కొడిగట్టరాని చిరుదీపాలు -అంబికా అనంత్

    
ఆనంద్, డాక్టర్ విమలలది చాలా ఆనందమైన కుటుంబం. ఆనంద్ ఓ పెద్ద కంపెనీకి డైరెక్టర్, డాక్టర్ విమల పేరుమోసిన గైనకాలజిస్ట్. వాళ్ళకి ఒక్కడే  బాబు, పదేళ్ళ విజయ్. ఆనంద్ వాళ్ళ నాన్నగారు ప్రకాశరావుగారు ఆ ఇంటికి పెద్ద. క్షణం తీరిక లేకుండా, కర్తవ్య నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా వుంటూ, ఎంతో కష్టపడే కొడుకూ - కోడల్నీ చూస్తూ తమకంటూ సమయం మిగుల్చుకోలేక పోతున్నారని ఎప్పుడూ బాధపడతారు ప్రకాశరావుగారు. తన కోసం అమ్మా, నాన్నా టైమ్ ఇవ్వట్లేదని బాధపడేవాడు విజయ్ ఆర్నెల్ల క్రితం వరకూ, ఇప్పుడు అతని లోకమే వే
రు.

* * *

    "ప్రకాశరావుగార్ని బలంగా తలమీద మోది చంపేశారు ఎవరో...!" నెత్తుటి మడుగులో వున్న ఆయన తలను మెల్లగా ఎత్తి తన తొడమీద పెట్టుకున్నాడు ఆనంద్. తనని పువ్వుల్లో పెట్టి పెంచిన నాన్న చివరి ప్రయాణం రోజా రేకులమీద సాగాలి అనుకున్నాడు, ఇలా నెత్తుటి వరదలో కాదు. గుండెలో ఎంతో ఉద్వేగం. ఆయన చిరునవ్వూ, శాంతం గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నుండి వేడి కన్నీళ్ళు టపటపరాలి పడ్డాయి ఆయన చల్లని శరీరం మీద.

    అంత్యక్రియలు, మిగతా తతంగం అంతా జరిగిపోయాక ఇంటినిండా నిశ్శబ్దం నిండుకుంది, కాని ఆనంద్ దంపతుల మనసుల్లో అలజడి రగులుతూనే వుంది. డబ్బు, నగలు దొంగలించడానికి చేసిన హత్య కాదిది. ఏ వస్తువూ పోలేదు. బీరువాలు తెరిచినట్టూ, కనీసం తెరవటానికి ప్రయత్నించినట్టూ లేదు. బయటివాళ్ళలోనూ, బంధుజనంలోనూ ప్రకాశరావుగారికి శత్రువులు లేరు. ఎంత ఆలోచించినా అర్థం అవటంలేదు. పోలీసులకూ అంతుచిక్కని సమస్య అయ్యింది ప్రకాశరావుగారి హత్య.

* * *

    "ఎప్పట్నించి నీకు నిద్ర సరిగా పట్టటం లేదు విజయ్..." మెల్లగా ప్రశ్నించాడు డాక్టర్ వర్మ. "మీ తాతగారితో పడుకునేవాడివిట కదూ, ఆయన ఇప్పుడు ప్రక్కన లేకపోతే నిద్ర పట్టడంలేదా...?" మృదువుగా మళ్ళీ ప్రశ్నించాడు.

    డాక్టర్ వర్మ మంచి పిడియాట్రీషియన్. అమెరికా మిచిగన్ హాస్పిటల్‍లోఎన్నాళ్ళో పనిచేసి ఇండియా తిరిగి వచ్చేసి తన స్వంత నర్సింగ్‍హోమ్ కట్టుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. డాక్టర్ విమలకు కాలేజీలో సీనియర్. గౌరవం, ఆత్మీయత కలబోసిన స్నేహం వారిది.

    "అమ్మా...నాకు నిద్రరావటం లేదు..." అంటూ రోజూ తనని నిద్రలేపుతున్న విజయ్‍ని గురించి దిగులు పట్టుకుంది విమలకి. తాతగారి శవం కళ్ళముందు కనిపిస్తోందేమో చిన్న నాన్నకి... అనుకుంటూ వాణ్ణి గురించి ఆలోచన ఎక్కువయ్యింది.

    డాక్టర్ మేధస్సుమీద, తనలోని తల్లి ప్రేమ మబ్బు కప్పేస్తుందని, అలాంటి క్లౌడెడ్ థింకింగ్ వల్ల లాభం లేదని, మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ వర్మని కలవాలని నిశ్చయించుకుంది. అతను పిల్లల మనస్తత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత తెలుసు. పిల్లల్ని అరవిచ్చిన గులాబీల్లా చూసే అతని సున్నితత్వం తెలుసు. అందుకే మర్నాడే విజయ్‍ని డాక్టర్ వర్మ దగ్గరకు తీసుకెళ్ళింది.

    "నీకు నిద్రపట్టనపుడు పుస్తకం ఏదన్నా చదువు విజయ్. బుక్స్ ఆర్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ - అన్నట్టు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ వున్నారు?" అడిగాడు డాక్టర్ వర్మ.

    "నాకు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఎవరూ లేరు డాక్టర్ అంకుల్, స్కూల్‍లో క్లాస్‌మేట్స్ అందరం కలిసి ఆడుకుంటాం. కానీ ఇంటి దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్ నా కంప్యూటర్...!" కళ్ళలో మెరుపుతో గర్వంగా అన్నాడు విజయ్.

    "ఈజిట్? వెరీ ఫైన్... చాలా తెలివైన కుర్రాడివన్న మాట..."

    "అవును డాక్టర్ అంకుల్... కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేనెప్పుడూ ఓడిపోలేదు. ఐయామ్ ఆల్వేస్ ఎ విన్నర్..." ఉత్సాహం, గర్వం పోటీగా ధ్వనిస్తున్నాయి విజయ్ గొంతులో.

    విజయ్ తనకి ఓపెన్ లిప్ అవుతున్నాడనీ, తన ప్రశ్నలు సరియైన మార్గంలో సాగుతున్నాయనీ తెలుసుకున్నాడు డాక్టర్ వర్మ.

    "ఎలాంటి గేమ్స్ ఆడతావు విజయ్... కంప్యూటర్లో ఛెస్ కూడా ఆడవచ్చు కదా, చాలా తెలివైన మూవ్స్ నేర్చుకోవచ్చు కదూ...?"

    "ఛీ..ఛీ, అవన్నీ అవుట్‍డేటెడ్ అయిపోయాయి అంకుల్. నేను ఆడేవన్నీ చాలా థ్రిల్లింగ్‍గా వుంటాయి. షాడో వారియర్, బ్లడ్, ఆర్మగెడ్డాన్, ప్రాంకిన్‍స్టీన్..." విజయ్ మొహం ఉద్రేకంతో ఎర్రబడటం గమనించాడు డాక్టర్ వర్మ. మెల్లగా విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని పల్స్ చెక్ చేశాడు. రాపిడ్‍గా వుంది, ఎక్సైటెడ్‍గా ఉంది.

    ఆ గేమ్స్ విషయం ఆలోచిస్తేనే ఇంత ఉద్వేగంగా, ఉద్రేకంగా మారిపోయాడు. అవి ఆడుతున్నప్పుడు అతని పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనిపించింది డాక్టర్ వర్మకి. "ఓ.కె. అంకుల్... మాతాతగారూ నాతో బెట్ కాసి ఓడిపోయేవారు ఎప్పుడూ, ఆ రోజు తప్ప..."

    ఉలిక్కిపడ్డాడు డాక్టర్ వర్మ "ఏరోజూ...?" జాగ్రత్తగా ప్రశ్నించాడు.

    "ఏంటి వర్మా... ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు ఆ గేమ్స్ గురించి. నాకు క్లినిక్ టైమైపోతుంది..." అసహనంగా మధ్యలో అడ్డు వచ్చింది విమల. ఫిజికల్ ఎక్జామినేషన్ అయిపోయాక అసలు విషయానికి రాకుండా ఈ కంప్యూటర్ గేంస్ గొడవేమిటో అని విసుగ్గా వుంది. పైగా పేషెంట్స్ తనకోసం ఎదురుచూస్తూ వుంటారని ఆమెకు ఆత్రుతగా వుంది.

    "ఎస్ అంకుల్. రేపు మా ఇంట్లో ఐ విల్ బె వెయిటింగ్ ఫర్ యూ..." అన్నాడు విజయ్.

    "ఓ.కె. విజయ్. సీ యూ టుమారో" అన్నాడు డాక్టర్ వర్మ. 

* * *

    "విమలా... నువ్వు నిజంగా చైల్డిష్‌గా ప్రవర్తించావు. నేను ఏదో లింక్ దొరుకుతుందేమో విజయ్ ఇన్‌సామ్నియా లక్షణాలకి అని ప్రశ్నిస్తుంటే మధ్యలో అడ్డు వచ్చావు" కాస్త విసుగ్గా అన్నాడు డాక్టర్ వర్మ ఫోన్‌లో.  

    "ఐయామ్ సారీ వర్మా... నేను క్లినిక్‌కు వెళ్ళాలన్న హడావిడిలో అన్నాను కాని, నీకు అడ్డురావాలన్నది నా ఉద్దేశ్యం కాదు" అంది విమల నొచ్చుకుంటూ.

    "అది సరే...ఇవాళ సాయంత్రం నాతో పాటు డాక్టర్ రమేష్‌ను కూడా తీసుకొస్తున్నాను. హీ ఈజ్ ఎ పిడియాట్రిక్ సైకియాట్రిస్ట్. విజయ్ విషయంలో అతని అవసరం ఉందేమోననిపిస్తోంది నాకు..." అన్నాడు.

    గుండె గుబగుబలాడింది విమలకి. తనలోని భయానికి రూపువచ్చినట్లయ్యింది అతని మాటలు వింటూంటే.

    "నీకు ఏది సరైందని తోస్తే అలా చెయ్యి వర్మా... విజయ్‌ని నీ చేతుల్లో పెడుతున్నాను" అంది నిర్లిప్తంగా.

* * * 

    ఆ గదిలో ఒక రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది. పైకి అందరూ చిన్న పిల్లాడితో ఏదో ఆటలు ఆడుతున్నట్లు వున్నారు కానీ అందరి మనసుల్లో ఏదో అన్వేషణ. 

    "ఈ గేమ్ కార్మెగెడ్డాన్... రోడ్డు మీద మనుషుల్ని కారు క్రింద ఎలా క్రష్ చేసెయ్యొచ్చో చూడండి అంకుల్..." గేమ్‌లో లీనమైపోతూ అంతున్న విజయ్‌వైపూ, కంప్యూటర్ స్క్రీన్‌మీద నెత్తుటి ముద్దల్లా కనిపిస్తున్న శవాల్ని చూస్తూ

    "ఈ గేమ్ భయంకరంగా ఉండి. నీకు భయం వెయ్యటం లేదా విజయ్...?" అడిగాడు డాక్టర్ వర్మ.

    "ఇది భయంకరంగా ఉందా మీకు? అయితే ప్రాంకిన్‌స్టిన్ త్రూద ఐస్ ఆఫ్ ఎ మాన్‌స్టర్ చూపిస్తాను. భలే బావుంటుంది" చకచకా కీ బోర్డ్ మీద వ్రేళ్ళు కదులుతున్నాయి. దృశ్యం మారిపోయింది.ఒక భయంకరాకారం ఒక అమ్మాయి మెదడుని పుర్రెలో నుండి తీసి, దాన్ని సూప్ చేసుకుని తాగుతున్నవైనం, ఎంతో వాస్తవంగా, జలదరింపు కలిగేలా వుంది.

    ఆ తర్వాత గేమ్స్ అన్నీ కూడా రక్తపాతం, హింసాకాండలతో నిండి ఉన్నాయి. లేజర్ తుపాకీలు, టాంకులు, ఏ ఆయుధాన్నయినా సునాయాసంగా వాడగల అనూహ్య శక్తి, మృత్యుభయంలేని ఓ కిరాతక ప్రవృత్తిని పెంపొందించే వాతావరణం.

    'బ్లడ్' అనే గేమ్‌లో శతృవుకి నిలువెల్లా నిప్పంటించి నృత్యం చేయించే దృశ్యం, తలతో ఫుట్‌బాల్ ఆడే అమానుషం...

    కళ్ళు తిరుగుతున్నట్లయ్యింది విమలకి. కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఎంతో ఘనమైన విషయంగా భావించిండి తను. ఎలాంటి గేమ్స్ స్నేహితుల దగ్గర్నుండి తెచ్చుకుని కాపీ చేసుకుంటున్నాడో అన్నది ఏనాడూ పట్టించుకోలేదు. వాడు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూంటే తన బాధ్యత తగ్గిందనుకుంది. ఇప్పుడు...

    "షాడో వారియర్‌లో నా స్కోర్‌ను ఎవ్వరూ దాటలేదు" ముఖం మీద చిరు చెమట మెరుస్తూ కళ్ళలో ఒక విధమైన అసహజ కాంతితో అన్నాడు విజయ్. "లెట్ మీ ప్లే..." అంటూ డాక్టర్ రమేష్, విజయ్ చేతిలోని మౌస్‌ను తీసుకున్నాడు. ఎంతో సునాయాసంగా ఆడుతున్నాడు. స్కోర్ పెరిగిపోతోంది. ఇంకా రెండు మూడు నిమిషాల్లో విజయ్ స్కోర్‌ను దాటిపోతుంది.

    'నో...నో' బిగ్గరగా అరిచాడు విజయ్. వెనుకనుండి డాక్టర్ రమేష్ మెడ చుట్టూ చేతులు బిగించాడు. ఉద్రేకంతో ఊగిపోతున్నాడు.

    నలుగురు మనుషులు కలిసినా విజయ్ వెర్రిబలం ముందు ఆగలేకపోయారు. పిచ్చిగా గుంజుకుటున్న విజయ్‌కి తన బ్యాగ్‌లో నుండి ట్రాంక్విలైజర్ తీసి ఇచ్చాడు రమేష్. నిస్త్రాణ పడివున్న విజయ్‌ని చూస్తూ మొహాన్ని రెండు చేతుల్తో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న విమల దగ్గరకు వెళ్ళి డాక్టర్ రమేష్

    "కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ విమలా. ఇలాంటి సందర్భంలో మీరు బేల కాకూడదు. పరిష్కారం ఆలోచించుకుందాం. పిటీ ఏమిటంటే ఎంతో తెలిసిన, చదువుకున్న తల్ల్దండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా తప్పటడుగులు వేస్తున్నారు. ఎలాంటి వాతావరణం పెరిగే ఆ మనసులకు అవసరమో తెలుసుకోలేక పోతున్నారు. ప్రేమాప్యాయతలు పంచి ఇవ్వలేని బిజీ తల్లిదండ్రులు ఏదోవిధంగా తమ పిల్లలను సంతోషపెట్టే ప్రయత్నంలో తమకు తెలియకుండానే చాలా హాని కలిగిస్తున్నారు."

    "ఈ మధ్య అమెరికాలో నలుగురు క్లాశ్‌మేట్స్‌నీ, ఒక టీచర్‌నీ ఘోరంగా చంపిన ఆన్‌డ్రూ గోల్డెన్, మిఛ్ జాన్సన్ అనే పిల్లల్లో అంత కౄరత్వం, అమానుషత్వం ఎలా వచ్చాయో అన్న విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పిల్లల్లో ఒకరి తాతగారు తమ మనవడు ఎప్పుడూ భయంకరమైన క్రూరమైన కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడని చెప్పారు. బ్రెంట్ డీ వాల్ అమెరికాలో జరిపిన పరిశోధనలో ఇలాంటి గేమ్స్ ఆడే పిల్లలు మృత్యువుకు స్పందించరని నిరూపించబడింది. అలా అని అందరు పిల్లలూ అలా తయారవుతారని కాదు, కానీ కొందరు పిల్లల్లో 'ఇంప్రెస్'అయ్యే తత్వం ఉంటుంది. అలాంటి నైజం వున్నవారిని గుర్తించి వారిని జాగ్రత్తగా పెంచాలి. చిరుదీపాల్లాంటి పిల్లల్ని అరిచేతులు అడ్డుపెట్టుకుని కాపాడుకోవాలి. కిరిసనాయిలూ, పెట్రోలూ లాంటివి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఇల్లే భగ్గుమంటుంది." డాక్టర్ రమేష్ వివరిస్తుంటే ఆ సాయంత్రం భారంగా గడిచింది ఆనంద్ ఇంట్లో.

* * * 

    "విజయ్...విజయ్...నువ్వూ, తాతగారూ కంప్యూటర్ గేమ్ ఆడుతున్నారు. తతగారు నవ్వుతూ "నిన్ను ఓడిస్తానురా విజయ్" అంటున్నారు...ఆయన బాగా ఆడుతున్నారు... నీకు కోపం ఎక్కువవుతోంది... ఆయన స్కోర్ పెరుగుతోంది... నీకు కోపం మరీ పెరుగుతోంది...ఉక్రోషంగా ఉంది...నిన్ను ఎవరూ ఓడించకూడదు అనుకుంటూ తాతగారు ఎలాగన్నా ఓడిపోవాలనుకుంటున్నావు..."

    విజయ్‌ని హిప్నాటిక్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి ఆ రోజు జరిగి ఉండవచ్చనుకున్న దృశ్యాన్ని మళ్ళీ అతనికి సజెషన్ ద్వారా చూపుతున్నాడు డాక్టర్ రమేష్.

    విజయ్‌లో జరుగుతున్న మార్పుల్ని ఏవో మెషీన్లు మానిటర్ చేస్తున్నాయి.

    "తాతగారి స్కోర్ పెరిగిపోయింది... అప్పుడు నువ్వు ఏంచేశావు...? ఏం చేశావు వీజ్య్...?"

    "నాకు ఏడుపొచ్చేస్తోంది... నాకు గేంలో ఓడిపోవటం అసలు ఇష్టం లేదు. తాతగార్ని ఎలాగన్నా ఆపాలి. నా స్కోర్ బీట్ చేసే లోపల..."

    "అప్పుడు నువ్వు ఏం చేశావు విజయ్... తాతగార్ని ఏం చేశావు విజయ్..."

    "ఐరన్‌బాక్స్‌తో నెత్తిమీద కొట్టాను... తాతగారు కిందపడిపోయారు. కళ్ళు తెరిచి నావైపు చూస్తున్నారు. ఏదో అంటున్నారు... మళ్ళీ లేచారంటే ఎలా... ఇంకా గట్టిగా కొట్టాను తలమీద... ఇక కదలటం మానేశారు... మమ్మీ, డాడీ ఇంట్లో లేరు..."

    "తాతగారి అరుపు వినలేదా ఎవరూ...?"

    "రామయ్య గదిలోకి వచ్చాడు పరుగెత్తుకుని. నన్ను చూశాడు. కిందపడి వున్న తాతగార్ని చూశాడు. గబగబా నా చేతుల్లో వున్న ఐరన్‌బాక్స్ తీసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్ళాడు. బాగా కడిగితెచ్చి, దాన్ని తుడిచి అల్మారాలో పెట్టేశాడూ. నన్ను ఎత్తుకుని ప్రక్క గదిలోకి తీసుకుపోయాడు.

    విజయ్‌బాబూ...నువ్వు చేసింది ఎవ్వరికీ చెప్పకు. చెప్పావంటే మీ మమ్మీ డాడీ కూడా చచ్చిపోతారు... అన్నాడు. అందుకే నేను ఎవ్వరికీ చెప్పలేదు. కానీ రాత్రయితే తాతగారు గుర్తుకొచ్చి నిద్రపట్టడం లేదు..." వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయ్‌ని మళ్ళీ మామూలు స్థితికి మెల్లగా తీసుకొచ్చాడు డాక్టర్ రమేష్.

    పాలుగారే ఆ తెల్లని బుగ్గల్ని, ఆల్చిప్పల్లాంటి అమాయకమైన ఆ కళ్ళని చూస్తూ, హత్య చేసిన ఆ చిన్నారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బావురుమంది విమల...
  
      
Comments