కరుణించిన దైవం - వెంపటి హేమ

    
ఎదుటివాళ్ల కష్టాలకు కనీసం సానుభూతి చూపిస్తూ ఒక్క ఓదార్పు మాట చెప్పేవారు కూడా అరుదే ఈ లోకంలో! వాళ్లు పడే బాధ చూసి నవ్వుకునే వాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ఎద్దుపుండు కాకికి నొప్పా ఏమిటి ? ఎదుటి వాళ్లు విలవిల లాడుతూండడం చూసి, తమకు అదేదో వినోదం ఐనట్లు పైశాచికానందం పొందే వారు కూడా అరుదేం కాదు ఈ లోకంలో.
             
    దేవాలయం అరుగుమీద రాత్రులు నిద్రపోయే మతి చెడిన అమ్మాయి, సావిత్రి ఆ రోజు ఉదయం ఎందుకనో లేస్తూనే వాంతి చేసుకుంది. ఉదయం గుళ్లో జరిగే పూజను చూడాలని వస్తున్న భక్త జనం సావిత్రి వైపు ఆశ్చర్యంగా చూశారు.
              
    ఉభయ సంధ్యల్లో గుళ్లో వేంచేసి ఉన్న స్వామికి పూజలు జరుగుతాయి. ఆ ఉదయం  జరిగే ఆరాధన చూడడంకోసం గుడికి వస్తున్న భక్తుల్లో కొందరికి సావిత్రి అవస్థ నవ్వుతెప్పించింది.  "వెర్రి సావిత్రికి వేవిళ్లు కాబోలు!" "ఎంత వెర్రిదైనా వేవిళ్లు తప్పవుకదా!" "ఇంతకీ ఆ పుణ్యాత్ము డెవరు చెపుమా!" ఇలా రకరకాలుగా  అంటూ వాళ్లలో వాళ్లు చెప్పుకుని కపట సానుభూతి చూపిస్తూ వెకిలిగా నవ్వుకున్నారు. గుడి గోపురపు గూళ్లలోని పావురాలు "హుహూ, ఉహూ" అంటూ, వాళ్ల మాటలకు తమ నిరసన తెలియజేశాయి.
                
    దయాగుణ మన్నది సుమ సౌరభం లాంటిది. దానికి గొప్పా బీదా అన్న తారతమ్యం లేదు.  "పరోపకార బుద్ధి", మనిషి మనోకుసుమంలో ఉన్న మకరందం అనడం అతిశయోక్తి మాత్రం కాదు. కష్టాల జడిలో పడి నలిగిపోతున్న ఒక్క జీవితాన్నైనా అది సేద దీర్చగల్గితే చాలు, ఆ దయాశీలి జన్మ ధన్యమే అనుకోవచ్చు.
              
    సావిత్రి ఎవరో కాదు, కొన్నాళ్ల క్రితం ఆ ఊరి చరిత్రలో పేరుమోసిన చెట్టుకింది ప్లీడరు పద్మనాభం కూతురు. బెమ్మిని తిమ్మిని చేసి, తిమ్మిని బెమ్మిని చేసి, ఇద్దరు మిత్రుల మధ్య కూడా లిటికేషన్ పుట్టించి, మధ్యలో దూరి తన పబ్బం గడుపుకోగల పరమ లౌక్యుడు అతడు.  సావిత్రికి, సురేంద్ర అని  ఒక అన్నకూడా ఉన్నాడు. హైస్కూల్లో చదువుతున్నాడు. 
               
    పద్మనాభం భార్య భ్రమరాంబ మాత్రం, ఏమాటకామాటే చెప్పుకోవాలి, దయా దాక్షిణ్యాలున్న ఉత్తమ ఇల్లాలు. కాని ఇల్లాలి హితబోధలు పట్టించుకొనే సద్బుద్ధి పద్మనాభానికి లేదు. భర్తను దారి మళ్ళించడం చేతకాక ఆమె, భర్తకు తెలిసీ, తెలియకుండానూ కూడా, పాపపరిహారం కోసం, దాన ధర్మాలు చేస్తూండేది. ఒకనాడు గుడిలో బిచ్చమెత్తుకుంటున్న ఏభై సంవత్సరాలు దాటిన ఒకామెను చూసి, ఆమె చరిత్ర విని జాలిపడి, ఆమెను ఇంటికి తీసుకు వచ్చింది భ్రమరాంబ. భద్రి అనే పేరుగల ఆమె, ఇంటి పనుల్లో భ్రమరాంబకు తోడుగా ఉంటూ, పెట్టింది తింటూ ఆ ఇంటి పనిమనిషిగా అక్కడే  ఉండిపోయింది. 
                 
    తల్లి తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తుల్లాగే, సంచిత పాప పుణ్యాలు కూడా పిల్లలకు సంక్రమించక మానవు. ఏదో ఒక కారణంగా ఆస్తులు మనల్ని  వదిలి పోగలవేమోగాని, పాప పుణ్యాలు మాత్రం మనల్ని విడిచిపెట్టవు ఎప్పటికీ. 
                 
    సావిత్రికి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు జరిగింది ఆ సంఘటన ! అక్కడితో తల్లితండ్రుల చల్లని నీడలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న సావిత్రి బ్రతుకు తారుమారై పోయింది........
                  
    ఆ రోజు సాయంకాలం మొదలైన వాన ఆ రాత్రంతా హోరుమంటూ కొట్టి కురుస్తూనేవుంది. మెరుపులూ, ఉరుములూతో గగ్గోలుగా ఉంది వాతావరణం. గాలి భయంకరంగా ఊళలు వేస్తోంది. కరెంటు ఎప్పుడో పోయింది. తలుపులన్నీ మూసేసి, కిరసనాయిలు దీపం వెలుగులో, భ్రమరాంబ పిల్లలకు భోజనాలు పెట్టి, పెందరాళే పడుకుని నిద్రపొమ్మని చెప్పి పంపించేసింది. భద్రి కూడా కొంత పని చేసి, కొంత మరురోజుకి వాయిదావేసి తన పంచగదికి వెళ్లిపోయింది. పరిసరాలన్నీ భీభత్సంగా ఉండడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ముసుకుతన్ని పడుకోడమే మేలు అనుకున్నారు.
                    
    పిల్లల గదిలో చెరో మంచం మీదా పడుకున్నారు సావిత్రి, సురేంద్ర. ఒక రాత్రివేళ పెద్ద గర్జనతో దగ్గరలోనే పిడుగు పడడంతో సావిత్రికి మెలకువ వచ్చింది. గదంతా చీకటి గుయ్యారంగా ఉంది. ఉండుండీ మెరిసే మెరుపుల వల్ల కళ్లు మిరిమిట్లౌతూండగా సావిత్రికి భయం మొదలయ్యింది. దానికితోడుగా సురేంద్ర నిద్రలోనే, కరాటే భంగిమలతో చేతులు ఝాడిస్తూ, "ఆ హూ, ఆ హూ" అంటూ కలవరించడం మొదలుపెట్టాడు. ఇక తట్టుకోలేకపోయింది సావిత్రి. తల్లి దగ్గరకు వెళ్లాలనుకుంది. కాని, వెనకటికి ఒకసారి అర్ధరాత్రి వెళ్లి తలుపు కొడితే, "పెద్ద దానివయ్యావు, ఇంకా నువ్వు నన్నిలా లేపితే ఊరుకునీది లేదు, తోలుతీస్తా" అంటూ తండ్రి  కోప్పడిన సంగతి గుర్తువచ్చి ఆ పని విరమించుకుంది. మళ్లీ బయట ఉరిమేసరికి ఒణికిపోతూ లేచి భద్రి దగ్గరకు పరుగెత్తింది సావిత్రి.
            
    కళ్లు పూర్తిగా తెరవకుండానే భద్రి, భయంతో గడగడా వణుకుతున్న   సావిత్రిని దగ్గరగా తీసుకుని, "నీకేం భయం లేదు, నేనున్నా కదా" అంటూ తన పక్కనే పడుకోబెట్టుకుని ఓదార్పుగా గుండెలకు హత్తుకుని, తన దుప్పటీయే కప్పి సముదాయించింది. అప్పుడు భయం తగ్గి ప్రశాంతంగా నిద్రపోయింది సావిత్రి. 

    తెల్లవార్లూ కుంభవృష్టిగా కొట్టికురిసిన వాన తెల్లారేసరికి సద్దుమణిగింది. అలవాటుగా భద్రి, పెందరాళే నిద్ర లేచి పాచిపని మొదలుపెట్టింది. గుమ్మాలు కడుగుతున్న భద్రికి ఓరవాకిలిగా తెరిచిఉన్న వీధి తలుపు వింతగా కనిపించింది. అంత తొందరగా ఆ ఇంట్లో భద్రి తప్ప ఇంకెవరూ లేచే అలవాటు లేదు మరి! 
            
    "ఎవరై ఉంటారు చెపుమా" అనుకుంటూ భద్రి తలుపు సందులోంచి లోపలికి చూసింది. అంతే, అక్కడ కనిపించిన దృశ్యం దిగ్భ్రాంతి కల్గించడంతో ఆమె కొయ్యబారిపోయింది. కొంతసేపటికి తెలివితెచ్చుకుని, పెద్దపెద్ద కేకలుపెడుతూ రోడ్డుమీదికి పరుగెత్తింది.
             
    భద్రి కేకలు విని ఇరుగుపొరుగుల వాళ్లు పరుగున వచ్చారు. అందరూ కలిసి హాల్లో ప్రవేశించారు. అక్కడి దృశ్యం కడు జుగుప్సాకరంగా ఉంది. హాల్లో సామానంతా చిందర వందరగా ఉంది. ఆ సామాను మధ్య మూడు శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఎవరో పద్మనాభాన్ని, అతని భార్యనే కాక, వాళ్ల అబ్బాయి సురేంద్రని కూడా, కండకొక కత్తిపోటుగా పొడిచి పొడిచి చంపేశారు. అక్కడి నేలంతా రక్తకొల్లులా ఉంది. అంతలో, ఎవరో వెళ్లి చెప్పడంతో పోలీసులు కూడా వచ్చేశారు. అందరూ తలోమాటా మాట్లాడడంతో కలకలం మొదలయ్యింది. ఆ గొడవకి మెలకువ రావడంతో లేచి వచ్చిన సావిత్రి, అక్కడి భీభత్సాన్ని చూసి విపరీతమైన భయంతో పెద్దగా కేకలు పెడుతూ అంతలోనే స్పృహ కోల్పోయి క్రింద పడిపోయింది.           
              
    పోలీసులు, సావిత్రిని వైద్యానికి హాస్పిటల్‌కి పంపించి భద్రిని ప్రశ్నించసాగారు. రాత్రి సావిత్రి తనదగ్గరకు వచ్చి పడుకున్న విషయం చెప్పి, రాత్రి గాలిహోరులో తనకు ఏ శబ్దం వినిపించలేదని దుఃఖం పట్టలేక భోరున ఏడ్చింది భద్రి. అందరూ తలోమాటా అనుకోడం మొదలుపెట్టారు. పద్మనాభం వల్ల కష్టాల పాలైన వాళ్లెవరో, వల్లమాలిన కసితో వంశ నాశనం చెయ్యడం కోసం చేసిన పనిగా నిర్ధారించారు. రాత్రి భద్రి దగ్గరకి చేరడం వల్ల సావిత్రి మాత్రం బ్రతికిపోయింది - అన్నారు. పద్మనాభం రాజకీయంవల్ల నాశనమైన వాళ్లు ఒకళ్లా ఇద్దరా ! అందులో ఇంత ఘోరానికి తలపడిన వారు ఎవరనుకోవాలి ? అది ఎవరో తేల్చవలసిన వాళ్లు పోలీసులు...
           
     పోలీసుల ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పి, ఆ తరవాత సావిత్రి కోసం ఆసుపత్రికి పరుగెత్తింది భద్రి. ఇల్లంతా పరిశీలించి పోలీసులు తేల్చిన విషయం - ఆ కిరాతకులు ఇంట్లో విలువైన వస్తువులు గాని, డాక్యుమెంట్లుగాని ఏమీ వదలకుండా అన్నీ దోచుకు వెళ్లారన్నది ! ఇంటిని మూసి తాళం వేశారు పోలీసులు.
           
    స్వభావాన్ని బట్టి, పద్మనాభానికి మిత్రులెవరూ లేరు. బంధువులతోకూడా అతనికి సత్సంబంధాలు లేవు. పైగా అది హత్య కేసు కావడంతో కూడా బంధువులు ఇటు రావడానికి భయపడ్డారు. ఆ కుటుంబం మీదనున్న అయిష్టంవల్ల, సావిత్రిని తమ బిడ్డగా చూసుకోగల ఔదార్యం కూడా వారిలో ఎవరికీ లేకపోయింది. అనాధగా మిగిలిపోయిన సావిత్రికి విశ్వాసంగల భద్రే సాయమయ్యింది. సావిత్రికి మరునాటికి తెలివి వచ్చింది. కాని ఆమె భద్రిని కూడా గుర్తించగల స్తితిలో లేదు. విపరీతమైన భయంవల్ల మెదడులో నరాలు చెడి ఆమెకు బుద్ధి మందగించిందని చెప్పి మరి రెండు రోజుల్లో డాక్టర్లు ఆమెను డిస్చార్జి చేశారు. ఆమెను తీసుకుని ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు భద్రికి. సాయం చేసేందుకుగాని సలహా చెప్పి ఆదుకునేందుకుగాని ఎవ్వరూ ముందుకి రాలేదు. అనాధగా మారిన సావిత్రి భారాన్ని మరో అనాధ ఐన భద్రి తన బుజాల మీద వేసుకుంది.
            
    పద్మనాభం ఉన్న ఇల్లు, అద్దె ఇల్లు కావడంవల్ల, పోలీసులు వేసిన తాళం తీసెయ్యగానే, ఆ ఇంటి స్వంతదారు వచ్చి, ఇంట్లో మిగిలివున్న సామాను బయట పారేసి , ఇల్లు స్వాధీనం చేసుకుని తలుపుమూసి తాళం పెట్టుకుని వెళ్లాడు. బయట పోగుపడ్డ సామానును, ఐనకాడికి తెగనమ్మి, ఆ వచ్చిన డబ్బు కాస్తా కొంగునకట్టుకుని,  సావిత్రి చెయ్యి పట్టుకుని ఉండడానికి కావలసిన చోటు వెతుక్కుంటూ బయలుదేరింది భద్రి. ఆ హత్య కేసుని పట్టించుకున్న వారు గాని, పద్మనాభం ఆస్తి పాస్తులేమిటో తెలుసుకున్నవారుగాని ఎవరూ లేకపోయారు. అనాధ ఐన సావిత్రికి అండగా ఉండాలన్న యావ తప్ప, మరే వ్యవహార జ్ఞానం లేదు భద్రికి.    
              
    సభ్య సమాజంలో ఎవరూ వాళ్లకు చోటు ఇవ్వలేదు. ఎంతో వెతగ్గా ఊరికి చివర నున్న మురికివాడ పూరి కొంపల్లో ఒక చోట వాళ్లకు ఉండడానికి చోటు దొరికింది. భద్రి ఊళ్లోని రెండు మూడు ఇళ్లలో పనికి కుదురుకుంది. ఇరు సంధ్యలా దేవాలయంలో ప్రసాదాలు పంచే వేళకి, తను ఎంత పనిలో ఉన్నా పక్కనపెట్టి, సావిత్రిని ఆలయానికి తీసుకు వెళ్ళేది భద్రి. అక్కడ పెట్టిన ప్రసాదాన్ని మొత్తం సావిత్రికి తినిపించి, ఆలయం అరుగుమీద కూర్చోబెట్టి పని పూర్తి చెయ్యడానికి వెళ్లీది. తను పనిచేసే ఇళ్లల్లో పెట్టిన పదార్ధాలు కూడా ఎంచి తీసుకొచ్చి, మంచివన్నీ ఆమెకు పెట్టేది. ఉన్నంతలో ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూవచ్చింది భద్రి. భద్రి ఉంటున్న చోట తక్కిన వాళ్లు కూడా సావిత్రి కథ విని ఆమెను ఆప్యాయంగా కనిపెట్టి కాపాడుతూ ఉండేవారు. యజమానులు పోయాక కూడా అనాధయైన సావిత్రి మీద భద్రి చూపుతున్న ప్రేమ, దయ, ఆమె మంచితనం అందరి మనసుల్నీ ఆకట్టుకోడంతో, ఆ వాడకట్టునవున్న అందరూ ఆమెను అభిమానించేవారు.
              
    విధిగా ఇరు సంధ్యలూ గుడికి వెళ్లేది భద్రి. ఉదయం ప్రసాదాలు పెట్టే వేళకు సావిత్రిని గుడికి తీసుకువచ్చి, ప్రసాదాలు తినడం అయ్యాక ఆమెను అక్కడే వదలి తను పనులు చెయ్యడానికి వెళ్లేది భద్రి. పగలంతా సావిత్రి గుడిలోనే తిరుగుతూ, అక్కడే కాలం గడిపేది. మళ్లీ సాయంకాలం ప్రసాదాలవేళకు వచ్చి, ప్రసాదాలు ఐనాకనే సావిత్రిని ఇంటికి తీసుకువెళ్లేది. అలా సావిత్రికి గుడిని అలవాటుచేసింది భద్రి ముందుచూపుతో.
             
    గుడికి వెళ్లినప్పుడల్లా భద్రి దేవుణ్ణి ఒకే విధంగా వేడుకునేది ప్రతిరోజూ...
            
    "స్వామీ! సావిత్రి ఏం పాపం చేసిందని ఆమెకీ శిక్ష వేశావు! ఏ పాపం ఎరుగని ఆ అమాయకురాలిని కరుణించు తండ్రీ" అన్నదే ఆ ప్రార్ధన.  
              
    ఆమె ప్రార్థన ఆ భగవంతుడు విన్నాడో లేదోగాని, పూజారి చెవిన పడింది అది. ఆయనకి సావిత్రి  గురించి అంతా తెలుసు. ముసలిదాని ఆరాటం ఆయనకి జాలి కలిగించింది. "దిగులు పడకు. నీ విశ్వాసం చూసైనా భగవంతుడు ఆమెను కరుణిస్తాడు. కాని, దేవుని చూపు మన మీద పడకుండా మన కర్మానుభవం మధ్యలో అడ్డు నిలబడుతూంటుంది. దేనికైనా ఆ టైం రావాలి" అన్నాడు ఆయన సానుభూతితో.
           
    రోజులు భారంగా గడుస్తున్నాయి. చూస్తూండగా కాలచక్రం పదేళ్లు ముందుకు కదిలింది. సావిత్రి ఇప్పుడు పసిపిల్లేంకాదు, యువతి! ముసలి భద్రి ఇంకా ముసలిదయ్యింది. ఒక రాత్రి నిద్రపోయిన భద్రి మరిలేవలేదు. సునాయాసంగా నిద్రలోనే చనిపోయింది ఆ పుణ్యాత్మురాలు. 
               
    మామూలు వేళకు మెలకువ వచ్చింది సావిత్రికి. గుడికి వెళ్లే వేళ కావడంతో భద్రిని లేపాలని చూసింది. ఆమె ఎంతకీ లేవకపోడంతో ఆ ప్రయత్నం మాని, తాను ఒంటరిగానే గుడికి వెళ్లిపోయింది.
                
    బాగా పొద్దెక్కాక, ఎప్పుడూ నాగాలు పెట్టని భద్రి ఆరోజు ఎందుకు పని చెయ్యడానికి రాలేదో కనుక్కుపోదామని వచ్చిన వ్యక్తి వల్ల భద్రి మరణవార్త అందరికీ తెలిసింది. ఇరుగుపొరుగులు అందరూ చేరి ఆమెకు దహన సంస్కారాలు జరిపించారు. జరిగినదేమిటో గ్రహించలేని సావిత్రి మాత్రం గుడిలోనే  ఉండిపోయింది.              

    సాయంకాలం ఆమెను తీసుకెళ్లడానికి భద్రి రాకపోడంతో అక్కడే ఉండిపోయింది. అదిమొదలు ఇక ఆ గుడే ఆమె నివాసమైపోయింది. సంగతి తెలిసి ఆ గుడిలోని ముసలి పూజారి దయతో ఇరు సంధ్యలా మరికాస్త ప్రసాదాన్ని ఆమె చేతిలో పెట్టేవాడు. గుళ్లోనే తిరుగుతున్న ఆమెను చూసి గుడికి వచ్చే భక్తులు జాలిపడి ఒక అరటిపండో, కొబ్బరి ముక్కో ఆమె చేతిలో పెట్టేవారు. అవి తిని కడుపు నింపుకుంటూ ఆమె అక్కడే ఉండిపోయింది. అక్కడి మండపంలోనే నిద్రపోయేది. అప్పుడప్పుడు భద్రి స్నేహితురాలు ఒకామె వచ్చి ఎంతో కష్టపడి సావిత్రిని తీసుకెళ్లి తలంటి, ఉతికిన బట్టలు కట్టి, మళ్ళీ గుడిదగ్గర వడిలేసేది. అలా ఆ గుడే సావిత్రికి ఇల్లైపోయింది. భద్రి పోయిన తరువాత ఆమె గుడిని విడిచి బయటకు పోయిందే లేదు.

    ఏ పాపిష్టి ముహూర్తంలో ఏ పాషండుడికి పుట్టిన దుర్బుద్ధి వల్లో సావిత్రి గర్భవతి అయ్యింది. వేవిళ్లతో సతమతమైపోయింది. భద్రి స్నేహితురాలే అప్పుడప్పుడు వచ్చి ఆమెకు చిన్న చిన్న సాయాలు చేసి వెళ్లేది. మిగిలిన జనంలో చాలామంది ఆమెను చూసి హేయంగా మాట్లాడి నవ్వు కునేవారు. కొందరు మాత్రం మనకెందుకులెమ్మని ఊరుకునేవారు. చూస్తూండగా సావిత్రికి నెలలు నిండాయి.
              
    ఒక రోజు తెల్లవారుఝామున సావిత్రికి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆ బాధ ఏమిటో తెలియక ఆమె అల్లాడిపోయింది. మొదటి నెప్పి కొంచెం తగ్గేసరికి, దానినుండి తప్పించుకుని దూరంగా పారిపోడాని కన్నట్లుగా గుడిమెట్లు దిగి, రోడ్డు వెంట పరుగెట్ట సాగింది ఆమె. అలాగ దిక్కు తెలియకుండా పరుగుపెడుతున్న సావిత్రికి, కాళ్లకు స్పీడు - బ్రేకర్ అడ్డం రావడంతో, బొర్లా పడిపోయింది. దెబ్బ గట్టిగా తగలడంతో బిగ్గరగా ఆర్తనాదం చేసింది. వెల్లువెత్తుతున్న రక్తం చూడగానే, భయంతో నరాలు పట్లు తప్పగా, ఆమెకు స్పృహ పోయింది. 
               
    మార్నింగ్ ఎక్సరసైజ్‌లో భాగంగా, జాగ్ చేస్తూ అటునుండి వెడుతున్న పురుషోత్తమ రావుగారి కళ్ల బడింది ఆ దృశ్యం! వెంటనే ఆయన జేబులోంచి సెల్‌ఫోన్ తీసి, తన మిత్రుడైన డాక్టర్ ఆనందసాయికి ఫోన్ చేసి, జరిగింది క్లుప్తంగా చెప్పి, తగిన సిబ్బందితో అంబులెన్సు పంపించమని కోరారు. ఖర్చుకి వెనకాడకుండా వెంటనే ట్రీట్మెంటు మొదలుపెట్టమనీ దానికి పూచీ తనదేననీ కూడా చెప్పారు ఆయన. ఆసుపత్రి దగ్గరే కావడంతో ఐదు నిముషాలైనా గడవకముందే అంబులెన్సు వచ్చింది. వాళ్లు సావిత్రిని తీసుకెళ్లిపోగానే పురుషోత్తమ రావు గారు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 
             
    పురుషోత్తమరావుగారు ఇన్‌కంటాక్సు ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన రిటైరయ్యీ ఐదేళ్లు కావస్తోంది. కొడుకులిద్దరూ పెద్ద చదువులు చదివి, అమెరికాలో పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తూ, అక్కడే సెటిల్ అయ్యే ఉద్దేశంలో ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూంటారు, తల్లితండ్రుల్ని చూచిపోడం కోసం. ఒక్క నెలైనా పూర్తిగా ఉండకుండానే, శలవు లేదంటూ వెళ్ళిపోతారు. ఒక్కమారుగా పిల్లల సందడి తగ్గిపోడంతో, వాళ్లు వెళ్లగానే ఇల్లు పూర్తిగా బోసిపోతుంది. అది పెద్దవాళ్లని మరింత చిన్నబుచ్చుకునీలా చేస్తుంది. ఈమధ్య వాళ్లకి పొద్దు గడవడమే కష్టంగా ఉంటోంది. ఏదో విధంగా ఈ మొనాటనీ తప్పితే బాగుండును - అనుకోసాగారు వాళ్లు. 
            
    జాగింగుకని వెళ్లిన భర్త కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చేసినందుకు ఆశ్చర్యపోయింది యశోద.
            
    "మనకు గుళ్లో కనిపించే పిచ్చమ్మాయి, పరుగుపరుగున వచ్చి రోడ్డుమీద పడిపోయింది. ప్రెగ్నెంటేమో చాలా ప్రమాదంగా మారింది పరిస్థితి. జాలేసింది. ఆమెను మన ఆనంద్ హాస్పిటల్కి పంపించి ఇలా వచ్చాను. పద, వెళ్లి చూద్దాం. పాపం, ఎలా ఉందో ఏమో" అంటూ ఆయన జోళ్లైనా విప్పకుండా, చెక్కుబుక్కు కోసం వెతకసాగారు. కొద్ది సేపట్లో వాళ్లు ఇద్దరూ ఆసుపత్రిని చేరుకున్నారు.

    అప్పటికే ఒక నర్సు, సంతకాలకోసం కాగితాలు పట్టుకుని, సావిత్రికి సంబంధించిన వాళ్ల కోసం లాంజ్‌లో వెతుకుతోంది. ఏమీ సందేహించకుందా నేనున్నానంటూ ముందుకి వచ్చారు పురుషోత్తమ రావు గారు.
                
    అలవాటుగా ఆమె అడిగింది, "మీరు ఎవరు ? బిడ్డకు తండ్రా?"
                 
    ఉలిక్కిపడినట్లు తలెత్తి భర్త వైపు చూసింది యశోద. ఆయన మాత్రం ప్రశాంతంగా జవాబిచ్చారు, " ఆ బిడ్డకు తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. కాని, నేను మాత్రం ఆ పేషంటుకి తండ్రిలాంటి వాడిని. ఆమెకిప్పుడు ఎలా ఉంది" అని అడిగారు.
                
    "సారీ సార్! ఆమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. వెంటనే ఆపరేషన్ జరగాలి. సంతకం చెయ్యండి సార్' అంటూ కాగితాలు ఆయనకు అందించింది ఆ నర్సు.
                  
    "చూడు యశోదా! ఆ అభాగ్యురాలిని మన బిడ్డగా అదరించడంలో తప్పు లేదు కదూ! ఆమే, బిడ్డా బ్రతికి బయట పడితే వాళ్లని మనం సాకుదాం. అలాచేస్తే, మనం మన జీవితకాలంలో ఒక మంచి పని చేసినట్లౌతుంది. మన సంపద కూడా సార్ధకమౌతుంది. ఏమంటావు" అని భార్యను అడిగారు.
                  
    "ఈ పరిస్థితిలో ప్రతి సెకనూ కూడా విలువైనదే! మాటలతో ఆలస్యం చెయ్యక, ఆ కాగితాలమీద సంతకం చెయ్యండి ముందు. ఆ తరవాత వాళ్లని మనం మనవాళ్లుగా ఆదరిద్దాం" అంటూ భర్తను తొందరపెట్టింది యశోద.
                   
    పురుషోత్తమరావుగారు, అనాధ ఐన సావిత్రి బాధ్యతను తాను స్వీకరిస్తున్న దానికి నాందిగా నర్సు అందించిన పేపర్లమీద సంతకం చేసి, వాటిని ఆమెకు అందించారు.
Comments