కుప్పిగంతులు - బులుసు-జీ-ప్రకాష్

    
మొదలిబాబు అభివృద్ధికి తోడ్పడింది మిరపకాయబజ్జీల, పకోడీల వ్యాపారం. రోడ్డు పక్కనే చిన్న గుడిసె అద్దెకు తీసుకుని అతను వ్యాపారం మొదలు పెట్టాడు. అతనికంటే ముందు ఆ గుడిసెలో వ్యాపారాలు చేసిన వాళ్ళు బోర్డు తిప్పేయక తప్పింది కాదు. కాని మొదలిబాబుని మాత్రం ఈ వ్యాపారం మోసం చేయలేదు.     వ్యాపారంలోకి అడుగు పెట్టినప్పుడు కుబేరుడైనా కావచ్చు, కుచేలుడైనా కావచ్చు కాని మొదలిబాబుని మాత్రం పకోడీల వ్యాపారం కుచేలుణ్ణి చేయలేదు. అలాగని కుబేరుడైపోయాడనుకోవడం కూడా పొరబాటే! ఒకర్ని దేహీ అనకుండా ఇల్లాలితో కాలం గడిపేటంతటి స్థితికి వచ్చాడు.     స్థానిక గ్రామదేవత పైడిమాంబ జాతర ఆర్భాటంగా ప్రారంభమైంది. సాధారణంగా లక్షకు మించని ఆ పట్టణ జనాభాకి మరో లక్ష అదనంగా కలిసింది. ఈ సుదినం వస్తుందని ముందే తెలిసిన మొదలిబాబు రోజూ కంటే వందరెట్లు పకోడీలే కాక, మరికొన్ని రకాల తీపి తినుబండారాలు కూడా ఎక్కువగా చేసాడు. తత్ఫలితంగా ఇరవై వేల పై చిలుకు రూపాయలు లెక్క పెట్టగలిగాడు.     వ్యాపారం ముగిసిన మూడురోజుల తరువాత మొదలిబాబు మెయిన్‌రోడ్డు మీద పడ్డాడు. కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్యకు ఏదో నగ కొందామనుకున్నాడు. తన శ్రేయోభిలాషి, పాక హోటల్ కొట్టుకు యజమాని అయిన 'ఆశీర్వాదం' కొట్లో దూరి కూర్చున్నాడు.

    మొదలిబాబు ఆనందోత్సాహాలను చూసి ఆశీర్వాదం అన్నాడు-
    "ఏమిట్రోయ్! ఇవాళ గొప్ప హుషారుగా ఉన్నావ్?"     "హుషారంటే హుషారే!" అన్నాడు మొదలిబాబు. - "ముందు ఓ ప్లేటు ఇడ్లీ కొట్టించు".     ఆశీర్వాదం ఇడ్లీ ఇచ్చాడు.     "మొన్న అమ్మవారి పండుగలో ఇరవైవేల రూపాయలకు పై చిలుకు అమ్మానయ్యా! మా లచ్చిమికేదైనా నగ చేయిద్దామనుకుంటున్నాను" అన్నాడు మొదలిబాబు.     "తప్పకుండా చేయించు" సలహా ఇచ్చాడు ఆశీర్వాదం.     "ఏమిట్రోయ్! కబుర్లు? నాక్కూడా కాస్త చెప్పండర్రా!" అంటూ హోటల్లో దూరాడు హనుమంతు.     హనుమంతు సాక్షాత్తు మొదలిబాబు బావమరిది. అంటే భార్య లచ్చిమికి అన్నయ్య. చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. కటకటాలు లెక్కపెడుతూండడం, బయటికి వస్తూండడం వాడికి వెన్నతో పెట్టిన విద్య.     మొదలిబాబుకి కన్నుగీటాడు ఆశీర్వాదం "జాగ్రత్త సుమా!" అనే హెచ్చరికగా. కాని మొదలిబాబుకి ధీమా ఎక్కువ. "ఏడిసాడు లేవోయ్! వీడి కుప్పిగంతులు నా దగ్గరా?" అన్నట్లు ఆశీర్వాదం వైపు చూసాడు. హనుమంతు చూస్తుండగా పదివేలు కట్టలు రెండు, ప్యాంటు జేబులోంచి తీసి చొక్కా జేబులో వేసుకున్నాడు.     "నీకేమిటి కావాలయ్యా?" అడిగాడు ఆశీర్వాదం.     "ఏంవుంటే అదే!" అన్నాడు హనుమంతు దర్జాగా, కాళ్ళూపుకుంటూ.     "ఆవిరి కుడుము ఉంది".     "అయితే అదే ఇయ్యి".     "డబ్బులోయ్! డబ్బులు ముందు చూపించకపోతే, కుడుము కాదు, పిడిగుద్దులు పడతాయి!" హెచ్చరించాడు ఆశీర్వాదం. లోగడ టిఫిన్ తినేసి డబ్బులెగ్గొట్టాడు హనుమంతు.     "ఇవిగో నీకెన్ని డబ్బులు కావాలో తీసుకో!" అని లేత గులాబీరంగు గల వెయ్యి రూపాయల కాయితం రెపరెపలాడించాడు హనుమంతు.     ఆశీర్వాదం కుడుము పెట్టక తప్పింది కాదు. మొదలిబాబుని చాటుకు పిలిచి "చంపేసావులా బాబూ! వాడెదురుగుండా నోట్ల కట్టని చొక్కా జేబులో వేసుకున్నావేంటి? వాడు పచ్చి కేటుగాడు!" అన్నాడు ఆశీర్వాదం.

    "వాడి తలకాయ వెధవ! నా దగ్గర అటువంటి కోతిపనులు చేస్తే తారకం ఎత్తించి బుర్ర రామకీర్తనం పాడిస్తాను. నా సంగతి వాడికింకా తెలిసినట్లు లేదు!" అంటూ మొదలిబాబు కోరి హనుమంతు పక్కకెళ్ళి కూర్చున్నాడు.
    "ఆశీర్వాదం! ఈ రెండు కట్టలూ ఎంతో తెలుసా? అక్షరాల ఇరవై వేల రూపాయలు! నా ఇంటి దానికి దానికి ఏం కొనమంటావో చెప్పు" అన్నాడు మొదలిబాబు.

    ఆశీర్వాదం సమాధానం చెప్పకుండానే హనుమంతు కలుగజేసుకుని "దానికేం? నా మాట విని ఫష్టు క్లాసైన పుస్తెల తాడు చేయించు బావా! శతమానాల మధ్య నుంచి పుస్తెలతాడు వెళితే ఆ మెడకి ఎంతందమో? మా చెల్లాయికి బంగారు పుస్తెలతాడంటే ఎంతిష్టమో! పొద్దుట లేచీ లేవడంతో ఆ మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుని మా చెల్లి మిగిలిన పనులు చేసుకుంటుంది. ఆలికి శృంగారం అవసరానికి బంగారం అని పెద్దలు చెబుతారు!" అన్నాడు హనుమంతు.
    మొదలిబాబు ఆశ్చర్యంతో కూలబడిపోయాడు! పుస్తెలతాడు! ఎంత మంచి సలహా? పుస్తెల తాడంటే లచ్చిమికెంతో ఇష్టం. ఈ సలహా ఇచ్చింది ఎవరు? బావమరిది హనుమంతు! తన చెల్లాయి బాగుకోసం ఎంత మంచి సలహా చెప్పాడు!

    ఛీఛీ! పాడులోకం! మనిషి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మంచివాణ్ణి దొంగ వెధవగా చిత్రీకరిస్తుంది. దొంగ వెధవల్ని అందలం ఎక్కిస్తుంది. "ఇటుపైని ఎప్పుడూ చెప్పుడు మాటలు వినకూడదు గాక వినకూడదు!" అనుకున్నాడు మొదలిబాబు.
    ఆశీర్వాదం ఇంకేవేవో చెప్పబోయాడు. మొదలిబాబు వినిపించుకోలేదు. ఆశీర్వాదం తన చెవిలో పువ్వు పెట్టబోతున్నాడని భావించాడు మొదలిబాబు. హనుమంతు టిఫిన్ డబ్బులు కూడా మొదలిబాబే ఇచ్చేసాడు.     బావ, బావమరిదుల శరీరాలు రెండూ బంగారం కొట్లో దూరాయి.     "ఇరవై గ్రాముల పుస్తెలతాడు ఎంతవుతుందండీ?" అడిగాడు మొదలిబాబు.     "రెడీమేడ్‌వి ఉండవు. ఆర్డరిస్తే వారం రోజుల్లో చేయించి ఇస్తాం" అన్నాడు దుకాణందారు.     "చేయిస్తే ఎంతవుతుంది?" అడిగాడు మొదలిబాబు.     "ఇరవై రెండువేలు"     "ఇరవై వేలే కదా?"     "మజూరీనో? మజూరీ రెండువేలవుతుంది."     "నా దగ్గర ఇరవైవేలే ఉన్నాయి. ఇప్పుడెలాగ?"     "ఆ పై రెండువేలూ నేనిస్తాను బావా! ఎప్పుడో వీలు చేసుకొని తిరిగి ఇచ్చేద్దువుగాని" అన్నాడు హనుమంతు.     మొదలిబాబు మరీ ఉబ్బితబ్బిబ్బయి పోయాడు, హనుమంతు ఔదార్యానికి.     ఇరవై రెండువేలూ ఇచ్చేసారు దుకాణదారుకి. దుకాణదారు రసీదు ఇచ్చాడు. "ఈ రసీదు భద్రంగా ఉంచండి. వారం పోయాక, ఈ రసీదు మాకిచ్చేసి మీ వస్తువు మీరు పట్టుకెళ్ళండి" అన్నాడు దుకాణదారు.

* * * * * *
    బావ, బావమరిదులిద్దరూ తుళ్ళుతూ గంతులు వేస్తూ కూని రాగాలు తీస్తూ ఇల్లు చేరుకున్నారు. అన్నయ్యని చూడగానే లచ్చిమి మొహంలో ఆనందం వెల్లివిరిసింది. "బావున్నావా అన్నయ్యా!" అని పలకరించింది. ఏమైనా రక్తం పంచుకుని పుట్టినవాడే కదా!
    "బావున్నాను చెల్లాయ్! నువ్వెలా ఉన్నావ్?" ఆప్యాయంగా అడిగాడు హనుమంతు. 

    "నేనూ బాగానే ఉన్నానన్నయ్యా!"     "అన్నాచెల్లెళ్ళు హుషారుగా కబుర్లు చెప్పుకోవడమేనా లేక ఓ కాఫీ చుక్క కలిపి ఇవ్వడం ఉందా?" అన్నాడు మొదలిబాబు.     "ఆ ఇదిగో కలుపుతున్నా!" గ్యాస్ ముట్టించడానికెళ్ళింది లచ్చిమి.     భర్తకీ, అన్నయ్యకీ కాఫీ తెచ్చింది.     "లచ్చిమీ! ఈ రసీదు నీ పెట్లో జాగ్రత్తగా ఉంచు. ఈ కాయితం ముక్క విలువెంతో తెలుసా?" అన్నాడు మొదలిబాబు.     "నోట్లయితే విలువ తెలుస్తుంది. కాని కాయితం ముక్కకి విలువేంటండీ!" అంది లచ్చిమి.     "అమ్మా చంపేసావ్! అలా అని పారేసావ్ స్మీ! కొంప మునుగుతుంది!" అన్నాడు మొదలిబాబు.     "అంత విలువేమిటో చెప్పి ఏడవకూడదా?"     "మొన్న పైడిమాంబ జాతరకి నేను అమ్మిన తినుబండారాల విలువ ఖర్చులు పోను, ఇరవై వేల రూపాయలు మిగిలాయి. ఆ డబ్బుతో ఏం చేద్దామా? అని ఆశీర్వాదం హోటల్లో మాట్లాడుకుంటుంటే, మీ అన్నయ్య కనబడి, మా చెల్లాయికి ఇరవై గ్రాముల పుస్తెలతాడు చేయించు బావా! ఆలికి శృంగారం అవసరానికి బంగారం అని సామెత కూడా చెప్పాడు" అన్నాడు మొదలిబాబు.     లచ్చిమి పొంగిపోయింది అన్నయ్య సూచనకి.     "అయితే ఈ రసీదు ఎందుకట?" అడిగింది లచ్చిమి.     "ఇరవై గ్రాముల బంగారు పుస్తెలతాడు చెయ్యడానికి సొమ్ము ముట్టినట్లు రసీదు ఇచ్చారు. వారం పోయాక వచ్చి రసీదు ఇచ్చేస్తే వస్తువు ఇచ్చేస్తానన్నారు దుకాణదారు. ఈ ఇరవై వేలూ కాక వస్తువు చేయడానికి మజూరీ రెండువేలు ఎగస్ట్రా అయ్యింది. మీ అన్నయ్యే ఇచ్చాడు!" అన్నాడు మొదలిబాబు.     "చూసారా! మా అన్నయ్య ఎంత మంచి వాడో మీకిప్పటికైనా తెలిసిందా? అనవసరంగా ఆతన్ని ఆడిపోసుకుంటారు?" అంది లచ్చిమి.
భర్త ఇచ్చిన రసీదుని పెట్లో పెట్టింది.
         "నిజమేనే! మీ అన్నయ్య గురించి చెప్పుడు మాటలు విని చాలా తప్పుగా అనుకున్నాను" అని హనుమంతు వైపు తిరిగి "నన్ను క్షమించు బావా!" అన్నాడు మొదలిబాబు.     "పోన్లే బావా! దాందేముంది?" అనేసాడు హనుమంతు.     ఇద్దరూ భోజనాలు చేసారు.     "వెళ్ళొస్తాను బావా! వెళ్ళొస్తాను చెల్లాయ్!" అంటూ వెళ్ళిపోయాడు హనుమంతు.     "బై" అన్నారిద్దరూ.     వారం రోజులు పోయాక పుస్తెలతాడు తయారైందో లేదో తెలుసుకుందామని, ఒక వేళ తయారై ఉంటే, రసీదు పట్టుకెళ్ళి వస్తువు తెచ్చుకుందామని రోడ్డు మీదున్న డబ్బా ఫోన్‌లో రూపాయి బిళ్ళ పడేసి మాట్లాడాడు మొదలిబాబు.     "మీరు వస్తువు బెత్తాయించినప్పుడు మీతో మరొకాయనెవరో వచ్చారే! ఆయన ఇప్పుడే వచ్చి రసీదు ఇచ్చేసి వస్తువు పట్టుకెళ్ళారు!" ఠక్కున వచ్చింది సమాధానం. 'హనుమంతు'డి దగ్గరా కుప్పిగంతులు?

(చిత్ర మాసపత్రిక అక్టోబర్ 2009 సంచిక నుండి ప్రచురితం)
Comments