కథకుడికథ - వి.వి.సుబ్బరాజు

    దొరబాబు జేబులో కిక్కిరిసి వున్న వందనోట్లను చూస్తుంటే బూరయ్యకు తెగ నోరూరిపోతోంది. జేబులు కొట్టే విద్య తనకు రానందుకు తొలిసారిగా విచారించాడు. అతని బుర్ర మహ చురుగ్గా రకరకాల పథకాలను ముందుంచుతోంది. ఎటునుంచి నరుక్కు రావాలో అర్థం కాక బూరయ్య సతమతమౌతున్నాడు.

    అది సత్తెమ్మ గుడి సెంటరు!     రోడ్డు పక్కగా సత్తెమ్మ గుడి. ఆ పక్కనే రెండు పాక హోటళ్లు, ఓ కిళ్లీబడ్డీ, అందులో సేవాదృక్పథంతో గోప్యంగా నిర్వహించబడుతున్న బ్రాంది షాపు వున్నాయి. రోడ్డుకు రెండవ పక్క ఓ తాటాకుల పాక దాని వెనక ఓ సెల్‌టవరు. అది ఆ సెంటరు భౌగోళిక రూపం. ఆ చుట్టుపట్ల నాలుగైదు గ్రామాలకు బయట ప్రపంచంతో ఏ పనిబడినా ఆ సెంటరుకే రావాలి.

    దొరబాబు పక్క గ్రామం మోతుబరి. పట్నం వెళ్లే బస్సు ఎక్కడానికి ఆ సెంటరుకి వచ్చాడు. బూరయ్య అతనితో వున్న పరిచయాన్ని పురస్కరించుకొని గౌరవసూకచకంగా ఓ స్టూలు తెచ్చి రోడ్డువారగా వేసి కూర్చుఓబెట్టాడు. బూరయ్యకు వయసువల్ల వంట్లో శక్తి తగ్గినా బుర్రలో పదును ఏమాత్రం తగ్గలేదు. మంచి మాటకారి. దొరబాబు చేత 'మంచినీళ్లు''టీ'లాంటివి వద్దనిపించుకుని యిక చురుగ్గా మాటలలోకి దించాడు.

    "దొరబాబుగారూ! మీ తాతయ్యగారు కోదండరామయ్యగారు గుర్తున్నారా? తవరికి?" అన్నాడు తనకు వాళ్ల కుటుంబంతో వున్న సాన్నిహిత్యం చెప్పడానికి.

    "ఆ! గుర్తులేకేం! నాకు ఊహ తెలిసినాకే పోయాడు మా తాత!" అన్నాడు దొరబాబు.

    "చెయ్యెత్తు మనిషండీబాబూ! బుర్రమీసాలు, గిరజాల జుట్టు, కండలు తిరిగి భీముడిలా వుండేవారండి!" అని దొరబాబు రెస్పాన్సుకోసం చూసాడు.

    దొరబాబు మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ఎప్పుడో పోయిన తన తాతని పొరుగూరి మినిషి పొగుడుతుంటే అతనికి వినసొంపుగా వుంది.

    "మీకు తెలుసోలేదో! మా వూళ్లో మీతాతగారికి ఓ ఇలాఖావుండేది. మా చిన్నతనంలో ఆయన సవారీ బండిమీద యిక్కడికి వత్తాపోతా వుండేవారండి!" అన్నాడు.

    దొరబాబు తెలుసన్నట్లుగా తలాడించాడు.

    "మీ నాన్నగారి సంగతి సరేసరి! మీ పొలాంమఖాంలో ఎప్పుడూ కొత్తపిట్టలే! మోజుతీరితే చాలు పాతదాన్ని వదిలించుకుని కొత్త పిల్లను యిట్టెతెచ్చెటోరు! ఆ మారాజుకి ఎలా దొరికేటోరో సంతకెల్లి ఆవునో, గేదెనో తోలుకొచ్చినంత తేలిగ్గా తీసుకొచ్చెసేవోరు. అంతా ఆశ్చర్యంగా చెప్పుకునేటోరు!"

    తండ్రి రసికతకు దొరబాబు మరింత కులాసాపడిపోతున్నాడు.

    "ధర్మరాజండీ బాబూ! అడిగినోడికి లేదనకుండా యిచ్చేటోరండి!"

    దొరబాబు సమ్మోహనంగా వింటున్నాడు. కొలిమిలో ఇనుపముక్క బాగా కాలింది. యిక తనకు కావలసిన ఆకారంలోకి మలుచుకోవడం తరువాయి. యింతలో ఓ ఆటోవాలా దొరబాబు పక్కగా ఆటో ఆపుజేసి 

    "వస్తారా! సార్!" అన్నాడు.

    బూరయ్య కంగారు పడ్డాడు."వద్దు! వెళ్ళు! వెళ్ళు! బాబుగారు బస్సుమీదనే వెడతారు" అంటూ తొందర జేసి తరిమేసాడు. "ఈ వెధవ ఆటోల ప్రయాణం వద్దు బాబూ! ప్రమాదం. నిదానంగా బస్సులో వెళ్లండి!" అంటూ దొరబాబుని నిలవరించేసాడు. యిక ఆలస్యం చేస్తే పనికాదు. గొంతు సవరించుకుని వినయంగా వంగి     "బాబూ! దయగల మారాజులు మీముందు నా కష్టం చెప్పుకోవాలి. మా ఆడపిల్ల కాపురం తిరంగాలేదు బాబయ్యా! మా అల్లుడు తాగుబోతు. యిద్దరు పిల్లలు! రోజూ మా పిల్లను కొట్టి నానాహింసలు పెడుతున్నాడు బాబూ! నా పిల్ల నలిగిపోతోంది బాబయ్యా!" ఆగాడు బూరయ్య. దొరబాబుని పరకాయించాడు. దొరబాబు శ్రద్ధగానే వింటున్నాడని గ్రహించి మళ్లా మొదలు పెట్టాడు.     "వంట్లో బాగాలేదు. ఓపాలి చూసివెళ్లమని కబురు చేసింది బాబయ్యా! నా చేతిలో రుపాయి లేదు. దారి కరుచులుండాలి. పిల్ల చేతిలో ఎంతో కొంత పెట్టిరావాలి. దారి కనబడ్డంలేదు. తవరు ఏమైనా యిప్పిస్తే..." అంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు.

    దొరబాబు జేబులో చెయ్యిపెట్టి వందనోట్లమధ్యనుంచి ఓ యాభై నోటు తీసి బూరయ్య చేతిలో పెట్టాడు. బూరయ్య మనస్సు చివుక్కుమంది. కనీసం ఐదు వందలైనా యిస్తాడనుకున్నాడు. ఆ అసంతృప్తి మొహంలోకనబడకుండా నవ్వు పులిమేసుకున్నాడు.     "తవరు ఏదో పనిమీద ప్రయాణమై వెడుతున్నారు. దరిద్రగొట్టోణ్ని నా అవసరం కొద్దీ అడిగేశాను. మరో పాలి సావకాశంగా తమరి లోగిలి కాడికి వత్తాను బాబూ! ఎంతైనా కోదండరామయ్యగారి మనమలనిపించుకున్నారు. మీకు మీరే సాటండి బాబూ!" అంటూ మరో విడతకు ముందరి కాళ్లకు బంధం వేసాడు.     అటుగా వచ్చిన ఆటో ఆగింది!     "వస్తారా?సార్!" అంటున్నాడు.     "ఎక్కెయ్యండి బాబూ! ఈ బస్సులను నమ్ముకుంటే ప్రయాణాలు జరిగినట్టే! ఎప్పుడు వత్తాయో ఎప్పటి కెల్తాయో ఆ భగవంతుడికి కూడా తెలీయదు!" అంటూ తొందర చేసి దొరబాబుని ఆటో ఎక్కించేసాడు. తనపని అయిపోయింది. యిక ఆటో తిరగబడినా బోర్లాపడినా తనకి పనిలేదు. స్టూలు తీసి పాకలో వేసేసాడు.     మోటారు సైకిలు మీద యిద్దరు యువకులు వచ్చి అక్కడే ఆగారు. వెనుక కూర్చున్న వ్యక్తి సూట్‌కేసుతో దిగాడు. బూరయ్య అతనిని గుర్తుపట్టాడు. పాకలోంచి స్టూలు తెచ్చి     "రండి కూర్చోండి ప్రసాదం బాబూ!" అంటూ ఆహ్వానించాడు.     "పట్నం వెళ్లే బస్సు పైన వుంది. వచ్చేత్తాది!" అంటూ భరోసా యిచ్చాడు.ప్రసాదం బాబుని యోగక్షేమాలు పరామర్శించాడు. యిక తనపని ప్రారంభించాడు.     "నాన్నగారు మంచి కష్టజీవండీ బాబూ! వ్యాపారం కోసం అర్థరాత్రి అపరాత్రి అనిలేకుండా యిక్కడ నుంచి మూడు మైళ్లు మీవూరు కాలినడకన తిరిగేటోరండి మహానుబావుడు. ఆరి లగేజీ పట్టుకుని మీ యింటికి వచ్చేవాడినండి. అమ్మగారు అన్నపూర్ణమ్మ తల్లి కడుపునిండా అన్నం పెట్టి యింటికి పట్టుకెళ్లమంటూ యింట్లో ఏముంటే అవి పెట్టేటోరండి.ఆ ధర్మ తల్లి పుణ్యం వల్లనే మంచి చదువులు చదివి పై కొచ్చారని తెలిసి సంతోషించాను బాబయ్యా!" అంటూ తన మాటల విన్యాసాన్ని సాగిస్తున్నాడు. ప్రసాదం ఆర్థిక పరిస్థితి అతని అంచనాకి దొరకడం లేదు. తన మాటలకు అతని నుండి వచ్చే కదలికలు సానుకూలంగానే వున్నాయి.     తన ప్రయత్నంలో భాగంగా జేబులోంచి మందుల చీటీ పైకి తీసాడు.     "బాబుగారూ! యిది వరకటిలా పనిపాటలకు వెళ్లలేకపోతున్నాను. వంట్లో సత్తువలేదు. ఆయాసం, నీర్సం. మా వూరి డాక్టరుగారికి చూపించుకున్నాను. ఆ మారాజు ఫీజు తీసుకోలేదండి. చీటీ రాసి యిచ్చారు. మందులు కొందామంటే పైసా లేదు. మరోలో అనుకోకండి బాబయ్యా! తమరేమైనా యిప్పిస్తే!..."అంటూ నసుగుతూ నిలబడ్డాడు.     బూరయ్య మాటలు పూర్తికాకుండానే ప్రసాదం జేబులోంచి బరువైన పర్సు తీసి వంద నోటు యిచ్చాడు. బూరయ్య కంగు తిన్నాడు. దొరబాబుకు చెప్పిన కథ చెప్పి వుంటే బావుండేదనిపించింది. మంచి అవకాశం చేజారి పోయిందని బాధ పడ్డాడు. బస్సు రావడంతో ప్రసాదం వెళ్లి పోయాడు. బూరయ్య స్టూలు పాకలో పెట్టేసాడు. అతని కాళ్లు ఉషారుగా బ్రాంది షాపుకు నడుస్తున్నాయి.     బూరయ్యకు అసలు ఆడపిల్ల లేనేలేదు. యిక మందుల చీటీ పక్కింటి గంగయ్యది. మందులు తెచ్చిపెట్టమని యిచ్చాడు. పాక వెనుక వున్న సెల్‌టవరుకి వాచ్‌మెన్‌గా ఉద్యోగ నిర్వహణ భాగంగా ఆ సెంటరు కనిపెట్టుకుని వుంటాడు. బూరయ్యకు నెల జీతంగా మూడు వేలు వస్తుంది. ఆ మొత్తాన్ని పూర్తిగా యింట్లోనే యివ్వాలి. యివ్వకుంటే భార్య కథలు వినదు. కర్ర తీసుకుంటుంది. భుక్తికి ఏమాత్రం లోటులేకుండా మడిచెక్కావుంది. ఉన్న కొడుకులిద్దరూ ఆర్జనపరులే.     బూరయ్య తన తాగుడు వ్యసనంకోసం ఎదుటివాళ్ల యిగోకి మేత వేసి రుపాయలు దండుకోవడానికి ఏవో కథలల్లి ఎవర్నో ఒకర్ని బుట్టలో వేస్తూనే వుంటాడు.
Comments