లోపలి సడి - దాట్ల దేవదానం రాజు

    
గడియారంలోని ముళ్ళ కోణాల ఆధారంగా టైము తెలుసుకున్నాను. దండెం మీద ఆరేసిన ముడతల గడియారం అది.

    నాలో ఉద్వేగం. అనేకానేక భావ సంచలనాల సడి కుదిపేస్తూంది.

    ఇంకా గంట వుంది. నాలో ప్రకంపనాలు మొదలయ్యాయి.

    పదకొండూ నలభై అయిదు కోసం ఎదురుచూడాలి.

    నార్మల్ విన్సింట్ పీలే పవర్ ఆఫ్ పోజిటివ్ థింకింగ్ కాసేపు తిప్పుదామని తీశాను. ఇంతట్లో రిమోట్‌తో తగ్గించలేని రొద.

    ఇంట్లో చానల్ మార్చడమే కష్టం. సౌండ్ తగ్గింపు పర్వాలేదు. హాలులోకి వెళ్ళి చప్పుళ్ళ పీక నొక్కాను.

    గదిలోకొచ్చి కిటికీ దగ్గరకు నడిచాను. కిటికీ తలుపుతీసి రోడ్డు వార జోళ్ళు కుట్టే వాడికేసి చూశాను. వేలికి గుచ్చుకున్న సూది బాధ ఓర్చుకుంటున్నాడు, పళ్ళ బిగువన. కిటికీ తలుపు మూసి మంచం మీద కూర్చున్నాను.

    ఎంతకీ నిముషాల ముళ్ళు కదిలి కదిలి గంట అవ్వదేం? బ్యాటరీ సెల్ వీక్ అయినట్లు కాలం నెమ్మదిగా కదులుతుందా?

    గోడ మీద సాయం సంధ్య చిత్రం. నది అలజడిగా వుంది... నురుగులు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి... తీరాన రాటకు కట్టిన నావ... దూరంగా తెల్లగా ఎగురుతున్న పక్షులు... మేఘాలు... నీటి మీద వాటి నీడ... ఎరుపు పులుముకున్న వాతావరణం... రోజూ చూస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వింత అనుభూతి.

    మరో గోడ మీద పర్వతాలు... లోయలు... పసిడి పువ్వుల మొక్కలు - నేను మంచి గొఱ్ఱెల కాపరిని, నా గొఱ్ఱె నాకు తెలుసు - దిగువన ఇంగ్లీషు అక్షరాలు.

    మీద తిరుగుతున్న ఫ్యాను. ఇలా పడుకుండనే ఎపుడో ఊడి పడి పోతుందన్న ఫీలింగు... అలవాటైన చప్పుడు...

    ఈ వేళ రాజ్‌కుమార్ చెప్పిన సమయానికి తప్పక మాట్లాడాలి. పావు తక్కువ పన్నెండు గంటలకు మాట్లాడమన్నాడు. నేను ఇస్తానన్న డబ్బుకి పని జరుగుతుందో లేదో చెబుతానన్నాడు.

    పని అవుతుందో లేదో ఈ వేళ తేలి పోవాలి. కొంచెం గౌరవంగా నెమ్మదిగా ప్రాధేయపడుతూ మాటలు చెప్పాలి. అవతలి మాటల్ని శ్రద్ధగా వింటూ వినమ్రత చూపాలి.

    టైమెంతయ్యిందో?

    చచ్చీ చెడి అరగంట కూడ కాలేదు. ఇంకా ఒక అర్గంటను ఈడ్చాలి. ఒకటే టెన్షన్ పెరిగిపోతూంది.

    ముందు టెన్షన్ తగ్గాలి. ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తే మాట్లాడాల్సిన విషయం రిహార్సల్ దెబ్బతింటుందేమో...! గొంతు సవరించుకున్నాను, మైకు ముందు మాట్లాడేవాడిలా. వంట గదిలో కెళ్ళి ఫ్రిజ్‌లోంచి మంచినీళ్ళు తాగాను. తిరిగొచ్చి తలుపులు బిగించాను.

    రాజ్‌కుమార్ తనే చేస్తాడేమో? వాడి దగ్గర నా ఫోను నెంబరుంది.

    వాడెందుకు చేస్తాడు? అవసరం నాది. నిజంగా అతను ఫోన్ చేస్తే నేనెనం మాట్లాడాలో అనుకోలేదు కూడా.

    ఖచ్చితంగా అతను చేయడుగాక చేయడు. గదిలో ఫ్యాను హోరు... కరకరమని మింగుతానంటుంది. అంతర్లీనంగా నలుగుతున్న ఆలోచనలు మూగగా... చేతిలో పుస్తకాన్ని గది మూలకు విసిరేసాను. 

    బీరువా తాళం తీసి డబ్బు కట్టలు బయటకు తీసాను. ఒకసారి అరచేతిలో తూకం వేసుకుంటూ "ఇవన్నీ వాడికిచ్చేయాలి... అయినా ఒప్పుకుంటాడో లేదో...ఒప్పుకుంటేనే బాగుండును. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను"

    ఖరీదు పెట్టి కొనకుండా ఏదైనా ఎలా వస్తుంది? భయం భయంగానో, అవసరంగానో కొనాల్సిందే. గుట్టు చప్పుడు కాకుండా కొనే సరుకులూ ఉంటాయి.

    గదంతా చిందరవందరగా వుంది. ఇలాగుండటమే నాకిష్టం. సర్దితే మనుషులు మసలుతున్నట్లు అనిపించదు. ఎక్కడబడితే అక్కడ పేజీలు ఎగురుతూ కనిపించాలి. పేజీలు పిలుస్తున్నట్లుంటేనే గమ్మున ఆపుస్తకం చదవాలనిపిస్తుంది. నీటుగా పేర్చిన పుస్తకాలు ఇక చదవడమెందుకు? ఒక ఫలానా టైము కోసం ఎదురుచూడ్డం ఒక రకంగా శిక్షేనా?

    ఇరవై నిముషాలుంది.
 
    ఫోన్ దగ్గరకు కుర్చీ జరిపాను.

    కుర్చీ మీద కూర్చుని ఊపిరి పీల్చాను, ఫోను ముట్టుకుని రిలాక్స్‌గా కుర్చీలో వెనక్కి వాలి...

    కాలింగ్ బెల్ చప్పుడు.

    'ఇపుడెవరొచ్చారో... నన్ను చంపుకు తినడానికి' ఉస్సురని లేచాను.

    బయటకు రాగానే చందాల పుస్తకం ముఖం ముందు పెట్టాడు. రక్తదానాలు చేసేవాడట. రోజూ ఆస్పత్రిలో రక్తం దానం చేస్తాడట. తెల్లగా పాలిపోయి వున్నాడు. వాడి పుష్టికరమైన ఆహారానికి చందా కావాలిట. అంతా నాటకం. పొట్టకూటికి కొత్తగా చేరిన వృత్తి భాగోతాలు. తెలుసున్నవాడిలా స్నేహంగా నవ్వుతున్నాడు.

    "ఇలా అడుక్కోవడానికి పోలీస్ స్టేషన్‌లో పర్మిషన్ తీసుకున్నావా? ఎదీ కాగితం?"

    బిక్కమొహం వేసాడు వెర్రి పీనుగ.

    "పోరా...పో..." ఒక్కుదుటున తలుపులు మూసి లోపలికొచ్చేసాను.

    రాజ్‌కుమార్ పేరులో హుందాతనం వుంది. జీన్స్ ప్యాంట్...టీ షర్ట్...బెల్టు... దానికి సెల్‌ఫోను... స్టైల్‌గా...

    సెల్ నంబరు లేదు నా దగ్గర.

    అతను ఇపుడే అక్కడే నెంబరు దగ్గర వుంటాడా? చెప్పిన టైముకు దొరుకుతాడా?

    'అవతల తీవ్రవాదంతో ప్రపంచం మండిపోతూంది'

    'ఒక దేశంలో రెండు బిల్డింగులు కూలిపోతే... లోకానికి వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీనా?'

    'పాకిస్తాన్ వాడికి ఈసారి బాగా అవుతుంది... అహహా...'

    'కొడుకుని చంపిన తండ్రి...తాగొచ్చిన కొడుకు దౌర్జన్యం భరించలేక...ప్చ్...పాపం'

    'వాకింగు చేస్తూ గుండెపోటుతో... హరీ...'

    'ఫైనాన్స్‌కంపెనీల చీటింగు...డిపాజిట్‌దారుల గగ్గోలు'

    లేదు. ఇక నెంబరు కోట్టాలి.

    నాకు బాగా తెలుసున్న నంబరే. అయినా డైరీ చూడాలి.

    అవునూ, డైరీ ఏదీ?

    లైటు వేసాను.

    డైరీ వెదికి తెచ్చి నంబరుగల పేజీని ఒక చేత్తో అదిమి పట్టుకుని రెండో చేత్తో ఫోను రిసీవరు చెవికి ఆనించుకుని భుజంతో బేలన్సు చేసుకుని నొక్కుకుంటూ... చేతిని నెమ్మదిగా కిందికి విడిచి... వేలితో ఒక్కో నెంబరునీ...

    అంత గట్టిగా అంకెల్ని నొక్కుతారేంటి, అసహ్యంగా అంటాడు మావాడు. నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఇపుడు మాత్రం అతి సుతారంగా నొక్కుతున్నాను. రాజ్‌కుమార్‌కు అసలు దెబ్బ తగలకూడదు.

    రింగవుతూంది. రాజ్‌కుమార్ నా ఎదురుగా కూర్చున్నట్లు ఫీలవుతున్నాను. కొంచె ముందుకు వినయంగా వంగాను. ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాను.

    చెమటతో తడిసి ముద్దవుతూ... చెవిలో రహస్యం చెప్పేవాడిలా ఊపిరి బిగపెట్టుకుంటూ...

    రింగవుతూంది. ఎవరూ ఎత్తడం లేదు.

    కాస్త ఊపిరి పీల్చుకున్నాను. డాక్టరు బి.పి.నియంత్రణ కిచ్చిన మాత్రలు ఎపుడూ మరచిపోను. రక్తం వేగంగా శరీరంలో పరుగెడుతూంది.

    క్షణక్షణం అవతలవైపు ఫోన్ ఎత్తిన క్లిక్‌మనే చప్పుడుకు ఎదురుచూపు.

    రింగ్ ఆగిపోయింది. ఫోన్ పెట్టేసాను.

    అమ్మయ్య అనుకున్నాను. ఎందుకో వెనుకగా వెచ్చని ఊపిరి... ఎవరో ఏదో చెబుతున్నట్లు... వెనక్కి తిరిగాను. మళ్ళీ కంచెలతో బాదినట్లు... ముఖం నిండా పేడ పులుముకుని... గజ్జికుక్క ఏడుపులాంటి నవ్వుతో...

    ఎవరైనా కనబడతారేమోనని చూసాను; ఎవరూ లేరు.

    'అంతా భ్రాంతియేనా జీవితాన...'

    రాజ్‌కుమార్ నెంబరు మళ్ళీ నొక్కాను, అతి జాగ్రత్తగా. రాజ్‌కుమార్ చాలా మంచివాడు. చాలా అందంగా మాట్లాడతాడు. కలుపుగోలుగా వుంటాడు. స్పష్టంగా తను చెప్పాల్సింది చెబుతాడు. అహం మచ్చుకి కనబడదు.

    రాజ్‌కుమార్‌ని తప్పుపట్టలేను. రాజ్‌కుమార్‌లు సమాజంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యవస్థలోని చట్టాల్ని బహునేర్పుగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. డబ్బులు సంపాదిస్తారు. అదృష్టం అంతా రాజ్‌కుమార్‌దే.

    మరలా రింగవుతూంది. అక్కడెవరో వున్నట్లు లేదు.

    రాజ్‌కుమార్‌కి ఏదైనా ప్రమాదం జరిగిందా?

    ఎముకలు విరిగి... ఆస్పత్రి పాలయ్యి... కట్టులతో... హృదయ విదారకంగా...

    నో... నో... అలా జరగకూడదు.

    నా పని  తప్పకుండా రాజ్‌కుమార్ చేస్తాడు. మంచివాడైన రాజ్‌కుమార్ మాట తప్పడు.

    బేరాన్ని ఎవరైనా తన్నుకుపోతారేమో... భయం... నాకుండక్కర్లేదు.

    'రాజ్‌కుమార్‌తో ఈవేళ ఇంక మాట్లాడలేను' విచారంగా అనుకున్నాను.

    కరెంటు మళ్ళీ మళ్ళీ పోతున్న ఆనవాళ్లు ఎవరూ చెరపలేరు. చీకటి వెలుగుల ఆటలు ఎవరూ తప్పించుకోలేరు.

    మావాడికి ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం లేక మానసిక వేదన అనుభవిస్తున్నాడు. అది రాజ్‌కుమార్ చేతిలో వుంది. నా శక్తికి మించి పోగు చేసిన డబ్బులు వాడి మొఖాన కొట్టాలి... సారీ...

    అటునుంచి రాజ్‌కుమార్ మాట్లాడితే బాగుండును. అతను మాట్లాడడు.

    నేనే వెళ్లాలి, మాట్లాడాలి, ఎప్పటికైనా...

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1,జూన్,2002 సంచికలో ప్రచురితం)  
Comments