కృతఙ్ఞత - పోతుబరి వెంకట రమణ

  
    భావి భారత పౌరులు, దేశ భవిష్య నిర్మాతలు, చొక్కాల మొహం తెలియని వారు, జారి పోతున్న నిక్కర్లని ఎగేసికుంటూ, కారుతున్న చీమిడిని మండలతో తుడుచుకొంటూ – చేతుల్లో డబ్బాలు, డొక్కులు, సొట్టలు పడ్డ సిల్వరు పాత్రలతో చేరు కుంటున్నారక్కడకు.
     
    అదో ప్రభుత్వ కార్యాలయం. లారీల నుండి కేర్ గోధుమ నూకను గౌడౌన్లలో చేరుస్తున్నారు. కొయ్యలకు తగిలి చిరిగిపోయిన సంచుల నుండి గోధుమ నూక నేల పాలౌతోంది, ప్రభుత్వ విథుల్లా.
    
    దేశంలో దారిద్ర్యానికి  ఐ.ఎస్.ఐ మార్కుల్లా ఉన్న ఆ చిన్నారులంతా ఎగబడి కారుతున్న గోధుమ నూకను తమ తమ పాత్రలలో నింపుకోసాగారు.  ఆ గలాభాలో కొంత నూక దుమ్ములో కలిసి పోతోంది. దాన్ని కూడ విడిచి పెట్టడం లేదు వారు.
    
    ఆ గుంపు మధ్యలో ఖాళీ చేతులతో బిక్కు బిక్కుమంటూ దీనంగా కారుతున్న నూక వైపు ఆశగా చూస్తూ ఉంది గౌరి.
     
    గౌరికి  పదమూడు సంవత్సరాల వయసుంటుంది. దేశంలో చాలామందికి లాగానే వాళ్ళ కుటుంబం కూడా దారిద్ర్యరేఖకు బాగా దిగువనే ఉంది. చాలామందికి లాగానే గౌరి తండ్రి సాంబయ్యకు సంపాదన స్వల్పం, సంతానం అధికం. సారాపానం అపరిమితం.
     
    తల్లి బతిమాల్తే పచారీ కొట్టుకు వెళ్ళింది గౌరి. పచారీ షావుకారు తిట్టినతిట్టు తిట్టకుండా తరిమి వేశాడు గౌరిని. తిరిగి వచ్చేస్తూ ఉంటే, దారిలో కనిపించిందా దృశ్యం. అది చూడగానే ఆమె గుండెలు కొట్టుకున్నాయి.
     
    ‘‘ఒరే నారిగా, నీ దగ్గర రెండు డొక్కు లున్నాయి కదా ? నాకొకటొ ఇవ్వవా , యింటి దగ్గర ఇచ్చేత్తాను’’ ఆరేళ్ళ నారిగాడ్ని బ్రతిమాలింది.
     
    ‘‘అబ్బ, నీకిచ్చేత్తే నువ్వొట్టు కెళి పోతావు. నాకిత్తావేఁటి. నానియ్యను’’ ఆకలి నేర్పిన స్వార్ధంతో నిష్కర్షగా తిరస్కరించేసాడు వాడు. 
     
    తనలా చూస్తూ ఊరుకుంటే తనకి బుగ్గి కూడా మిగలదు. ఏదో విధంగా గోధుమను ఒడిలోకి ఎత్తుకోవాలి.
     
    అక్కడే మొదలయింది, అసలు సమస్య.
      
    ఏ అమ్మో దయదలచి ఇచ్చిన స్కర్టు అది. మోకాళ్ళ వరకే ఉందది. దాన్ని మడచి పట్టు కోవాలంటే కష్టమే. పైగా ఉదయం స్నానం చేసేటప్పుడు ఉన్న ఒక్క చెడ్డీని తడిపీసింది.
      
    ఆఫీసులో ఉద్యోగులున్నారు. అన్లోడ్ చేస్తున్న కూలీలున్నారు. గౌరి కడుపు నిండా ఆకలి ఉన్నాది. అప్పుడప్పుడే యవ్వన ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న  ఆమెకి గుండె నిండా సిగ్గు కూడా ఉంది.
    
    మానాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ మోకాలి మీద కూచోని లంగా కొంగు కొంచెం మడిచి, అందులోకి నూకను ఎత్తుకోసాగింది. ఆ మడతలో నూక నిబడ లేదు. మడత మరి కొంచెం పెద్దది చేయాలని ప్రయత్నించింది.
   
    కానీ ...
   
    అశక్తతో ఏడుపు కూడ వచ్చేస్తోంది. వదిలేసి వెళ్ళి పోదామంటే, ఇంటి దగ్గర ప్రళయతాండవ మాడుతున్న ఆకలి. ఇంటి కెళ్ళి చోటు తెచ్చుకునే లోపు దాన్ని ఈ గుంటలందరూ ఊడ్చేస్తారు.
   
    మళ్ళీ లంగాని మడచి ప్రయత్నం చేసింది. మళ్ళీ మామ్మూలే. ఈ సారి అశక్తత కన్నీటి రూపంలో చెక్కిళ్ళ మీద జాలువారసాగింది.
    
    గౌరి అవస్థను ఇంకెవరన్నా గమనించారో లేదో గానీ అప్పుడే విశ్రాంతి కోసం ఫైల్ నుండి తలెత్తి సిగరెట్ అంటించుకొంటున్న మూర్తి మాత్రం గమనించాడు.
     
    మానవత్వం కదిలింది. తాగుతున్న సిగరెట్ ని అలాగే కింద పడేసి, ఆ రోజు వార్తా పత్రిక నొకదాన్ని తీసుకొని వెళ్ళి గౌరి ముందు పడేసాడు.
     
    ఒక్క సారి తలెత్తి మూర్తివైపు చూసింది గౌరి.
     
    ఆ కళ్ళలో కృతఙ్ఞత తళుక్కున మెరిసింది !
     
    ఆబగా నూక ఎత్తుకోసాగింది.

(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం) 
Comments