లోపం లేని చిత్రం - వనజ వనమాలి

    
"ఇప్పటి వరకు ఇంటిపనులే  సరిపోయాయి. మళ్ళీ అవి ముందేసుకుని కూర్చోక పొతే కాసేపు పడుకో రాదు..." అని  కోడలిని కాస్త మందలిపు కలపిన ప్రేమతో ఆన్నారు  అత్త వర్ధనమ్మ. 

    "లేదత్తమ్మా...  విశ్రాంతి సమయంలో కూడా ఇలా ఇష్టమైన పని చేస్తేనే నాకు నిజమైన విశ్రాంతి. ఇది ఒక పని అనుకోను" అప్పటికే స్టాండ్ బిగించుకుని కలర్ మిక్సింగ్  చూసుకుంటూ చెప్పింది హేమ.

    ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఓపిక తగ్గినప్పుడు చేసి పెట్టడానికి ఎవరూ లేనప్పుడు తెలుస్తుంది... ఆరోగ్యం విలువ" అని అంటూ తనూ కోడలి ముందు కూర్చుంది. 

    "దేవుడి దగ్గర ఎగ్రిమెంట్ చేసుకుని వచ్చి మీరు ఉంటారుగా" అని నవ్వింది కోడలు. దానికి అత్తగారు నవ్వుకుంది. అదీ ఆ అత్తకోడళ్ళ అనుబందం. చూసేవారికి కనువిందుగా... మరి కొందరికి మూతి విరుపు ముక్కు విరుపుగా. 

    కోడలి చేతిలో వంపులు తిరుగుతూ రంగులు అద్దుకుంటూ సహజాతి సహజంగా ఓఅందమైన చిత్రరాజం రూపు దిద్దుకుంటోంది. ఆ వేళ్ళ కదలికల్ని రంగుల మేళవింపుని, ఏకాగ్రతని చూస్తూ 'కోడలికి  తన దిష్టే తగిలేట్టుంది' అనుకుంది. కొడుకు కన్నా కోడలు అపురూపం ఆమెకి. పెళ్లి అయిన మర్నాటి నుండి రుబ్బు రోలులో  పొత్రం ఎటు వైపు  తిప్పాలో కూడా  తెలియకుండా పెరిగి వచ్చిన పిల్ల  గిరగిర పొత్రంలా తిరుగుతూ ఆ ఇంటికే చైతన్యం తెచ్చింది. సూక్ష్మగ్రాహి. ఎవరి మనసులో ఏముందో పసికట్టి వాళ్లకి నచ్చినట్లే చేస్తుంది. ఇంటా బయటా అందరి నోటి వెంటా "హేమమ్మా" అనే పిలుపులే. 

    'పెద్దదాన్ని నేనొక దానిని ఉన్నానని మర్చిపోయారు. ఇంకో అత్తగారైతే కోడలి పెత్తనం కొరివితో తలగోక్కున్నట్లు ఉన్నదని ఆడిపోసుకునే వారు. అత్త అనే హొదానో,లేదా పెద్దరికాన్నో ప్రదర్శించాలని ఆలోచన చేసి ఆచరణలో చూపించక ముందే పసి గట్టి "అయ్యో..!అన్నీ నన్ను అడుగుతారు ఏమిటీ!? నాకేం తెలుసు... అత్తమ్మ ఉన్నారు. ఆవిడని అడగండి" అంటూ తన ముందర కాళ్ళకి బంధం వేసినట్లు మాట్లాడేది గడుసు కోడలు. ఇంకేం అధికారం చూపిస్తాం అంతా  ఐస్...ఐస్... ఐస్..'.  అవి తెలితేటలో, లేదా గడుసుతనమో తెలియడానికి ఓ నాలుగేళ్ళు పట్టింది ఆవిడకి.

    నిజంగానే కోడలు బంగారం వంటి మనసున్న పిల్లే. కానీ... భర్తతోనే గొడవ పడుతూ ఉంటుంది. ఆడ జన్మలు కొన్ని కొన్ని సర్దుకోవాలమ్మా..అంటే వినదు. మొండితనం అనడానికి వీల్లేదు. నిక్కచ్చిగా... మాట్లాడటం హేమ  అలవాటు. ఎదుటి మనిషి తిరిగి అనడానికి కూడా ఏమి ఉండేది కాదు. అలా కాసేపే... మళ్ళీ అత్తమ్మా... అంటూ పలకరించేది. ఇలా కోడలి గురించి.. మంచి చెడు బేరీజు వేసుకుంటోంది.  

    హేమ తను పూర్తి చేసిన చిత్రాన్ని రకరకాల కోణాలలోకి మార్చి చూసుకుంటూ..తుది మెరుగులు దిద్దుతోంది. అది ఒక అందమైన ప్రకృతి చిత్రం! ఎక్కడో ఏదో లోపం. లోపం ఉన్న చిత్రానికి పైపై మెరుగులు దిద్ది నగిషీ పెట్టి ఆ లోపాన్ని పూడ్చి అందంగా చూపించవచ్చు. కానీ హేమకి అలా ఇష్టం లేదు.

    "ఇక వదిలేయరాదూ... బాగానే ఉంది కానీ" అంది వర్ధనమ్మ.

    "మనం స్వయంగా చిత్రించుకున్న చిత్రం జీవితంలాటిది. జీవితచిత్రంలో లోపాలు చిత్రిస్తారా ఎవరైనా? ఒకవేళ లోపాలు ఉన్నా ఎన్నిమెరుగులు దిద్దినా, నగీషీలు పెట్టినా కూడా కనబడే లోపం లోపమే కదా. చూసే కళ్ళని బట్టి చిత్రం ఉంటుందేమో కానీ లోపం తెలిసి సరిపుచ్చుకునే చిత్రకారుడు  ఉండడు. ఏ విధమైన లోపం లేకుండా ఉండాలనే చూస్తాడు" అంది హేమ.

    "ఏమిటో... నీ మాట ఒక్కటి అర్ధం కాలేదు" అంది వర్ధనమ్మ. 

    "అర్ధం చేసుకునే తత్త్వం మీకు ఉందిలెండి" అంటూ లోపం ఉన్న చిత్రాన్ని స్టాండ్ నుండి తీసి ఉండచుట్టి పడేసింది హేమ.

    "అమ్మా.. చిన్న బాబు ఉన్నాడా.." అంటూ వచ్చాడు ఎదురింట్లో ఉండే సుధాకర్. అతను వాళ్ళ ట్రాక్టర్ కి డ్రైవర్ గా చేస్తుంటాడు. 

    "ఫ్యాక్టరీకి వెళ్లి ఇంకా రాలేదు. ఇంకా బళ్ళు అన్లోడ్ కాలేదు అనుకుంటాను. నువ్వు వెళ్ళవా? నువ్వు వెళితే కానీ చిన్న బాబు ఇంటికి రాడు" వెళ్ళమని  చెపుతున్నట్లు చెప్పింది వర్ధనమ్మ.

    "లేదమ్మా... నేను వెళ్ళదలచుకోలేదు" చెపుతున్నాడు. మనిషి బాగా తాగినట్లు ఉన్నాడు. మాట తూలుతూ ఎర్రబారిన కళ్ళతో అసహ్యంగా కనిపించాడు. అతనిని ఆ అవతారంలో చూసి కొంచం అసహ్యంగా, భయంగా లోపలకి వెళ్ళబోయింది హేమ. 

    "హేమమ్మా నీతో మాట్లాడాలి కాస్త ఆగు" అన్నాడు అతను. అతని మాటల్లో తగ్గుతున్న గౌరవానికి చిరాకు పడుతూ "ఏం మాట్లాడాలి. అత్తమ్మ ఉన్నారుగా ఆవిడికి చెప్పు" అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే గదిలోకి రాబోతూ వర్ధనమ్మ అడ్డుగా ఉండేటప్పటికి ఆగిపోయాడు. 

    "మేము మీలా చేస్తే మీరు ఊరుకుంటారా? మేము మీ దగ్గర పనిపాటలు చేసేటొల్లమనే కదా ఎలా పడితే అలా మాట్టాడతారు" అంటున్నాడు.
 
    "ఏంటిరా ఒళ్ళు తెలియకుండా ఏమిటేమిటో మాట్లాడుతున్నావ్? అవతలకి పో! ఏమైనా మాట్లాడాలిసినది ఉంటే పెద్దాయన వచ్చాక రాపో"అని కోపంగా మాట్లాడింది వర్ధనమ్మ. 

    "నేను పెద్దాయనతోనో, చిన్న బాబుతోనో మాట్లాడటానికి రాలేదు మీ ఆడాళ్ళ తోనే మాట్లాడటానికే వచ్చాను.  నేను నిన్నటేల ఊర్లో లేకుండా జూసి నా ఇంటికి వెళ్లి నా పెళ్ళాం చేయి పట్టుకున్నాడట నీ కొడుకు. ఇప్పుడు ఆయన ఇంట్లో లేడని నేను ఆయన భార్య చేయి పట్టుకుని అడుగుతాను. మీరు ఊరుకుంటారా? అదేమని అడిగితె తాగి ఉన్నాడులే... పోనీయి అంటారు. ఇట్టా  రెండుసార్లు జరిగింది. అందుకే నేను ఆయన పెళ్ళాన్ని అలా చేయి పట్టుకుని అడగటానికి వచ్చాను" అని వాగుతున్నాడు. 

    లోపలి నుండి వింటున్న హేమకి అవమాన భారంతో తల నరికేసుకోవాలనిపించింది. ఏ మాత్రం రక్త పాతం కనిపించని అవమానపు కోత. సమాధానం చెప్పే తీరాలి. తరతరాలుగా.. స్త్రీ జాతికి జరిగే అవమానం ఇది అనుకుంది.

    "సుధాకర్ నువ్వు వెళ్ళు. చిన బాబు రాగానే నేను ఏం జరిగిందో అడుగుతాను. నువ్వు తాగి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. ఇంటికి వెళ్ళు..." అంటుంది బ్రతిమిలాడుతున్న ధోరణిలో కోడలు వాడి మాటలు వినడం ఇష్టం లేక. అప్పటికే జరిగేది జరిగిపోయింది. 

    హేమ చాలా ప్రశాంతంగా బయటకి వచ్చింది.  "ఏమిటి?" సుధాకర్ ని అడిగింది. 

    "నా పెళ్ళాన్ని మీ ఆయన చేయి పట్టుకుని సుజాత... వస్తావా? అని అడిగాట. నేను హేమ... వస్తావా? అని అడుగుతాను" అని రెండు సార్లు మళ్ళీ మళ్ళీ కావాలనే ఆమాట అంటూ సమీపంగా రాబోయాడు.

    అతను తనదాకా రాకుండానే తనే ముందుకు వెళ్లి అక్కడే  ఉన్న  చెప్పు అందుకుని  వాడి మొహం పై టప టపా వాయించి "ఇదిగో... ఇలా నీ పెళ్ళాం కూడా నా మొగుడిని కొట్టాల్సింది... అంది హేమమ్మ అని  వెళ్లి మీ ఆవిడకి చెప్పు " అంది హేమ.    

    అంతే... వాడి మొహం పై నెత్తురు చుక్క లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా   వెళ్ళిపోయాడు.  "వాడిని అలా కొట్టావు. వాడు ఏమైనా చేస్తే... ఇక్కడ అంతా వాళ్ళ బలం" అంది వర్ధనమ్మ 

    "తప్పు ఎవరిది? మన దగ్గర పని చేస్తున్నారు కదా అని పేదవాళ్ళు , శీలం అంటే విలువ తెలియని వాళ్ళు, నాలుగు డబ్బులు పడేస్తే మెదలకుండా పడి ఊరుకుంటారు అని అహంకారంతో, ధీమాతోనే కదా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్లి మరీను, లేదా పొలాల్లో ఒంటరిగా దొరికితేను వాళ్ళ ఆడవాళ్ళని ఆడుకోవడం మదపు చర్య అవదూ?" అడిగింది ఆవేశంగా హేమ. 

    "ఇక్కడ ఇవన్నీ మామూలే. వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం లేదని అలాటి పన్నాగాలు పన్ని డబ్బు గుంజుతారు" అంది ఆవిడ.
 
    "అన్యాయంగా కొడుకుని వెనకేసుకుని వచ్చి సమర్ధించకండి అత్తమ్మా"  అంది కోపంగా హేమ. 

    "లేదు హేమ పొలాల్లో పనిపాటలు చేసుకునే వాళ్లకి ఇవి మామూలే! వదిలేయి" అంది.

    "మరి ఇంకేం? వాడు ఇప్పుడు నన్ను అలా మాట్లాడటం మామూలే అనుకోమంటారా?" అడిగింది  రగిలిపోతూ హేమ. 

    "మొన్నటికి మొన్న టౌన్ కి హాస్పిటల్కి వెళ్లి వస్తుంటే ప్రక్కన ఊరికి చెందిన ఒకామె నా కన్నాముందు బస్ ఎక్కింది. నన్ను ఎవరో పలకరించి నేనెవరో ఆమెకి  చెప్పగానే లేచి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి మరీ గౌరవంగా   చెప్పింది ఇలా 'మీ ఇంటాయన వూర్లో ఆడవాళ్ళని బతక నీయడా. తెగ అల్లరి పెడుతున్నాడు. ఏం పద్దతి అది. మిమ్మల్ని అంటే ఊరుకుంటారా?'  అని. ఆమె చదుకున్న ఆవిడ కాబట్టి మర్యాదగా చెప్పింది. నేను అవమానంతో వెంటనే ఆ బస్ దిగిపోయాను. అది చాలదా..మనకి  గౌరవం మిగలడానికి" అంది ఒకింత వ్యంగంగా.

    "అదేమిటో తప్పు చేసేది ఆయన .ఆ తప్పుకి నేను బాధ్యత వహించాలని అన్నట్లు నా వరకు విషయాన్ని లాక్కుని వస్తారు.  అది నాకు అవమానంగా ఉండదా? నేను లోకం లో గౌరవం కల వ్యక్తిగా బతకాలనుకుంటాను. భర్త మంచిచెడులు, కష్ట-నష్టాలు పంచుకోవడానికి నేను సదా సిద్దమే. కానీ... ఇలాటి అవమానాలా? నా వల్ల కాదత్తమ్మా  ఆయనలో  ఏ మార్పు లేదు. ఉచ్చనీచాలు మరచి అలా అచ్చోసిన ఆంబోతులా పడటం, కాముక ప్రవృత్తిని భరించడం నా వల్ల కాదు. ఆడవాళ్ళు కాపురాలు కావాలనుకుని ఇలాటివన్నీ భరించడం, నిజం ఏమిటో తెలుసుకున్నాక కూడా ఏమి తెలియనట్లు నటిస్తూ బ్రతకడం ఆత్మహత్యా సదృశ్యం అనిపించుకోదూ?" అంది ఆవేదనగా.

    "మీరు చదువుకున్నవాళ్ళు గనుక  మీకు ఇవన్నీ తప్పు అనిపిస్తాయి. ఇలాటివి మా తరం ఎన్నో చూసి ఉంటాయి" అంది అనుభవం చెపుతున్నట్లు. 

    ఆ రోజు రాత్రి ఓ పెద్ద యుద్దమే జరిగింది ఆ ఇంట్లో.  "నేను ఆ డ్రైవర్ గాడి పెళ్ళాం పట్ల అసభ్యంగా ప్రవర్తిన్చానో లేదో నిరూపణ అయ్యాక కదా నీకు కోపం రావాలి. వాడిని అనవసరంగా కొట్టావు. వాడు అది  మనసులో పెట్టుకుని కక్ష కట్టి నన్ను ఏమైనా చేస్తే ఎవరికి నష్టం? నీకేగా" అంటూ సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నభర్త  తీరుకి అసహ్యం కల్గింది హేమకి. 

    "ఇదిగో చూడు నీలో నూరు తప్పులని క్షమించే గుణం నాకు లేదు. నేను అసలు  పెద్ద ప్రతివతా శిరోమణిని కాదు. భర్త మదమెక్కి   చేసే పనులకి నేను నా అభిమానాన్ని,గౌరవాన్ని,విలువని పోగొట్టుకున్న భార్యగా బ్రతకడం కన్నా ఇంకో సిగ్గు చేటు ఇంకోటి లేదు. నీ కన్నా ఆ డ్రైవర్ యే నయం. పెళ్ళాం చేయి పట్టుకున్నది ఎవరైనా సరే... ఆ పట్టుకున్న వాడి ఇంటికే వచ్చి వాడి పెళ్ళాం కి అలాటి అవమానం కల్గించి వెళ్లాలని ప్రయత్నం చేసి వెళ్ళాడు చూడు వాడు మగవాడు" నిదానంగా ఒక్కొక్క  మాటే ఒత్తి పలుకుతూ చెప్పింది. 

    "హేమా గొడవ పెరుగుతుంది. ఊరుకో..." సర్దిపెట్టాలని చూసింది వర్ధనమ్మ. 

    "మీరుండండి అత్తమ్మా..." అంటూ హేమ భర్తని ఏహ్యభావం తో అడిగింది.

    "భార్య అంటే భర్తకి అన్నిటికన్నా మించిన ఆస్తి. ఆ ఆస్తి ని పదిలంగా కాపాడుకోలేనివాడు. తన ప్రవర్తనవల్ల  ఇతరల గౌరవంకి భంగం కల్గించేవాడు, పరుల చేత హీనం గా మాటలు అనిపించేవాడు భర్త ఎలా అవుతాడు? అంతకన్నా భర్త లేడని అనుకోవడం ఉత్తమం"  అంటూ తన పెట్టె సర్దుకుని బయట పడుతూ

    "హేమా నేను ఎందుకు  చెపుతున్నానో విను... వినమంటున్నాను కదా!" చేతిలో ఉన్న పెట్టెని లాక్కోబోయింది 

    "అమ్మా దాన్ని వెళ్ళనీ...  కుక్కలాగా మళ్ళీ అది  ఇక్కడికే రాక  ఏం చేస్తుందో చూద్దాం" అంటున్నాడు మగ అహంకారంతో.  

    ఆ అహంకారం పై, విశృంఖలత్వం  పై ఒకే  ఒక చిరునవ్వు చెంప దెబ్బ వేసి ఈ విశాలమైన ప్రపంచంలోకి కాలు బయట పెట్టింది హేమ. లోపాలు  ఉన్న  చిత్రాన్ని చింపి పడేసినంత తేలికగా  లోపాలు ఉన్న వ్యక్తి ని మార్చలేక... తను అవమానాలు దిగమింగి రాజీ పడలేక.       
Comments