మనసుకు తొడుగేది!? -రాధ మండువ

    “శ్రీజా! బట్టలన్నీసర్దేసుకున్నావా?” అంది అమ్మ ఆఫీసు నుండి ఇంట్లోకి అడుగు పెడుతూనే.

     ఆఁ సర్దుకున్నానమ్మా!” అన్నాను.

     ఏం సర్దుకున్నావో చూపించు - పద" అంది.

     అబ్బబ్బ! సర్దుకున్నాలేమ్మా! ఇంకాసేపట్లో బస్సు వస్తుంది! టైమ్ లేదు" అన్నాను విసుగ్గా.

     అదికాదుశ్రీ - ఏమైనా మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది పడతావు ఊరుగాని ఊర్లో" అంటూ సూట్‌కేసు తీసి అన్నీ చెక్‌చేసింది.

     షిమ్మీలుపెట్టుకోలేదేమే"

     ఇన్నర్స్ పెట్టుకున్నానుగామ్మా! మళ్ళీ షిమ్మీలెందుకు?”

     శ్రీ, ఇన్నర్స్ పైన షిమ్మీలు వేసుకోవాలి - ముఖ్యంగా బయటికి వెళ్ళినపుడు, తీసుకురా" అంది కోపంగా.

     అలమరా తీసి షిమ్మీలు తెస్తూ 'చెక్ చేయడం అయింది ఇక ఇప్పుడు జాగ్రత్తల ఉపన్యాసం వినాలి' అనుకున్నాను.

     నా చేతుల్లోంచి షిమ్మీలు తీసుకుని సూట్‌కేస్‌లో సర్దుతూ "ఇంజనీరింగ్ దువుతున్నాను జాగ్రత్తలు నాకు తెలియదా నువ్వు చెప్పకపోతే అని అనుకుంటున్నావ'ని నాకు తెలుసు. ఏదైనా జరిగితే బాధపడతాం కాబట్టి జాగ్రత్తలు చెప్తాం" అంది.

     రాహుల్  గుర్తొచ్చాడు. నేను రాహుల్ని ప్రేమిస్తున్నానని, చదువయ్యాక ఇద్దరం పెళ్ళి చేసుకుంటామని చెబ్దామని నోటి దాకా వచ్చింది కాని ఆమె ఏమంటుందో? 'మూడ్ చెడిపోతే మళ్ళీ ఎక్స్‌కర్షన్ ఎంజాయ్ చేయలేను' అనుకుని అమ్మ చెప్తున్న జాగ్రత్తలకి 'ఊ' కొడుతూ ఉండిపోయాను.

     భలే ఆంటీ మీరు..! దానికి చిన్నపిల్లకి చెప్తున్నట్లు జాగ్రత్తలు చెప్తున్నారు" అంది శ్రుతి. హాల్లో నిలబడి గదిలో మేం మాట్లాడు కుంటున్నవన్నీ విన్నట్లే ఉంది దాని వాలకం చూస్తుంటే.

     దా!  శ్రుతీ!  ఇద్దరూ జాగ్రత్తమ్మా!” అంది అమ్మ.

     అయ్యో!  ఆంటీ!  ఏంటి జాగ్రత్త? మీకే ఆపదా రాకుండా తొడుగులేసుకోండి అని చెప్తున్న కాలం ఇది. మీరేమో ఇంకా బిసికాలపు జాగ్రత్తలు చెప్తున్నారు" అంది.

     శరీరాంగాలకి తొడుగులు వేసుకోగలరేమో శ్రుతీ... కానీ మనసుకేం తొడుగులు వేసుకోగలరు? దానికే విధంగా సమాధానం చెప్పగలరు?” అంది అమ్మ. 

    ఆమె గొంతులోని కఠినత్వానికి అన్నింటినీ తేలిగ్గా తీసుకుని కొట్టిపారేసినట్లుగా సమాధానం చెప్పే శ్రుతి అమ్మ కళ్ళల్లోకి చూడలేనట్లుగా తలవంచుకుంది.

     బయట నుండి బస్ హారన్ మోగడంతో "పదండి బయలు దేరండి" అంది అమ్మ.

     బస్సెక్కాక "అమ్మ ఎప్పుడూ అంతేలే. చాదస్తం. నువ్వేమీ అనుకోకు" అన్నాను.

     "ఇట్స్ ఓకె" అంది శ్రుతి భుజాలెగరేస్తూ.

* * *

     మా ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులకి వీడ్కోలు పలుకుతూ కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎక్స్‌కర్షన్  ఇది. హార్సిలీ హిల్స్‌లో కాటేజ్‌లు బుక్‌చేశారు.  రాత్రి బస్‌లో రాహుల్ నన్ను నిద్ర పోనీయకుండా నా పక్కపక్కనే తిరుగుతూ లెక్చరర్ చూడకుండా నన్ను తాకుతూ కొంటెపనులు చేస్తూనే ఉన్నాడు. వేకువ ఝాము నాలుగుకి హార్సిలీహిల్స్ చేరుకున్నాము. 

    కాటేజ్ లోకి వెళ్ళి అన్నీ సర్దుకుని కాసేపు పడుకున్నామో లేదో రేణుకమేడమ్ అందరినీ బయలు దేర తీసింది. ఆ ఉదయం అక్కడున్న చిన్నజూ, గుడీ, ఆ కొండంతా తిరిగి చూశాం. దాదాపు 9 అవుతుండగా బస్ ఎక్కి కిందకి వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి నొందిన రిషీవ్యాలీ స్కూలుకి వెళ్ళాము. 

    స్కూలు చూశాక అక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న తెట్టు వేణుగోపాలస్వామి ఆలయం చూసి వస్తూవస్తూ దారిలో గంగమ్మగుడి దగ్గర బస్సు ఆపారు భోజనాల కోసమని.

    ఊళ్ళో ఉన్న హోటల్లో నుండి భోజనాలు వచ్చాయి. గంగమ్మ గుడిదగ్గర ఉన్న ఇళ్ళల్లోవాళ్ళు టార్పాలిన్ బట్టలు, చాపలు తెచ్చిచ్చారు. ఆ చేలల్లోనే చాపలు పరుచుకుని భోజనాలు చేశాం. మా ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ కొందరు, ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కొందరు - వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంది. రాహుల్ కళ్ళల్లో రాత్రి బస్ లో చేసిన అల్లరి పనుల తాలూకు ఆనందం.

    భోంచేశాక చేతులు కడుక్కోవడానికి గుడికి దగ్గరగా ఉన్న ట్యాంక్ దగ్గరకి వెళ్ళాం.

     శ్రీ!  రాత్రికి మేం మీ రూమ్ కొస్తాం. తలుపు గడి వేసుకోకండి. దగ్గరగా వేసి ఉంచండి" అన్నాడు రాహుల్ నాకు దగ్గరగా వచ్చి చేతులు కడుక్కుంటూ.

     వద్దు - వద్దొద్దు" అన్నాను కంగారుగా. పైకైతే అలా అన్నా కాని నా శరీరంలో వణుకు స్పష్టంగా కావాలంటోంది.

     అప్పటికే రాహుల్ విననట్లుగా పక్కకి వెళ్ళిపోయాడు. నాకు గుండె దడదడ లాడసాగింది. మగపిల్లలు గర్ల్ ఫ్రెండ్స్‌ని కలుసుకోవడానికి వేసుకున్న ప్లాన్ లెక్చరర్స్‌కి ఎక్కడ తెలిసి పోతుందనో లేక మరెందుకో ఏదో కంగారు మా ఆడపిల్లలందరి ముఖాల్లో కనపడుతోంది. అంత ధైర్యంగా మాట్లాడే శ్రుతి కూడా నాదగ్గర కొచ్చి  "రాహుల్ కూడా వస్తానన్నాడా?” అంది ఆత్రమూ, ఆందోళన కలగలిసిన గొంతుతో.

     ఊఁ వద్దన్నా వినేట్లుగా లేరే" అన్నాను.

     ష్! సాయంత్రం మాట్లాడు కుందాం" అందది.

     అందరూ భోంచేశాక మిగిలిన పదార్థాలని అక్కడున్న ఇళ్ళల్లో వాళ్ళని పిలిచి ఇచ్చేసింది రేణుక మేడమ్. లెక్చరర్స్ అందరూ భుక్తాయాసంతో చాపలమీద వాలినట్లుగా పడుకున్నారు. మేము అక్కడక్కడే తచ్చట్లాడుతున్నాం. 

    పిల్లలు తమ కళ్ళకి కనపడనంత దూరం వెళ్తున్నారని గమనిస్తే మాత్రం పిలిచి దగ్గరగా కూర్చో బెడుతున్నారు.

     అబ్బబ్బ!  ఏం కాపలా కాస్తారో చూడు. స్వేచ్ఛ లేని బతుకు" విసుక్కుంటున్న శ్రుతి మాటలకి అందరం ఫక్కున నవ్వాం.

     సాయంత్రం నాలుగవుతోంది. కొండల చాటుకి వెళ్ళి సంధ్యాదేవిని కలుసు కోవాలనే తాపత్రయంతో సూర్యుడు పక్కకి వాలుతున్నాడు.  

    రేణుక మేడమ్ లేచి వెళ్ళి అక్కడున్న ఇళ్ళల్లో వాళ్ళతో మాట్లాడి టీ కి ఏర్పాటు చేసింది. అప్పుడే పిండిన పాలతో వాళ్ళు టీ తయారుచేసి ఇచ్చారు.

     టీ చాలా బావుంది తాతా! ఇక బయలు దేరతాం" అంది రేణుక మేడమ్ టీ తెచ్చిన తాతకి డబ్బులు ఇస్తూ.

     ఇంకాసేపున్నారంటే ముగ్గురక్కచెల్లెళ్ళ కొండ గుండా కిందికి దిగే సూర్యుణ్ణి చూడొచ్చు. ఇక్కడికి అందరూ అది చూడటానికే కార్లేసుకుని మరీ వచ్చి చూసి పోతారు" అన్నాడు ఆ తాత.

     'ముగ్గురు అక్కచెల్లెళ్ళకొండా!?' అనుకుంటూ మాకు వెనగ్గా ఒక దానికొకటి ఆనుకుని ఉన్నట్లు కనిపిస్తున్న మూడు కొండల వైపు చూశాం.

     ముగ్గురక్కచెల్లెళ్ళ కొండని ఎందుకంటారు?” మాలో చాలామందిమి లెక్చరర్స్ తో సహా ఒకేసారి అడిగాం.

     వీటికి పెద్ద కథ ఉంది" అన్నాడు. నిట్టూర్పు వెలువడింది అతని గొంతు నుంచి.

     ఆ శబ్దం మాకింకా ఆసక్తిని కలిగించింది. అందరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయి ఆ కొండలనే చూడసాగాం.

     కథ చెప్పు తాతా" అంది రేణుక మేడమ్.

     తాత మౌనంగా ఉన్నాడు ఒక్కమాట కూడా మాట్లాడకుండా.

     చెప్పుతాతా! ఎందుకలా ముగ్గురక్కచెల్లెళ్ళ కొండంటారో చెప్పు తాతా ప్లీజ్. నీకు తెలుసు కదా!" అందరం గోలగోలగా అరుస్తూ అతని చుట్టూ చేరాం.

     తెలుసు గాని నేను బాగా చెప్పలేను లేమ్మా! ఆడదాని మనస్సు మరో ఆడదానికే తెలిసిద్ది అంటారు. ఉండండి మా భార్యని పిలచకొస్తా అది చెప్పిద్ది" అన్నాడు.

     దూరంగా పొయ్యి ముందు కూర్చని నీళ్ళు కాగబెడుతున్న తన భార్యని కేకేశాడు. 

    “ఏమ్మే వీళ్ళకి ఆ ముగ్గురక్కచెల్లెళ్ళ కథంటా చెప్పు. నువ్వయితే చదువుకున్న దానివి. బాగా చెప్తావు" అన్నాడు మా దగ్గరకొచ్చిన ఆవిడతో.

     నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, ముదురాకు పచ్చ రంగు చీర, ఎర్ర జాకెట్టు వేసుకున్న ఆవిడ      ఇంతకు ముందు చూసిన గంగమ్మగుడిలోని గంగమ్మలా ఉంది. 

     సూర్యుడు అస్తమించడానికి ఆయత్తమవుతూ కొండల మీదకి చేరాడు. వేగంగా సాగిపోతున్న మబ్బుల విసురుకి చల్లని గాలులు సన్నటి నొక్కుల రాగాలు వినిపిస్తున్నాయి. ఆమె నిలబడే కథ చెప్తోంది. మేము మాత్రం బుద్ధిమంతులైన స్టూడెంట్స్‌లా చాపల మీద కూర్చున్నాం వరసగా.

 * * * 

     ఇదిగో పాపలూ! ఈమె పెద్దామె. పేరు సరోజిని. మధ్యలో ఉన్నామె నడిపామెసితార. అదిగో ఆ చివర ఉందే ఆమె విశారద. వాళ్ళ నాయన మారాజు. ముగ్గురికీ బ్రహ్మాండమైన మూడు కోటలుక ట్టిచ్చాడు. ఆ రాజు చచ్చిపోయేముందు ముగ్గురినీ పిలిచి 'పాపల్లారా!  మీకు నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుని సుఖంగా బతకండి. మీ మనసుకు ఏమైనా బాధ కలిగితే మాత్రం మాయమైపోయి మనూరి గంగమ్మ గుడికాడ కెళ్ళిపోండి. ఆయమ్మే మీయమ్మ. అదే మీకు పుట్టిల్లు' అని చెప్పి చచ్చిపోయాడు.

    ముగ్గురక్క చెల్లెళ్ళూ ఎవరికి కట్టిచ్చినింట్లో వాళ్ళు కాలం గడుపుతున్నారు. కొన్నాళ్ళకి ముగ్గురికీ పెళ్ళీడొచ్చింది.

     పెద్దామె సరోజినికి ఒకటే స్నేహితుల పిచ్చి షికార్ల పిచ్చి. ఒకసారి స్నేహితులతో హిమాలయాలకి షికారుకి పోయింది.  అక్కడ ఒక గూడారం వేయించుకుని సరదాగా కాలం గడుపుతోంది. ఒకరోజు సాయంత్రం స్నేహితులు లేకుండా ఒక్కతే ఆ మంచుకొండల్లో తిరుగుతుంటే ఒకబ్బాయి కనిపించాడు. అబ్బో! అతను భలే అందంగా ఉన్నాడంట. ఆ అబ్బాయి నేరుగా ఈమె దగ్గరకే వచ్చి 'నేను దారి తప్పాను ఫలానాది మా ఊరు నీకు దారి తెలుసా' అని అడిగాడంట. 

    ఈ సరోజినికి అతన్ని అతని అందాన్ని చూసేప్పటికి ప్రేమ పొంగిపోయింది. తన అందానికి సరైన జోడు ఇతనే అనుకుని పెళ్ళి చేసుకోమని అడిగింది. అతను 'ఇదేమిటమ్మా దారి అడిగితే పెళ్ళంటావ'ని వెళ్ళిపో సాగాడు.

 సరోజిని అతన్ని వదలకుండా వెంట పడింది. 'ఊరుకోవమ్మా నువ్వు. నాకిదివరకే పెళ్ళయింది. దారి తప్పి నేనేడుస్తుంటే ఏంటీ గోల' అంటా ఒక్కతోపు తోసి వెళ్ళిపోయాడు. 

    'ఇదిగో నువ్వు వచ్చి నన్ను పెళ్ళి చేసుకున్నావా సరే లేకపోతే ఇక్కడే ఈ మంచులో పడి చచ్చిపోతా' అని అరిచింది. అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అవమానంతో ఆపిల్ల ఏడుస్తూ మంచులో పడిఉంది. ఇదంతా చూస్తున్న దారులు కొట్టే దొంగ ఒకడు చీకటి పడ్డాక ఆమె పక్కకి చేరి ఆ అందమైన యువకుడి లాగే నటించి లోబరుచుకున్నాడు. 

    తను కోరుకున్న ప్రియుడే మళ్ళీ వచ్చాడనుకుని ఈ దొంగతో సంతోషంగా గడిపింది. తెల్లవారింది. ప్రియుడిని కళ్ళారా చూసుకుందామని చూస్తే వేరేఎవరో... 'ఛీ!  ఛీ!'  అనుకుని బాధతో ముఖం మాడ్చుకుని మాయమై గంగమ్మ గుడికాడొచ్చిపడింది.

 * * *

     ఇక రెండో ఆమె సితారకి ఒక పెంపుడు పావురం ఉంది. ఆ పాప ఓ వసంత కాలం ఆ పావురాన్ని ముద్దాడి  'ఒసే పావురమా! నాకు కాబోయే మొగుడిని నువ్వే తీసుకురా.  ఎవరినంటే వాళ్ళని తీసుకురాకే, మంచివాడిని మనసున్నవాడిని తీసుకురా సరేనా' అంది. 

    పావురం కువకువ లాడుతూ తూరుపు దిక్కుగా ఎగిరిపోయింది. 

    అది పోయిపోయి కుండలు చేసుకుంటున్న అందమైన కుర్రోడినిచూసింది. ఆ ఇంటి గోడమీద కూర్చుని సితార అందాన్ని గురించి వర్ణించి వర్ణించి చెప్పి అతన్ని వెంట బెట్టుకుని తీసుకొచ్చింది.

     పావురం వెంట కోటలోకి వస్తున్న ఆ కుమ్మరిని చూస్తానే సితార అతనిపైన మనసు పారేసుకుంది. లోపలకి పిలుచుకోని తలుపేసుకుంది. అంతే కుమ్మరి చేతిలో కుండలా రకరకాల వంపులు తిరిగి పోయింది. ఆరునెలలు బయట ముఖం చూడకుండా భోగాలల్లో తేలిపోయారు. 

    ఒకరోజు ఏదో మాటల్లో కుమ్మరికి తన ఇల్లు గుర్తొచ్చింది. 'పెళ్ళి చేసుకోని మా ఇంటికి తీసుకు పోతాపద' అన్నాడు. 'మరి నాకే కష్టమూ రాకుండా, ఏ దెబ్బా తగలకుండా చూసుకుంటావా?' అని అడిగింది. 'నీకెందుకు కష్టం కలిగిస్తాను? నీ కాల్లో ముల్లు గుచ్చుకున్నా నేనుభరించలేను' అన్నాడు. 

    సితారకి నమ్మకం కలగ లేదు. పెళ్ళి మాట ఎత్తకుండా కాలం గడిపేస్తోంది. రోజులు గడిచి పోతున్నాయి. ఇక కుమ్మరి ఆగలేక 'తన ఊరికి పోవాల'ని వత్తిడి తెచ్చాడు.

     అప్పుడు సితార అతన్ని పరీక్షించాలనుకుని అతన్ని దగ్గరగా పిలిచి 'ఈ రోజు నాకొక అపాయం రానుంది. అందుకే ఇన్నాళ్ళూ నీతో పెళ్ళికి ఒప్పుకోలేదు. అదిగో ఆ పడమరవైపున్న కిటికీలోంచి ఇప్పుడు ఒక నల్లని పక్షివచ్చి నన్ను దాని ముక్కుతో పొడిచి చంపేస్తుంది. దానికి నేను కనపడకుండా ఉండాలంటే నువ్వు నన్ను ఈ దబ్బనంతో పొడువు. నేను కప్పగా మారిపోతాను. ఆ పక్షి నేను కనపడక వెళ్ళిపోతుంది. అది వెళ్ళాక దబ్బనంతో మళ్ళీ పొడిచావంటే మామూలుగా మారిపోతాను. ఈ గండం గడిస్తే మనం పెళ్ళి చేసుకుని మీఊరికి వెళ్ళిపోదాం' అంది.

     'ఆ పక్షి ఏదో రానీ చూద్దాం దానికి నా ప్రాణాలని ఎరగా వేస్తా కావాలంటే అంతేగాని నా చేతులతో నేను నిన్ను ఎలా పొడవ గలను' అని అంటాడనుకుంది పాపం సితార. 

    తొందరగా పెళ్ళి చేసుకుని తీసుకోని పోవాలన్న ఆత్రమో ఏంపాడో ఆకుమ్మరి, మూలనున్న దబ్బనం తీసుకోని ఆపాపని పొడిచాడు. అంతే మనసు ముక్కలై గంగమ్మ గుడికాడి కొచ్చిపడింది.

 * * * 

     మూడో ఆమె విశారద.  చాలా మంచిమనసు గలది. ఈమెకి పువ్వులన్నా, పుస్తకాలన్నా ప్రాణం. తన కోట చుట్టూ అందమైన పూలతోటని వేసుకుంది. తోటమాలికి తోటపక్కనే ఇల్లు కట్టించి ఇచ్చింది. రోజులు గడవగాగడవగా ఆ తోటమాలిని నమ్ముకుని వచ్చిన అతని బంధువులు, అతని భార్యవైపు బంధువులు అందరూ అక్కడే ఇళ్ళు కట్టుకుని ఉండసాగారు.

     ఒకరోజు తోటలో విహారానికి వచ్చిన విశారద అక్కడ బండమీద కూర్చుని చదువుకుంటున్న ఒక అబ్బాయిని చూసింది. అతను తనకంటే వయసులో చిన్నవాడని తెలుస్తోంది. అతనికి దగ్గరగా వెళ్లి  'ఎవర్నువ్వు?' అంది. 'మీ తోటమాలిగారి బావమరిదిని' అన్నాడు. 'ఏం చదువుతున్నావు?' అంటూ చనువుగా అతని మీదికి వంగి అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకుంది.

     అంత అందమైన రాజకుమారి, పైగా యజమానురాలిని అంత దగ్గరగా చూసిన అతను చిన్నగా వణికాడు. అతని వణుకు ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. అతని దగ్గర నుంచి తీసుకున్న ఆ పుస్తకం గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. అప్పటి నుంచీ అతని దగ్గరున్న పుస్తకాలని గురించి అతను చెప్తే ఆమె దగ్గరున్న పుస్తకాల గురించి ఆమె చెప్పేది. పుస్తకాలు అందుకుంటున్నప్పుడు, వాటి గురించి మాట్లాడుకునేప్పుడు ఇద్దరూ పరవశంలో మునిగి తేలేవారు. తను అతనికి దగ్గరగా వెళ్ళినపుడు అతని శరీరం సుగంధం వెదజల్లాలని కొత్తబట్టలు, రకరకాల సబ్బులు, తైలాలు, సెంట్లు ఇచ్చేది.

     ఒకరోజు బయట కుండపోతగా వానపడుతోన్న వేళ ఒకరికొకరు తెలియకుండానే చేరువయ్యారు. ఆమె పూర్తిగా అతని మత్తులో పడిపోయింది. అతని కోసం ఇల్లు దానిలో అన్నిహంగులూ అమర్చింది. కొన్నాళ్ళయ్యాక పెళ్ళి చేసుకుందామని అడిగింది. 'నువ్వు నాకంటే పెద్దదానివి కదా! పెళ్ళి చేసుకుంటే ఆయుక్షీణం. పెళ్ళి చేసుకోపోతే ఏం? జీవితాంతం మనిద్దరం ఇలానే ఉందాం- పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ...' అన్నాడు. నమ్మింది. రేయింబవళ్ళు అతని గురించే ఆలోచించేది. అతనే లోకంగా బ్రతికింది.

     ఒకరోజు వేకువఝామున ఆమెకేదో పీడకల వచ్చి అతన్ని చూడాలన్న ఆత్రంతో తెల్లవారుతూనే అతని ఇంటికి వెళ్ళింది. అక్కడున్న ఇళ్ళల్లో ఎవ్వరూ లేరు. చింతచెట్టు కింద కుక్కిమంచంలో కూర్చుని ఉన్న తాతదగ్గరకి వెళ్ళి 'తాతా! వీళ్ళందరూ ఏరి?' అంది. 'మీ తోటమాలిగారి బావమరిది పెళ్ళికి రాత్రి అందరూ తరలివెళ్ళారమ్మా! మీకు తెలియదా?' అంటుండగానే పెళ్ళికి వెళ్ళినవారు పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకుతో సహాబళ్ళు దిగారు.

     ఆమెని అక్కడ చూసిన అతను తడబడుతూ భార్యని ఇంట్లోకి పంపించి ఆమె దగ్గరకి వచ్చాడు. 'ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్ళి చేసుకున్నాను. నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు' అని నమ్మబలికాడు. మళ్ళీ నమ్మింది. 'తను నాకంటే చిన్నవాడుకదా ఇంట్లో వాళ్ళు మాపెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు? పోనీలే నన్ను పెళ్ళి చేసుకోపోతే ఏం అతనికి నా మీదే ప్రేమ' అనుకుంది. కాని తన ప్రవర్తన సాటి ఆడదాన్ని ఎంత బాధిస్తుందో తెలుసుకోలేక పోయింది. అతన్ని తన కోటలోకి పిలిపించు కోవడం, అతని అవసరాలు తీర్చడం మళ్ళీ మామూలుగానే జరిగిపోతోంది.

     ఒకరోజు అతను రాలేదు. ఒక్కరోజు కూడా అతన్ని చూడకుండా ఉండలేని విశారద అతని ఇంటికి వెళ్ళింది. ఈమెని అక్కడ చూడగానే అతని భార్య 'నీకు నామొగుడే కావలసివచ్చాడంటే పద బయటికి' అంది. అసలా మాట ఊహించని విశారద ముఖం మ్లానమైంది. సహాయం కోసం అతని వైపు కన్నీళ్ళతో చూసింది. 'ఆమె వల్లే ఈరోజు మనం ఈ భోగభాగ్యాలని అనుభవిస్తున్నాం. ఇది ఆమె ఇల్లే' అని భార్యని మందలిస్తాడనుకుంది. కాని అతను 'ఎందు కొచ్చావిక్కడకి నాకాపురం తీద్దామనా?' అన్నాడు. అంతే ఆమె గుండె పగిలింది. గంగమ్మ గుడికాడి కొచ్చిపడింది.

     ముగ్గురక్కచెల్లెళ్ళూ తమకథలని ఆ గంగమ్మతో చెప్పుకుని ఎవరికీ ముఖం చూపించలేక ఇలా కొండలుగా మారిపోయారు. ఇదే ఆ అక్కచెల్లెళ్ళకొండ" కథ ముగించి మమ్మల్ని వేదనలో ముంచేసి ఆ ముత్తయిదువు నిబ్బరంగా నడిచిపోయింది. ఆ కొండలనే చూస్తూ ఒకనిమిషంపాటు అందరం అలా నిలబడి పోయాం.

 * * *

     సూర్యుడుకొండలకిందుగాదిగిపోతున్నాడు. తనకోసం క్రమం తప్పకుండా వచ్చే భానుడిని గర్వంగా చూసుకుంటూ సాయంసంధ్య సిగ్గుల రంగైన కెంజాయిని విరజిమ్ముతోంది.

     కథ విని మౌనంగా మారిన నామనసుని ఆ అద్భుత దృశ్యం మరింత లోతుల్లోకి తీసుకెళ్ళి వదిలి నట్లయింది.

     అమ్మగుర్తొచ్చింది. ఆమె మాటలు ఇప్పుడు నాకు అర్థం అయ్యాయి. గంభీరంగా మారిన నాముఖాన్నిచూసిన రాహుల్ కళ్ళల్లోని అల్లరి మాయమయింది. ఆ రాత్రి మా గది తలుపులు తీశారో, ఎవరైనా వచ్చారో లేదో నేను పట్టించుకోలేదు. నన్నుమాత్రం ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 24 ఆగస్టు 2014 సంచికలో ప్రచురితం)

Comments