కుంచెవాడు - సత్యభాస్కర్

     
"ఏమండీ! నిద్ర లేవండి!" అంటూ ఎవరో కుదుపుతున్నట్లుగా అవడంతో ఉలిక్కిపడి లేచాను. 

    రాత్రంతా ఓవర్‌టైమ్ చేసి రావడం వలన కళ్ళు భగభగమంటున్నాయి. అప్పుడే కంపెనీ టైమయిపోయిందాని ఉసూరుమనిపించింది. సరిగ్గా గంట కూడా పడుకున్నట్టులేదు. 

    "టైమయిపోయిందా?" అంటూ ఆత్రుతగా కళ్ళు నులుముకుంటూ ప్రశ్నించాను.

    "టైమ్ కాలేదు కాని సున్నం వేసేవాడు వచ్చాడు. ఒకసారి మీరు మాట్లాడండి" అని శ్రీమతి అంది. 

    ఒకసారి గడియారం వైపు చూశాను. పదకొండవుతోంది. ఒంటిగంటకల్లా బస్‌స్టాపులో వుంటే సరిపోతుంది. ఇంకోగంట పడుకోనివ్వచ్చుగదా! నిద్ర ముంచుకొస్తోంది.

    "నువ్వు మాట్లాడరాదూ!" అంటూ మళ్ళీ ముసుగేయబోయాను. కాని నా ఆటలు సాగలేదు. 

    "మీరే మాట్లాడండి! తరువాత వాడితో తగాదా రావచ్చు! ఇలాంటివి మగవాళ్ళే చేయాలి!" అని బలవంతం పెట్టింది.

    "సరే కాసేపు వుండమను. మొహం కడుక్కుని వస్తాను" అని లేచి బాత్‌రూమ్‌లోకి దూరాను.

    ఈ చిన్నపాటి కొంపను కొని పదేళ్ళయినప్పటికీ ఏనాడూ సున్నం వేయించిన పాపాన పోలేదు. కట్టినప్పుడు వేసిన సున్నంతోనే కాలం గడుపుతున్నాం. ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులకు, అనుకోని అవసరాలకు... ఇలా ఏట్లో పిసికిన చింతపండులాగా అయిపోవడమే! గోడలన్నీ మరకలతో మసిబారి అసహ్యంగా ఉన్నాయి. ఈసారి దసరా పండుగకు ఎలాగైనా సున్నం వేయించాలని శ్రీమతి పట్టుబట్టింది. దాని ఫలితంగానే వాకిట్లో కొంపముందు సున్నం వేసేవాడు నిలబడివున్నాడు.

    మొహం కడుక్కుని వాకిట్లోకి వచ్చేసరికి పోర్టికోలో...

    కుంచె పట్టుకుని రమారమి నా వయస్సుగలవాడే నిలబడి వున్నాడు. వాడిచేతిలోని కట్టెలాంగే నిటారుగా వున్నాడు. ప్రక్కన ఒక పిల్లవాడు పదిహేను పదహారేళ్ళు వుంటాయేమో, బహుశ కొడుకయి వుంటాడు. ఎండలో కాగి కాగి నల్లగా మాడిన శరీరం, కష్టాల కడలి లాంటి వాడి మొహం చూడగానే తెలుస్తుంది రోజు కూలీ అని!

    "ఎవరు పంపించారు నిన్ను?" అని ప్రశ్నించాను.

    అవతలి మనిషి నోరు తెరిచే లోపలే...

    "మన పనిమనిషి రత్నమ్మ ఇంటి దగ్గరనే ఉంటాడటండి. అవతలి వాళ్ళ ఇంట్లో సున్నం వేస్తుంటే నేనే పంపించి పిలిపించాను" అని వెనక నించి మా ఆవిడ సమాధానం ఇచ్చింది.

    "సరే మంచిది! లోపలికి వచ్చి ఒకసారి ఇల్లు చూసుకో. ఎంత సున్నం పడుతుంది. నీ లేబర్ ఖర్చుకలిపి చెబితే బేరం చేద్దాం" అని అంటూ లోపలికి దారి తీసాను. 

    "సరే సార్!" అని అంటూ బయట హవాయి చెప్పులు విడిచి తండ్రి, కొడుకులిద్దరూ లోపలికి వచ్చారు. ఇది హాలు, ఇది బెడ్రూమ్, కిచెన్ అంటూ ప్రతి గది తిరిగి చూపించాను. వాళ్ళ వెనకాలే మా శ్రీమతి ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంది. ఇన్నాళ్ళకు సున్నం వేయిస్తున్నామనే సంతోషం ఆమె మాటలలో కొట్టొచ్చినట్ట్లు కనపడుతోంది.

    అన్ని చూశాక మళ్ళీ బయటకు వచ్చాం.

    "నువ్వొక కాఫీ తీసుకురా!" అని విసుగ్గా అంటూ పోర్టికోలో కుర్చీవేసుకుని కూలబడ్డాను.

    వరుసగా నిన్న పదహారు గంటలు, అంటే రెండు షిఫ్టులు పనిచేయడం వలన వళ్ళంతా విరగ్గొట్టినట్లుగా వుండి చిరాగ్గా వుంది. పొద్దునే వెధవ సంత తగిలింది. ఎదో ఆవిడ చూసుకోవచ్చు గదా! కంపెనీ పనికే వళ్ళంతా హూనమైపోతుంటే ఇంటి పనులన్నీ కూడా నేనే చూడాలంటే ఎలా కుదురుతుంది. రెస్టు తీసుకోకుండా! ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.

    ఈ లోపల గేటు ముందు స్కూటర్ ఆగడం మా బావమరిది రంగప్రవేశం చేయడం జరిగిపోయింది. 

    మా బావమరిది సురేష్ రావడమే ఒక తుఫానులా వస్తాడు. ప్రతీది హడవుడే! ఏదో పరుపులమ్మే కంపెనీకి సేల్స్ మేనేజరుగా పని చేస్తున్నాడు. తన తమ్ముడికి అఖండమైన తెలివితేటలున్నాయని మా ఆవిడ అభిప్రాయం. ఈ బేరసారాలవీ నాతో కుదరవనే మా ఆవిడ ఫోన్ చేసి పిలిపించినట్లుంది. 

    "ఏం బావగారు! సున్నం వేయిస్తున్నారటగదా! వెరీగుడ్! దసరాకు మా అందరికీ పార్టీ ఉందన్నమాట" అని అంటూనే లోపల నుండి కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు. 

    హమ్మయ్య! బ్రతికి పోయాను. ఈ వెధవ బేరాలంటేనే నాకు మహా చిరాకు. రోజూ కంపెనీకి వెళ్ళి రావడం, నెలకోసారి అవసరాలకు సరిపడా జీతం రాళ్ళను ఇంట్లో పడెయ్యడం, మిగిలిన సమయాన్ని పుస్తకాలు, సాహిత్య సమావేశాలతో కాలక్షేపం చేయడం నాకు అలవాటు. మా ఇంట్లో చీపురుకట్ట కొనాలన్నా సురేష్ రావల్సిందే! చీపురు కట్టలెన్ని రకాలు? వాటిలో ఎన్ని పుల్లలుంటాయి, అవి ఎక్కడ నుంచి వస్తాయి. అవి ఎలా తయారవుతాయి. వాటి మధ్య తేడాలేమిటి, వాటి తయారీ ఖరీదెంత, వాటిని అమ్మే ధర ఎంత అంటూ గడగడా అప్పజెప్పి షాపు వాడికి పిచ్చెక్కేలా చేసి, తనకు కావలసిన ధరకు తెచ్చుకోగల సమర్థుడు. అందుకే మార్కెటింగ్ రంగంలో రాణిస్తున్నట్లున్నాడు.

    ఇంతలో మా ఆవిడ కాఫీ కప్పులతో రానే వచ్చింది. తమ్ముడిని చూడగానే మొహం చాటంతయింది. 

    "ఎప్పుడొచ్చావురా! బావగారు కూడా నీకోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఇదిగో కాఫీ తీసుకో! ఈయనకు బేరాలసలే రావు. పది రూపాయలది వందరూపాయలకు ఒప్పుకుంటారేమోనని భయపడుతూనే వున్నాను"

    మా సంభాషణలో జోక్స్యం చేసుకుంటూ సున్నం వేసేవాడు "అంత అన్యాయంగా రేటు చెప్పమమ్మా" అని అంటూ ఏదో చెప్పబోయాడు. కాని మేమ్నదరం విననట్టే వుండడంతో వూరుకున్నాడు.

    "సరే! ఆ ప్రమాదం తప్పింది కదా! నాయనా సురేష్, నీవు మీ అక్క కలిసి నాకు సున్నం వేయండి. నాకు కంపెనీ టైమ్ అవుతోంది. నేను వస్తాను" అంటూ కాఫీ కప్పుతోనే ఇంట్లోకి దూరాను. 

    గుమ్మంలోనే మా పుత్రరత్నం రాహుల్ నన్ను దాటుంటూనే "బై!డాడి" అంటూ బయటకు దూసుకుపోయాడు. వాడు పదో తరగతి చదువుతున్నాడు. వాడికన్నీ దూకుడే! వెధవకు మేనమామ పోలిక వచ్చిందనుకుంటూ స్నానానికి బాత్‌రూమ్‌లోకి వెళ్ళాను. 

* * *

    స్నానం పూర్తిచేసుకుని, ఫ్రెష్‌గా తయారై హుషారుగా బయటకు రాగానే పెద్దగొంతుకతో ఆ కుంచెవాడు, మా బావమరిది సురేష్ మాట్లాడుకోవడం వినబడింది. బేరం కుదిరినట్లు లేదు. ఏదైనా గొడవ పడగలరని మనసు కీడు శంకించింది. ఈ సురేష్ మరీ కోడిగుడ్డుకు ఈకలు పీకుతాడు. లేబర్‌తో నోరు జారటం మంచిది కాదు. ఇంటి ముందు నానా యాగీ అవుతుందనుకుంటూ టవల్‌తో తల తుడుచుకుంటూనే బయటకు వచ్చాను. 

    "సరే! వెళ్ళవయ్యా! నీవు కాకపోతే మరొకడు! ఇట్లా రోజుకు రెండొందలు ఇచ్చేవాడెవడయినా మాకు కూడా దొరికితే, నేను మా బావ కూడా ఉద్యోగాలు మానేసి నీలాగే కుంచెపట్టుకుని సున్నాలేసుకుంటాం" అని సురేష్ విసురుగా అంటున్నాడు. 

    ఇంతసేపు నిలబడి బేరం కుదరనందుకు రుసరుసలాడుతూ కొడుకుతో పాటు గేటు తీసి బయటకు పోతున్నవాడల్లా ఈ మాటతో ఒక్కసారి నిలబడిపోయి వెనక్కి తిరిగాడు. 

    వాడి ముఖకవళికలన్నీ మారిపోయాయి. అది కోపమో ఆవేదనో తెలియని రీతిలో మొహమంతా నల్లరంగులో జేవురించింది. ఎండకు వాడి తలమీద తెల్లవెంట్రుకలు మరింతగా మెరుస్తున్నాయి. వాడి మొహంలోని తీవ్రతకు మావాడి నోరు కూడా ఆగిపోయింది. ఒక్క క్షణంలోనే ఏదో తెలియని ఉద్రిక్తత ఆవరించింది. 

    ఆ కుంచె వాడు ప్రశాంతంగా మా వంక సూటిగా చూస్తూ స్థిరమైన కంఠంతో ఇలా అన్నాడు.

    "చూడు బాబు! కలలో కూడా మీరు అలా అనకండి! మా పరిస్థితి పగవాడికి కూడా రావద్దు! నేను కూడా మీ బావలాగానే ఒకప్పుడు ఒక కంపెనీలో పనిచేసే వాడిని. ఇదిగో నా కొడుకు కూడా, ఇందాక వెళ్ళిన మీ మేనల్లుడిలాగానే స్కూల్లో చదివేవాడు. మా కంపెని యజమాని మా కార్మికుల శ్రమతో సంపాదించినంతకాలం కోట్లు గడించాడు. ఆ తరువాత విదేశీ సరుకులు కారుచౌకగా దిగుమతి కావడంతో పోటీ తట్టుకోలేక ఆర్డర్లు లేక మా కంపెనీని మూసివేశాడు. దాని వలన మా యజమానికేం నష్టం కాలేదు. ఉన్న కంపెనీ జాగాని అమ్ముకుని బాగానే బాగుపడ్డాడు.కంపెనీకి నష్టం వచ్చిందని దొంగలెక్కలు చూపించి మూడు నెలల జీతం చేతికిచ్చి మమ్మల్నందరిని రోడ్లమీదకు నెట్టాడు. నెల జీతం వస్తేనే పూట గడిచే మాకు ఉన్న ఉద్యోగం పోవడం పిడుగుపాటయింది. మరో ఉద్యోగంలో చేరదామంటే అన్ని కంపెనీల పరిస్థిలి ఇలాగే వుండటం, మమ్ములను తీసుకునేవాడు లేకపోవడంతో మేమంతా రోడ్లమీద పడ్డాం. ఆకలికి, పస్తులకు తాళలేక ఇదిగో ఇలాగ నేను, నా కొడుకు రోజు కూలీ అవతారమెత్తాం. మా ఆవిడ కూడా ఇంటిపట్టున వుండేది కాస్తా ఏదో పని చేసుకోక తప్పడం లేదు. మీరు మీ ఉద్యోగాలు చల్లగా వుండాలి బాబు! వస్తాం!" అంటూ గేటు దాటాడు.

    ఆ మాటలకు సురేష్ మొహం నెత్తురు చుక్కలేకుండా పాలిపోయింది. మా ఆవిడ కూడా అవాక్కయినట్లు కనపడుతోంది. ఇంతలో నాలో వివేకం మేల్కొంది. 

    "ఆగు బ్రదర్! ఒక్క నిముషం! అంత కోపమయితే ఎలా? మా వాడు ఏదో తెలియక నోరు జారాడులే! ఇంటి యజమాని నేను కదా! నా మాట విను, లోపలికి రా! ఎంతో కొంత నీకు న్యాయమనిపించినంత తీసుకుని నీవే పనిచేయి!" అంటూ లోపలికి స్వాగతించాను. 

    ఆత్మగౌరవంతో వెలుగుతున్న మొహంతో ఆ తండ్రి కొడుకులు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. మొహం చెల్లక మారు మాట్లాడకుండా సురేష్ లోపలికి వెళ్ళిపోయాడూ. 

    "టీ తీసుకోండి బాబు! తాగి పని మొదలు పెట్టండి!" అని నిండుగా నవ్వుతూ శ్రీమతి టీ కప్పులతో ప్రత్యక్షమయ్యింది.

    మబ్బులు తొలగిన ఆకాశంలా మా మనసులు తేలికపడి, సోదర భావంతో తొణికిసలాడాయి. 

(కార్మికలోకం మాసపత్రిక అక్టోబర్ 2007సంచికలో ప్రచురితం)    
     
Comments