కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య

    
వంతెన కింద రోడ్డుపక్క నిలబడి వున్నాడు రాంబాబు. భుజాన బరువైన పుస్తకాల సంచీ వుంది. ఒక చేతిలో చిన్న టిఫిన్ క్యారియర్ వుంది. చాలా ఏకాగ్రతతో దీక్షగా ఎదురుగా వున్న పెద్ద సైన్ బోర్డు వంక చూస్తున్నాడు. దానిమీద 'నగరంలో సినిమాల' పోస్టర్లన్నీ వున్నాయి. రంగురంగుల రకరకాల పోస్టర్లు.

    రాంబాబు ఒక పోస్టరు చూస్తూ ఆగిపోయాడు. అదేదో ఊరిచివర వున్న సినిమాహాలు. సాధారణంగా అక్కడ పాత సినిమాలే ఆడుతూ వుంటాయి. ఇప్పుడందులో పాతికేళ్ళనాటి ఒక జానపద చిత్రం వేస్తున్నారు. పోస్టర్‌లో పెద్ద అక్షరాలతో 'తప్పక చూడండి' మీ అభిమాన కథానాయకుడు నటించిన ఉజ్వల జానపద చిత్రం. భయంకరమైన పోరాటాలు, 'ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్', వగైరా నినాదాలున్నాయి.

    రాంబాబుకు అంతలో గుర్తొచ్చింది. అతని నాయనమ్మ చాలా సార్లు అతనితో ఆ సినిమా గురించి చెప్పింది. ఫలానా పేరుగల సినిమా ఎప్పుడైనా ఏ హాల్లోనైనా వస్తే తనకు తప్పకుండా చెప్పమన్నది. మరిచి పోవద్దన్నది. అవును, అదే సినిమా...రాంబాబు మళ్ళీ శ్రద్ధగా పోస్టరంతా చదివాడు. క్రింద పెద్ద అక్షరాలతో 'రెండు రోజులు మాత్రమే' అని స్పష్టంగా వ్రాసివుంది.

    అతడి మెల్లగా ఇంటిదోవ పట్టాడు. దారిలో అవీ ఇవీ చూసుకుంటూ పార్కు దాటి, వంతెన దాటి, ఇంటికి వచ్చేసరికి ఆ చిన్న వరండాలోనే నాయనమ్మ ఎదురైంది. ఎందుకో రుసరుస లాడుతున్నది. తీరికగా వరండాలో గోడకానుకుని కూచుని బొంగురు గొంతుకతో "ఇంతే నా జీవితం. ఎప్పుడు సుఖపడ్డాను కనుక? ఇంతే...ఇలా వెళ్ళిపోవాల్సిందే" అంటున్నది...రాంబాబు నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. వంటగదిలో తల్లి పనిలో వుంది. ఆమె కూడా అస్పష్టంగా ఏదో గొణుగుతోంది.  రాంబాబు పుస్తకాలవతల పడేసి, క్యారియరు వంటింట్లో పెట్టి ఒక చేత్తో లాగు పైకి లాక్కుంటూ, మరో చేత్తో ముక్కు తుడుచుకుంటూ "అమ్మా! ఆకలవుతున్నదే. తింటానికేవన్నా పెట్టవూ?" అని అడిగాడు.

    వాళ్ళ అమ్మ కోపంగా వెనుదిరిగి చూసి "ఏం కాస్సేపాగలేవూ? కాళ్ళు కూడా కడుక్కోకుండా ఏమంత తొందర?" అని ఉరిమింది. రాంబాబు వెనక్కు తగ్గి "ఇంట్లో పరిస్థితి ఏమీ బాగున్నట్టులేదే...అంతా రుసరుసలాడుతున్నారు" అనుకున్నాడు.

    ముసలమ్మకు డెబ్బై యేళ్లుంటాయి. ఆమె జీవితమంతా ఎక్కడో పల్లెటూళ్ళో గడిచింది. అక్కడే పుట్టడం పెరిగి పెద్దది కావడం ఆ వూరి సంబంధమే పెద్దవాళ్లు ఖాయం చెయ్యడం...అక్కడే పెళ్ళి...అక్కడే పురుళ్లు,పుణ్యాలు...అక్కడే చావులు, అక్కడే కాన్పులు,అక్కడే కష్టసుఖాలు...ఇలా అంత జీవితమూ అక్కడే వెళ్ళిపోయింది. 

    కొన్నేళ్ళ క్రితం భర్త పోవడంతో అక్కడ మిగిలివున్న చేరెడు నేలా అమ్ముకుని కొడుకు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చాడు. ఇక్కడ ఆమెకేమీ తోచదు. పొద్దున్న లేచి అలా చుట్టుపక్కల యిళ్ళకు వెళ్ళి కష్టసుఖాలు విచారించి వస్తూ వుంటుంది. వాళ్లు విన్నా వినకపోయినా పట్టించుకోకుండా శక్తి కొద్దీ వాగి తమ ఇంట్లో విశేషాలను ఏకరువు పెట్టి, వారి యింటిలో విశేషాలు సాధ్యమైనంతవరకు సేకరించుకుని నెమ్మదిగా ఎప్పటికో యిల్లు చేరుకుంటూ వుంటుంది. కోడలికి ఇది గిట్టదు. "హాయిగా యింటిపట్టున కూర్చుని 'కృష్ణా రామా' అనుకోరాదా? ఆ యిల్లూ ఈ యిల్లూ బలాదూరు తిరక్కపోతే?" అని సతాయిస్తూ వుంటుంది. పైగా ముసలమ్మకు పసిపిల్లలాగా అవీ యివీ తినాలని కోరిక. ఈవేళ అదే జరిగింది. ఆమె మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత ఎండ కొద్దిగా తగ్గడం గమనించి చేతికర్ర అందుకుని నెమ్మదిగా తన 'మామూలు రౌండ్లకు' బయలుదేరింది. ఇల్లుదాటి కొద్ది గజాల దూరం వెళ్ళగానే సీతాఫలాలు అమ్ముతున్న ఒక నడివయసు అమ్మాయి ఎదురైంది. ముసలమ్మ కళ్లు మెరిశాయి. నోరూరింది. సీతాఫలాలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, కన్నులపండువగా కనిపించాయి. గొప్పగా రోడ్డుమీదనే బుట్ట దింపించి, నుదురుగా, పెద్దవిగా వున్న రెండు పళ్ళు ఏరుకుని బేరమాడింది. ఎంత కిందపెట్టి మీదపెట్టి బేరమాడినా రెండు పళ్ళూ అర్థరూపాయికి తగ్గలేదు. 

    ముసలమ్మ పళ్లు రెండూ ధోవతి చివర కట్టుకుని తమ యింటివైపు వేలు చూపించి "అదుగో ఆ  పక్కదే మా వాటా. మా కోడలుంటుంది డబ్బులడిగి తీసుకో" అని చెప్పి ఎదురుగావున్న వరలక్ష్మమ్మగారి యింటిలోకి వెళ్ళింది 'అమ్మాయ్!' అని పిలుస్తూ! తర్వాత గొడవ అంతా రెండు నిముషాల్లో జరిగింది. "ముసలమ్మగారు పళ్ళు తీసుకున్నారమ్మా! రెండూ అర్థరూపాయి...డబ్బులు మిమ్మల్ని అడగమన్నారు."

    "ఆ! పళ్ళు తీసుకుందా? రెండు పళ్లు  అర్థరూపాయా? వెధవ సీతాఫలాలకు మొహం వాచిపోయి వుందా? తనేం పసిపిల్లా? నెలాఖరు రోజుల్లో డబ్బులేమన్నా చెట్లకు మొలుస్తాయనుకుందా? రోజులెట్లా వున్నాయి? మండిపోతున్నాయి. ఏళ్ళొచ్చాయి ఎందుకూ? ఆ మాత్రం ఇంగితం తెలియొద్దూ..."

    "అమ్మ! ఇంతకీ డబ్బులు..."

    "డబ్బులిక్కడ కుప్ప పోసుకుని కూర్చోలేదు...ఫో ఫో". ఇంత జరిగాక పళ్ళ మనిషి ఊరుకుంటుందా? బుట్టనెత్తి కెత్తుకుని విసవిస నడిచి వరక్ష్మిదేవి యింటికొచ్చి, ముందు అరుగుమీద కూర్చుని బాతాఖానీ కోడుతున్న ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, పళ్లు రెండూ పుచ్చుకుని 'మంచి బేరమే' అని సణుక్కుంటూ వెళ్ళిపోయింది. ముసలమ్మకు తల తీసేసినట్టయింది. కళ్ళవెంట నీళ్లొచ్చాయి. ఏం మాట్లాడేందుకు గొంతు పెగల్లేదు. కర్ర అందుకుని గబగబ అడుగులు వేసుకుంటూ ఇంటికి వచ్చి కూర్చుని తీరిగ్గా మొదలు పెట్టింది. ముక్కు చీదుకుంటూ, మాటిమాటికి కళ్లు తుడుచుకుంటూ "ఈనాటి కీ గతి పట్టింది. నా కొడుకు ఇంట్లో నా కింత అవమానమా? వెధవది అర్థరూపాయి డబ్బులకు నోచుకోలేదా? అందరు కోడళ్ళూ అందరిళ్ళలో ఇలాగే వున్నారా? ఇంత అరాచకం ఎక్కడైనా వుందా?" లోపల కోడలు అన్నీ వింటూనే వుంది. కానీ పల్లెత్తి మాట్లాడలేదు. బదులు పలకలేదు. వాగి వాగి చివరకు ముసలమ్మ అలిసిపోయింది. అదుగో సరిగ్గా అప్పుడు వచ్చాడు రాంబాబు స్కూలు నుంచి.   

    అతడు తీరికగా నాయనమ్మ పక్కన చేరాడు. ఆమె అతనివంక చూసింది కాని యేమీ మాటాడలేదు. రాంబాబుకు నాయనమ్మను చూస్తే జాలివేసింది. ఆమె అప్పుడు ప్రపంచంలో వున్న విషాదమంతా మూట కట్టి కూర్చోబెట్టినట్లున్నది.

    రాంబాబు నెమ్మదిగా "నాయనమ్మా! సినిమా..." అన్నాడు.

    ఆమె గయ్‌మని మళ్ళీ లేచింది. "ఏం నాయనా! ఎగతాళిగా వుందా? వెధవది పళ్ళకు అర్థరూపాయ గతిలేదు. సినిమాట, సినిమా."

    రాంబాబు అనునయంగానూ, నెమ్మదిగానూ, స్పష్టంగానూ "అది కాదు నాయనమ్మా, వినూ. నువ్వెప్పుడూ చెబుతూ వుంటావ్, అదీ వచ్చిందిప్పుడు. రెండు రోజులే. ఇంక వుండదు" అన్నాడు.

    ఆ సినిమా పేరు వినగానే ముసలమ్మ గాజు బిళ్ళలవంటి కళ్లు మెరిశాయి. అతని దగ్గరికి జరిగి "ఆ సినిమా వొచ్చిందా? ఎక్కడ? ఎప్పుడు? హాలు ఎంత దూరం?" అని ప్రశ్నలు కురిపించింది. రాంబాబు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు - ఆ సినిమా రెండు రోజులు మాత్రమేనని, అప్పుడే ఒకరోజు అయిపోయిందనీ మరునాడు మాత్రమే వుంటుందనీ తెలుసుకుని గంభీరంగా ఆలోచించడం ప్రారంభించింది. కాస్సేపాగి "ఒరే రాముడూ! మనం ఎట్లా అయినా సరే ఆ సినిమాకు పోవాలి తప్పదు" అంది ఖచ్చితంగా.

    రాంబాబు ఆమె పట్టుదల గ్రహించాడు. లోపలికి వెళ్ళి కలం, కాగితం తెచ్చి ఇద్దరు మనుష్యులకు ఆ సినిమాకు వెళ్ళి రావడానికి ఎంత ఖర్చవుతుందో లెక్క వేశాడు. రానూ పోనూ బస్ ఛార్జీలు, అక్కడ రెండు టిక్కెట్లు, మధ్యలో తానేమీ వేరుశెనగ కాయలు వగైరా కావాలని ఆశించడు...జాగ్రత్తగా లెక్కవేసి నిట్టూర్చి "లాభం లేదు నాయనమ్మా! చాలా ఖర్చవుతుంది..." అన్నాడు.

    ముసలమ్మ వినలేదు. తల అడ్డంగా ఆడిస్తూ "అదేం వీల్లేదు. ఇద్దరం వెళ్ళి తీరాల్సిందే - ఎంత ఖర్చయినా సరే - సీతాఫలాలు అక్కర్లేదు... తిండి అఖ్కర్లేదు!" అన్నది.

    నాయనమ్మకు ఆ పాతకాలపు సినిమా మీద అంత మోజెందుకో రాంబాబుకు అర్థం కాలేదు. "పోనీ ఒక పని చేద్దాం. నేను నిన్ను హాలు దాకా తీసుకుపోయి టికెట్టు కొని లోపలికి పంపిస్తాను. ఆట వొదిలే టైముకు వచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. అందువల్ల బోలెడు సుఖం. పైగా నాకు ఆ పాత చింతకాయ పచ్చడి సినిమాలు ఇష్టం ఉండదు" అన్నాడు.

    ముసలమ్మ ఒప్పుకోలేదు. "నువ్వూ రావలసిందే" అన్నది. "నీకు మీ తాతగారి పేరు పెట్టుకున్నాంరా - తండ్రీ!" అని గొణిగింది. తర్వాత నెమ్మదిగా అసలు విషయం బైట పెట్టింది. అది విన్న తర్వాత రాంబాబుకు కూడా ఆ సినిమా తప్పకుండా చూడాలనిపించింది. నిశ్శబ్దంగా కూర్చుని డబ్బు పోగు చేసే పద్ధతులు ఆలోచించడం ప్రారంభించారిద్దరూ.

    అది చాలా పాతకాలపు సంగతి. అప్పుడు ఆమె భర్త రాయిలా హాయిగా ఆనందంగా ఉండేవాడు. తమ వూర్లో అడపాదడపా  వారినీ వీరినీ పోగుచేసి నాటకాలాడుతూ వుండేవాడు. ఆయన ఎప్పుడో మద్రాసు వెళ్ళినప్పుడు, స్నేహితుడు ఆ సినిమాలో చిన్న వేషం వేయమంటే 'సరేన'ని వేశాడు సరదాగా. ఆ కథ అంతా రాజులకూ రాజ్యాలకూ క్రూరులైన సేనాధిపతులకూ రాజకుమార్తెలకూ కుట్రలకూ ఎత్తులకూ పైఎత్తులకూ సంబంధించింది. అందులో ఆయన వేషం వేశాడు. రాజవైద్యుడి వేషం. ముసలమ్మ మాటల్లో; "చాలా సేపే కనిపిస్తారు. చెమ్కీ కోటు తొడుక్కుని...తలపాగాతో...మీసాలతో - రెండు మూడు మాటలు కూడా ఉన్నాయి"

    నాయనమ్మా, మనవడూ ఇద్దరూ కృతనిశ్చయులై లేచారు.

    ఆనాడు రాత్రి ముసలమ్మ, కోడలు వంటగది శుభ్రం చేసే పనిలో నిమగ్నురాలై వున్నప్పుడు కొడుకు గదిలో చేరింది. కూర్చుని నెమ్మదిగా ప్రారంభించింది. 'తెల్లవారితే శివరాత్రి...ఇంత బతుకూ బతికింది తాను...ఇప్పుడు కాటికి కాళ్లు చాచుకుని వుంది...పొయ్యేముందు ఇంత పుణ్యం చిన్న మూటగానైనా కట్టుకుని పోకపోతే సద్గతులుండవు...పైగా దూరమా భారమా?...ఉంటున్నది పవిత్ర కృష్ణాతీరం. నాలుగు మునకలు వేసి అమ్మవార్ని చూసొస్తే చాలు... వొట్టి చేతుల్తో పోలేము కదా! అడుక్కునే నిర్భాగ్యులందరికీ పెట్టలేము... కనీసం కొందరికైనా పైసలు పడేయొద్దూ?'

    కొడుకు అంతా విన్నాడు. ఏమీ మాట్లాడకుండా లేచి చొక్కా జేబు తడివి నెలాఖరు రోజుల్లో జేబులో మిగిలిన రెండు రూపాయి కాగితాలూ, కాసిని చిల్లర నాణాలూ ముసలమ్మకిచ్చి, మళ్ళీ కూర్చున్నాడు. ముసలమ్మ ఇవతలికి వచ్చి మనుమడి దగ్గరచేరి ఆ డబ్బులన్నీ అతనికి అప్పగించింది. అతడంతకు ముందే తాను అప్పుడప్పుడు పోగుచేసిన రూపాయి, చిల్లర లెక్క చూసుకున్నాడు. తర్వాత రెండురోజుల పాటు తాను స్కూలుకు నడిచిపోగలడు. పొద్దున్నే వీధి చివర యింట్లోని కాశిగాడు తనకు ముప్పై పైసలివ్వాలి. అవి వసూలు చేస్తే 'సుబ్బరంగా' సరిపోతుంది.

    మర్నాడు ముసలమ్మ ఎక్కడినుంచో మరో పావలా పట్టుకొచ్చింది.

    రాంబాబు కొంచెం శ్రమపడ్డాడు. కాని మొత్తంమీద కాశీగాడి బాకీ వసూలు చేశాడు.

    సాయంకాలం అయిదు దాటిన తర్వాత ముసలమ్మ తనకున్న వాటిలో మంచి ధోవతి కట్టుకొని కళ్ళజోడు తాటితో చెవులకు బిగించుకొని తయారైంది. రాంబాబూ సిద్ధంగానే వున్నాడు. ముసలమ్మ కోడల్ని కేక వేసి "ఇదిగో నిన్నే...మొన్న చెప్పానే...మన వూరి వారి అమ్మాయి కాపురానికొచ్చి ఇక్కడే వుంటున్నదని... వారింటికి పోతున్నా...మొన్న కనిపించి ఒకటే బతిమిలాడింది. పాపం పెద్ద దిక్కెవ్వరూ లేరట. చూసొస్తా... రాముణ్ని తోడుగా తీసుకుపోతున్నా పెద్దముండను కదా...తోడుగా ఉంటాడని..." అన్నది. కోడలు తలవంచి చూసి ఏకళనున్నదో ఏమో సరే అన్నట్టుగా తల వూపింది. నెమ్మదిగా 'జాగ్రత్త' అని కూడా అన్నది.

    ఇద్దరూ నడచి వచ్చి వంతెన దిగి బస్సు కోసం నిలబడ్డారు. ఎన్నో బస్సులు వస్తున్నాయి... పోతున్నాయి... ఏ బస్సులోనూ ఖాళీ లేదు. చాలాసేపు పడిగాపులు పడివుంటే చివరకు బస్సు దొరికింది. అది అరగంట ప్రయాణం చేసి ఊరిచివరకు చేరింది. అక్కడినించి నడిచి సినిమా హాలుకు చేరుకున్నారు. అదొక పాత హాలు... హాలు ముందు లైట్లు కూడా మందంగా ఉన్నాయి. జనం కూడా ఎక్కువ మంది లేరు. చాలా పలుచగా ఉన్నారు. ఆ వాతావరణం చూస్తే అసలారోజు సినిమా ఉంటుందా, ఉండదా అని అనుమానం కలిగింది. రాంబాబు వెళ్ళి కనుక్కుని వచ్చాడు. "నాయనమ్మా! ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వేస్తారు... పదిమంది జనం ఉన్నాసరే..." అని చెప్పాడు. 

    అక్కడున్న పది పదిహేను మంది చాలా నిరుత్సాహంగా నిర్లిప్తంగా ఉన్నారు. ఏమీ తోచక, మరేం చెయ్యడానికి ఏమీలేక వచ్చిన వాళ్ళలాగున్నారు.

    అంతలో కొన్ని లైట్లు వెలిగాయి. బెల్ మోగింది...కౌంటర్లు తెరచి కూర్చున్నారు హాలువాళ్లు. జనం ఉన్న కొద్దిమంది చాలా నెమ్మదిగా, నీరసంగా టిక్కెట్లు కొనుక్కుంటున్నారు.

    రాంబాబు టిక్కెట్లు తెచ్చాడు. నాయనమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించుకుని వెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు. లోపల ఏదో పాతకాలపు సినిమా పాట వినిపిస్తున్నది. 

    మళ్లీ బెల్ మోగింది. లోపల లైట్లు ఆరిపోయాయి.

    కూర్చున్న కొద్దిమంది జనంలోను, ఎవడో ఈల వేశాడు.

    న్యూస్‌రీల్ ఒకటి ప్రారంభమయింది...తర్వాత అసలు సినిమా అక్షరాలు పడ్డాయి...మళ్లీ ఎవడో ఈల వేశాడు.

    ఆ కథ అంతా రాజ్యాలకోసం కుట్రలు, యుద్ధాలు, ముసుగు మనుషులు, ప్రేమలు ఇలా నడుస్తున్నది. పాత ప్రింటు కావడం వల్ల అన్ని సన్నివేశాల్లోనూ వర్షం కురుస్తున్నట్టుగా వుంది. మాటి మాటికీ తెర మీద గీతలూ, ఇంటూ, ప్లస్ గుర్తులు పడుతున్నాయి. జనంలో ఎవరో ఎందుకో ఏదో పెద్దగా అని మరింత పెద్దగా నవ్వారు.

    అంతలో ఇంటర్వెల్...'ఇంక పది నిమిషాల్లో...'అనుకుంది ముసలమ్మ..."ఇంక పది నిమిషాల్లో" అని పెద్దగా రాంబాబుతో అన్నది.

    కథ నడుస్తున్నది. రాజుగారు మరణశయ్యమీద వున్నారు - చుట్టూ దేవేరులూ, మంత్రులూ, ఇతరులూ నిలబడి వున్నారు...మౌనంగా - "ఇప్పుడే - ఇప్పుడే" అన్నది ముసలమ్మ అదుర్దాగా - రాంబాబు ఉత్కంఠతో జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాడు. అంతలో "రాజవైద్యులొచ్చేశారు -" అన్న డైలాగ్...చూడు చూడు" అన్నది ముసలమ్మ. కెమెరా గుమ్మంవైపు తిరిగింది.

    ఉన్నట్టుండి తెరమీద ఎర్రటి మంట కనిపించింది. శబ్దం కూడా వినిపించింది. ఫిలిం కాలిపోయింది. లైట్లు వెలిగాయి. జనంలో ఎవడో మళ్ళీ ఈల వేశాడు. ఒకరిద్దరు లేచిపోయారు.

    రీలు లోపల చుట్టుతున్న శబ్దం...అర నిమిషం తర్వాత మళ్ళీ సినిమా మొదలైంది. ఇప్పుడు విలను గుహలో నాట్యం ప్రారభమైంది. జనంలో మళ్ళీ ఈల వేశాడు. 

    రాంబాబు నీరు కారిపోయాడు. నాయనమ్మ వంక చూశాడు. ఆమె దిగ్భ్రాంతి చెందిన దానిలా బొమ్మలా కూర్చుని వుంది.

    "నాయనమ్మా!"

    "ఊ!"

    "ఇంతేనా?"

    "అంతే ఇక కనిపించదు" ఐదు నిమిషాల తర్వాత ఆమె రాంబాబు చెయ్యి పట్టుకుని లేచి "పద యింటికి పోదాం - " అన్నది.

    ఇద్దరూ హాలు బయటికి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఎదురుగా అంత మందమైన వెలుతురు...చీకటిని మించలేని సామాన్యమైన వెలుతురు...  
Comments