కీలెర్గిన వాత -సిద్దెంకి యాదగిరి

    బాయినించి ఇంటికి చేరుకునే వరకు రాకీల పున్నంకు వొత్తనని చెప్పిపోయిన కొడుకు లచ్చవ్వకు యింటికాడ కనవడ్డడు.'ఎన్నడు గిట్ల రానోడు గిట్లెందుకు వొచ్చిండో' అని మనుసుల అనుకొని "ఎపుడొచ్చినవ్ బిడ్డా!" అని అడిగింది.     పుల్కాషిగ ఉన్న కొడ్కు "యిపుడే ఒచ్చిన్నే" పుట్టెడొడ్ల బరువు ఎత్తుకొని, నరాజుగా గూత ఎల్లకుంట మెల్లగ మాట్లాడతండు ఎల్లయ్య.     "ఏమయిందిరా ఎమో సిన్నగ మాట్లాడుతున్నవ్..." అనుకుంటూ జాలేట్లకు వొయి కాల్లు కడుకునేది ఆగింది. కొనరుగుకు కూసున్నది.     "ఏమయింది బిడ్డా! ఏముట్ల శిన్నతనమైందిరా...శెప్పు బిడ్డ శెప్పు" అని కడుపుల దేవుతున్న ఆత్మతోటి తకాయించి అడుగుతంది.     "ఏం లేదు తియ్యే! ఒట్టిగనే వొచ్చిన. ఆడ ఆస్టర్లు యింక దెరువలే. మొన్నటి పరీక్షలో మార్కులు ఆడికాడికే వొత్తన్నై. గీ టీచర్ నౌకరన్న వొత్తదో లేదో? ఏమో పోయే ఏం సదువుడో ఏమో..." అని ఉన్న ముచ్చట శెప్పిండు ఎల్లయ్య.     'అయ్యో! గింత గనం చద్వినా..., కొడుక్కు నౌకరి రాదట. ఏంజేత్తు. ఎంత గనం జేద్దు. పోరి యింటి మీదుండే, యీనికి నౌకొరొత్తె ఆమెను అండ్లది అండ్ల జర మంచోనికి, మంచి ఇంట్లకు యియ్యాలనుకుంటి. ఒక్కపారి రొండు లగ్గాలు చేద్దామనుకుంటిమి. భగమంతా! ఎంత పనైపాయే. కొడుకు ఒగ రీతోడు గాకపోతె ఎట్ల? ఒక్కపోరన్ని సదివిచ్చెతందుకు ఒలువవోతే నార లేకుంట మనుషులమైతిమి. ఐనెకు తప్పకపాయె కట్టం. నాకు తప్పకపాయే. బాకీలు తీరకపాయే. బత్కు మారకపాయే. తీరని మావులకు బతుకు తేరని పావుల గావట్టే. ఐనెకు గీముచ్చట ఎర్కయితే ఏమంటడు. ఏమనుకుంటడు. గిట్ల నవ్వెటోని ముంగట కాలుజారి పడ్డట్టు కావట్టె. ఈ యింత పోరగాండ్లకు నాలుగిత్తులెయ్యక పోతి' అనుకొని నీళ్లూరిన కండ్లను తుడ్సుకుంటంది. కొద్దిసేపట్కి బాధల కేలి తేరుకున్న లచ్చవ్వ "అయితాయె బిడ్డా! అనుమము ఎట్లుంటే గట్లైతది. నౌకరి ఏంది బిడ్డ. నసీబ్ ఎట్లుంటె గట్లైతది. పాసుల నౌకరి వొత్తేంది? రాకపోతేంది. మేం బతుకతలేం రా! యెన్కటి నుంచి నౌకరిజేసే సాదిండ్రా. గా తర్వాయి మీద నిన్ను చెల్లెను ఇద్దరక్కలను సాదలేదా? అక్కలకు పెండ్లిల్లకు, పురుల్లకు, పండగలకు అన్నిటిని ఉన్నంతల ఎల్లదీత్తలేమా? కట్టాలు ఒచ్చినపుడు గుండెను రాయి జేసుకోని బతికినోడే మనిషంటరు. మతిల మనాది దీసెయాల్రా... లేకపోతే రంది రోగమైతది..." అంటూ పైకి బీంకరంగా జెప్పుతున్నా లోపట్లోపట కడుపంత కలికలి ఐతంది.

    మెల్లగ జాలెట్లకు వొయి, కాల్రెక్కలు గడుక్కొని, వత్తున్నప్పుడు బిడ్డ పద్దమవ్వ "అవ్వా! ఇగో తువ్వాల..." అంటు సేతికిచ్చి పొయిమంట సూసుకుంట బీడీలు జేసేతందుకు వోయింది.
    "అవ్వా! బట్వాడా వొచ్చిందా బాంచన్..." బిడ్డను మెల్లగ అడ్గుతంది లచ్చవ్వ.     "యియ్యల్ల లేటయితందని రేపు యిత్తమన్నరు" అని పద్మవ్వన్నది.     "ఎల్లమూ! అయ్యకు ఎదురుంగా పోయిరాపో బిడ్డా!" లచ్చవ్వ చెప్పింది.     "పోతన్ననే..." అంటు పోయిండు ఎల్లం. ఎల్లం సైకిల్ మీద సర్రన దొడ్డికాడ ఆగేవరకు ఎడ్లకు గడ్డి సదురుతూ ఎల్లం దిక్కు చూసి రంగయ్య "మా యెల్లెమే వొచ్చినవేం రా పట్నం కేలి" కొడుకును అడిగిండు.     "ఆస్టల్ యింక పద్దినాలైతే యిస్టాట్ ఐతదట. గప్పటి దాక ఏంజెయ్యాలె అని వచ్చిన్న"న్నడు ఎల్లయ్య.     'గిన్ని దినాలాయే పట్నం పోవట్టి, ఎన్నడు జెప్పని ముచ్చట గిపుడు చెప్పవట్టె...ఏంది గిట్ల. ముందుగాలైతే బక్కాట్కి గడ్డి సదురుత....' ఏమో ఆలోచిస్తున్న నాయనను జూసి, 'అన్ని అడ్గుతడు మా నాయన. పని మీద ఉన్నపుడే నేనవతల పడాలె' అని మనసులో అనుకొని     "నాయనా? గీ పచ్చిగడ్డి మోపు కొంటవోవన్నాయే..."అని అడిగిండు ఎల్లం.     "కొంటవో...బిడ్డా!" అని అయ్య రంగయ్య జెప్పిండు.     క్యారల్‌కు మోపు వెట్టుకొని గిర్రున యింటిమొకాన సైకిలు మలిపిండు ఎల్లయ్య.

    రంగయ్య ఇంటికొచ్చెవరకు ఎప్పటోల్నె కలె మబ్బయింది. ఐన కంటె ముందుగ బర్రె ఇల్లు జేరింది. కాల్రెక్కలు కడుక్కొని వొచ్చి "అవ్వా! కొన్ని నీళ్లియ్యిరా! అటనే పాలసర్వ దీసుకురా బిడ్డా!" అంటు పద్దుమకు జెప్పిండు.
    అప్పట్కే డొక్కూ బ్లాక్ ఐండు వైట్ టీవిల మునిగి, ఏడుపుగొట్టు సీర్యల్ సూత్తన్నామెకు సలిచీమ కుట్టినట్లు అయ్య మాట యినిరాంగనే బీడీల సాట కిందవెట్టి సర్రన నీళ్లూ, పాలసర్వ దెచ్చి "అయ్యా ఇగోయే..." అని యిచ్చింది.     "బర్రెను కట్టేసి శానసేపాయే. దుడ్డె తండ్లాడుతుంది. నడువు నడ్వు" పాలు పిండుమని గెదిమింది లచ్చవ్వ.     "పోతన్ననే...పోతన్న పాలు పిండెతందుకు"     "ఎయ్, ఎట్వాయనే వీడు. పట్నం నుంచి రాంగనే ఏదో వొయి ముంగటేసుకొని సద్వుకుంటుండే" ఎల్లయ్య నుద్దెశించి లచ్చవ్వతో అన్నడు రంగయ్య.

    "ఏమో..!" అంటె కుక్క బూతులు పడవలసి వొత్తదని, ఎప్పుడో కొంకలు ఇచ్చెతందుకు పోయినా..."ఇపుడే కొంకలు యిచ్చెతందుకు కొత్తరూంల్ల లచ్చి నర్స దగ్గర్కి తోలిచ్చిన" అంది లచ్చవ్వ.

    "ఉడ్కుడ్కు యింత యేస్కరాయే. నాలుగు సినుకుల్ల తడిసినంద్కు సల్సలి వెడ్తంది. బుక్కెడు దినంగనే మల్సుకొని పంట" అని లచ్చవ్వకు జెప్పిండు.
    "అవ్వా! నేను పప్పుయిసురుతున్న. జర్ర యేస్కరా బాంచెన్. పని మీద్కేలి నేనేం లేవాలే..." అని పద్దుమకు జెప్పింది లచ్చవ్వ.     పద్దుమ బువ్వ యేసుకొచ్చి, అయ్యకు తలె యిచ్చింది. పొగలెల్లిన బువ్వదిని, నుల్క మంచంల గొంగడి కప్పుకొని పన్నడు రంగయ్య.

    తొమ్మిదిన్నరయినంక యిల్లు జేరిండు ఎల్లయ్య. ఎల్లం తోటి లచ్చవ్వ "యాడ్కి వోతివి బిడ్డా! అయ్య కలువరిచ్చి కలువరిచ్చి రాపాయె ననుకుంట నిదురవాయే... తినుపోరా..." అని అన్నది.
    అనుడు ఆల్శమే లేదు. పద్దుమ నీళ్లు దెచ్చి యిత్తె చెయి కడుక్కొని వొచ్చి, టీవి ముంగట తినెతందుకు సకులంముకలం వెట్టుకొని కూసున్నడు. పద్దుమ బువ్వదెచ్చి యిచ్చింది.
    ఎల్లం టీవి జూసుకుంట అదే మనాదికి తినబుద్ది అయిత లేదు. తిన్నట్టు జేత్తండు. కరుసుకుంట, కరుసుకుంట తింటన్న అన్నను జూసి పద్దుమవ్వ "అన్నా! పులుసు మంచిగ లేదాయే..." అడిగింది. పన్నుకింద యిసుకొచ్చి కిర్రుమన్నట్టు అనిపించింది ఎల్లయ్యకు.

    "మంచిగనే ఉందిరా! నువ్వు జేసిన పులుసు మంచిగుండదారా!" అంటూ ఆకొద్దిసేపు మరిసి యేసిన కాడ్కి పురాగదిన్నడు.
    'దినాం పొద్దుగాల బాయికేయి మబ్బుతో పోతున్నడు. నాలుగైదు రోజులైనంక వీన్ని పట్నం ఎందుకు పోతలేడో అర్సుకుంటనని' అనుకుంది లచ్చవ్వ.

    "అరేయ్! నువ్వెపుడు పట్నం పోతవ్రా!" గట్టిగానే అడిగింది లచ్చవ్వ.     "ఇక పట్నం బోను సద్య. అయ్యతోటే పనికి వోత."     "అదెరా..."     "నాకు నౌకరొత్తలేదు. ఏం లేదు. ఏం సద్వుమంటున్నవ్?"     "మల్ల మాలెక్క గాయిది పని జేత్తవా...? నువ్వు సద్వాలని దొర పటేండ్ల దొడ్లు కడ్గితిమి. వాళ్లపిల్లల ముడ్లు గడ్గితిమి. అయ్య నేను మాయితనం జేత్తిమి. సెల్లెను బీడీలు సుట్టవెడ్తిమి.ఎందుక్కొడ్కా ఈ బాంచె బత్కు పోయెతందుకే గదా..." అని లచ్చవ్వన్నది.     గపుడే ఊల్లెకేలి రంగయ్య వొత్తండు.     "అవ్వా కోమట్ల యింటికాడ చెక్కా పల్క శేతికిచ్చినపుడు ముర్సుకుంట బడికి పోయిన. పది పాసైనపుడు పది మందికి చెప్పుక తిర్గితి. పై సదువులకు నేను వోతున్నపుడు తూట్లు పడ్డ టిక్కెట్లోలే సదువుకు తూట్లు వడొద్దు అనుకున్న. గని అన్ని నౌకర్ల అటెండర్లనుంచి అందరు ఆందరోల్లె నిండి పోతండ్రు. మనోల్లకు ఏమి యియ్యనిత్త లేరు. నేనేం జేయాలే" అని ఎల్లయ్య అన్నడు.     అప్పటికే సూత్తన్న రంగయ్యకు తిక్కెవుట్టింది.     "ఔరా! తర్రగాడ్దికొడ్కు లెక్క యెన్కకు మర్రుతావురా. యీడ పుట్టినం. ఈడ పెరిగినం. ఈడ మలమల మాడుడు ఏందిరా. పొయి మనది. పొయి మీద కుండ మనది. పొమ్మనకుంట పొగవెట్టి యెల్లగొట్టాలె. గీయింత దానికే పోనని చెప్పుతండు మొగోడు. ఆ ఈని పిరికితనం సూడే...ఎట్లుందో..." అని లచ్చవ్వ దిక్కు గుడ్లు యిర్మి చూసి "నువ్వు జెయ్యంగానే గిట్లైందే... నీయక్క రోగం కున్న వారెద్దూ..." తిడ్తండు.
    "ఒర్రకు మాసినోడా...ఒర్రకు. ఏమో గాయిగాయి ఒర్రుతున్నవ్. ఇంట్ల మాట అవుతల వడకుంట మాట్లాడాలెనని నూటయాభై సార్ల జెప్పిన గంతే...గట్లే ఒర్రుతాడు" అని లచ్చవ్వన్నది.     "ఈయక్క నీ మెడలిరిసేను. ఔల్దానా! నువ్వొక్కపారి మంట వెడ్తెనే... బువ్వ కూర అయితాదే. నేనొక్కపారి చేయించిన నాగలితోటే సాలీము దున్నుతన్నానే... ఊరికి పయనం ఐపోంగా పోట్రౌతు దాకితే ఊకొంటామే...గివ్వేమో చెప్పవేమే. పట్టు పట్టనే వొద్దు. పడ్తె ఇడ్తారే..." అంకుంట లచ్చవ్వ మీదికి రంగయ్య గయ్యన లేసిండు.     "ఏందయ్యో! ఎరగని ఊల్లె మొరగని కుక్క పంచాది ఊకెనే ఐతదా...? కూకుండి గుర్రాల మత్తుగ మలుపొచ్చు. నీ ఒర్రుడు మొకంగాల. ఊకో" రంగయ్యను లచ్చవ్వన్నది.     "అయ్య గట్లే ఒర్రుతడు. ఊరుదాటనోనికి ఏం ఎర్కరా! కొలువు రాకపోతే రాకపాయే. ఇంకో బాయి ఏడనన్న పాలుకు వట్టి యెవుసం జేద్దాం. నర్సిని అడ్గి పెండ్లి జేత్త. మా అన్న నాకియ్యనని అంటడా వాని బిడ్డను" అని అన్నది.     "కీలెరిగి వాత వెట్టాలె. యిగురంతోటి అడుగులేసి యిసంగాల్ల మోసం పడగొట్టాలె. గీసొంటి లోకమ్మీది ముచ్చట జెప్తె నామాటలు పట్టకుమని చెప్పుతున్నవేమో, గండ కరువుల బొంబాయి పోయి బంగ్ల బంగ్లల పనిజెయ్యలేదే. మెసలుతె దంత మెంటల్దానా...?"     "అరె ఎల్లా! పోకపోతే పొట్టువాయే. నువ్ సద్వపొతే సద్వపోతివి గని యియ్యాల శారగొండ పటేండ్లది కౌలుకు మాట్టాడ్త... ఏయ్ ఏత్తువు రాయే. ఎడ్లు దొడ్లె వాయే... నడ్వు నడ్వు..."     "బర్రెలెక్క ఒర్రినట్లు ఏస్కొని తిను" లచ్చవ్వన్నది.     "నా బిడ్డ ఉంటే ఎవ్వడు పిలుసు. రాయే...ఆమె బీడిల మాష్ ఇచ్చెతందు కంపెన్లికి వొయింది. రా...రా..." రంగయ్యన్నడు. బువ్వ ఏత్తె రంగయ్య తింటండు.
    'ఔను నాయన...అవ్వ అన్నది నిజమే. పగదారునితో కొట్లాటకు వోయెటపుడు గెల్చి రావలె. అట్లా అని ఒక్కపారి ఓడిపోతె మొత్తం ఓడిపొయినట్లు ఎట్లయితది? కాదు. ఒక్కసారి ఫేలయినోల్లు నౌకరి చేసేటోల్లు లేరా...' ఆలోచనలన్ని ఎల్లయ్య మతిల మెదులుతనే ఉన్నై.
    ఎల్లయ్య సిన్నప్పటి దోస్తు సత్తీష్. ఒకటో తరగతి నుంచి పట్నంల యిపుడు సదివేదాక ఒక్కకాన్నె తిని, ఒక్క కాన్నె సదివి, ఒక్క కాన్నె ఉన్నరు. "ఏం బిడ్డా! సత్తయ్యా! బాగున్నావ్ కొడుకా? ఎపుడొచ్చినవ్" అని లచ్చవ్వ అడిగింది.

    "ఆ బాగనే ఉన్న సిన్ని. ఎల్లిగాడు ఎటువోయిండు. శెల్లె మంచిగున్నదా?" అని అడిగిండు సత్తీస్.
    "నువ్వు పట్నంలనే సద్వుతున్నవా...? గిప్పుడు."     "ఆ అవునే"     "మావోడు సదువాంటండు. ఏం సంగతి. ఇన్నొద్దులు మీ అయ్యవ్వ, మేం మంచిగ సదివిత్తర్రు అని పేరెల్లినం. మావోడు ఇగ సదువా అంటండు. ఏం జేయాల్నయా?" అంటూ ఎల్లయ్య దిక్కు చెయ్యి సూపెట్టుకుంట సెప్పుతండు రంగయ్య.     "నువ్వొద్దెనేనే మన నౌకర్లు మనగ్గాకుంట, మన నీళ్లు మనకు పారకుంట మన బొగ్గు మనకందకుండ మనకగ్గివెట్టిండ్రే...'పంట పండాలె గని తింటె దంగుతదా అన్నట్లు మంచి మంచి సదువులు కోస్తాంద్ర పంటలు దీసెటోల్లు సద్వించవట్టిరి. ఇగ మేమయితే మీరు పంపిచ్చిన పైసలు సాలక ఎస్టీడీలల్ల, క్యాటరింగ్...లాంటి ఎన్నో పనులు జేసుకుంట సద్వితిమి. వాళ్లకు మనకు పోటివెడ్తె ఐతదా...? గట్ల పెట్టి, మనదగ్గర కొలువులు కూడా ఏర్పడ కుంట గుంజుక పోతండ్రు. గట్ల నౌకరైనోడు పందికొక్కోలె వాని కిందికి, వానోని కిందికి పొక్క తోడుకుంటండు. మనకు నౌకర్లు రాకుంట చేత్తండ్రు" అని చెప్పిండు సత్తీస్.

    "మన పని మనకు పంచెయ్యాలె. మన నౌకరి పాల్లు మనకు పెట్టాలె. పెట్టేటట్లు చెయ్యాలే" రంగయ్యన్నడు.     "అట్లు వొత్తలేదే? మాది మనోల్లది అనే ఆలోచన రాక మనం అట్ల తెలివికి రాక ఆగమైతన్నం" అని సత్తీస్ అన్నడు.

    "ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే."     ".................."     "అరేయ్ మనం పెరట్ల గుండు మీద గూసుండి మాట్లాడుకుందాం పారా పోదాం" అని సత్తీస్ అంటే అటువోయిండ్రు ఇద్దరు దోస్తులు.     "ఔరా! మన తాడికి బతికెతందుకొచ్చి, మనది మనగ్గకుంట గుంజుకుంటే ఊకుండ వడ్తిమి. రేపు మన తమ్ముల్ది గుంజుకోరా...? వాంది. వానితాతది. వానయ్యది. మాయిముంత ఏడదాసిండ్రో గది వాని ఖుద్దుజాగ. మన దగ్గర్కొచ్చి మన యాస మీద, బాషమీద, పండుగలమీద వాని జుల్ము ఏంది? బిచ్చానికొచ్చినోడు ఆమిల్లు గరిస్నట్టు గావట్టే. నువ్వెమంటవ్రా ఎల్లా! చెప్రా"     "నువ్వొద్దెనేరా..."     "మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా...!" అని సత్తీస్ అన్నడు.     "ఔను! గీ ముచ్చట మంచిగుంది. థింక్ పాసిటివ్ వే గా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఐతది. ఒగ పెద్దయన 'నీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది' అన్నట్టు మనం జేసే పని మంచిదైతే అదే బాగైతది. మంచిగైతది" అని ఎల్లం అన్నడు.     "ఇగ రేపు వోదాం క్యాంపస్‌కు" సతీష్.     "సరే అట్లైతే అట్లనే" ఎల్లం.     "అవ్వా! రేపు పొద్దుగాల పట్నం బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా సదివెతందుకు.     నాయినా! ఇగ రేపు బోతా. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త.     నాయినా! అవ్వా! పొతున్న. మీకు దండం. మీ పాదాలకు దండం. కొలువన్న దెత్త. యిలువన్నా దెత్త. కొనాకరికి కొట్లాడి కొరి జీవినాల తోటైన తెలంగాణ దెత్త."

(తెలంగాణా ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన శ్రీకాంత్ మరియు ఇతర విద్యార్థి అమర వీరులకు ఈ కథ అంకితం)

    
    
Comments