క్రియ - వివిన మూర్తి

    “మావాడూ సమాజ ఉధ్ధరణ చేస్తున్నాడు.” అంది రాధ


    అంటున్నప్పుడు రాధ నవ్వాలి. ఆ నవ్వులో కాస్తంత గర్వం, కించిత్తు వెటకారం ఉండాలి. అప్పుడే రాధ డూ దగ్గర తీసిన దీర్ఘానికి అలంకారం ఏర్పడుతుంది. 


    కాని రాధ నవ్వదు. సమయ ప్రభావం. 


    నేనైతే ఆ నవ్వుకోసం ఎదురుచూసిన క్షణాలు, రోజులు, ఏళ్లూ ఉన్నాయి. వాటిని పువ్వులుగా చేసుకుని హృదయమంతా అలంకరించుకోవాలన్న రోజులు ఉన్నాయి.


    ఇప్పుడు.. ఈ వయసులో.. నాకటువంటి రొమాంటిక్ భావనలు లేవు. 


    శారద పోయాక కనీసం అలాంటివి కలిగినా బావుండునన్న వెర్రి ఊహ కలగటం మాత్రం పచ్చినిజం. 


    శారదకి నేనిచ్చిన వ్యధ ఎక్కువా- ఆమె నాకిచ్చిన సుఖం ఎక్కువా అన్నది రెండేళ్లుగా తూచుతున్నాను. తూనిక తేలలేదు. తేలుతుందన్న నమ్మకం కూడా లేదు. తేల్చాలన్న పూనిక నన్ను ముంచుతోంది.


    విధికి నన్నెలా శిక్షించాలో బాగా తెలుసు. 


    లేకపోతే రాధా, నేనూ పక్కపక్కల నివసించ వలసిన కర్మ ఏమిటి!! 


    నిజమే తను నవ్వలేదు. కట్టుడు పళ్లు పెట్టుకునుంటే నవ్వుండేది. ఈ నవ్వు ఆ నవ్వులా ఉండదు. నాకా చూపు లేదో- ఈ నవ్వుకు ఆ రూపు లేదో- ఇప్పటికీ రాధ సందడి చుట్టాలలో తగ్గలేదు. పైగా పెరిగింది. అప్పటి కారణం అందమైతే ఇప్పటి కారణం ముగ్గురు మగపిల్లలు, ఓ ఆడపిల్ల.. అంతా అమెరికా నివాసులు.. బుష్ సరేనంటే వాళ్లు అక్కడే ఓ కోవెల కట్టి అమ్మను పూజించుకునేవారే. భర్తకి చాలా సేవలు చేసిందట. ఆడవాళ్ల వెనకాల కొన్ని రకాల నిజాలు మాట్లాడుకుంటుంటారు. రాధ వయసులో ఉన్నప్పుడు కూడా అలాంటి నిజాలు ఎవరూ మాటలాడుకోగా నేను వినలేదు. శారదని నేను బాధ పెట్టాను గనక – రాధ తన భర్తని బాధపెట్టి ఉండుంటే- కనీసం జనం అలా అనడం వినుంటే- లోపల్లోపల నాకు కాస్త తూకంగా ఉండేది. లేదు. అలా జరగలేదు. సందర్భం వచ్చినపుడు తప్ప  ఆ రోజుల్లో అది నన్ను అంతగా గెలికేది కాదు.  తను ఎక్కడో పిఠాపురంలో ఉండేది. నేను ఈ హైదరాబాదులో శారదను బాధ పెట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ ఉండే వాడిని. గెద్దనాపల్లిలో పుట్టి పెరిగిన ఆరోజులు ఆడపిల్లల చూపు కలిస్తే చాలు అందులో వేయి అర్ధాలు వెతుక్కుని స్నేహితులతో కలబోసుకునే మగపిల్లల కాలం. వేదుల కృష్ణశాస్త్రీ మమ్మలని ఆవహించిన కాలం. మా మెదడులను నాట్యం చేయించిన కాలం. ఆ నాట్యంలో రాధ నాకు ఏదియో అర్ధమ్ముకాని భావగీతమ్ము అయింది..... ఆమె నయనంబులందు అనంతాంబరపు నీలినీడలు కనిపించేవి.. ఉమర్ ఖయాం వేదాంతమయింది... గాలిబ్ గీతమయింది.

      

    కులం, శాఖ, గోత్రం, వరస, స్థాయి అన్నీ అమరిన ప్రేమ గనక ఫలించడానికి అడ్డంకులు ఏమీ లేవు. 

      

    అయినా ఫలించలేదు.

      

    కారణం విధి కాదు. పోనీ మా నాన్న అందామా అంటే ఆయన నందో రాజా భవిష్యతి వాడు.

      

    ఫలించక పోటానికి కారణం ఏమిటమ్మా అని రాధనే అడిగితే- తనకింకా పెళ్లి కానపుడు – వికారమైన మొహం పెట్టి – సమాజ ఉద్ధరణ – అనేదని సూరిబావ చెప్పేవాడు. వాడికి ప్రేమ మీద చచ్చినంత గౌరవం. అది గనక ఓమారు పుట్టిందీ అంటే- దానికో కారణం ఉండదట. జన్మ జన్మలకీ వదలదట. నీ సుఖమే నే కోరుకున్నా  అనాలిట. వాడికనేంటి- నాకూ అంతకన్న నాలుగు ఎక్కువే ఉండేవి సిద్ధాంతాలు.


    రాధ –సమాజ ఉద్ధరణ – అన్నపుడల్లా, ఆమాటని సూరిబావ నాతో అన్నపుడల్లా- అందులో రాధ మాటల్లో కచ్చ, మెచ్చుకోలు వినిపించేవి. కచ్చని దాచి మెచ్చుకోలుని వినిపించటం మిత్రధర్మమన్న సూరిబావ సంకల్పం కనిపించేది.  


    అలా అతను నాతో గుసగుసలాడుతున్నపుడు ఓరోజు శారద షాకుల మీద షాకులు ఇచ్చింది.


    రాధ గురించేనా గుసగుసలు- అంది ఫలహారపు పళ్లెం అందించుతూ.


    వాడు నాకేసి అయోమయంగా చూసాడు.


    నేనూ ఊహించనిది కావటంతో కోపం చూపించాలో, మామధ్య ఎంత అవగాహన ఉందో చూడు – అన్న ఫోజు చూపించాలో అర్ధంకాక అయోమయంగా చూసాను.


    “-ఆ బంగారుతల్లి ఈ బంగారుకొండని నాకు దానం చేసిన దేవత” అంది. యధాతధంగా అలా అవే వాక్యాలు అందని నేను చెప్పలేను గాని నా జ్ఞాపకాలలోని ఆమె భావనను ఇముడ్చుకునే వాక్యాలు అవి. 


    ఆ రెండు షాకులతో శారద సరిపుచ్చలేదు.


    “అన్నయ్యగారూ- ఈ చెల్లిలి మాటగా చెప్పండి.- చక్కగా పెళ్లి చేసుకుని నూరేళ్లూ పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో చల్లగా ఉంటేనే మా సంసారం ఎత్తిరిల్లుతుంది.” – అంది. ఆ – ఎత్తిరిల్లుతుంది- అన్న పదం శారద వాడినదే. అది నాకు బాగా నాటుకుని ఉండిపోయింది. 


    ఇంత చక్కగా ప్రవర్తించిన శారదతో ఆరాత్రి నేనెంత చక్కగా ప్రవర్తించానో నాకు బాగా గుర్తు.


    “-అందరూ నీలా ఉండరే ముండా ఇలా మెగుడు చచ్చాడు. అబార్షన్ అయిందో చేయించుకున్నావో ఆ భగవంతుడి కెరుక. నీ అన్న చెప్పాడూ.. నాన్న చెప్పాడూ అంటున్నారు.. వాళ్లు చెప్పారో నీకే పుట్టిందో.. నీకే పుట్టుంటుంది గారంటీగా.. రుచి చూసావు గదా.. కావాలి కావాలి అనుంటుంది... నువ్వెవడితో నైనా పోయినా పోతావని మీ నాన్నో అన్నో మళ్లీ పెళ్లి తలపెట్టారు. వలేసారు. నేను పడ్డాను. వెర్రి మాలోకాన్ని. లోకోద్ధరణ చేసెయ్యాలని గంగిరెద్దులా తలూపి నీ మెళ్లో మరో పసుపుతాడు కట్టాను. రాధ నీలాంటిది కాదు. మనసివ్వటానికీ మనువాడటానికీ తేడా చూడని మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అందుకే నేనింత మోసం చేసినా రెండేళ్లయినా పెళ్లి మాటెత్తనివ్వటం లేదు.” –


    అదీ నా మాటల సారాంశం. మరొకరు ముట్టిన శరీరాన్ని ముట్టుకోక తప్పనిసరి కావటంతో ప్రక్షాళన కోసం కాల్చిన గుర్తులు శారద శరీరం మీద శాశ్వతంగా ఉండిపోయాయి. అదీ నా జీవితకాల ప్రవర్తన సారాంశం.


    అవకాశం వచ్చినపుడల్లా రాధకి చెప్పమని సూరిగాడితో నేను అన్న మాటలు ఇవి.


    “-ప్రేమ ఎంత పవిత్రమైనదో సమాజ ఉద్ధరణ అంతకన్న పవిత్రమైనది. బొందెతో మాత్రమే శారదతో జీవిస్తున్నాను. అది కేవలం నా బుద్ధి నా శరీరానికి అప్పజెప్పిన ధర్మం. నువ్వుకూడా నన్ను అనుసరిస్తే నాకు పాపప్రజ్ఞ ఉండదు.”-


    ఆ నా మాటల ప్రభావమో, జీవిత వాస్తవికతో – రాధకి కూడా పెళ్లయిపోయింది. అది నా మాటల ప్రభావమే నని సూరిగాడు కృష్ణశాస్త్రిలా తమకంగా అంటుంటే నేను ఎన్నడూ కాదనలేదు.


    ఇప్పుడు రాధ మొగుడు లేడు. శారద లేదు. మా ఇద్దరి మధ్యా ఏదైనా ఉండే వయసు లేదు. 


    రాధ కూతురు కూడా అమెరికా వెళ్లిపోతూ.... తల్లిని తన ఇంటిలోనే ఉంచి, ఆమెకు సహాయంగా మా చుట్టాలలోనే ఓ పేద చుట్టాన్ని ఏర్పాటు చేసి, మరో చుట్టమైన మా అబ్బాయికి ఓ వెయ్యి అద్దె తగ్గించి పై వాటా ఇచ్చి, - నా యింటినే కాదు నా తల్లినీ నీ చేతుల్లో పెడుతున్నానని అప్పగింతలు పెట్టింది. 


    ఇలా నా కొడుకూ కోడలూ కడుపులు పట్టుకుని ఆఫీసులకూ మనవలు బాగులు పట్టుకుని బడులకూ పోతే పై వాటాలో నేనూ కింద వాటాలో రాధా ఉండే శిక్ష విధించాడు విధాత. వీలున్నపుడూ.. వీలు చేసుకుని కూడా రాధ సమాజ ఉద్ధరణ అని రెండేళ్లుగా అంటూనే ఉంది. అది కొంత కష్టంగా ఉన్నా కొంత ఇష్టంగా కూడా ఉంది.


    కాని మా వాడూ అని రాధ తీసిన దీర్ఘం ప్రత్యేకమైనది.


* * *


    “ఏ సమాజాన్ని ఉధ్ధరిస్తున్నాడో –చెప్పూ”- అన్నాను విధి లేక.


    లోపలికి వెళ్లి పనిలో పనిగా నవ్వటానికి తయారుగా కట్టుడు పళ్లు పెట్టుకుని మరీ వచ్చింది. రాధ చేతిలో పేపరేదో ఉంది. 


    ఈ- మావాడూ- అన్నవాడు రాధకి తమ్ముడు వెంకటేశ్వర్లు. సి. వి. లూ అనేవాళ్లం వేళాకోళంగా.  నా కన్న పదేళ్లేం అంతకన్న ఎక్కువే చిన్న. సివిలు డ్రాప్ట్స్ మన్ సర్టిపికెట్టు సంపాదించి కర్నాటకలో మంగళూరులో ఉద్యోగమో పనో ఏదో మొత్తంమీద అక్కడ ఉంటున్నాడు. సమాజాన్ని ఉద్ధరించే లక్షణాలు నాకు తెలిసి వాడిలో కోసినా లేవు. వాడు ఇరవై ఏళ్లకే బోల్డన్ని ముగ్గులు పెట్టి కోడిజుత్తు రోగం తగిలించుకున్నాడు. వాడిని వేదులా,  కృష్ణశాస్త్రీ ఏమీ చెయ్యలేక పోయారు. ఆ తర్వాత వాడు ఊజ్యుడయాడనీ, బాగా వెనకేసాడనీ అన్నారు.


    ఆ పేపర్లు కన్నడంట. అచ్చం తెలుగు అక్షరాలే.  అందులో వాడి ఫొటో ఉంది. కింద ఇంటర్వ్యూ.ట. ఇంకో పేపర్లో ఏవో నినాదాల అట్టలతో వెంకటేశం ఓ గుంపులో ముందు వరసలో ఉన్నాడు. 


    “ఫొటోల్లో మనాడు కనిపిస్తున్నాడు గాని ఏం రాసారేంటి రాధా”


    రాద ఈసారి నవ్వటానికి సంకోచించలేదు. అందులో గర్వం నించటానికి సంకోచించలేదు. నన్ను నా సైజుకి కుదించటానికి సంకోచించలేదు. 


    “ ఏంటో నాకు మాత్రం ఏం తెలుసు బావా- టీవీలన్నింటి లోనూ మా వాడేట. నేనో మారు టీవీలో చూపిస్తుంటే చూసాను. ఏమిట్రా- అని ఫోను చేస్తే సమాజం పాడైపోతోందక్కా- మన కడుపుకు మనం చూసుకు బతికెయ్యట మేనా- దాన్ని బాగు చెయ్యటానికి తోచింది చెయ్యాలిగదా- అంటూ ఈ పేపర్లు పంపించాడు.” అంటూ వాటిని నా మొహంమీద కొట్టింది. అవి నేను చూస్తుంటే కొనసాగించింది.


    “-పాపం మనబోటి వాళ్లం ఏం చేసినా ఎంత చేసినా రాణకెక్కదు. చెప్పుకునే వాళ్లే ఉండరు…..”


    ఇహ ఈ వెంకటేశం గాడి పేపరు ప్రతిష్ఠతో నన్ను టొకాయించి పారేస్తుందన్నమాట ఈవిడ గారు అని గొణుక్కుంటూ పేపరు చాటేసుకున్నాను. 


* * *                            


    నారోజు బాగుంది. పది రోజుల్లో నా కొడుక్కి ఏదో ట్రైనింగుట. అదీ బెంగుళూరులో. పిల్లలకి సెలవులు. నా కోడలికి కూడా సెలవలు మురిగి పోతున్నాయిట. దానాదీనా కర్నాటకలో తిరుగుదామని కొడుకూ కోడలూ కూడబలుక్కున్నారు. మీరు అంత దూరం వెళ్లేట్టయితే మంగుళూరు వెళ్లాల్సిందే అంది రాధ. అంతటితో ఊరుకోలేదు. వెంకటేశంతో ఫోను కూడా చేయించింది. అంతటితో అవలేదు.


    ఈ ముసిలి ప్రాణాన్ని కూడా మోసుకుపోతామన్నారు మా వాళ్లు. చెప్పొద్దూ- నాకు ఆనందమే కలిగింది. జీవితమంతా పెళ్లాన్ని హింసించటమన్న ఎంటర్టైనమంట్ తప్ప మరోటి ఎరగని వాడిని. మా రైల్వేవాళ్లు పాసులు ఇచ్చినా, శారద ఉత్సాహ పడినా- “నీ బాబు నిన్ను పోషించటానికి ఉద్యోగం వేయించాడు. రాత్రిళ్లు నిన్ను సుఖపెట్టటమనే డ్యూటీ వేసాడు. ఇంక నీకు తిప్పుళ్లు మప్పమని  నాకు చెప్పలేదు. మప్పానా- మరి తిప్పలేను”- అనేసి కసి తీర్చుకున్నానుగాని నాకంటూ మరో ఎంటర్టైనమంట్ లేకుండా చేసుకున్నాను. అలవాటై పోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా మనసు వెనక్కి లాగేస్తుంది. అసలు ఇల్లు విడిచి వెళ్లాలంటే ఆడాళ్లకున్న సరదా మొగాళ్లకి ఉండదనుకుంటాను. అయినా ఆనందం ఎందుకు వేసిందంటే పది పదిహేను రోజులు ఎడం ఉంటే రాధమ్మ సమాజ ఉద్ధరణ ఎత్తిపొడుపులని కాస్త ఎడం పెడుతుందేమోనన్న ఆశ. చెప్పొద్దూ- లోపల మరో బెంగ ఉంది- అది భార్గవి.


* * *


    వెంకటేశం నిజంగానే చాలా మంచాడు. అభిమానాలూ అపేక్షలూ మనవాళ్లన్న గౌరవాలూ అన్నీ ఉన్నవాడు – ఎప్పుడు నేర్చుకున్నాడో మరి. అతగాడూ, భార్గవీ వచ్చి వాళ్ల ఇన్నోవా కారులో తీసుకుని పోయారు. కెఎస్ రావు రోడ్డు మీదనుంచి పోతున్నాంట. వెంకటేశ్ తెగ వాగుతున్నాడు-  అక్కడి గౌడసారస్వత  బ్రాహ్మణుల గురించి వారిలో సంప్రదాయమూ ఆధునికతా సమ్మేళనం గురించి, స్థానికుల మంచితనం గురించి, మరో ఐటీ సిటీగా మారిపోవటంతో వచ్చి పడుతున్న ఉత్తరాది యువతీ యువకుల గురించీ, పెరుగుతున్న మాల్స్ పబ్బుల గురించి, వారి వల్ల వాటి వల్ల జరుగుతున్న సంస్కృతీ కాలుష్యం గురించి—అవునండీ నిజమేనండీ అంటూ మావాడూ.. మధ్యమధ్యలో ఒకటీ అరా అంటున్నా మనవళ్ల సందేహాలకే పరిమితమై పోయింది నా కోడలు.. ముందు సీట్లో మావాడూ, వెంకటేశం .. వెనక సీట్లో కోడలూ పిల్లలూ.. మధ్యలో నేనూ వెంకటేశం పెళ్లాం భార్గవీనూ..


    -చూసారా ఆ బిల్డింగూ .. అంటూ నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ భవనం ముందు నిలిపాడు. తిప్పి చూపించాడు. వచ్చిన కొత్తలో కొనిపడేసాడుట. –ఈ రోజుల్లో డబ్బు చెయ్యాలంటే ఇళ్ల మీదే..బావా ముందు చూపుండాలి.. లోకలాళ్ల కన్న లోకలాళ్లమై పోవాలి.. కలిసి కూడా రావాలనుకో ..అందుకు మీ చెల్లాయే ఉంది.. నా ఇంటి భాగ్య దేవత.. ఐతే మనిషి ప్రయత్నం కూడా కావాలి కదా.. నా పేరు కూడా వెంకటేష అని మార్పించేసు కున్నాను. – అంటున్నాడు. 


    కారెక్కాక రిసెషన్ గురించి, రియాలిటీ కుదేలవటం గురించి, ధరల గురించీ, రికవరీ గురించీ మా వాడి చిరు ప్రశ్నలూ.. వెంకటేష్ (శం) పెను జవాబులూ –మధ్యలో ఏంటయ్యా ఏ బిల్డరు ఆత్మహత్య చేసుకున్నాడూ.. అమెరికా వాళ్లని వదిలెయ్ మన దేశం గురించి చెప్పు.. అంటూ నవ్వుతున్నాడు.


    భార్గవి కలగ జేసుకుని మాటాడటం లేదు కాని కాస్త అప్రసన్నంగా ఉంది. వెధవ సంత వచ్చిపడిందని అనుకుంటోందేమో.. నేనెరిగిన మేరకు భార్గవి అలా అనుకునీ మనిషి కాదు. నాబోటి వెధవతో.. అసహ్యంగానే ఉంటుంది. 


    భార్గవి నాకన్న బాగా చిన్నది. అపుడపుడు పెళ్లిళ్లలో చూసాను. ఓమారు మా పాపారావు చిన్నాన్న కూతురు పెళ్లి ఓ వయసైన రెండో పెళ్లి వాడితో కుదుర్చుకుంటే తెలిసి పనిగట్టుకుని వచ్చి ఆ పిల్ల గొంతు కొయ్య వద్దని గొడవ చేసిందిట. ఆ పిల్లని తనతో తీసుకుపోయి చదువూ సంధ్యా చెప్పించిందిట. దాంతో మావైపు ఆడాళ్లలో కాస్త పేరు. మొదటిసారి ఆవిడని కలిసొచ్చిన ఉత్సాహాన్ని నాతో పంచుకోబోయింది శారద. 


    శారద ఉత్సాహాన్ని స్వయంగా దించుకునీ లోపల నేనే పూరాగా దించేసాను.


    “నీబోటి వెధవ ముండలకి బానే ఉంటాయి ఆవిడగారి ఉపన్యాసాలు. ఎవడితో పడితే వాడితో పోవటమే గదా స్త్రీ స్వాతంత్ర్యమంటే... ప్రతి దానికీ లోపల్లోపల ఉండేదే గదా.. బట్టలిప్పుకు తిరగాలని..”


    పడీ ఆడదాని ముందు ప్రతీ మొగాడూ పేట్రేగి పోతూనే ఉంటాడు. ఉన్న కాస్తంత సంస్కారం కూడా ఊడిచిపెట్టుకు పోయేది శారద ముందు. నా క్షమానర్హమైన ధోరణి అలా ఉంచి మళ్లీ భార్గవిని కలుస్తానని గాని ఇలా పక్కపక్కన కూర్చుంటానని గాని ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. శారద నాగురించి చెప్పి ఉంటే- చెప్పే ఉంటుంది- చెప్పకుండా ఎలా ఉంటుంది- చెపితే మాత్రం తప్పేముంది- నీచుడిని నీచుడనుకుంటే తప్పేముంది- తీర్చినా తీర్చికపోయినా మనిషన్నాక చెప్పుకుంటారు. చిన్ని నమ్మకమేంటంటే చెప్పుంటే భార్గవి ఊరుకునీ అవకాశం లేదు. నా కాపురం గోయిందా అయిపోయేది.


    కనీసం ఇప్పుడు నా పక్కన కూర్చునీది కాదు. కార్లోంచి తోసేసి ఉండేది. ఏమో.. స్త్రీవాదుల్లో మాత్రం దయామయులుండరా.. అసలు స్త్రీలే దయామయులు .. లేకపోతే శారద ఇన్నాళ్లు నన్ను మోసేదా.. శారద..


    భార్గవి మధ్యమధ్యలో నన్ను చూస్తోంది. ఏదో అనాలని అనుకుంటోందని అర్ధమవుతోంది. ఈవిడ చేసిన ఏ మంచిపనికో మా వెంకటేశం గాడికి సమాజ ఉద్ధరణ బిరుదు వచ్చేసిందా.. ఆడాళ్లు చేసే మంచి పనులకు అడ్డు చెప్పక పోడం  కూడా మా మగ ముండాకొడుకుల కీర్తి ఖాతాలో పడిపోతుంది గదా— ఏమైనా భార్గవి చూపులో నాపై అసహ్యం లేదు.


    నిజంగా మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యలి గదా... సంపాదన కేముంది కుక్కలు కూడా సంపాదించెయ్యగలవు.. పేయింగ్ బాక్ టు సొసైటీ అన్న కాన్సెప్టు ఎంతమందికి ఉంటుంది.. అంటూ నా కొడుకు వెంకటేశాన్ని ఎత్తేస్తున్నాడు. నా జీన్సు ఎక్కడికి పోతాయి.. ఏరు దాటి తెప్ప తగలేసే నా తత్వం ఎంతోకొంత అంటుతుంది గదా.. సిరి అబ్బక పోయినా చిడుము అంటుతుంది గదా..


    లేకపోతే ఏంటయ్యా రాంబాబూ.. మనదేశం ఎలాంటి దేశం.. మన సంస్కృతి ఎంత ఉత్కృష్టమైనదీ.. కేవలం ఆడవాళ్ల పాతివ్రత్య బలం మీద ఖండఖండాంతరాలలో జైజైలు కొట్టించుకున్న దేశం. అలాంటిది ఈనాడు ఆడాళ్లు తాగటమేంటి.. తాగి తైతక్కలాడటమేంటి చెప్పు.. పబ్బుల్లో పడి చిచ్ఛీ.. 


    సడన్ బ్రేకుతో కారు ఆగింది. ఎవరో జంట.. తాగేసి ఉన్నారట.. గోవా వాళ్లుట వెంకటేశం అంటున్నాడు. చిన్ని గొడవ.. సారీ సారీ.. సుమ్మనీరు.. కన్నడం వాళ్లు గొడవలు పడరట. ఎవరైనా పడితే సుమ్మనీరు.. ఊరుకోండిట.. అంటూ సర్దేస్తారట. 


    “తాగేసి ఉన్నారు గుంటముండా వాడూనూ.. అసలు ఆడాళ్లు తాగటమన్నది .. నీకు గుర్తుందా రాజారావు బావా.. పప్పలోళ్ల పిల్ల .. అంటు మామిడి తోటలో దొంగ సారా బట్టీలూ.. తాగి తాగి చచ్చింది ఆ మనిషి.. అంతెందుకు కల్తీ సారా తాగి చచ్చేవాళ్లలో ఎంతమంది ఆడాళ్లు.. అవుతే ఏమాటకామాటే చెప్పుకోవాలి.. వాళ్లంతా పాటకపు జాతి.. అలగా రకాలు.. మన సంస్కృతికే వాళ్లు...”


    వెంకటేష్(శం) నవ్వు తెరలు తెరలుగా.. 


    నవ్వాగనే లేదు .. ఇల్లొచ్చేసింది.


    అది ఇల్లా- పేద్ద మహల్... భార్గవీ నిలయ... కన్నడంలో.. పెళ్లామంటే ప్రేమే.. పోన్లే భార్గవి అదృష్టవంతురాలు. 


    ఇంటి ముందు గేటు. ఓ సెక్యూరిటీ గార్డు. ఇద్దరు పోలీసులు. ఒకడు గేటు తీసాడు. ఒకడు కారు వెనకే పరుగెత్తుకొచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు. వెంకటేష ఆతని భుజం మీద చెయ్యివేసి దిగుతూ – తిమ్మప్పా అంటూ కన్నడంలో –పలకరింపు కాబోలు- ఏదో మాటలాడాడు. అతను ఏదో వినయంగా చెప్పాడు. ఓ తృటి వెంకటేష మొహం మారింది. అంతటిలోనే ఆ పోలీసు ఏదో అనటంతో –సరి సరి- అంటూ పెద్దగా నవ్వుతూ ఫద భావా అంటూ వత్తులు పెంచి – కన్నడం వాళ్లకి వత్తుల పిచ్చి చూసావా రాజ్యం మన చేతుల్లో ఉంటే ఎన్ని మర్యాదలో- లోపలికి తీసుకుపోయాడు. 


    నా మెదడులో చిన్నపుడు ఏర్పడిన ముద్ర చెదరక పోటంతో వాడిదంతా పైపై బండారం అనే అనిపిస్తోంది. – ఎవరీ పోలీసులు- అన్నాను బెరుకు దాచుకుంటూ. 


    అరెస్టు చేసారు గదా- ఆ మధ్య పబ్బులోకెళ్లి ఆడపిల్లలను తాగొద్దమ్మా అన్నాంగదా- ఆ కేసు. సిఐ వచ్చాట్ట. వీళ్లని మనకి సెక్యూరిటీ పెట్టారు. ఏవో సంతకాలు కావాలిట. – అంటూనే వెళుతున్నాడు. వాడి వెనకే నే పరుగెట్టాలిసి వచ్చింది.


    పిల్లలు సామాన్లు పట్టించుకుని వచ్చీసరికి వాడు ఆ వచ్చిన పోలీసాయన పని చూసేసాడు. కాఫీకి టైం లేదని గాబోలు చెప్పి ఆయన వెళ్లిపోయాడు. మా ముందు జరగాల్సిన ప్రదర్శన రంజుగా జరిగినందుకు కాబోలు మా వాడు మహోత్సాహంగా ఉన్నాడు ఆరోజు రాత్రి వాడి కూతురు వచ్చే వరకూ.


* * *


    పిల్లపేరు ప్రసన్న. పేరుకి తగ్గ మొహం. జీన్సు పాంటూ, టీ షర్టూ, వాళ్లమ్మ లాగే కత్తిరించుకున్న జుత్తు. మొహానికీ వేషానికీ లంకె వెయ్యలేకపోతోంది మనసు. తెలుగులో మాట్లాడాలన్న సరదా ఉంది. మధ్యమధ్యలో నట్టేస్తోంది. కన్నడం ఇంగ్లీషూ వచ్చి దూరి పోతున్నాయి. 


    మా ఊరూ మా ఏలేరూ అంటుమామిడి తోటా.. ఎన్నెన్నో అడుగుతోంది. ఏంటేంటో చెపుతోంది. నేనే మరచి పోయినవన్నీ గుర్తు చేస్తోంది. మంచి పిల్ల.. కానీ ఆ జుత్తూ వేషం.. ప్చ్..


    ఆ పిల్ల రాగానే మనోడి ముహం మారిపోయింది. –ఇంతసేపు ఎక్కడ తగలడ్డావ్- అంటూ అరిచాడు. ప్రసన్న ఆ మాటే విననట్లు మాతో మాటలు.. భార్గవి వాడిని లోపలికి తీసుకు పోయింది.. వాడి గొంతు క్రమంగా తగ్గింది. 


    ఎవరో ముస్లిం అమ్మాయిని అల్లరి పెడుతున్న ఓ అబ్బాయి మీద కేసు పోలీసులు బుక్ చెయ్యలేదుట. దానికోసం ఏజిటేషన్. అందులో పాల్గొని వచ్చిందిట. కేసు బుక్ చేసారుట. చెపుతోంది ప్రసన్న. 


    ఆ మర్నాడు ఉల్లాల బీచ్. పట్టుకుపోయారు. ఏముంటుంది సముద్రమంటే.. ఎక్కడ నుంచి చూసినా ఒక్కటే. ఇసక.. నీళ్లు.. హోరు.. చిన్నపుడు సరదాగానే ఉండేది. ప్రసన్నా మా వాళ్లూ తెగ తిరిగేస్తున్నారు. ఎక్కడ చూసినా జనం. వేలం వెర్రి. హాయిగా ఏ పకోడీలో చేసుకుని తింటే సరిపోదూ ఇలా ఊళ్ళ మీద పడే బదులు.. ఏంటో డబ్బులు ములాగ్గా ఉంటే వస్తాయీ సరదాలు. పుణ్యమూ పురుషార్ధమూ అంటూ జన్మకో సంక్రాంతిలా వెళ్లేవారా నాటి జనం. 


    మర్నాడు నేను తిరగలేనని దణ్ణం పెట్టేసాను. మావాడు విసుక్కుంటే వెంకటేశం సర్దేశాడు. బావ రాకరాక వచ్చాడు. ఓపిక ఉంటే వస్తాడు. లేకపోతే రెస్టు తీసుకుంటాడు. నువ్వు అభిచాయత్తపడకోయ్ రాంబాబూ – అన్నాడు. వాళ్లు తిరగటానికి పోయారు. వాడికి పనులేవో ఉన్నాయిట. ఏదో మీటింగుందని మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తానని మన కోసం చూడొద్దని వంటాయనకి చెపితే వడ్డించేస్తాడని చెప్పి ఆఖరున వెళ్లింది భార్గవి. 


    తనొచ్చేవరకూ నిద్రే నిద్ర. వస్తూనే అయ్యో భోంచేసెయ్య లేక పోయారా అన్నయ్య గారూ- అంటూ ఊ తెగ ఇదై పోయింది. కొసరి కొసరి వడ్డించింది. – కడుపు నిండిపోయిందమ్మా నీ ఆదరణా నీ సంసారమూ చూస్తుంటే.. – అన్నాను మనసారా.


    నవ్వింది భార్గవి.


    “ఏమ్మా – నవ్వుతున్నావ్.. మా వెంకటేశం అదృష్టవంతుడు కాదా చక్కనైన భార్యా కూతురూ సంపాదనా.”. అన్నాను అయోమయంగా.


    “ఆమాట ఆయన అన్నాడా”


    “బావుంది తల్లీ ఎవరి గొప్పలు వాళ్లు చెప్పుకుంటారా ఏం”


    “కరెక్టు చెప్పుకోరు. చూపించుకుంటారు”


    నా మనసులో మాటే అంది కాని స్వచ్ఛంగా ఆత్మీయంగా కావలసిన మనుషితో చెప్పుకుంటున్నట్టు అంది. అది గుండెకి తగిలింది. 


    “మా వాడికి కాస్త మందు అలవాటని విన్నాను. ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా కొంపదీసి” – తోచిన కారణం అడిగాను.


    భార్గవి చెపుతోంది- మంగుళూరు పబ్బు సంఘటన.. ఆడాళ్లని తరిమి తరిమి కొట్టడం.. అందులో వెంకటేశం పాత్ర.. రకరకాల కారణాలతో దూసుకు పోయే మనుషులు..పార్టీ మారగానే సంస్కృతీ పరిరక్షకుల నవోత్సాహం.. పాల్గొన్న వాళ్లపై కేసులు, అరెస్టులు .. బెయిళ్లు. వాళ్ల మీద దాడి జరగొచ్చని రక్షణలు.. మీడియా అడావుడి.., తనూ కూతురూ స్త్రీ సంఘాలతో కలిసి పబ్బుకు వెళ్లి నిరసన తెలపటం..


    కొంత ఆర్ధమవుతోంది. వెంకటేష చేస్తున్న సమాజ ఉద్ధరణ తుదీ మొదలూ.


    ఏమాటకి ఆమాటే ఒప్పుకోవాలి. తాగారని ఆడాళ్లని కొట్టడమేంటి .. తప్పే అయితే మగాళ్లు తాగినా తన్నాలి. రామాయణం నాటికి మహామహా వాళ్లే ఆడాళ్లూ మగాళ్లూ తాగేవాళ్లుట. అసలు వద్దనీ ఈ వెంకటేశం మందు కొట్టని మహాయోగా..


    “అన్నీ తెలిసినవాడికి ఈ పనులేమీ బాగులేవమ్మా”- అన్నాను అనకుండా ఉండబుద్ధవక..


    “దానికీ కారణం ఉంది అన్నయ్యగారూ.. నన్నూ నా కూతురనీ తన్న లేకా.. ఏదోలా పేపర్లకెక్కాలనీ..”


    అంటే


    చెప్పింది -మగాళ్ల అల్పత్వం గురించీ వాళ్ల స్వార్ధం గురించీ ....


    “అవుననుకో తాగటం అందులోనూ ఆడాళ్లు పాపం వెంకటేశానికి తప్పనిపించిందేమో తల్లీ..” నసిగాను. 


    “ఆడాళ్లు తాగటం ఈయనకి నచ్చదంటారా – మీ వెర్రి..”


    “ఆ గుంపులో అందులోనే గాదు ఏ ఉద్యమంలోనైనా సిన్సియర్ గా ఉండే వాళ్లు ఎంతమందో అంతకుమించి అందులో నాకేంటి అనుకునీ వాళ్లు చేరతారు. ఆ ఉద్యమం మంచిదైనా అంతే చెడ్డదైనా అంతే..”


    ఆలోచనలో పడ్డాను. 


    అనాదిగా ఒక జాతి సంస్కృతి అంతటి బరువూ ఆడాళ్ల మీదే మోపటం తాలూకు చరిత్ర.. మనదేశం తాలూకు హిపోక్రసీ.. స్త్రీలను లక్ష్యం చేసుకున్న దాడులు.. మా మాట కొట్టేస్తారా అన్న మగ అహంకారం.. దాని వివిధ రూపాలూ.. వింటున్నాను.. శారద తో నా ప్రవర్తన గుర్తులతో మనసు కుంచించుకు పోతోంది.


    “అన్నయ్యగారూ మీరంటే నాకు ఎంతో గౌరవం. మీకు స్త్రీలపై గల ఫీలింగ్స్ శారద గారి గురించి విన్నాక నాకు అర్ధమయాయి. ఆడవాళ్ల పరిస్థితిలో ఈ నలభై ఏళ్లలో మార్పులు వచ్చాయని మీరు అనుకుంటున్నారేమో ఆర్ధిక స్వాతంత్ర్యం మార్పులు తెస్తుందన్నది అర్ధ సత్యమే ఐపోయింది. పనివాళ్ల మార్కెట్ పెంచింది తప్ప మౌలికమైన ఏ మార్పులూ రాలేదు. బయటి పరిస్థితులతో పాటు మనిషి లోపల మార్పులకు పెద్ద ప్రయత్నం జరగ వలసిందే,, అంటూ చెప్పి చెప్పి----


    “మారే మీవంటి వాళ్లే నాలాంటి వాళ్లకి ఇంకా ఆశ కలిగిస్తున్నారు..” అంటూ చటుక్కున నా పాదాలు ముట్టింది. 


    ఒక్కసారిగా నేను పగిలి పోయాను.


    నేను మహా పాపాత్ముడిని.. నాకు పుట్టగతులుండవు.. బొంగురు పోయిన గొంతుతో తడిదేరిన కళ్లతో ఆమెకు నమస్కరించాను. 


    -ఇంక ఆరు నెలలకన్న ఎక్కువ బతకదని వైద్యులు తేల్చేవరకూ బతికిన నేను వేరు. ఆ తర్వాత నా దేవత నాకిచ్చిన దేంటో -నేను పోగొట్టుకోబోతున్న దాన్ని గుర్తు చేస్తున్న బుద్ధి లెక్కగట్టింది. కన్నీటితో ఆమె కాళ్లు కడిగాను. మంచం మీదున్న ఆమె ఉచ్చెత్తాను. పియ్యెత్తాను. ముప్పై ఏడేళ్లుగా నేను ఆమెను పెట్టిన హింస .. నా ఆకలి నా నిరుద్యోగం అధైర్యం శారదతో పెళ్లికి నన్ను పురి కొలపటం.. ఆ తర్వాత నాలోని రాక్షసుడు.. నేనేదో పోగొట్టేసుకున్నానని కసి.. కార్పణ్యం..


    అన్నీ విడిచిపెట్టి అంతా బయటకు వచ్చేసి.. 


    “చెప్పు తల్లీ.. నీకింకా మా మొగజాతి మీద ఆశ ఉందా”


    తలెత్తి భార్గవిని చూసాను. అందులో ఏమున్నాఆ చూపులు నా కళ్లలో ముళ్లు దింపుతున్నాయి. వెర్రాడిలా తల వంచుకున్నాను. 


    కొంత సేపయాక –“మంచి నీళ్లు తీసుకోండన్నయ్యగారూ”- అంది. గ్లాసు ఖాళీ చేసేను. తలెత్తాను. ఇప్పుడు ఆమె కళ్లు దయా పారావారాలలా ఉన్నాయి.


    “ఇప్పుడు నాకేమనిపిస్తున్నదంటే..”  అంటూ ఆగింది


    వెర్రిగా చూస్తున్నాను.


    “ప్రేరణ ఏదైనా ఫలితమేదైనా..మంచి పని మంచి పనే ......చెడ్డ పని చెడ్డ పనే..” అంది  భార్గవి.

Comments