కుంకం బరిణె - వి.వి.బి.రామారావు

    మన పెద్దల సూక్తులలో పరస్పర విరుద్ధాలు ఉన్నట్టు కనిపిస్తాయి. 'ఆలస్యం అమృతం విషం' అని చెబుతారు. తొందరపడి ఏ పనీ 'చెయ్యకు' అనీ చెబుతారు. ఈరెండింటిలో ఏది ఎప్పుడు స్మరణకు తెచ్చుకుని పాటించాలీ అన్నది వ్యక్తికి వివేకమే చెప్పాలి. వివేకం ఆలోచన వలనే రావాలి.

    'గతం నస్మరామి' అంటారు. ఈ నానుడి రావాల్సిన అవసరం ఒకరకంగా మనం ఊహించుకోవచ్చు. ఒకాయన ఎవరో తనకు అపకారం చేసి ఉండవచ్చు. లేదా చేసిన మేలు మరిచిపోవచ్చు. కోపం తెప్పించవచ్చు. అంత మాత్రం చేత అతనికి అవసరమొచ్చి పలకరిస్తే చీదరించకూడదు. ఎందు చేతంటే గతాన్ని ఆసందర్భంలో తలుచుకోకూడదు.

    ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే గతాన్నీ తలచుకోవాలి. ఇది - అంటే గతాన్ని గుర్తుంచుకోవడం - మంచిని పెంచుకోడానికి ఉపకరిస్తుంది.

    మంచి అంటే జ్ఞాపకం వచ్చింది పూజ చేసుకుంటూ ఉంద్డగా 'దేవుడి పెట్టె' మీద ఉన్న కుంకం బరిణె చూసి. రోజూ చూసేదే అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును చూస్తే మనసు గుండ్రాలలోకి వెళ్లిపోతుంది. 

    కంచూ ఇత్తడీ బరిణె - బరువుగా ఉంటుంది. ఎప్పుడూ తూచలేదు కాని సులువుగా అరకేజీ బరువుంటుంది.

    సారెతో పాటు అమ్మమ్మ తనకు ఇచ్చిందని అమ్మ చెప్పడం నాకు బాగా గుర్తుంది. అమ్మ పోయి మూడు దశాబ్దాలు దాటిపోయాయి. బరిణె చూసినపుడు తరచుగా గతం కళ్ల ముందు కదలాడుతునే ఉంటుంది. అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఆ బరిణె. అమ్మ నాకు మిగిల్చిన ఆస్తి... మరి 'గతం నస్మరామి' అనేస్తే 'ఆహాఁ!' అని ఊరుకోగలనా?

    అరవైయేళ్ల క్రిందటి మాట! రుపాయికి నువ్వుల నూనె సుమారు మూడుకేజీలు పట్టే కంచు చెంబులో మరి దేనితోనూ కొలవనవసరం లేకుండా 'మచ్చిగాడు' నింపి ఇచ్చేసేవాడు. నువ్వులనూనె - తెలకలి మచ్చి జ్ఞాపకం రావడానికి కారణం గానుగాడిన నువ్వుల నూనే దేవుడి దీపానికి శ్రేష్టం. ఇది మీకూ తెలిసిన విషయమే - రోజూ దేవుడికి దీపం పెట్టుకునే పాతకాలం వారందరికీ.

    నేను పదేళ్ల వాడినేమో -

    అమ్మ కంట నీళ్లు పెట్టుకుంటూ దేవుడి పెట్టె దగ్గర నిలబడి మెడలో నుంచి పుస్తెలు తీసి - జాగ్రత్తగా శతమానాలు విప్పి - వాటి స్థానంలో పసుపు కొమ్ము కట్టుకోడం నా కళ్లలో ఈరోజుకూ మెదులుతుంటుంది.

    నాన్న వంక చూశాను. ఆయన అటువంక తిరగడమూ గుర్తుంది. 

    "సత్యంగారింటి వెళతా! మంచివాడు. అడిగినప్పుడెన్నడూ కాదనలేదు..." 

    అమ్మ కన్నీళ్లు కుక్కుకుని నన్ను దగ్గరకు తీసుకుంది.

    "అమ్మా, సత్యంగారంటే మా క్లాసు మాష్టారేనా?"

    "ఆఁ!" అంది. అందులో ఎంత అసహ్యం ఉందో నాకు అప్పుడు తెలియలేదు.

    ఆ తరువాత తెలుసుకున్నదేమంటే - ఇంటి ఖర్చులకి కావలసిన దానికీ నాన్న సంపాదించగలిగిన ఆదాయానికీ ఏమాత్రమూ పొంతన లేక పోవడమనే సత్యం.

    అవన్నీ ఇప్పుడు నేననుకుని ప్రయోజనం లేదు కాని - వేదన తప్పదు మరి. ఇంటిలోని మగాడి దుబారాని ఆపగలిగిన 'ఆడ'ది - ఒకటీ ఒకటీ ఉన్న కాస్తా ఒలిచి ఇచ్చేయడమే చేయగలదు. 

    అమ్మ శతమానాలు సత్యం గారింటికి వెళ్లి అప్పటివరకూ వెళ్లిన వాటిలో కలిసి పోయి అవి మళ్లీ అమ్మ కంట పడలేదు.

    మేం ఇద్దరమూ మా అమ్మానన్నలకి మగపిల్లలమే. మాకు అక్కలూ చెల్లాయిలూ లేరు.

    కష్టాలు ఒంటరిగా రావు. నాన్న హఠాత్తుగా కడుపునొప్పితో కన్ను మూశారు.

    నేను అప్పటికి అయిదో ఫారంలో ఉన్నా. క్వార్టర్లీ పరీక్షలయినా కాలేదు. 

    మానాన్నతో పనిచేసిన చిరుద్యోగి నన్ను అక్కున చేర్చుకున్నారు. స్కూలు చదువుకు కావలసిన ఏర్పాట్లు చేస్తానన్నారు. అమ్మా తమ్ముడూ మా పెద్దమ్మగారింటి వెళ్లి - తమ్ముడు అక్కడ బడిలో చేరాడు. 

    కొద్దిరోజుల్లో నాకు కాస్త కుదుటపడే స్థితి ఏర్పడింది అమాయకతవ్మతో పాటు! నోటి మంచి ఉంటే ఊరు మంచికి కొదవ ఉండదు. నాన్న సహోద్యోగీ అంతంత మాత్రమే అయిన సామాన్య సంసారే. ఒక నాలుగు రోజుల్లో నన్ను మాతృసప్తకాని అప్పగించారు. బస వారింటే. 

    సంపదలగురించి నాకు ఆరోజుల్లో ఏమీ తెలియక పోయినా నాకు కడుపు నిండా - తమ పిల్లలతో పాటు చూసుకున్న వారందరూ మాతృమూర్తుల జాబితాలో ముందు రావలసిన వారే - సంపన్నులే.  

    బడి జీతాలు కడతామని కొందరంటే - బడి తరువాత ఇళ్లకి వచ్చి పదిమందితో కలిసి చదువుకోమని కొందరు మాష్టార్లు నన్ను ప్రోత్సహించారు. 

    ఎస్సెల్సీ అయ్యాక పుణ్యాత్ముల ఆశీర్వచనాలు, అండదండలతో విజయనగరం కళాశాలలో చేరా. చల్లని దేవుడు సింహాచల స్వామి విద్యార్థి భోజన సత్రంలో పద్దు దొరికింది. తమ్ముడూ ఎస్సెల్సీ వరకూ ఇబ్బంది లేకుండా - అక్కడ మాదంటూ కంటికి కనపడే ఆస్తి లేని - మా ఊరుకి, నా తల్లుల దగ్గరకే వెళ్లిపోయాడు.

    నేను కాలేజీలో చేరిన తరువాత నాకు మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చింది.

    పెద్దల ప్రేమ - భగవంతుని ఆశీస్సులు - దయవలన చాలా పెద్దవాడిని కాగలిగినానని అనుకుంటూ తృప్తిగా జీవిస్తున్నాను.

    కాని దమ్మిడీ లేని రోజుల్లు గుర్తొస్తూనే ఉంటాయి. కుంకం బరిణె గురించి చెబుతున్నాను కదూ!

    నేను కాలేజీలో చదువుతుండగా అమ్మకి జ్వరం వచ్చింది. లంఖణానికి లొంగక మందు వేయవలసి వచ్చింది. రెండు మైళ్లు నడిచి రాగలిగాను అమ్మను చూడడానికి. మందుకి చేతిలో దమ్మిడీ అయినా లేదే. నా మనసు ఊరుకోలేదు. 

    "నాన్నా... ఇదిగో... ఈ బరిణె తీసుకువెళ్లి కొత్తపేటలో మనవాళ్లు శర్మ గారున్నారు.  ఉంచుకుని రెండో మూడో పట్టుకురా... ఉన్నప్పుడు ఇచ్చేసి తెచ్చుకుందాం."

    చాలా రోజుల క్రిందట అమ్మతో కొత్తపేట వెళ్లడం గుర్తొచ్చింది. బరిణెని కాగితంలో చుట్టి చేతితో కంబళిని పట్టుకున్నట్టు పట్టుకున్నా. చేతులో పెట్టుకోబోతే చాలా బరువనిపించింది. ప్యాంటు జేబు అప్పటికే చిరిగి ఉంది.

    నడుస్తూ ఉంటే అమ్మలు జ్ఞాపకం వచ్చారు. "నీకెప్పుడు ఆకలేసినా ఇక్కడికిరా. పిల్లల కోసం ఏదో చేసి ఉంచుకునే ఉంటే. నీకూ పెడతా..." "ఏరోజు ఎంగిలికి అవకాశం లేకపోయినా భోజనం వేళకి వచ్చేయ్. ముందే చెప్పవలసిన అవసరం లేదు." "ఒరేయ్, నువ్వు పెద్దవాడివవుతావ్! దేవు క్రూరుడు కాదు. ఇప్పటి నీ కష్టాలు - ఆయన దయతో నీకిచ్చినవే... కష్టాలు రావడం కూడా భగవదనుగ్రహమే అని తెలిసినవారు నమ్ముతారు" రామం మేష్టారు నాతో ఒకరోజు అన్న మాటలు.

    శర్మగారిల్లు వచ్చేసింది. నడక - ఆయాసం అనిపించనే లేదు - మూడు రూపాయలు కావాలి. ఎంత వేగం వీలయితే అంత తొందరగా...

    కొత్తగ్రహారం నుంచి కొత్తపేటకు మూడు మైళ్లు ఉంటుంది. కన్యకా అమ్మవారి గుడి పక్కనుంచి పార్కు గేటు దాటి, బస్‌స్టాండ్ పక్కనుంచి నీళ్లటాంకు దరికున్న కొత్తపేట నలభైనిముషాలలో చేరుకున్నా.

    "చాలా రోజులకు వచ్చావ్, నాయనా, రా కూర్చో" అంటూ ఆవిడ పలకరించింది. నేను కాసేపు తటపటాయించి ఆవిడ చూపిన బల్ల మీద కూచున్నాను. "అమ్మా, పెద్దమ్మా, పెదనాయనా అంతా కులాసా?"

    నేనెలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఆవిడే అమ్మ గురించి అడగడం సంతోషమనిపించింది. ఇకెందుకు ఆలస్యం!

    "అమ్మకి జ్వరమండీ... రెండు రోజులైంది. ఇంకా మందు వేయలేదు... ఇది ఉంచుకుని మూడు రూపాయలు ఇస్తే తొందరలో నే వచ్చి లెక్క ఇచ్చి తీసుకుని పోతా!" 

    బరిణె కాగితం పొట్లం నుంచి తీసి బల్ల మీద పెట్టాను.

    "అయ్యో నాయనా ఆయన ఇంటిలో లేరు. నా దగ్గర డబ్బులుంచరు..."

    "ఎప్పుడొస్తారమ్మా" చనువుగా అడిగాను.

    "తెలీదు నాయనా, ఎక్కడికి వెళ్లేదీ చెప్పరు."

    నేను అటూ ఇటూ చూస్తూ మౌనంగా కూచున్నాను. నిముష నిముషానికీ ఆత్రం ఎక్కువౌతోంది. ఏం జ్వరమో ఏమిటో...

    ఒక అరగంటయి ఉంటుంది. 'ఆయన' వచ్చి నన్నూ బల్లమీద బరిణెనీ చూసి లోపలి కెళ్లిపోయారు.


    కాసేపట్లో నాకు లోపలనుంచి ఆయన గొంతు "పిల్లవాడిని పెద్ద చదువులకి పెట్టాం... మనకే కటాకటిగా ఉంది... మనమేం సాయం చేయగలం!"

    నేను మరి ఆగకుండా బరిణె కాగితంలో చుట్టుకుని ఇంటి ముఖం పట్టాను. 

    ఆతరువాత ఏంచేశామో, జ్వరం ఎలా తగ్గిందో నాకు గుర్తు లేదు.

    కాలేజీ చదువైపోయి ఉద్యోగంలో చేరి ఊపిరి పీల్చుకోగలిగాను. దైవ కృప.

    డిల్లీ వెళ్లవలసి వచ్చి అక్కడ మావాడొకడికి ఫోన్ చేసి  ఫలానా రైలుకొస్తున్నానని చెప్పి బయలు దేరాను. 

    చలికాలం. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ న్యూడిల్లీ చేరేసరికి ఐదున్నరయింది. తెల్లవారలేదు. ఎముకలు కొరికే చలి అంటే దక్షిణాది నుంచి వెళ్లిన వారికి, అదీ మొదటిసారిగా, ఏమిటో తెలుస్తోంది. 

    ప్లాటుఫాం మీద దిగి సూట్‌కేస్ పట్టుకుని అతడెటు వస్తాడా అని చూస్తున్నా. ఉన్న ఊలు బట్టలన్నీ ఒంటిమీదే ఉన్నా చలి గజగజలాడిస్తోంది. 

    ఒక పది నిముషాల తర్వాత మావాడొచ్చాడు. 

    "రావడం ఆలస్య మైంది. రాత్రి నిద్ర లేదు... ఇంత ఉదయాన్నే ఆటో కూడా దొరకడం కష్టమైంది..." అంటూ ఆటోలో కూచోగానే మావాడు మొదలు పెట్టాడు.

    "నిద్రలేదా? కారణం?"

    "మనవాడే! కొత్తపేటలో శర్మ గారి అబ్బాయి. ఇక్కడ పెద్ద చదువులు చదవడానికి వచ్చాడు. నా రూమ్‌లోనే ఉంటున్నాడు... ఇద్దరం మెస్‌లో తింటూ కాలక్షేపం చేస్తున్నాం. చలి ఎక్కువైంది. స్నానం చెయ్యవద్దంటే వల్లకాదని తలమీద నుంచి చన్నీళ్లు స్నానం చేస్తున్నాడు. జ్వరం వచ్చింది. న్యుమోనియా అన్నారు... రాత్రికి రాత్రి జ్వరం ఎక్కువై పోయి నిన్న ఉదయం పోయాడు... పోలీసులు... తతంగం... రాత్రి పడుకునే సరికి పన్నెండు..."

    "కుంకం బరిణె..." తీరా నోటినుంచి ఆ మాట వచ్చాక ఠక్కున ఆగిపోయాను.

    ఆటో కుదుపుకు ఆగినట్టు నటించాను.

    "కుంకం బరిణె?" మా వాడు నావంక చూశాడు - నమ్మలేనట్టు. 

    "కుంకం బరిణేమిటి?" నేను చటుక్కున అడిగాను. "ఏమంటే నువ్ ఏం వినిపించుకున్నావో?" దబాయించేశాను. 

    నాకు కుంకం బరిణె అంటే ఏం జ్ఞాపకం వచ్చిందో అదిచెప్పడం అంత సులువు కాదు.

    'గతం నస్మరామి' అని జ్ఞాపకం తెచ్చుకుని ఓ వాల్‌పోస్టర్ చూపిస్తూ, "ఈ సినిమా చూశావా?" అని అడిగాను - అతడి దృష్టి మరల్చడానికి. 

(చినుకు మాసపత్రిక అక్టోబర్ 2010 సంచికలో ప్రచురితం) 

Comments