కుడిఎడమైతే... - శ్రీరాగి

    "అరే నానిగా...తాతయ్య దగార డబ్బులు తీసుకుని ఇలా ఇయ్యి..." అడిగింది మనమడు కృష్ణని శాంతమ్మ.     "తాతయ్యా! డబ్బులట..."     "ఇవిగో... పాలబ్బాయికివ్వాలి... నానమ్మకియ్యి..."తాతయ్య కరెన్సీ నోట్లు అందించాడు.     "నానమ్మ! ఇవిగో డబ్బులు..." అంటూ కృష్ణ తన ఎడమ చేత్తో, తాతయ్య ఇచ్చిన కరెన్సీ నోట్లను నానమ్మ చేతికియ్యబోయాడు.     "వెధవా! ఎడం చేత్తో ఇస్తావా డబ్బులు! కుడి చేత్తో ఇవ్వు..."     నానమ్మ... శాంతమ్మ మనుమడిని కేకలేసింది. మనమడు కరెన్సీ నోట్లను ఎడమ చేతి నుంచి కుడి చేతిలోకి మార్చుకొని... శాంతమ్మ కిచ్చాడు.     వాడికి తొమ్మిదో ఏడు నడుస్తోంది. వాడి చురుకైన బుర్రలో సందేహం వచ్చింది.     "డబ్బులు ఎడం చేత్తో ఇస్తేయేం నానమ్మా!"     "దరిద్రంరా... దరిద్రం చుట్టుకొంటుంది..."     "ఎందుకని?"     "ఎందుకంటే... అపరిశుభ్ర పనులన్నీ... ఎడం చేత్తో చేస్తాం కనుక... అందుకని... కొంచెం కుడి...ఎడమ చూడాల్రా అబ్బాయి..."     "మరి ఎడం చెయ్యిలేకపోతే... అది చేసే పనులన్నీ ఏ చేత్తో చెయ్యాలి..."     'లా'పాయింటు తీశాడు సూక్ష్మగ్రాహి మనుమడు కృష్ణ.     "కుడి చేత్తోనే చెయ్యాలి... అన్నం కూడా కుడిచేత్తోనే తినాలి... అది వాళ్ళ ఖర్మ" నానమ్మ చెప్పింది...     "దేవుడు మనకు రెండు చేతులెందుకిచ్చాడు నానమ్మా! ఓ చెయ్యి చాలదూ..."     "మంచి పనులు... కుడి చేత్తోనూ...చెడ్డ పనులు... ఎడం చేత్తోనూ చెయ్యాలని...రెండు చేతులిచ్చాడ్రా..."     "అంటే రెండు చేతులూ... ఒకటి కాదా నానమ్మ!"     "ఎట్లా అవుతై?"     నానమ్మ సమాధానం... మనుమడిని తృప్తి పరిచినట్లు లేదు...     ఇది శాంతమ్మ ఇంట్లో మూన్నెళ్ళ క్రిందట జరిగిన ముచ్చట.

* * * * *

    ఆ రోజు... పాపం శాంతమ్మ ఎవరి ముఖం చూసి లేచిందో! పిల్లి ముఖం మటుకు కాదని చెప్పొచ్చు... ఎందుకంటే...వాళ్ళింట్లో ఓ పెంపుడు పిల్లి ఉంది. దానికి రోజూ... ఉదయం పాలూ... పదిగంటలకు పెరుగన్నమూ పెడతారు. రాత్రి ఎక్కడ నిద్ర పోతుందో ఏమో...తెల్లవారుతూనే...పంచ వాకిలి తెరుస్తూనే...ప్రత్యక్షమవుతుంది. దానికి మనిషి కన్నా ఎక్కువ తెలివితేటలే వున్నాయి. సాధ్యమైనంతవరకూ... ఉదయం...ఎవరికీ ఎదురుగా రాదు...అయినా ఉదయమే దాని ముఖం చూసినా ఎవరికీ ఏం కాలేదింత వరకూ...
    లేచిన వేళా విశేషం కాబోలు!

    గది బీరువాలో బట్టలు సర్దుతూ...ఏమరుపాటున శాంతమ్మ...ఓ గుండ్రటి ప్లాస్టిక్ సీసా మీద కాలు పెట్టడం...అది జర్రున దొర్లుతూ...పోవటం...కాలు జారి శాంతమ్మ...నేల మీద పడబోతూ...ఎడమ చేతిని నేల మీ ఆనించటం... ఆ బరువుకి... మణికట్టు ఎముక కలుక్కు మనటం...ఆమె కళ్ళు తిరిగి నేల మీద కూలడం...క్షణాల మీద జరిగాయి. 

    నేల మీద పడ్డ చప్పుడికి హాల్లో ఉన్న శాంతమ్మ కూతురు... ఆఫీసుకు వెళ్ళటానికి తయారవుతున్నామె...గభాలున వచ్చి...నేల మీద పడిపోకుండా...శాంతమ్మను పట్టుకుంది.     కొన్ని క్షణాలు శాంతమ్మకి కళ్ళు చీకట్లు కమ్మినై.

    కాసేపటికి..."అబ్బా!" అంటూ మూలిగింది శాంతమ్మ.     "అమ్మ పడింది!" పెద్దగా కేక పెట్టింది కూతురు రాధ...     వంటింట్లో పని మీద ఉన్న శాంతమ్మ భర్త రమణారావు, కొడుకు వినయ్...పరిగెత్తుకొచ్చారు.     "ఏమైంది?" అడిగారు ఆదుర్దాగా.     వాళ్ళు అందరూ కలిసి శాంతమ్మను మెల్లగా లేపి... హాలుతో ఆమె మంచం మీద పడుకోపెట్టారు.     "అరే! మణికట్టు ఎంత వాచిందో!" భర్త రమణారావు అన్నాడు.     "డాక్టరును పిలవండిరా..." శోకాలు పెట్టింది శాంతమ్మ.

    రమణారావు కుటుంబానికి ముగ్గురు డాక్టర్లు ఉన్నారు...ఒకాయన అలోపతీ...ఒకాయన యునానీ...మరొకాయన హోమియోపతి...     శాంతమ్మ ఎడమ మూత్రపిండం చెడిపోవడంతో ఇంతమంది డాక్టర్లు అవసరమయ్యారు.     ఈ మధ్య నాలుగో డాక్టరు పరిచయమయ్యాడు...ఆయన మూలికా వైద్యుడు...పై ముగ్గురు డాక్టర్లు నయంచెయ్యలేని మూత్రపిండాల వ్యాధిని తన మూలికావైద్యంతో ఆయన అదుపులో ఉంచాడు.

    మొదటగా యునానీ డాక్టరు వచ్చాడు. ఆయన ఏదో ఆయిల్ మణికట్టు మీద రాసి నొప్పి తగ్గటానికి బిళ్ళలిచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన గంటకు ఆస్పత్రి డాక్టరు పన్నెండు గంటల వేళ శాంతమ్మను చూడటానికి వచ్చాడు.     ఆమె ఎడమ మణికట్టును ఆయన పరీక్ష చేశాడు. అప్పటికే మణికట్టు బాగా వాచి ఉంది...నొప్పి ఉంది... అయితే శాంతమ్మ శోకాలు తగ్గినై.     "ఫ్రాక్చరయి ఉంటుంది...నర్సింగ్ హోముకు తీసుకెళ్ళి కట్టు కట్టించండి...ఆయనే నొప్పి తగ్గటానికి మందులు రాస్తాడు...బ్యాండేజీ ఎంతలేదన్నా ఆరు వారాలుంచాలి. అయితే గాభరా పడాల్సిందేమీ లేదు..."అన్నాడు అలోపతీ డాక్టరు.

    "డాక్టరుగారూ...నొప్పి ఎక్కువగా ఉంది. బిళ్ళ వేసుకున్నాక...ఇప్పుడే కొంచెం తగ్గుతున్నట్టుంది...నా చెయ్యి మళ్ళీ సరిగ్గా వస్తుందంటారా?" ఆత్రంగా అడిగింది శాంతమ్మ.     డాక్టరుగారు మందహాసం చేసి ఇలా అన్నారు...     "తగిలింది చిన్న దెబ్బే...బ్యాండేజీ కట్టక పోయినా...మందు బిళ్ళలతోనే...తొలగిన ఎముక తన స్థానంలోకి వస్తుంది. కాని కట్టు కట్టకపోతే...వేళ్ళు...వకర పోవచ్చు...బ్యాండేజీ వేస్తే...ఆ అవలక్షణం రాదు...చెయ్యి సరిగా వస్తుంది..."     "ఆసుపత్రికి తీసుకెళ్తేనో..." అడిగాడు కొడుకు వినయ్.     "వద్దు...క్యాజువాలిటీలో ఏ పోస్టు గ్రాడ్యుయేటు స్టూడెంటో ఉంటాడు. ఆ మహానుభావుడు చేతిని అటూఇటూ తిప్పడంతో సగం తొలిగిన ఎముక పూర్తిగా స్థానభ్రష్టమవుతుంది. డ్యూటీలో ఉన్న 'ఎముకల నిపుణుడు' రావటానికి చాలా ఆలస్యం అవుతుంది...అంత సేపు శాంతమ్మగారు కూర్చోలేరు...ఏ నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్ళినా...వెంటనే ఎక్స్-రే తీసి...బ్యాండేజీ వేస్తారు. ఈ లోగా ఈ యాంటీ బయాటిక్ బిళ్ళా, నొప్పి బిళ్ళా వాడండి..."అంటూ సమాధానం ఇచ్చారు డాక్టరుగారు.
    నర్సింగ్‌హోమ్‌లో సాయంకాలం ఆరు గంటలకు...శాంతమ్మ మణికట్టుకు ఎక్స్-రే తియ్యటం, డాక్టరుగారు బ్యాండేజీ వేసి, మందు బిళ్ళలు రాయటమయింది. 

    ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలైంది. మెడ నుంచి వ్రేలాడ తీసిన సంచితో 90డిగ్రీల కోణంలో బ్యాండేజీ కట్టిన చేతిని ఉంచుకోవాలి...     ఆ బ్యాండేజీ చేత్తో కుడి ప్రక్కకు తిరగటానికిలేదు...ఓ ప్రక్కనే రాత్రంతా పడుకోవటం, మొదట్లో కష్టమనిపించింది శాంతమ్మకు...అలవాటయింది.
    ఎలా అయినా బ్యాండేజీ వేసిన తర్వాత శాంతమ్మ కష్టాలు ప్రారంభమయ్యాయి.

    ఒక్క కుడిచేత్తోనే అన్ని పనులు చెయ్యటం ఎలా సాధ్యమో శాంతమ్మకు అర్థం కాలేదు... కుడి చేత్తో అన్నం తినగలిగినా...అన్నిపదార్థాలు ఇంకొకళ్ళు వడ్డించాలి...మంచినీళ్ళ గ్లాసు ఎంగిలి చేత్తో తీసుకోవాలి. ఎడమ చేయి బాగ ఉంటే అందుకు పనికి వచ్చేది.

    తిని, చెయ్యి కడుక్కోవాలన్నా ఇంకొకళ్ళు చేతి మీద నీళ్ళు పొయ్యాలి.
    టూత్ బ్రష్ చేత్తో పట్టుకుంటే...ఎవరన్నా బ్రష్ మీద ఫేస్టు వెయాలి.     ఒక చేత్తో ఎలా చీర కట్టుకోవటం?     జడ ఎలా వేసుకోవటం?     తన కూతురు...రాధ మీద ఆధారపడటం శాంతమ్మకు తప్పలేదు.     కళ్ళల్లో, చెవుల్లో చుక్కలు వేసుకోవాలన్నా ఒక్క చేత్తో సాధ్యం కావడం లేదు.     రెండు చేతులు బాగా ఉన్నప్పుడు శాంతమ్మ ఎంత పని చేసేదనీ!     రంగు వెలిసిపోయిన తలుపులకు...ఆమె ఎన్నో అందమైన రంగులు ఎంతో కష్టపడి వేసింది... ఆ తలుపులు...కొత్తరంగులతో అందంగా ప్రకాశిస్తున్నాయి.     ప్లాస్టిక్ వైరు తెగిపోయిన కుర్చీకి నవారు అల్లి..ఆ కుర్చీ మళ్ళీ పనికొచ్చేటట్లు చేసింది. ఇంట్లో ఏవస్తువు చెడిపోయినా...తన రెండు చేతులతో ఆమె బాగుచేసేది. గోడలకు పట్టిన బూజు దులిపేది.     ఒక్క చేత్తో బట్టలు ఉతకడం ఎలా?     ఆ పని కూతురు రాధ... చేస్తోందిప్పుడు.

* * * * *

    శాంతమ్మ పెద్ద కొడుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికిద్దరు సంతానం...ఒక కొడుకూ, కూతురూ...
    కొడుకు కృష్ణ తొమ్మిదేళ్ళ వాడు. కూతురు...పన్నెండేళ్ళు. కొడుకు అయిదోతరగతి...కూతురు తొమ్మిది చదువుతున్నారు. మనుమడు కరాటేలో మూడు బెల్టులు సాధించాడింతవరకూ...     "ఇప్పటి నుంచే వాడికెందుకు కరాటే?" సణుగుతూంది శాంతమ్మ...     వాడెక్కడ కాళ్ళూ...చేతులూ...విరగ్గొట్టు కొంటాడేమోనని ఆమె భయం.     "చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే కరాటే వస్తుంది... నేర్చుకోనీ...ఆ విద్యలో వాడు రాణిస్తాడేమో! ఎవరు చూశారు!" అంటాడు శాంతమ్మ భర్త రమణారావు.     కోడలు టెలిఫోన్ ఆఫీసులో పనిచేస్తుంది. శాంతమ్మ పడ్డ రెండో రోజు...ఆమె యోగ క్షేమాలు కనుక్కోవడానికి ఫోను చేసింది.     శాంతమ్మ తన ఎడమ చేయి మణికట్టు ఫ్రాక్చరయిన విషయం చెప్పింది. మరునాడుదయమే...శాంతమ్మ పెద్ద కొడుకు ప్రభాకర్...తన కొడుకుతో...తల్లిని పరామర్శించటానికి వచ్చాడు.     శాంతమ్మ వచ్చిన కొడుకునీ...మనుమడినీ చూసి సంతోషించినా తనకు ఫ్రాక్చరయినందుకు కన్నీరు పెట్టింది.     మనుమడు కృష్ణ వస్తూనే చేతికి బ్యాండేజీ కట్టుకుని మంచం మీద కూర్చున్న నాయనమ్మను ఆప్యాయంగా వాటేసుకున్నాడు.     వాడికి నానమ్మన్నా, తాతయ్యన్నా, అత్తా, బాబాయి అన్నా బోల్డు ప్రేమ!     "చెయ్యి నొప్పిగా ఉందా నానమ్మా?" పరామర్శించాడు మనుమడు.     "అవున్రా..."అంటూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆప్యాయంగా.     "తగ్గిపోతుందిలే... భయపడకు!" ధైర్యం చెప్పాడు మనుమడు.     పెద్దకొడుకు తల్లిని పరామర్శించాడు.     "అదేమిటి? సీసా మీద కాలు వెయ్యడమేమిటి?" అన్నాడు.     "ఖర్మరా...నాయనా! ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలుసు? వాళ్ళను కూడా తీసుకు రాకపోయావా?"     అతను నవ్వి వూరుకున్నాడు.     శాంతమ్మకు చెయ్యి బాగా ఉంటే...గారెలు తప్పక వండేది...     రమణారావు...పులిహోర, పాయసంతో వంట ముగించి...దసరా పండగ రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టాడు.     ఆ రోజు శుక్రవారం!     ఆదివారం నాడు ...పెద్ద కొడుకూ...మనుమడూ...శాంతమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు.     భగవంతుడు...మనిషికి... రెండుకళ్ళూ, రెండుకాళ్ళూ, రెండుచేతులూ..రెండు చెవులూ, రెండు మూత్ర పిండాలూ ఇవ్వటంతో... అయన మేధాశక్తి ఏమిటో శాంతమ్మకిప్పుడు అర్థమవుతున్నది.     ఓ కంటితో చూడొచ్చు...     ఓ కాలితో...నడవచ్చు...     ఓ మూత్ర పిండంతో మనిషి బ్రతకొచ్చు...     ఓ చెవి, చెవిటిదయినా...రెండో చెవితో వినొచ్చు.     కాని రెండు చేతులూ...లేకపోతే ఎన్ని పనులకు ఆటంకం?     ఎడమ చెయ్యి, కుడి చెయ్యి రెండు సమానమే! ఒకటి తక్కువా...మరొకటి ఎక్కువా లేదు, దేని పని దానిదే!     ఈ సత్యం శాంతమ్మకిప్పుడు అర్థం కాకుండా ఎలా ఉంటుంది? దీపావళి నాడు తన చేత్తో జ్యోతులు వెలిగించలేక పోయింది.
    తన ఎడమ చేయి ఎప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తుందోనని ఆరోజు కోసం శాంతమ్మ ఎదురుచూస్తూనే ఉంది!


(అమృతకిరణ్ పక్ష పత్రిక 16-6-1995 సంచికలో ప్రచురితం)
 
    

    
Comments