కావ్యోదయం - భవానీ ఫణి

    చందన గుడి మెట్ల మీద కూర్చుని ఉంది. ఆమె హృదయంలో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయి. అతను తననే చూస్తున్నాడని అర్ధమవుతోంది. తల మరింతగా క్రిందికి దించింది. 

    "ఏమీ మాట్లాడవా ?" అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. 

    "నెల రోజుల క్రితం నేను చూసింది నిన్నేనా అనిపిస్తోంది. అంతలా చిక్కిపోయావ్ ఏమిటి? ఒంట్లో బాగా లేదా?"

    బాగానే ఉందన్నట్టు తల అడ్డంగా నిలువుగా ఊపింది. 

    "నిన్న పెళ్లిలో కూడా ఏడుస్తూనే ఉన్నావు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ?"

    ఆమె కంగారుగా తలెత్తి చూసింది. ఆ సానుభూతి వాక్యాలకి అప్పటికే ఆమె కళ్ళు కన్నీటి తో నిండిపోయి ఉండటంతో జల జలా రాలిపడ్డాయి ఆమె తెల్లని బుగ్గల మీద నుంచి. 

    అలాంటిదేమీ లేదు అందామనుకుంది. కానీ మాట రాకపోవడం వల్ల మళ్ళీ వేగంగా తల అడ్డంగా ఊపింది. 

    అతనికి నవ్వొచ్చింది "అమ్మ చెప్పింది, నువ్వు మీ అమ్మానాన్నల్ని  వదిలి రావాలని ఈ నెల రోజుల్నించీ తిండి మానేసి ఏడుస్తున్నావట, నిజమేనా?"

    మెల్లగా మళ్ళీ తల దించేసి అవునని తల ఊపింది. 

    "ఇక నేను అవును,కాదు ప్రశ్నలు ప్రాక్టీస్  చెయ్యాలన్నమాట" అన్నాడు అల్లరిగా. ఆమె నవ్విందో లేదో కనిపించలేదు. 

    "అయినా నిన్ను ఇప్పుడు ఎవరైనా చూస్తే నేను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. ఇంకాస్త ధైర్యవంతులైతే తీసుకెళ్ళి పోలీసులకి అప్పగిస్తారేమో కూడా!"  ఈసారి నవ్వింది ఆమె. 

    కొద్దిగా ఆగి అన్నాడు సుధీర్ 

    "ఇప్పుడు చెప్పాల్సిన విషయం కాదేమో ఇది, కానీ ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదని ఇలా నిన్ను గుడి వంక పెట్టి ఇక్కడికి  తీసుకొచ్చాను" అతని గొంతులో గాంభీర్యం ధ్వనించింది. ఈసారి కూడా ఆమె నుండి మౌనమే సమాధానం. సంశయంతో కూడిన మౌనం . 

    "నాకు ఇప్పుడు ఉద్యోగం లేదు. పోయింది... మన పెళ్లి కుదిరిన సమయానికి అంతా బాగానే ఉంది. తర్వాత నా మీద లేని నేరం మోపి నన్ను ఉద్యోగం లోంచి తీసేసారు. వెంటనే మీకు చెప్తానంటే అమ్మా వాళ్ళు చెప్పనివ్వలేదు. కుదిరిన పెళ్లి చెడిపోతుందని భయపడ్డారు"

    ఇప్పుడు మాత్రం ఎందుకు చెబుతున్నట్టో! తెలుసుకుని తను ఏం చెయ్యగలదు? 

    ఉక్రోషం ఆమె మౌనాన్ని దాటి బయటకి రాలేక పోయింది. 

    "ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నువ్వేమీ బెంగ పడకు. అంతా త్వరలోనే సర్దుకుంటుంది" అతను చెప్పాల్సింది చెప్పేసి మనసులో బరువు దించేసుకున్నాడు. మరి ఆమె మనసులో భారం సంగతి!

* * *

    ఈ సంఘటన చందనకి శరాఘాతంమే అయింది. ఆమె మరింతగా మౌనం వహించింది. 

    ఉమ్మడి కుటుంబం. అత్తా మామలు, బావగారు తోటికోడలు, అందరూ పైకి బాగానే ఉన్నారు. కానీ తన భర్త కి ఉద్యోగం లేదన్న నిజం పరిస్థితులపై చూపే ప్రభావం ఆమెకి  అంతర్లీనంగా అర్ధమవుతూనే ఉంది. ఆత్మాభిమానాన్నే కనిపించని ఆభరణంగా ధరించిన ఆమె భోజనం కూడా సరిగా చెయ్యడం మానేసింది. సంపాదించే సామర్ధ్యం లేని వాళ్ళకి తినే హక్కు ఎక్కడిది!

    ఆమె భోజనం సరిగా చెయ్యక పోవడానికి అదొక్కటే కారణం కాదు. వారం తిరిగే లోపే మరో సంఘటన  జరిగింది ఆమె జీవితాన్ని మరింత నరక ప్రాయం చేస్తూ. 

    ఆ రోజు ఉదయం ఆమె పూజ ముగించుకుని హోల్లోకి వస్తూనే గాలిలో తేడా పసిగట్టింది. 

    "అక్కా, ఎక్కడో నాన్ వెజ్ వండుకుంటున్నారు కదూ?" తోటికోడల్ని అడిగింది. 

    కుసుమ నవ్వింది  "ఎక్కడో  కాదు, మనింట్లోనే. అత్తయ్యగారు ఈవాళ కోడి కూర వండుతున్నారు"

    ఒక్క క్షణం ఆమెకి భూమి ఆకాశం తల క్రిందులైనట్టు అనిపించింది. తను ఈ విషయం ఎలా ఊహించలేక పోయింది!

    ఒక్క పరుగున తన గదిలోకి వెళ్లి  బెడ్ మీద పడిపోయింది. లోపల్నిచి దుఃఖం తన్నుకొస్తోంది. దానితో పాటు ఆ  చిన్ననాటి జ్ఞాపకం కూడా. 

    అప్పటికి తన వయసెంతో తెలీదు. ఆ రోజు ఏ పండగో కూడా గుర్తు లేదు. చుట్టాలంతా ఇంటికి వచ్చారు. పిల్లలతో ఆడి ఆడి అలిసిపోయింది చందన. చీకటి పడుతుండగా గుర్తొచ్చింది బుజ్జి గురించి. వెంటనే తల్లి దగ్గరకి వెళ్ళింది. ఆడవాళ్ళంతా అక్కడే ఉన్నారు కబుర్లు చెప్పుకుంటూ. 

    "అమ్మా, బుజ్జి ఏదీ, కనబడదే?"

    టీ పెడుతున్న నాగమణి తలెత్తి చూసింది. 

    "నీ బొజ్జలో ఉంది" నవ్వింది  రాణక్క. 

    అయోమయంగా చూసింది చందన. "నా బొజ్జలో ఎందుకుంటుంది?"

    "మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తింటే మరి బొజ్జలో కాక ఎక్కడుంటుంది?" కిసుక్కున నవ్వింది వల్లి వదిన కూడా.

    చందనకి కోపమొస్తోంది. ఏంటి ఎవరూ సరిగ్గా చెప్పరే? 

    చందన అవస్థ చూసి వాణీకి జాలేసింది. "చందూ తల్లీ, నీ బుజ్జి కోడిని  కోసే  మద్యాహ్నం నువ్వు తిన్న కోడి కూర వండింది"

    చందన, పిన్ని వైపు నమ్మలేనట్టుగా చూసింది. తర్వాత నిజమా అన్నట్టుగా వాళ్ళమ్మ వైపు కూడా. 

    జాలిగా తననే చూస్తున్న తల్లి కంగారుగా తల దించుకుంది. చందనకి సమాధానం లభించింది. లోపల్నించి తెలియని బాధ ఏదో బయలుదేరింది. మాట్లాడకుండా జామ చెట్టు దగ్గరకి వెళ్లి కూర్చుంది. 

    అలా ఎలా చేస్తారు. బుజ్జి ఎంత అందంగా ఉంటుంది. గులాబీ పువ్వు లాగా మెత్తగా, కదిలితే గిలిగింతలు పుట్టేటట్టుగా. అది మనకంటే చిన్నదనా! మరి మన కంటే పెద్దవాళ్ళు మనల్ని అలా కోసుకుని  తినేస్తే? అయినా పాపం బుజ్జికి ఎంత నొప్పెట్టి ఉంటుంది! మొన్న పడిపోయి మోకాల్చిప్ప కొట్టుకుపోతేనే  తను ఎంత ఏడ్చింది,  అమ్మ కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఛీ!!  అసలు తనకి తెలిస్తే మద్యాహ్నం ఆ కూర తినేదే కాదు. 

    చందన ముఖం  కోపంతో బాధతో ఎర్రగా అయిపోయింది. ఎంత వద్దనుకున్నా కళ్ళలోంచి నీళ్ళు ప్రవాహంలా తన్నుకొస్తున్నాయి. 

    ఆ తర్వాత రెండు రోజుల పాటు ఎవరు ఎంత బ్రతిమాలినా చందన ఏమీ తినలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. 

    నీరసంతో మంచానికి అంటుకుపోయింది. పక్కన కూర్చుని తండ్రి ఆ రోజు అన్న మాటలు చందన ఎప్పటికీ మర్చిపోలేదు. అక్షరం అక్షరం గుర్తున్నాయి. 

    "అమ్మా, చందూ, నేను నీకిదే మాటిస్తున్నాను. ఈ రోజు నుంచీ మనింట్లో నీచు వండరు. నీ మీదొట్టు. ఇకనైనా లేచి అన్నం తిను తల్లీ"

    చందనకి  తండ్రి చెప్పింది పూర్తిగా అర్ధం కాకపోయినా ఆయన తన బాధ తీరే భరోసా ఏదో ఇచ్చాడని తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళింట్లో మాంసం వండలేదు. ఆమె తినలేదు. చుట్టాలింటికి వెళితే నేను మాంసం తినను అని చెప్పడం గొప్పగా అనిపించేది చందనకి. 

    కానీ ఇప్పుడు తన అత్తారింట్లో వండుతుంటే ఎలా తప్పించుకోగలదు. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడికి కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. 

    అత్తగారు ఏదో చెప్పడానికి వచ్చినట్టు అర్ధమవుతోంది. 

    "చూడమ్మా, మీ నాన్నగారు ఈ విషయం పెళ్లి మాటలప్పుడే చెప్పారు. మాకూ దేవుడు, పూజలు నమ్మకాలున్నాయి. మేము కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినం. ఏదో నెలకోసారి అంతే. వండటానికి  పాత్రలు, కత్తి పీట విడిగా ఉంచుతాను. నాకు ఎప్పటినుంచో అలా అలవాటు. నీకేమీ ఇబ్బంది ఉండదు. అంతగా కావాలంటే ముందు రోజు చెప్తాను. నువ్వు పొద్దున్నే లేచి నీకు విడిగా వండుకుని పెట్టుకో. మెల్లగా అలవాటు అయిపోతే గొడవే లేదు. ఈ రోజుకు నేనే నీకు ఉదయాన్నే విడిగా వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను" ఆవిడ ఒక్క క్షణం ఆగింది, తను ఏమైనా అంటుందేమోనని. చందనకి గొంతు పూడుకుపోయి మాటే రావడం లేదు. 

    లాభం లేదని మళ్ళీ ఆవిడే అంది  "సుధీర్ బయటకి వెళుతున్నట్టున్నాడు, ఇక లేచి ఏమైనా కావాలేమో చూడు" అత్తగారి మాటల్లో అనునయం కన్నా ఆదేశమే ఎక్కువగా ధ్వనించింది. అమ్మ దగ్గర సాగినట్టుగా ఇక్కడ సాగుతుందా!

    అలా అని చందన సరిపెట్టుకోలేక పోయింది. శారదమ్మగారు  చెప్పడానికి నెలకోసారి అన్నా పది పదిహేను రోజులకే ఆ వంటలు చేస్తున్నారు ఇంట్లో. అలా మాంసం వండిన రోజు ఉపవాసం ఉండటం అలవాటు చేసుకుంది చందన. అంతే కాదు ఆ రోజంతా తన గదిలోనే ఉండిపోతుంది ఏడుస్తూ. ఎంత పాతబడినా ఈ విషయం మాత్రం ఆమె సున్నితమైన మనసుని  ప్రతి సారీ కొత్తగా గాయపరుస్తూనే ఉంది. పుట్టింటి నుండి దూరమైన  ఆవేదన మాత్రం కాలంతో పాటు కొంత ఉపశమించింది. 

* * *

    "చందనా, సుధీర్ తో వెళ్లి రేపటి పూజకి  అవసరమయ్యే సామాను తీసుకురా" అత్తగారి పిలుపుకి  చేస్తున్న పని మధ్యలో ఆపి బయలుదేరింది చందన. 
భారంగా నైనా సంవత్సరాలు దొర్లిపోయాయి. లక్ష్య , సంపత్ పుట్టుకొచ్చారు. మర్నాడు తోటి కోడలి మూడో సంతానం కావ్య కి అన్నప్రాసన. కొంచెం గ్రాండ్ గానే చేస్తున్నారు . 

    "చందనా, కావ్యని కూడా కొంచెం నీతో తీసుకెళ్దూ, చెయ్యి దిగడం లేదు. బోల్డు పనులున్నాయి. చుట్టాలు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు" కుసుమ అభ్యర్ధనగా అడిగింది.

    కాదనలేక తన పిల్లలతో పాటు ఆ పిల్లని కూడా తీసుకుని బయల్దేరింది చందన బజారుకి . 

    భర్త డొక్కు స్కూటర్ బరబరా చప్పుడు చేస్తోంది. అతని ప్రింటింగ్ ప్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. త్వరలోనే  కారు కొనే ఉద్దేశ్యంలో ఉన్నాడు కూడా. 

    బావగారి ఫోటో స్టూడియో బిజినెస్  అంత బాగా లేనట్టుంది. మాటల్లో చెప్పకపోయినా తోటికోడలి అసంతృప్తి జ్వాలల సెగ అప్పుడప్పుడు తనకి తగులుతూనే ఉంది. 

    ఏమాట కామాటే చెప్పుకోవాలి. తన పిల్లల్ని మాత్రం ఆమె పిల్లలతో సమానంగానే ఆదరిస్తుంది. తనకి కూడా వాళ్ళ పిల్లలంటే అంతే ప్రేమ. ముఖ్యంగా ఈ కావ్య అంటే మరీనూ. ముద్దబంతి పువ్వులా ముద్దులు మూట గడుతూ ఉంటుంది.  

    పెద్ద కుదుపుతో చందన ఆలోచనల్లోంచి బయట పడింది . తను నేల మీద ఉందేంటి? ఒడిలో కావ్య ఏదీ.  చుట్టూ జనం మూగసాగారు . ఎవరో  లక్ష్యనీ , సంపత్ నీ ఆమె దగ్గరికి తీసుకొచ్చారు. తమ స్కూటర్ కి యాక్సిడెంట్ అయిందని అప్పటికి అర్ధమయింది చందనకి. పిల్లలు బానే ఉన్నారు. భయంతో బిక్కమొహం వేసారు. 

    భర్త, కావ్య కనిపించడం లేదు. ఆమె మెల్లగా లేచి నిలబడి చుట్టూ చూసింది. అప్పుడు కనిపించాడు సుధీర్, పరుగు పరుగున తన వైపు వస్తున్నాడు . అతని చేతుల్లో ఉంది కావ్య  రక్తమోడుతూ! చందనకి గుండాగినంత పనయింది. 

    "పాపం, పసి గుడ్డు, చేతి మీదనించి లారీ వెళ్ళిపోయింది" ఎవరో అంటున్నారు, చందనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. 

* * *

    ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పటల్ బెడ్ మీద ఉంది. పక్కనే భర్త నిలబడి తన వైపు చూస్తున్నాడు.   

    "కావ్యకి ఎలా ఉంది?" ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగింది. 

    "చెయ్యి బాగా నలిగిపోయిందట. తీసేయ్యాలి అన్నారు" భర్త కళ్ళలో నీళ్ళు. 

    మూడు రోజుల పాటు సుధీర్ అదే రక్తంతో తడిసిన షర్ట్ తో హాస్పటల్ లోనే ఉన్నాడు. యాక్సిడెంట్ తన చేతుల్లో జరిగిందన్న అపరాధ భావం అతన్ని విపరీతంగా కృంగదీసింది. 

    ఎలాగో కావ్య బ్రతికి బట్టకట్టింది. రెండు నెలల తర్వాత హాస్పటల్ నించి ఇంటికి తీసుకువచ్చారు. 

    చూడటానికి వచ్చే పోయే వాళ్లతో ఊపిరి సలపకుండా ఉంది చందనకి. కావ్యకి పాలు పట్టే సమయం అయిందని గుర్తొచ్చి పాలు కలిపి తోటికోడలి గదిలోకి తీసుకెళ్ళింది. కావ్యని  ఒడిలో వేసుకుని మౌనంగా దుఃఖిస్తోంది కుసుమ. పాపం ఆ చిన్నారి తల్లికి మోచెయ్యి పై వరకు తీసేసారు. పైగా కుడి చెయ్యి. 

    "అక్కా, బాధపడకు" అంది చందన అంతకంటే ఎలా ఊరడించాలో తెలియక. నిజానికి చందనకి కూడా అంతే దుఃఖంగా ఉంది కావ్య విషయంలో. తమతో పాటుగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందనే బాధ కూడా అందుకు తోడయింది.  

    "ఏడవక ఏం చెయ్యమంటావు చందనా, మీ బావగారి బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. ముందే ఇద్దరున్నారు. ఈ అవిటి పిల్లని ఎలా పెంచి పెద్ద చెయ్యాలి. ఎలా పెళ్లి చెయ్యాలి, అంతకంటే ఆ యాక్సిడెంట్ లోనే ... "

    "ఆపక్కా" చందన గట్టిగా అరిచింది వినలేక.  స్వార్ధం మనుషుల్ని ఎలా ఆలోచించేలా చేస్తుంది! చందనకి ఎందుకో బుజ్జి జ్ఞాపకానికి వచ్చింది.

    కావ్య ని తన చేతుల్లోకి తీసుకుంది. తనకి వచ్చిన కష్టం  ఏమిటో తెలియని ఆ పసి పిల్ల అమాయకంగా నవ్వుతోంది . 

    "క్కా , నువ్వు మరో సారి అలా మాట్లాడకు. ఇక నుండీ కావ్య నీ బిడ్డ కాదు. నా కూతురు. తన బాధ్యత అంతా  ఇక పై మాది. నువ్వు నిశ్చింతగా ఉండు"

    బలంగా ఆ పసిమొగ్గని గుండెలకి హత్తుకుంది చందన. ఆమె హృదయాకాశంలో మానవత్వమనే కావ్యం మరోసారి ఉదయించింది. 
Comments