు. ఇంతలో ఇదంతా చూస్తున్న బాల గబగబా అక్కడికి వచ్చింది.     "కారు నాది కాదూ అన్నట్టు పోతావేం? ఏం వచ్చిపడింది" అన్నాడు పరంధామయ్య చిరాగ్గా.     "పెట్రోలు కడవలకొద్దీ తాగి కూర్చుంటూ వుంది మా కారు. దాన్ని మేం భరించలేకుండా వున్నాం బాబాయిగారూ. కొంత కాలం దానికి రెస్టు ఇద్దామనుకుంటున్నాం. మీరంతా ఆఫీసులకి బస్సుమీద వెళ్లిపోండి ఇక నుంచి" అంది బాల నిర్మొహమాటంగా.     "మేం బస్సుమీద వెళ్లాలా? బాగా చెప్పావుగానీ మాకా ఓపిక లేదు" అంది కామాక్షి. 

    "నేనెక్కవలసిన బస్సు ఒక జీవితకాలం లేటు. అందుకే ఎక్కను బస్సు ఎక్కను గాక ఎక్కను" పుల్లారావు అలా అని ముకుందరావు చెయ్యిపట్టుకుని "పదండి గురూ గారూ కారు దగ్గరకు. ఎందుకు మురిపించుకుంటారు?" అన్నాడు.     "పద పద కారు తియ్యి" అంటూ అందరూ ముకుందరావుని తోసుకుంటూ పోయి, కార్లో కూలేసి ఎక్కి కూర్చున్నారు.     ముకుందరావు ఏడుపు ముఖంతో కారు స్టార్ట్ చేసాడు. బుర్రుమంటూ ముందుకు దూకింది కారు.     బాల నోరు వెళ్లమెట్టింది. రెండు రోజులు అలాగే సాగింది. బాల మరో ప్లాను వేసింది. ఇక నుంచి ముకుందరావు ఆఫీసుకి ఉదయం ఎనిమింది గంటలకే జారుకోవాలి. బాల చెప్పినట్టు ముకుందరావు ఆఫీసుకు ఎనిమిది గంటలకే తుర్రుమని పారిపోసాగాడు.     ఒకరోజు - రెండో రోజు - మూడో రోజు - నాలుగో రోజు - కాలనీవాసులు మిడతల దండులా నిలదీస్తారేమో అనుకుంటే వాళ్లంతా నిమ్మకు నీరెత్తినట్టు వుండడం, కారు గురించి కారు కూతలేమీ అనకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది బాలకు, ముకుందరావుకి. ఆఫీసరుకి మాత్రం అడిగినప్పుడల్లా కాదనకుండా కారు అరువు ఇస్తున్నాడు. పదిహేను రోజులు గడిచాయి.     ఆ రోజు సుబ్బారావు ముకుందరావు ఇంటికి వచ్చాడు.     "కారు లేకుండా బైటికెళ్లాలంటే చాలా ఇబ్బందిగా వుంది. మీ కారు ఒకసారి ఇస్తావా ముకుందరావూ, అలా షికారుకెళ్లి వస్తాం"     "డ్రైవరు లేకుండా కారేం చేసుకుంటావోయ్?" అన్నాడు ముకుందరావు తమాషాగా నవ్వుతూ.     "నేనే డ్రైవ్ చేస్తా"     "నువ్వా?" ముకుందరావు ఆశ్చర్యంగా అడిగాడు.

    "అవును నేనే. ఈ పదిహేను రోజులబట్టి డ్రైవింగ్ స్కూలుకు పోయి కారు నడపడం నేర్చుకున్నాను. నీకెందుకింక కష్టం. ఆ పనేదో నేను చేస్తానులే. నీ పేరు చెప్పుకుని సంతోషిస్తాం. కారు తాళాలు ఇటివ్వు ముకుందరావూ" అన్నాడు సుబ్బారావు.     ముకుందరావు ఒక వెర్రి నవ్వు నవ్వాడు.     "ఇక నుంచి పెట్రోలు ఖర్చు మా అందరిదీ" అన్నాడు సుబ్బారావు.     ముకుందరావు అప్రయత్నంగా తాళాలు తీసి ఇచ్చాడు.     పటపటమంటూ పళ్లు కొరుక్కుంది బాల.

* * *
    బయట ఏవో అరుపులు వినిపిస్త వీధి బయటకెళ్లారు బాల, ముకుందరావు. ఆ కాలనీ వాళ్లు కారు దగ్గర గుమికూడి వున్నారు.     ఆ వీధిలోని వాడైన త్రినాథ్ గబగబా ముకుందరావు దగ్గరకొచ్చి అన్నాడు - "మీరు తాళాలు సుబ్బారావుకెందుకిచ్చారు? అన్ను కారు ఎక్కించుకోవడం లేదు. కాస్త రికమెండ్ చేయండి ముకుందరావుగారు"     ముకుందరావుకి చిర్రెత్తుకొచ్చింది. ముటముటలాడుతూ ఏదో అనబోయేంతలో డ్రైవర్ సీట్లో వున్న సుబ్బారావు తల బయటకి పెట్టి "త్రినాథూ రావయ్యా రా... వచ్చి కూర్చో అలా అలిగి వెళ్లి పోతే ఎలా" అన్నాడు గట్టిగా.     త్రినాథ్ బొబ్బిలిపులిలా చెంగున గెంతాడు కారు వైపు. కారు కదిలింది నిండు గర్భిణీలా.     "సొమ్మొకడిది సోకొకడిది...బద్మాషులు..." పళ్లు పటపట కొరికాడు ముకుందరావు.     "మీరేం వర్రీకాకండి...రోజూ పెట్రోలుకి అయ్యే ఖర్చు చూసి ఆ సుబ్బిగాడి పని ఔట్" అంది బాల.

* * *
    ఉదయం పూట ముకుందరావు మనసులో తిట్టుకుంటూ ఆఫీసర్‌తో సహా అందర్నీ కారులో తమతమ ఆఫీసులకి జేరవేస్తున్నాడు. సాయంత్రం సుబ్బారావు అందర్నీ కారులో షికారుకు తిప్పుతున్నాడు.
 
    ఆ వీధిలొ వాళ్లంతా చందాలేసుకుని పెట్రోలు పోయిస్తున్నారు. మధ్య మధ్యన ఆఫీసరు కారు ఎత్తుకెళ్తున్నాడు. సిన్మాకని ఒకరోజు, కైలాసగిరికని ఇంకోరోజు, పేరంటం - పెళ్లి అంటూ మరో రోజు.

    ముకుందరావుకి కారు మీద కసి పెరిగిపోతోంది. "మనిద్దర్నీ సుఖపెట్టలేకపోతూ వుందే ఈ కారు. దీన్ని తీసుకెళ్లి పాతిపెట్టాలని వుందే బాలా" అన్నాడు కసికసిగా.

    "ఛీ తీసుకెళ్లి అమ్మి పారేయండి" అంది బాల కోపంగా.

    "మంచి ఐడియా, దీన్ని అమ్మి పారేస్తాను. అప్పుడు ఈ వెధవలందరి పని ఔట్. కారు తప్ప కాలు కింద పెట్టడం చాతకానట్లు పోజులు కొడుతున్నారు పోజులు..."

* * *

    మర్నాడు ముకుందరావు ఇంటి ముందు 'కారు అమ్మబడును' అన్న బోర్డును ముందు చూసిన వాడు సుబ్బారావు. అది చూడగానే సుబ్బారావు గుండె గుభేలుమంది.

    "ఓ పుల్లారావుగారూ...ఏమండోయ్ ఎల్లారావుగారూ...ఘోరం...ఘోరం..." అంటూ పరుగుతీసాడు.     క్షణంలో కాలనీలోనే కాక ఆఫీసంతా దావాగ్నిలా దహించుకుపోయింది ఆ వార్త.     "నీకేమన్నా పిచ్చి పట్టిందా? బంగారం లాంటి కారుని అమ్మడమేమిటి?...వెర్రి వేషాలేయకు" అన్నాడు ఆఫీసరు.     ముకుందరావు నోరు విప్పకుండా ఆఫీసరు పెట్టిన అక్షింతలన్నీ భరించాడు.     ఇవతలకి వచ్చిన తర్వాత - ఆఫీసరే కాదు ఆ బ్రహ్మ దేవుడు దిగివచ్చినా ఆరునూరైనా, నూరు ఆరైనా ఆ వెధవ 
కారును అమ్మి తీరతాను - అనుకున్నాడు ధృఢంగా.

* * *

    సాయంత్రం ఇంటికి వెళ్లేటప్ప్పటికి కాలనీవాసులంతా ముందు హాలులో తిష్టవేసుకుకూర్చుని వున్నారు. వాళ్లని చూడగ్గానే గతుక్కుమన్నాడు ముకుందరావు.     "ఏమయ్యా బాబూ నువ్వు కారు అమ్మితే మా గతేం కాను" అన్నాడు సుబ్బారావు.     "నువ్వు కారు అమ్మడానికి వీల్లేదోయ్" అన్నాడు పరంధామయ్య నిక్కచ్చిగా.     "మాకు కారు అలవాటు అయిపొయింది. ఇంక కాలు కింద పెట్టలేం. ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు మేం భరించలేం" పుల్లవిరుపుగా ఎల్లారావు అన్నాడు.     "బాగుంది... చాలా బాగుంది. అలాగంటే ఎలాగండీ! నా కారు నేను అమ్ముకుంటాను" చిరాగ్గా అన్నాడు ముకుందరావు.     "మేం ఒప్పుకోం" అరిచారు అంతా.     "నా కారు నా ఇష్టం" ముకుందరావు గట్టి పట్టులోనే వున్నాడు.     "అదేంటండీ అలా అంటారి? మా సౌఖ్యం కూడా చూడాలి కదా. మేము పెట్రోలు పోయిస్తున్నాం కదా! ఇంక మీకేంటంట నొప్పి?" పుల్లారావు రుసరుసలాడాడు.     "అదేంటయ్యా నా కారు అది. నా ఇష్టం అమ్ముకుంటానో విరిచి పొయ్యిలో పెట్టుకుంటానో. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. మీరంతా వెళ్లిపోండి" అన్నాడు ముకుందరావు.
 
* * *  

    తెల్లవారింది. ఇంటి బయట ఏవో అరుపులు వినిపిస్తూ వుంటే తలుపులు తీసి కొయ్యబారిపోయారు బాల, ముకుందరావు.

    సుబ్బారావు ఇంటిముందు షామియానా వేసుంది. 'కాలనీవాసుల ఆమరణ నిరాహారదీక్ష' అన్న బోర్డు పెట్టి వుంది. షామియానా కింద ఆఫీసరుతో సహా కాలనీవాసులంతా పిల్లాజెల్లాతో సహా కూర్చుని వున్నారు.

    "కారు అమ్మకూడదు - కారు అమ్మకూడదు - కారు అమ్మితే మేం ఆమరణ నిరాహా దీక్ష చేసి ఛస్తాం" మైక్‌లో సుబ్బారావు గొంతు మోగుతోంది. బాల ఠారెత్తిపోయి ముకుందరావు వైపు చూసింది. ముకుందరావు గుండె వేగంగా కొట్టుకుంటోంది.

    "నేను కారు అమ్మనయ్యా బాబూ. అమ్మను గాక అమ్మను. మీమీదొట్టు" గట్టిగా అరిచాడు ముకుందరావు.

    ఆ ప్రదేశమంతా హోరుమంటూ చప్పట్లతో మారుమోగింది.

    గబుక్కున మెలకువ వచ్చింది ముకుందరావుకి.

    అప్పటికే బాల కూడా లేచి కూర్చుంది ఆ కలవరింతలకి.

    టైము మూడయింది. "బాలా పద... ఇదే మంచి టైము. ముందు ఆ కారుని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేస్తా. తెల్లారితే వెళ్లి ఎంతకో అంతకి కార్‌బజార్‌లో ఆమ్మేస్తా పద" అంటూ లేచాడు ముకుందరావు.

(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 26-02-2004 సంచికలో ప్రచురితం)
Comments