కస్తూరి తాంబూలం - మునిపల్లె రాజు

    
ఇప్పుడిప్పుడే పస్తులుండటానికి అలవాటుపడుతున్నాడు రామమూర్తి. భార్యతో మాత్రం - "ఆకలిగా లేదు. నాకోసం వొండొద్దు" అని మొదటి రెండుసార్లు చెప్పాడు. తరువాత - "ఇవ్వాళ ఏకాదశి ఉపవాసం. శనివారం రాత్రి ఏమీ తినను. వెంకటేశ్వరస్వామి మొక్కు" అంటూ వచ్చాడు.     ఆ ఉదయం రమ నిద్రలేవకముందే బియ్యపు డబ్బా మూత తీసి చూశాడు. అడుగున అరసోలెడు మోయిన ఉన్నాయి. జేబులో పావలాకాసు మిగిలి ఉన్నది.     ఒక సంకల్పం, ఒక లక్ష్యం లేకుండా - రామ్మూర్తి ఇంట్లోంచి వీధిలోకి అడుగు పెట్టాడు. అవి రెండు మూడేళ్ళ క్రితమే అతని జీవిత పథం నుంచి తొలిగిపోయినాయి కదా!     శివాలయంలో గంటలు మోగుతున్నవి హమ్మయ్య, ఇది శివ రాత్రి పర్వదినం. తన భోజనం ప్రసక్తి లేదనుకున్నాడు. ఉన్న బియ్యంతో రమకు ఈ దినం గడిచిపోతుంది. జేబులో పావలా ఉంది గదా. ఒక బేడకు బెండకాయలు, మిగిలిందాంతో గొల్లరత్తమ్మ పెరుగు పోస్తుంది. తను ఏ లక్ష్యం లేకుండా బయలుదేరలేదులే - అని తలపోస్తూ వెనుదిరిగాడు.

    నడుస్తుంటే జివ్వున చలిగాలి. శివరాత్రితో శివోహం కావలసిన శిశిరాన్నింకా సూర్యభగవానుడు ఎందుకో నాశం చేయలేదు.
    పైన వేసుకున్న నేత తువాలునే చెవులమీదుగా కప్పుకొన్నాడు. తను పొగాకు వ్యాపారం చేస్తున్నప్పుడు, లండన్ వెళ్ళే ప్రయత్నంలో కుట్టించుకొన్న సూట్లున్నాయా ఇప్పుడు? 'ఆర్మీ-నేవీ' స్టోర్సులో కొన్న విదేశీ లెదర్ జెర్కిన్ ఉన్నదా - ఈ చలినుంచి తనను కాపాడేందుకు - అనుకొంటూ నడుస్తున్నాడు.     వెనక నుంచి శేషమ్మగారి శాపవాక్యాలు అప్పుడు వినిపించాయి. "వంశాంకురం లేకుండా పోతుంది. పెద్దలు చేస్తేనేం, ఎవరు చేస్తేనేం? చేసిన పాపం కట్టి కుడవక పోదురా! నా వంశం ఉసురు తగులకపోదురా!"
    శేషమ్మగారిది సగం వంగిన నడుము. చూపు కూడా అందీ అందకుండానే. కళ్ళాపి చల్లుతున్నది - సగం శిథిలమైన ఇంటిముందు. ప్రహరీ గోడ కూలిపోయిన భాగాన్నుంచి లోపలి పెంకుటిల్లు దీనంగా దృశ్యమౌతూనే ఉంటుంది.

    ఆ వృద్ధురాలు రామ్మూర్తి జ్ఞాతి-సంబంధీకురాలే. సగోత్రీకుల మత్సరాలలో వైరాలు పెరిగి, కోర్టుల చుట్టూ ఆమె కుటుంబాన్ని ఒక పుష్కర కాలం ప్రదక్షిణలు చేయించాడు అతని తండ్రి. ఆస్తులు అంతరించాయి. ఈనాము భూములూ తప్పిపోయాయి. ఆ కుటుంబంలో పిన్నలూ, పెద్దలూ అంతరించిపోయినట్లే.
    ఈ ఏకైక ప్రతినిధి తిట్లకూ అలవాటుపడ్డాడు రామ్మూర్తి, పస్తులకు అలవాటు పడిన పద్ధతిలోనే - ఈ సంవత్సర కాలంలోనే.     బెండకాయలు వంటింట్లో పోసి రామ్మూర్తి మధ్య నడవలోకి వచ్చాడు. అప్పుడే బయట చినుకులు. అకాల వర్షపు జల్లులు.     రమ ఇంకా లేవలేదు. "కొంచెం నలతగా ఉందండీ"     రామ్మూర్తి గుండె గుభేలు మన్నది. చిల్లిగవ్వ లేదు. రమ నిండుగర్భిణి. మొదటి రెండూ విచ్చిన్నమైనవి.     నిరుత్తరుడై నిలిచిపోయాడు. ఎక్కడినుంచో రాగలదనుకొన్న మనీఆర్డరు కోసం పోస్టాఫీసుకు మూడు దినాలు తిరిగాడు. ఇవ్వాళ సెలవు దినం.     "గంగమ్మకు కబురు చేస్తే మంచిదండీ."     గంగమ్మ ఆ గ్రామపు మంత్రసాని.     బయట చినుకులు ఉధృతమౌతున్న శబ్దం. గుండెలోతులనుంచి "భగవాన్" అని వినిపించినట్లయింది. ఎవరి గుండె నుంచో విదితం కాలేదు. గుమ్మంలో నిలబడి వానజల్లులో బట్టలు తడుపుకున్న శివయ్య "రామ్మూర్తీ" అని పిలుస్తున్నాడు.     శివయ్య చేతులు చూస్తాడు. కొద్దోగొప్పో జ్యోతిష్యం చెబుతుంటాడు. "నీ జాతకచక్రంలో ఏడింట కుజుడు. కుజదోషం ఉన్నది. నీ భార్యకు గండం" అని నెల రోజుల కిందట భవిష్యత్తును చెప్పింది శివయ్యే. ఇప్పుడెందుకొచ్చాడో?     మేఘాలు ముమ్మరంగా అలుముకొంటున్నవేమో చీకటిగా మారుతున్నది ఆ నడవలో నీడ.     రమ సన్నగా మూలుగుతూనే ఉన్నది. అన్నీ తెగనమ్ముకోగా ఆమె కోసం మిగిల్చిన రగ్గు కప్పబోయాడు.     "అవసరం వస్తుందని పది రూపాయలు దాచానండి. పోపు డబ్బాలో ఉన్నాయి" అని రమ హీన స్వరంతో రగ్గు తోపేస్తూ అన్నది.     రామ్మూర్తి మంత్రసాని ఇంటికి ఆ ముసురులోనే బయలు దేరాడు, శివయ్యను తోడు తీసుకుని. వీధి మలుపు తిరుగుతుండగా జల్లు మందగించి అంతమైంది. కాని శేషమ్మగారి రెండవ దఫా తిట్లు వినవస్తున్నాయి. పడిపోయిన గోడ నుంచి చూసింది కాబోలు.     "ఈ త్రాష్టుడు దొరికాడా? అష్టావక్రుడు. నోరు తెరిస్తే అపశకునం. తాగుమోతు వెధవలతో చేరితే జూదరి బుద్ధులు గాక ఇంకేం అమరుతై? పోనీ, నాశనమైపోనీ!"     ఈ బాణాలు శివయ్యవేపేనని రామ్మూర్తి గ్రహించాడు. శివయ్యకు ఆ రెండు దుర్గుణాలు అబ్బినాయని తనకూ తెలుసు. ఏం చేస్తాడు? తన ఆందోళనలో జాతకం చూపించుకున్నాడు.     మహాశివరాత్రి పుణ్యదినం. గంజాయి దమ్ము కావాలి. రామ్మూర్తి ఏమైనా పైసలు విదల్చ గలడేమో అని ఆశతో వచ్చాడు ఈ శివుడు.
* * * * *  

    రామ్మూర్తి నాకెప్పుడూ ఉత్తరం రాయలేదు. ఆ ఉదయం పోస్టులో మొదటి సారి, మా విద్యార్థి దశ తరువాత - ఇన్నేళ్ళకు అతని దస్తూరీ పోల్చుకున్నాను.
    రామ్మూర్తి పూర్తి పేరు - మేదా దక్షిణా రామమూర్తి. వాళ్ళ తాతగారు పెట్టిన పేర్లన్నీ ఆ వంశంలో పురాణేతిహాసాలవే. వాళ్ళక్క పేరు గార్గి. చెల్లిపేరు లోపాముద్ర. బాల్యంలో పంకజం, వనజాక్షి, నేనూ, రామ్మూర్తీ, గార్గీ, లోపాముద్ర - రైలు పట్టాలు దాటి స్కూలుకు పోయే వాళ్ళం. ఆడపిల్లలు గబగబా పట్టాలు దాటి ఆవలికి పోయేవాళ్ళు. మేమిద్దరం మాత్రం పట్టాల మీద నడుచు కొంటూ చాలా దూరం అనవసరంగా నడిచి తిరిగి వచ్చి కబుర్లు చెప్పుకొంటూ సరిగ్గా రెండో బెల్ మోగేసరికి ఆవరణలోకి రొప్పుకుంటూ ప్రవేశించే వాళ్ళం.     ఇష్టమైతే కబుర్లు కలిపేవాడు. లేకుంటే అత్యంత ముభావంగా నడిచేవాడు. ఒక్కోసారి వయసుకు మించిన వేదాంత వాక్యాలు దొర్లించే వాడు. ఒకసారి ఏ సందర్భంలోనో అన్నాడు "ఈ రైలు పట్టాలు ఎక్కడా కలవ్వు. పెద్దయితే మనిద్దరి జీవితాలు అంతేనోయ్!"
    నిజమే, భవిష్యవాణి పలికాడు. కాలేజీ చదువు పూర్తి చేయకుండానే రామ్మూర్తి బిజినెస్ మాటలు మాట్లాడేవాడు. కొద్ది నెలల్లోనే పొగాకు వ్యాపారంలో పడిపోయాడు. మొదట్లో మాగ్రామంలోనే రెండు పొగాకు బ్యారన్లు కట్టించాడు. తరువాత గుంటూరులో కంపెనీయే పెట్టేసాడు. తెల్లకార్లో తిరుగుతుండేవాడు. బొంబాయిలో గుజరాతీ మధ్య దళారీల ద్వారా పొగాకు ఎగుమతులు ప్రారంభించాడు. గుంటూర్లో మేడ కూడా కట్టాడని వినికిడి.

    ఇంటి వెనక ఆస్తి భరోసాతోనే ఈ లక్షల వ్యాపారం చేపట్టాడని నాకు తెలుసు. కాని ఆ భరోసా వెనుక ఉన్న నిజాన్ని బహుశా రామ్మూర్తి తప్పుగా అంచనా వేసి ఉండవచ్చు.
    రామ్మూర్తి తాతగారు నిస్సంతు. రామ్మూర్తి తండ్రిని పెంపుడు తెచ్చుకున్నారు. విద్యాబుద్ధులు, వివాహంతో పాటు సర్వాధికారాలు దత్తపుత్రుడు సంక్రమింప జేసుకున్నాడు.
    సొంత వ్యవసాయం మానిపించాడు. కౌలుదార్లను మానిపించాడు. ప్రతి వ్యవహారానికి లాయర్ నోటీసులు, ప్లెయింటులు, వ్యాజ్యాలు. జ్ఞాతులందరితోనూ వైరం. సబ్‌కోర్టులు మునసబు కోర్టులు జిల్లా కోర్టులు. మధ్యమధ్య క్రిమినల్ కేసులు. శేషమ్మగారి భర్తతో ఏభై గజాల నివేశన స్థలం విషయంలో హైకోర్టు దాకా వెళ్ళి ఒక పుష్కరం తరువాత వ్యాజ్యం గెలిచాడు. తాతగారు ఇవన్నీ అనుభవించకుండానే తరలి పోయిన తరువాత జ్ఞాతులందరూ అళియ రామరాజుకు ఎదిరి పక్షంగా ఏకమైన బహమనీ సుల్తానుల్లా ఐక్యంగా ఈనాము భూముల విషయంలో ఆయనను ఎదుర్కొన్నారు. చివరికి మిగిలింది కరిమింగిన వెలగపండు. ఆస్తికి మించిన అప్పులు భూములన్నీ పోయినా రామ్మూర్తి ఇల్లు మాత్రం అమ్ముకు పోలేదు.

    అప్పటికి నేను ఉదరపోషణార్థం పరరాష్ట్రాలు పట్టి పోయాను. రామ్మూర్తి వ్యాపారం అప్పుడే పడగలెత్తుతున్నది. అప్పులన్నీ తీర్చుకొని పూర్వవైభవం అందుకొంటున్నాడు.
    పొగాకుకు రంగు ముఖ్యం. ఆకుకు పురుగు పట్టకూడదు. అయిదారేళ్ళు అఖండజ్యోతి అనుకొన్న వ్యాపారం, అతను లండన్ ప్రయాణం పెట్టుకొన్న సంవత్సరమే కొడిగట్టడం ప్రారంభించింది. వేసిన పొలంలోనే వెయ్యటం, పంట మార్పిడి గూర్చి ఆలోచించకపోవటం, రైతుల అత్యంతాశలు - ఆకుకు రంగు రావటం లేదు. పురుగూ విజృంభిస్తున్నది. రైతుల కిచ్చిన అడ్వాన్సులు, మందులకు పెట్టిన మదుపులు ఒక ఏడు కాదు - మూడేళ్ళు వరుసగా మంటగలిసిపోయాయి.     రామ్మూర్తి తన వ్యాపార సామ్రాజ్యం చిన్నాభిన్నమైపోవటం నిస్సహాయుడై గమనిస్తూ కూర్చున్నాడు. ఇతర ఎగుమతిదారుల ఒత్తిడి, పోటీ. తను ఇతర జిల్లాలకు వాళ్ళలా వెళ్ళలేక పోయాడు. అతనికి రాజకీయాలలో ప్రవేశం లేనందున, కులం అడ్డు వచ్చినందున రష్యాకు, చైనాకు మిగిలిపోయిన నాసిరకం ఆకును - ఎగుమతి చేసుకొని అసలును కొంతవరకైన భర్తీ చేసుకొనే అవకాశమూ మృగ్యమైపోయింది. మేడలూ, కార్లూ, నగలూ, చివరికి తన దుస్తులూ, రేడియోలూ, గ్రామఫోన్లూ - అన్నీ తెగనమ్ముకొని జన్మస్థలం చేరుకొన్నాడు.

    ఎప్పుడు నేను స్మృతికి వచ్చానో ఏమో చిన్న ఉత్తరం రాసి పడేశాడు. "బ్రతుకిచ్చే బహుమానాల్ని అందుకోవాలని అర్రులు చాచాను. ఇప్పుడు పగట్లో కనబడే కఠిన సత్యాలను చూడలేను. అస్పష్టంగా కనబడే ఆశలతో ఈ రాత్రి తెల్లారకుంటే బాగుంటుందని ప్రార్థన చేసుకుంటున్నాను. మనదారులు కలవవు అని అజ్ఞానంతో చిన్నప్పుడు అన్న మాటలు నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. రమ ఆరోగ్యం బాగాలేదు. ఒక మనియార్డరు పంపిస్తావనే ఆశతో రాస్తున్నాను".     ఎంతో రాయలేదు. నా శక్తి ననుసరించి రామ్మూర్తికి డబ్బు తంతి మనీ ఆర్డరు పంపాను. అదే అతనికి సమయంలో అందలేదు కాబోలు.

* * * * *
    
    మంత్రసాని గంగమ్మ - "చిన్న నొప్పులు. చీకటి పడ్డాక గాని పెద్ద నొప్పులు రావు" అని చెప్పిపోయింది.     సాయంత్రం దాకా రామ్మూర్తి కాలుగాలిన పిల్లి చందాన గుడికీ, ఇంటికీ మధ్య చాంద్రాయనం చేస్తూ గడిపాడు.     సాయంత్రానికి బట్టతడుపు జల్లు వర్షపాతం ఝరిగా మారింది.     ఇంట్లో బుడ్డీ దీపాన్ని కాపాడుకుంటూ అతను గంగమ్మకోసం ఎదురుచూస్తూ, రమ ఆర్తనాదాలు వింటూ అచేతనంగా ఉండిపోయాడు. దాయాదులు, ఊరువిడిచిపోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళెవరితోనూ మాటలు లేవు. పాలూ పెరుగూ అమ్ముకునే రత్తమ్మ అంత వానలోనూ గిద్దెడు పాలుపోసి, రమకు తోడుగా నిలబడి, మంత్రసానికోసం అతన్ని పంపింది.     గంగమ్మ వచ్చేసరికే రమ మగబిడ్డను ప్రసవించింది. మంత్రసాని పిల్లాడి బుగ్గ గిల్లి ఏడిపించడం, బొడ్డు తాడు కోయటం, తల్లి మాయను తీసివేయటం నిర్వర్తించింది. రత్తమ్మ వేడినీళ్ళు పెట్టింది. అవి కాగటానికి మొన్ననే రామ్మూర్తి తాతగారి పాతకొయ్య కుర్చీని విరగగొట్టి ముక్కలు చేసి ఉంచాడు.     తన జన్మ రాశికి ఏడింట కుజుడు అపకారి కాదు - అని అప్పటికి రామ్మూర్తికి పూర్తి విశ్వాసం కుదిరింది.     రత్తమ్మ వెళ్తూ వెళ్తూ 'పురిటాలికి కస్తూరి యెయ్యవా? సలిగాలి కొడతావుంది' అన్నది.     గంగమ్మ - "ఆ మాటే చెబుతున్నా తల్లీ. ఆకుల్లో బెట్టి కస్తూరి తాంబూలం యిప్పియ్యాలి బాబూ" అని తోడు పలికింది.     "ఎక్కడ దొరుకుతుంది గంగమ్మా?"     "ఇయ్యన్న పూజారికాడ వుండేది పోయినేడాది దాకా. ఇప్పుడాయనకాడా లేదు. మీ యిళ్ళల్లోనే వుండాలి బాబూ. మీ బందుగులు యింత మందుడారు. ఆళ్ళకాడ పాతిళ్ళలో దొరక్కపోద్దా?" అని మర్నాడు వచ్చే హామీ ఇచ్చి తరలిపోయింది.     కొడుకు పుట్టిన గడియ ఏమిటో, అంత పెద్ద వర్షమూ ఎవరో అజ్ఞాపించినట్లు ఒక్కసారి స్థంభించి పోయింది కాని, చలి పోలేదు.
    రామ్మూర్తి హడావిడిగా గుడివేపు వెళ్ళాడు. శివరాత్రి జాగరణకు పార్వతీకల్యాణం హరికథ నడుస్తున్నది. శివయ్య కనిపించాడు.
    "ఎవరింట్లో నేమిటి? ఆ ముసలి ముండ ఇంట్లో గుండ్రాయంత కస్తూరి ఉందయ్యా" - అని చెప్పాడు. ఆ ముసలి ముండ శేషమ్మగారే.     రామ్మూర్తి గుండె ఆగిపోయింది. వంశాంకురం ఉండదని శపించిన శేషమ్మగారు ఇప్పుడు కస్తూరి దానం చేస్తుందా? ఉండబట్టలేక మూడు సార్లు ఆమె గుమ్మందాకా వెళ్లాడు. ధైర్యం చాలలేదు.

* * * * *
    అతనికి భూత ప్రేత పిశాచాల కలత నిద్రనుంచి మెలకువ వచ్చి, కటిక నేలమీదినుంచి లేచేసరికి - ఆకాశం నిర్మలంగా ఉంది. బాల భాస్కరుడి కిరణాలు లోకాన్నంతా రక్తారుణిమనుంచి తప్త హేమ మండలంగా మలుస్తున్నవి. గబగబా లోపలికి పోయాడు.     చలితో గడ్డకట్టిపోయిందనుకొన్న రమ - కళకళ లాడుతున్నది. పుట్టిన వంశోద్దారకుడు, పొత్తిగుడ్డల మధ్య వత్తుగా వదిగి తలమీద రంగు గుడ్డ టోపీతో, తను ఏ లోకమ్నుండీ ఊడిపడ్డాడో ఆలోకపు చిరుచీకటిని గురించే ఆలోచిస్తున్నట్లుగా తపస్సులో మునిగి ఉన్నాడు.     "శేషమ్మత్తయ్య వచ్చిందండీ. కస్తూరి తాంబూలం ఇచ్చి పిల్లాణ్ణి సర్ది వెళ్ళింది. మీరెక్కడికి వెళ్ళారో? పాల రత్తమ్మ వీధిన పోతూ చెబితే ఆమెకు తెలిసిందట" అని రమ మెల్లగా చెబుతున్నది. కాని, కన్నీళ్ళాగ లేదు.     ఆ రోజు రామ్మూర్తికి శేషమ్మగారింటికి వెళ్ళి కృతజ్ఞత చెప్పుకోను, క్షమార్పణ చెప్పుకోను ధైర్యం చాలలేదు. మరుసటి దినమూ తాత్సారించాడు. రమ అన్నది - "నా దిండు కింద ఇంకో కస్తూరి మాత్ర ఉంచిపోయిందండీ, ఆకులో మడిచి ఇస్తారా?"     అతను భార్యకు తాంబూలం ఇచ్చి, పరుగుపరుగున శేషమ్మ గారింటి వేపు సాగిపోయాడు.     బయట పదిమంది ఆడా మగా గుమిగూడి ఉన్నారు.     "ఎంత బతుకు బతికింది - పిచ్చితల్లి!"     "ఊరగాయ పెట్టమంటే గిన్నె నింపి పెట్టేది."     "పథ్యం పచ్చళ్ళన్నీ పందేరానికి దాచిపెట్టేది! పలుకు కటువు మనసు వెన్న!"     "మొన్న రాత్రి ఎక్కడి కెళ్ళిందో - ముద్దగా తడిసి వచ్చి అట్లాగే బిగదీసుకు పడుకుంది కాబోలు. ఆ జ్వరంతోనే పోయింది."     "పిచ్చి తల్లి! అంత ఆస్తి పోయినా ఒకళ్ళను యాచించి ఎరగదు"

* * * * *
    ఆ రోజే నా మని ఆర్డరు అందింది కాబోలు రామ్మూర్తికి. "నా వంశాన్ని ఉద్దరించిన మాతృమూర్తివి. మత్సరానికి ప్రేమ బదులిచ్చావు. నీకు ఊర్ధ్వలోకాల ప్రాప్తి లభిస్తుంది. నీ కర్మాంతరాలు నేనే చేస్తాను. నువ్వు నా తల్లివి!" అని మనసులో ప్రార్థించుకుంటూ అతను శేషమ్మ కర్మ క్రమానికి పూనుకొన్నాడు. ఆ విషయమే మళ్ళీ నాకు రాసిన రెండో జాబు. ఆ ఉత్తరం విప్పుతుంటే కస్తూరి వాసన వచ్చింది.
Comments