మనసు మాట వినదు - అనిసెట్టి శ్రీధర్

    
"మీ పేరు?''     "లలిత. బాగా కావలసిన వాళ్లు లోలో అంటారు.''     లోలో. ఈవిడ ముగ్ధ రూపానికి ముద్దు పేరు కూడా బాగుంది అనుకుంది సుసీ.     "వయసు?''     "..........''     "మీ సమస్యను మేము అర్థం చేసుకోవడానికి మీ వయసు కూడా కొంత సహాయపడుతుంది.''     "నలభై''.     సుసీకి ఆశ్చర్యం వేసింది. అంత వయసున్నామెలా కనబడడం లేదు. ఆమెను పరిశీలనగా చూసింది. తన విధిలో భాగం కూడా. కొంచెం వడిలిన రోజా పువ్వులా ఉందామె. ఇక్కడకు రావడానికి ముందు చాలా సంఘర్షణకి లోనైనట్టుగా ఉంది.     "చెప్పండి లలితగారూ.''     "రామ్‌గారితో మాట్లాడొచ్చా?'' కొంచెం సంకోచిస్తూనే అడిగింది.     "ప్రొఫెసర్‌గారు పోయిన వారమంతా లేరు. అటు యూనివర్సిటీ పని, ఇటు ఈ కౌన్సిలింగ్ సెంటర్ పని పేరుకుని పోయి చాలా బిజీగా ఉన్నారు. కేబిన్‌లో చూశారుగా. తలెత్తకుండా పని చేసుకుంటున్నారు.''     "నేను పది రోజులనుండి వారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను.''     "పాతికేళ్లు కూడా లేనట్టున్న ఈ అమ్మాయి నా సమస్యకి పరిష్కారం చెప్పగలదా అని ఆలోచించకండి. నేను వారి శిష్యురాలినే. యూనివర్సిటీలో చదువైపోయాక ఇక్కడ పని చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఇదొక స్వచ్ఛంద సంస్థ. మీ సమస్య నాతో చెప్పండి.''     పది నిమిషాలు మాటలు జరిగాయి.
* * *
    "ప్రొఫెసర్ సర్...'' కేబిన్ బయటకు ఒకసారి కళ్లు తిప్పి చూసి మళ్లీ రామ్‌వైపు నిస్సహాయంగా చూసింది సుసీ.     "చాలా పనుంది. నువ్వు హేండిల్ చెయ్యలేవా?'' బయట కూర్చున్న ఆమెవైపు చూస్తూ అడిగాడు.     "మీ గురించి విన్నట్టున్నారు. మీ సలహా తీసుకోందే కదిలేలా లేరు.''     సిస్టం షట్‌డౌన్ చేసి సరే అన్నట్టుగా తలాడించాడు.     సుసీ ఆమెను వెంటబెట్టుకుని కేబిన్‌లోకి వచ్చింది. రామ్ ఎదురుగా కూర్చున్నారు ఇద్దరూ.     "చెప్పండి'' అన్నాడు రామ్.     "నా పేరు లలిత. బాగా కావలసిన వాళ్లు నన్ను లోలో అంటారు.''     తనతో కూడా అలానే చెప్పింది ఆవిడ. ఎవరితో పరిచయం చేసుకున్నా ఇలానే మాట్లాడుతుందా అనుకుంది సుసీ.     ఒక్క క్షణం మౌనం.     "చెప్పండి లలితగారూ'' అన్నాడు రామ్.     "సుమారు ఇరవై రెండేళ్ల క్రితం నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా కిచ్చు మా క్లాస్‌లో చేరాడు. తన కజిన్, నాకు స్నేహితురాలైన శైల కూడా మా క్లాసే. కిచ్చు చదువులోనే కాదు ఏ విషయమైనా చక్కగా విశ్లేషించి మాట్లాడేవాడు. బాగా బిడియస్తుడు. నేనే తనతో కల్పించుకుని మాట్లాడేదాన్ని. శైల వాళ్లింట్లో అప్పుడప్పుడు కలిసేవాళ్లం.''     "అతని పేరు కిచ్చునా?'' సుసీ అడిగింది.     "కాదు వాళ్లింట్లో, శైల వాళ్లింట్లో అలానే పిలుస్తారు. నేనూ అలానే పిలిచేదాన్ని. పరిచయమైన రెండో రోజే తనని 'కిచ్చు' అని పిలిస్తే ఎంత కోపం వచ్చిందో. 'నా పేరు అది కాదు' అన్నాడు కోపంగా. 'సారీ కిచ్చూ, ఇంకెప్పుడూ అలా పిలవను కిచ్చూ, నీ అసలు పేరుతోనే పిలుస్తాను కిచ్చూ. ఒట్టు కిచ్చూ' అన్నాను అల్లరిగా. తను నవ్వేశాడు. ఆ పరిచయం ఆరు నెలల్లో ప్రేమగా మారింది'' ఆ జ్ఞాపకాల తాలూకు ఆనందం ఆమె ముఖంలో కదలాడినప్పుడు సుసీకి ముచ్చటేసింది.     ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. మా కుటుంబానికి ఉన్నట్టుండి పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది. మా అక్కయ్యకి మా మేనత్తగారి అబ్బాయితో వివాహం నిశ్చయించారు. కాని మా అక్కయ్య చెప్పాపెట్టకుండా ప్రేమ వివాహం, అందులోనూ మతాంతర వివాహం చేసుకుంది. పెళ్లి పనులు మొదలుపెడుతున్న నాన్న గుండెపోటుతో మంచం పట్టారు. ఊరినిండా చుట్టాలే. ఒక్కళ్లూ మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాన్న ఒక్కసారి అలా మంచం పట్టేసరికి మేము తల్లడిల్లిపోయాము. అమ్మకి కిచ్చు విషయం చూచాయగా తెలుసనుకుంటాను. అక్క చేసినట్టు నేను చెయ్యనని ఒట్టు వెయ్యమంది. నాన్నని ఆ స్థితిలో చూసేసరికి నేను మరేమీ ఆలోచించకుండా ఒట్టు వేసేశాను. రెండు నెలలపాటు నాన్నగారికి బాగాలేదని, పరీక్షలని కిచ్చుని తప్పించుకుని తిరిగాను. మా అక్కయ్య చేసిన సాహసం కిచ్చుకి కూడా తెలియడం వలన తనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అదృష్టవశాత్తూ నాన్నకి కలకత్తా బదిలీ అయింది. అక్కడి మా టెలిఫోన్ నంబర్ కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అయితే నేను ఏ కారణాల వలన కిచ్చునుండి దూరంగా వెళ్తున్నానో శైలకి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత ఒక మనిషి జీవితంలో సాధారణంగా ఏమేం జరుగుతాయో అవన్నీ నా జీవితంలోనూ జరిగాయి. పెళ్లీ, ఒకబ్బాయి పుట్టడం.''     "మీ వైవాహిక జీవితం?''     "చాలా సంతోషంగా గడిచిపోతోంది. మావారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను తన భార్యగా రావడం తన పూర్వజన్మ సుకృతం అంటారు. కిచ్చుని వదిలి వెళ్లిపోయాక ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నాను. మొదటి రెండు, మూడు సంవత్సరాలు చదువు పేరుతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మా అక్కలా ఏం చేస్తానోనని మా వాళ్లకు భయం. అందుకని పెళ్లికి తొందర చేసేవాళ్లు. కిచ్చు జ్ఞాపకాలు నన్ను చాలా బాధించేవి. గుండె రాయి చేసుకున్నాను. మనసుని సమాధానపర్చుకోడానికి సంవత్సరం పైనే పట్టింది. నా ప్రేమ తాలూకు జ్ఞాపకాలేవీ నా వైవాహిక జీవితానికి అడ్డంకులు కాకూడదనీ, కాబోయే నా భర్తకు నా పూర్తి సహకారాన్నీ, ప్రేమనీ పంచిస్తానని గట్టి నిర్ణయం తీసుకోగలిగిన తర్వాతే ఒప్పుకున్నాను.''     "కిచ్చు?''     "కిచ్చు కూడా చాలా ఆలస్యంగా పెళ్లి చేసకున్నాడని తెలిసింది. తల్లి అనారోగ్యంతో మంచం పడితే ఆమె కోరిక మేరకు దగ్గర బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని విన్నాను. ఏమైనా కిచ్చు పెళ్లి చేసుకున్నాడన్న వార్త నాకు చాలా ఊరటనిచ్చింది. నా గుండెల్లో ఎప్పుడూ బరువుగా మెదిలే తప్పు చేశాననే భావన తగ్గినట్లనిపించింది.''     "మరి మీ సమస్య ఏమిటి?''     "పదిహేనేళ్ల తర్వాత మేము మళ్లీ కలుసుకున్నాం. మావారి ఉద్యోగరీత్యా మేము ఎక్కువగా నార్త్‌లోనే గడిపాము. ఈ మధ్యే ఒక సంవత్సరం క్రితం హైదరాబాద్ వచ్చాం. తొమ్మిది నెలల క్రితం ఒక స్నేహితురాలు కలిసి కిచ్చు హైదరాబాద్లోనే ఉన్నాడని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చింది. మొదట ధైర్యం చేయలేకపోయాను. చివరకు ఒకరోజు ఫోన్ చేశాను.     'హలో.'     'హలో. ఎవరూ?'     'నేను లోలోని.'     తను తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది. కుశలప్రశ్నలు, ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకుని, అవీ ఇవీ మాట్లాడుకున్నాక 'కిచ్చూ నన్ను క్షమించావు కదూ' అని అడిగాను. 'ఇప్పుడవన్నీ ఎందుకులే' అన్నాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఇప్పటివరకూ నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేశాను అంటే మనసు ఎంత తేలికగా ఉంటుందో అలా అనిపించింది.''     "తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లా?''     "లేదు. ఫోన్ నంబర్ ఇచ్చిన స్నేహితురాలి ఇంట శుభకార్యానికి కలిశాము. అలాగే మరొకసారి. ఫోన్‌లోనే తరచూ మాట్లాడేదాన్ని.''     "పాత విషయాలు జ్ఞాపకం చేసేవారా మీరు?''     "లేదు. అంటే మిత్రుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటి, రెండు విషయాలు దొర్లేవి.''     "తను''     "కావాలని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒకసారి ఏదో చెప్పబోయి ఆపేసి క్షమించు లోలో అన్నాడు.''     "ఏ విషయాలు మాట్లాడేవారు?''     ప్రశ్నలన్నీ సుసీయే అడుగుతోంది. రామ్ మౌనంగా వింటున్నాడు.     "ఎక్కువగా మా కుటుంబం గురించి, మా ఇద్దరికీ తెలిసిన వాళ్ల గురించి. నాకు సరదాగా మాట్లాడ్డం అలవాటు.''     "యు మీన్ ఫ్లర్టింగ్?''     "నాట్ లైక్ దట్'' ఆమె ముఖం ఎర్రబడింది.     "ఒకరోజు నేను రెండు మూడు సార్లు ఫోన్ చేసినా తన దగ్గర్నుంచి జవాబు లేదు. చివరికి తనే చేశాడు. ఎన్నిసార్లు చెయ్యాలి అన్నాను.     'ఒక మిస్డ్ కాల్ మాత్రమే ఉంది'     'నీ ఫోన్ సరిగా పనిచెయ్యడం లేదేమో'     'నా ఫోన్ బాగానే ఉంది. కాల్స్ వస్తూనే ఉన్నాయి. నీ ఫోనే బాగాలేదేమో' అన్నాడు.     'ఏం కాదు. నీ ఫోనే డొక్కు డొక్కు డొక్కు ...' అన్నాను. తను ఎంత నవ్వాడో చెప్పలేను.     'మళ్లీ ఎప్పుడు ఫోన్ చేస్తావు' అనడిగేవాడు.     'నేను చెయ్యను.'     'ఎందుకని?'     'నా ఇష్టం.'     'నేనూ చెయ్యను' అనేవాడు కోపంగా.     'అది నీ ఇష్టం' అనేదాన్ని.''     "మీరెప్పుడూ ఇలానే సరదాగా మాట్లాడతారా?''     "అందరితో కాదు. నాకు బాగా కావలసిన ఇద్దరు ముగ్గురితో. హిందీ పాటలు హమ్ చేయడం తనకు అలవాటు. ఒకసారి 'చలో ఇక్‌బార్ ఫిర్ సె అజ్నబీ బంజాయె హం దోనో' అని పాడాడు.     'అజ్నబీ అంటే' అడిగాను.     'అపరిచితులు' అన్నాడు.     'అపరిచితులేగా. శంకర్ అపరిచితుడుగా మారిపోదాం' అన్నాను.''     సుసీకి నవ్వాగలేదు     "నేను కిచ్చుతో అంతకుమునుపులాగా సరదాగా ఉండకూడదేమో అనిపిస్తోంది.''     "అందులో తప్పేం ఉంది లెండి. కిచ్చు మాటల్లో మీరంటే ఇష్టం కనబడేదా?''     "చెప్పలేనంత. ఒకసారి పది రోజులు నేను ఫోన్ చెయ్యలేదు. తను సామాన్యంగా నాలుగు రోజులకొకసారైనా ఫోన్ చేసేవాడు. తను చెయ్యకపోతే నేనే చేశాను.     'ఏం బాబూ. ఎన్ని రోజులైంది ఫోన్ చేసి. నేనసలు గుర్తొస్తున్నానా?'     'రోజుకి ఇరవై, ముప్ఫైసార్లు'     'ఏమిటీ?'     'అదే. ఫోన్ చేద్దామనుకోవడం, పనిలో పడిపోవడం' తన గొంతులో తప్పుగా మాట్లాడాననే అపరాధ భావన.     'నువ్వైనా ఫోన్ చెయ్యచ్చుగా' అన్నాడు తేరుకుని.     'ఇంటినిండా చుట్టాలు'     'చుట్టాలంటే?'     'అర్థం చేసుకోవాలి బాబూ' అన్నాను.''     ఆ మాట ఆమె దీర్ఘం తీస్తూ అన్న తీరుకి సుసీకి చాలా ముచ్చటేసింది. కిచ్చు సంగతి వేరే చెప్పాలా అనుకుంది.     "అంటే కిచ్చుతో మాట్లాడడానికి మీరు ప్రైవసీ కోరుకునే వాళ్లా'' సుసీ.     "మీరు రాజమండ్రిలో కదా చదివానన్నారు?'' లలిత అడిగింది.     "మీకు ఇష్టంలేని ప్రశ్నలేస్తే మాట మార్చేస్తారా'' అంది సుసీ.     "మీరేదో అడగబోయారు'' అందామె రామ్‌తో.     మళ్లీ మాట మార్చేస్తోంది. ఈవిడతో మాట్లాడడం చాలా కష్టం. ఆ కిచ్చు ఎన్ని బాధలు పడ్డాడో అనుకుంది సుసీ.     "సుసీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు'' మొదటిసారిగా మాట్లాడుతూ అన్నాడు రామ్.     "ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమిటి అని ప్రశ్నలు వస్తాయి కదా. ఎందుకు లేనిపోని మిస్ అండర్ స్టాండింగ్స్?''     "ఆ తర్వాత ఏం జరిగింది?''     "ఆ తర్వాత ఫోన్ చెయ్యడమే మానేశాడు. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఫోన్ చేసి 'హేపీ ఫ్రెండ్ షిప్ డే' అని చెప్పాను. మొదటి ఫోన్ నీకే చేశాను అని చెప్పాను. 'థాంక్స్. సేమ్ టు యు' అని వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఫోన్ కట్ చెయ్యడం, లేదా వినబడనట్టు నటించడం. నాకు చాలా బాధ కలిగేది. లోలో అనడం మానేసి లలితా అని పిలవడం మొదలుపెట్టాడు.     ఎప్పుడైనా ఫోన్ చేస్తే 'నేను బిజీగా ఉన్నాను. తర్వాత చేస్తాను' అని ఫోన్ పెట్టేయసాగాడు. కానీ చెయ్యడు. నేనే సిగ్గు విడిచి నెలరోజుల తర్వాత ఫోన్ చేస్తే రెండు నిమిషాలు క్షేమసమాచారాలు మాట్లాడుకోగానే 'చుట్టాలు వచ్చారు ఉంటాను' అని అబద్ధం చెప్పేవాడు. నాకు ఎంత క్షోభ కలిగేదో చెప్పలేను. ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే పనిమీద అమీర్‌పేట వచ్చానన్నాడు. మేము హిమాయత్‌నగర్‌లో ఉంటాము. 'దగ్గరే కదా, ఒకసారి రావచ్చుకదా' అన్నాను.     'అబ్బే మరీ దగ్గరేం కాదు' అన్నాడు.     'మనం ఒకసారి మాట్లాడుతున్నపుడు దగ్గరే అన్నావు. కాలం గడిచేకొద్దీ దగ్గరలు దూరాలవుతాయేమో' అన్నాను.     'కదా' అన్నాడు. నా మనసు గాయపడింది. ఒకరోజు ఫోన్ చేసి అడిగేశాను. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ తప్పించుకోడాలు అని. తను మా ప్రేమని మరిచిపోలేకపోతున్నాడట. నాతో మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ మరీ మరీ గుర్తుకు వస్తున్నాయట. అందుకని మనం మాట్లాడుకోకుండా, కలవకుండా ఉండడం మంచిది అన్నాడు.''     ఒక్క నిమిషం ఎవరూ మాట్లాడలేదు. అదే ఈవిడ సమస్య అన్నట్లుగా చూసింది సుసీ రామ్ వైపు.     "నా సమస్య మీకు చాలా సిల్లీగానూ, అసలు సమస్యే కానట్టు అనిపించవచ్చు. ఒక చిన్న విషయాన్ని భూతద్దంలోనుండి చూస్తున్నానని అనుకోవచ్చు. కాని కిచ్చుతో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. అయితే ఇతరులకు సంతోషం కలిగించకుండా సంతోషాన్ని పొందే అధికారం మనకు లేదు అని బెర్నార్డ్ షా అన్నాడు. నాతో మాట్లాడడం సంతోషదాయకం కానప్పుడు నేనెలా మాట్లాడతాను.''     "మీ సమస్య అతడి ఆలోచనలని ఎలా వదిలించుకోవాలనా?'' అడిగాడు రామ్.     చురుగ్గా చూసింది.     "కాదు. తనే నా తలపుల నుండి పారిపోవాలని చూస్తున్నాడు. అతను పాత జ్ఞాపకాల్ని పట్టుకుని ఎందుకు వేళ్లాడాలి? అందువల్ల ఏమిటి ఉపయోగం.''     "అవును. మనుషులెప్పుడూ వర్తమానమనే బలమైన తాడుని పట్టుకుని ముందుకు సాగాలి. మీ స్నేహితుడు గతం అనే బలహీనమైన ఆధారాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. లోయలోకి జారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది'' అన్నాడు రామ్.     "అతడికి ఎవరైనా ఈ విషయం చెప్పినా మారడు.''     "ఎందుకలా అనుకుంటున్నారు?'' అంది సుసీ.     "ప్చ్. అతడికి ఎవరూ చెప్పక్కర్లేదు కూడా. తను చాలా తెలివిగలవాడని తనకి నమ్మకం. అలా మారేట్లయితే మీ దగ్గరకి సలహాకోసం వచ్చేదాన్నే కాదు.''     "బహుశా అతడికి అంత మానసిక పరిపక్వత లేదేమో'' అన్నాడు రామ్.     నిరసనగా చూసిందామె. రామ్ మాటలు ఆవిడకి నచ్చలేదని తెలుస్తోంది సుసీకి.     "అది అతడి బలహీనతే అనుకోండి. తను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యడం లేదు కదా'' అంది సుసీ.     "తను నన్ను ఒక స్నేహితురాలిలా ఎందుకు భావించడు? నేనేమంత పాపం చేశాను? నేనప్పుడు తనకి చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే. కానీ తప్పలేదు. ఆ విషయం తను కూడా అంగీకరించాడు.''     "కిచ్చూ మీరు ఈ మధ్య మాట్లాడుకుని ఎన్ని రోజులైంది?'' సుసీ.     "మూడు నెలలు. ఎంత బాధగా ఉంటోందో తెలుసా?''     "అతడు మాట్లాడడం లేదని మీరు ప్రతిరోజూ గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నారా?'' రామ్.     "మధ్యలో ఆరోగ్యం సరిగాలేక, పిల్లవాడి పరీక్షలు, బంధువుల ఇంట్లో పెళ్లి... ఇలా ఒక నెల గడిచిందనుకోండి.''     "చూసారా అప్పుడు కిచ్చు ఆలోచనలు మిమ్మల్ని బాధపెట్టలేదు, తను మీతో మాట్లాడ్డం లేదని మీకు గుర్తు రాలేదు. అంటే మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోవాలి'' అన్నాడు రామ్.     తల వంచుకుని ఉన్న ఆమె ఆ మాటలు విన్నదో లేదో తెలియదు.     "పెళ్లికి ముందు అంటే మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్న రోజుల్లో శారీరకంగా ఒక్కటయ్యారా?'' సుసీ.     ఈ ప్రశ్న ఆమెని గాయపరిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.     "క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టినట్టున్నాను. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని అంచనా వెయ్యడానికి అడగాల్సి వచ్చింది'' అంది సుసీ. "అటువంటిదే జరిగుంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేదాన్ని.''     "అటువంటిదే జరిగుంటే కిచ్చుకి మీపై ఇంకా - ప్రేమ అనండి, అనురాగం అనండి - ఈ స్థాయిలో ఉండే అవకాశం తక్కువగా ఉండేదనుకుంటాను'' అంది సుసీ.     "అంటే ప్రేమ సెక్స్‌తో అంతమవుతుందనా?'' లలిత.     "కాదు. అంతమూ కాదు, అదే అంతిమమూ కాదు. ప్రేమలో అదొక భాగం. కొనసాగే అవకాశం... అంటే వివాహం అయుంటే ప్రేమ మరింత బలపడేది. ఈ వ్యక్తి నాకు అన్నివిధాలా స్వంతం అనే భావన తృప్తినిస్తుంది.'' అన్నాడు రామ్.     "ఒకరినొకరు భౌతికంగా చూసుకోవడం వల్లను, స్వరం వినడం వల్లను కలిగే స్పందనలు ఇవి. మీరిద్దరూ గతంలో మీ చుట్టూ నిర్మించుకున్న ఊహాసౌధం కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించడానికి కిచ్చు ప్రయత్నిం చెయ్యడం లేదు కదా.'' సుసీ అంది.     "కిచ్చు అంత ఇంప్రాక్టికల్, ఇమ్మెచ్యూర్ అని నేననుకోను'' అందామె. "బహుశా ఆ ప్రయత్నం అసాధ్యమని లేదా చెయ్యకూడదని అనుకుని ఉండొచ్చు. నైతిక కట్టుబాట్లని అధిగమించకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉండొచ్చు.'' రామ్ సుసీ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు.     "ఇంతకీ మీరు కోరుకునేదేమిటి?'' అడిగాడు రామ్.     "మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోలేకపోయాం. అంత మాత్రాన బాధపడుతూ కూర్చోవాలా? మా స్నేహం కొనసాగాలి.''

        "చూడండి ఈ విషయాలు మీవారికి లేదా కిచ్చు కుటుంబానికి గానీ తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించారా?'' అన్నాడు రామ్. 

        "ఇప్పుడు మేమేం తప్పు చేసామని భయపడాలి. మా మనసుల్లో ఎలాంటి చెడు ఆలోచనలు లేవే.''     "ఈ విషయం మీ ఇద్దరికీ తెలుసు. అందరూ అలానే అనుకోవాలనేం లేదుగా. ఇది దృష్టిలో పెట్టుకునే కిచ్చు మీతో మాట్లాడడం లేదేమో'' అన్నాడు రామ్.     కాసేపు మౌనం.     రామ్ ఇంకేమైనా మాట్లాడతాడేమో అన్నట్టు చూసింది.     "మీకూ సమస్యలుంటాయా?'' లలిత అడిగింది. ఆమె ఎవరిని అడిగిందో అర్థం కాలేదు.     "మేమూ మనుష్యులమే కదా. వైద్యులకి అనారోగ్యం లాగే'' నవ్వుతూ అంది సుసీ.     "అప్పుడు నా దగ్గరకు రండి కౌన్సెలింగ్ కి'' అంది లలిత.     సుసీ నవ్వేసింది.     "నిందితుడు రాజకుమారుడే అయినా రాజు నిష్పక్షపాతంగా తీర్పుచెప్పాలంటారు. మీరు నాకూ అలానే సలహా ఇవ్వండి'' ఆఖరుగా ఏం చెబుతారో అన్నట్లు చూసింది.     "అవునండి. నేను సుసీకి అదే చెబుతుంటాను. మన వ్యక్తిగత అభిప్రాయాల్ని, అనుభూతుల్ని మనమిచ్చే సలహాల్లో చొరబడనీయకూడదని.''     

        సుసీ ఏదో చెప్పబోయింది.     సుసీని వారించి రామ్ మొదలుపెట్టాడు.     "నేను చెప్పే సలహా మీకు నచ్చకపోవచ్చు. కౌన్సిలింగ్‌కి వచ్చినవాళ్లు పరిష్కారం తమకు నచ్చే విధంగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం. కిచ్చు మీతో మాట్లాడకూడదని తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పలేము. అతడి బాధా, మనసులోని ఆలోచనలు మనం వినే అవకాశం లేదు కదా. వాద, ప్రతివాదాలు విని కిచ్చు చేస్తున్నది సరైనదనో లేక కిచ్చు మీతో స్నేహాన్ని కొనసాగించాలనో తీర్పు చెప్పే వేదిక కాదు ఇది. వేదాంతం మాట్లాడుతున్నాననుకోవద్దు. పుట్టుకా, మరణం, మధ్యలో జీవితం తప్పవు. ప్రతి మనిషీ సుఖంగానూ, ఆనందంగానూ జీవించడానికి ప్రయత్నించాలి. ఆ క్రమంలోనే మనకు ఇష్టం ఉన్నవాటిని వదిలెయ్యాల్సి రావచ్చు. కొన్ని ఇష్టంలేని వాటిని స్వీకరించాల్సి రావచ్చు. కిచ్చు జీవితం, మీ జీవితం సాఫీగా సాగిపోతున్నాయి. యాదృచ్ఛికంగా కలిసారు. స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడుకున్నారు. మళ్లీ కలుసుకోవచ్చు, లేకపోవచ్చు. కొంతమంది మిత్రుల్ని మనం చాలాకాలం కలుసుకోము, బహుశా మళ్లీ ఎప్పటికీ కలుసుకోమేమో కూడా. వాళ్లు అప్పుడప్పుడూ లేదా సందర్భాన్ని బట్టి గుర్తుకొస్తారు. ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది అనుకుంటాము. కలిస్తే సంతోషంగా ఉంటుంది. కలుసుకోకపోయినా బాధ ఉండదు. కిచ్చు విషయం కూడా అలానే అనుకోండి. ఫోన్‌చేసి మాట్లాడితే సంతోషించండి. లేకపోతే కిచ్చుని ఇన్నేళ్ల తర్వాత కలవడం ఒక అందమైన కల అనుకోండి. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. సరోవరంలో ఒక రాయి పడొచ్చు. కల్లోలం కొంతసేపే ఉంటుంది. కొంతసేపే ఉండాలి.''     "ఇంతకన్నా వేరే దారిలేదా?'' దీనంగా అడిగింది లలిత.     "లేదు'' అన్నాడు రామ్.     ప్రొఫెసర్‌గారు ఇంత నిష్కర్షగా మాట్లాడ్డం ఎరుగని సుసీ ఆశ్చర్యంగా చూసింది.     ఆనకట్ట ఏ క్షణాన్నైనా తెగేలా ఉంది.     సుసీ చెయ్యి అప్రయత్నంగా లలిత చేతి మీదకు వెళ్లింది.     "మీరు చెప్పినట్టే మనసు దిటవు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కిచ్చుని కూడా నా ఆలోచనలు బాధించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నా క్షేమం కోరి కిచ్చు నాకు ఫోన్ చెయ్యదలచుకోలేదని అన్నారు మీరు. కావొచ్చు. తనైనా సుఖంగా ఉండాలని కోరుకుంటాను'' నెమ్మదిగా లేచి చేతులు జోడించింది. రామ్, సుసీ కూడా చేతులు జోడించారు. వర్షిస్తున్న కళ్లను తుడుచుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయింది.     సుసీకి మనసు భారంగా తోచింది. 'ఈవిడ పాటికి ఈవిడ తన బాధనంతా వెళ్లబోసుకుని వెళ్లిపోయింది. పాపం కిచ్చు ఎవరికైనా చెప్పుకున్నాడో లేదో. అతడిని తలుచుకుంటేనే జాలేస్తోంది.'     హఠాత్తుగా గుర్తు వచ్చినట్టయి "ప్రొఫెసర్ సర్ మనం ఎంత తప్పు చేశాము. కిచ్చు గురించి అసలు ఆలోచించనేలేదు. ఆమె భర్త పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయి వెళ్లిపోతున్నారట. అయ్యో ఆమె నడిగి అతని ఫోన్ నంబర్ తీసుకున్నా బాగుండేదే'' అంది సుసీ.     రామ్ జీవంలేని నవ్వు నవ్వాడు.     "అందరికీ శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడిందట'' చిన్నగా అనుకున్నాడు రామ్.     సుసీకి ఏమీ అర్థం కాలేదు. ఆమె బయటకు వచ్చి కిచ్చు గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో రామ్ భార్య లోపలికి వచ్చింది.     "మేడమ్ బాగున్నారా? ఏంటిలా హఠాత్తుగా వచ్చారు?'' అంది సుసీ.     "ఈ రోజు మా పెళ్లిరోజు. లంచ్‌కి బయటికి వెళ్దామన్నారు. నీవు కూడా రా.''     "మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలా. అయినా నాకు వేరే పనుంది. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు'' అని సుసీ బయటకి వెళ్లిపోయింది. రామ్ భార్య కాబిన్‌లోకి వెళ్లింది.     "ఏమయింది?'' నిస్త్రాణంగా కూర్చుని ఉన్న రామ్ వైపు ఆందోళనగా చూస్తూ అడిగింది.     రామ్ ఏమీ మాట్లాడలేదు.     "లోలో వచ్చిందా కిచ్చూ?'' అనునయంగా అడిగిందామె.     "అవును ... వచ్చింది. తనతో స్నేహాన్ని కొనసాగించలేనని చెప్పాను. ఏడుస్తూ వెళ్లిపోయింది. కొన్నాళ్లు పోతే తనే అర్థం చేసుకుంటుందిలే'' దిగులుగా ఏటో చూస్తూ అన్నాడు రామ్.

(ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 21 ఫిబ్రవరి 2010 సంచికలో ప్రచురితం)
Comments