కొలువు - వడలి రాధాకృష్ణ

    "నీ పేరు"
    "లక్ష్మి"
    "ఏమిటీ లచ్చిమియా"
    "లేదమ్మా! ఆదిలక్ష్మి!!"

    "చూడు ఆదిలచ్చిమీ పని అమ్మాయి అంటే అణకువగా నమ్మకంగా ఉండాలి. జీతం నెలకు మూడొందలు ఇస్తాను సరేనా!"

    "సరేనమ్మ గారూ"

    మొదటి నుండి సరస్వతికి పనిమనిషి అంటే ఇష్టంలేదు. వాళ్ళు చక్కగా పనిచేయరని, డబ్బు కౌపీనం మనుషులని, మనిషి కనుమరుగైతే చేతి వాటానికి పాల్పడతారని. అందుకే తన హోదాని మరచికూడ తమ పనిని తానే చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ ఇప్పుడేం చేస్తుంది.
    ఆరోగ్యం దెబ్బతినడంతో డాక్టర్లు బెడ్‌రెస్ట్ కావాలన్నారు. ఇప్పుడు సరిగా లేవలేకపోతోంది.

    కూతురు అపర్ణకు పెళ్ళి అయిపోవడంతో తమని ఒదిలి ముగుడితో హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. కొడుకు ఆకాశ్‌కి ముంబాయిలో జాబ్ రావడంతో వెళ్ళి దాదాపు సంవత్సరమైంది. ఇక మిగిలింది సరస్వతి భర్త మల్లికార్జున్. శరీరం సహకరించక పోవడంతో రోజూ మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది సరస్వతి. వంట చేయడం మొదలుకొని ఇంటిపనులకి బయట పనులకి పనిమనిషి మీద ఆధార పడడం తప్పలేదు. మొదట్లో ఏమో అనుకున్నా కొత్త పనిపిల్ల నమ్మకంగానే ఉంటోంది.

    ఉదయాన్నే సరస్వతికి స్నానం చేయించడం దగ్గర నుండీ అంట్లు తోమడం, ఇల్లు ఊడ్చడం, వంట చేసి మల్లికార్జునకి బాక్స్ ఇచ్చి పంపడం దాకా విసుగులేక చెదరని చిరునవ్వుతో చేస్తోంది.

    నెలసరి వెచ్చాలు తెచ్చినప్పుడు మంచి హేతుబద్ధతతో చిన్నవస్తువు కూడ మరువకుండా ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్త పాటిస్తుంటుంది. మొత్తానికి ఆదిలక్ష్మి అండతో సరస్వతి మల్లికార్జునుల దినచర్య సక్రమంగా సాగిపోతోంది.

* * * * * * *

                                                                     ముంబాయి
        
    హాయ్‌మమ్ గుడ్ ఈవెనింగ్... ఏంచేస్తున్నావ్! మార్నింగ్ ఫోన్ చేద్దామనుకున్నా. ఎలాగూ నీకు లెటర్ రాయాలి కదా! అని ఊరుకున్నా. డాడీ ఏం చేస్తున్నారు... క్యాంప్‌కు వెళతారని మొన్న చెప్పావు...వెళ్ళారా! మరల ఎప్పుడొస్తున్నారు. నీ ఆరోగ్యం ఎలా ఉంది.
    ముఖ్యంగా రేపు సెకండ్ మినార్ ఎక్సుప్రెస్‌కి విజయవాడ వస్తున్నాను. అక్కడ ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్‌లో మా కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తోంది. మేము తయారు చేసే కొత్త ప్రోడక్ట్ ప్రమోట్ చేసే బాధ్యత ఈసారి నాకప్పగించారు. ఈ టీంను నేనే లీడ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రెస్టేజియస్ ఈవెంట్. ఇది సక్సస్ అయితే మా కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుంది. దానికి అక్కడ మన వాళ్ళందరి సహకారం నాకు కావాల్సి ఉంటుంది. ఇది వారం రోజుల ప్రొగ్రాం. తరువాత మా ఫ్రెండ్ అని మ్యారేజ్ ఉయ్యూరులో ఉంది. దానికి అటెండవ్వాలి.
    అక్కడి నుండి పెదనాన్న గారింటికి వెళ్ళి ఆయన్ని చూసి రావాలనుకుంటున్నాను. పెద్దమ్మ ఆరోగ్యం బాగా లేదని చెప్పావు. ఇప్పుడెలా ఉంది? వైజాగ్ మా కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. రెటర్న్ లో అక్కగారింటికి వెళదామనుకుంటున్నా. మొత్తం మీద త్రీ వీక్స్ టూర్ ఇది. అయినా అక్కడికీ ఇక్కడికీ తిరగడంతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. ఐదు, ఆరు రోజుల మించి మనింటి దగ్గర ఉండడం కుదరదు. అప్పుడు నీ చేతి వంట తినే అవకాశం తినే అవకాశం దొరుకుతుంది. నేను వచ్చినప్పుడు డాడీని ఎక్కడికీ పనులు పెట్టుకొని వెళ్లవద్దని చెప్పు.
    నాకిష్టమైన పాలకోవా, పెరుగు ఆవడ, నేతి పొంగలి, గుత్తివంకాయ కూర, బెల్లం ఆవకాయ చేయించుకుని కులాసాగా నీతో కబుర్లాడుతూ తినాలనుంది. మర్చిపోయాను. మొన్న బోనస్ యాభై వేల రూపాయలు ఇచ్చారు. దానితో నీకు దుబాయ్ నుండి మా ఫ్రెండ్ ద్వారా బ్యాంగిల్స్, డాడీకి జర్కిన్ తెప్పించాను.
    ఆయన రోజూ టైంకి వస్తున్నారా? లేక ఆడిట్సు, కస్టమర్ విజిట్లంటూ ఆఫీసుకే తాళికట్టేస్తున్నారా? ఫోన్‌లో చెబితే కొన్ని విషయాలు మర్చిపోతాననే ఉద్దేశ్యంతో ఈ లెటర్ రాస్తున్నాను. సరిగ్గా వారం రోజుల్లో వచ్చి నీ ఒళ్లో వాలిపోతాను. అంతవరకూ నిమిషాలని రోజుల్లా లెక్కపెట్టుకుంటున్నా.

                                                                ఇట్లు
                                                                 నీ ఆకాష్

    కొడుకు రాసిన లెటర్ చూసి సరస్వతి మనసు రాగరంజితమైంది. 'పిచ్చిసన్యాసి వారం రోజుల్లో వస్తున్నాడట. అమ్మని నాన్ని ఒదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాణ్ణి చూసి అప్పుడే సంవత్సరమైంది. అసలు ఈ కాలపు పిల్లల్లా ఉండడు. వాడు నాకొడుకు.' ఆనందంతో ఉత్తరాన్ని నాలుగైదుసార్లు చదువుకొంది.

    "అమ్మగారూ! మొత్తానికి గ్యాస్ సిలిండర్ సంపాదించుకు వచ్చానమ్మా! మొదట్లో స్టాకు లేదు, ఇప్పుడు బుక్ చేసుకుంటే పదిరోజుల తరువాత గానీ డెలివరీ ఇవ్వనన్నాడు. ఓనర్‌ని దబాయిస్తే మొత్తానికి బ్లాక్ చేసింది తీసి ఇచ్చాడు" రిక్షావాలా సాయంతో సిలిండర్‌ని దించుతూ చెప్పింది ఆదిలక్ష్మి.

    "అబ్బా! నీకు ఏ పని చెప్పినా ఇక చూసుకోనవసరం లేదు. అదే అయ్యగారికి చెబితే ఏదో మామూలుగా ఒక ఫోన్ చేసి ఎప్పుడో పంపుతాడులే అని ఊరుకుంటారు. తరువాత దానిగురించి పెద్దగా పట్టించుకోరు."

    "పోనీలెండి అయ్యగారికి ఆఫీసు పనులతోనే సరిపోతుంది. ఇఉవంటి చిన్నచిన్నవి చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా!"

    "సరే నాలుగు రోజుల్లో బాబు వస్తున్నాడు. ఇంట్లో గ్యాస్ నిండూకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. మిగిలిన డబ్బులతో పూలు కొనుక్కో"

    "ఎందుకమ్మా! నెలనెలా జీతం ఇస్తూనే ఉన్నారు. పై డబ్బులు ఏం చెసుకుంటాను చెప్పండి. పూలు కావాలంటే మీ పెరట్లోనే కోసుకొంటున్నాను కదా" చిల్లర తిరిగి ఇచ్చే ఆదిలక్ష్మి తనకు ఆత్మబంధువుగా తోచింది సరస్వతికి ఆ క్షణంలో.

    "అయితే ఆకాశ్‌బాబు వస్తున్నారన్నమాట. ఆయన గురించి మీరు చెబితే వినడం, ఫోటోలో చూడడం తప్ప మనిషిని ఇంతవరకూ చూడలేదు. అయాగారూ, మీరూ నన్ను కన్నకూతురు కన్న ఎక్కువగా కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారు. సాధారణంగా మీలాంటి పెద్ద ఇళ్ళలోని మనుషులకి డాబు, దర్పం, అహం, గర్వం ఎక్కువగా ఉంటాయి. మాలాంటివాళ్లని చాలా చిన్న చూపు చూసి మాట్లాడుతుంటారు. అందువల్లే మనసుకి కష్టం అనిపించి చాలా ఇళ్లని వదిలేశాను. ఇక చిన్నయ్యగారు ఎలా ఉంటారో చూడాలి"

    "లేదు లేవే ఆకాశ్ అటువంటి వాడు కాదు. చూద్దువుగాని కాదా!" సరస్వతి ఏదో మాట్లాడుతోందే కాని మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది. ఆదిలక్ష్మి కూడా చాలా చలాకీ మనిషి. పేరుకు తగ్గట్టు చాలా మంచి పిల్ల. తండ్రి ఈమె చిన్నతనంలోనే తల్లిని ఒదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడట. దానితో తల్లి ఆ ఇంట్లోనూ, ఈ ఇంట్లోనూ పనులు చూసుకుంటూ కూతుర్ని పెంచి పెద్ద చేసింది. తరువాత భయంకర వ్యాధి ఆమెను కబళించడంతో అనాథగా మిగిలిపోయింది. మంచితనంతో కష్టపడి పొట్టపోసుకునేది. మల్లికార్జున్ ఇంట్లో వెచ్చాలు తెచ్చిపెట్టాలన్నా, వంటపనులు చెయ్యాలన్నా, పాలు తేవాలన్నా, ఫోన్ బిల్లు కట్టాలన్నా, హాస్పిటల్‌కి తోడు రావాలన్నా అన్నింటికీ కేంద్రబిందువుగా రూపాంతరం చెందింది. పనిమనిషిగా కాకుండా ఆ ఇంటి మనిషి అని చెప్పుకొనే స్థాయికెదిగింది.
    ఆదిలక్ష్మిని చూస్తే ఒక్కోసారి తనకు అసూయ కల్గుతోంది. మరోసారి విపరీతమైన జాలి కలుగుతుంది. ఇరవై సంవత్సరాల పై చిలుకు వయసున్న మెరుపుతీగ ఆమె.

    అందం ఆడదాని సొత్తు. అందుకే ఈ ప్రకృతి వనితా విహారమిందని కవులు స్త్రీని వర్ణిస్తారు. ఆ మాటకొస్తే అందానికే అందం ఈ ఆదిలక్ష్మి. ఎదుటి మనిషి మతిభ్రమింప చేసేంతటి మార్వలెస్ ఫిజిక్. నేచర్ సృష్టించిన నాచురల్ బ్యూటీ.

    ఆమె నవ్వితే ఆ కంఠస్వరం ఇతరుల్ని మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అపురూప లావణ్యం. కట్టిపడేసే అందం.
    మెరుపుతీగలా దృష్టి మార్చుకోలేని అందం.     సొగసుతో పరవశుల్ని చేసే అందం.     అందానికి నిర్వచనం ఆమె.
    బలమైన శరీరం, ఎత్తుకు తగిన సౌష్టవం, సువర్ణాన్ని బోలిన ఛాయ, విశాలమైన నుదురు, నెమలి కనుల్లాంటి రెప్పలు, వాటి మాటున కవ్వించే కళ్లు. ఆదిలక్ష్మిని ఏ కోణంలోంచి చూసినా లావణ్యం మరింత ద్విగుణీకృతమవుతూ ఉంటుంది.

    తల దువ్వుకోకపోయినా అందంగా ఉంటుంది.
    ఏ బట్ట కట్టినా దానికే అందాన్ని చేకూరుస్తింది.
    తిలకం దిద్దుకోకపోతే అదో రకమైన కోమలత్వం.

    అంట్లు తోముతుంటే మరో విధమైన ఆకర్షణ కలిగి వుంటుంది.
    బట్టలు ఉతుకుతుంటే అందం. ఉతికినవి ఆరేస్తుంటే మరో అందం.
    ఏ సందర్భంలో చూసినా నాజూకుతనం, కోమలత్వం ఉట్టిపడూతూ చూపరులను ఆకర్షిస్తూంది. 

         అందం...అందానికి తగిన చమత్కార గుణం ఆమె సొంతం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సందర్భోచితంగా మాట్లాడటం వెన్నతో పెట్టిన విద్య. ఎటువంటి మనిషినైనా మాటలు చెప్పి ఆకట్టుకునే తత్వం. కన్విన్సింగ్ కెపాసిటీ ఎక్కువ. ఎప్పటికేది ముఖ్యమో అదే చేస్తూ వుంటుంది. ఎదుటివారి మనస్తత్వాన్ని ఇట్టే పసిగట్టి వారిని నొప్పించక తన పని పూర్తి చేసుకుంటూ ఉంటుంది.    

          ఒకసారి బెడ్‌రూమ్ లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేస్తుంటే ఆదిలక్ష్మికి బ్యాంగిల్ సెట్ నేలమీద దొరికింది.
    "అమ్మగారూ! బీరువాలో భద్రంగా దాచుకోవలసిన బంగారు గాజులు ఇలా పడేశారు. అంత అజాగ్రత్త అయితే ఎలా చెప్పండీ?" నిజాయితీగా తెచ్చి ఇచ్చిన ఆమెను అభినందించకుండా ఉండలేక పోయింది. 

        మెడికల్ చెకప్‌కని సరస్వతి కూతురు ఇంటికి హైదరాబాద్ వెళ్లి వారం రోజులుండి వచ్చింది. తిరిగి వచ్చేసరికి తన ఇంటి స్వరూపం సమూలంగా మారిపోయి ఉండడం మంచి ఆనందాన్ని కలిగించింది. డ్రాయింగ్ రూమ్, సోఫా, కలర్ టి.వి, టెలిఫోన్ అన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి. అస్సలు డబ్బు ఖర్చు లేకుండా ఉన్నవాటినే చిన్న చిన్న మార్పులు చేసేసరికి ఆ ఇంటికి విపరీతమైన శోభ చేకూరింది. పెరట్లో పిచ్చిమొక్కలు పీకి వేయబడి నీట్‌గా చదును చేయబడి వుంది. పూలమొక్కల్కు పాదులు చేసి నీరు పెట్టింది. ఇదివరకు సరస్వతిని అడిగే మల్లికార్జున్ ఏదైనా సలహా కావాలంటే ఇప్పుడూ ఆదిలక్ష్మిని అడగడం మొదలు పెట్టాడు. తెల్లని లంగాపై ఎర్రని ఓణీతో చక్కని నడవడిక కలిగిన ఆదిలక్ష్మి అంటే వాత్సల్యాన్ని ప్రదర్శించేవాడు.

         ఆదిలక్ష్మిని చూస్తే ఒక్కోసారి సరస్వతికి ఈర్ష్య కలుగుతుంది. ఫ్రపంచంలో ఆడవాళ్లు మగవాళ్లకి మోహాజనితంగా ఉంటారు కానీ, ఆడవాళ్లకే స్పందన కలిగించే నిలువెత్తు సౌందర్యం ఆమె స్వంతం. తను ఎన్ని అలంకారాలు పెట్టుకున్నా ఖరీదైన పట్టుచీర కట్టుకున్నా కాస్తంత కూడా అందంగా కనిపించదు. అలంకారాలతో అందాలు తెచ్చి పెట్టుకుందామని ప్రయత్నించే సరస్వతికి ఆదిలక్ష్మిని చూస్తే జెలసీగా ఉంటుంది.

    ఒక్క మాటలో చెప్పాలంటే లేమితనంతో దారిద్ర్యం వెళ్లబోయడం వలన తన ఇంటిలో పనిమనిషిగా చేరింది. లేకపోతే ఒక గొప్పింటి పిల్ల అయి వుండవలసింది. నెలకిచ్చే మూడొందలూ తీసుకుంటుందే తప్ప అది కావాలి, ఇది కావాలి అని నోరు తెరిచి ఎప్పుడూ అడగదు. మనిషి చాలా అభిమానవంతురాలు. 

    ఈమె ఆడవాళ్లకే మోహాన్ని చేకూరుస్తుంటే, ఇక వయసులో ఉన్నవాడు, పెళ్లి కావాల్సిన ఆకాశ్ దీని వలలో చిక్కుకుంటే ఇంకేమైనా ఉందా. పరువంలో ఉన్న కుర్రాళ్లు అందమైన ఆడపిల్లల్ని చూస్తే ఇట్టే ఆకర్షింపబడతారట. అసలు ఆకర్షణ వ్యామోహాలకి పేదా గొప్పా అనే తారతమ్యాలు లేవంటారు. ఉపద్రవాన్ని తలచుకొని సరస్వతి మనసు నొచ్చుకొంటూ ఉంది.     అసలు తన చరిత్రే మరలా ఇప్పుడు పునరావృతమైతే!

    ఒక్కసారి ఆమె మనసు గతం వైపు తొంగి చూసింది.     అందంగా ఉన్న ఏదైనా మల్లికార్జున్ని తొలిచూపులోనే వలచి మనసు పారేసుకుంది సరస్వతి. అప్పటికే అరడజను సంబంధాలను చూసి ఉన్న తల్లిదండ్రుల దగ్గర మనసులో మాట బయట పెట్టింది. అందం, ఆస్తి, హోదా ఉన్న అతన్ని చేసుకుందామని భావించి విషయాన్ని మల్లికార్జున్ తల్లిదండ్రులతో సంప్రదించమంది.
    అందం, చదువు, ఉద్యోగం ఉన్న ఆడపిల్లని చేసుకుంటే అహంకారం ప్రదర్శిస్తుందని అంతంతమాత్రం చదువుకుని, సాంప్రదాయపు కుటుంబంలో పెరిగిన ఆడపిల్లైతే కాస్త అణకువగా ఉంటుందని అతని భావన. అందువల్ల సరస్వతి పట్ల అనురాగమయంగానే స్పనిదించాడు. తరువాత వివాహం చేసుకోవడానికి సుముఖం వ్యక్తం చేశాడు.

    పెళ్లి అయిన తరువాత కాలక్రమేణా ఆమె పెట్టే ఆంక్షలు అతన్ని విస్మయుణ్ణి చేశాయి. ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ఆడవాళ్లతో అతిగా ప్రవర్తించవద్దని రోజూ అంటుంటుంది. వారికి దూరంగా జాగ్రత్తగా ఉండమని, తన ఆరాధ్యదైవం శ్రీరామ చంద్రుని మీలో చూసుకుంటున్నానని పదే పదే గుర్తు చేస్తూ వుంటుంది. మొదట్లో భార్య ప్రవర్తన వింతగా తోచినా తరువాత రోతగా మారినా మల్లికార్జున్ సర్దుకోక తప్పలేదు.

    ఇంటికి వస్తున్న కొడుకుపట్ల చింత ఆమె మనసును తొలుస్తోంది. విషయాన్ని విస్పష్టంగా తన సహజ ధోరణిలో భర్త ముందుంచింది. ఆమెను మానిపిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.     "ఆమెను ఒక మగాడి దృష్టితో చూస్తున్నావు. నేను ఒక ఆడదాని దృష్టితో పరిశీలిస్తుంటాను. అయినా ఆకాశ్ చిన్న కుర్రాడు. పాతిక సంవత్సరాల వయసు. డీసెంట్ అండ్ పొలైట్ పర్సనాలిటి. మంచి ప్రవర్తన కలవాడు. వాడి గురించి అతిగా ఊహించుకుని మనసు పాడుచేసుకోకు. సున్నితమైన విషయాన్ని భూతద్దంలోంచి చూసి ఆదిలక్ష్మిని పనిలోంచి తీసేయడం మంచిది కాదు. అయినా వాడు నా కొడుకు..."     "అందుకే నా భయమంతా" అలవాటైన భార్య వైఖరికి నవ్వి ఊరుకున్నాడు.

    కనీసం వాడు ముంబయికి తిరిగి వెళ్లేవరకైనా ఏదో వంకతో పని మాన్పించేస్తే... లక్ష్మి ఇంటి పనులు చాలా బాధ్యతగా చేస్తోంది. ఒక్కోసారి తనకి తట్టని సలహాలు కూడా ఇస్తుంది. పని ఎక్కువ చెప్పినా విసుక్కోకుండా నవ్వుతూ చేస్తుంది. జీతం ఇంత కావాలని అడగకపోగా నిజాయితీగా సొంత మనిషిలా పనిచేస్తుంది. తను మానేయమన్నప్పుడు ఆమె పూర్తిగా మానేస్తే... మొత్తానికి ఏదో నెలరోజుల భాగ్యానికి తప్పించడమెందుకని ఆ ఆలోచనను విరమించుకుంది. 

    కొడుకు ఏర్పాటు చేసిన టాయిస్ స్టాల్‌లో సరస్వతి మల్లికార్జున్లతో పాటు ఆదిలక్ష్మి కూడా పాలుపంచుకోవలసి వచ్చింది. ముంబాయి నుండి అరడజను మంది దాకా రిప్రజెంటేటివ్స్ వచ్చి పాల్గొన్నా చాలా మందికి లాంగ్వేజీ ప్రాబ్లెం కావడంతో ఆయా బొమ్మల ఆపరేషన్ గురించి విపులంగా వివరించలేక పోయారు. దానితో పెద్దగా సేల్సుని ప్రమోట్ చేయలేకపోయారు. మొదటి రెండురోజులు ఆర్డర్స్ పెద్దగా బుక్ చేయలేకపోయాడు ఆకాశ్.     అనుకోకుండా ఆదిలక్ష్మి సేల్స్ గర్లుగా ఇన్వాల్వ్ కావడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. వివిధ రకాల ఆటబొమ్మలు అవి పనిచేసే విధానాన్ని కన్విన్సింగ్‌గా కస్టమర్లకు చెప్పగలగడంతో మొదట పెదవి విరిచిన వారే తరువాత పెద్దమొత్తంలో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మొత్తానికి వారం రోజుల్లో పది లక్షల రూపాయల దాకా బిజినెస్ జరిగింది. ఆదిలక్ష్మి చేసిన సహాయానికి ఆమెకు కృతజ్ఞతగా కొంత సొమ్మును ఇవ్వబోయాడు ఆకాశ్.

    "నేను డబ్బు తీసుకునేంత పని ఏమీ చేయలేదు. నాకు తోచిన మాట సహాయం చేశానంతే" తాను ఇచ్చిన సొమ్ముల్ని తిరస్కరించడంతో అతనిలో ఆమె పట్ల ఉన్న అభిమానం రెట్టింపయింది.
* * * * * * *
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"
    కళ్లు మూసుకుని సోఫాలో వాలి ఉన్న ఆకాశ్ ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.     ఎదురుగా ఆదిలక్ష్మి. అతని ఊహల పల్లకి లోంచి ఎప్పుడు బయట పడిందో నవ్వుతూ టీపాయ్ వైపు చూసింది.     ప్లేటులో పెరుగు ఆవడ, నేతి పొంగలి, పాలకోవా.     "ఇవి నాకిష్టమని నీకెలా తెలుసు?"

    "తెలుసు"     "అమ్మ చెప్పిందా?"     "లేదు"     "మరెలా తెలుసు?"     "మనుషుల్ని, మనుషుల మాటల్ని సున్నితంగా పరిశీలిస్తే వారి హాబీలు, ఇష్టాలు తెలుస్తాయి"     "మరి నా హాబీలు ఏమిటి?"     "చెప్తా"     "ఎప్పుడు?"     "తర్వాత"     "సింప్లీ సుపర్బ్" పాలకోవా నోటొలో పెట్టుకుంటూ అన్నాడు. మంచినీళ్ళు పెట్టి లోపలికి వెళ్లబోతూ వెనక్కి తిరిగింది.     "అదే పిండివంటలు... చేసిన వంట వారు" చిన్నగా నవ్వింది.     "ఆ నవ్వుకు అర్థం"     "అర్థం... అర్థం చేసుకునేవారిని బట్టి వుంటుంది" అదోలా చూసింది.     "అలా! నిన్ను రియల్ బ్యూటీ అంటాను"     "నా హాబీ ఏమిటని అడిగారు చుశారూ...ఇదే"     "అంటే?"     "మాటల్లో చెప్పాలంటే దాన్ని ఆరాధన అంటారు"     "అది అసభ్యత అవుతుందా?" 

    "ఆడదానిపట్ల చొరవ, ఆమె అందాన్ని పొగడ్డంతోనే ఆరంభమవుతుందంటారు. దాన్ని అర్థం చేసుకోగలదని మగాడు అనుకుంటూ ఉంటాడు"     "నా ఆరాధనకి పాస్‌వర్డ్ ఏమిటో తెలుసా?"     "అల"     "నీకెలా తెలుసు" ఆశ్చర్యంగా అడిగాడు.     "ఇప్పుడేగా అలా! నిన్ను ఏదో బ్యూటీ అంటాను అన్నారు"     "అసలు అల అంటే ఏమిటో తెలుసా?"     "ఆదిలక్ష్మి" క్రీగంటి చూపుతో చిలిపిగా నవ్వి అతన్ని కవ్వించింది.     "అలా! నిన్ను ప్రేమిస్తున్నానేమోనని భయంగా ఉంది"     "భయం దేనికి?" కూర తరుగుతూ కళ్లు చక్రంలా తిప్పి మనోహరంగా మరోసారి నవ్వింది.     "దేనికేమిటి! నిన్ను గాడంగా ప్రేమిస్తున్నానేమోననిపిస్తోంది"     "ప్రేమించండి. అసలు మీరేంటి ఎదురింటిలో ఉన్న సుబ్బారావు ప్రేమించాడు. కాలేజీలో కాంతారావు ప్రేమించాడు"

    "......................"

    "దేరీజే వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ప్రేమ అండ్ సుబ్బారావు, కాంతారావు ప్రేమ" చేస్తున్న పనిమీద నుండి తల తిప్పి కళ్లలోకి చూస్తూ అంది.
    "అర్థంగాని విషయాన్ని అదరగొట్టేస్తూ చెప్తే ఎలా? సరిగా చెప్పు?" 

    "కొన్ని ప్రేమలు ఈదురుగాలుల్లా మనుషుల్ని ఢీకొట్టి అతలాకుతలం చేస్తాయి. మరికొన్ని చిరుగాలిలా స్పృశించి, సేద తీర్చి స్పందింపజేస్తాయి."

    "మరి నాదే గాలి?"     "మీరు చిరుగాలికి చిరునామా"     "సేద తీరుస్తావా?"     "ప్రేమించే హృదయం తనకు తానే స్పందిస్తుంది"     "నువ్వు స్పందిస్తావా?... నన్ను స్పందింపజేస్తావా?"     "ప్రేమలేని ప్రేయసిగా మిగిలితే పాపం" 

    "అంటే?"
    "అంటే...అంటేనే" ఉల్లిపాయలు తరుగుతూ తల ఎగరేసింది. ఆ కన్నీళ్లలో ఆకాశ్‌కి ఓ మెరుపు కనిపించి మాయమైంది.

* * * * * * *

    మొదట్లో ఆదిలక్ష్మి అందచందాల్ని పెద్దగా పట్టించుకోని ఆకాశ్ ఆమె మాట తీరుకు, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు పరవశుడవసాగాడు.
    "మమ్మీ! ఆదిలక్ష్మికి కొంచెం చదువు వుండి, వెనకాల ప్రోత్సాహం ఉంటే చాలా పైకి వచ్చేది. అప్పుడు ఇలా బ్రతికే అవసరం ఉండకపోయేది కదూ!" ఏదో చెప్పబోతున్న కొడుకు ముఖంలో అదోలా చూసింది సరస్వతి. అస్తమానూ ఆమెలో ఏదో భయం. ఎప్పుడూ పనిమనిషి గురించే మాట్లాడుతూ ఆమెనే పొగుడుతూ కాలక్షేపం చేస్తున్న కొడుకు కదలికల్ని చాల జాగ్రత్తగా కనిపెడుతోంది.
    ఆరోజు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్. పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. పనులు ముగించుకుని మల్లిఖార్జున్, ఆకాశ్ టీ.వి.ముందుకు చేరారు.

    "లెక్క ప్రకారం ఈరోజు పాకిస్థాన్ గెలిచితీరాలి"  

    "అవును డాడీ! అయితే పాక్ ఎంత త్వరగా ఆస్ట్రేలియా స్కోరును అధిగమిస్తుందని నా ఆలోచన. ఓ పాతిక ఓవర్లు సరిపోతాయని నా అభిప్రాయం"
    "లేదు నలభై, నలభై ఐదు ఓవర్లు తీసుకోవచ్చు"  

    "అయితే ఈ విషయంలో మనమిద్దరం బెట్ కడదామా? పాతిక ఓవర్లలో పాక్ విన్ అయిత నీవు నాకు పార్టీ ఇవ్వాలి. లేకుంటే నేనే నీకు పార్టీ ఇస్తాను" 

    "ఓ.కే."
    "లక్ష్మీ నువ్వేమంటావ్? పాకిస్థాన్ గెలుపుకి ఎన్ని ఓవర్లు పడుతుందంటావ్?"     "అసలు పాకిస్థాన్ నెగ్గుతుందని మీ కెవరు చెప్పారు. నన్నడిగితే ఆస్ట్రేలియాకి విజయావకాశాలు ఎక్కువ వున్నాయి" దివాన్ పిల్లో మారుస్తూ మృదువుగా అంది.     ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తండ్రీకొడుకుల వంతయింది.
    "అసలు నీ ఆర్గ్యూమెంట్‌కి బేస్ ఏది?"

    "టీ.వీ.లో ప్లేయర్స్ కదలికలని సున్నితంగా పరిశీలించి చూడండి. లీగ్‌మ్యాచ్‌లు అన్నీ గెలిచిన పాకిస్థాన్ టీమ్‌లో అతిశయం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రోబబుల్ విన్నింగ్ టీమ్ అని మీడియాతో సహా అందరూ హైలైట్ చేస్తుంటే వారు ఓ విధమైన నెర్వస్ ఫీలవుతున్నట్లుంది. వాళ్లు థింగ్స్ ఈజీగా తీసుకుంటున్నారు. కప్ మనదే అన్న భావనతో ప్రాక్టీస్ సరిగా చేసినట్లు లేదని మైదానంలో వారి కదలికల్ని బట్టి అర్థమవుతోంది. అదే ఆస్ట్రేలియన్లు చూడండి. మనసులో ఏవిధమైన ఒత్తిడులు లేకుండా ముఖం మీద చక్కటి చిరునవ్వుతో మైదానంలో ఫ్రీగా కనబడుతున్నారు. దానితో మంచి టీం వర్క్ ప్రదర్శింపగలుగుతున్నారు. సాధారణంగా పాజిటివ్ అప్రోచ్ గల జట్టు విజయం సాధిస్తుందని నా అభిప్రాయం." 

    ఆదిలక్ష్మి అబ్జర్వేషన్‌కి ఆశ్చర్యపోవడం వారి వంతయింది. చివరికి ఆస్త్రేలియా విజయం సాధించింది.     తల్లి ఏదో వంకపెట్టి సణుగుతున్నా ఆమెను పలకరించకుండా ఉండలేకపోతున్నాడు. అస్తమానూ మాటల్లో పెట్టి ఆమెను కూర్చోపెట్టాడానికి ట్రై చేస్తున్నాడు. రోజూ ఉదయం ఆరుగంటలకి వచ్చి పనులన్నీ ముగించుకుని పది గంటలకి వెళ్లిపోతుంది. సాయంత్రం ఠంచనుగా నాలుగు గంటలకి వచ్చి వంట పనులు పూర్తిచేసుకుని ఏడింటికి వెళ్లిపోతుంది. ఆమెను రోజూ తన స్కూటర్ మీద డ్రాప్ చేయడానికి ఆరాటపడతాడు.     ఆదిలక్ష్మి 'ససేమిరా' అంటుంది.     ఆదిలక్ష్మి వెళుతుంటే ఎవరికోసమో అంత ఆరాటం అన్న భావన ఆకాశ్‌లో ద్యోతకమవుతూ ఉంటుంది.     ఆమెకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటల్ని గానీ, టీవీ సీరియల్స్ గానీ, యాంకర్స్ హావభావాలు గానీ మైండ్ లో రిజిష్టర్ చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడడిగినా తిరిగి ఎక్స్ ప్రెస్ చేస్తుంది. ఆమె జ్ఞాపక శక్తికి ఆకాశ్ ఆశ్చర్యపోయాడు.     "లక్ష్మీ మీ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదన్నావు. నీకు కూడా పెద్దగా ఎకడమిక్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నీవు పుట్టి పెరిగింది కూడా స్లం వాతావరణంలో. కానీ నిన్ను చూస్తే మరోలా కంపిస్తావు. ఈ మాటతీరుగానీ, నడవడికగానీ, వ్యక్తిత్వంకానీ నేను నమ్మలేకపోతున్నాను."

    "నాన్న మమ్మల్ని ఒదిలేసి వెళ్లిపోయాడు. అమ్మని రోగం కబళించి తీసుకు పోయింది. ఇక మిగిలిన నన్ను మా అమ్మ తమ్ముడు నీడనిచ్చి ఆదరించాడు. మామయ్య టీచర్. యాక్సిడెంట్ అయి కాళ్లు రెండూ కోల్పోయిన మామయ్యకు నేనే దిక్కు. అందుకే ఇక్కడ పనులు ముగించుకుని, ఆయనకు అన్నం పెట్టాలని త్వరగా వెళ్లిపోతుంటాను. ఆయన మాకు ఆర్థికంగా సహాయపడలేకపోయినా అపురూపమైన తన వ్యక్తిత్వాన్ని మటుకు ఇచ్చాడు."
    "మట్టిలో మాణిక్యం" లోపల అనుకుందామనుకున్నా పైకి అనకనే అనేశాడు ఆకాశ్.

    "ఏరా! అనిల్ మ్యారేజ్ ఈరోజు సాయంత్రమే కదా! మర్చిపోయావా! ఉయ్యూరు ఎప్పుడూ వెళుతున్నావ్?"     "లేదు మమ్మీ! ఈరోజు కొంచెం ఫీవరిష్‌గా వుంది. అనిల్ అంటే ఏదో తెలిసున్న వ్యక్తేగానీ నాకు అంత డీప్ ఫ్రెండ్‌షిప్ ఏమీ లేదు." సరస్వతికి కొడుకు ధోరణి వింతగా అంపించింది.     "పోనీ పెదనాన్న గారింటికి తణుకు ఎప్పుడు వెళుతున్నావ్. చాలా రోజుల తరువాత నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు"     "ఇప్పుడు కాదు. రేపు సమ్మర్‌కి వచ్చినప్పుడు వెళతాను. ఇప్పుడు మూడ్ లేదు." కొడుకు అంతరంగంలో మార్పును, అతని ఆలోచనల్ని ఆమె గ్రహించక పోలేదు.     "యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుని ఇంతకు ముందు మూడుసార్లు వాయిదా వేసుకున్నావు. సెలవులు ఉన్నాయి. కాబట్టి వెళ్లివస్తే ఒక పని అయిపోతుందేమో"     "బై పోస్టు పంపమని ఈ మెయిల్ మెసేజ్ ఇస్తాలే" విజయవాడలో చేయవలసిన పనులు పెద్దగా ఏమీ లేకపోయినా మరో పదిరోజులు లీవ్ ఎక్స్‌టెన్షన్ కోసం ముంబాయి ఆఫీసర్‌కి టెలిగ్రాం పంపాడు.

    సరస్వతికి కొడుకు ధోరణి అంతుపట్టడం లేదు. ఏవేవో పనుల్ని ప్లాన్ చేసుకు వచ్చినవాడు అన్నీ మానేసి ఆదిలక్ష్మి ముందు కబుర్లాడుతూ కూర్చోవడం నచ్చలేదు. "ఆమె ఒక పనిమనిషి. సర్వెంట్ మెయిడ్‌ని సర్వెంట్‌గానే ఉంచాలి. అతి చనువిచ్చి దగ్గరకు తెచ్చుకుంటే తరువాత చిక్కుల్లో ఇరుక్కుంటాము"
    తల్లి మాటలకు చాలా నొచ్చుకునాడు.     "మమ్మీ! పనిమనిషి కూడా మనిషే కదా! మనం కుర్చీలో కులాసాగా కూర్చొని కిందివాళ్లకి పనులు పురమాయించి నవ్వుతూ తుళ్లుతూ వుంటాం. అదే మనం తిన్న ఎంగిలి కంచాలు కడిగేవారి గురించి ఆలోచించం. ఒక్కసారి మనం వారి మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేసి చూసినప్పుడు ఆవేదన ఏమిటో తెలుస్తుంది."

    'ఆత్మాభిమానం తన ఉనికిని ఇతరుల ద్వారా నిలబెట్టుకోవాలనుకుంటుంది. అది సాటివారిని చిన్నచూపు చూడదు. కానీ అహంకారం తన దర్పాన్ని తానే హైలైట్ చేసుకుని ఇతరుల మంచితనాన్ని వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంది. స్వార్థంతో నిండిన అహంకారం ఆత్మాభిమానానికి ఎంతమాత్రం సరికాదు.'     ఆకాశ్ అంతరంగం అతలాకుతలమవుతోంది. కాలం కరిగిపోయి మరలా ముంబాయి వెళ్లవలసిన రోజు సమీపిస్తోంది. గుండెలు నులిమేస్తున్నట్లు, ప్రాణాలు తోడేస్తున్నట్లు ఫీలవుతున్నాడు. ఇటువంటి విచిత్రమైన స్థితి ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించి ఉండడు. ఆదిలక్ష్మి కనిపిస్తే మామూలు మనిషి అవుతాడు. లేకుంటే మామూలే.     "డాడీ! చదువుకుంటున్నప్పుడుగానీ, ట్రైనింగ్‌కి వెళ్లినప్పుడుగానీ, జాబ్ పోస్టింగ్ వచ్చినప్పుడుగానీ ఎన్నో సార్లు ఈ ఊరిని మిమ్మల్ని ఒదిలి వెళుతుంటే ఎప్పుడూ నాకు బాధ కలగలేదు. కానీ ఈసారి నాలో మార్పు ఏమిటో తెలియడం లేదు. వెళ్లాలని మనసుపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ ఊరుని వదలి రావడానికి ససేమిరా అంటోంది. ఈ సంకటస్థితి ఏమిటో తెలియరావడం లేదు" శూన్యంలోకి చూస్తూ చెప్పాడు.

    ఆశ్చర్యంగా కొడుకు ముఖంలోకి కాకుండా వాడి మనసులోకి తొంగి చూశాడు మల్లికార్జున్.
    నిశ్చలమైన కొలనులో నీరు ఆవిరై మేఘంగా మారింది. దానిని చిరుగాలి తాకేసరికి అనురాగ గంగయై వర్షిస్తోంది. "నీ భావావేశానికి ఆలంబన ఆదిలక్ష్మి... అవునా?"     అతని కళ్లు రాగరంజితమై భారంగా కిందికి వాలిపోయాయి.     "ఏం చేద్దామనుకుంటున్నావ్?"     "ఐ లవ్ హర్ సోమచ్... నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" సూట్‌కేసు సర్దుకుంటూ అన్నాడు.     "బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? ఈ విషయం వింటే మీ అమ్మ మండిపడుతుంది" అంటుండగానే ఇస్త్రీ చేసిన కొడుకు బట్టల్ని తీసుకుని వచ్చింది సరస్వతి.     ఒక్కసారి కొడుకు వంక సాలోచనగా చూసి "మనవాడు ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాట్ట" అని చిన్నగా నవ్వాడు.     "ఏరా! ఆకాశ్ నిజమేనా?" మొహం చిట్లించి కోపంగా అంది. తల్లివైపు అసహనంగా చూశాడు.

    "నేను అనుమానించినట్టే అయింది. ఏదో బొత్తిగా లేవలేని దాన్ని కాస్త పనికి ఆసరాగా ఉంటుందని పెట్టుకున్నాను. నోరు విప్పి అడక్కపోయినా దానికేమి కావాలో ఆలోచించి అన్నీ సమకూర్చి పెట్టాను. చివరికి అది తిన్న ఇంటి వాసాల్నే లెక్కపెడుతోంది. పాముకు పాలు పోసినట్టే అయింది. ఇంత నమ్మకద్రోహానికి పాల్పడింది" ఆవేశంగా అంటూన్న తల్లి వంక తీవ్రంగా చూసి అన్నాడు ఆకాశ్,
    "మమ్మీ! అనవసరంగా ఆ అమ్మాయి గురించి ఒక్క మాట కూడా అనొద్దు. ప్రేమించింది, అభిమానించింది నేను. ఎప్పుడైనా సరదాగా మాట్లాడబోయినా అవకాశం తీసుకోని అపురూప వ్యక్తిత్వం గల అమ్మాయి ఆదిలక్ష్మి.

    నిజాయతీతో కూడిన కొడుకు మాటలకి లోలోపలే హర్షించింది మల్లికార్జున్ హృదయం. తను ఊహించిన దానికన్నా కొడుకు సంస్కారంలో ఒక మెట్టు పైనే ఉన్నాడనిపించింది. అవును... కొడుకు సెలెక్షన్‌లో లోపం ఏముంది? ఆదిలక్ష్మికి ఏమి తక్కువ. చిదిమి దీపం పెట్టుకునేటట్లుంది పిల్ల. అందం, అణకువ ఎదుటి వారిని ఆకట్టుకునే చక్కని మాట తీరు, పరిధి దాటని సంస్కారవంతమైన ప్రవర్తన ఇంతకంటే ఇంటి కోడలికి ఏమి కావాల్సివుంటుంది.
    ఇక డబ్బా?
    తమకు కూర్చుని తినగలిగే సంపద ఉంది. ఇంకా కట్న కానుకలంటూ ఆడపిల్లల తల్లిదండ్రులను వేధించి ఆస్తి పెంచుకోవాలనే తాపత్రయం, కక్కుర్తి ఎందుకు?

    'నిజమే! ఆకాశ్ ఆలోచన అభినందనీయమే. సాంఘిక కట్టుబాట్లు, సామాజిక అసమానతలు, వర్గ వివక్ష వీటన్నిటికీ అతీతంగా విశాలహృదయంతో ఆలోచించే మనసు ఎందరికుంటుంది. ఇటువంటి కొడుకును కన్నందుకు మేం గర్వించాలి'అనుకుంటూ భార్య వైపు చూశాడు మల్లికార్జున్.

    ముఖం కందగడ్డలా చేసుకుని సోఫాలో కూర్చుని చీర కొంగుతో కళ్లు ఒత్తుకుంటోంది సరస్వతి. అతని అంతరంగమంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసి స్వాంతనగా అన్నాడు.
    "చూడు సరూ! ఇన్నాళ్లుగా మనింట్లో మనిషిలా మసులుతూ మనపట్ల ఎంతో అభిమానంగా సేవలందించిన ఆదిలక్ష్మినేగా మనబ్బాయి చేసుకుంటాంటోంది. ఇదే వాడు ముంబాయిలో ఎవర్నో చేసుకొని ఇంటికి తీసుకువస్తే మనం ఏం చేయగలిగేవాళ్లం చెప్పు. ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అశాంతి ఉండదు."  

    భర్త మాటలతో ఆమె కళ్లు జలజలా వర్షించాయి. "ఇదేం ఖర్మండీ! మన స్టేటస్ ఏమిటి? మనం ఏమిటి? ఆపిల్ల ఆగర్భ దరిద్రురాలు. మన సిరిసంపదలకు సరితూగే ఏ గొప్పింటి బిడ్డనో మహాలక్ష్మిలా ఇంటికి తెచ్చుకోవాలని కలలు కన్నాను" అంది వేదనగా. 

    "మనం ఏ ధనవంతుల బిడ్డనో కట్నకానుకలు ఆశపడి కోడలిగా తెచ్చుకున్నామనుకో, అహంకారంతో మనల్ని సరిగా చూస్తుందని గ్యారంటీ ఏమిట? అదీ ఒకందుకు మంచికే అనుకుందాం. అబ్బాయి ఇష్టాన్ని కాదని వాడికి మనస్తాపాన్ని కల్గించడం ఎందుకు? నాకెందుకో వాడు తీసుకున్న నిర్ణయం అన్ని విధాల బాగానే ఉందనిపిస్తుంది. కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడరాదూ. నేను ఆరోజుల్లో మా స్టేటస్ గురించి, మా తాత ముత్తాతల వైభవాన్ని గురించి ఆలోచించినట్లైయితే దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిన్ను ఎలా చేసుకునేవాణ్ణి" అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ.
    తన స్థితిని మర్చిపోయి ఆలోచించిన తన మూర్ఖ వైఖరికి ఆమెలో కాస్తంత పశ్చాత్తాపం పొడచూపింది. "సరే మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండర్రా" బింకంగా అని ఆనాటి రోజులని జ్ఞాపకం చేసుకుంటూ కిచెన్‌లోకి వెళ్లింది సరస్వతి.

    ఆ చల్లని సాయంత్రం ఏడు గంటల వేళ...
    చకచకా ఇంటి పనీ వంటపనీ పూర్తి చేసుకుని వెళ్లబోతున్న ఆదిలక్ష్మిని కాసేపు అటువచ్చి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు మల్లికార్జున్.     ఆకస్మికంగా తన పట్ల ఆయన చూపిస్తున్న మర్యాదకు చకితురాలై చూసింది ఆదిలక్ష్మి.     "పరవాలేదు కూర్చోమ్మా! నీతో మేము మాట్లాడాలి" అన్నాడు గంభీర హాసంతో.     బిడియంగా బెదురు చూపులు చూస్తూ మెల్లగా వచ్చి అక్కడ ఉన్న కార్పెట్ మీద పొందికగా కూర్చుంది.
    మెట్లు దిగి వస్తున్న సరస్వతి అక్కడికి వచ్చి కూర్చోడానికి ఒక్క క్షణం సందేహించి వెళ్లబోతుంటే అమెనూ వచ్చి కూర్చోమన్నాడు మల్లికార్జున్.

    "అమ్మా లక్ష్మీ! మావాడు నువ్వంటే ఇష్టపడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు" అంటూన్న ఆయన వంక చిత్రంగా చూసి, వెంటనే అమ్మగారి వైపు భయం భయంగా దృష్టి సారించింది. నిర్వికారంగా నిర్విణ్ణంగా చూస్తోందావిడ.
    "బాబుగారూ! ఇందులో నా ప్రమేయం ఏం లేదండీ, నన్ను నమ్మండి నిజం చెప్తున్నాను. నేను అందని స్వర్గానికి నిచ్చెనలు వేసేదాన్ని కాను. నేనెప్పుడూ ఆశపడలేదు. పని మానేసి వెళ్లిపొమ్మంటే పోతాను...అంతేకానీ" చివురుటాకులా వణికిపోతూ అంది చలిత స్వరంతో ఆమె.     సరస్వతి లక్ష్మిలోని కలవరపాటుని, ఆందోళనని గమనించి కాస్త విభ్రాంతిగా చూసింది.
    "అది కాదమ్మా! నీదేం తప్పు లేదు. ఆకాశ్ నిన్ను మనసారా ప్రేమించాడు. ఇన్నాళ్లూ పెళ్లిమాట ఎత్తితేనే చిరాకు పడే అబ్బాయి నిన్ను కావాలనుకుంటున్నాడు. వాడి నిర్ణయం మాకూ నచ్చింది. నువ్వు కోడలుగా వస్తే ఇల్లు కళకళలాడుతుంది. ఏమంటావ్ సరస్వతి" అని భార్య వైపు చూశాడు మల్లికార్జున్.

    "ఆ అవును లక్ష్మీ! నీ మంచితనమే నీకీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏమంటావ్?" అని నవ్వుతూ చూసింది. ఇప్పటి వరకూ తన జీవితంలో ఎదుర్కోని సంకటస్థితిని ఎదుర్కోవలసి వచ్చినట్లు భారంగా రెండు క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఆదిలక్ష్మి గుండెల నిండా బలాన్ని కూడదీసుకుంటూ మెల్లగా పెదవి విప్పింది.
    "అయ్యగారూ! అమ్మగారన్నట్లు ఇది అదృష్టమే కావచ్చు. కానీ ఈ అదృష్టాన్ని భరించే శక్తి నాకులేదు. నేను పుట్టి పెరిగిన పరిసరాలు వేరు, మనుషులు వేరు. తాగి తాగి అమ్మను ఒదిలేసి ఎటోపోయాడు అయ్య. రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ అమ్మ చదివించిన కొద్ది చదువుతో నాకు కాస్త సంస్కారం అబ్బింది. నయంకాని జబ్బుతో అమ్మ పోతూ పోతూ నా బాధ్యతను మామయ్యకు అప్పజెప్పింది. ఆయన అండతో కాస్త లోకజ్ఞానం తెలిసింది. నేనే సర్వస్వం అనుకుంటూ అపురూపంగా పెంచి ఇంతదాన్ని చేశాడు మామయ్య. రోడ్డూ ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని ఎందుకూ కొరగాకుండా పోతున్నానే నిస్పృహతో గడుపుతున్న మామయ్యకు ఇప్పుడూ నేనే ఆలంబన." ఆత్మాభిమానం ఉన్నవాళ్లు తమని తాము అవమాన పరచుకోవడానికి, ఎదుటివారిని అవమాన పరచడానికి ఎప్పుడూ సిద్ధపడరు.

    "పరవాలేదమ్మా! మీ మామయ్య సంరక్షణ భాధ్యతను నువ్వేమీ వదులుకోనక్కరలేదు. ఎప్పటిలాగే చూసుకుంటూ ఉండొచ్చు" అంటున్న భర్తవైపు వింతగా చూసింది సరస్వతి. ఎప్పుడు వచ్చాడో ఆమాటలన్నీ వింటూనే ఉన్నాడులా వుంది ఆకాశ్, తనుకూడా వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు... ఆమె అంగీకారం కోసం ఆశగా ఎదురుచూస్తూ.
    "ఇది సినిమా కాదు బాబుగారూ! జీవితం. ఏదో జీవన భృతికోసం మీలాంటి వాళ్ల ఇళ్లలో పనిచేయడం వేరు. నాలాంటిది ఈ ఇంటి కోడలుగా రావాలనుకోవడం వేరు. నా పరిధిలో నా పేద పరిసరాలలో స్వతంత్రంగా స్వేచ్చగా ఉన్నప్పుడు పొందే ఆనందాన్ని నేను గొప్పింటి పరిసరాలలో పొందలేను. నా స్వభావం అదికాదు. నా ఇల్లు, నా పరిసరాలు, నా వాళ్ల మధ్య ఉండడమే నాకిష్టం. నన్ను క్షమించండి" అని నమస్కరించి లేచి వెనుతిరిగింది.

    ఎన్నడూ వినని అద్భుతమైన సంగతేదో విన్నట్టుగా, కన్నట్టుగా ఆశ్చర్యంతో కళ్లింత చేసుకుని ఆమె వెళ్లిన వైపే చూస్తుండిపోయింది సరస్వతి.
    ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ తన రూంలోకి వెళుతున్న కొడుకుని చూస్తూ నిట్టూర్చిన మల్లికార్జున్‌కి చిన్నప్పుడు తెలుగు మాస్టారు చెప్పిన పద్యం గుర్తుకు వచ్చింది.     కమలములు నీట బాసిన     కమలాక్షుని రశ్మి సోకి కమలిన భంగిన్     తమతమ నెలవులు తప్పిన     తమ మిత్రులె శత్రులగుట తథ్యము...
    "అవును... తమకి కావల్సిందేమిటో, ఎట్లా ఎక్కడ ఉంటే తాము ఆనందంగా ఉండగలరో చక్కగా ఆలోచించి ఆ విధంగా జీవితాన్ని నడుపుకోవడం ఎంతమందికి చేతనౌతుంది. ఉన్నచోట సంతృప్తిలేక ఎక్కడికో ఎగరాలని, ఏవేవో సుఖాలు జుర్రుకోవాలని అలవిమాలిన ఆశలతో అసంతృప్తితో జీవచ్చవాలుగా బ్రతుకుతున్న వాళ్ల కోవలో చేరకుండా ఆదిలక్ష్మి లాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం స్వాభిమానం కలవాళ్లు ఏ కొద్దిమందో ఉంటారు" అనుకుంటూ కొద్దిసేపట్లో బయలుదేరబోతున్న కొడుకు గదిలోకి నడిచాడు మల్లికార్జున్.               


(విజ్ఞాన సుధ మాసపత్రికలో ప్రచురితం)


    

        

    
Comments