కీడు జరుగుతుందా? - రేగులపాటి విజయలక్ష్మి

    అది డిసెంబర్ నెల. చలి ఎక్కువగా ఉన్నది. ఉపాధ్యాయులు తమ కోరికలు నెరేరడానికి ధర్నా మొదలు పెడతామని అన్నారు. అది గమనించిన ప్రభుత్వం వారు ఉమ్మడి సెలవులు ప్రకటించారు. ఉపాధ్యాయులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. సుధిర్ కూడా తన భార్య సుచరితని, కూతురు సుహాసినిని తోలుకుని తన సొంత ఊరు అయిన కొండాపూర్‌కు చేరుకున్నాడు.
 
    మసూర వేసిన పొలం కోతకు వచ్చినది. సుధీర్ వరి కొయ్యడానికి కొడవలి తీసుకుని పొలము వెళ్ళాడు. సుధీర్ తమ్ముడు సురేష్ ఎం.ఎస్.సి చదివాడు. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని కరీంనగర్ వెళ్ళాడు. సుధీర్ తల్లి సుందరమ్మ పక్క ఊరిలో బారసాలకు వెళ్ళింది. సుధీర్ తండ్రి సుందరయ్య స్నానం చేసి తిరుమణి పెట్టె తెరచి బొట్టు పెట్టుకున్నాడు. మామగారు బొట్టు పెట్టుకోగానే భోజనం చేస్తారని తెలిసిన కోడలు సుచరిత టేబుల్‌పైన అన్నం కూరలు పెట్టి పళ్లెంలో అన్నం కూరలు వడ్డించింది. మంచినీళ్ళు టేబుల్‌పై పెట్టి మామగారిని భోజనానికి పిలిచింది. సుందరయ్య భోజనం చేసాడు. చేయి కడుక్కోవడానికి కుర్చీలో నుండి లేవబోయాడు. కాని లేవస్తలేదు. సుచరిత సుమతి ఇద్దరూ చెరొక దిక్కుపట్టుకుని చేయి మూతి కడిగారు. మంచం మీద పడుకోబెట్టారు.
 
    సుధీర్‌కు చెప్పడానికి పక్కింటి పిల్లవాణ్ణి తోలించారు. పొలం నుండి ఇంటికి వచ్చాడు. తండ్రి మంచంలో పడుకొని ఉన్నాడు. లేవస్తలేదు. దగ్గరికి పోయి బాపు...బాపు... అని పిలిచాడు. కళ్ళు తెరిచి చూచాడు. మాట తపతపపోతున్నది. ఆర్.ఎం.పి డాక్టర్ శ్రీనివాస్‌ను పిలుచుకువచ్చాడు. శ్రీనివాస్ ఆ వూరి వారందరికి వైద్యం చేస్తుంటాడు. చాలా వరకు ఆరోగ్యవంతులవుతారు. 
 
    డా.శ్రీనివాస్ సుందరయ్యను పరీక్ష చేసి ఎటైనా పెద్దాసుపత్రికి తీసుకుపోండ్రి అని చెప్పాడు. ఆ సాయంత్రం ఎటూ పోలేమని తెల్లవారేదాకా ఓపిక పట్టారు. ఎల్లారెడ్డి పేటకు పోయి జీపు మాట్లాడుకుని తీసుకువచ్చాడు సుధీర్. 
 
    కోడళ్ళు ఇద్దరూ ఇంటిదగ్గర ఉన్నారు. సుధీర్ తల్లిని, అక్కను తోలుకుని తండ్రిని కరీంనగర్ తోలుకుపోయాడు. ఆ రోజు ఆదివారం. రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్‌లు లేరు.
చేసేదిలేక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసినారు. సకాలంలో సరైన వైద్యం అందలేదో లేక ఆయుష్షు తీరినదో కాని తెల్లవారి 10 గంటలకు సుందరయ్య ప్రాణం పోయింది. ఇంటికి తీసుకువచ్చినారు. 
 
    ఇరువైఏడు సంవత్సరాల క్రితము ఫోన్‌లు అందుబాటులో లేవు. చావు కబురు అందాలంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి మనిషి పోయి చెప్పవలసినదే. అన్ని ఊర్లకు మనౌషులను తోలించినారు. బంధువులంతా చేరుకున్నారు. రాత్రివరకు దహనము జరిగినది.
   
    పదవరోజు బూడిద ఎత్తి పోయాలి. బ్రాహ్మణున్ని పిలవాలి అన్నారు పెద్దలు, కుటుంబ సభ్యులు. "అన్నము వండి పిట్టలకు పెట్టుదాము కాని బ్రాహ్మణుల్ని పిలవద్దు. బ్రాహ్మణుడు మంత్రాలు చదువక పోతే ఏమీ కాదు. పిండము పెట్టుడు అవసరం లేదు. తండ్రి ఫోటో పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ చేద్దాము. బంధు మిత్రులందరికీ భోజనాలుపెట్టుదాము" అన్నాడు.

    "ఇంతవరకు మన ఇండ్లల్ల ఇట్ల ఎవరు చేయలేదు. అందరోలె మనము చేసుకోవాలే" అంది అక్క సుమ. చెల్లెలు సుధ, తమ్ముడు ఏమీ మాట్లాడలేదు.

    "ఒక మార్పు అనేది వచ్చినప్పుడు సంఘరషణ అనేది ఉంటుంది. కొందరు ఒప్పుకుంటారు కొందరు వ్యతిరేకిస్తారు. రాజారామ్‌మోహన్‌రాయ్‌గారు సతీసహగమనము ఆపలేదా? అప్పుడు చాలామంది వ్యతిరేకించారు. తరువాత అలా చేస్తే ఏమీ కాదని తెలుసుకున్నారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువివాహాలు చేయించలేదా? ఈ మొగుడు చచ్చినదానికి మళ్ళీ పెళ్ళిచేస్తారా? అని అప్పటివాళ్ళు ముక్కుమీద వేలేసుకున్నారు. కాని తరువాత అలవాటై పోయినది" అన్నాడు సుధీర్.

    "ఏదైనా మొదట చేసినప్పుడు వింతగా మాట్లాడుకుంటారు. తరువాత వాళ్ళూ మారుతారు. మీరంతా కాదు అంటే నేనేమీ చేయలేను.బ్రాహ్మణున్ని పిలువక పోవడం వలన ఏమీ జరుగదు. పిండం పెట్టకపోతే పుణ్యలోకాలు లభించవు అనేది అపోహ. మన సత్‌ప్రవర్తనే స్వర్గము మన దుష్‌ప్రవర్తనే నరకము" అన్నాడు సుధీర్. ఏ విషయమైనా ఆవేశపడకుండా మెల్లని ధోరణిలో అందరిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. "ఏమంటవు అక్కా?" అని ప్రశ్నించాడు.

    "అందరూ ఏమనుకుంటారు" అని అంది సుమ. మళ్ళీ తనే "నీ ఇష్టము" అంది. ఎవరికి ఇలా చేయడం ఇష్టము లేకపోయినా వద్దు అని వ్యతిరేకించలేదు.

    పదవరోజు పాలివాళ్ళు, దగ్గరి బంధువులు వచ్చినారు. బూడిద ఎత్తిపోసినారు. అన్నం వండి కాకులకు, పక్షులకు పెట్టినారు. మటన్ భోజనాలతో అందరిని తృప్తి పరిచినారు. ధర్మపురి గంగలో బొక్కలు కలిపి వచ్చినారు.

    పన్నెండవ రోజు ఊరందరిని పిలిచినారు. తండ్రి ఫోటో కుర్చీలో పెట్టి అగరొత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టినాడు. సుధీర్ తన తండ్రి గూర్చి తాను వ్రాసిన కవిత చదివినాడు. ఆ కవిత ప్రింట్ కాపీలు వచ్చిన వాళ్లందరికీ మనిషికొకటి ఇచ్చినాడు. 

    తల్లి బొట్టు, గాజులు, పుస్తె, మెట్టెలు చాకలి వాళ్ళు పదకొండవరోజు రాత్రి తల్లిని బయటకు తోలుకుపోయి తీసినారు. ఇది కూడా అనాచారమే. కాని అలా చేస్తారిన్ సుధీర్‌కు తెలియదు. ఆ తతంగం జరిగిన తరువాత సుధీర్‌కు అనిపించినది 'ఎక్కడికో తోలుకుపోయి అలంకరణలు తీసి వేయడమేమిటి? తన తల్లికి ఇష్టం లేకపోతే ఆమే తీసివేస్తుంది. లేకుంటే ఉంచుకుంటుంది. ఇది ఏమి ఆచారము మనిషిని హింసించడము తప్ప' ఇలా సాగిపోతున్నాయి ఆలోచనలు.
 
    "బ్రాహ్మణుడ్ని పిలిస్తే అతడే అమ్మకు తీర్థము పెడుతుంటే వద్దన్నారు కదా? మీరిద్దరు పోయి అమ్మకు తీర్థము పెట్టుండ్రి. మీరే ముందుగా చూడుండ్రి" అంది కొంచెము పెడసరంగా ఆడపడుచు సుమ. 
      
    ఇలా చేయడం వలన ఏమీ కాదు అని సుధీర్ భార్య సుచరితకూ తెలుసు. 'భర్త ఒక మార్పు తేవాలనుకున్నప్పుడు తాను కూడా సహకరించాలి. తానే ముందుపోయి చూడక పోతే వేరేవాళ్ళు ఎవరు చుస్తారు' అనుకుంది సుచరిత. తీర్థము గిన్నె పట్టుకుని సుందరమ్మ ఉన్న గదికి వెళ్ళినారు.
 
    పాపము సుందరమ్మ చేతులు వణుకుచున్నాయి. కొడుకుకు ఏమయినా అయితదేమో ననే భయము ఆమెను వణికిస్తున్నది. పోయినవాడు ఎలాగూ పోయిండు. ఉన్నవాళ్ళు మంచి గుండాలె అని అనుకుంటుంది సుందరమ్మ.
 
    "అమ్మా!" అని పిలిచినాడు సుధీర్. తీర్థము చేతిలోపోసినాడు. ఆమె అది తాగి బావురు మని ఏడ్చినది. సుచరిత అత్త దగ్గర కూర్చున్నది. తరువాత బంధువులందరు ఆమె దగ్గరికి వచ్చినారు. ముందుగా వాళ్లు చూస్తే వాళ్ళ పసుపు కుంకుమలు ఏమయితాయో అనే అనుమానం వారికి. అందరు కూడబలుక్కుని సుచరితను లోపలికి తోలినారు.
 
    తనకేమి చెడు జరుగదు అనే ధృఢ నమ్మకముతో భర్తను తోలుకుని అత్త దగ్గరి వెళ్లినది. బయట ఏమి మాట్లాడుకున్నారో గాని, సుధీర్ ముందర మాత్రం ఎవరు ఏమి అనలేదు. తాను అనుకున్న పద్ధతిలో కర్మకాండ జరిగినది.

    నెలమాసికము రోజున కూడా పాలి వారిని, బంధువులను పిలిచి భోజనాలు ఏర్పాటు చేసినారు. తండ్రి పటము పెట్టి పూజ చేసినారు.

    తండ్రి ఉన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగే సురేష్ తండ్రి పోయిన తరువాత ఇంటి బాధ్యత పట్టించుకున్నాడు. వ్యవసాయము చూసుకుంటున్నాడు. ఆ సంవత్సరము వేసంగి మక్క వేసినారు. మక్క కంకులు విరిపించి ఇంటి వెనుక కల్లము చేసి ఎండబోసినారు. కానికి కావలి పడుకోవాలి? చిన్న కొడుకు కావలి పడుకుంటే ఒక్కడు భయపడతాడని సుందరమ్మ కూడా తోడు పడుకునేది. 

    సంవత్సరీకము కూడ సుధీర్ అనుకున్న పద్ధతిలోనే జరిగినది. బంధువులకు బట్టలు పెట్టారు. ఎవరికి ఏ కీడు జరుగలేదు. సురేష్ భార్య నెల తప్పినది. అది శుభసూచకము.

    సురేష్ తన చదువుకు తగిన ఉద్యోగము దొరుకక పోయేసరికి విసిగి వేసారి డ్రైవింగ్ నేర్చుకొని ఆర్టీసీ డ్రైవరుగా సెలెక్టు అయినాడు.
    ఇద్దరు పాలేర్లను పెట్టి వ్యవసాయం నడిపిస్తున్నారు. వారానికొకసారి ఇంటికి వచ్చేవారు సుధీర్ సురేష్‌లు.వ్యవసాయానికి కావలసినవి కొనిచ్చేవారు. పొలముకు మందు వేయించేవారు. కోతలప్పుడు ఇంటికి వచ్చేవారు. పంట నూర్పిడి కాగానే కల్లములోనే అమ్మివేసేవారు. పంటలు సతృప్తికరముగా పండినవి.
 
    ఏదైనా చెడు జరుగుతదేమో ఎద్దేవా చేయవచ్చునని ఎదిరి చూసిన అసూయాపరులకు ఆ అవకాశము లభించలేదు. కాలము గడిచిపోతున్నది. సుధీర్, సురేష్ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినవి. తాతలు కూడా అయినారు.
 
    మూఢంలో పెళ్లి చేసుకున్న దంపతులూ ఉన్నారు. వేదమంత్రాలు లేకుండా దండల మార్పిడి పెళ్ళి చేసుకున్నవాళ్ళూ ఉన్నారు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎవరికీ ఏమీ కాలెలదు. కాదు.
 
(చినుకు మాసపత్రిక మే 2008 సంచికలో ప్రచురితం)
Comments