ఖాండవవనం - ఎస్.నారాయణస్వామి

    మట్టి కొట్టుకున్న జిప్సీ ఒకటి హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్డుమీద మన్ననూరు అటవీశాఖ చెక్ పోస్టుదగ్గర ఆగింది. డ్రైవర్ చెక్ పోస్టు ఆఫీసులోకెళ్ళాడు రిజిస్టర్లో సంతకం చెయ్యటానికి. పక్క సీట్లో చేరబడి కూర్చునున్న జగన్రెడ్డి కుతూహలంగా చుట్టుపక్కల కలయ చూస్తున్నాడు. వెనక సీట్లో యెంకట్రెడ్డి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు చివరి దమ్ము పీల్చి కిటికీలోంచి బయటికి విసిరేశాడు. అతని పక్కన శతృఘ్న తమ వెనకాల సామానుతో వర్కర్లతో వస్తున్న ట్రక్కు ఎంత దూరంలో ఉందా అని చూస్తున్నాడు.

    డ్రైవర్ తిరిగొచ్చి బండి స్టార్ట్ చేశాడు. అతని వెనకాలే బయటికి వచ్చిన ఫారెస్టు గార్డు రోడ్డుకడ్డంగా కట్టివున్న గేటుని విడిపించాడు. గేటు పైకి లేచింది. జిప్సీ మెల్లగా గేటుని దాటుతుండగా గార్డు మడమలు గట్టిగా తాటించి జగన్రెడ్డికి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూటెందుకో అని అనుమానిస్తూనే జగన్ అసంకల్పితంగా బదులు సెల్యూట్ చేశాడు. జిప్సీ స్పీడందుకుంది.

    "ఐపోయింది, మన పనైపోయింది. యెంకటన్నా, నేనీడనె మన్ననూర్ల దిగిపోతనే. ఈ జగన్ గానెంబడి నేనైత అడివిలో కొస్తలే. మీరెళ్ళండి కావాల్నంటె చెంచు గూడేనికే యెల్తారో యెమలోకానికే యెల్తారో," అన్నాడు శతృఘ్న ఒక అసహజమైన కీచు గొంతుతో.

    యెంకట్రెడ్డి తీరిగ్గా ఇంకో గోల్డ్‌ఫ్లేక్ వెలిగించి పొగ వొదుల్తూ జగన్ కేసి తేరిపార చూస్తున్నాడు. శతృఘ్న కామెంటుకీ, గార్డు తనకి సెల్యూట్ చెయ్యటానికీ ఏదో సంబంధముందని ఊహించిన జగన్ చురుగ్గా బదులు చెప్పటానికి వెనక్కి తిరిగాడు. యెంకట్రెడ్డి చూపు అతన్ని తీక్షణంగా నిలదీసింది.

    ఖాళీ సిగరెట్ పెట్టెలోకి నుసి రాలుస్తూ యెంకట్రెడ్డి అన్నాడు, "ఏందిరా జగనా, ఆ క్రాపింగేందిరా? మనమెల్లేటిది చెంచు గూడేనిగ్గదా, అంత అర్జెంటుగ క్రాపింగు చేపిచ్చుకోవల్నని యెట్టనిపిచ్చిందిరా నీకు?"

    పొట్టిగా కత్తిరించి ఉన్న తన జుట్టుని తడుముకున్నాడు జగన్. గర్వంతో కూడిన చిరునవ్వు మొహంలో తొంగి చూస్తుంటే అన్నాడు, "నా క్రాపింగు కేమాయె? కొత్త సిన్మాల సల్మాన్ లెక్కనుంది గదా. నాకు తెల్వదు గాని, మీ అడివిలో కెల్లాల్నంటె క్రాపింగు చేపిచ్చుకో కూడదా?"

    "ఏందో, ఇంజనీరింగు చదువుతున్నవ్ గదాని ఎరక్కబోయి నిన్ను రమ్మన్న ఈ ప్రాజెక్టులో జర హెల్పుగుంటవని. నువ్విట్ల బోయి క్రాపింగు చేపిస్త వనుకోలె."

    "ఏందిది, మీరిద్దరు నా క్రాపింగు మీద లొల్లి చెయ్య బట్టిన్రు? ఈ శతృఘ్న గాని లెక్క బట్టబుర్రుంటెగాని చెంచోల్లు మెచ్చరేంది? సర్లె గాని ఒక సిగరెట్టియ్యి."

    జగన్ సిగరెట్ కాల్చుకుంటూ కిటికీ లోంచి చూస్తూ కూర్చున్నాడు. అప్పటికే మన్ననూరు దాటి జిప్సీ కొండెక్కటం మొదలు పెట్టింది. ఘాట్ రోడ్డు మీద ఒక్కొక్క మలుపు తిరిగినప్పుడు ఆవిష్కృతమవుతున్న అడవి అందాలు అతన్ని మరి మాట్లాడకుండా చేసినై. కిటికీకి కళ్ళప్పగించేశాడు.

    కొంత దూరం మెలికలు తిరుగుతున్న ఘాట్ రోడ్డు కొండెక్కినాక బల్లపరుపుగా తిన్నగా ఉంది, అప్పుడప్పుడూ ఏదో ఒక మలుపు తప్ప. రోడ్డుకి రెండు పక్కలా దట్టమైన అడవి.  రోడ్డుకడ్డంగా హడావుడిగా పరుగు తీసే చిన్న జంతువులు, జిప్సీ చప్పుడుకి భయపడి పొదల్లోంచి గగ్గోలుగా ఎగిరిపోయే అడవికోళ్ళు అక్కడక్కడా తారస పడుతున్నై.

     ఒక వింత గమనించాడు జగన్. పహరా నిలబడ్డ జవాన్లలాగా రోడ్డు వెంబడి బారులు తీరి వున్న కరంటు స్తంభాలు కొండ కింద ఉన్నట్టుగా కొండ పైన లేవు. అసలు కొండెక్కాక రోడ్డు పక్క ఒక్క కరంటు స్తంభం కూడా చూసిన గుర్తు రాలేదతనికి.

    "బాబయ్యా, కొండ కింద దాక కరంటు లైను రోడ్డు సైడెంబడె వస్తుండె గదా, కొండపైన అవుపిస్తలేదేంది?"

    అక్కడక్కడా చెట్ల మధ్య డొంకదార్లు కనిపించినై. అవెక్కడి కెళ్తాయని జగన్ అడిగితే అవి చెంచులు ఉపయోగించే అడ్డతోవలని చెప్పాడు యెంకట్రెడ్డి.

     "కలప స్మగ్లర్లు కూడ వాడుతుంటరు," అని కలగ జేసుకున్నాడు శతృఘ్న.

    "స్మగ్లర్లా? అంటె మీసాల ఈరప్పన్ లెక్కనా?"

    "ఈ బాడకోవులకంత సీనేం లేదులే .. ఈ ఏరియాల ఒక సైడుకి నక్సలైట్ స్క్వాడ్లు జేరుతున్నరు. అటు సైడుకి పోలీసు కూంబింగులు. ఈ రెండు సైడ్ల మద్దెన ..  రెణ్ణెల్లయిందా, నాయుడి మీద ఎటాకయ్యి? ఇంక రిజర్వు పోలీసు బెటాలియన్ బెటాలియన్లుగ దిగుతా ఉంది అడివిల. థూ దీనెమ్మ, స్మగ్లర్లేంది, ఫారెస్టోల్లె మెయిన్రోడ్డు దిగి అదివి లోపటి కెల్లల్నంటె జడుస్తున్రు." అన్నాడు శతృఘ్న.

    ఈ సారి అతని గొంతులో ఎవరిమీదో తెలియని కసి వినిపించింది జగన్‌కి.

* * *

    జిప్సీ ఒక రెండంతస్థుల బిల్డింగు ముందు ఆగింది. అడవిలో ఇంత లోపల ఈ కాంక్రీటు బిల్డింగెలా కట్టారబ్బా అని ఆశ్చర్య పోయాడు జగన్. అది గిరిజనాభివృద్ధి శాఖ వారు కట్టించిన స్కూలు మరియు హాస్టలు బిల్డింగని యెంకట్రెడ్డి చెప్పాడు. అది చూడ్డానికి స్కూల్లాగానే ఉంది కానీ ఎక్కడా అలికిడి లేదు, మనిషి జాడ లేదు.

    ఆ బిల్డింగు చుట్టూ సుమారు పదెకరాల ఖాళీ స్థలం. అక్కడక్కడా ఎండిపోయిన తుప్పలు తప్ప ఆ స్థలంలో మరో పచ్చటి మొక్క గానీ చెట్టు గానీ లేదు. ఖాళీ స్థలానికి అవతల రెండు పరస్పరం లంబంగా ఉన్న వరసల్లో చిన్నచిన్న సిమెంటు ఇళ్ళు. జగన్ మొత్తం పద్ధెనిమిది లెక్క బెట్టాడు. ఒక్కొక్క ఇంట్లో రెండేసి గదులు - అంటే రెండేసి కుటుంబాలు అని చెప్పాడు యెంకట్రెడ్డి. ఆ సిమెంటు ఇళ్ళూ, ఈ కాంక్రీటు బిల్డింగూ పెద్దపులుల అభయారణ్యంలో ఆక్రమణదారుల్లాగా అసహజంగా ఉన్నయ్యి.

    యెంకట్రెడ్డి, శతృఘ్న వర్కర్లతో ట్రక్కులో నించి ప్రాజెక్టు సామాను దింపిస్తున్నారు. చేసే పని లేక ఎవరన్నా కనిపిస్తారేమోనని జగన్ ఒక వరస ఇళ్ళ వేపుకి నడిచాడు. అతనికి చెంచుల్ని చూడాలని కుతూహలంగా ఉంది.

     ఇళ్ళు ఇంకా యాభై గజాల దూరంలో ఉండగా రెండు ఇళ్ళ మధ్య ఖాళీ జాగా గుండా ఇద్దరు యువకులు బయటికి వచ్చారు. వాళ్ళిద్దరూ నిక్కర్లూ, మాసిపోయిన బనీన్లూ వేసుకుని నల్లగా పొట్టిగా బలంగా ఉన్నారు. జగన్ కి వాళ్ళు తన వయసు వాళ్ళే అయుంటారనిపించింది. చెయ్యూపి పిలుద్దామని అతను అనుకునే లోపల వాళ్ళూ అతన్ని చూడనే చూశారు. క్షణంలో సగం సేపు బొమ్మల్లా స్తంభించి పోయి, మరుక్షణం మెరుపు కొట్టినట్టు వెనక్కి తిరిగి పరిగెత్తి ఆ ఇళ్ళ వెనక మాయమయ్యారు. జగన్ ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూశాడు, తన వెనక ఏమీ లేదు వాళ్ళని భయపెట్టేందుకు. ఒక వేళ వాళ్ళు తనని చూసి భయపడ్డారా? ఆ ఆలోచనకి అతనికే నవ్వొచ్చింది. జగన్ ఆ ఇల్ల వరుసని చేరేప్పటికి అక్కడ కూడా మనిషి జాడ లేదు. ఇళ్ళకి అవతల ఇంకో ఇరవై గజాల దూరంలో అడవి మొదలవుతోంది. ఇందాకటి యువకులిద్దరూ ఏమయ్యారో కనబళ్ళేదు.

    జగన్ దగ్గర్లో ఉన్న ఇళ్ళని తనిఖీ చేశాడు. ఇళ్ళ ముందూ చుట్టూతా మెత్తటి బూడిద రంగు మట్టి. జగన్ అడుగుల వడికి అలలుగా దుమ్ము రేగుతోంది. జగన్ వేసుకున్న తెల్లటి టెన్నిస్ బూట్లు అప్పటికే బూడిద రంగుకి తిరిగాయి. కొన్ని ఇళ్ళకి అసలు తలుపులే లేవు. ఉన్నవి కూడా తీసే ఉన్నయ్యి మనుషులు లేకపోయినా. లోపలికి తొంగి చూస్తే కింద నేల గచ్చు చేసి లేదు - మట్టీ బండలూ. లోపలి గోడలు సిమెంటు పూతైనా లేక ఇటుకలు కనిపిస్తూ బోసిగా ఉన్నయ్యి. ఒక మూల మూడు రాళ్ళ పొయ్యి, కొన్ని సత్తు గిన్నెలు, దాని పక్కన గోడలు నల్లగా పొగచూరి ఉన్నయ్యి. కొంచెం తేడాగా అతను చూసిన నాలుగిళ్ళూ అలాగే ఉన్నై.

     బోరు కొట్టి జగన్ జిప్సీ దగ్గరికి తిరిగొచ్చేశాడు. యెంకట్రెడ్డి సామాను బాధ్యత శతృఘ్నకి అప్పగించి, జగన్ చెయ్యి పట్టుకుని రెండో వరస ఇళ్ళ వేపుకి దారి తీశాడు.

    వాళ్ళు ఆ వరస మలుపు తిరిగేటప్పటికి ఒక ఇంటి ముందు జనం గుంపుగా కనపడ్డారు. పిల్లలూ పెద్దలూ కలిసి ఇరవై మంది దాకా ఉంటారు. స్త్రీలూ, పిల్లలూ, వయసు మళ్ళిన మగవాళ్ళు తప్ప జగన్కి వయసు కుర్రాళ్ళు ఎవరూ కనబడలేదు. వీళ్ళేనా చెంచులు అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు జగన్ వాళ్ళని.  ఆడవాళ్ళు చవకరకం చీరలు కట్టుకుని, మగవాళ్ళు నిక్కరో, లేక మోకాళ్ళ కిందకి దిగని చిన్న పంచె కట్టుకుని - ఎక్కడా సినిమాల్లో చూపించే ఆదివాసుల్లాగా పూసల పేర్లూ, జుట్టులో ఈకలూ, మొహాలకి రంగులూ ఏవీ లేవు - మామూలుగానే ఉన్నారు.

    గుంపుని సమీపించినప్పుడు - అప్పుడు కనిపించింది తేడా. వాళ్ళు నిజంగా మామూలు మనుషుల్లా లేరు. ఎండకి ఎండి కమిలిపోయినట్టున్న నల్లటి వొళ్ళు, బుజాల దగ్గిరా మోచేతుల దగ్గిరా ఎముకలు పొడుచుకొస్తూ - అందరికీ కాళ్ళ నిండా, పిల్లలకైతే వొంటి నిండా అదే బూడిద రంగు దుమ్ము - పుర్రె మీద చర్మాన్ని బిగదీసి తొడిగినట్టు ఏ మాత్రం మాంస పుష్టిలేని మొహాలు - ఆ మొహాల్లో దైన్యం. తన వూళ్ళోనే కరువునీ పేదరికాన్నీ చూశాడు జగన్, అవి తనని ఎప్పుడూ అంటక పోయినా, కానీ ఇలాంటి దైన్యాన్ని ఎప్పుడూ చూళ్ళేదు. అందరూ ఇంచుమించు ఒకేలా ఉన్నారు. బాగా చిన్న పిల్లలు మాత్రం పత్తికాయల్లా మెరుస్తున్న కళ్ళతో ఈ కొత్త మనుషుల్ని ఆసక్తిగా చూస్తున్నారు.

    ఆ గుంపు లోనించి సుమారు పాతికేళ్ళ యువతి ఒకామె గబగబా ముందుకొచ్చి యెంకట్రెడ్డిని ఆప్యాయంగా పలకరించింది.

    "ఏందే యెంకటన్నా. ఇంత పొద్దెక్కినంక కూడ మీరు రాకుంటె ఇక ఈ దినం వస్తలేరేమో అనుకున్నం!"

    "వస్తమని చెప్పినంక రాకుంటెట్ల, ఈదమ్మా. ఏంది అంత బాగేనా?"

    ఆమె యెంకట్రెడ్డి చెయ్యి పట్టుకుని గుంపు దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంకొందరు పెద్దవాళ్ళు యెంకట్రెడ్డిని పలకరించారు.

    కొందరు జగన్ని యెగాదిగా చూస్తున్నారు. ఉన్నట్టుండి ఒక నడివయసతను జగన్ కేసి తల వూపుతూ యెంకట్రెడ్డి నడిగాడు.

    "ఈ సారెవ్వరు?"

     "మా పోరడే. మాయన్న కొడుకు."

     "అట్టనా? సార్ని జూసి పోలీసాయనేమో అనుకున్న. సారు కండలయి జూస్తె మరట్లనె అవుపిస్తున్నడు."

    చెంచతను ఏదో జోక్ చేసినట్టు యెంకట్రెడ్డి విరగబడి నవ్వాడు.

     "సర్లె గాని, పెదమల్లయ్య ఔపిస్తలేడేంది? మంచిగున్నడా?" అనడిగాడు యెంకట్రెడ్డి.

    "ఆ, మంచిగనె ఉన్నడు. పూజ చేస్తున్నడు. యింకొక గంటైతదేమొ. నువ్వచ్చినవని పిల్సకచ్చేదాన్న?" అంది ఈదమ్మ.

    "వొద్దొద్దు. పూజ కానియ్యిలె. మేం పని మొదలు పెట్టాల. చీకటయ్యె లోపట్నె పని పూర్తై పోవాల కదా!" అని జగన్ వేపు తిరిగి అన్నాడు.

    "జగనా, ట్రక్కు కాణ్ణించి ఇండ్ల సెటప్పులన్ని ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సెట్టు చేర్పించాల. తక్కిన సామాను ఈ మర్రిచెట్టు కిందకి తెస్తే ఏదో కొంచెం నీడలో పని జేసుకోవచ్చు. నువ్వెల్లి శతృఘ్నతో కల్సి అరేంజిమెంట్ చూడు. హబ్బ, చైత్రం రాకపోయినా అప్పుడె యెండ మండుతాంది," అంటూ కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు.

* * *

    జగన్, శతృఘ్న ఇళ్ళకి సెట్ల పంపిణీ పూర్తి చేసి వచ్చేటప్పటికి మర్రిచెట్టు దగ్గిర పని జోరుగా సాగుతోంది. టెక్నీషియన్లు అరుగు పక్కన నీడలో పెద్ద సెట్లని ఎసెంబుల్ చెయ్యటంలో నిమగ్నమై ఉన్నారు. యెంకట్రెడ్డి, జిప్సీ డ్రైవరు అరుగు మీద కూర్చుని పెద్ద వైర్ల చుట్టల్లోనించి వైర్లని సరైన పొడుగు కొలిచి కత్తిరించే పని చేస్తున్నారు. విచిత్రంగా కనపడుతున్న నడివయసు మనిషి ఒకతను యెంకట్రెడ్డి పక్కన చెట్టు మొదలుకి చేరబడి కూర్చుని మాట్లాడుతున్నాడు.

    


    "అతనే పెదమల్లయ్య. ఈ గూడేనికి పెద్ద," అని జగన్ చెవిలో ఊదాడు శతృఘ్న.


    ఆ మనిషి ఆకారమూ బట్టలూ మిగిలిన చెంచుల్లాగే ఉన్నాయి కానీ మొహం విలక్షణంగా వుంది. వయసు అరవై పైనే. నెరిసిన జుట్టూ, గడ్డమూ బాగా పొడుగ్గా పెంచాడు. జుట్టుని నడినెత్తిన సిగ చుట్టాడు. నుదుటి మీద వెడల్పుగా విబూది రేకల మధ్యలో పెద్ద కుంకుమ బొట్టు. మనిషి కూచున్న తీరులో ఒక రాజసం. ఆకుపచ్చ ఆకులో చుట్టివున్న చుట్టని పంట నొక్కి పెట్టి గుప్పుగుప్పున పొగ వొదుల్తున్నాడు.


    యెంకట్రెడ్డి జగన్ని అతనికి పరిచయం చేశాడు. శతృఘ్న, జగన్ కూడా వైర్లు కత్తిరించే పనిలో చేరారు. పెదమల్లయ్య తన సంభాషణని కొనసాగించాడు, నోట్లో చుట్ట తియ్యకుండానే.


    "అప్పుడైతే రాజయ్య సారు ఆపీసరుండె దినాల్లొ, ఆయనొచ్చి మమ్మల్ని చూస్తాండె, ఇంక చిన్న ఆపీసర్లు గూడ వచ్చి చూస్తాండిరి, మంచి చెడ్డ అడుగుతాండిరి. ఆయనెల్లిపాయె, ఇంక మా మొగం చూసెటోడు లేడు. ఈ కోపరేటోల్లు (కో ఆపరేటీ వాళ్ళు) ఎప్పుడొస్తరో ఎందుకెల్తరో తెల్వదు. ఏరుకొచ్చిన గోందు (గం), కాయ గడ్డలన్ని .. ఎంత కాలమని దాచాలె. ఇస్కూల్ల ఆల్లకొక గది .."


    యెంకట్రెడ్డి అతని మాట కడ్డమొచ్చి అడిగాడు.

    "సరెగాని మల్లయ్యా, ఇస్కూల్ల టీచర్లెవ్వరు ఔపడతలేరు, వస్తలేరా ఏంది? అసలుకి ఇద్దరు టీచర్లు ఎప్పుడూ ఇక్కణ్ణె ఉండాలె గద!"


    "అయ్యొ సారు, దినాలట్లున్నయ్యి గద. బతుకుడె కష్టంగుంటె ఇగ ఇస్కూలెవనికి బట్టె? అడివిల ఏమైతాంది నీకు తెల్వద? అడివి అల్లాడి పోతాంది గద. మూల మూల తెల్సిన మాకే అడివిలొ కెల్లల్నంటే బయమైతాంది. ఆడది గాని, మొగోడుగాని అడివిలో కెల్లిన్రంటె మల్ల కల్లబడితేనె బతికున్నట్టు. ఏం జెప్పాలె - ఈ లొల్లి సందు జూసుకుని టీచర్లు రాకున్నరు. ఉన్నోల్లు గూడ ఎల్లిపోయిన్రు. ఆస్టలు పిలగాన్లని అట్లనె వొదిలి రాత్రికి రాత్రి ఎవ్వరికి తెల్వకుండ మాయమైన్రు. మా పొట్టలే నింపలేక మేం సస్తాంటె ఇంక ఆస్టలు పిలగాన్లని గూడ యెట్ల మేపాలె? .."


    పెదమల్లయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. పని జరిగిపోతూ ఉంది.


    టైము పన్నెండు దాటింది. జగన్కి కడుపు కరకరలాడుతోంది. వైర్లు కట్ చేసి చేసి వేళ్ళు నొప్పెడుతున్నాయి. గంట గంటకీ చాయ్ చప్పరించే నాలిక ఉత్త మంచి నీళ్ళతో తృప్తి పడలేక పోతోంది. యెంకట్రెడ్డి పుణ్యమాని గోల్డుఫ్లేకులు పుష్కలంగా ఉన్నై కానీ చాయ్ తోడు లేకుండా రెండు సిగరెట్లు కాల్చేప్పటికి జగన్ గొంతు మండింది.

    వొంటి గంటకి లంచ్ తినడానికి పని ఆపించాడు యెంకట్రెడ్డి.


    రోడ్డు సైడున ఏదో పాకహోటల్లో పొట్లాలు కట్టించి తెచ్చుకున్న పూరీలు అప్పటికే తోలుముక్కల్లా తయారైనై. వాటినే గబగబా మింగారు అందరూ. తీరిగ్గా నమిలి తినే తీరిక ఇవ్వలేదు యెంకట్రెడ్డి. జల్దీ కానియ్యాల అంటూ తొందర పెడుతూనే ఉన్నాడు. పది నిమిషాల్లో మళ్ళీ పనిలో పడ్డారు.

 


    యెంకట్రెడ్డి వాచీ చూసుకుంటూ, "జగనా, వైర్ల కటింగు చాలు గాని నువ్వూ శతృఘ్నా యిండ్లల్ల సెటప్పులు చూడండి. టెక్నీషియన్లకి ఈ పెద్ద ఐటముల్తోనే సరిపోతాంది. ఇట్లయితే చీకటెయ్యే లోపట పని కాదు. జల్ది జల్ది కానియ్యాల," అన్నాడు.

 


    ఒక టెక్నీషియన్ జగన్‌కీ, శతృఘ్నకీ ఒక సెటప్ చేసి చూపించాడు. ఓసింతే గద, చిటికెలో చేసెయ్యొచ్చు. బాబయ్య ఊకె పరెషానైతుండు అనుకున్నాడు జగన్. టెక్నీషియన్ తన తోటి పనివాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు.

    జగన్, శతృఘ్న రెండో ఇంట్లో పని మొదలు పెట్టారు. శతృఘ్న ఒక వైరు తీసి దాని ఒక చివర పోగుల్ని బాటరీ తెర్మినల్సుకి కలిపాడు. జగన్ ఆ వైరుకి రెండో చివర అందుకోబోతుంటే వైరు రెండు పోగులు ఒకదానికొకటి రాసుకుని, చిన్న మెరుపు మెరిసి జగన్ కి షాక్కొట్టింది. ఒక్కసారి గాలిలో కెగిరి, అరుస్తూ వైర్ని దూరంగా విసిరేశాడు.

  


    జగన్ అవస్థ చూసి శతృఘ్న ఆ మట్టి నేలమీదే కూలబడి విరగబడి నవ్వుతున్నాడు. జగన్‌కి రోషమూ కోపమూ బుస్సున పొంగాయి.

 


    "తెలీనోడివి తెలీనట్టుండాల్న, పెద్ద తెలిసినోడి మల్లె ఎందుకు చెయ్యి పెట్టాలె?" అని అరుస్తూ శతృఘ్న మీద కలియ బడటానికి వెళ్ళాడు.

 


    "ఓయబ్బ, పెద్ద ఇంజనీరు బయల్దేరిండు. నా హెల్పు వొద్దనుకుంటె నువ్వె జేసుకో," అంటూ జగన్ పట్టు విడిపించుకుని శతృఘ్న విసురుగా బయటికి వెళ్ళిపోయాడు.

 


    శతృఘ్నని తిట్టుకుంటూ జగన్ ఎదురుగా ఉన్న వస్తువులన్నిటినీ పరిశీలనగా చూశాడు. టెక్నీషియన్ మొదట ఏం చేశాడో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు.


* * *

    నాలుగు సెటప్పులు పూర్తి చేసేప్పటీకి జగన్‌కి నడుము అలసటతో మూలుగుతోంది. అలవాటు లేని పని కావటంతో వైర్ల అంచులు వేళ్ళల్లో గుచ్చుకుని వేళ్ళు సలుపుతున్నయ్యి. జగన్ కి ఒక్క సారిగా నీరసమొచ్చింది. యెంకట్రెడ్డి మీద కోపమొచ్చింది. ఏదో హెల్పు చెయ్యాలనంటె తను చెయ్యగలడు గాని, ఇట్ల పని మొత్తం తన నెత్తిన రుద్దితే .. ఇక నా వల్ల గాదు. ఎల్లి ఒక సిగరెట్ కాల్చుకుని జిప్సీల పోయి పడుకుంటనిక అనుకుని బయటికొచ్చాడు.

    మర్రి చెట్టు దగ్గర ఆరేడుగురు యువకులు నించుని యెంకట్రెడ్డితో మాట్లాడుతున్నారు. ఆ గుంపులో పొద్దున తను చూస్తుండగానే మాయమైన ఇద్దరు యువకుల్నీ జగన్ గుర్తు పట్టాడు. కొత్త మనిషి రావటం యువకులందరి దృష్టీ అతని మీదికి తిరిగింది. యెంకట్రెడ్డి జగన్ రాక గమనించి అతనికేసి చెయ్యి వూపుతూ, "మాయన్న కొడుకు. ఇంజనీరింగు చదువుతుండు. ప్రాజెక్టుకి హెల్పు చేస్తడని మాతో పిల్సుకొచ్చిన," అని జగన్ తో, "ఏరా జగనా, ఎన్ని సెట్లు పూర్తయినై?" అనడిగాడు.

    జగన్‌కి యెంకట్రెడ్డి ప్రశ్న వినబడినట్టు లేదు. శతృఘ్న మీది కంప్లైంట్లు కూడా మర్చిపోయినట్టున్నాడు. చెంచు యువకుల చూపులు అతన్ని ఇబ్బంది పెడుతున్నై. ఆ చూపులు అతన్ని కాలి బూట్ల నించీ తల క్రాపింగు దాకా కొలిచి చూస్తున్నట్లున్నై. గుండె లోతుల్ని తవ్వి అక్కడ దాగిన రహస్యమేదో కనిపెట్టాలని వెతుకుతున్నట్లున్నై. వాడిగా వేడిగా ఉన్నై. జగన్‌కి తన చుట్టూతా గాలి బిగుసుకున్నట్టు అనిపించింది.

    యెంకట్రెడ్డి అదేం పట్టనట్టు, "జగనా, ఇతను చినమల్లయ్య, పెదమల్లయ్య కి చిన్న కొడుకు. ఇదుగో ఈడు మల్లేశ. ఈడు సిరి లింగం .." అంటూ చెంచు యువకులందర్నీ పేరుపేరునా పరిచయం చేశాడు. జగన్‌కి ఏంచెయ్యాలో తెలియలేదు. పలకరింపుగా చిన్న నవ్వుకూడా రాలేదు. వాళ్ళ చూపులు ఇంకా అలాగే దూసిన కత్తుల్లా ఉన్నై.

    ఉన్నట్టుండి చినమల్లయ్య ఒకడుగు ముందుకు వేసి షేక్‌హాండ్ కోసమన్నట్టు కుడిచెయ్యి ముందుకు చాచి గంభీరంగా, "గుడ్ మార్నింగు సారు," అన్నాడు. జగన్ అప్రయత్నంగా అతనితో చెయ్యి కలిపాడు. ఆ కుర్రాడి చెయ్యి ఉక్కులా వుంది.

    జగన్ యెంకట్రెడ్డి దగ్గిర సిగరెట్ తీసుకుని ముట్టించుకుంటుంటే చెయ్యి వొణికింది.

    చిన మల్లయ్య యెంకట్రెడ్డి వేపు తిరిగి మాటలు కొనసాగించాడు. 

    "మీరొచ్చేది తెల్సింది గానైతె, కొత్త జీబు తెచ్చిన్రు. ఆ జీబులున్నది మీరేనని మాకెట్ల తెలియాలె? మా జాగర్తల మేముండాలె గద సారు. పెద్ద బెటాలియన్లుగ దిగిన్రు అడివంత. అడివిల ఎటు తిరిగి చూసిన వాల్లె. మొన్న మొన్ననె అడివిల గోందేరుకుంటాంటె ఈ లింగన్ని ఎత్క పోయిన్లు, ఏడ కెత్క పోయిన్లొ తెల్వదు. రాత్రి గూడేనికి తిరిగి రాకుంటె ఇగ వాని పెండ్లాము ఏడుపు. చీకట్ల ఎక్కడని ఎతకాలె. మర్రోజు సాయంత్రం వొల్లంత తట్లు దేలి కొస పానంతొని గూడెం చేరిండు. ఇగొ ఇప్పుడిప్పుడె మల్ల నడుస్తుండు. ఏదో స్క్వాడు గూడెం దిక్కొచ్చిందని ఆల్లకి ఇంపరమేసనంట - ఈన్ని తీస్కెల్లి బొక్క లిరగ బొడిసిన్రు. చెంచోడంటె అందరికి లోకువే గద. ఐన మమ్మల్ని ఇరగ బొడవల్నంటె ఆల్లకి కారణం గూడెందుకు? అడివంత కాల్సక తింటన్నరు, ఐన గాని ఆల్లకి చాలదు." అని కాండ్రించి దుమ్ములోకి ఊశాడు.

    యెంకట్రెడ్డి సానుభూతిగా తల వూయించాడు. ఆ కుర్రాడు కొనసాగించాడు. "అచ్చిన బండ్లు మియ్యేనని తెల్వగానె తిరిగొస్త మనుకున్నం. ఇంతట్లొ ఈ సాంబయ్య ఈదయ్య ఉర్కెత్తుకొచ్చి గూడెంల పోలీసులొచ్చిన్లని చెప్పిన్రు," అని జగన్ వేపు చూశాడు. పొద్దున తనని చూసి ఉడాయించిన సాంబయ్య ఈదయ్యలు కూడా తన వేపే చూస్తున్నారు. ఆ చూపులు నిలదీస్తున్నై.

    జగన్ ఇక భరించలేక అక్కణ్ణించి కదిలి జిప్సీ వేపుకి వెళ్ళాడు.

    పది నిమిషాల తరవాత జగన్ తిరిగి వచ్చేప్పటికి యెంకట్రెడ్డి ఆ కుర్రాళ్ళకి ప్రాజెక్టు గురించి చెబుతున్నాడు.

    " .. ఇంటున్నరా? నెల కొక్క సారైన ఈ బాట్రీలు చెక్ చేసుకోవాల. ఏదన్న బల్బు పాడైతె మండలాపీసులొ చెబితె కొత్త దిస్తరు. కొన్ని బల్బులు స్పేరు మీకే ఇచ్చి పోతం. ఈ గాజు పలకల్ని దుమ్ము గిమ్ము పడకుండ సుబ్రం గుంచు కోవాల, ఏంది?"

    "ఎందుకు చెయ్యం సారు? మా కోసం గద మీరింత కస్టం జేసి యియన్ని తెచ్చిన్రు. మంచిగ చూస్కుంటం. మల్లొచ్చినప్పుడు నువ్వె చూస్తవ్ గద. మరైతె రాత్రి కుంటరు గద, రెండు కోళ్ళు కోయిచ్చి .."

    అతనింకేదో అనబోతుంటే యెంకట్రెడ్డి అడ్డుపడ్డాడు.

    "వొద్దొద్దు. ఈ సాయంత్రానికి పని పూర్తై పోవాల. రాత్రికి తిరిగి మన్ననూరు చేరుకోవాల. నేనొక్కణ్ణైతె ఉండిపోత గాని, వర్కర్లు ఈల్లందరు .. మేం పని పూర్తి జేస్కొని ఎల్లిపోతేనె మంచిది."

    చినమల్లయ్య అర్థమైనట్టు గంభీరంగా తల వూపాడు. మళ్ళీ ఎందుకో జగన్ వేపు చూశాడు.

    యెంకట్రెడ్డి అన్నాడు, "ఏందిరా జగనా, ఎందాకొచ్చింది ఇండ్లల్ల సెటప్పు? ఏం మల్లయ్యా, మీ పోరగాల్లు గూడ ఒక చెయ్యేస్తే .. జగనా, ఈల్లగ్గూడా సెటప్పు జూపించు. పని జల్ది పూర్తి కావాల, చీకటయ్యిందంటె .."

    అప్పటికే నాలుగైంది.

* * *

    యువకులంతా చాలా ఉత్సాహంగా పని చేశారు. చదువు రాని ఈ చెంచు యువకులు అంత తొందరగా నేర్చుకుని చకచకా పని చెయ్యటం జగన్‌కి చాలా ఆశ్చర్యం కలిగించింది. అయినా పని పూర్తయ్యే సరికి ఏడయింది. బాగా చీకటి పడింది.

    టార్చి లైటు కాంతిలో చివరి సెటప్పు పూర్తి చేసి బయటికొచ్చిన జగన్ చుట్టూతా గూడెంలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి నమ్మలేక బొమ్మై పోయాడు. టెక్నీషియన్లు బిగించిన నాలుగు వీధి దీపాలు అప్పటికే సూర్య కాంతిని బేటరీల్లో పూర్తిగా నింపుకుని దేదీప్య మానంగా వెలుగుతున్నయ్యి. తను మొదట సెటప్ చేసిన ఇళ్ళలో కూడా ఫ్లోరసెంటు లాంపులు వెలుగుతున్నయ్యి. ఒక ఇంట్లోకి తొంగి చూశాడు. కొత్త సోలార్ కరంటు దీపం వెలుతురులో ఈదమ్మ వంట ప్రయత్నాలు చేస్తోంది. పొద్దునే ఆ ఇల్లు చూసి తను అసహ్యించుకున్న సంగతి జగన్‌కి గుర్తు రాలేదు. అతనికి ఆ దృశ్యం ఎంతో అందంగానూ అద్భుతంగానూ కనబడుతోందిప్పుడు.

* * *

    సామాను దింపిన ట్రక్కు అప్పుడే తిరిగి వెళ్ళిపోయింది. వచ్చేప్పుడు దాన్లో వచ్చిన టెక్నీషియన్లు కూడా ఇప్పుడు జిప్సీ ఎక్కాల్సి వచ్చింది. అందరూ ఇరుక్కుని సర్దుకు కూర్చున్నారు. బండల మీద బండి పొయ్యేప్పుడు ఎవ్వరూ బంతుల్లాగ ఎగిరి పడక్కర్లేదని శతృఘ్న జోక్ చేశాడు. పని సక్రమంగా పూర్తయిందన్న ఉత్సాహంతో అందరూ గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ మాత్రం ఆ చీకటిలో ఆ ఎగుడు దిగుడు దారిమీద జిప్సీని జాగ్రత్తగా నడిపించటంలో నిమగ్నమై ఉన్నాడు.

    జిప్సీలో తన చుట్టూ మాటలు సాగుతూ ఉన్నా జగన్ తన ఆలోచనల్లో నిశ్శబ్దంగా ఉండి పోయాడు. దూరంగా మసక వెన్నెల్లో కనపడీ కనపడనట్టుగా ఉన్న కొండ శిఖరాల మీద .. ఏదో వెలుగు. తన తోటి వాళ్ళెవరూ చూసినట్టు లేదు. డ్రైవరు కళ్ళు రోడ్డుని అంటిపెట్టుకునే ఉన్నయ్యి. జిప్సీలో మిగతా వాళ్ళు కబుర్లలో లీనమై ఉన్నారు.

    ఆ కొండ చరియల మీద దీపాలు .. వరుసలుగా .. వెలుగు మాలికల్లాగా ..

    జగన్ మంత్ర ముగ్ధుడిలా ఆ వెలుగు చారికల్నే చూస్తున్నాడు.

    కాదు, కాంతి నింపే దీపాలు కాదు. కాల్చేసే మంటలవి.

    సజీవంగా ఉన్నట్టు మెలి తిరుగుతూ, పాముల్లాగా వ్యాపిస్తూ, అడవిని ఆక్రమిస్తూ, జీవాన్ని కబళిస్తూ .. మనుషులు రగిల్చిన మంటలు.

    అడవి కాలిపోతోంది.

    ఆ రోజంతా తను చూసిన విన్న అనుభవించిన విషయాల సారమేదో ఆ మంటల్లో కాలి పోతున్నట్టు తోచింది జగన్‌కి. ఎందుకో చిన మల్లయ్య గుర్తొచ్చాడు. జగన్ వెన్నులో ఏదో తెలియని జలదరింపు .. ఒక అనుమానం .. ఒక భయం.

    మన్ననూరు చేరేదాకా అతను మాట్లాడలేదు. శతృఘ్న వెక్కిరింపులకి కూడా జవాబివ్వలేదు.

    ఫారెస్టు బంగ్లా వరండాలో రాత్రికి పడుకుని తెల్లారే లేచి హైదరాబాదు బయల్దేరాలని యెంకట్రెడ్డి అందరికీ చెబుతున్నాడు. జగన్ మెల్లగా అతని పక్కన చేరాడు.

    "బాబయ్యా, నేనిక్కణ్ణించి శ్రీశైలమెళ్ళి రేపు రాత్రికి ఇంటికొస్తా."

    యెంకట్రెడ్డి జగన్ కేసి పరీక్షగా చూశాడు. జగన్ మొహం తిప్పేసుకుని అవతలి కెళ్ళిపోయాడు.

* * *

    మర్నాడు సాయంత్రం భోజనాల టైముకి ఇల్లు చేరిన జగన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు యెంకట్రెడ్డి.

    "ఏందట్ల చూస్తున్నవ్? నువ్వూ, ఆ శతృఘ్న గాడు నిన్న ఓ ఒర్లిన్రుగా నా క్రాపింగు గురించి. శ్రీశైల మెల్లొచ్చిన. బాగుండ్లా?" అన్నాడు జగన్ నున్నటి గుండుని నిమురుకుంటూ.

    యెంకట్రెడ్డి అర్థమైనట్టు చిన్నగా నవ్వి జగన్ భుజం తట్టాడు.

(తానా 2005 సావినీరులో ప్రచురితం)
Comments