కెవ్వు... కేక - బి.మాధురి

    "ఏమండోయ్! మిమ్మల్నే! అలా దిక్కులు చూస్తారేం! వెళ్ళి తిరుపతి బస్సు ఎన్నిగంటలకొస్తుందో అడగండి" సత్యవతి అరుపుకు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రాంబాబు.

    "ఏమిటే! అరుస్తున్నావ్! కొంచెం నెమ్మదిగా మాట్లాడొచ్చుగా! నాకేమైనా చెవుడా?" అటు ఇటు చూసాడు రాంబాబు తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని.

    "నా మాట లెప్పుడైనా మీకు అరుపుగానే ఉంటాయి. ధ్వజస్తంభంలా అలా నిలబడకపోతే బస్సు ఎప్పుడొస్తుందో ఎంక్వైరీలో అడగొచ్చుగా!" అంది దగ్గరికొస్తూ.

    "ఏమిటే ఆ వాగుడు! ఇంట్లో మాట్లాడినట్లు బయట కూడా వాగుతావు. విన్నవాళ్ళు ఏమనుకుంటారు!" చిరాకుగా అన్నాడు రాంబాబు.

    "ఎవరేమనుకుంటే నాకేంటి? ఇంట్లో ఒకలాగా వీధిలో ఒకలాగా మాట్లాడ్డం నేర్పలేదు మా వాళ్ళు మీ వాళ్ళలాగా" అంది సాగదీస్తూ సత్యవతి.

    "మధ్యలో మా వాళ్ళ ప్రస్తావన దేనికి? ప్రతి దానికి వాళ్ళని తలవంది నీకు రోజు గడవదు" విసుక్కుంటూ ఎంక్వైరీ దగ్గరి కెళ్ళాడు రాంబాబు.

    "ఈ మొగుడితో వేగలేక చస్తున్నానే కాంతం! మతి మరుపు మనిషి. ఏదైనా అంటే ముక్కు చీదేస్తాడు. అసలే ఎర్రటి మనిషేమో! ఆ చీదుడికి ముక్కుకాస్తా దొండపండై పోతుంది" విసుగ్గా అంది ప్రక్కనున్న అక్క కాంతంతో.

    "నీ మొగుడి గురించి నాకే చెప్తున్నావ్? రాంబాబు చాలా మంచోడే! మీ బావలాగా నసగాడు కాదు. మీ బావ నన్నసలు నోరెత్తనిస్తాడా! అమ్మ నాన్న నీకు మంచివాడినే వెదికి చేశారే! చక్కటి ఉద్యోగం. ముచ్చటగా ఇద్దరే పిల్లలు! నీ కాపురం చూసి నేనెప్పుడూ ముచ్చట పడతానే సత్యం!" అంది అక్క కాంతం లోలోపల తన భర్తను గొణుక్కుంటూ.

    సత్యవతిని ఇంట్లో అందరూ 'సత్యం' అని పిలుస్తారు. సత్యవతి భర్త రాంబాబు గవర్నమెంటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వాళ్ళది ఒంగోలు. అక్కను వెంటబెట్టుకొని సత్యవతి తిరుపతి ప్రయాణం పెట్టుకొంది. సత్యవతికి ఇద్దరు పిల్లలు. కృష్ణ, శాంతి. కృష్ణ కృష్ణుడిలాగానే నల్లగా ఉంటాడు. అమ్మలాగా పొట్టిగా, లావుగా ఉంటాడు. ముఖంలో పసితనం కనబడదు. శాంతి అచ్చుగుద్దినట్లు వాళ్ళ నాన్నలాగా తెల్లగా ఉంటుంది. చూడగానే పిల్ల అందంగా, మందంగా కనిపిస్తుంది. కానీ సత్యవతి పిల్లకి ఎక్కడ దిష్టి తగులుతుందోనని ఒకటికి నాలుగు బొట్లు పెట్టి, కళ్ళనిండా కారేలాగా కాటుక పెట్టి, తల నిండా నూనె కారి పోయేలా రాసి, గట్టిగా రెండు పిలకలు వేసి రిబ్బన్లతో కుచ్చులు పెట్టేస్తుంది. 'ఈ రోజుల్లో ఆ దిష్టి బొట్లేంటి?' అని ఎవరైనా అంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్లే! 'నా పిల్ల! నా ఇష్టం! మధ్యలో మీ పెత్తనం ఏంటి?' అని దులిపి పారేస్తుంది. ఆ వీధిలో ఆడాళ్ళంతా సత్యవతితో అంతంత మాత్రంగా ఉంటారు.

    "తిరుపతి వెళ్ళే బస్సు పది  నిమిషాల్లో వస్తుందట. రెడీగా ఉండండి! నేను బస్సు ఎక్కి సీట్లు ఉంచుతాను. మీరు జాగ్రత్తగా ఎక్కండి!" అని వదినగారితో అన్నాడు రాంబాబు.

    "చూశావే! కాంతం! అతనేమో చొక్కా నలక్కుండా టిప్‌టాప్‌గా బస్సు ఎక్కేస్తాడట! మనం ఈ పిల్లల్తో, లగేజీతో నెమ్మదిగా ఎక్కాలట. ముచ్చుగాడే! అన్నీ వాళ్ళమ్మ బుద్ధులే!" అంది మెటికలు విరుస్తూ.

    "ఏంటే సత్యం! ప్రతి దానికి ఆడిపోసుకుంటావ్! చూడు ఎంత జనం ఉన్నారో? మరిది వెళ్ళి సీట్లు ఉంచకపోతే తిరుపతి వరకు నిలబడే ఉండాలి" అంటూ మరిదిని సమర్థించింది కాంతం.

    ఈ లోగా బస్సు వచ్చి ఆగింది. జనాలు తోసుకుంటూ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కండక్టరు క్యూలో ఎక్కండని అరుస్తున్నా ఎవరూ అతణ్ణి పట్టించుకోవడం లేదు. రాంబాబు ఎలాగోలా ధైర్యం చేసి దూసుకుంటూ బస్సు ఎక్కి సీట్లు సంపాదించాడు.

    "ఏంటమ్మా! అలా తోసేస్తున్నావ్? మేం కూడా బస్సు ఎక్కేవాళ్ళమే! అలా పిల్లాణ్ణి చంకనేసుకు ఎక్కకపోతే ముందు పిల్లాడిని ఎక్కించి తర్వాత నువ్వు ఎక్కొచ్చు కదా! పిల్లాడేమీ చిన్నాడు కాదు కదా!" అన్నాడొక పాసింజర్.

    "ఏంటయ్యా నువ్వు నాకు చెప్పొచ్చేది? నేనెలా ఎక్కితే నీకేంటట! నా పిల్లాడు నా ఇష్టం! ఎత్తుకుంటానో? భుజాల పైనే ఎక్కించుకుంటానో నా ఇష్టం! నీకు అంతగా బాధగా ఉంటే ఇంకో బస్సెక్కు. అంతే గానీ నీతులు చెప్పకు" అంటూ "ఆడాళ్ళు కనిపిస్తే చాలు చొంగలు కార్చుకుంటూ ఏదో వంకతో మాట్లాడ్డానికి తయారైపోతారు" గొణుక్కుంటూ బస్సెక్కింది కాంతం.

    "ఇది ఆడదేమిట్రా! ఏ పార్టులోనైనా ఆడతనం కనిపిస్తోందా?" కిసుక్కున నవ్వాడు రమేష్ నల్లగా, లావుగా, గున్న ఏనుగులా ఉన్న సత్యవతిని చూస్తూ.

    "ఒరేయ్! విన్నదంటే మనిద్దరి మీదపడి కరిచేస్తుంది! ష్... గప్ చుప్..." అన్నాడు శ్రీను.

    రమేష్, శ్రీను ఇద్దరూ స్నేహితులు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీకెండ్ అని తిరుపతికి ప్రయాణం పెట్టుకున్నారు.  

    కాంతం శాంతిని ఎత్తుకొని బేగ్, సూట్‌కేసుతో పైకెక్కి మరిది చూపించిన సీటులో చతికిలబడింది.

    "ఏమండీ! ఈ సూట్‌కేస్ పైన పెట్టండి. ఈ కర్రల బేగ్ మన కాళ్ళ దగ్గరే ఉంచండి. పిల్లలకి ఏదైనా అవసరమైతే పెట్టొచ్చు" అని సీటు కింద పెట్టమని సంచి ఇచ్చింది సత్యవతి.

    "కృష్ణా! నువ్వు కిటికీ దగ్గర కూర్చోకురా! అసలే నీకు అలర్జీ. చల్లగాలికి జలుబు చేస్తుంది. రా! నాన్నా! నా ప్రక్కన కూర్చో!" గారాంగా పిలిచింది.

    "అమ్మా! నన్నలా పిలవద్దని చెప్పానా! స్టైల్‌గా 'క్రిష్' అని పిలు. అందరిలో పల్లెటూరిదానిలా పిలిచి నా పరువు తియ్యకే!" కోపంగా అన్నాడు కృష్ణ.

    వెనక సీటులో కూర్చున్న రమేష్, శ్రీను ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వేశారు.

    కృష్ణకి వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూసి "ఏంటి మిష్టర్! అలా నవ్వుతున్నారు" అన్నాడు.

    "ఏం లేదు క్రిష్! నిన్ను చూస్తే మాకు భలే గమ్మత్తుగా ఉంది. నువ్వేమన్నా సినిమాల్లో ఏక్ట్ చేశావా? నిన్నెక్కడో చూసినట్టుందే!" ఏడిపించాలని అన్నాడు రమేష్.

    "ఏం మిష్టర్! నాకంత సీను ఉందంటావా? నాకైతే సినిమాల్లో ఏక్ట్ చెయ్యాలనే ఉంది. కానీ మా అమ్మరాక్షసి నన్ను పంపదుగా!" అన్నాడు సీటులో నిలబడి ముందుకు వంగి రహస్యంగా.

    "తల్లికి తగ్గ కొడుకు" శ్రీను మెల్లగా అన్నాడు సత్యవతికి ఎక్కడ వినిపిస్తుందోనని.

    కండక్టర్ టిక్కెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు.

    "ఏమండీ! మనకి మూడు టిక్కెట్లే తియ్యండి" అంది సత్యవతి.

    "మూడేంటే! వీడికీ టిక్కెట్టు తియ్యాలి. లేదంటే కండక్టర్ ఊరుకోడు" కసురుతూ అన్నాడు రాంబాబు. అప్పటికే కృష్ణ కిటికీ ప్రక్క అద్దానికి చేరబడి నిద్రకుపక్రమించాడు.

    "మీరూ! మీ ఛాదస్తమూనూ! మీరూరుకోండి! ఆ డబ్బులిలా ఇవ్వండి. నేను తీస్తా టిక్కెట్లు" అని రాంబాబు చేటిలో నుంచి ఐదువందల కాగితాన్ని లాక్కుంది సత్యవతి.

    "మూడు టిక్కెట్లు ఇవ్వండి తిరుపతికి" అని ఐదువందల కాగితాన్ని ఇవ్వబోయింది.

    "ముగ్గురెవరమ్మా!" కండక్టరు.

    "మేమిద్దరం. ఆ పక్క సీటులో ఉన్నావిడ" స
త్యవతి.

    కాంతం ఒళ్ళో నిద్రపోతున్న శాంతిని చూశాడు కండక్టరు. కాంతం చిన్న తువ్వాలు శాంతికి కప్పింది. చిన్నదే అని ఊరుకున్నాడు. "ఆ కిటికీ దగ్గరున్న అబ్బాయి ఎవరు?" అడిగాడు కండక్టరు.

    "మా వాడే!" సత్యవతి.

    "టిక్కెట్టు తియ్యండి!"

    "వాడికి నాలుగేళ్ళే!"

    "అంతున్నాడు నాలుగేళ్ళేమిటి? టిక్కెట్టు తియ్యాల్సిందే!"

    "ఎంతున్నాడు! వాడు చిన్నాడే! కొంచెం బొద్దుగా ఉంటాడు. అందుకే మీకలా అన్పిస్తున్నాడు."

    "ఏమిటీ? మాకే చెప్తున్నారా? ఏంటి సార్! మీరు మాట్లాడరేమిటి?" కండక్టరు రాంబాబుని అడిగాడు.

    "నేను చెప్తున్నాగా! సరిపోదా! మళ్ళీ ఆయ్యన్ని అడుగుతారే!" కయ్యిమంది సత్యవతి.

    "ఏమండీ! ఈ అబ్బాయి నిజంగా మీ అబ్బాయేనా?" తండ్రీ కొడుకుల్ని మార్చి మార్చి చూస్తూ అడిగాడు కండక్టరు.

    "ఏమయ్యో! ఏంటా వింత ప్రశ్నలు! మా అబ్బాయి కాకపోతే ఎవరనుకుంటున్నావ్?" నిలదీసింది సత్యవతి.

    "ఏమో! రంగు ఆకారాలు చూస్తుంటే తేడాగా అన్పించింది" ఎగతాళిగా అన్నాడు కండక్టరు.

    "మర్యాదగా మాట్లాడు! నన్ననుమానిస్తున్నావా? ఏంటయ్యా! ఏమనుకుంటున్నావ్! మాది నిప్పులు కడిగే వంశం! ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!" అపర భద్రకాళిలా లేచింది.

    బస్సులో అందరూ వెనక్కి తిరిగి చూడడం మొదలు పెట్టారు. టిక్కెట్లు తీసుకుంటున్నాడని డ్రైవర్ బస్సును నెమ్మదిగా పోనిస్తున్నాడు. అంతవరకు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి సత్యవతి అరుపుతో అందరూ కంగారు పడి 'ఏం జరుగుతోందా?' అని తిరిగి తిరిగి చూస్తూ రకరకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు.  

    "నీది నిప్పులు కడిగే వంశం అయితే నాకెందుకు? కప్పులు కడిగే వంశం అయితే నాకెందుకు? ముందు డబ్బులు తియ్యి. టిక్కెట్టిస్తాను!" చిరాగ్గా అన్నాడు కండక్టరు.

    "ఏంటీ! కప్పులు కడిగే వంశమా మాది? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు... ఏమండీ! ఏం మాట్లాడకుండా ముంగిలా కూర్చుని అలా వినోదం చూడకపోతే ఇతన్ని దులిపి పడెయ్యొచ్చుగా!" మొగుణ్ణి మోచేత్తో ఒక్క పోటు పొడిచి అంది.

    "ఆయన్ని అసలు మాట్లాడనిస్తుందా ఈవిడ! దుమ్ము దులిపేస్తుంది కదా!" గుసగుసగా అన్నాడు రమేష్ గట్టిగా అంటే తనమీదికి ఎక్కడ లంఘిస్తుందోనని భయపడుతూ.

    "నన్ను ఇన్నేసి మాటలన్నందుకు నాకు క్షమాపణలు చెప్పు ముందు" గట్టిగా హుకుం జారీ చేసింది.

    "ఏంటమ్మా! ఏం మాట్లాడుతున్నావ్! నేను క్షమాపణలు చెప్పడం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా?"

    "లక్ష్మయ్యా! బస్సు ఆపు ముందు. ఈ సంగతి తేల్చాలి" అన్నాడు కండక్టరు డ్రైవర్‌తో.

    బస్సాగిపోయింది.

    "మతీ! గితీ! అంటున్నావ్? మాటలు తిన్నగా రానియ్! నా సంగతి నీకు తెలవదు" అంటూ కొంగు బిగిస్తూ లేచి నిలబడింది.

    "టిక్కెట్టు తియ్యడానికి ఇంత హైడ్రామానా? దిగవమ్మా! దిగు! పొద్దున్నే భలే బేరం తగిలింది" విసురుగా అన్నాడు కండక్టరు.

    "నువ్వు సారీ చెప్తే గాని దిగనంటే దిగను" మంకు పట్టు పట్టినట్టు మాటాడింది.

    "సారీ.. గీరీ.. జాంతానై! దిగు.. దిగు.. ముందు"

    "ఏంటండీ! కండక్టరు గారూ! ఈ బస్సు ఈ రోజు బయల్దేరుతుందా లేదా?" వెనకనుంచి ఎవరో గట్టిగా అరిచారు.

    "గోవిందో! గోవిందా!.. 'బస్సు గోవిందం' భలే రక్తి కడుతోంది" వెనక రమేష్ చేతులు పైకెత్తి దణ్ణం పెడుతూ అన్నాడు.

    "సారూ! మీ ఆవిడతో నాకు గొడవెందుకు? మీరు టిక్కెట్టన్నా తియ్యండి. లేదా బస్సైనా దిగండి" రాంబాబుతో అన్నాడు కండక్టరు.

    "టిక్కెట్టు ఇచ్చేయండి..." అంటూ వందనోటు ఇవ్వబోయాడు రాంబాబు.

    వెంటనే ఆ చెయ్యి మీద గట్టిగా ఒక్కటేసి అపరకాళిలా "పెళ్ళాన్ని అన్ని మాటలంటుంటే చూస్తూ కూర్చొని పేద్ద ధర్మాత్ముడిలా ఇప్పుడు టిక్కెట్టు తీస్తున్నావా? ఛస్తే టిక్కెట్టు తియ్యడానికి ఒప్పుకోను గాక ఒప్పుకోను..." అరిచింది సత్యవతి నోటున్న చేతిని గట్టిగా గుంజుతూ.

    "ఎంత సేపు యాగీ చేస్తావమ్మా! దిగిపో" వెనక నుంచి ఎవరో అరిచారు.

    "ప్రతి అడ్డమైన వాళ్ళతో మాటలనిపించుకుంటుంటే ఈ మగమహారాజుకి చీమ కుట్టినట్లైనా లేదు! అన్నీ అమ్మ బుద్ధులే! నా కర్మ ఇలా తగలడింది. మా వాళ్ళననాలి. ఒక చవటని తెచ్చి కట్టబెట్టారు" ముక్కు చీదడం మొదలు పెట్టింది.

    అంత వరకు గుర్రుపెట్టి నిద్రపోతున్న కృష్ణ ఒక్కసారిగా "ఎవరు మా అమ్మని ఏడిపిస్తున్నారు? వాళ్ళంతు తేలుస్తా!" తొడ చరుస్తూ లేచాడు.

    "అబ్బ! అసలు హీరో ఇప్పుడు లేచాడ్రా! వీడికి ఒక్కటిస్తే వయసు బయటపడుతుంది" రమేష్ శ్రీనుతో అన్నాడు.

    "ఏంటి మిష్టర్! నా వయసు గురించి చర్చిస్తున్నారు" వెనక్కి తిరిగి అడిగాడు.

    "అసలు గోలంతా నీ గురించే కదరా! నీకు మీ అమ్మ టిక్కెట్టు తియ్యనంటుంది. నీకు నాలుగేళ్ళేనట కదరా! ఆ వయస్సేదో త్వరగా తేల్చు. బస్సన్నా కదులుతుంది" బ్రతిమాలుతూ అడిగాడు రమేష్.

    "అహ్హహ్హా! నా వయసు గురించి బస్సే ఆపేసారా? ఈ క్రిష్ అంటే ఏమనుకున్నారు... హడల్" అంటూ మళ్ళీ నిక్కరు పైకెత్తి తొడ చరిచాడు.

    "బాబూ! నువ్వు ఏం చదువుతున్నావ్" అడిగాడు కండక్టరు.

    "ఏడవతరగతి" కుర్‌కురే పేకెట్ కరకరలాడిస్తూ చల్లగా చెప్పాడు మరుగుజ్జు కృష్ణ కాదు.. కాదు.. క్రిష్.

    "మరి మీ చెల్లి ఏం చదువుతుందో?" శ్రీను ఆసక్తిగా అడిగాడు.

    "మా చెల్లా! అదెవరు? మా పెద్దమ్మ ఒళ్లో నిద్రపోతున్నది మా అక్క. హ్హహ్హహ్హ..." అన్నాడు చంకలు గుద్దుకుంటూ క్రిష్.

    "టిక్కెట్లు గోవిందా! గోవిందా!" వెనక నుంచి ఎవరో అరిచారు.

    "కెవ్వు కేక... కెవ్ కెవ్ కెవ్ కేక..." ఎవరో సెల్‌లో గట్టిగా పాట పెట్టారు. 
Comments