కుమారక్క - వినోదిని

    "హే ప్రభు యేసు... హే ప్రభు యేసు...
    హే ప్రభు దేవసుతా...
    సిల్వధరా... పాపహరా... శాంతికరా
    హే ప్రభు ఏసు... హే ప్రభు ఏసు...'' యల్లారీశ్వరి భక్తి పాట పాడుతోంది మైకులోంచి. తెల్లబట్టలేసుకున్న చర్చి తలమీద ట్యూబులైట్ల శిలువ పక్కనుంది మైకు.

    చర్చి ఎదురుగా వున్న దొరసాని పాత బంగ్లా కాంపౌండులో చింతచెట్టుకింద ఆగిన గూడు రిక్షాలోంచి దిగింది కుమారి.

    అచ్చం ఆ చర్చిలా తెల్లగా వుంది కుమారి.

    శిలువాకారంలో వున్న ట్యూబులైటు వెలుగులా కాంతిగా వుంది కుమారి. సన్నటి పిల్ల. పల్చటి మొహం. పుట్టినప్పట్నుంచి చర్చి, బైబిలు, ప్రార్థన, ప్రేమ, క్షమలతో పెరిగినందువల్లేమో, వాటన్నిటి పాఠాన్ని పీల్చుకొని వొక రకమైన ప్రశాంతత, దాని తాలూకు వెలుగు ఆ మొహంలో ప్రతిఫలిస్తున్నాయి. యేసు నుంచి ప్రేమని విడదీసి చూడలేనట్టే కుమారి మొహంలోంచి ఆ చిరునవ్వుని వేరుచేసి చూడలేకపోతాం.

    రిక్షా దిగి హేండ్‌బ్యాగ్ భుజానికి తగిలించుకొని, సూట్‌కేస్ రిక్షాలోంచి దించింది. బ్రామ్మలింట్లోకి మొదటిసారిగా అడుగుపెడుతున్న మాలపిల్లలా బిక్కుబిక్కుమంటూ, భయం భయంగా, నెమ్మదిగా చీకటిలోకం మీదకి పాదం పెడుతోంది.

    "రింగా రింగా రోజస్,పేకెట్ ఫుల్లాఫ్ పోసీస్
    అష్షా బుష్షా ఉయ్యాల్ ఫాల్ డావున్ ...'' పాడుతూ చేతులు పట్టుకొని గుండ్రంగా తిరుగుతున్న పిల్లలు సడెన్‌గాతిరగడం ఆపేసి చిత్రవిచిత్రమైన ఫోజుల్తో బొమ్మల్లా నిలబడిపోయారు. సిమెంట్‌తో కట్టిన పెద్ద అరుగుమీద నిలువునా మసిబారిపోయిన నల్లటి గెడకర్రలాంటి అజయ్‌శేఖర్ వీళ్లకి జడ్జి. ఒక నిమిషం టైం. చివరివరకు కదలకుండా ఉండి గెల్చిన వాళ్లకి చాక్లెట్ యిస్తాడు. దానికోసం పిల్లలు గంటల తరబడి విచిత్రమైన పోజుల్తో, హావభావాల్తో నిలబడిపోతారు. వొకరిమీద వొకరికి పోటీ. యెట్టి పరిస్థితుల్లోను కదలడానికి యిష్టపడరు. 'పాం పామ'ని అరచినా మెదలరు. అజయ్‌శేఖర్ ఒక్కొక్కరి దగ్గరకీ వెళ్లి తమాషా తమాషా మాటలన్నీ మాట్లాడుతున్నాడు. పిల్లలు కనీసం చూపుకూడా తిప్పడం లేదు. సూట్‌కేస్ తీసుకొని అంతదూరంలో నడిచొస్తున్న కుమారిని యెవరు చూశారోగాని "కుమారక్కా'' అంటూ బలంగా అరిచారు. అంతే. "కుమారక్కా, కుమారక్కా'' అని అందరూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా గాలి దుమారంలా పరిగెత్తారు. వాళ్లకి ఒక నోరు, రెండు చేతులూ సరిపోవడం లేదు. కుమారక్కని ముద్దు పెట్టుకోడానికి, వాటేసుకోడానికి.

    అజయ్‌శేఖర్ యెలాగో సందు జేసుకొని సూట్‌కేస్ అందుకున్నాడు.

    "రేపొస్తానన్నావుగాక్కా ...''

    "ఉండబుద్ధిగాలేదురా ...''

    అటు పదిమంది పిల్లలు. ఇటు పదిమంది పిల్లలూ. కుమారి రెండు చేతులు పట్టుకొని నడుస్తుంటే రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కల మీద వాలిన పావురంలా కదిలింది కుమారి.

    "అమ్మేదిరా?''

    "స్త్రీల కూడిక కదా, చర్చికెళ్లింది''

    ఆరుబయట వేసిన మంచమ్మీద కూర్చొని సూట్‌కేస్‌లోంచి పెద్ద పాకెట్ తీసింది. దాన్నిండా చాక్లెట్లు. పేరు పేరునా అందరికీ యిచ్చింది. ఆటకి రాకుండా యిళ్లల్లోనే ఆగిపోయిన పిల్లలకివ్వమని వీళ్ల చేతికిచ్చింది. కుమారి చుట్టూ పిల్లలు. గొర్రెపిల్లల మధ్య కూర్చున్న క్రీస్తులా వుంది కుమారి.

    "రేయ్ ... చీకటి పడిపోయిందిరా ... ఇంటికెళ్లి చదూకోండి'' చెప్పాడు అజయ్శేఖర్. ఎవరూ కదల్లేదు. మామూలుగా అయితే ఈ పాటికి చాక్లెట్లు నోళ్లల్లో నానుతుండేవి. యెవరికీ కుమారక్కని వదిలి అంత తొందరగా వెళ్లాలనిపించలేదు. వారం రోజుల తర్వాత రావాల్సిన క్రిస్మస్. ఆ రోజే ఆ క్షణమే వచ్చినట్లుంది పిల్లలకి - కుమారిని చూస్తుంటే!

    'ఇక రేపట్నుంచి ఆటలు, పాటలు, మిమిక్రీ, డ్రామాలు, క్రీస్తు పుట్టుక నాటకం ... ఇవన్నీ నేర్పించేస్తుంది కుమారక్క' పిల్లల కళ్లల్లో ఆశ, వుత్సాహం. వీటన్నిటినీ పిల్లలు క్రిస్మస్రోజు స్టేజి మీద ప్రదర్శిస్తారు. ముందు నుంచే ప్రతి సండే స్కూల్లో ఇవన్నీ కుమారి దగ్గర నుంచి నేర్చేసుకుంటా వుంటారు. ఈ సంవత్సరమే కుమారి డిగ్రీ పూర్తి చేసుకొని బి.యిడి. చదవడానికి గుంటూర్లో హాస్టల్ కెళ్లిపోయింది.

    "వెళ్లి చదూకోండిరా, లేకపోతే రేపు ఆటలో చాక్లెట్లు కట్'' అజయ్‌శేఖర్ బెదిరించాడు.

    "మాకేమొద్దులే! ... కుమారక్క వచ్చేసిందిగా ...'' అందరూ ముద్దు ముద్దుగా కళ్లు తిప్పుతూ.

    వాళ్ల దృష్టిలో కుమారక్కను మించిన పెద్ద చాక్లెట్ ఎక్కడా లేదు. పరలోకంలో కూడా...!

* * *

    తెల్ల అంగీ వేసుకొని ఆల్టర్ లోపల శిలువ గుర్తు వేస్తూ -

    "తండ్రి యొక్కయూ, కుమారుని యొక్క యూ, పరిశుద్ధాత్మ యొక్కయూ నామమున ...'' అని పాస్టర్‌గారు అనగానే - "ఆ ... మెన్'' అన్ని గొంతులూ వొక్కసారిగా రాగయుక్తంగా -

    "క్రిస్మస్ స్తుతి ఆరాధనలో భాగంగా కుమారి వొక పాట పాడుతుంది'' తెలుపుమీద చిన్నచిన్న నీలం పువ్వులున్న కాటన్ చీర. చెంగు తలమీదుగా ముసుగు వేసుకొని మెత్తగా నడుస్తూ ఆల్టర్ లోపలున్న మైక్ ముందుకొచ్చింది కుమారి. అలుముకున్న నిశ్శబ్దాన్ని తియ్యగా చీలుస్తూ -

    "ఆరాధనాలందుకో ...
    పాప క్షమాపణా జీవామునిచ్చిన
    కరుణామయా .. అందుకో '' పాట సాగుతోంది. ప్రత్యేక కార్యక్రమాలతో క్రిస్మస్ ఆరాధన ముగిసింది. చర్చి అయిపోయింది.

    బయట ఆంటీలు, అంకుల్లు, అన్నలూ, అక్కలూ కుమారి చుట్టూ చేరారు. పిల్లలు సరేసరి.

    "అరే, యెప్పుడొచ్చావురా...''

    "బాగున్నావంటరా ...''

    "యేందమ్మా కుమారీ... చిక్కిపోయినట్లున్నావ్''

    "రేపు ఫస్టుదాకా వుంటావు గదమ్మా'' భుజమ్మీద చేతులేసి, తలమీద చేతులేసి, చేతులు పట్టుకొని అందరూ కుమారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సమాధానం చెబుతోంది కుమారి - ప్రేమగా కళ్లు చిన్నవిగా చేసి ముసిముసిగా నవ్వుతూ. ఆ పరిసరాలంతా క్రిస్మస్ పండగ వాసనేస్తోంది.
మబ్బుపట్టకుండానే నీడ. బంతి చామంతుల కలనేసిన వాసన.

    యేసు పుట్టిన అర్ధరాత్రి ఘడియల్లో ఆరాధనకొచ్చి ఇప్పుడు రాకుండా ఇళ్లల్లో వుండిపోయి కొవ్విన గొడ్డు మాంసంతో పలావులొండుతున్న అమ్మలూ, అమ్మమ్మలూ, నాయనమ్మలు - నిన్న రాత్రివరకు కారల్స్లో సంపాదించిన డబ్బులు ఎట్లా ఖర్చుపెట్టాలో లోపల్లోపలే లెక్కలేసుకుంటూ పాంట్లల్లోకి చొక్కాలు దోపి కొత్త షూ వేసుకొని హడావిడిగా తిరుగుతున్న కుర్రాళ్లు - క్రిస్మస్ పండగ సంబరాన్ని వొళ్లంతా మెరుపు నురగలా పట్టించుకొని చర్చి గంటల్లా గూగూ మోగుతున్న టీనేజీ అమ్మాయిలు -

    ప్రతి యింటి ముందూ వో క్రిస్మస్ ట్రీ. చెట్టునిండా బోలెడు గ్రీటింగ్లూ, బెలూన్లూ, రంగురంగుల కాగితాలు. ప్రతి యింటి సీలింగుకి గోడలకి రకరకాల డిజైన్లతో కత్తిరించిన రంగుకాగితాలు వేలాడుతున్నాయి.

    అచ్చం ఆ క్రిస్మస్ ట్రీలా పిల్లలు. రంగు కాగితాల్లా, గాలి వూదిన బెలూన్లలా ... గ్రీటింగ్ కార్డుల్లా, రంగుముగ్గుల్లా పిల్లలు. తుక తుకా వుడుకుతున్న గొడ్డు పలావు ఘుమాయింపులా పిల్లలు -

    ఆ రోజు భోజనానికి రాబోతున్న ముస్లిం హిందూ స్నేహితుల కోసం చాలా యిళ్లల్లో ప్రత్యేకంగా వుడుకుతున్న వేటమాంసం కోడిమాంసం- తమలాంటి ఊరిచివర అంటరాని పేద వాడల్లోకి వచ్చే కుష్ఠురోగుల కోసం చిల్లరగా - చింపిరి జుట్టుతో చీలికలైన బట్టలతో తమ దగ్గర మాత్రమే చిన్న గిన్నెలతో తిండి అడుక్కోవడానికొచ్చే పసివాళ్ల కోసం - జామకాయలుగా, అరటిపళ్లుగా, బెల్లమన్నంగా, సగ్గుబియ్యం జావగా మారిపోయిన 'దశమ భాగం' -
అప్పోసప్పో చేసి, అరాకొరా డబ్బుల్తో పండగకి పాతబట్టల్తోనే తిరుగుతున్న నాన్నలూ - అన్నీ కల్సి క్రిస్మస్.

    యింటికి కొట్టిన కొత్త సున్నం బట్టలకు యెక్కడ అంటుకుంటుందోనని దూరదూరంగా తిరుగుతున్నాడు అజయ్‌శేఖర్.  ఫ్రెండ్స్ లంచ్‌కి వచ్చే టైమైందని అందర్నీ హడావిడి పెట్టేస్తున్నాడు.

    యింటినిండా కుమారికోసం వచ్చిన పిల్లల్తో "రాళ్లు తెచ్చుకోండ్రా పగలకొట్టుకొని తిందురు'' మైసూర్‌పాక్ పిల్లల చేతికిస్తూ చెప్పాడు. అవి రాత్రి తను చెయ్యి పెట్టడం మూలంగానే చెక్కముక్కల్లా తయారయ్యాయి.

    "అరేయ్ వాళ్లయ్యసలే పాలపళ్లురా. ఊడిపోతయ్ పాపం'' నవ్వుతూ చెప్పాడు పెద్దన్నయ్య సాగర్.

    "వీడు చేసిన మైసూర్‌పాక్ కంటే వాళ్ల పళ్లే మెత్తగుంటయ్'' కొత్త చుడీదార్ మీద సున్నీ సరిచేసుకుంటూ చెప్పింది శశి.

    "రేయ్, ఆ జులపాలేందిరా పిల్లులు పట్టే వాడిలాగా, ఎన్నిసార్లు చెప్పాల్రా పోయి క్రాఫు జేయించుకో పో'' కుక్కిమంచంలో కూర్చొని మైసూర్‌పాక్ కొరుకుతూ అరిచాడు వేదమణి. ఆయన అరుపుల్ని ఏ మాత్రం లెక్కచెయ్యలేదు అజయ్‌శేఖర్. పైగా సీరియస్‌గా కుమారి దగ్గరికొచ్చి మొహంలో మొహం పెట్టి రహస్యంగా - "జీసస్‌ని డిప్ప కొట్టించుకోమనే దమ్ముందా నాన్నకి. నన్ను మాత్రం అంటాడు. అయినా జీసస్‌దీ నాదీ సేమ్ హేర్ స్టయిల్. నో డిఫరెన్స్'' చెప్పాడు.

    నవ్వింది కుమారి. అజయ్‌శేఖర్ గడ్డాన్ని వేళ్లతో ముట్టుకొని వేళ్లని ముద్దు పెట్టుకుంది ప్రేమగా. మెడమీద నుండి వెనక జుట్టులోకి వేళ్లు పోనిచ్చి- "ఈ స్టయిల్ నీకు పెద్దగా సూటవ్వలేదు నాన్నా'' నెమ్మదిగా చెప్పింది. అంతే! అరగంట తర్వాత అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చిన్న క్రాఫ్ చేయించుకొని వచ్చాడు అజయ్‌శేఖర్.

* * *

    పదిరోజుల తర్వాత కుమారి దగ్గర నుంచి వచ్చిన ఆ వుత్తరాన్ని ఇంట్లో అందరూ అన్ని సార్లు చదవడం వల్లనేమో బాగా నలిగింది. స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న శారా అప్పుడే వచ్చింది. అందులో ముఖ్యమైన భాగాన్ని మళ్లీ మళ్లీ చదివింది.

    "ముందే చెబితే ... మీరు ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకున్నా అతను మన కులం మన మతం కాదు కాబట్టి భయపడొచ్చు. వాళ్లింట్లో వాళ్లు మనింటి మీదికి గొడవకి రావచ్చు. ... వాళ్లింట్లోనైతే నన్ను యిష్టపడరు కదమ్మా ... కనీసం లోపలికి కూడా రానివ్వరు ... మనిషిని మరో మనిషి ప్రేమించడం గొప్ప విషయమని కదా అమ్మా మనం నమ్ముతున్నాం! అమ్మా! అతన్ని చూస్తుంటే నాన్నలాగా, అజయ్‌లాగా, సాగరన్నలాగా, చెల్లి శశీలాగా యెప్పుడన్నా ఒక్కసారి నీలాగా నన్ను ప్రేమిస్తున్నట్టు అన్పిస్తుంది ... అంత ప్రేమని కులం కారణంగా మతం కారణంగా వదులుకోలేకపోతున్నాను.

    అట్లా ప్రేమించే మనిషిని ప్రేమిస్తూ జీవితాంతం బతకటం బావుంటుంది కదమ్మా! నాకు బాగా నమ్మకం! ఈ వొక్క కారణం చేత మీరు నన్ను దూరంగా తోసెయ్యరని ...'' చెంపల మీద నుంచి నీళ్లు కారిపోతున్నాయి శారాకి. "కుమారి, నా బిడ్డ! పెళ్లి చేసుకుంది. యెవరూ దగ్గర లేకుండా, అనాథలా! రిజిష్టర్ మారేజి, నా బంగారు తల్లి'' వున్న చోటనే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. కొంచెం తేరుకొని కూర్చున్న చోటనే మోకరించి ప్రార్థించటం మొదలుపెట్టింది. "ప్రభువా, నీకు తెల్సు నాయనా. దానికి ప్రేమించడం తప్ప యింకేమీ తెలీదు. దాని నిర్ణయం నీ చిత్తమైతే, జీవితాంతం వెన్నంటి వుండు నాయనా. కష్టంలోనూ, సుఖంలోనూ వారు ఒకరికొకరై కలిసిమెలిసి ఉండేట్లు కరుణించు తండ్రీ ...'' ప్రార్థన సాగిపోతోంది. మెల్లగా ఆ కుటుంబంలో వాళ్లంతా ఒక్కొక్కరే వచ్చి ఆమె పక్కన మోకరించి కళ్లు మూసుకున్నారు. ఆమె చాలాసేపు ప్రార్థించి ఆమెన్ అన్నాక "ప్రేమగల మా పరలోకపు తండ్రీ ...'' అంటూ ప్రార్థన మళ్లీ మొదలైంది అజయ్‌శేఖర్ గొంతులో. అట్లా ఆ ప్రార్థన ఒకరి తర్వాత ఒకరిగొంతు మారుతూ సాగిపోతూనే వుంది ... ఆ రాత్రంతా!

 * * *

    చర్చిపేట పిల్లలంతా కుమారక్కని చూసి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తెల్లవారితే క్రిస్మస్. శారా ఇంట్లో కూడా క్రిస్మస్ వుంది. అయితే పండగలా కాదు. పనిలా! అజయ్‌శేఖర్ కారల్స్‌కి వెళ్లలేదు. వెలగడం లేదని జాగ్రత్తగా పెంకులు జారకుండా యింటి మీదకెక్కి అక్కడ కర్ర చివర కట్టిన స్టార్ లోపల బల్బు తీసి చూస్తున్నాడు అజయ్‌శేఖర్.  ఫిలమెంట్ పోయింది. ఇంతలో ఇంటిముందు సైకిల్ దిగుతున్న వ్యక్తి కిందికి రమ్మన్నట్టు సైగచేసి పిలిచాడు. అజయ్‌శేఖర్ కిందికి దిగేలోపే అతనిచ్చిన టెలిగ్రాం శారా చేతిలో ఉంది. "కుమారి సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ''. కళ్లు బైర్లుకమ్మి ఉన్నచోటనే కూలిపోయింది శారా. చర్చిపేటంతా పరిగెత్తుకొచ్చింది. పది నిమిషాల్లో యింటికి తాళం వేసి అజయ్‌శేఖర్ తెచ్చిన టాక్సీ ఎక్కి గుంటూరు జనరల్ హాస్పటల్‌కి బయలుదేరారు. దుఃఖపు ఆవిరితో టాక్సీలోపలి అద్దాలు చెమ్మగిల్లుతున్నాయి. చీకట్లో నల్లటి తారు రోడ్డు మీద - కడుపు నిండా దుఃఖపు మందుపాతర కూరుకున్న తెల్లని గొర్రెపిల్లలా టాక్సీ గంట తర్వాత గుంటూరు పెద్దాసుపత్రి ముందు ఆగింది.

* * *

    తెల్లని దోమతెరలో ... ముదిరిన నాటు గులాబీరంగులో మానవాకారంలో ఓ మాంసపుముద్ద ... కుమారి ... తొంభై శాతం కాలిన గాయాలతో ... బాంబులతో పేల్చినట్టు అందరి గుండెలు ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయ్.

    "కుమారీ ... నా తల్లీ ...'' శారా నోట్లోంచి ఏమాటా రావడం లేదు.

    "అమ్మా ...! '' శబ్దం బయటకొచ్చింది. అది నోటి రంధ్రమో, ముక్కురంధ్రమో అర్థం కాకుండా వుంది.

    "నా చిన్న తల్లీ ... కుమారీ ...'' శారా తన రెండు అరచేతులతో కుమారి మొహాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఏది పెదవో ఏది గడ్డమో తెలియడం లేదు. కళ్లు కాలిపోయాయో, కారిపోయాయో అర్థం కావడం లేదు.

    వెలుగుతున్న కాండిల్లోంచి - మంటకింద కరిగి కాండిల్ పాదాల వరకు కారిన మెత్తటి వేడి మైనంలా మొహం మీది చర్మం. కొంత అతుక్కొని, కొంత ఊడిపోతూ ...

    "అమ్మా ...! తెల్సుగా ఆయన ..'' కష్టంగా వస్తోంది మాట.

    "ఇప్పుడే తెల్సిందమ్మా ... నా తల్లీ ...''

    "ఆయన లేకుండా నేను బతకడంలో అర్థం లేదమ్మా ...''

    "అందుకని ... యింత ఘోరానికి పాల్పడ్డావా తల్లీ ...''

    "ఇది ఘోరం కాదమ్మా ... న్యాయం ... ప్రేమ ...''

    "ఇదేం న్యాయం తల్లీ ... నీ యిద్దరు పసిబిడ్డల్ని వదిలేసి ... మమ్మల్నందర్నీ వదిలేసి ... ఇదేం న్యాయమమ్మా ...''

    "లేదమ్మా ... నాకతని ప్రేమ కావాలి ..!''

    "ఈ యేడాదంతా అతని ప్రేమలోనే ఉన్నావుగదా తల్లీ ... ఆ ప్రేమని నీ బిడ్డలకి కూడా పంచాలి కదా ...''

    "నా బిడ్డల్ని చూడడానికి మీరున్నారు. పైన యేసయ్య ఉన్నాడు. కానీ అతణ్ణి చూడ్డానికి ... నిర్జీవంగా అతణ్ణి చూడ్డానికి నేనుండనమ్మా ...''

    "యెందుకు తల్లీ ... ఎందుకట్లా?'' శారాలో ధైర్యం దుఃఖం సమాంతరంగా వస్తున్నాయి. "అమ్మా ... అతణ్ణి నేను నా ప్రాణమంతటితో ప్రేమించాను. అంతకు వెయ్యింతలు అతడు నన్ను ప్రేమించాడు. అతడెపుడూ అంటుండేవాడమ్మా ... కుమారీ, కర్మ చాలక నీకేమైనా అయితే ... ఒక్క క్షణం కూడా నేనీ లోకంలో ఉండలేను ... క్షణంలో నీ దగ్గరకొస్తాను అని ... కానీ అమ్మా ...! అతడు బెంగుళూరులో లారీ కిందపడి చనిపోతే మూడ్రోజులకిగానీ నాకు తెలియలేదమ్మా ... రక్తంతో తడిసిన అతడి ఒంటిమీద బట్టలు సూట్‌కేస్లో వచ్చాయమ్మా .. అవి మా పెళ్లికి అతనేసుకున్న బట్టలు ...'' ఒక్కక్షణం ఆగింది కుమారి. బెడ్‌కి దగ్గరగా జరిగి వింటున్న అందరి కళ్లల్లోంచి కన్నీళ్లు నిశ్శబ్దంగా జారిపోతున్నాయి. "... ఒక్కక్షణం కూడా నేను ఆలస్యం చేయ్యలేదమ్మా. కిరోసిన్ తీసుకొని, బాత్రూంలోకి వెళ్లి తలుపు గడియపెట్టుకొని ...''

    పసిపాప నిద్రలోంచి సడెన్గా ఉలిక్కిపడి గట్టిగా భయానకంగా ఏడ్చినట్లు - ఒక్కసారిగా మందుపాతర పేలినట్టు అందరిలో ఒక్కసారిగా దుఃఖం ఎగజిమ్మింది.
"అమ్మా ... యాడవద్దు ... నాన్నా వద్దు ... శశీ ... అన్నయ్యా యాడవద్దు ... అజయ్ ... వద్దురా ప్లీజ్ ... అమ్మా ఈ జీవితం వుంది ప్రేమించడానికే అని చెబుతావ్ కదమ్మా ... నేనూ అందుకే చనిపోతున్నానమ్మా ... ప్రేమకోసం ...''

    ఎక్కడినుంచో గడియారం గంటలు కొట్టడం మొదలు పెట్టింది. సూర్యుడస్తమించిన ఆ నట్టనడిరేయి పాపపు చీకట్లను చీల్చుకుంటూ నీతి సూర్యుడు ప్రభవిస్తాడని సర్వ క్రైస్తవలోకం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్షణాలవి. పన్నెండో గంట మోగుతుండగా అప్పటి వరకు ప్రేమకోసం తపించి, ప్రేమతో జ్వలించిన కుమారి ఆరిపోయింది.

    "హ్యాపీ క్రిస్మస్''

    బయట బలంగా, ఉత్సాహంగా అరుస్తున్న అరుపులు వెచ్చగా ఊరంతా ప్రతిధ్వనిస్తున్నాయి.

    జీసస్ కంటే నెలముందు కుమారికి పుట్టిన ఇద్దరు కవలపిల్లలు పాప, బాబుతో కుమారి ప్రేమదేహంతో శారా కుటుంబం తిరిగి నరసారావుపేట బయలుదేరింది.

* * *

    కుమారి వయసుని లెక్కబెడుతూ చర్చిగంట ఇరవైరెండుసార్లు మోగింది. తెల్లటి గుడ్డ పరచి మేకులు గొట్టిన చెక్కపెట్టెలో - శిలువాకారపు చర్చిలో - అడ్డం నిలువు క్రాస్ అయ్యే మధ్య స్థానంలో వుంది కుమారి శరీరం. కిక్కిరిసి ఉంది చర్చి. కాంపౌండులో, రోడ్డు మీద ఎక్కడబడితే అక్కడ జనం. దుఃఖం వెయ్యి తలల సైతానుపామై అంతమంది మధ్య దారి చేసుకొని ఒక్కొక్కరినీ ఒరుసుకుంటూ పెనవేసుకుంటూ పోతోంది. అందరూ మెలితిరిగి పోతున్నారు. పిల్లల్నయితే అమాంతం మింగేస్తోంది. వాళ్లకి చాలా కన్‌ఫ్యూజన్‌గా వుంది. వాళ్లకి తెల్సు యేసయ్య కూడా చనిపోతాడని గుడ్ ఫ్రైడే రోజు. కానీ కుమారక్క చనిపోవడమేంటి క్రిస్మస్రోజు! యేసయ్య మీద పట్టరానంత కోపంగా కూడా వుంది. తమకి లేకుండా కుమారక్కని పరలోకానికి తీసుకెళ్లిపోతాడా అని.
ఆరాధన ముగిసింది.

    ఓ నలుగురు ముందుకొచ్చి బాలయేసును యెత్తుకున్న మరియలా ఆప్యాయంగా కుమారిని భుజాలమీద కెత్తుకున్నారు. "పరదేశీయులమో ప్రియులారా ... మన పురమిది గాదె ...'' బైబిల్ చేత పట్టుకొని పాట యెత్తుకున్న పాస్టర్గారిని అనుసరించారు.

    చర్చి కాంపౌండు దాటి, రోడ్డు మీదకొచ్చి రైల్వే గేటుదాటి, చెరువుకట్ట చుట్టి, చిన్న బ్రిడ్జిని దాటి, పెద్దపెద్ద తుమ్మచెట్ల మధ్య నుండి దారి చేసుకుంటూ పాస్టర్గారి వెనుక, సముద్రంలా జనం వెనక నడుస్తుంటే బరియల్ గ్రౌండ్‌ని  చేరింది కుమారి. ఆ జన సముద్రం దార్లో కొన్నిసార్లు బైబిల్ వాక్యమయింది. కొన్నిసార్లు కీర్తనయింది. కొన్నిసార్లు నిట్టూర్పయింది. కొన్నిసార్లు వట్టి పిరికిగొడ్డయి వొణికిపోయింది. కొన్నిసార్లు గుండె నిబ్బరమయింది. దారి పొడవునా పూలు. భుజం మీద ఆదమరచి నిద్రపోతున్న పసిబిడ్డని దింపినట్టు మెల్లగా, ఆప్యాయంగా దించారు.

    "మన్నుకి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, ప్రాణానికి ప్రాణంగానూ ప్రభువా, ఈ బిడ్డను నీకప్పగిస్తున్నాం'' మూడుసార్లు మూడు గుప్పెళ్ల మట్టిని సమాధి మీద వేశారు పాస్టర్గారు. శారా కుటుంబం, ఆ తర్వాత అందరూ వచ్చి గుంట చుట్టూ పాదు చేసినట్టున్న మట్టిని తలా పిడికెడు పెట్టెమీద చల్లారు.
ఆ చలికాలపు సాయంత్రపు నీరెండలో కుమారి సమాధి చేయబడింది. నిమిషం తర్వాత ఆ లేత చలి చీకటిని జయిస్తూ సమాధినిండా కొవ్వొత్తులు.

* * *

    కుమారి పెళ్లికంటే ముందు చర్చిపేటలో పాస్టర్‌గా పనిచేసిన మోజస్‌గారు శారా ఇంట్లో కూర్చోనున్నారు. కుమారి చనిపోయి మూడు నెలలయినా శారా కుటుంబం తేరుకోలేదు. ఇంకా నాలుగో నెల నిండని కుమారి కొడుకు శశి ఒడిలో, పాప అజయ్‌శేఖర్ ఒడిలో వుంది. "మీరు సరిగ్గా చూశారా అంకుల్'' వేదనతో అడిగింది శశి.

    "చూశాను ... ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూశాను గుంటూర్లో. అప్పుడప్పుడు కుమారితో కల్సి చర్చికొచ్చేవాడు. చర్చి అయిపోయాక నాతో మాట్లాడేవాళ్లు. కుమారి ఎప్పుడూ అతని గురించే చెప్పేది. అతను ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటాడని, అక్కడ సరయిన యిల్లు దొరికాక తనని కూడా తీసుకెళ్లిపోతాడని, తనని చాలా ప్రేమిస్తాడని, తన అభిప్రాయాలు గౌరవిస్తాడని ... చివరికి అతను శాకాహారయినా కుమారి కోసమే చికెన్ తెచ్చేవాడని, అతని ప్రేమలో తానన్ని మర్చిపోయానని. అయినా డెలివరీ తర్వాత అతన్ని తీసుకొని నరసరావుపేట అదే, ఇంటికి వెళ్లాలని ... చాలా చాలా చెప్పేది ...''

    అందరూ శ్రద్ధగా వింటున్నారు.

    మళ్లీ పాస్టర్‌గారే మాట్లాడారు.

    "నేను అతణ్ణే కాదు. అతడు కూడా నన్ను గుర్తు పట్టాడు. చూడగానే చాలా కంగారు పడ్డాడు. స్వస్థత కూటాలు ముగిసిన రోజే, మేం నలుగురం పాస్టర్లం, బెంగుళూర్లో భోజనం చేయడానికి ఆ హోటల్లోకి వెళుతున్నాం. అతను - భార్య, అతని పోలికలతో వున్న ఇద్దరు ఐదారేళ్ల పిల్లలతో బయటికొస్తున్నాడు. నేను షాకయ్యాను. నన్ను చూసి చాలా చాలా కంగారుపడ్డాడు.

    నేను తేరుకొని అతని వెనక పరిగెత్తే లోపలే అతను హడావిడిగా కుటుంబంతో సహా టాక్సీ ఎక్కి పారిపోయాడు ...''

    అందరి కళ్లముందూ కాలి, కమురు కంపుతో, ముడుచుకుపోయిన శరీరంతో కుమారి కన్పిస్తోంది. ప్రేమకోసం, కేవలం ప్రేమకోసం దారుణాతి దారుణంగా శరీరాన్ని కాల్చుకొని, చీల్చుకొని ప్రాణాలను పీకేసుకున్న కుమారి కన్పిస్తోంది.

    దుఃఖమా? కాదు ... అంతకు మించిందేదో, లేదనా? కాదు కాదు, అంతకుమించి, ఇంకేదో శూన్యమా? కానే కాదు, అంతకంటే చాలా ఎక్కువ ... ఇంకా ఏదో ...

    "ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే ... ఆ కరుణామయుడి ప్రవచనాలతో జీవిస్తున్నవాళ్లం ..'' అందరి కళ్లూ పాస్టర్‌గారి వైపు తిరిగాయి.

    " ... కుమారి అతణ్ణి ప్రేమించింది ... మీరు అతణ్ణి క్షమించండి'' అంటూ ప్రార్థన చేయడానికి లేచి నిలబడ్డారు.

* * *

    ఆ కుటుంబమంతా అతణ్ణి క్షమించమని ప్రత్యేకారాధనలో కళ్లు మూసుకొని గొప్ప క్షమతో ప్రార్థిస్తుండగా ... ఆ అర్ధరాత్రి ... అజయ్‌శేఖర్ బేగ్‌లో రెండు జతల బట్టలు పెట్టుకొని నిశ్శబ్దంగా బయటికొచ్చి బెంగళూరు బస్సెక్కాడు.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం 23 జనవరి2011 సంచికలో ప్రచురితం)
Comments