క్యాన్సిల్! క్యాన్సిల్!! - అక్కినేని కుటుంబరావు

    
అతనికి నలభై ఏళ్లుంటాయ్. పట్టిన పట్టు వదలకుండా వున్నాడు. "నా సమస్య మీ కర్థంగాలా'' అన్నాడు.

    "నా కర్థమైందండీ! మీరు నెల రోజుల క్రితం బీమా పాలసీ తీసుకొన్నారు. ఇప్పుడది క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారు. అంతే గదా!'' అన్నాడు ఆఫీసులో క్లర్కు.

    "అవును. ఇవాళ్టికివాళే క్యాన్సిల్ చెయ్యండి. ఖర్చుకి డబ్బులేమన్నా కావాలంటే కూడా కడతా.''

    ఆశ్చర్యంగా చూశాడు ఆ ఎల్.ఐ.సీ. క్లర్క్.

    "మీరు పాలసీ తీసుకొన్నప్పుడు మొదటి ప్రీమియం మీరే కట్టారా లేక, ఏజెంటు మిత్రుడు ...''

    "నేనే కట్టా! ఆయన కడతానన్నాడు. నేనే వద్దన్నా! నా ఎకౌంటులో ఆయన కట్టడం అంటే నేను ఆయన దగ్గర అడుక్కుతిన్నట్టే గదా! అందుకే వద్దన్నా.''

    "మరి మీరు తీసుకొన్నది మనీ బాక్ పాలసీ! మంచి పాలసీ. అయిదు వందల రూపాయలు ఇప్పటికే కట్టారు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మీకు ఒక్కపైసా రాదు. మూడు సంవత్సరాలు పూర్తయి తేనే మీకేమైనా వచ్చేది. కనీసం ఈ మూడేళ్లు కట్టండి.'' 

    "ఒక్క నెల కూడా కట్టను. పాలసీ క్యాన్సిల్ చెయ్యండి. క్యాన్సిల్ చేయడాన్కి ఎంతకావాలో అడగండి కడతాను.'' 

    "మీకు నష్టం ...''

    "నా లాభనష్టాలు నాకు తెలుసు. క్యాన్సిల్ చెయ్యండి.''

    "అసలు ఎందుకు క్యాన్సిల్ చేద్దామనుకొంటున్నారు.''

    "వద్దనుకుంటున్నా కాబట్టి. అంతకన్నా నేను చెప్పను. క్యాన్సిల్ చెయ్యండి.''

    "క్యాన్సిల్ చెయ్యడానికేముంది. మీరు కట్టకండి. ఆర్నెల్లు పోతే అదే లాప్స్ అవుతుంది.''

    "కుదరదు. క్యాన్సిల్ ... క్యాన్సిల్ చెయ్యండి ... క్యాన్సిల్.''

    అతని కంఠం కొంగర జగ్గయ్యగారి కంఠంలా గంభీరంగా లేదు. వేమూరి గగ్గయ్యగారి కంఠం ఎలా వుంటుందో నాకు తెలియదు. అతని కంఠంతో ఎవరి కంఠం పోల్చాలో తోచదు. కాని అతని కంఠంలో నిశ్చయం, పట్టుదల మాత్రం కొట్టొచ్చినట్టు వున్నాయ్.
అతను ఆ ఎల్.ఐ.సి. ఆఫీస్ కొచ్చి అరగంటయ్యింది. అన్ని టేబుల్స్ దగ్గర కెళ్లాడు. అందర్నీ అడిగాడు. అతను మాట్లాడిన వంద మాట ల్లో 75 మాటలు 'క్యాన్సిల్' అనే! ఆ మిగిలిన పాతిక కూడా ఆ క్యాన్సిల్ కోసమే.

    అందరూ తలో ప్రశ్నా వేశారు. యే జ్యోతిష్కుడన్నా పాలసీ తీసుకున్న నెలకి హరీ మంటావని చెప్పాడా? లేక పోతే ఇంత పట్టుదల ఎందుకు?

    ఎవరెన్ని అడిగినా ఫలితం శూన్యం, క్యాన్సిల్. ముందు క్యాన్సిల్ చెయ్యండి అనే. సరే అందరూ మంతనాలాడి అతని దగ్గర్నుంచి ఒక ఉత్తరం తీసుకున్నారు. క్యాన్సిల్ చేస్తామన్నారు.

    అతను విజయగర్వంతో అందర్నీ ఓసారి చూశాడు. గబగబా మెట్లు దిగి వెళ్లిపోతున్నాడు.

    నేనతని వెంటే పరుగెత్తి "మాస్టారూ! కాఫీ తాగుదాం రండి. మీ పట్టుదల నాకు నచ్చింది'' అన్నాను.

    "మీరిక్కడే పని చేస్తారా?'' అన్నాడు అనుమానంగా చూస్తూ.

    నేను నొచ్చుకొని "ఛీఛీ. నేను ప్రీమియం కడ్దామని వచ్చాను. నేను సనత్‌నగర్‌లో గ్యాస్ కంపెనీలో'' అన్నాను.

    "వెరీ గుడ్! అయితే రండి. కాని బిల్లు నేనిచ్చే కండిషన్ మీద'' అన్నాడు.

    కాఫీకి ఆర్డరిచ్చాక "ఇప్పుడు చెప్పండి. ఎందుకంత పట్టుదలగా క్యాన్సిల్ చేయించారు?'' అన్నాను.

    "నా మనసు గాయపడింది'' అన్నాడతను సూటిగా నా హృదయంలోకి చూస్తూ.

    నాకు రాబోయే నవ్వుని ఆపేశాను. మంచిదయింది. బైటికి గాని ఆ నవ్వు వచ్చి వుంటే అతని హృదయం మళ్లీ గాయపడి ఉండేదని చెప్పడానికి నేను ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

    "బీమా పాలసీకీ మీ మనసు గాయపడడానికీ సంబంధం ...'' అని చివరికి కావాలనే నసిగాను.

    నేను గానీ, ఆ హోటల్లో మిగతావారు గానీ ఆయన మనసులో రికార్డు అవడం లేదని ఆయన ధోరణే చెప్తోంది.

    "నేను మోసానికి గురయ్యాను'' అన్నాడతను మళ్లీ.

    "అదేమిటి? మీరడిగిందొక పాలసీ అయితే మీకిచ్చింది మరొకటా?''

    "కాదు. అలా అయితే ఎల్లయిసీ వాళ్లని కోర్టు చుట్టూ తిప్పేవాడిని. జరిగింది అంత తేలికయిన విషయం కాదు.''

    "అసలేమయింది...''

    "చెప్తాను. నా కసలు పాలసీ చెయ్యాలనే అయిడియా లేదు. ఆ మాట కొస్తే ఈ ఏజంటు మొహం చూసేదాకా ఎల్లయిసీ పాలసీ మనకేదో ఒరగ బెడ్తుందని కూడా తెలియదు నాకు. ఏజంటు... పేరెందుకులెండి... నా దగ్గరకొచ్చాడు. ఒకసారి కాదు కనీసం పదిసార్లు వచ్చాడు. మా వూళ్లోగానీ నా పరిచయస్తుల్లో గానీ ఎవరికీ తెలియనన్ని నా పర్సనల్ సంగతులు అతను నన్నడిగి తెలుసుకున్నాడు ..''

    "అంటే ...''

    "ఏముంది? నా పేరు. నా వయసు. మా నాన్న పేరు. మా నాన్న వయసు. మా అమ్మ పేరు. మా అమ్మ వయసు. నా భార్య పేరు, వయసు. నా కెంతమంది కొడుకులు. కూతుళ్లు. వాళ్ల వయసులు. నా అన్నలు, తమ్ములు అక్కలు చెల్లెళ్లు వాళ్ల వయసులు. బతికున్న వాళ్లవే కాదు. చచ్చిపోయిన వాళ్లని గురించి కూడా అడిగాడు. సానుభూతి చూపాడు. ఎలా చచ్చిపోయారో అడిగాడు. చచ్చిపోయేటప్పటికి ఎవరికెంత వయసో అడిగాడు. నా ఆరోగ్య వివరాలు, నాకు గానీ నా రక్త బంధువుల్లో మరెవరికైనా గానీ క్షయ, ఆస్తా ్మ, రక్తపోటు, కుష్టు... ఉన్నయ్యా అని అడిగాడు. ఉంటే ఫలానా డాక్టరు దగ్గరికి తానే తీసుకెళ్తానన్నాడు.

    నా ఆదాయం గురించి ... నా ఆదాయప్పన్ను వాళ్లకి చెప్పననే భరోసా యిచ్చి మరీ తెలుసుకున్నాడు. ఉద్యోగంలో ఎంత బిజినెస్సులో ఎంత ఉమ్మడి కుటుంబంలో ఎంత ... విడివిడిగా కూడా తెలుసుకున్నాడు.

    నాకెన్ని పుట్టుమచ్చలు? ఎక్కడెక్కడ ఉన్నాయి? నా బర్త్ డే అడిగాడు. మరో రెండు రోజులకే అది వస్తుందని తెలిసి ఆనందపడ్డాడు. అడ్వాన్సుగా అభినందనలు చెప్పాడు.

    నా పిల్లల చదువుల గురించి, అమ్మాయి పెళ్లి గురించి అడిగి సంబంధాలు చూస్తానని కూడా చెప్పాడు.

    మా అమ్మానాన్న ఆరోగ్యాలు ఎలా వున్నాయి. మామూలుగా ఎలా వుంటాయి. నాదెలా వుంటుంది. మా ఆవిడది, పిల్లలది, అందరి ఆరోగ్యాలూ పేరు పేరునా అడిగాడు. నా అడ్రసు ... నా స్నేహితుడి అడ్రసు ... ఎన్ని సంగతులు ఎన్ని సంగతులు. అతనడిగే వరకూ నాకన్ని వివరాలున్నాయని గాని, నాది అంత చరిత్రగల కుటుంబం అనిగానీ నాకే తెలియదు.

    అతను నా జీవితంలో అందరికన్నా ముఖ్యుడయిపోయాడు. సహజమేగదా. మన గురించి అన్నీ తెలిసిన వాడిని మనం అభిమానిస్తాం.''

    అతను తనని తను మరిచి ఏదో లోకాల్నుంచి మాట్లాడ్తున్నట్లుగా చెప్పుకుపోతున్నాడు.

    నాకు కాస్త చిత్రమన్పించింది. ఎల్లయిసీ ఏజంటు పాలసీ యిచ్చే ఎవర్నైనా ఈ ప్రశ్నలన్నీ వేస్తాడు. ప్రపోజల్‌లో నింపడానికి. దీనిలో అతనంత యిదవ్వడానికేముందబ్బా! ఇంకా చెప్పుకు పోతున్నాడు.

    "నేనేం చదివానో అడిగాడు. ఎక్కడ చదివానో అడిగాడు. ఓసారా సర్టిఫికెట్టు కావాలన్నాడు. యిచ్చాను. నే నెక్కడ ఉద్యోగం చేస్తున్నానో, అం తకు ముందెక్కడ చేశానో అడిగాడు. నా ఎత్తు చూశా డు. నా బరువు చూశాడు. నా ఛాతీ కొలతలు వూపిరి తీస్తే ఎంతో, తియ్యకపోతే ఎంతో చూశాడు. నా పొట్ట చూశాడు.

    ఒకటా ... నా కాలి చిటికెన వేలు గోరు నించి నా తల వెంట్రుకల వరకూ, నా చిన్న కొడుకు నుంచి నా తాత ముత్తాతల వరకూ అందరి వివరాలూ తెలుసుకున్నాడు. అన్నట్లు నాకు యింకా పిల్లలు పుడతారో లేదో కూడా కనుక్కున్నాడు. ఆపరేషన్ ఎవరు చేయించుకున్నారు అని వాకబు చేశాడు.

    ఇతన్ని మించిన శ్రేయోభిలాషి లేడనుకొన్నాను.

    నాకు స్థలం ఎక్కడన్నా వుందా అని అడిగి, ఉంటే దానిలో యిల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఓ చక్కని ఫ్లాట్ కొనుక్కోడానికి లోను యిప్పిస్తానన్నాడు. నా ఫైనాన్షియల్ బడ్జెట్టు గురించి చర్చించాడు.

    నా భార్య క్కూడా నా గురించి అన్ని విషయాలు తెలియవు ...''

    అతను చెప్తోనే వున్నాడు. నిజమే. భర్త గురించి భార్యకైనా లేదా భార్య గురించి భర్త కైనా తెలిసేది తక్కువ. (భార్యా భర్తలనే కాదు. మిత్రుల గురించి కూడా). ఒకవేళ కాస్త ఎక్కువగా తెలిసిందా వాళ్లు ఆ సంసార లంపటాల్లో పడి కొట్టుకోలేరు. కాబట్టి ఎవరి గురించైనా ఎవరికైనా ఎంత తక్కువ తెలిస్తే వాళ్ల సంబంధాలు అంత ఎక్కువ కాలం వుంటాయి. 

    "ఇంతకీ అసలేమయిందండీ'' అన్నా ను ఆయన్ని ఆపుతూ. మరేం చెయ్యను. నేను కాఫీ తాగేశాను. ఆయనింకా మొదలే పెట్టలా.

    "అదే చెప్తున్నా! అన్ని వివరాలు నా గురించి తెల్సుకున్నాడా! నేను పాలసీ చేశానా ... నాకు ఆ పాలసీ కూడా నిన్ననే రిజిస్టర్ పోస్టులో వచ్చింది. వెంటనే ఆ ఏజంట్ గుర్తొచ్చాడు. ఎంత మంచివాడో కదా అనుకున్నాను. ఆఫీస్ అయ్యాక వస్తున్నా. బస్టాండులో నిలబడ్డా. ఆ ఏజంటు అప్పుడే అటు వచ్చాడు. నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్లిపోయాడు. నన్నెవరో ఆకాశంలోనుంచి కిందికి తోసినట్టనిపించింది.

    నా గురించి అన్ని తెలుసుకుని, అంతా తెల్సుకొని, ఏమీ తెలియనట్టు, అసలు నేనే తెలియనట్టు ఎలా ... ఎలా వెళ్లిపోయాడు. రాత్రంతా నిద్ర లేదు.

    అందుకే...అందుకే ఇవ్వాళ ఆఫీసుకి శలవుపెట్టి యిటొచ్చా. క్యాన్సిల్ ... క్యాన్సిల్!''

    ఆయన 'క్యాన్సిల్' అనే కేక విని బిల్లు తీసుకొస్తున్న సర్వర్ 'ఈయనేంటి కాఫీ తాగి బిల్లు క్యాన్సిలంటున్నాడు?' అన్నట్టు బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోయాడు.

    ఇంతలో ఏదో చూడరానిది చూస్తున్నట్టు అతని కళ్లు 'ఇంతింతై వటుడింతై' అన్నట్టు ఆశ్చర్యంతో, కోపంతో పెరిగి పెరిగి అలా నిల్చి చూస్తున్నయ్. అతను చూస్తున్న వైపు చూసిన నాకు అప్పుడే వచ్చి అవతల టేబుల్ దగ్గర కూర్చుంటున్న మా కేశవరావు కనపడ్డాడు. 

    "అరే, కేశవా... ఇక్కడికి రా'' అని కేకేసి, అతని కేసి చూసి "కేశవరావనీ నా స్నేహితుడు'' అన్నాను. అప్పటివరకూ కేశవరావు వైపు 'ఇంతింత కళ్ల'తో చూస్తున్న అతను నేను ఆ మాట అనగానే నావైపు చూశాడు. 

    ఇంతలో కేశవరావు నా దగ్గరకొచ్చి నా పక్కన నిలబడి "మిమ్మల్నెప్పుడో చూశానే'' అన్నాడు. ఎప్పట్లాగే నాకు ఒళ్లు మండింది. అయినా తమాయించుకుని "ఏడిశావులే. కూర్చుని తగలడు. నేను ముత్యాన్ని'' అన్నానో లేదో -

    వెర్రి నవ్వొకటి నవ్వి "అరే ముత్యం నువ్వా'' అన్నాడు కేశవరావు.

    "నీ మతిమరుపుతో చంపుతున్నావు గదరా'' అన్నాను.

    ప్రశ్నార్థకంగా నావైపు చూస్తున్న అతనికి మావాడ్ని పరిచయం చేస్తూ "అన్నట్లు వీడు ఎల్లయిసీ ఏజంట్'' అన్నాను.

    "నాకెందుకు తెలియదూ. నేనింతసేపు చెప్పింది ఈయన గురించేగాదూ'' అన్నాడతను.

    "ఈయనెవరు'' అన్నాడు నెమ్మదిగా కేశవరావు.

    "ఊ'' అని దీర్ఘంగా మూలిగాడు అతను.

    ఆ మూలుగుకే బలముంటే దేశంలో వున్న మతిమరపు వాళ్లంతా మసై పోయుండే వాళ్లే.

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16 అక్టోబర్ 2011 సంచికలో ప్రచురితం)
Comments