ఖాళీ - రామా చంద్రమౌళి

  
 
యాభై తొమ్మిది సంవత్సరాల ప్రొఫెసర్ నీరజ తొంభై ఆరు అడుగుల ఎత్తుపైనుండి లోయలోకి దూకి, నీటి తుంపరగా చిట్లి ధ్వంసమైపోతున్న చిత్రావతి నదినే తదేకంగా చూస్తోంది ... పావుగంట నుండి.

    అంతటా నీటి చప్పుడు ... దూకుడు ... విచ్ఛిన్నత ... అలజడి ... ఎక్కడో ఆత్మలో ... బీభత్స విస్ఫోటనం ... వెరసి భౌతికంగా ఒట్టి నిశ్శబ్దం.

    కాని ఎక్కడో ... ఏదో అంటుకుని ... దహిస్తూ, వ్యాపిస్తూ ... ఇంకా ఇంకా విస్తృతమౌతూ, ఒక పెద్ద ఖాళీ ... విశాలమైన ... లోతైన ... అగ్నిగుండంలాంటి జ్వలిస్తున్న ఖాళీ ... ఎప్పుడూ నింపబడనిది ... ఎవరూ నింపలేనిది ..., బయటికి కనిపించనిది ... అజ్ఞాతంగా ఉండిపోయేది.

    కనబడకుంటే ... అది లేనట్టా,

    కనబడేవన్నీ నిజంగా ఉన్నట్టా ... మీమాంస.

    గాలి కనబడ్తుందా ... హృదయం కనబడ్తుందా ... కన్నీళ్లు పుట్టకముందు కనబడ్డాయా ... అగ్నికంటే తీవ్రాతితీవ్రంగా దహించే ఆత్మ కనబడ్తుందా ...,

    ఎవరివో కవిత్వ పాదాలు గుర్తొచ్చాయి నీరజకు - 'పిడికిట్లో గాలి ప్రేమ ... ఉందంటే ఉంది ... లేదంటే లేదు ...' ఎంత సరళ గంభీర వ్యక్తీకరణ...,

    నీరజకు ఇంతకుముందు ఒక ప్రత్యేక బోటులో తనొక్కతే చిత్రావతి జలపాత సానువుల్లో గంటసేపు పయనిస్తూ గడిపిన మధురానుభూతి గుర్తొచ్చింది. ఇండియన్ నయగరా అని చెప్పారెవరో చిత్రకూటం వద్ద ఇంద్రావతి జలపాతం గురించి ... నయగరా వ్యాపారవ్యూహంలో ఒక ప్రపంచ వింతయింది. చిత్రకూటం ఒక నిర్మల ప్రాకృతిక స్వచ్ఛమైన సంపద. వ్యాపార మలినం అంటకుండా పవిత్రంగా మిగిలింది ... సహజంగా.

    ఎక్కడి హైద్రాబాద్ ... ఎక్కడి ఛత్తీస్‌ఘఢ్ బస్తర్ జిల్లాలోని చిత్రకూట ప్రాంతం ... ఎక్కడి నగరారణ్యంలోని మానవ విషజంతువులు ... ఎక్కడి ఈ అమాయక, బీద, కాలుష్యం సోకని నిజమైన మనుషులు ...., ఏమిటీ ప్రయాణం ... ఏమిటీ యాత్రాకాంక్ష ... ఏమిటీ ప్రకృతి సౌందర్య లాలస ... ఎందుకీ అధ్యయన తృష్ణ ... ఏమిటీ జ్ఞాత ఆత్మానందం.

    పడవపై ... నీటిలో పయనిస్తున్నంతసేపూ శరీరమంతా ఏదో ఉద్విగ్నత ... అలజడి ... మహోగ్ర సంచలనం ... ఆ నీటిలోకి దూకితే బాగుండునా ... ఆ జలరాశిలో లీనమై అదృశ్యమై ... ఎక్కడ్నుంచో ఏదో పిలుస్తూంటే చేతిని చాచి అందించి మమేకమై, విముక్తమై, ఒక తెగిన గాలిపటంలా నిసర్గమై ...,

    విచ్ఛిన్నత ... సంలీనత ... చీల్చుకుని, చించుకుని ... కలిసి, కలెగలిసి లీనమై ... గాలి ... పాట ... రాగం ... లయ ... శబ్దం ... ధ్వని ... గింగుర్లు తిరుగుతూ ఒక ఆత్మచేతన.

    ఎదుట ఒట్టి చిగురుపచ్చగా లేత పసి ఆకులు...,

    వెనుక ... జలపాతంపైన ... ఎర్రగా అస్తమిస్తున్న సూర్యుడు ... ఆకాశమంత నుదిటిపై రక్తారుణ సింధూరం ... జలజలా నీటి తుంపర... నీరు నీటిని, మట్టి మట్టిని ... అగ్ని అగ్నిని ... ఆకర్షిస్తాయా ... పంచభూతాత్మకమైన మనిషి శరీరం కూడా మరో మనిషి శరీరాన్నాకర్షిస్తుందా ... జలతలంపై పయనిస్తున్నపుడు ఈ ఆకర్షణవల్లనేనా మనిషిలో నీళ్లలోకి దూకితే బాగుండునన్న క్షణికవాంఛను ఉత్సుకిస్తాయి. అందుకేనా పాలరాతి భవనాల్లో నివసించేవాళ్లకైనా బోసిపాదాలతో మట్టిని ముద్దాడాలనే తపన కల్గుతుంది ...,

    జీవితం ఒక అర్థంకాని అనంత రహస్యం.

    ప్రయాణం ఒక అంతులేని నిరంతర దాహం.

    అన్వేషణ ... అన్వేషణ ...

    ఏదో కావాలి.... ఇప్పుడు తన దగ్గరున్నది కాక - తన దగ్గరలేనిది ఇంకేదో కావాలి. ఉన్నది ఏమిటో పూర్తిగా తెలియదు. లేనిదీ, తనకు కావల్సిందేమిటో స్పష్టంగా అర్థంకాదు.

    అర్థంకానిదీ ... ఆత్మను తృప్తం చేయగలిగేదీ ఏదో కావాలి ... ఇంకా ..,

    ఆ 'ఏదో' కోసమే ఈ అన్వేషణ ...,

    ఎక్కడ అన్వేషిస్తావు ... పుస్తకాల్లో ... డిగ్రీల్లో ... డబ్బులో ... మనుషుల్లో ... స్నేహితుల్లో ... సహచరుల్లో ... స్పర్శలో ...దేశాల్లో ... ప్రాంతాల్లో ...,

    అమెరికా ... కెనడా ... జర్మనీ ... రష్యా ... చైనా ...శ్రీలంక ... మలేషియా ... వారణాసి ... ఢిల్లీ ... కాశ్మీర్ ... కేరళ ... అడవులు ... కొండలు ... లోయలు ... పర్వతాలు ... ఆకాశాంతర ప్రాంతాలు ... సముద్ర తీరాలు ... దండకారణ్యాలు ...,

    ఎక్కడ ... ఎక్కడుంది ... మనిషిక్కావలసింది...,

    నీరజ అప్రయత్నంగానే తన పక్కనున్న ఐపాడ్ బటన్ నొక్కింది.

    'జిన్హే హమ్ భూల్నా చాహే ... ఓ అక్సర్ యాద్ ఆతీహై ...' ముఖేష్ దుఃఖపూరితమైన గాఢమధుర స్వరం. ఆనందంకంటే ... విషాదమే మధురమైందా ... విరగబడి నవ్వడంకంటే మనిషి మౌనంగా దుఃఖించడంలోనే నిజమైన ఉపశమనం పొందుతాడా.
పాట ... తెరలు తెరలుగా సన్నగా వ్యాపిస్తుంటే ... నేపథ్యంలో చిత్రావతి జలపాత చిరు హోరు ... సంధ్య చిక్కనౌతూ ... పొగమంచుతో కలిసి విస్తరిస్తూ వస్తున్న లేత చీకటి.

    చీకటీ ... రాత్రీ ఒకటేనా...?

    బతకడమూ ... జీవించడమూ ఒకటేనా.

    శరీరం తృప్తం కావడానికీ, ఆత్మ సంతృప్తం కావడానికీ కావలసిన మూలమైన, జీవప్రదమైన ధాతువు ఒకటేనా..., ఎక్కడనుండో ఒక ఏక్తార ధ్వని ... దూరంగా ... లోయలో ... ఎవరో భిక్షువు చేతిలోని ఏదో ఉపకరణం ... అద్భుతమైన జీవశబ్దం ... శబ్దజీవం ...,

    కళ్లు మూసుకుంటే ... ఏదో ఒక విద్యుత్ స్పర్శ ... నరనరానా ... ఒక నిశ్శబ్ద సంగీత విజృంభణ ... ఒక విచ్చుకుంటున్న వసంత ఋతువిన్యాసం ... ఒక తాదాత్మ్యత ... మగ్నత. మనిషి తనను తాను కోల్పోతూ ... అభౌతికమైన దేన్నో ... అర్థంకాని ఏదో రసానుభవాన్ని పొందగలిగే ఈ మహోద్విగ్న స్థితి ఏమిటి?

    నీరజ కళ్లు మూసుకుంది మౌనంగా... ఎందుకో ఆమె కళ్లనుండి జలజలా నీళ్లు రాలాయి. వెచ్చగా ... అగ్నిధారల్లా ... ఎడతెగకుండా.

    ఏమిటి కావాలి తనకు...?

    ప్రశ్న....,

    అన్నీ ఉన్నాయి కదా ... అని జవాబు.

    అసలు ఉండడమంటే ఏమిటి ... లేకపోవడమంటే ఏమిటి.

    ఇంతకుముందు వస్తున్నప్పుడు చెట్టుకింద పిల్లనగ్రోవి ఊదుతూన్న పశువులకాపరి ముఖం నిండు పున్నమి చంద్రునిలా పరిపూర్ణంగా, కాంతివంతంగా, పరమ శాంతంగా ఉందికదా ... వాడిదగ్గర యేముంది. రాత్రింబవళ్లు చదివి డాక్టరేట్ పట్టాపొంది ... ప్రొఫెసర్ హోదాపొంది, పద్దెనిమిదిమంది పిహెచ్డీలను తయారుచేసి, ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రపతి పురస్కారం పొంది, పేరు, ప్రతిష్ట, గౌరవం, డబ్బు, ఉన్నతి ... యిన్ని ఉన్న తనలో ఆ పరిపూర్ణమైన శాంతి ఎందుకు లేదు.

    ముప్పయి ఐదు సవత్సరాలుగా తనతో కాపురం చేస్తూ ... ఒక రాజకీయ నాయకునిగా ఎదిగి, మంత్రయి, ఎఐసిసి కార్యదర్శయి, శక్తివంతమైన పార్టీ ప్రముఖుడై ... క్షణంకూడా తీరికలేక ఈ క్షణం యిక్కడుంటే ఈ రాత్రి ఎక్కడుంటాడో తనకే తెలియని వివిఐపియైన తన భర్త ... నారాయణదాసు ... మొన్నటిదాకా కోటాను కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌లను, పార్టీ ఫండ్‌ను, లావాదేవీలను నడిపి నడిపి, ఎక్కడెక్కడి బ్యాంకుల్లోనో ఏవేవో రహస్య అకౌంట్లను నిర్వహించి నిర్వహించి ... గత నెలలోనే పసిఫిక్ మహాసముద్రంపై విమానం కూలిన దుర్ఘటనలో మృతుడయ్యాడు. అతని ... జీవితకాలంలో ఏ ఒక్కరోజైనా ఈ పశులకాపరి ముఖంపై విరజిమ్ముతూ కనబడుతున్న శాంతి, కాంతి ఎందుకు లేవు.

    తమ ఒక్కగానొక్క కూతురు, ప్రముఖ బయోటెక్నాలజిస్ట్, ఫైజర్ అమెరికాలో సైంటిస్ట్, మానవ మూలకణాల పరిశోధన, వర్గీకరణ, మ్యాపింగ్‌లో జగత్ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఉమాదేవి గైక్వాడ్‌లో ... వృత్తిపరమైన నిరంతర ఆందోళన, అశాంతి, అన్వేషణ తప్ప ఈ పరమ పవిత్రమైన సంతృప్తతతో నిండిన ప్రశాంతత ఎందుకు లేదు.

    చదువుకూ, డబ్బుకూ, హోదాలకూ అతీతమైందీ,

    కేవలం ఆత్మకూ, హృదయానికీ, సంతృప్తతకూ, పరిత్యాగానికీ, నిరాడంబరతకూ సంబంధించిన అర్థంకాని ఒక చేతన మాత్రం ఏదో ఉంది ... ఎక్కడో,

    అది ఏమిటి...?

    నీరజ నిట్టూర్చింది అనాలోచితంగానే ... చుక్క తెగిపడ్డట్టు ... ఏ అంతర్లోకాల్లోనుండో జారిపడ్తున్నట్టు ఉలిక్కిపడి ... చుట్టూ చూచింది.

    చుట్టూ ... అప్పుడే కమ్ముకుని చిక్కనౌతున్న చీకటి.

    చిత్రావతి జలపాతం కనబడ్డంలేదు ... సూర్యుడు పూర్తిగా అస్తమించాడు ... అయినా లయబద్ధంగా జలపాత మధుర ధ్వని. దూరంగా ... చెట్టుకింద ... తన 'స్కార్పియో' వాహనం ... డ్రైవర్ అక్కడే ఉండి ఉంటాడు. లేచి నిలబడింది నీరజ.

    ఫిఫ్టీనైన్ ఇయర్ ఓల్డ్ నీరజ.

    ఓల్డ్ ... పాతబడిపోతోంది తను ... ముసల్దయిపోతోంది తను ... అలసిపోతోంది తను ... ఒక తెలియని పెద్ద ఖాళీలో గిలగిలా తన్నుకుంటోంది తను.

    ఈ సుదీర్ఘ జీవితకాలంలో తప్పనిసరిగా కావలసిన ప్రాణప్రదమైనదేదో దొరకలేదు తనకు. కాని మనిషికి అర్థవంతంగా జీవించడానికి అవసరంలేనివన్నీ ఉదారంగా లభించాయి తనకు ... ఐతే,

    మనిషికి ఏవి అవసరమో తెలుసుకోవడం కంటే ఏవి అవసరంలేవో తెలుసుకోవడం అతి ముఖ్యం కదా.

    ఎక్కడో ఏదో ఖాళీ ఉంది .... పూరించలేని ఖాళీ...,

    నడుస్తోంది నీరజ ... నెమ్మదిగా ... మసక చీకట్లో ... కారువైపు.

* * *  

    ఆ లేలేత ఉదయం కళ్లు తెరిచేసరికి.,

    ఎక్కడ్నుండో పక్షుల కిచకిచలు ... కిటికీలోనుండి గదిలోకి చొచ్చుకొస్తూ సూర్యకిరణాలు ... చల్లగా గాలి ... ఏవో చెట్లు, లతలు, మొక్కలు, పూలు, కాయలు, పళ్లు, మట్టి ... నీటితడి ... అన్నీ కలిసి అడవి వాసన.., అడవి వాసన ... ఆకాశం వాసన ... నిప్పు వాసన ... మట్టివాసన ... గాలి వాసన ... వెరసి మనిషి వాసన ... మనిషిలోని జంతువు వాసన ... ఇవన్నీ ఉంటాయా ...

    కుక్క ... మనిషి వాసనను బట్టికదా పసిగడ్తుంది ... మల్లెవాసనకు పరవశుడైకదా మనిషి ఉన్మత్తమోహ వివశతతో పిచ్చోడైపోతాడు ... అరోమా ట్రీట్మెంట్ ... పరిమళ చికిత్స..,

    మరి దేహపరిమళం ... యవ్వన పరిమళం ... హృదయ పరిమళం ...,

    నీరజ ... మెల్లగా లేచి ... కిటికీ తెరలను జరిపి ... బయటికి చూసింది. చుట్టూ దట్టమైన అడవి. బస్తర్జిల్లా చిత్రకూట్ ... ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ల అతిథి గృహం..,

    ఎదురుగా ... ఎదురుగా ... మట్టిని చీల్చుకుంటూ సెలయేరు ... సన్నని నీటి శబ్దం..,
ఎక్కడో ఓ పిచ్చుక కిచకిచ చప్పుడు...,

    అడవి తనకు తెలియకుండానే తనను ఆవహిస్తోందా ... తను పొందలేకపోయిన అనేకానేక అనుభవాలను, రిక్తతను, వ్యధను ... సర్వ లౌల్యాలను, సుప్త చేతనలోని అపరిపక్వ స్వప్నాలుగా మిగిలి నిప్పుకణికలై రగిలే వ్యాకులతను ... అన్నింటినీ తొలచి తొలచి తనను నిశ్శేషం చేస్తోందా ... అరణ్యం మనిషిని ఇంత ఉద్విగ్నం చేస్తుందా ... అడవి మనిషిని యింత మౌనంగా జయించి వివశురాల్ని చేస్తుందా..?

    తను పయనించాలింకా ...,

    ఎక్కడినుండి ... ఎక్కడిదాకా ... ఎంతవరకీ యాత్ర ... ఈసారి నీరజ దండకారణ్య సౌందర్యాలను తిలకించాలనుకుంది. హైద్రాబాద్ నుండి బయలుదేరి ... ఒక్కతే ... యుటిలిటీ వెహికిల్‌లో ... డ్రైవర్ ... తను.., దంతెవాడ, భైరాంఘర్, జగ్దల్పూర్, బస్తర్, చిత్రకూట్..., రాముడు, సీత ... లక్ష్మణుడు వనవాసం చేసి ప్రకృతిలో పరవశులై అద్భుత వనజీవన మాధుర్యాన్ని లోకానికి చాటిచెప్పిన చోటు ...,

    చెట్లు మాట్లాడుతున్నట్లు ... పక్షులు పలకరిస్తున్నట్టు, నదులు పిలుస్తున్నట్టు, జంతువులు నేస్తాలై ఆహ్వానిస్తున్నట్టు ... ఏదో సంలీనత ... ఏదో సంవేదన ... ఏదో తాదాత్మ్యత ..,

    ఐతే ... ఇంకెంత దూరం యాత్రించాలి తను, ఎన్నాళ్లు యాత్రించాలి తను ... దేనికోసం..,

    అసలు ఏమిటీ జీవితం...,

    ఒంటరి ... ఒంటరి ...

    ఇన్నాళ్లూ ఒంటరి కాదా తను..,

    పేరుకు ... భర్త ... ఒక దాంపత్యబంధం, ఇద్దరు వ్యక్తులు ... రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకరి ప్రపంచంలోకి మరొకరికి ప్రవేశం నిషిద్ధమైన రెండు వేర్వేరు వ్యవస్థలు ... ఒకే ఇంట్లో రెండు భిన్నమైన జీవనక్షేత్రాలు... పైకి ... స్టేటస్ ... ఒక ప్రొఫెసర్ ... ఒక పాపులర్ నాయకుడు ... మధ్య ఒక వ్యాపారాత్మక వ్యవహార ప్రపంచం చుట్టూ గోడలు ... దుర్భేద్యమైన గోడలు.
ఎప్పుడైనా తాము అనునయింపుగా స్పర్శించుకున్నారా ... హృదయాలను విప్పి నవ్వుకుని వివశులైపోయారా ... చేతిలో చేయి వేసుకుని ఓ ఫర్లాంగ్ దూరం నడచి చెట్లనీడల కింద సేదదీరారా ... ఒట్టిగా అలా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని దిగంతాల్లోకి ... కొండల్లోకి ... ఆకాశంలోకి, లోయల్లోకి చూపులను సారించి ఓహ్ ... జీవితమంటే ఒక మహాశూన్యం కదా అని నిస్సహాయంగా నిట్టూర్చారా...?

    ఒకటే పరుగు ... పరుగు ... పదవులకోసం, హోదాలకోసం ... ప్రమోషన్లకోసం, డబ్బుకోసం, ఆస్తుల సముపార్జన కోసం ... సామాజిక పటాటోపాలకోసం ... ఎడతెగని పరుగు..,

    ఇంతలో ఒక పాప..,

    పుట్టగానే ... రెండేళ్లకే కాన్వెంట్ ... రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ... బంగారు ఊచల జైలు ... బంగారు ఫ్లోరింగ్, బంగారు గోడలు... బంగారు బట్టలు ...

    బంగారాన్ని ఆహారంగా తినగలమా ..,

    మళ్లీ కవి స్ఫురించాడెందుకో ... గింజ మొలకెత్తాలంటే మట్టి కావాలి ... మట్టి. బంగారం కాదు, మట్టికోసం అన్వేషణ ... ఒట్టి మట్టికోసమే వెదుకులాట ... తపన.

    రవ్వంత ప్రేమకోసం, చిటికెడు వాత్సల్యం కోసం, ఒక చిరు స్పర్శకోసం, ఒక తీయని పలకరింతకోసం, ఒక ... 'అలసిపోయాను ... ఇక కోలుకోలేనంతగా అలసిపోయాను' అనుకుంది నీరజ.

    పాప పుట్టి పెరిగి ... ఎదిగి... ఇంకా ఎదిగి ... ఒక్కతే ... గోల్డ్మెడలిస్టయి ... ఐఐటీలో చేరి ... సైంటిస్టయి ... ఒంటరిగానే ఎగిరి ... ఎదిగి ... అమెరికా వెళ్లిపోయి.., ఖండఖండాంతరాల కవతల ... బిడ్డ ... గాజుబొమ్మ. ఈమెయిల్ డాటర్ ... ఫేమస్ సైంటిస్ట్ .. చాటింగ్ డాల్, మొగుడు ... రాత్రింబవళ్లు రాజకీయాలు ... నెరిపి నెరిపి ... ఎదిగి ఎదిగి ... పసిఫిక్ మహాసంద్రంలో కూలి ... అదృశ్యమై ... ఏమిటీ జీవితం ... ఏమి పోయింది ... ఏమి మిగిలింది.

    ఒక పేద్ద ఇంటిలో ముగ్గురు మనుషులున్న అతి చిన్న ప్రపంచం ... దశాబ్దాలకు దశాబ్దాలకాలం ... పలకరింతల్లేవు ... చిరునవ్వుల్లేవు ... ఒక సుదీర్ఘ జీవన యానంలో ..., కలిసి నడిచి ... కలిసి జీవించి ... కలిసి బతుకును పంచుకోలేక...,
'ఒక జీవితకాలం కలిసివున్నా ఆత్మబంధువులం కాలేదు. ఆత్మీయులం కాలేదు ... స్నేహితులం కూడా కాలేదు ... కనీసం పరిచయస్తులం కూడా కాలేదు ...' ఎందుకు ... ఏమిటిది -

    అప్పుడర్థమైంది నీరజకు ... తనలో అజ్ఞాతంగా ఒక ఎడారి ఉందని, అందుకే అడవి ఆమెను అల్లుకుంటోంది .. ఆక్రమిస్తోంది ... ఆవహిస్తోంది.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 13 ఫిబ్రవరి 2011 సంచికలో ప్రచురితం)

Comments