మానాన్న - తాడేపల్లి పతంజలి

    
రైలు దిగి, బయటికి వెళ్ళబోతూ ఎందుకో ఫ్లాట్‌ఫాం మీద కూర్చున్న వ్యక్తిని పరిశీలించాను. అడుగు ముందుకు సాగలేదు. గడ్డం కింద చేయిపెట్టుకొని శూన్యంలోకి చూస్తున్నాడు ఆయన... నా రక్తప్రసరణ వేగం హెచ్చింది. పోలికలు అచ్చుగుద్దినట్టుగా ఉన్నాయి.

    నా...న్న...

    ముప్పైయేళ్ళ నుంచి కనబడకుండా ఉన్న నాన్న...

    ఆయనేనా... ఆయన పోలికలతో ఉన్న మరొకరా...

    "అతిస్నేహ! పాపశంకీ"

    నాన్నే... అనుమానం లేదు... గెడ్డం కింద నేను అలా చేయిపెట్టుకుని కూర్చున్నప్పుడల్లా... అచ్చం నాన్నలాగా కూర్చున్నావని అమ్మ ఇప్పటికీ అంటూ ఉంటుంది.

    అదికాక నా రక్తంలో ఆత్మీయతా జీవశక్తి ఏదో... ఈయనను చూసిన తర్వాత - స్పందించినట్లు నాకు తెలుస్తోంది.

    ఖచ్చితంగా ఈయన నాన్నే...

    జనాన్ని తోసుకుంటూ నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళాను.

    "నా...న్నా..."

    యుగయుగాలనుండి అమృతాన్ని నింపుకొన్న జంట పదాలలో రెండవ పదం...

    ఆయన తలెత్తి చూశాడు.

    నన్ను చూసిన ఆయన మొగంలో కాంతులు మారటం గమనించాను.

    "ప...ప...పాణీ..."

    గుండెని శబ్ద పేటికకు చేర్చి అరవానిపించింది.

    ఎన్ని రోజులు... ఎన్ని సంవత్సరాలయింది ఆ పిలుపు విని.

    "పాణీ..." అంటూ నాన్న నన్ను దగ్గరకు తీసుకున్నారు. మనిషిని మనిషి తాఇక్తే స్పర్శ... కాని ఎన్ని విధాలు... ఎన్నెన్ని రకాలు... ఆత్మీయుల స్పర్శతో పోటెత్తిన గోదావరి...

    నా కళ్ళనీళ్ళు ఆయనను తడుపుతున్నాయి.

    నా మెడనిమురుతూ ఆ చల్లనిచేయి.

    తండ్రినయినా కూడా... కన్న తండ్రి ప్రేమలోని తీపిని అనుభవిస్తున్నాను. ప్రేమని ఎన్ని రకాలుగా జుర్రుకున్నా అది ఇంకిపోని ఊట...

    "అందరూ బాగున్నారా నాన్నా..."

    నాన్న అడిగిన ప్రశ్న చిన్నది. కాని జవాబు మా అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ జీవితాలంత పెద్దది.

    నాన్నని ఎన్నో గబగబా అడగాలని ఉంది. ఇన్నాళ్ళ బట్టి ఎక్కడున్నాడు? అసలెందుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు? ఇనాళ్ళు మమ్మల్ని విడిచి దూరంగా ఎలా ఉండగలిగారు?...ఎన్నో ప్రశ్నలు.

    ఏదో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఫ్లాట్‌ఫాం మీదికి వస్తున్నట్లుంది. జనం తోపులాట పెరిగింది.

    "నాన్న... బయటికి వెళ్దామా!" అన్నాను.

    మౌనంగా నా వెంట నాన్న నడిచారు.

    స్కూటర్ మీద నాన్నని కూర్చోబెట్టుకొని ఎ.ఓ.సి.సెంటర్‌లోని ఖాళీ ప్రదేశంలో ఆపాను.

    కూర్చోవడానికి ఇద్దరికి రెండు పెద్ద రాళ్ళు దొరికాయి.

    "ఇప్పుడు చెప్పండి నాన్న... ఇన్నాళ్లు మీరెక్కడున్నారు?"

    నాన్న నవ్వారు.

    "చెబుతాను... చిన్ననాటి నీ తొందరపాటుతనం ఇంకా తగ్గినట్టు లేదుకదరా!"

    తన లోపమేమిటో తనకు తెలుసు. కాని ఎదుటి వాళ్లు దాని వేలెత్తి చూపిస్తే భరించలేం. సామాన్య మానవుడి నైజమది. నేను కూడా సామాన్య మానవుడినే...

    నా మొగం చిన్నబుచ్చుకోవడం నాన్న గమనించినట్టున్నారు.

    "ఊరికే అలా అన్నానురా పాణి... చాలా పెద్దవాడివయ్యావు... ఎంతమంది పిల్లలు..."

    చెప్పాను.

    "పెళ్ళిళ్ళు చేశావా!"

    "లేదు నాన్న... ఇంకా ఇద్దరూ చదువుకుంటామంటున్నారు..."

    "అయితే బిడ్డల ఇష్టాన్ని తీర్చే తండ్రివన్నమాట."

    "అన్నయ్యలు... ఎక్కడెక్కడ ఉన్నారు?"

    చెప్పాను. వాళ్ళ పెళ్ళిళ్ళు , బిడ్డల వివరాలతో సహా.

    నాకు ఆశ్చర్యం కలిగింది. నాన్న అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కాని ముందుగా అడగవలసిన అసలు ప్రశ్న అడగనందుకు చాల ఆశ్చర్యం కలిగింది.

    "అమ్మ..." నాన్న గొంతు గద్గదికమైంది. ఆయన అనదలుచుకున్న మాటలని కన్నీళ్లు మింగుతున్నాయ్. ఆయన చేతులను మృదువుగా స్పర్శించాను.

    "మీ అందరికంటే మీ అమ్మకు ఎక్కువ మోసం చేశాను పాణి... ఆవిడ పేరును కూడా ఉచ్చరించే అర్హత లేదు నాకు... అందుకే అమ్మ ప్రస్తావన ముందు తేలేదు. కాదు తేలేక పోయాను."

    నాన్న చాలా నెర్వస్‌గా ఫీలవుతున్నారు.

    "అమ్మ.... మానసికంగా, శారీరకంగా చాలా చితికి పోయింది. ఆప్యాయతతో పాటు. ఆమెకు ఈ లోకంలో కళ్ళు కనబడటం లేదు."

    నాన్న ఉత్తరీయం చెంగుతో కళ్ళు తుడుచుకొన్నారు.

    నా మాటలలోని అర్థం ఆయన బోధపరచుకొన్నారు లాగుంది.

    ఇంతలో నా ఫోను మోగింది.

    పెద్దన్నయ్య...
    "ఏరా పాణి... ఇంకెంత సేపు... బ్రాహ్మణులు వచ్చారు. తొందరగారా... మేము ఎదురు చూస్తున్నాం..."

    "నాన్న..." అంటూ ఆగిపోయి "... వస్తున్నా" అంటూ ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాను.

    నాన్న కనిపించకుండాపోయిన రోజుని ఆయన చనిపోయిన రోజుగా నిర్ధారించుకొని ప్రతి ఏడాది ఆయనకు శ్రాద్ధం పెడుతున్నాం. మా లెక్క ప్రకారం ఈ రోజు ఆయన తద్దినం. అందుకే అన్నయ్య పిలిచాడు.

    "ఎవరు నాన్నా... మాట్లాడింది..." నాన్న అడిగారు.

    "పెద్దన్నయ్య శివశంకరం..." అని నాన్నకి జవాబిచ్చి పెద్ద అన్నయ్యకు మళ్ళీ ఫోన్ చేశాను.

    "అన్నయ్యా! పాణిని మాట్లాడుతున్నాను. తద్ద్నినం ఆపేయండి... బ్రాహ్మణులను తిరిగి పంపించండి..."

    "ఏరా... నీకేమన్నా పిచ్చెక్కిందా?" అవతలి వైపు నుంచి అన్నయ్య మందలించాడు.

    "నాన్న... నాన్న కనిపించారన్నయ్యా! నా వెంట తీసుకువస్తున్నాను"

    "ఏంట్రా... ఏం మాట్లాడుతున్నావ్?" అన్నయ్య కంఠంలో సంభ్రమం... ఆదుర్దా...

    "నిజమే అన్నయ్యా! నాన్నతో మాట్లాడుతావా?'

    "తర్వాత మాట్లాడతా గాని... ఒరేయ్... ఇప్పుడెక్కడున్నావ్?"

    "ఏ.ఓ.సి.వాటర్‌ఫాల్ దగ్గర..."

    "నాన్న విషయం ఎవరికన్నా చెప్పావా?"

    "లేదన్నయ్యా! ఫస్ట్ నీకే... ఏం అన్నయ్య... అలా అడుగుతున్నావ్?"

    "తర్వాత చెబుతా... ఇంకెవ్వరికీ నాన్న విషయం చెప్పకు... నేనిప్పుడే బయలుదేరి వస్తున్నా..." అన్నయ్య ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు.

    అన్నయ్య ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు.

    "ఏమన్నాడ్రా... అన్నయ్య..." నాన్న ప్రశ్నించాడు.

    "ఇక్కడికి వస్తానన్నాడు"

    "వాడికి నా మీద కోపం అలాగే ఉందా?"

    "కోపం ఏముంది నాన్నా...?" అర్థం కాక అడిగాను.

    "అదేరా... తెల్లారితే అక్కయ్య పెళ్ళనగా వెళ్ళిపోయాను కదా! కుటుంబంలో పెద్దవాడిగా బాధ్యతంతా తననెత్తి మీద వేసి పారిపోయానని కోపమేమీ లేదు కదా."

    "లేదు నాన్న... మీకోసం వాడు చాలా ప్రయత్నించాడు. వెతకని చోటులేదు... అన్నయ్య మీకోసం పడ్డ శ్రమను తలుచుకుంటే మీరెంతో అదృష్టవంతులని నాకిప్పుడు పెద్దయిన తర్వాత అనిపిస్తోంది. ఇల్లూ వాకిలి లేకుండా - ఆ స్వామీజీ మీరు ఇక్కడున్నారని చెబితే వెంటనే వెళ్ళేవాడు. ఇంకొకరు... రేపు మధ్యాహ్నం దాకా ఫలాన ఊళ్ళో మర్రి చెట్టుకింద మీ నాన్న ఉంటాడు... ఆలస్యంగా వెళ్ళావంటే దొరకడంటే - ఎన్ని కష్టనష్టాలనోర్చి వెళ్ళేవాడో..."

    "చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను..." నాన్న బాధగా అన్నారు. నాన్నని పరిశీలనగా చూశాను. డెబ్భై... ఎనభై యేళ్ళ మధ్య వయస్సు... ముసలితనం తనను తెల్లగా ఆక్రమించుకోవాలని చూస్తుంటే, తన ముఖంలోని స్వచ్చమైన కాంతి ముసలితనాన్ని బెదిరిస్తున్నట్టుంది. వేసుకొన్న నలగని తెల్లని బట్టలు మనిషి మనస్సుకు ప్రతిబింబాల్లా ఉన్నాయి.

    "ఇన్నాళ్ళు ఎక్కడున్నారు నాన్నా..."

    "చావుకి... బతుక్కి మధ్యలో..." నవ్వుతూ అన్నారు.

    "మమ్మల్ని విడిచి మీకు ఎలా ఉండ బుద్ధేసింది..."

    "ప్రశ్న అలాకాదు అడగవలసింది పాణి... ఎందుకు బాధ్యతల నుంచి పిరికి వాడిలా పారిపోయావ్ నాన్నా... అని అడుగు"

    "లేదు నాన్నా... మిమ్మల్ని అలా అడగలేను. ఒక మంచి మనిషి తప్పు చేశాడంటే... ఏదో బలమైన శక్తి ఆ పనిని చేయించి ఉండాలి. లేదా తెలియకుండా అతను ఊబిలోకి జారిపోయి ఉండాలి."

    ఉదయం పదకొండు గంటలయింది.

    వాహనాల రద్దీ కొంచెం తగ్గుతోంది.

    శీతాకాలం చల్లదనం నుండి ప్రజలను రక్షించటానికి సూర్యుడు చేస్తున్న ప్రయత్నం కొద్దిగా ఫలిస్తోంది.

    "పాణీ... నువ్వన్నట్టు నేను మంచి మనిషిని కానురా...

    రాత్రికి రాత్రే లక్షాధికారిని కావాలన్న దురాశాపరుడిని... ఒక తప్పు కప్పిపుచ్చుకోవడాబుజు మరెన్నో తప్పులు చేయాలనే సాధారణ సూత్రం నన్ను ఇంటికి దూరం చేసిందిరా...

    తెల్లవారితే అక్కయ్య పెళ్ళిలో కన్యాదాతగా ఇవ్వాల్సిన డబ్బుతో క్లబ్బులో పేకాడాను. ఏ తండ్రీ ఇలా చేయకూడదు. నేను చేశాను. అదృష్టం, దురసృష్టం రెండూ నన్ను వరించాయిరా పాణీ!"

    "అంటే..." అర్థం గాక అడిగాను.

    "లక్షల్లో లాభం వచ్చింది. అది అదృష్టం... అర్థరాత్రి ఇంటికి బయలు దేరుతుంటే పేకాట స్నేహితులు వెళ్ళనీయలేదు. ఇది దురదృష్టం... పదిమంది ముందు ఒక్కడు బలహీనుడు..."

    "పోనీ... ఆ డబ్బేదో వాళ్ళ మొగానకొట్టి రాలేక పోయావా నాన్నా..."
    "అదీ చేశాన్రా... లాభం వద్దు... కనీసం నేను పెట్టిన పెట్టుబడియైన నాకు ఇప్పించండి కాళ్ళ వేళ్ళ పడ్డాను. దిక్కున్న చోట చెప్పుకొమ్మని మొత్తం లాక్కొని చీకటి కొట్లో పెట్టారు..."     మౌనం భయంకరంగా ఉంది.     "ఆ తర్వాత నేను వాళ్ళ గురించి ఎక్కడ చెబుతానో అని కాళ్ళూ చేతులు కట్టేసి, గోనె సంచిలో పెట్టి డిల్లీకి వెళ్ళే గూడ్సు రైలులో పడేశారు. ఆ గోనె సంచిలో పెట్టి డిల్లీకి వెళ్ళే గూడ్సు రైలులో పడేశారు. ఆ గోనె సంచిలో ఊపిరాడక ప్రాణాలు పోయుంటే బాగుండేది. వాళ్ళలా వెళ్ళిన తర్వాత - దేవుడు ఈ పాపాత్ముడిని బతికించాలని - గార్డు కంట బడేట్టు చేశాడు. నెమ్మదిగా అతను నన్ను బంధవిముక్తుడిని చేశాడు."

    "ఆ తర్వాతయినా ఇంటికి రాలేక పోయావా నాన్నా."     "గార్డు కూడా నన్ను వెళ్ళమనే చెప్పారు... కాని... ఏ మొగం పెట్టుకొని రాను. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పే దమ్ము నాకు లేదు... అందుకే చస్తూ, బతుకుతూ, ఆశ్రమాల్లో, నాకు వచ్చిన ఇంగ్లీషు పాఠాళు చెప్పుకొంటూ బతికాను..."     "మమ్మల్ని చూడాలని అనిపించలేదా నాన్నా..."
    "సంవత్సరం తర్వాత ఆపుకోలేక ఒక చీకటి రాత్రి వచ్చానురా... మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది..."     "మన బంధువుల ఇళ్ళల్లో విచారించినా తెలిసేది కదా?"     "చెప్పానుగదరా! తప్పుడు మొగాన్ని చూపే ధైర్యం లేదని...     అందుకే జీవచ్చవంలా బతుకును గడుపుతున్నాను. రేపు రాత్రికి ఢిల్లీలో ఆశ్రమానికి ఫండ్స్ ఇస్తానని ఒక పెద్దాయన పిలిచాడు. ఎ.పి.ఎక్స్‌ప్రెస్ కోసం చూస్తుంటే... నువ్వు కనబడ్డావ్..."     "మేమిచ్చిన పేపర్ ప్రకటనలు... రేడియో ఎనౌన్స్‌మెంట్లు"     "అవి అందని పరాయి రాష్ట్రాల్లో ఉన్నారా పాణీ..."

    నాన్నతో ఏం మాట్లాడాలో తోచలేదు.     "నాన్న గురించి తెలిసిన తర్వాత అసహ్యం వేస్తోంది కదూ! కనబడకుండా ఉంటే బాగుండేది అనుకొంటున్నావా?"     "ఛా... అదేం మాట నాన్నా..." ఏదో క్యాజువల్‌గా అన్నానుకాని గుండె నుంచి ఈ మాటలు రాలేదని నాకు అనిపిస్తోంది.     అన్నయ్య బండి మాముందు ఆగింది.     అన్నయ్య కౌగిట్లో నాన్న...     నాకంటె ముందు పుట్టినవాడు... నాన్న ప్రేమను నాకంటే ఎక్కువగా పొందినవాడు.

    ఒక అరగంట ఎన్నెన్నో మమతా ప్రవాహాలు...     "పాణీ! వెళ్దాం పదా!" అన్నయ్య ఒక అరగంట తర్వాత అన్నాడు.     "అన్నయ్యా! నాన్నను నీ బండిమీద కూర్చోబెట్టుకుంటావా? నా వెనకాల కూర్చోబెట్టుకోనా?" అడిగాను.     "ఎవరి బండి మీద వద్దురా... నాన్నా... మమ్మల్ని క్షమించండి... మీరు లేరని, మీరు తిరిగిరారని నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వం వారు ప్రభుత్వోద్యోగిగా మీకు రావలసిన లక్షలు మన కుటుంబానికి ఇచ్చార్. ఇప్పుడు మీరున్నారని తెలిస్తే తిరిగి వాటన్నింటిని మేము ప్రభుత్వానికి కట్టాలి. మీసంతానంలో ఎవరం కూడా ఒక్కసారిగా అంతకట్టే స్థితిలో లేము. ఏ లక్షల కోసం మీ జీవితం మారిందో, ఆ లక్షలు మీ కుటుంబానికి నిలవాలంటే మీరు..."     "నాన్న చేయి ఊపుతున్నారు - కనుమరుగవుతూ.     అన్నయ్య బండి ముందు... వెనకాల నేను. నా స్కూటర్ చక్రం ఊడిపోతే బాగుండుననిపిస్తొంది. అన్నీ అనుకున్నట్టు జరగవు.

(సాక్షి ఫండే నవంబర్ 23,2008లో ప్రచురితం)
Comments