మా బాదం చెట్టు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

    నా చిన్నప్పటి విషాయాల్లో నాకు గుర్తున్న వాటిలో ప్రధానమైనవి ఈ మాటలు. తరచూ నేను మా అమ్మని అడిగేవాడిని.

    "అమ్మా! ఆ బాదం చెట్టుని ఎవరు కనుక్కున్నారు?"

    "నువ్వేరా, నీ చిన్నప్పుడు ఓ రోజు నువ్వు నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి చెప్పావు.

    'అమ్మా! మనింట్లో ఓ మామిడి మొక్క వచ్చింది. చూపిస్తారా.'నేను, నువ్వూ కలిసి అక్కడికి వెళ్ళాం. సన్నటి, చిన్న మొక్కని చూపించావు నువ్వు.

    'అది మామిడి కాదురా! బాదం మొక్క' అని చెప్పాను నేను. నీకు గుర్తుంది కదా?"

    లేకపోయినా ఉందనే వాడిని. మా మధ్య రెండు మూడు రోజులకోసారి ఈ సంభాషణ జరిగేది. 

    ఇప్పుడనిపిస్తోంది, అది నిజమై ఉండదని. ఎందుకంటే నేను బాల్యంలో ఉండగానే అది బాగా ఎదిగి కాయలు కాస్తోంది. 

    నా చిన్నతనంలో విజయవాడలోని సత్యనారాయణపురంలోని చాలా మంది ఇళ్ళల్లో మొక్కలు పెరిగేందుకు ఖాళీ స్థలం ఉండేది. దొడ్డిగా వ్యవహరించే ఆ స్థలంలో చాలా ఇళ్ళల్లో మామిడి, కరివేపాకులాంటి చెట్లతో పాటు బాదం చెట్టు కూడా ఉండేది. ఐతే మా సందులో మాత్రం కేవలం మా ఇంట్లోనే బాదం చెట్టుండేది. అంచేత రిక్షావాడికి గుర్తు చెప్పేటప్పుడు 'బాదం చెట్టిల్లు' అని మా సందులోని వారంతా చెప్పేవాళ్ళు.

    వేసవిలో ఆ బాదం చెట్టు బాగా కాయలు కాసేది. మా పిల్లలందరికీ దాని కాయలు చూస్తే పండగే. మాలో పెద్దవాడైన రామం బాదం చెట్టెక్కి కాయలని కోసి కింద పడేసేవాడు. మేం వాటిని పంచుకుని కంకరరాళ్ళు ఏరుకుని వచ్చేవాళ్ళం. ఆ ఆకుపచ్చ కాయలని అడ్డంగా ఇంకో రాతిమీద ఉంచి గట్టిగా దెబ్బలు వేస్తే పై తొక్కు చీలి లోపలి పెంకు చప్పుడు చేస్తూ పగిలేది.  అందులో సన్నగా పొడుగ్గా బాదం పప్పు ఉండేది. అది ఎంతో రుచిగా ఉండేది. కొన్ని కాయల్లో బాదంపప్పు సన్నగా రేకులా అప్పుడే ఏర్పడుతూ ఉండేది. కండ ఉండేది కాదు. వాటిని తినకుండా పారేసే వాళ్ళం. కొండొకచో రాతి దెబ్బ బాదం కాయ మీద కాక మా చేతుల మీద పడుతూండేది. వేలు చితికి రక్తం కారడం, పెద్దవాళ్ళు పసుపుని తడిపి రాసి తడి బట్టతో ఆ వేలుకి కట్టుకట్టడం చేసేవాళ్ళు. అది కుడి చేతి వేలైతే గాయం తగ్గేదాకా అన్నం స్పూన్‌తో తినడం గర్వంగా ఉండేది.

    వేసవిలో బాదం చెట్టు పై కొమ్మకి తాడుతో కట్టిన ఉయ్యాలమీద కూర్చుని వంతుల వారి లెక్క పెట్టుకుని ఊగేవాళ్ళం. మా ఇంట్లో చిన్నవాడినైన నాకు ఊగడానికి మిగిలిన వాళ్ళు ఎక్కువ అవకాశం ఇచ్చేవాళ్ళు. మా మూడో అన్నయ్య ఎక్కువగా నన్ను ఊపేవాడు. ఉయ్యాల పైకెళ్ళి కిందకి దిగేప్పుడు కళ్ళు మూసుకుంటే ఓ తమాషా అనుభూతి కలిగేది.

    నా కుడి చెవికి, కుడి కంటికి సరిగ్గా మధ్యగల చిన్న మచ్చ, ఓ రోజు ఉయ్యాల మీంచి పట్టుతప్పి కొద్ది దూరంలో ఉన్న రోలు మీద పడ్డ గుర్తు.

    రోజూ నిద్ర లేవగానే మేం బాదం చెట్టు కిందకి పరిగెత్తేవాళ్ళం. బాగా పండిన ఎర్రటి బాదం పళ్ళు నేల మీద రాలి ఉండేవి. పై ఎర్రటి తొక్కు తింటే తియ్యగా ఎంతో రుచిగా ఉండేది. చేతికి, బట్టలకి ఎర్రటి రంగు అంటేది. తర్వాత దాన్ని పగలకొడితే రుచికరమైన పెద్ద పప్పు ఖచ్చితంగా లోపల ఉండేది.

    ఒక్కోసారి బొగ్గుల కుంపటి మీద మా అమ్మ సత్తు గిన్నెలో కాచే చారులో బాదం పప్పులని మా అమ్మకి తెలీకుండా వేసే వాళ్ళం. అన్నం తినేటప్పుడు అవి ఎవరికి వస్తాయా అని చూసే వాళ్ళం.
 
    బాదం చెట్టు నీడలోనే మా ఆటలు సాగేవి. మిగిలిన చెట్లు అంత నీడని ఇచ్చేవి కావు. మా రెండో అన్నయ్య బాదం చెట్టు ఎక్కి సౌకర్యంగా ఉన్న ఓ కొమ్మ మీద కూర్చుని చదువుకునేవాడు. ఆటల్లో అయితే వాడు రాజు. ఆ కొమ్మ సింహాసనం. మేం సైనికులం కాబట్టి కింద నించునే వాళ్ళం. మంత్రి, సేనాధిపతి అంటే పక్కింటి చంద్రం, మా నాలుగో అన్నయ్య కింది కొమ్మల మీద కూర్చునే వారు. మాటల తోనే మా ఆటలు సాగేవి.

    "సేనాధిపతీ! పొరుగు రాజు సైన్యం ఎంత?" మా అన్నయ్య అడిగేవాడు.

    "మనకన్నా చాలా తక్కువ రాజా." జవాబు చెప్పేవాడు సేనాధిపతి.

    "మంత్రీ! మన ఊరి విశేషాలేమిటి?"

    "అంతా హాయిగా జీవిస్తున్నారు రాజా."

    నేను సేనాధిపతిగా ఉంటానని ఏడిచేవాడిని. ఆ మోజు తీరకుండానే నా బాల్యం గడిచిపోయింది. నేను పెద్దయ్యేసరికి అన్నయ్యలంతా ఉద్యోగాలు వచ్చి మా ఊరు వదిలి వెళ్ళిపోయారు.

    మా సందు చివర పూరి పాకలో అద్దెకుండే హనుమంతరావు మాస్టారు తరచూ మా ఇంటికి వచ్చి నేల రాలిన బాదం ఆకులని ఏరుకుని తీసుకెళ్ళేవాడు. ఆయన వాటిని విస్తళ్ళుగా కుట్టి అన్నం తినడానికి వాడుకునేవాడు.

    ఆయన విస్తళ్ళు కుట్టడం నాకు ఆనందంగా ఉండేది. చీపురుపుల్లని తీసుకుని దాన్ని మధ్యకి చీల్చేవారు. రెండు బాదం ఆకులని పక్కపక్కనే ఉంచి పూచిక పుల్లని వాటి అంచుల్లోకి చొప్పించి కుట్టి విరిచేవాడు. అలా రెండు పూచిక పుల్లలు పూర్తయ్యేసరికి ఓ గుండ్రటి బాదం విస్తరి తయారయ్యేది.

    ఆ చెట్టు మా ఇంటి కాంపౌండ్ వాల్‌కి దగ్గరగా ఉండడంతో కొన్ని కొమ్మలు బయట రోడ్డు మీదకి విస్తరించుకున్నాయి. రిక్షా వాళ్ళు దాని నీడలో రిక్షాలు ఆపుకునేవారు. దాంతో అది 'అనఫిషియల్ రిక్షా స్టాండ్'గా ఉపయోగించేది. వాళ్ళు అక్కడ మేక - పులి ఆటని డబ్బు పెట్టి ఆడుకునేవారు. అది చూడటం మాకు చక్కని వినోదం. 

    రోడ్డు ఊడ్చేవాళ్ళు దీపావళి మామూలుకి వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బు ఇవ్వద్దనే వాళ్ళం. ఎందుకంటే, నెలకోసారైనా వాళ్ళు మా నాన్నతో 'చెట్టు కొట్టించండి. ఆకులు రాలి రోడ్డంతా ఖరాబవుతోంది' అనేవాళ్ళు.

    ఒకోసారి మా అమ్మ కూడా మా నాన్నతో చెప్పేది బాదం చెట్టు కొట్టించేయమని. 

    "వెధవ చెట్టు. కూరా, పళ్ళూ ఇవ్వదు. వెధవ చాకిరీ. రాలే బాదం ఆకులని ఏరలేక చస్తున్నాను." అలాగేలే. బొగ్గుల రాముడితో చెప్పి కొట్టిస్తాను" అనేవారు.

    "ఒద్దండి నాన్నగారు. కొట్టించకండి" అనే వాళ్ళం మేం.

    "అలాగే" అనేవారు.

    బాదం చెట్టు మీది పక్షులు ఉదయం, సాయంత్రాలు తెగ అరిచేవి. బాదం చెట్టు మీద గోరింకలు, కాకులు గూళ్ళు కట్టుకునేవి. ఎప్పుడూ రామచిలుకలు కనిపించేవి. అవి బాదం పళ్ళని కొరికి తినడానికి వచ్చేవి. మా రెండో అన్నయ్య వాటిని పట్టుకుని పెంచుకోవాలని అనేక ప్రయత్నాలు చేసేవాడు. తాళ్ళతో తనకి తోచిన రీతిలో కొమ్మల్లో ఉచ్చులు ఏర్పాటు చేసేవాడు. కానీ ఒక్కదాంట్లో కూడా ఎన్నడూ ఒక్క రామచిలుక కూడా చిక్కుకోలేదు.

    ఇంకా వడ్రంగి పిట్టలు, పిచ్చుకలు, పొడుగుతోక పిట్టలు, గోరింకలు, పికిలి పిట్టలు ఇలా దాదాపు డజను రకాల పక్షులు బాదం చెట్టు మీద మాకు కనిపించేవి. కాకులు పండిన బాదం పళ్ళని తీసుకెళ్ళి ఇంకెవరి ఇంట్లోనో పడేసేవి. తరచూ నా స్నేహితులు, 'కాకి మీ బాదం పండుని తెచ్చి మా ఇంట్లో పడేసింది' అనేవారు.

    ఆకురాలు కాలంలో బాదం చెట్టు ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారి నేల రాలేవి. వాటిని ఏరే బాధ్యత పిల్లలది.

    ఓసారి పెద్ద గాలి వాన వచ్చి బాదం చెట్టు కొమ్మలు గాలికి కొన్ని కూలాయి. వర్షం వెలిసాక వెళ్ళి కొమ్మలకి ఉన్న బాదంకాయలని పిల్లలమంతా కోసుకున్నాం. ఎవరింట్లోనైనా పెళ్ళయితే నెల ముందే మా నాన్నగారు బాదం చెట్టు కొమ్మలని కొన్నిటిని కొట్టించి వాళ్ళకి పంపేవారు. దొడ్లో ఎండాక దాన్ని కట్టెల పొయ్యికి కట్టెల కోసం వారు వాడుకునేవారు. అలాంటి సందర్భాల్లో కూడా కొట్టిన కొమ్మల దగ్గరకి పిల్లలమంతా చేరి వాటికున్న బాదం కాయలని కోసుకునేవాళ్ళం. వాటి ఆకులని తెంపాల్సిన బాధ్యత కూడా మాదే.

    నాకు బాగా గుర్తు. ఓ రోజు ఆకులన్నీ తెంపాక పెద్ద వర్షం వచ్చి సందంతా నీటిలో, గోదురు కప్పలతో నిండిపోయింది.  వేగంగా ప్రవహించే ఆ నీటిలో మేం బాదం ఆకుల్ని వేస్తే అవి క్షణాల్లో మాయం అయ్యాయి.

    వేసవిలో ఆరు బయట బాదం చెట్టు కిందే మా పడకలు.

    మా నాన్నగారు ఆఫీస్ నించి రాగానే దొడ్లో తొట్లోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, ఓ సారి బాదం చెట్టు దగ్గర ఆగి తన చేతులతో కింది కొమ్మని ముట్టుకునేవారు. అంతదాకా చిరాగ్గా ఉండే మా నాన్నగారిలో చిరాకంతా తక్షణం మాయమయ్యేది. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చేవారు. పిల్లలందర్నీ పలకరించాకే, మా అమ్మ ఇచ్చే కాఫీ గ్లాసుని అందుకునే వారు.

    ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు  మళ్ళి బాదం చెట్టుదగ్గరి వెళ్ళి కింది కొమ్మనుంచి ఏదో అందుకున్నట్లుగా నటించి ఆఫీస్‌కి  వెళ్ళిపోయేవారు. కొత్తవాళ్ళకి ఆయన చర్య అర్థమయ్యేది కాదు. మమ్మల్ని అడిగితే గర్వంగా చెప్పేవాళ్ళం.

    "మా నాన్నగారికి ఆఫీస్‌లో ఎన్నో సమస్యలు. అయితే వాటిని ఇంట్లోకి తీసుకురాకూడదని రోజూ ఆఫీస్ నించి రాగానే వాటిని ఆ చెట్టు కొమ్మకి తగిలించాకే ఇంట్లోకి వస్తారు. మళ్ళీ మర్నాడు ఉదయం ఆఫీస్‌కి వెళుతూ వాటిని వెంట తీసుకువెళ్తారు."

    మా నాన్నగారు నవ్వుతూ వారికి చెప్పేవారు.

    "తమాషా ఏమిటంటే, ఉదయం నేనా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే, క్రితం సాయంత్రం నేను ఎన్ని సమస్యలని తగిలించానని నాకు గుర్తో అన్ని సమస్యలు ఉండవు."

    మా నాన్నగారి సంతానంలో మేం ఎవరం మా ఆఫీస్ సమస్యల వల్ల కలిగే చీకాకుని ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద చూపించి ఎరగం. మా నాన్నగారు మాకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండటానికే ఆ బాదం చెట్టుని వాడుకుని ఉంటారని నాకు పెద్దయ్యాక అర్థమైంది.

    మా బాదం చెట్టు కింద మా అక్కయ్య, చెల్లాయిలు ఎన్ని వందల సార్లు బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవారో! కొబ్బరాకుల బూరలతో మగ పిల్లల మంతా ఆ పెళ్ళికి సంగీతాన్నందించే వాళ్ళం.

    మేం స్కూల్ నించి రాగానే బాదం ఆకులు కోసి తెచ్చుకుంటే మా అమ్మ మాకు వాటిలో టిఫిన్ వడ్డించేది. 

    మేం ఆ ఇల్లు అమ్మి మరో ఊరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేను బాదం చెట్టు గురించి బాధపడ్డాను. కొత్త యజమాని దాన్ని ఉంచుతాడా? లేక ఆకులతో న్యూసెన్స్ అని కొట్టేయిస్తాడా?

    "నాన్నగారూ ఇల్లు కొనేవాళ్ళకి చెప్పండి, బాదం చెట్టుని కొట్టవద్దని" అంతా కోరాం.

    "అలాగే" ఒప్పుకున్నారు నాన్నగారు. 

    మేం ఆ ఇంటిని వదిలిన రెండేళ్ళ దాకా నాకు ఆ బాదం చెట్టు గురించిన ఆలోచన అప్పుడప్పుడూ వస్తూనే ఉండేది. నాలా మా బాదం చెట్టుని మర్చిపోనిది నాతో పాటు మా మూడో అన్నయ్య. హ్యస్టన్ నించి ఎప్పుడైన ఫోన్ చేస్తే, 'ఏరా బెజవాడ వెళ్ళావా? మన బాదం చెట్టు ఉందో లేదో చూసావా?' అని అడుగుతూంటాడు.

    కొన్నేళ్ళ తర్వాత ఓ సారి ఆఫీసు పని మీద నేను విజయవాడ వచ్చినప్పుడు ఓ సాయం సంధ్యా సమయంలో మా పాతింటిని చూడటానికి వెళ్ళాను. దూరం నించి చూస్తే, మా ఇంటి స్థానంలో నాలుగంతస్థుల అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కనిపించింది.

    నా మనసు బాధతో మూలిగింది. బాదం చెట్టు కొట్టేసి ఉంటారనుకున్నాను. దగ్గరకి వెళ్ళి చూసాను. నా కళ్ళు మిలమిల మెరిసాయి.

    ఉంది!

    అది ఆ బిల్డింగ్‌కి అడ్డు రానంత దూరంగా కాంపౌండ్ వాల్‌కి ఆనుకుని వుంది కాబట్టి కొట్టించలేదనుకున్నాను. అది నా చిన్నప్పటికన్నా బాగా విస్తరించుకుంది. మా నాన్న కొట్టించినట్లు ఎవరూ కొమ్మలు కొట్టించే శ్రద్ధ తీసుకున్నట్లు లేదు. పైకి పొడుగ్గా ఎదిగింది. రకరకాల పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. ఓ గోధుమ రంగు కుక్క దాని నీడలో పడుకుని నిద్రపోతోంది.

    ఆ చెట్టు కింద నిలబడితే నాకు చిన్ననాటి స్మృతులన్నీ గుర్తుకు వచ్చాయి. సేనాధిపతి కొమ్మ ఒక్కటే ఉంది.  మంత్రి కొమ్మని గుర్తు పట్టలేకపోయాను. ఉందో పోయిందో? రాజు సింహాసనం కొమ్మ మాత్రం కచ్చితంగా లేదు.

    కింద పడ్డ రెండు బాదం పళ్ళని ఏరి తీసుకున్నాను. ఒకటి చిలక కొరికింది. దానికంటిన మట్టిని కర్చీఫ్‌తో తుడుచుకుని తిన్నాను. ఎంత కాలానికి నా నాలుకకి ఆ బాదం పండు రుచి?

    రాతి కోసం చూసాను కాని అంతా సిమెంట్ ఫ్లోరింగ్. చుట్టు పక్కల నాకు కంకర రాయి కనపడలేదు. వాటిని కర్చీఫ్‌లో చుట్టి జేబులో వేసుకున్నాను.

    నేనుండే కాంక్రీట్ జంగిల్‌లో మా పిల్లలకి ఇంతవరకూ బాదం పప్పు రుచి తెలీదు. నా వెంట కారులో తెచ్చిన తాళ్ళతో వాటి కొమ్మలకి మూడు ఉయ్యాలలు కట్టాను.

    నేను కనిపెట్టానని చెప్పి నన్ను బాల్యంలో మా అమ్మ ఆనందింప చేసిన ఆ చెట్టు వంక తృప్తిగా చూసి వెనక్కి తిరిగాను.       
Comments