మా ఊరి దొంగ - చొప్పదండి సుధాకర్

    
నర్సింలు గురించి చెప్పాలంటే మాలెస్స కథ అయితది! నర్సింలు పేరు చెప్పంగనే మా ఊళ్ళో ఎవల్లయిన "అబ్బోవాడా? వాడొట్టి దొంగ" అంటుంటరు, కానీ వాడంటే మాత్రం మాకందరికీ ప్రేమే - ప్రేమంటే మామూలు ప్రేమకాదు - ప్రాణానికి ప్రాణం! చిన్నప్పటి నుండి కల్సి తిరిగినం - కల్సే పెరిగినం కస్లే సదువుకొన్నం - కల్సే ఎగవెట్టినం. బడి ఎగ్గొట్టి బయిలల్ల ఈతగొట్టినం. కోలుబాయిల శాపలు పట్టినం - గంజిమామిడి కాయలు దొంగతనం జేసినం! అదీ ఇదేందీ - అల్లీపురమంతా మాదే!

    మా అల్లీపురం అంటే భలే గమ్మత్తుంటది... సుట్టు గుట్టలు... ఊళ్ళెనే శెల్మెలు, ఇప్పుడంటే ఎండిపోయినయిగానీ - గప్పుడు ముప్పయి ఏండ్ల క్రింద ఎటు జూసినా నీళ్ళే! దూదేకుల షరీఫ్ వోటలు పెడితే వారం రోజులు సందులేకుంట వానపడి ఆఖర్కి పొయిలనే ఊటవడ్డది... ఇగ గదిజూసి పబ్లిక్ నవ్వుడే నవ్వుడు - ఇగ వాగులకు పోతెనయితె ఇంట్లకు రాబుద్దయ్యేది కాదు- ఇప్పుడుపోతే ఏడ్వబుద్ధయితది - అది వేరే ముచ్చట - మొత్తానికి వాగు మా ఊరికి పెద్దపేగు. దాని గురించి ఎంత జెప్పినా సాలదు. 

    వాగు దాటితే పడమటికి అంతా శెల్కె - దాన్ని అంటుకొని శేన్లకాడ పొలాలకాడ కట్టుకొన్న పదిండ్లే శెల్కల పల్లె - అంటే అడివి పల్లె అన్నమాట! శెల్కలపల్లె పోవాన్నంటే ఎసోంటి మొగోడికైనా లాగు తడ్వాల్సిందే - ఎందుకంటే నడ్మల 'సండ్ర'లుంటయి. సండ్రలంటే మానూలు సండ్రలు కాదు! తాటి శెట్ల లెక్క ఒక్కోటి అంతెత్తున జడల భూతమోలే సూడంగనే 'గజ్జు'మనిపించే చెట్లు! అండ్లకేల్లి ఒక్క ముల్లు దిగకుంట నడ్శినోడు శిపాయి మొగోడే - అండ్ల మనిషి సొచ్చిండంటే కీకపెట్టుదాకా జాడ తెల్వదు. శిన్నప్పుడు మా సోపతిగాల్లమంతా గండ్లనే ఆడుకొంటోళ్ళం. పొద్దుగాల లేత్తే సండ్రల్ల సొచ్చేది. సొచ్చి శితవల్కపండు, బల్సుకంపండు, అల్లనేరేడి పండ్లు... తానికాయలు, మేడిపండ్లు ఒక్కటేంది. దొర్కినయి దొర్కినట్లు బర్కుడే - ఒక్కల్లా - ఇద్దరా - ఇరవై మందిమి - శెల్క మొత్తం లూఠీ మాఫీ జేసేటోళ్ళం.

    మాకు లీడర్ నర్సింలు! వాడెటంటే అటె మా తొవ్వ. వోదినం కోలుబాయి, ఇంకో దినం చెంచుకయ్యలు, తెల్లారి బొగ్గులకుంట, ఎటూ తోసకపేతే గండిశెర్వుల తామెర పూలు, మల్లన్నగుట్ట ఎక్కిదిగుడు... గిదే దినాం మేం శేసేపని!

    ఎప్పుడన్న యాదికొస్తే బడీ - లేకింటె సున్న - గంతే! మాకు మేమే రాజులం. అయ్యకు ఇనేది లేదు - నా అవ్వకు ఇనేదిలేదు - ఇగ పంతులైతే బడీల ఓక్కడు! ఎవల్లదగ్గరేదుంటే అది పెట్టమనెటోడు. ఒకడు మిర్పకాయలు, ఒకడు కంకులు, ఇంకోడు శింతకాయ... ఏదో ఒకటి తెచ్చి ఇంట్ల పోత్తిమంటే సాలు! ఆయనకు గంతే సై - మాకు తిరుగుడే సై!

    ఇగ మా నర్సింలు ముచ్చటే వేరే - ఎవడు ఎక్కడ గల్సినా - 'యాడికి పోతున్నవురా నరిమ్మా' అంటే సాలు, అప్పటికప్పుడు అతికినట్టు ఏదో అబద్ధమాడేటోడు. ఆ అబద్ధం ఇంటుంటే ఒకోసారి మేమే నిజమని నమ్మేటోళ్లం... కానీ తర్వాత తెల్సేది, అదంతా వొట్టిదేననీ - తెల్సినాక మాకు శెప్పరాని ఇశిత్రమనిపించేది.

    "గిదేందిరా, వాళ్ళకు గట్లశెప్తివీ" అంటే "ఛల్ పోనీరా! లేలింటే వానికేందిరా - అన్ని ముచ్చట్లు శెప్పేదీ" అనేటోడు. గందుకే ఊళ్లె అంతా వాన్ని "బట్టెబాజోడు - లఫంగ - నోరు తెరిస్తే అబద్ధాలు" అని తిడ్తరిప్పడికీ!

    మాకెందుకోగానీ ఎన్ని కోతిపనులు చేసినా నర్సింలు అస్సలు అసంటోడు కాదనిపిచ్చేది. ఎవరితో ఎన్ని అబద్ధాలాడినా మమ్ముల్ని మాత్రం ప్రాణమోలె సూసుకునెటోడు. అంతే కాదు, మా కెవ్వలికయినా ఏకష్టం వచ్చినా తనే ఓ అబద్ధం టక్కున ఆడి అవలీలగా ఒడ్డెక్కించేవాడు.

    ఒకనాడు భలే శిత్రం జరిగింది. కొత్తకోమటి రంగయ్య మాకు ఒక ఆశపెట్టిండు. అదేందంటే శింతకాయ తెచ్చిస్తే "మీకేది గావాల్నంటే అది దుకాండ్లకేల్లి తీసిస్తనని" శెప్పిండు. 

    "ఏదంటే అదిత్తవా" నర్సింలు ఆశగా అడిగిండు.

    "నీ బుద్ధిరా - పిప్పరమెంట్లా - శాక్లెట్లా - పేలాల ముద్దలా - శిల్కపేర్లా ఏవంటే అవి తీస్కో కానీ ఈ సంచేడు శింతకాయ తే - !" అంటూ ఓ పెద్ద సంచి చేతికిచ్చిండు. ఆ సంచిసూస్తే మాకు చెడ్డనవ్వొచ్చింది. అదెంత పెద్దగుందంటే ఓ పోరన్ని అండ్ల సొరగొట్టి దాశిపెట్టొచ్చు. 

    అయితే గాసంచి నింపుడు మాకో ఇచ్చంత్రం గాదు. లస్మయ్య దొర శింతలెక్కితే అదేందీ అసొంటియి మూడయిన నిడుతయి. ఎటొచ్చి కావలోనితోనే బుగులు. అయినా రంగయ్య సేటు సూపించిన ఆశముందు గదంత మర్శిపోయినం. ఇగ సంచి తీస్కొని పెరండ్లల్ల పడ్డం!

    గప్పుడు నర్సింలు బేతిరిన్ ప్లాన్ శెప్పిండు. గదేందంటే ఎర్రటి ఎండల పోవాలె, చెట్టెక్కాలె. ఎందుకంటే గాటయింల కావలోడు తినబోతడు. తిన్నంక కరెంటొస్తది, అట్నుంచి అటే బాయికాడికి పోయి మోటరేసి పొలానికి నీళ్లు పారిత్తడు. అది పారినంక నాలుగ్గంటలకు మల్ల శింతల కాడికొత్తడు. గింతలోపల మాపని అయిపోతది, అదీ ప్లాన్! నర్సింలు తెలివికి మేమంతా పరేషానైపోయినం. గదే ఎండపూట పెరట్క సిరవడ్డం, దెయ్యాలోలె ఎగవడ్డం - గంతే - సంచి నిండింది.

    అయితే రంగయ్య సేటు దోఖా జేసిండు. సంచెడు శింతకాయ దొబ్బి మనిషికో ప్యాలాల ముద్ద శేతుల వెట్టి 'ఛల్ పోండ్రి పోరగాండ్లు' అని గదిరిచ్చిండు. మాకు కొంచెం కోపం రాలే... కాని పోరగాండ్లం ఏం జేత్తం? మనసుల మాత్రం నీయవ్వ నీ సంగతి సూత్తం తియ్యని ఇవతలవడ్డం! ఎక్కువ వొర్రితె దొంగతనం బయటపడి ఈపులు పల్గుతయాయె - గందుకే కుయ్యిమనలే!

    ఆఖర్కి తెల్సిందేమిటంటే ఆ శింతకాయను రంగయ్యసేటు ప్యాటకు తీస్క్పోయి ఇరవై రూపాయలకు అమ్ముకొచ్చిండనీ - ఇరవయి అంటే మాటలా? ఆ దినంల ఎంత గొప్ప - ఈ దినానికి రొన్నూరు రూపాయలు-!

    పది పైసల ప్యాలాల ముద్దలిచ్చి గంత లాభం కొట్టిండని మా కడుపు కోపంతో ఉడ్కిపోయింది. నర్సింలు పండ్లు పటపట కొర్కినా ఏం జెయ్యలేకపోయిండు. 

    తెల్లారి నర్సింలు మల్లా సేట్ దగ్గరికి పోదామన్నడు. "ఎందుకురా" అంటే, "నీకు తెల్వదు ఊకోహె" అని బెదిరిచ్చిండు. మాకు వాడి తర్వాయి నచ్చకున్నా వాన్నొదిలి మేం ఉండలేం గనక, గులుక్కొంట ఎన్కనేపోయినం. 

    "సేటూ... నిన్న మాకు మత్తు సంబురమయింది. మల్ల తెమ్మంటవా శింతకాయ" అని మా ముందట్నే అడిగిండు.

    "యాడ తెత్తవురా... నిన్ననే తెత్తివీ" రంగయ్య సేటు అనుమాన పడ్డడు.

    "ఓయక్క... శింతకాయ కరువా సేటూ - మాతోట్ల మత్తుగుంది. రేపు మబ్బుల్నే నీ కొడ్కుని తోలియ్య. మా నాయన ఎముడాల పోతుండు. తోట్ల ఎవలుండరు. నేను ఉంట - రొండు సంచులు నింపిత్త" గుసగుసగా శెప్పిండు. 

    "నిజంగనారా నర్సింలూ" రంగయ్య సేటు నోరు బోరుపొక్క లెక్క తెర్చుకొంది. 

    "నిజం అమ్మతోడు" నెత్తిమీద చెయిపెట్టుకొన్నడు నర్సింలు.

    "అరె రాజిగా - ఇంటున్నవా - ఇగో ఈ నర్సింలుగాని తోటకాడికి రేపు ఎగిలి వారంగనే పోయిరా - వాడు శింతకాయ వెడ్తడు" కొడుక్కి కీక వెట్టి శెప్పిండు.

    "అట్లనే నాయినా" మల్లెసాలల అన్నంతింటున్న రాజిగాడు తల్కాయ ఊపిండు. 

    మల్లా ఒప్పందం జరిగిపోయింది. అయితే ఈసారి రెట్టింపు సంచులు, రెట్టింపు ప్యాలాల ముద్దలు. కానీ 'ఇకమత్' ఎక్కడ బెడిసి తన్నిందంటే ఆ దినం నర్సింలు నాయిన ఎముడాల పోనేలేదు. నర్స్మిలు బాయికాడ పత్తాలేడు. అసలు ఆదినం ఆయనకు ఊరికిపోయే పనేలేదు. కావాలనే నర్సింలు అబద్ధమాడి సేటుకొడుకుని పొలానికి రమ్మని తాను గాయబ్ అయిండు. అక్కడికి పొయ్యేవరకేమున్నది - నర్సింలు నాయిన యమునోలె ఎదురొచ్చిండు. పోరన్ని నాలుగుతికి "లమ్డికే - చింతకాయ దొంగతనం నేర్పుతున్నవురా నా కొడుక్కి" అని ఎల్లగొట్టిండు. అటెన్క రంగయ్య సేట్ మీదికి లొల్లికొచ్చిండు. అటువోయి, ఇటువోయి ఆఖర్కి పెద్ద లడాయి అయింది. సందుల సందు అన్నట్లు గండ్లనే నిన్నటి దొంగతనం బైటపడింది. అంతా కల్సి రంగయ్య సేటుదే తప్పని తీర్మానం జేసిండ్రు. తప్పుకు దండుగ అయిదొందలేశిండ్రు. ఆయన అటు ఒర్రి ఇటు వొర్రి లాస్టుకు మూడొందలు కట్టిండు. లాభం గూబలకొచ్చింది. గిదంత మేం గోడల సాటుకు జాగుండి సూసుకొంట ఇగ నవ్వినం - ఇగ నవ్వినం -!!

    గిట్ల శెప్పుకొంటపోతే నర్సింలు జేసిన కైతికాలు శెప్పవశం గాదు. గటువంటి నర్సింలు ఇయ్యాల మా ఊరికొత్తుండు. వొట్టిగొత్తలేడు. ఊళ్ళె బడి గట్టియ్యడానికి ఇరవై లక్షల రూపాయల విరాళం ఇత్తనని వొత్తుండు. ఎంబడి విద్యాశాఖమంత్రి ఇంకా ఎందరో పెద్దపెద్దోల్లు గూడా వొత్తుండ్రు. వాళ్ళ రాకతో కుక్కలు కూడా తొంగిసూడని మా అల్లీపురంకి ఇప్పుడు శెప్పరాని దెశొచ్చింది. పేపరోళ్ళూ... టీవీలోళ్ళు ఒకటే రాకడ... పోకడ... కార్లూ... మోటారు సైకిళ్ళు కయ్యకయ్య ఒర్రుకొంట తిరుగుతున్నయ్ - ఊరు ఊరంతా తన్ తన్‌మంటుంది!!

    ఇగ మేం పాత దోస్తులమందరం గీ రొండుమామిండ్ల కాడ వానికోసం ఎదురు సూత్తున్నం. ఎదురు సూత్తునం గనీ మనసుల ఒకటే గుటగుట--! వాడు మమ్మల్ని ఇంకా గుర్తు పెట్టుకున్నడ లేక పెద్దగయి కోట్లు సంపాయించి మర్శిపోయిండా... ఎందుకంటే వాడు చేసే దంద మామూలు దంద కాదు. లక్షలు కోట్లే... ఇంతకు అదేందటే సినిమాలకు కథలు రాసుడు --- ఎట్ల నేర్సుకొన్నడో గనీ... ధూమ్ చక్కర్ కథలు రాస్తడు. ఈడికి నాలుగు కథలు రాసిండు. అన్నీ 'ఇట్టే'... ఇప్పుడు నర్సింలుగాడు పెన్ను పట్టాలంటే ఇరవై ముప్ప లక్షలయినా శేతిల పడాల్సిందే! ఇప్పటికి అడ్మాంస్ అయిదు సినిమాలున్నయట! సంపాయించింది సాలు... అండ్లకేల్లి కొంచెమైనా దానం కూడా చేద్దామనీ - చేసేదేదో - పుట్టి పెరిగిన ఊరికి శేద్దామని ఆలోచన వచ్చి, అందుకు మూర్తం ఇయ్యాల పెట్టిండు. ఇదే సందని విద్యాశాఖమంత్రిని, ఎమ్మెల్యేని పట్టుకొత్తుండు! ఇగ సూస్కోండ్రి మా ఊళ్ళె లొల్లే లొల్లి. మా సోపతిగాళ్ళకయితే రాత్రి నుంచి నిద్రే లేదు. నర్సింలు ఎపుడొత్తడు - వాన్ని ఎపుడు కల్వాలె అని సత్తిగాడు, రాములు, చెంద్రిగాడు, రమణ, మల్లయ్య, శ్రీను, నర్సిరెడ్డి అంతా ఆగమాగమయి పోతుండ్రు.

    "ఒరే శ్రీనూ... టైమెంతయింద్రా..." నర్సిరెడ్డి అడిగిండు.

    వాళ్ళ నాయిన చైన్ తెగిపోయిందని గూట్లెపారేసిన డొక్కుగడియారం రిపేరు చేయించుకొని నిన్ననే చేతికి పెట్టుకొన్న శ్రీను... "పదిన్నర" అన్నడు. 

    "మరి వీడింకా రాలేదేందిరా..." నర్సిరెడ్డి గులిగిండు.

    "ఏమో పెద్దోళ్ళ యవ్వారం - వాళ్ళకెన్ని పనులు" రమణ సముదాయించిండు.

    "ఎంత పెద్దోడయినా - మన నర్సింలు మనోడే కదరా" నెనన్నాను.

    "ఏమో... ఇప్పుడెట్లయిండో... గుణం ఎప్పటికి ఒక్కతీరే ఉంటదా - " శ్రీను అన్నడు.

    "నువద్దెరా - పైసొత్తె కండ్లు కనిపియ్యయి" సత్తి మెల్లగా అన్నడు.

    నాకయితే అదీ నిజమేననిపించింది. గోడిశేపు ఎవల్లం ఏం మాట్లాడలేదు. సూత్తండగనే మూల మీదికేల్లి పది పన్నెండు కార్లు రయ్యిరయ్యిమని రావట్టినయి. వాటెన్కనే బర్రబర్రమని పోలీసు జీపులు. నీయవ్వ - మేమంతా నోరు తెర్శి బీరిపోయినమో లేదో నర్సింలుగాడు కారు దిగనే దిగిండు!

    ఎత్తుకెత్తయిండు - తెల్లగయిండు... చేతికి బంగారు చెయిన్‌తో గడియారం - అయిదేళ్లకు అయిదుంగరాలు - బ్రాస్‌లెట్... మల్లెపూవసోంటి డ్రెస్ మీద సెంట్ కొట్టుకొని వాడే ఓ మంత్రిలెక్క గప్పుమని మెరుస్తుండు. దిగంగనే జర్రసేపు అటూ ఇటూ చూసి "అరే... వీరేశం బాగున్నావురా...?" అని గంతమంది ముంగట నన్ను గట్టిగా కావలించుకొన్నాడు. నా కడుపు నిండిపోయింది.

    "ఎంతయినా నాటి నుంచి మీరు మీరొక్కటేలేరా...!" మల్లేశు మసిలిపోయిండు.

    "అరె మల్లయ్యా - మల్లేశూ - నేగుర్తుపట్టలేదురా - అరే రమణా - రాజిగా - నర్సిరెడ్డి... ఓర్నీయక్క మ్యాలమంత ఇక్కడే ఉన్నార్రా" అంటూ అందర్ని కావల్నిచుకొని కడుపుల తల్కాయ పెట్టిండు. మా సంబరం శెప్ప వశమయితలేదు. పక్కనున్న మంత్రీ... పోలీసులు... అంతా మమ్మల్నే సూస్తుండ్రు. 

    కచక్... కచక్... క్రీక్ క్రీక్‌మని ఫోటోలే ఫోటోలు...!!!

    ప్రోగ్రాం అయ్యేదాకా నర్సింలు మాతోనే అంట్క పోయిండు. మా అందరికి దండలేశి మాతో ఫోటోలు దిగి ఎట్ల నడుస్తుంది బతుకు తెర్వని మంచి చెడు అడిగిండు.

    రమణకు బతుకు తెర్వులేదని తెల్సుకొని రొండు లక్షల చెక్కు ఇచ్చి, సిద్ధిపేట్ల జిరాక్స్ మిషన్ కొనుక్కోని దుకాణం పెట్టుకొమ్మన్నడు. మాకయితే ఇదంతా చూసి కండ్లు వెయ్యి తిర్గినయి!

    గింతమంచోన్ని అందరూ "దొంగ... దొంగ"అని ఎందుకంటరో మాకయితే అస్సలు నెత్తికెక్కలేదు. గదే ముచ్చట వాన్నే అడిగినం...!

    "దొంగంటె - ఎవల్రా దొంగకాందీ... లాయరు దొంగలు - డాక్టరు దొంగలు - బ్రోకరు దొంగలు... ఆఫీసర్ దొంగలు... అంతా దొంగలే... ఎవలు సుద్ద పూసలు?" నర్సింలు గాడు ఒక్కసారి జాడిచ్చి అడిగిండు - !

    వాని అడుగుడుకి ఏం జవాబు చెప్పాలో తోచక  ఒక్కసారి మా పెయిలన్ని నల్లవడ్డయి.

    "నిజమేలేరా - " కొద్దిగా చదుకొన్న చంద్రం తొందరగా తేరుకొని అన్నాడు.

    "కాకపోతే నే శిన్నగున్నప్పుడు అన్నీ అబద్ధాలే ఆడెటోన్ని గదరా - గందుకే దొంగ దొంగని పేరుపడిపోయింది. పడితే పడే - అండ్లగూడ లాభమే అయిందిరా నాకు" నర్సింలు పెద్దగ నవ్విండు.

    "గండ్లేం లాభంరా?" నేనడిగాను.

    "ఎవలు కనిపించి అడిగినా, అప్పటికప్పుడు ఓ అబద్ధమాడి ఓ కథ అల్లి శెప్పెటోన్ని కదా - అదే లాభమయింది"

    "మల్ల లాభమంటడేందిరా...?" నర్సిరెడ్డి పిస్స పిస్స అయిపోతుండు.

    "అరె... ఎందుకు లేదురా... గా కథలల్లుడే ఇప్పుడు సినిమాలకు కథలు రాస్కోనీకి అక్కరకొస్తుంది" అసలు సంగతి బయటపెట్టిండు నర్సింలు.

    "గట్లెట్లా" శ్రీను నోరు తెరిచిందు.

    "ఏముందిరా... నాలుగయిదు ఇంగ్లీషు హింది సినిమాలు చూసి వాటికి నా కథ కొద్దిగా అల్లి రాస్తే గదే కొత్త కథ" ఫక్కున నవ్విండు.

    "గటువంటివి నిర్మాతలు మెచ్చుతరా - " సినిమాల గురించి ఎక్కువ తెల్సిన రాములు ప్రశ్న!

    "మెచ్చుడేందిరా - లక్షలిస్తరు"

    "నువద్దెనా -?"

    "నువద్దె - నువద్దెందిరా - గీనడ్మ వచ్చిన సినిమా అంతే కదా - గది నేనే రాసిన" సినిమా పేరు చెప్పిండు. గంతే! మేం నోరు తెర్శినం.

    ఆ సినిమా బంపర్ హిట్టు - యాడాది ఆడింది!

    "ఎంతయినా నువు శిపాయివిరా! నీ అసంటోడు ఊరికొక్కడూంటే సాలు" అందరం ఒప్పుకొన్నం.

    "ఊరుకొక్కడేందిరా - ఇంటికొక్కడుండాలే" నర్సిరెడ్డి అన్నాడు.

    ఆ పొద్దుగూకే నర్సింలు మల్లా పట్నం ఎల్లిపోయిండు. అప్పటినుండి వాడు ఎప్పుడు యాదికొచ్చినా "ఉండాలె - అసంటోడు" అనుకొంటం అందరం తుర్తిగా - !!

(సాక్షి ఫన్‌డే ఆగస్జ్టు 17, 2008 సంచికలో ప్రచురితం)    
Comments