కొత్త రేడియో లీల - చలపాక ప్రకాష్

    
"ట్రీంగ్... ట్రీంగ్..."

    "హలో!"

    "హలో!... అప్పం రేడియోనాండీ"

    "అవునండీ"

    "మీ బెదరగొట్టేస్తాం ప్రోగ్రామ్ నిజంగా మమ్మల్ని భలే బెదరగొట్టేసింది లెండి"

    "అలాగా!... అయినా మాంచి మాచి కొత్త పాటలే వేస్తున్నాం కదా. మీరు దేనికీ బెదిరిపోవడం?" తియ్యగా ప్రశ్నించింది అవతల నుండి యాంకర్ కంఠం.

    "బెదిరిపోక ఏం చెయ్యమంటావు తల్లో... నేను సినీ నిర్మాతను కమ్ ఆడియో కంపెనీ ఓనర్ని"

    "అయితే?"

    "అయితే ఏంటంటావు తల్లీ! మీరిలా కొత్త సినిమా పాటలు విరబడి వేసేస్తుంటే, ఇక మా దగ్గర డబ్బులు పెట్టి క్యాసెట్లు, సీడీలు ఎవరు కొంటారు తల్లీ. ఇది అన్యాయం... అక్రమం కాదా?.. అమతంత డబ్బులు వెచ్చించి ఆడియో హక్కులు కొన్న మా నెత్తిన చెంగు వేస్తారా? ఇదేమైనా మీకు న్యాయమా చెప్పండి తల్లీ" నిలదీశాడాయన.

    ".....?"

    "హలో... హలో... లైన్లో వున్నారా? నా వాగుడు ఏమన్నా మీకు వినబడుతున్నదా?"

    ".....?"

    "హలో... హలో..."

    ఈ సారి అవతల నుండి లైన్ కట్ చేసిన శబ్దం వచ్చింది.

* * *

    "ట్రీంగ్... ట్రీంగ్..."

    "హలో... అప్పం రేడియోనా నండీ"

    "అవునండీ. ఇది 'బూటకచక్ర' ప్రోగ్రాం అండీ"

    "బూటక సామ్రాట్ బుడగల బుచ్చబ్బాయ్ గారిని, మా అబ్బాయ్ జాతక చక్రం ఎలా వుందో అడిగి తెలుసుకోవాలని వుందండీ"

    "అలాగా? మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నని అడగండి. బుడగల బుచ్చబ్బాయ్ గారు నా ప్రక్కనే సిద్ధంగా వున్నారు మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి" అంది యాంకర్.

    "హలో... బుడగల బుచ్చబ్బాయ్ గారూ!"

    "ఆ... చెప్పండి. నేనే మాట్లాడుతున్నాను"

    "మా అబ్బాయి జాతకం గురించి మిమ్మల్నొక ప్రశ్న వేయాలనుకుంటున్నానండీ"

    "ఆ వేద్దురుగాని, కానీ... ముందుగా మీ పేరు, ఏ ఊరినుండి మాట్లాడుతున్నారో చెప్పండి?"

    "నా పేరు అరగని దేవండి. అడుక్కునే వారి పాలెం నుండి మాట్లాడుతున్నాను."

    "అలాగా! ఇప్పుడు మీ ప్రశ్న అడుక్కోండి"

    "మా అబ్బాయి నైంత్ వరకు చాలా శ్రద్ధగా చదివాడు"

    "ఓకే"

    "అన్ని క్లాసుల్లో ఫస్టే వచ్చాడంటే నమ్మండి"

    "ఓకే. అలాగే నమ్ముతాను. ఆ తర్వాత...?"

    "ఇప్పుడు టెంత్ చదువుతున్నాడు"

    "ఓకే! ఐతే...?"

    "ఇప్పుడు టెంత్‌ని ఒకేసారి ఈ సంవత్సరం కంల్ప్లీట్ చేస్తాడా? ఫస్ట్‌క్లాస్‌లో పాసవుతాడా? ఈ సందేహాలతో నాకు ఒకటే టెన్షన్‌గా వుంది బుచ్చబ్బాయ్ గారూ!"

    "అదేం ప్రశ్న? మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడంటున్నారు కదా. మరి ఫెయిలెందుకు అవుతాడని ఊహిస్తున్నారు మీరు?"

    "అహా!... టెంత్ క్లాస్ పాస్ అవ్వడమంటే కాస్త కష్టమైన విషయం కదా. అదీ కాక మా అబ్బాయి గ్రహబలం అవీ అనుకూలంగా వున్నాయో లేవోనని నా సందేహం!"

    "మీ సందేహం సరైనదే. మీ అబ్బాయి రాశి వివరాలు చెప్పండి!"

    "హింస రాశి... సారీ హంస రాశి"

    "ఓకే! ఏ సంవత్సరం... ఏ నెల ఏ తేదీన పుట్టాడు?"

    "1990 సంవత్సరం... ఫిబ్రవరి... 30న పుట్టాడు"

    "ఐసీ! ఏ సమయాన పుట్టాడూ"

    ".....?"

    "హలో అరగని దేవిగారూ! లైన్లో ఉన్నారా?"

    "ఆ... లైన్లోనే వున్నానండీ"

    "పుట్టిన సమయం ఖచ్చితంగా చెప్పండి?"

    "ఖచ్చితంగా పన్నెండున్నరకి పుట్టాడు. కాకపోత మధ్యాహ్నమో, రాత్రో గుర్తుకు రావట్లేదండీ"

    "ఆ... గుర్తుకు రావట్లేదంటే ఎలాగండీ... ఖచ్చితమైన రిజల్ట్స్ రావాలంటే అన్నీ సక్రమమైన వివరాలు కావాల్సిందే. అయినా ఆ రోజంతా గ్రహబలం బలంగా వుంది కనుక సరి. కాకపోతే, మీ అబ్బాయి జాతక ఫలంలో చిన్న వంకరుంది."

    "అయ్యో రామా! దీనికేమిటి విరుగుడు?" బాధగా, కంగారుగా అందామె.

    "ఆ... అయినా ఏం ఫర్వాలేదు. సెల్‌ఫోన్లు, టీవీలు, సినిమాల జోలికి వెళ్ళనీయకుండా చూస్తే చాలు. మీవాడు ఖచ్చితంగా పాసయ్యి తీరుతాడు"

    "అలాగా! చాలా సంతోషమండీ. మీరు చెప్పినట్లే చేస్తాను. కాకపోతే, నాదో చిన్న ధర్మ సందేహం!"

    "అడగండి!" విసుగ్గా అన్నాడు.

    "మా అబ్బాయి మీ అప్పం రేడియో వినవచ్చాండీ?"

    వెంటనే పక్కనే వున్న యాంకర్ మైక్ లాక్కొని టక్కున చెప్పింది. "ఓ తప్పకుండా!... ఈ అప్పం రేడియో వింటూ చదివితే, ఉరిమే ఉత్సాహం, ఉల్లాసం మీ వాడికి తోడవుతాయి. ఆ మాటకి పక్కనే వున్న బుడగల బుచ్చయ్య తల గోక్కున్నట్లుగా శబ్దమైంది రేడియోలో.

    "ఓకే థ్యాంక్యూ బుడగల బుచ్చబ్బాయ్ గారూ... రేడియో యాంకరమ్మ గారూ... మా వాడి ఉజ్వల భవిష్యత్‌కి మీరూ... మీ రేడియో ఇచ్చిన మాంచి సలహాలిచ్చి ముందుకు నెట్టినందుకు మెనీ మెనీ థ్యాంక్సండీ"

    "ఓకే... ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మీకు కూడా థాంక్సండీ... బై బై"

* * *

    గిర్రుమని ఆర్నెల్లు గడిచిపోయాయి.

    "ట్రింగ్...ట్రింగ్..."

    "హలో... బూటక చక్ర ప్రోగ్రామాండీ"

    "అవునండీ!... మీ పేరూ, ఎక్కడి నుంచు కాల్ చేస్తున్నారో ముందుగా చెప్పండి" అడిగింది యాంకర్.

    "నా పేరు అరగని దేవి. అడూక్కునే వారి పాలెం నుండి మాట్లాడుతున్నాను" చెప్పింది అవతల నుండి ఆడ కంఠం తీవ్రస్వరంతో.

    "మీరు ఇంత క్రితం కాల్ చేసారు కదూ" బుడగల బుచ్చబ్బయ్ లైన్లోకొస్తూ అన్నాడు వెంటనే.

    "అబ్బ! చాలా చక్కగా గుర్తించారు. మీ జ్ఞాపకశక్తికి నా జోహార్లు" అవతలి నుండి వెటకారంతో కూడిన ధ్వని.

    "ఓకే... థాంక్యూ" అంటూ ఆనందంతో ఓ వెకిలి నవ్వు నవ్వి "అవునూ... ఇంతకీ మీరు గతంలో వేసిన ప్రశ్నకి నా జవాబు నిజమైందా? మంచి ఫలితం ఇచ్చిందా?" ఆత్రంగా అడిగాడు బుడగల బుచ్చబ్బాయ్.

    "మా వాడు టెంత్ క్లాస్ ఫస్ట్ క్లాసులో పాసవ్వుతాడని చెప్పారు కదా మీరు"

    "అవును. ఏం? ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడా? స్టేట్ ఫస్ట్ వచ్చాడ్Fఆ?" మరింత ఉత్సాహంగా అడిగాడు.

    "ఫస్ట్‌క్లాసు కాదు. కనీసం లాస్ట్ క్లాశ్‌లో కూడా పాసవ్వలేదు సరొకదా! అతి ఘోరంగా తప్పాడు"

    "....."

    "హలో... బుచ్చబ్బాయ్ గారూ! ... లైన్లో వున్నారా?"

    "ఆ... ఉన్నాను... అయినా అలా జరిగే అవకాశం లేదే? కొంపదీసి మీరేమైనా జోక్ చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది నాకు"

    "జోకా? డోకా? మన మొఖానికి అంతోటీ!... ఏదో అప్పం రేడియోలో మీ జవాబులు వింటూ ఊరికే ఉండబట్టలేక ప్రశ్న వేసాగాని, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా వుండి వుంటే బాగుండేదని అనిపిస్తుంది. కనీసం మావాడు మామూలుగానైనా పాసై వుండి వుండేవాడు... ప్చ్..." బాధగా నిట్టూర్చింది.

    "ఎక్కడో ఏదో రాంగ్ జరిగినట్లుంది. నేను చెప్పినట్లు సెల్‌ఫోన్, టీ.వీ, సినిమాల నుంచి మీ వాడిని దూరంగా వుంచారా?" అనుమానంగా అడిగాడు.

    "ఆ... మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. కాకపోతే ఆరునూరైనా మీవాడు పాసై తీరుతాడని మీరంత ఖచ్చితంగా చెప్పేసరికి, మా వాడు చదవడమే మానేసాడు ఎలా పాసవ్వుతానో చూద్దామని. ఏదీ... మీరు చెప్పింది నిజమవ్వందే" ఖయ్యిమంది అవతలి కంఠం. అంతే! రేడియో స్టేషన్‌లో ఒకటే నిశ్శబ్దం!! 
Comments