కొడిగట్టిన దీపాలు - జాస్తి రామకృష్ణ చౌదరి

    
ఆ రాత్రి ఇంటికి వచ్చిన సత్యమూర్తి కడుపులో నొప్పితో విలవిల్లాడిపోతున్న భార్య సుజాతని చూసి బెంబేలు పడిపోయాడు. ఏమైందని అడిగితే చెప్పే పరిస్థితిలో లేదు సుజాత. పక్కనే ఉండే జానకమ్మని పిలిచాడు గట్టిగా సత్యమూర్తి. జానకమ్మ పిలవగానే వచ్చింది. ఆమెకి కూడా ఏం చేయాలో పాలిపోవడం లేదు. ఈ మధ్య సుజాత నీరసంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఉండే ఆర్.ఎం.పి. డాక్టర్ ఏవో మందులివ్వడం జరుగుతూ ఉంది కొంతకాలంగా. జానకమ్మ పరుగెత్తుకుంటూ వెళ్లింది డాక్టర్ని పిలవడానికి. కానీ డాక్టర్ ఇంట్లోనూ లేడు, క్లినిక్ లోనూ లేడు. భార్య అంటే ప్రాణం సత్యమూర్తికి. ఆమె బాధ చూళ్ళేకపోతున్నాడు, కానీ ఏమీ చేయలేని అసహాయస్థితిలో చూస్తూ ఉండిపోయాడు. జానకమ్మ కొడుకు రాజు అదే సమయానికి రావడంతో "దగ్గరలో హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి" అంటూ తొందర చేయసాగాడు. సత్యమూర్తికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు, చేతిలో చిల్లిగవ్వ లేదు. రాజుకి అతని పరిస్థితి అర్ధమైంది, "పైసలు గురించి చూడకు మామా, నేనున్నానుగా ముందు హాస్పిటలుకి వెళ్దాం పద, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో" అంటూ బయటకి వెళ్ళి ఆటో తీసుకు వచ్చాడు. సుజాతని ఆటోలో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకి వెళ్లారు. ఆమెని చూసిన డాక్టర్ కొన్ని పరీక్షలు రాసి నొప్పి తగ్గడానికి ఏవో మందులు రాసింది. ఆ పరీక్షలకి రెండువేలు అవుతాయని చెప్పింది అక్కడ ఉన్న అమ్మాయి. "ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ లో చేర్చుకోరా మాడమ్" అని అడిగాడు రాజు డాక్టరమ్మని. ఆరోగ్యశ్రీ ద్వారా కుదరదు. అయినా ఇప్పుడు ఆ పధకం ద్వారా పేషెంటులని చేర్చుకోవడం లేదు అని చెప్పింది డాక్టర్. ఇక ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న డబ్బుతో ఆమెకి పరీక్షలు చేయించాడు రాజు. 

    డాక్టర్ రాసిన మందులు వాడాకా సుజాతకి కొంచెం నొప్పి తగ్గింది. అయితే అప్పుడప్పుడూ సడన్ గా నొప్పి వస్తూనే ఉంది. ఒక్క మెతుకు కూడా ముట్టలేకపోతోంది. సుజాతని సత్యమూర్తి ఎంతో బ్రతిమలాడుతున్నాడు అన్నం తినమని. కానీ ఆమె వల్ల కావడం లేదు. ఆమెని అలా చూస్తూ పనికి కూడా వెళ్లలేకపోతున్నాడు సత్యమూర్తి. ఒక రోజు పనికి వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. "పనిలోకి వెళ్లయ్యా, నాకేం కాదులే" అంటూ భర్తకి ధైర్యం చెబుతోంది సుజాత. వాళ్ళకి ఒక్కతే కూతురు మంగ, లేక లేక పుట్టిన బిడ్డ. పోయిన ఏడాదే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. "మంగని పంపమని అల్లుడికి ఫోన్ చేసి చెబుతానే" అని మూర్తి అంటుంటే "వద్దయ్యా, దానికి చెప్పొద్దు, అది కంగారు పడిపోద్ది" అంది సుజాత. నాలుగిళ్ళల్లో పని చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తూ భర్తకి తోడుగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొస్తోంది సుజాత. ఉండడానికి ఇల్లు లేదు ఒక రేకు గది తప్ప, రోగం వస్తే నయం చేసుకోవడానికి పది రూపాయలు చేతిలో ఉండవు. ఎలాగో రెక్కల కష్టం చేసుకుని కూతురిని ఒక ఇంటి దాన్ని చేశారు వాళ్ళు.

    రెండు రోజులు తరవాత సుజాతని తీసుకుని రాజుతో పాటు హాస్పిటలుకి వెళ్ళాడు సత్యమూర్తి. డాక్టరమ్మ మళ్ళీ సుజాతని పరీక్ష చేసి టెస్ట్ రిపోర్టులు చూసి ఆమెని బయటకి వెళ్ళమని సత్యమూర్తితో ఆమెకి కడుపులో కాన్సర్ ఉందని చెప్పింది. డాక్టరమ్మ అలా చెప్పగానే సత్యమూర్తికి మతి పోయింది. "ఆపరేషన్ చేయాలి, రెండు లక్షలు ఖర్చు అవుతుంది, అయినా గారంటీ ఇవ్వలేము" అంది డాక్టర్.

    సత్యమూర్తి పడిపడి ఏడుస్తున్నాడు, రాజు ఊరుకోబెడుతున్నాడు. సుజాతకి ఈ సంగతి తెలియకూడదని కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చేశాడు సత్యమూర్తి. "ఏం పరవాలేదట అక్కా, మామకి భయం ఎక్కువ, డాక్టరమ్మ మంచి మందులు రాసింది తొందరలో తగ్గిపోతుంది" అని రాజు చెబుతుంటే సరేనని తల ఊపింది సుజాత. ముగ్గురూ బయటకి వచ్చారు. ఆటో పిలిచాడు రాజు. "వద్దు రాజూ , బస్సులో వెళ్దాం పద" అంది సుజాత. రాజు ఒప్పుకోలేదు. ఇంటికొచ్చారు. "లకిడీకాపూల్లో కాన్సర్ హాస్పిటల్ ఉంది, రేపు అక్కడకి వెళ్దాం, నువ్వేం బెంబేలు పడకు, దేవుడే మనకి సాయం చేస్తాడు" అని ధైర్యం చెప్పాడు రాజు సత్యమూర్తికి చాటుగా. 

    మర్నాడు సుజాత గొడవ చేస్తుంటే పనిలోకి వెళ్ళాడు సత్యమూర్తి. సుజాత కూడా మామూలుగా పనికి వెళ్లింది. ఆ రోజు ఒకరింట్లో పని చేస్తుంటే ఒక్కసారే తీవ్రమైన నొప్పి రావడంతో మెలికలు తిరిగిపోతూ క్రింద పడిపోయింది సుజాత.

    "ఛ ఛ, వెధవ సంత, ఎప్పుడూ ఏదో రోగమే, నెలకి నాలుగు రోజులు డుమ్మా కొడతారు, పని చేసే పది రోజులూ సరిగ్గా చేయరు" అని తిట్టుకుంటోంది ఆ ఇంటావిడ. ఎలాగో తానే మెల్లగా లేచి "ఈ మధ్య అసలు ఒంట్లో బాగుండడం లేదమ్మా, హాస్పిటలుకి వెళ్ళి చూపించుకున్నాను, తొందరలో తగ్గిపోతుందని చెప్పారు, తగ్గిపోయాకా ఇక పని మాననమ్మా, కొంచెం జీతం డబ్బు రూ.500 ఇప్పించమ్మా" అని అడిగింది సుజాత. "ఆ... డబ్బులు చెట్టుకి కాస్తాయ్, వచ్చే వారం ఇస్తాలే వెళ్ళు" అని చీదరించుకుంది ఆ ఇంటావిడ.

    ఆ రోజు సుజాతని కాన్సర్ హాస్పిటలుకి తీసుకుని వెళ్ళాడు రాజు. రాజు చాలా మంచి అబ్బాయి. మంచి మనసున్న మనిషి. డిగ్రీ చదివి ఒక కొరియర్ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఉదయం న్యూస్ పేపర్ వేస్తాడు. ఎప్పుడూ ఏదో పని సంపాదించుకుని ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ తల్లి జానకమ్మని బాగా చూసుకుంటాడు. తండ్రి త్రాగుబోతు, అతన్ని మార్చాలని శతవిధాలా ప్రయత్నించి ఇక లాభంలేదని విరమించుకున్నాడు. తండ్రి అతని మీద పెను భారమైనా తల్లీ కొడుకులిద్దరూ అతన్ని భరిస్తూనే ఉన్నారు. 

    నలుగురు డాక్టర్లు సుజాతని పరీక్ష చేసి "ఇది కాన్సర్, బాగా ముదిరిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, ఈ ఆపరేషన్ చాలా కష్టమైంది, ఇక్కడ ఈ ఆపరేషన్ చేయగల డాక్టర్ గానీ, సదుపాయాలు గానీ లేవు, కాబట్టి మీరు ఫలానా హాస్పిటలుకి వెళ్ళి చేయించుకోండి, నేను అక్కడ డాక్టర్ పరమాత్మకి లెటర్ రాసి ఇస్తా అన్నాడు" అందులో ఒక డాక్టర్. "ఆయన చేస్తేనే ఈమె బ్రతుకుతుంది" అని చెప్పాడు పైగా. 

    "సారూ, వీళ్ళు చాలా లేని వాళ్ళండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని ఇక్కడకి వచ్చాం, మీరే దయ చూపి ఈమెకి ఇక్కడే వైద్యం జరిగించండి, ప్ల్లీజ్" అని అడిగాడు రాజు.

    "ఇక్కడ చేయగలిగే పరిస్థితి ఉంటే మేము అడ్మిట్ చేసుకునే వాళ్ళం గదా. మీరు ఆలశ్యం చేసే కొద్దీ ఆమెకి ప్రాణాపాయం తప్ప ఏ ఉపయోగమూ లేదు" అని చెప్పి ఒక చీటీ వాళ్ళ చేతుల్లో పెట్టాడు ఆ డాక్టర్. 

    "కాన్సరు అని డాక్టర్లు చెబుతుంటే ఎందుకయ్యా మీరు నన్ను అక్కడకి ఇక్కడకీ తిప్పుతారు, మీకూ నాకూ ఇబ్బంది తప్ప" అంది సుజాత.

    "నువ్వు ఊరుకో అక్కా, ఇప్పుడు గొప్ప గొప్ప మందులొచ్చాయి, కాన్సరే కాదు, ఏ జబ్బైనా తగ్గిపోద్ది, కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి, ఊరికే నిరాశ పడకు" అంటూ ధైర్యం చెప్పాడు రాజు.

    సరాసరి ఆ పరమాత్మ గారుండే హాస్పిటలుకి తీసుకువెళ్లాడు రాజు సుజాతని, ఆమె హాస్పిటలుకి వద్దు అని ఎంత చెప్పినా వినకుండా. "డాక్టర్ చాలా బిజీగా ఉన్నారు, వేరే డాక్టర్ చూస్తారు, వెయిట్ చేయండి" అంది రిసెప్షన్లో ఉన్నావిడ. 

    వేరే డాక్టర్ చూసి "అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. డాక్టర్ పరమాత్మ చాలా బిజీ, అసలు నెల రోజులవరకూ ఆయన చేయాల్సిన ఆపరేషన్లు ఖరారయిపోయాయి. ఇది చాలా అర్జెంట్ కేస్ కాబట్టి ఆయనని ఎలాగో ఒప్పించి తొందరలో ఆపరేషన్ చేయిద్దాం. కానీ రెండు లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు రెడీ చేసుకొండి, మరో విషయం. ఆపరేషన్ అయిన తరువాత రేడియషన్ ట్రీటుమెంటు ఇవ్వాలి, దానికి మరో లక్ష ఖర్చు అవుతుంది, ఎందుకైనా మంచిదని ముందే చెబుతున్నా, ఇక మీదే ఆలశ్యం" అంటూ "నెక్స్ట్" అని పిలిచాడు వీళ్ళని వెళ్ళమని చెబుతూ.

    అక్కడ ఉన్న స్టాఫ్ తో గొడవ పెట్టుకున్నాడు రాజు, ఆరోగ్యశ్రీ పధకం క్రింద ఎందుకు ఆపరేషన్ చేయరని. కంఠశోష తప్ప మిగిలింది ఏమీ లేదు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడడం తప్ప ఈ కుళ్లుసమాజంలో డబ్బు రోగం పట్టుకున్న ఈ ప్రపంచంలో పేద వాడికి ఏ న్యాయమూ జరగదని బాధ పడుతూ క్రుంగిపోతున్న సత్యమూర్తికి ధైర్యం చెబుతూ ఇంటికి తీసుకు వెళ్ళాడు రాజు. 

    సత్యమూర్తి ఒక కంస్ట్రక్షన్ కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాడు. కంపనీ యజమానికి తన భార్య రోగం గురించీ ఆపరేషన్ గురించీ చెప్పి అది ఎలాగోలా మీరే చేయించి పుణ్యం కట్టుకోమని బ్రతిమాలాడు తన యజమానిని. 

    "చూడు మూర్తీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీలు అవీ పని చేయడం లేదమ్మా, కాన్సర్ కదా, ఎలాగోలా డబ్బు చూసుకుని ప్రైవేటు హాస్పిటలులోనే వైద్యం చేయించుకోవాలి, తప్పదు. నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేనో రూ.10000 సహాయం చేస్తా, మిగిలింది నువ్వే ఏదో రకంగా చూసుకో" అని సలహా ఇచ్చి మరో మాట మాట్లాడడానికి తావు ఇవ్వకుండా తప్పుకున్నాడు. అతనికి లెక్కలేనంత ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు, అమెరికాలో పెద్ద ఉద్యోగం. ఎన్ని ఉంటే ఏం లాభం, మనసు మాత్రం లేదు, రెండు మూడు లక్షలు అతనికి రెండు రూపాయలతో సమానం, కానీ దమ్మీడీ  ఇవ్వడు, ఇవ్వబుద్ది కాదు. ఇవ్వగలడు, కానీ ఇవ్వడు, అంతే.

    ఇప్పుడు ఇంత డబ్బు ఎలా తెచ్చేది. రోజు రోజుకీ సుజాత పరిస్థితి క్షీణిస్తోంది. సత్యమూర్తికి ఏమీ పాలిపోవడం లేదు. ఎవరూ సహాయం చేసే వాళ్ళు లేరు. గుండెలు ఆవిసిపోతున్నాయి ఏడ్చిఏడ్చి. పక్కన రాజు లేకపోతే తన పరిస్థితి ఏమిటి. అతన్ని గట్టిగా కౌగిలించుకుని బావురుమన్నాడు సత్యమూర్తి.
వారం రోజులు గడిచాయి. సత్యమూర్తి ఓ రోజు ఉదయమే రాజుని పిలిచి తను తెచ్చిన రూ.2 లక్షలు చూపించి, "ఇదిగో డబ్బు దొరికింది రాజూ ఇక సుజాతకి ఆపరేషన్ అయిపోయినట్టే కదా, ఆమె బాగైపోతుంది కదా" అని ఆతృతతో సత్యమూర్తి అంటుంటే రాజు కళ్ళల్లో ఆనందం. "ఎలా తెచ్చావ్ ఇంత డబ్బు" అడిగాడు రాజు సత్యమూర్తిని. "అదంతా తరవాత చెబుతా గానీ ముందు ఇంటికి పద, అక్కని వెంటనే హాస్పిటల్లో చేర్పిద్దాం" అన్నాడు సత్యమూర్తి. 
సుజాతకి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నారు డాక్టర్లు. "కొద్ది రోజుల తర్వాత రేడియషన్ చికిత్స చేయాలి. అంత వరకూ మందులు వాడాలి. నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం" అని చెప్పారు.

    సుజాతకి కొంచెం తేలికగా ఉండడంతో సత్యమూర్తి మనసు హాయిగా ఉంది. కళ్ళల్లో ఇప్పుడు మందహాసం కనిపిస్తోంది. భర్త కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఆమె కళ్ళల్లో తెలియకుండానే నీళ్ళు. సుజాతని డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులు గడిచాయి. సత్యమూర్తి, సుజాత, రాజు వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయారు.

    సత్యమూర్తి ఎంత చెప్పినా వినకుండా పనికి వెళ్లింది సుజాత. కానీ పని చేస్తూ చేస్తూ అలసిపోతోంది. ఎక్కడా మానకుండా ఉదయమే అందరి ఇంటికీ వెళ్ళి పనులు చేస్తోంది. అయినా ఎప్పుడూ ఏవో తిట్లూ తిరస్కారాలూ. అలవాటైపోయింది తనకు. 

    ఆ రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు సత్యమూర్తి. తను వచ్చే వరకూ ఎంత పొద్దుపోయినా మెలకువగా ఉండే సుజాత మంచం మీద పడుకుని తను వచ్చిన అలికిడి అయినా కదలకుండా ఉండేసరికి భయం పుట్టుకొచ్చింది అతనికి. ఆ పక్కకి తిరిగి ఉన్న సుజాతని ఇటు వైపు తిప్పాడు. ఒకటే రక్తం నోట్లోంచి. వెంటనే రాజుని పిలవడానికి వాళ్ళ ఇంటికి పరుగెత్తాడు. రాజు ఇంట్లో లేడు. జానకమ్మని తోడుకొచ్చి భార్యని వెంటనే హాస్పిటలుకి తీసుకువెళ్లాడు సత్యమూర్తి. డ్యూటీలో ఉన్న డాక్టర్ చూసి పెదవి విరిచి "అర్జెంటుగా అడ్మిట్ చేయాలి. పెద్ద డాక్టర్ గారు రేపు కానీ రారు, ఆయన వచ్చి చూస్తే కానీ ఏమీ చెప్పలేం, అడ్మిట్ చేస్తే సెలైన్ పెట్టి మందులు మాత్రం ఇస్తాం" అన్నాడు. 

    "సరే బాబూ, హాస్పిటలులో పెట్టండి, నా భార్యని ఎలాగైనా కాపాడండి" అని ఏడుస్తూ బ్రతిమాలాడాడు. అడ్మిషన్ చీటీ రాసిచ్చి "రిసెప్షన్లో డబ్బు కట్టి అడ్మిట్ చేయండి, నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలుపెడతాను" అన్నాడు డాక్టర్. మళ్ళీ డబ్బు కట్టాలా, వీళ్ళే కదా ఆపరేషన్ చేసి జబ్బు తగ్గిపోయిందని చెప్పారు అనుకుంటూ చేసేదేమీలేక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన చీటీ చూపించాడు. అది చూసి వాళ్ళు రూ.10000 కట్టమన్నారు అడ్వాన్సుగా. అతని దగ్గర ఉన్నది 50 రూపాయలు. వాళ్ళకి తన పరిస్థితి చెప్పి డబ్బు లేకుండా భార్యని చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు. లాభం లేకపోయేసరికి భార్యని తీసుకుని ఇంటికొచ్చాడు. అతని పరిస్థితిని చూస్తున్న జానకమ్మ గుండె తరుక్కుపోతోంది. రాజు వచ్చి అంతా విని సుజాత బాధ చూళ్లేకపోయాడు. సత్యమూర్తి కూడా తెగులు వచ్చిన వాడిలా కనిపిస్తుంటే రాజుకి కూడా ఏం చేయాలో అర్ధం కాలేదు. రాజు బయటకి వెళ్ళి ఆటో తీసుకుని వచ్చాడు. "పదండి ఉస్మానియా హాస్పిటలుకి వెళ్దాం" అంటూ సత్యమూర్తికి ధైర్యం చెబుతూ అతన్ని ఓదారుస్తున్నాడు. హాస్పిటలు ఎమర్జెన్సీ వార్డ్ లోకి నేరుగా వెళ్లారు. డాక్టర్ సుజాత తాలూకు మెడికల్ పేపర్లు అన్నీ చూసి అడ్మిషన్ రాశాడు. అయితే అతను ఏమీ చెప్పడం లేదు. రాజు డాక్టరుకి అన్నీ విషయాలు చెప్పాడు. "సరే, అడ్మిట్ చేయండి, చూద్దాం" అన్నాడతను. సత్యమూర్తికి కొండంత బలం వచ్చింది. సుజాతని వార్డులో చేర్చగానే డాక్టర్ వచ్చి ఏవో పరీక్షలు మందులూ రాసి నర్సుకి చెప్పి వెళ్లిపోయాడు. రాత్రికి జానకమ్మ, రాజు అక్కడే ఉండిపోయారు సత్యమూర్తికి తోడుగా. జానకమ్మ సుజాత దగ్గర ఉంది. రాజూ, సత్యమూర్తి క్రింద ఓ పక్కన కూర్చున్నారు. సత్యమూర్తి నిద్రలోకి జారుకున్నాడు. రాజు ఒకసారి వార్డులోనికి వెళ్ళి చూశాడు. సుజాత మెల్లగా బాత్రూమ్ కి వెళ్తోంది. "రాత్రి ఇంకో డాక్టరయ్య వచ్చి చూశాడు రా రాజూ, కానీ ఏమీ చెప్పలేదు మరి" అంది జానకమ్మ కొడుకుతో.

    తెల్లవారింది. రాజు బయటకి వెళ్ళి టీ తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చాడు. ఇంకా సత్యమూర్తి లేవలేదు. లేవమని గట్టిగా కదిపాడు రాజు అతన్ని. అయినా లేవలేదు. సత్యమూర్తి స్పృహలో లేడు, రాజు వెంటనే అతన్ని డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లాడు. ఆ డాక్టర్ "ఇతన్ని వెంటనే హాస్పిటలులో అడ్మిట్ చేయాలి" అని చెబితే రాజుకి ఏమీ అర్ధం కావడం లేదు. ఒక వైపు సుజాతక్క, మరోవైపు సత్యమూర్తి ఇద్దరూ హాస్పిటలులో. రాజు వెంటనే సత్యమూర్తి కూతురుకీ అల్లుడుకీ ఫోను చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరమని చెప్పాడు. తల్లి జానకమ్మని చాటుకి పిలిచి విషయం చెప్పగానే ఆమె క్రుంగిపోయింది. ఆ విషయం సుజాతకి చెప్పకుండా దాచారు వాళ్ళు. 

    సుజాత భర్త ఎక్కడ అని జానకమ్మని అడుగుతోంది. ఇంటికి వెళ్ళాడు. ఆయనొస్తాడు కానీ నువ్వు ఈ ఇడ్లీ తిను అంటూ పెట్టింది. ఆమె తినడం లేదు. పెద్ద డాక్టర్ వచ్చారు. ఆయన సుజాత పాత మెడికల్ పేపర్లు, రాత్రి హాస్పిటలులో చేసిన టెస్టుల రిపోర్టులు చూసి జానకమ్మని పక్కకి రమ్మని సైగ చేశాడు. "చూడమ్మా, ఈమెకి కాన్సర్ ఉంది, ఆపరేషన్ చేశారు, కాన్సర్ గడ్డ తేసేశారు, కానీ మళ్ళీ గడ్డ ప్రేగు లోపలనుండి బయలుదేరింది. ఇక ఆపరేషన్ చేసీనా ఉపయోగం లేదు, ఈమె వారం రోజులకంటే ఎక్కువ బ్రతకడం కష్టం అని చెప్పాడు" ఇదంతా గమనిస్తూనే ఉంది సుజాత. తను బ్రతకదన్న విషయం తనకి తెలుసు, ఇప్పుడు తన బాధ అంతా భర్త గురించే, అసలే అమాయకుడు, ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడు అన్న దిగులే ఎక్కువ ఆమెలో. 

    పురుషుల వార్డులో సత్యమూర్తి దగ్గర ఉన్న రాజుని ఉద్దేశించి "ఇతను నీకేమి అవుతాడు" అని అడిగాడు డాక్టర్. 

    "ఇతను మా ఇంటి పక్కనే ఉంటాడు సార్, మాకు బాగా కావలసిన వాడు" అన్నాడు రాజు 

    "చూడు బాబూ, ఇతనికి ఈ మధ్య ఆపరేషన్ జరిగింది. ఒక కిడ్నీని తీశారు. దాని వలన ఇతనికి రియాక్షన్ వచ్చి ఇతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. కిడ్నీ తీయడంలో పొరపాటేదో జరిగినట్టుంది. ఈ విషయాలేవీ నీకు తెలియవా" అని అడిగాడు డాక్టర్.

    రాజుకి అప్పుడు అర్ధమైంది. సుజాతక్క ఆపరేషన్ కోసం సత్యమూర్తి కిడ్నీని అమ్ముకున్నాడన్న సంగతి. అదే విషయం డాక్టరుకి చెప్పాడు. 

    అతని ప్రేమకి త్యాగానికి మనసులో జోహార్లు చెప్పుకున్నాడు రాజు.

    "ఐ యాం సో సారీ" అన్నాడు డాక్టర్ 

    సత్యమూర్తి పక్కన కూర్చున్నాడు రాజు. సత్యమూర్తికి తెలియదు తనకి ఏమైందో. రాజుని అడిగాడు తనని హాస్పిటలులో ఎందుకు పెట్టారు అని. 

    "ఏమీ లేదు మామా, రాత్రి నువ్వు చాలా నీరసంగా ఉండి పడిపోయావ్, నేనెంత లేపినా లేవలేదు, అందుకని హాస్పిటలులో పెట్టాల్సివచ్చింది" అన్నాడు రాజు.

    "కాస్త నీరసానికే హాస్పిటలులో చేర్చుతావా, నీ భయం కాకపోతే, పద వెళ్ళిపోదాం. సుజాతని చూడాలి" అన్నాడు సత్యమూర్తి.

    "అలా వెళ్లనివ్వరు, ఈ రోజుకి ఓపిక పట్టు. సుజాతక్క బాగానే ఉంది, అమ్మ అక్కడే ఉంది" అని చెప్పాడు రాజు.  

    "మీరే లేకపోతే మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళెవరు" అంటూ రాజు వంక దీనంగా చూశాడు సత్యమూర్తి. 

    ఇంతలో సత్యమూర్తి మిత్రుడు వెంకటయ్య అనే అతను వచ్చాడు విషయం తెలిసి హాస్పిటలుకి చూడడానికి. అతనికి తెలుసు సత్యమూర్తి కిడ్నీని అమ్మిన సంగతి. ఏమీ చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు సత్యమూర్తి వెంకటయ్యకి. వెంకటయ్య రెండు నిమిషాలు సత్యమూర్తితో మాట్లాడిన తర్వాత రాజు అతనితో బయటకి వచ్చాడు. రాజు అడిగాడు అతన్ని సత్యమూర్తి కిడ్నీ అమ్మిన సంగతి గురించి. వెంకటయ్య ఏమీ చెప్పలేదు. "నాకంతా తెలుసు, డాక్టరే చెప్పాడు అతని కిడ్నీ లేదని. కిడ్నీ తీయడంలో పొరపాటు వలనే అతనికి ప్రోబ్లమ్ వచ్చిందని" అన్నాడు రాజు. 

    వెంకటయ్య బాధపడ్డాడు, అసలు విషయం చెప్పనారంబించాడు.

    "సత్యమూర్తికి ఎవరో ఒక ఆసామి సలహా ఇచ్చాడట తన భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బు గురించి. ఆ విషయం ఆ రోజు నాతో చెప్పి నన్ను తోడుగా రమ్మంటే ఇద్దరమూ వెళ్ళాం ఒక చోటకి. కిడ్నీ ఇస్తే మూడు లక్షలు వస్తాయని చెప్పడంతో బేరం కుదిరింది. సత్యమూర్తి కూడా మూడు లక్షలే అడిగాడు. అవతలి వాళ్ళు సరే అన్నారు, అడ్వాన్సుగా రూ.10,000 ఇచ్చారు. అతన్ని మూడో రోజు రమ్మన్నారు ఆపరేషన్ కి. ఆపరేషన్ పూర్తి అయింది. వెంటనే డబ్బు ఇవ్వలేదు, మూడు రోజులు తిప్పుకున్నారు, ఎలాగైతే చేతిలో రెండు లక్షలు పెట్టారు, ఇదేమిటి అని అడిగితే ఏవో లెఖలు చెప్పారు, మాకు  తెలియదు ఇది బ్రోకర్ల వ్యవహారం అని. ఇక చేసేది లేక డబ్బు తీసుకుని ఇంటికొచ్చాం. ఇదంతా ఒక వారంలో జరిగింది. ఆ సమయంలో తనని యజమాని ఊరికి పంపించాడని చెప్పమన్నాడు ఎవరైనా అడిగితే, ముఖ్యంగా తన భార్యకీ నీకూ." చెప్పాడు వెంకటయ్య.

    నిజానికి సత్యమూర్తి కిడ్నీని ఆ బ్రోకర్లు రూ. 5 లక్షలకి అమ్ముకున్నారన్న సంగతి సత్యమూర్తికి కానీ వెంకటయ్యకి కానీ తెలియదు.

    "సుజాతని మళ్ళీ హాస్పిటలులో పెట్టడంతో కిడ్నీ బేరం కుదుర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబుచ్చుకుని ఒక లక్ష రూపాయలు ఇప్పించమని అడగడానికని వెళ్ళాం. అక్కడున్న పెద్దమనిషికి సుజాత కాన్సరు గురించి, ఆమెకి ఇంకా జరగాల్సిన వైద్యం  గురించి చెప్పి ముందు చెప్పినట్టుగా రూ.3 లక్షలు ఇప్పించమని మర్యాదగానే అడిగాం. 'నీ కిడ్నీని మేమేం తిన్నామా, ఎవరికో కిడ్నీ కావాలంటే నీకు సాయం చేశాం. అయినా దీనిలో చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన దానితో సంతోషించు వెళ్ళు వెళ్ళు' అని కసురుకున్నాడు ఆ పెద్ద మనిషి. ఇక చేసేదేమీలేక బేల మొహం వేసుకుని వెనుదిరిగాం” చెప్పాడు  వెంకటయ్య. 

    జానకమ్మ హడావిడిగా వచ్చి కొడుకుని రమ్మని సుజాత ఉన్న వార్డులోకి తీసుకువెళ్లింది.

    సుజాత చనిపోయింది. పుణిస్త్రీ గా వెళ్లిపోవాలనుకున్న ఆమె కోరిక నెరవేరింది. దాని కోసమే సత్యమూర్తి కూడా బ్రతికి ఉన్నట్టుంది.

    సత్యమూర్తికి ఈ విషయం చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్పాడు. సత్యమూర్తి గుండె పగిలిపోయింది. 

    సుజాత శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి బయటపెట్టి దహనక్రియకి ఏర్పాట్లు చూస్తున్నాడు రాజు. అతని మిత్రులు వచ్చి సహాయం చేస్తున్నారు.

    కూతురు మంగ తల్లి శవం మీద పడి బోరున ఏడ్వసాగింది. అల్లుడికి కూడా కన్నీళ్లు ఆగడంలేదు. సుజాత శవానికి అంత్యక్రియలు జరిగిపోయాయి. 

    కాన్సరుకీ మందు లేదు, ఈ కుళ్లిన సమాజానికి కూడా మందు లేదు అనుకుంటూ వాపోయాడు రాజు.

    సత్యమూర్తి బ్రతికి ఉన్న శవంలా జరుగుతున్న తంతు అంతా చూస్తూ ఉండిపోయాడు.

    చావు అతనికి దగ్గరగానే ఉన్నా ఏ మాత్రం భయపడకుండా సుజాత దగ్గరకి ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూడసాగాడు.

    మంగ తండ్రి భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె తల నిమురుతూ ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు సత్యమూర్తి. 

    రాజుకి దుఃఖం ఆగడం లేదు, సమాజం మీద కోపం తన్నుకొస్తుంది అతనికి. 

(ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం 28.11.2011 సంచికలో ప్రచురితం)  

Comments