మానవ ప్రయాణం - వారణాసి నాగలక్ష్మి

    
"మానవ్!!మానవ్!!" భయంగా ఆదుర్దాగా పిలుస్తున్నారు మానవ్ స్నేహితులు. మానవ్ చుట్టూ మూగిన జనం, డాక్టర్ విలియమ్స్ అదిలించడంతో దూరంగా తొలిగారు.గాలి తగిలేలా దుస్తుల్ని వదులు చేసి, చురుగ్గా పల్స్ పరీక్షించి, అతని గుండె తిరిగి శ్వాస అందుకోవడం కోసం ప్రయత్నించ సాగాడు డాక్టర్ విలియమ్స్.'బంగీ జంపింగ్' క్రీడలో పాల్గొనాలని మానవ్ వెంట వచ్చిన స్నేహితులు ముగ్గురూ అవాక్కుగా, బెదురుగా నిరీక్షణలో మునిగారు.మానవ్ జీవం పుంజుకోవాలని ఎవరికి వారు తమ తమ మతాలు తమకు నేర్పిన రీతుల్లో ప్రార్థించుకుంటున్నారు.  
    మానవ్ జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు!  
* * *

    వేల సంవత్సరాలుగా అనంతమైన ప్రయాణం! పొరలు పొరలుగా విడిపోతున్న ఎన్నో అనుభవాలు, అనుభూతులు, భయాలు, శారీరక మానసిక గాయాలు...ఏదో అభద్రత.వెనక్కి వెనక్కి ప్రయాణిస్తున్న కొద్దీ ఏదో గుబులు! ఎక్కడికో ఇష్టంలేని, బాధాకరమైన ప్రదేశానికి ఎందుకనో ఈ ప్రయాణం!తన ప్రమేయం లేకుండానే తన శరీరం అలా తేలికగా వెళ్ళిపోతోంది! శరీరమా?   కాదు...మనసు కాబోలు!ఉహు..మనసు కాదు..ఎంతమాత్రం కాదు.మనసే ఐతే ఎవరి మనసు? మానవ్ మనసా?మరి ఆ ప్రయాణాన్ని కిటికీలోంచి చూస్తున్నట్టు గమనిస్తున్న తనెవరు?

    ఇది కలా నిజమా?శరీరాన్ని ఆకులతో కప్పుకుని, అడవి మృగాలతో,పాములతో పాటుగా చెట్లూ పుట్టలూ లోయలూ గుట్టలూ...ప్రకృతిని ఇతర జీవాలతో పంచుకుంటూ బతుకుతున్న అతడెవరు? తనే!??అమ్మో!..అలా ఎలా బతికాడో అపుడు?అదేమిటి? ... ఆ చెట్టునల్లుకున్న బలమైన తీగలతో వేళ్ళాడుతోంది! అది కొండచిలువ!నోరుతెరచి తనవైపే సాగుతోంది!మానవ్ గమనించడం లేదు .. అయ్యో!     మానవ్!గమనించి చూసుకో...జాగ్రత్త!     ఈ జాగ్రత్త చెపుతున్నదెవరు? తనే కదా!తనంటే?మానవ్! అమ్మయ్య! మానవ్ చటుక్కున మరో బలమైన తీగని పట్టుకుని సర్రున జారి, బారెడు దూరం జరిగాడు క్షణకాలంలో. అతనికివన్నీ అలవాటే కాబోలు!అయినా భయమే.గుండె దడదడలాడుతోంది. ప్రాణం ఎంత తీపి!    

    అమ్మయ్య! చేరింది సురక్షితమైన జాగాలానే ఉంది!అయినా ఏం భద్రతో ఏమో! చీకటి పడిపోతోంది. వెలిగించిన కాగడా రెపరెపలాడుతోంది.ఆ వెలుగునీడల్లో మానవ్ కళ్ళలో కదలాడుతున్న భయం. భయం...దాహం... భయం...నీరసం...భయం...నిద్ర!     బంగారు కిరణాలు...వెలుగులు. రంగుల ఈకల వలువలు! చెట్టుకింద చేత చురకత్తితో నిలుచున్న అతను తనే! నిగనిగలాడే శరీరంతో తన పక్కనున్న స్త్రీ కళ్ళు తెల్లగా ప్రకాశవంతంగా ఎంత బావున్నాయి! ఎత్తైన చెట్ల కొమ్మలన్నీ పైన ఒకదానితో ఒకటి అల్లుకుపోయి అందమైన పందిరిలా ఏర్పడ్డాయి. వాటికి వేళ్ళాడే సన్నని పూల తీగలు.

    కండలు తిరిగిన తన బాహువుల్ని గర్వంగా చూసుకుని ఆమె వైపు కాంక్షగా చూశాడు తను. ఆమె నవ్వుల మెరుపుల్లో మైమరచాడు తను!
    అయ్యో! ఆ మూల గుట్టల వెనుకనుంచి పొదల మాటున దాక్కుంటూ వస్తున్న ఆ కోయవాడు….ఎవడువాడు    

    తననేం చేయాలని వస్తున్నాడు? అయ్యయ్యో! ఆ స్త్రీ మోజులో,పులిని చంపిన విజయోత్సాహంలో, పొంచివున్న ప్రమాదాన్ని గమనించలేని, పసిగట్టలేని అజాగ్రత్తకు ఎలా లోనయ్యాడో మానవ్! బల్లెం ఎత్తి ఆ కోయవాడు అటువైపే గురిచూస్తున్నాడు! అంతా తెరమీద చిత్రంలా తనకెలా కనిపిస్తోంది? తను మానవ్ కాడా? తనని తనే ఎలా చూసుకుంటున్నాడు?

    బల్లెం రివ్వున వచ్చి తన వీపులో గుచ్చుకుంది.గుండెనదిమిన చేయి వెచ్చని రక్తంలో తడిసింది... కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమిటీ అభద్రత? సృష్టిలోని జీవజాలమంతటికీ ఈ భద్రతా రాహిత్యం ఎందువల్ల?     కొద్ది క్షణాలో,రోజులో,వారాలో?...నిశ్శబ్దం. చీకటి...మెల్లగా తన చుట్టూ వెలుగువలయాలు...
    ఎక్కడికో తను ప్రయాణిస్తున్నాడు! అబ్బో! తనెంత బాగా గుర్రపుస్వారీ చేస్తున్నాడు! ఎపుడు నేర్చుకున్నాడో! తను ఒంటరిగా లేడు. వెంట ఎంతోమంది సైనికులు...తోటి సైనికాధికారులు! ఎర్రటి తలపాగాలు. నడుముకి వేళ్ళాడుతున్న కరవాలాలు.అస్పష్టంగా వినిపిస్తున్న మాటలు. కొందరి కళ్ళలో
విజయకాంక్ష. మరికొందరిలో సందేహం,బెదురు. అయినా అందరిలోనూ ఓ కసి! యుద్ధానికి కాబోలు ఈ ప్రయాణం!     గుర్రాల డెక్కల చప్పుడు. కొండ దారుల్లో,మైదానాల్లో ఎంతసేపీ ప్రయాణం?

    అదుగో ...ఎదురుగా శరవేగంతో వస్తున్న శత్రుసైన్యం! బాణాలు...బల్లేలు...ఢీకొన్న సైనికబలాలు! ఉద్వేగంతో, వేడెక్కిన శరీరంతో ప్రత్యర్థి మీదకు దూకుతున్న ఆ వీరుడు తనే!ఎంతమందిని హతమార్చాడో క్షణాల మీద!తన కళ్ళ ముందంతా జివ్వున చిమ్ముతున్న రుధిర ధారలే!ఆ స్వైర విహారం చేస్తున్న వ్యక్తి తనేనా? ఎవరికైనా ఎంతచిన్న గాయమైనా చలించే మనసు కాదూ తనది?     మరి ఆ శూరుడు,ఆ వజ్ర కఠిన హృదయుడు ఎవరు?
    ఆ! ఏమిటా ఏమరుపాటు? తన చెయ్యి క్షణకాలం ఆలస్యంగా కదిలిందేం? ఫ్రత్యర్ధి నుంచి వచ్చిన బాణం తన గుండెని చీల్చింది.చివ్వున రక్తం చిమ్మింది.అయిపోయింది... మానవ్! నీ పని అయిపోయింది! ఏమిటీ దు:ఖం? తన మరణం తానే చూసుకుని దు:ఖించడం ఏమిటి?వింత కాదూ?     ఆలోచనలు అలసిపోయాయి!అంతటి శోకమూ క్షణికమై చీకటిలో కరిగిపోయింది!     వింతైన ప్రశాంతత..దూరం నుంచి చల్లని వెలుగు.కాలమే సముద్రంగా మారగా ఆ వెలుగు వైపు ఈదుతూ ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు 'తనే'! మానవ్!     గమనించే లోపే కదలిపోతున్న ఎన్నో దృశ్యాలు...చేతికర్రతో వడివడిగా సాగిపోతున్న ఆ వ్యక్తి తనకి తెలుసు!! ఆయన..ఆయన బాపూజీ! ఆయన వెనకే కదిలే జనసముద్రంలో ఒకడుగా తను! దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఆ మహనీయుని వెనక తనూ నడిచాడన్న మాట! అయితే తను ధన్యుడే!     అన్యాయాన్నెదిరించాలి! దురాక్రమణని ఖండించాలి!పరపీడన అంతం కావాలి! స్వాతంత్ర్యం రావాలి !     "వందేమాతరం!"     ఎన్నో నినాదాలు!నరనరానా ఆవహించిన ఉద్వేగం,ఉద్రేకం.సముద్రకెరటాల్లా ముందుకు పరుగులు తీస్తున్న జనంలో తనొక కణంగా కలిసిపోయాడు! ఏదో ఙ్ఞాపకం తెరలాగా తన కళ్ళ ముందు పరుచుకుంది.ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అమ్మ!మూగగా కళ్ళతో సంభాషించే భార్య!నిండుచూలాలైన తన అర్ధాంగి.ఆమె తలపుకొస్తే చాలు గుండె తలుపులు తెరుచుకుని వెల్లువయ్యే అనురాగం!మరి ఇలా తనవాళ్ళని వదిలి ఈ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నాడు తను? ఈ యఙ్ఞంలో తనను తానే ఒక సమిధగా సమర్పించుకుంటున్నాడా? తుపాకుల్ని,తూటాల్ని మానవ శరీరాలు ఎంతసేపు ఎదిరించగలవు?తనగుండెలో సన్నని గుబులు. ఆ తెల్లవాడి తూటాకి తను బలైపోతే తన భార్య, తన లేడి కళ్ళ ప్రియబాంధవి ఏమైపోతుంది?ఇంకా పుట్టని తన బిడ్డ?కళ్ళారా తన బిడ్డని తను ఒక్కసారైనా చూసుకోగలుగుతాడా?తనలా కాకుండా వాడు స్వతంత్రభారతంలో జన్మించగలుగుతాడా?     చెవులు చీలుస్తూ తూటాల చప్పుళ్ళు! నినాదాల మధ్య హాహాకారాలు! తొడతొక్కిడి. వందేమాతరం! వందేమాతరం!వందే...ఆ...ఆ!మండుతున్న నిప్పుకణికె తన కుడిచెవిలోంచి రివ్వున దూసుకుపోయింది.తన మనుగడని శాసించే అత్యంత ప్రముఖమైన శరీరభాగం చిద్రమైన అనుభూతి!తీవ్రమైన బాధతో శరీరం గిలగిలలాడింది.క్షణకాలంలో అంతా ముగిసింది.     ఆహా! ఎంతటి విశ్రాంతి!     కొలనులో తేలుతున్న పూవులాగా తన మానసం! హాయిగొలిపే నిశ్శబ్దం! చల్లని వెలుగు...విశ్రాంతి! కొలను మెల్లగా నదిగా మారి ముందుకి ప్రవహిస్తున్న అనుభూతి.మళ్ళీ ప్రయాణం.... పచ్చని పల్లె.పాత పెంకుటిల్లు.ముందుకి వాలినట్టున్న వసారాలో ఎందుకో అంతమంది జనం! ముతక చీరలూ,నీరుకావి పంచెలూ , నీరసపు మొహాలూ! ఏమైందని అంత దిగులు?తనకు తెలుసు ఏమైందో!నిన్నా మొన్నా జరిగిన సంఘటనల్లాగా,రోజువారీ ప్రయాణాల్లాగా ఇవన్నీ తనకి గోచరించడం ఎంత వింత!     కొత్తగా,కుతూహలంగా,ఒకోసారి అయిష్టంగా, భయంగా, అంతలోనే నిర్లిప్తంగా...ఎన్నో భావాలు!ఎన్నెన్నో అనుభూతులు! తనిలా ప్రేక్షకుడిలా చూస్తూ ఉండటం కలకాదు గదా! తనకంతా తెలిసినట్టే ఉంది! వసారాలో గుమిగూడిన జనం తన తండ్రి తోటి రైతులు. పాలిపోయిన మొహంతో, విద్యుద్ఘాతం తగిలిన వాడిలా, పెచ్చులూడిపోయిన గోడనానుకుని నిలబడ్డ ఆ కుర్రవాడు తనే.ఆరోజే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసి వచ్చాడు. సెలవుల్ని తలచుకుంటూ ఆనందంతో ఇల్లు చేరిన తనకి, జీవనయానంలో అలసిపోయి సెలవు పుచ్చుకున్న తండ్రి కనిపించాడు! అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య! ఇంటిలోపల్నించి సన్నని మూలుగులు. ఉండుండి ఒక్కసారిగా పెల్లుబికే రోదనలు. అమ్మ గుండె పగిలిపోతుందేమో అని భయం. ఎందుకిలా జరగాలని ఉక్రోషం. ఎవరిమీదో కసి. ఘనీభవించిన దుఃఖం. ఊపిరితిత్తుల నుంచి బయటికి రాని కఫంలా కన్నీటి రూపంలో బయటికి రాని దుఃఖం! పగలూ,రాత్రీ భేదం లేకుండా అప్పుల వసూలు కోసం పీడిస్తున్న ణదాతలు!
కాలమేఘం లా కమ్మేసిన తీవ్రమైన వ్యథ. భవిష్యత్తంతా చీకటి.రాత్రింబగళ్ళు పొలంలో శ్రమించి, పంటలు పండించే నాన్న జీవితం, పండక ముందే మంటలకాహుతై పోయింది. తన పై చదువుల ఆశలన్నీ కలలే...కల్లలే!     పెద్దకొడుకుగా ఈ ఇంటి బాధ్యత తనదే. ఈ అప్పులూ తనవే. కొండంత దిగులు. దీన్ని దిగమింగి అక్కాతమ్ముళ్ళతో, అమ్మతో ప్రయాణం సాగించాలి! ప్రభుత్వం ప్రకటించిన సాయం కోసం ఎదురుచూపులు. శవాన్ని పీక్కుతినే రాబందుల్లాగా ప్రభుత్వసాయం మధ్యలోనే తన్నుకు పోవాలని కాచుకుని ఉన్న అధికారులు. అనంతమైన నిరీక్షణ,ఛీత్కారాలు,అవమానాలు!     స్త్రీని దేవతగా కొలిచే సంస్కృతి తమదేనా? ముద్దబంతి పువ్వులా కళకళలాడిపోయే అక్కని నిరంతరం వేధిస్తూ పీడించే కీచక ఋణదాతల్ని పదహారేళ్ళ తనెలా ఎదిరించగలడు! చిమ్మచీకటిలో వెలుగు కోసం వెతుకులాడుతూ కొద్దివారాల జీవితం. ఆఖరిసారి అంతా కలిసి పాయసం తిన్నారు, వెలితిగా నవ్వుకుంటూ. 'అయ్యో!మానవ్!ఏదోదారి దొరక్కపోదు.తొందరపడకు!అంతా వదిలేసి కొత్తచోటికి పారిపో.ఏదో పని వెతుక్కో..చావు ఏ సమస్యకీ పరిష్కారం కాదు '...వేడుకుంటున్నాడు తను.     రాత్రి పది దాటింది. పురుగుమందు కలిపిన పాయసం తన పని ప్రారంభించింది. భరింపరాని కడుపు నెప్పి. తమ్ముళ్ళ ఏడుపులు...అక్క మూలుగు. నేల మీద అంతా పొర్లుతున్నారు బాధ భరించలేక. అందరికీ నోటివెంట నురుగులు. మృత్యుదేవత చల్లని ఒడి కోసం ఎంతగా పరితపిస్తే ఆవిడ కరుణించిందో.'అమ్మా!తల్లీ!ఈ మానవ్ ని కరుణించు.విముక్తి ప్రసాదించు ' ఆ బాధ చూడలేక ప్రార్ధిస్తున్న తనెవరు?తన కళ్ళముందు చీకటిలో లుంగలు చుట్టుకుపోతున్న ఆ మూర్తి ఎవరిది?ఏమిటిదంతా?...ఎంతసేపటికి ఆ కాళరాత్రి తెల్లవారిందో.తమ బతుకులు ఎంత అన్యాయంగా తెల్లవారాయో!     హమ్మయ్య!... ఎంత ఓదార్పు!ఇక బాధ లేదు.చల్లని గాలిలో తేలియాడుతున్న తనకి శరీరం లేదు. తలచుకుంటే చాలు ఎక్కడికైనా వెళ్ళగలడు అప్రయత్నంగా!అలా అగమ్యంగా ఎంతకాలం విహరించాడో ఏమో!     చల్లగా పరుచుకున్న చీకటి .అక్కడక్కడ తెల్లని విద్యుద్దీపాల వెలుగులు. అందమైన ఉద్యానవనంలో మ్యూజికల్ ఫౌంటైన్ ని వీక్షిస్తూ కూర్చున్న మానవ్ దృష్టిపథంలోకొచ్చాడు. చిరునవ్వు నవ్వుతూ తన పక్కనున్న స్త్రీమూర్తి తన భార్య కాబోలు. అవును...గాఢమైన తమ అనుబంధం తన మనసుకి తెలుస్తోంది. హాయిగొలుపుతున్న ఆ నవ్వు తన మనసంతా వెన్నెలై పరుచుకుంది. ఆమె భుజం మీదుగా తన చెయ్యి. ఆమె ఒడిలో ముద్దులొలికే పసివాడు. వలయంలా తమనావరించిన ఆత్మీయత! ఆరివెలుగుతున్న దీపాలని పసివాడికి చూపిస్తూ, సంగీతానికి అనుగుణంగా తలలూపుతూ మురిసిపోతున్నారు తామిద్దరూ .ఆ అనురాగ బంధాన్ని దూరం నించీ గమనిస్తున్న తనకెందుకో ...ఏదో ..ఆందోళన! పసివాడి మొహం లొని కాంతిని వీక్షిస్తున్న ఆ తండ్రి తను కాదా? తనను తనే గమనిస్తూ తన భద్రత గురించి ఆందోళన చెందుతూ ,ఈ జనన మరణాల చక్రభ్రమణాన్ని వీక్షించుకుంటూ ఉండడం విభ్రాంతిని కలిగిస్తోంది! ఎందుకీ ఆందోళన!? దేనిగురించి? అదుగో...ఆ పక్కనే ఉన్న సంచీలో పేలడానికి సిద్ధమవుతున్న బాంబు!! ఎవరో ఉన్మాది దాన్ని అక్కడ వదిలేసి దొంగ చూపులతో జారుకున్నాడు! క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి.

     పెద్ద విస్ఫోటనం !     
    క్షణ కాలం విలవిలలాడిన తన శరీరం!అంతే తనకింకేమీ తెలియదు...     పెనుచీకటిలో మళ్ళీ ప్రయాణం!'మరణం ఒక కామా' అన్న ఆ మహానుభావుడి మాటలెంత నిజం! జీవరాశులన్నిటికీ ఎందుకీ అభద్రత? ఎన్నాళ్ళీ అనంతమైన ప్రయాణం? ఏమిటీ అస్థిరత? దేనికోసం వెతుకులాట?     దేన్ని పొందితే తృప్తి??
    కొద్దిసేపట్లోనే చల్లని హాయైన వెలుగు పరుచుకున్న చోటికి చేరాడు. బాధ అంటే ఎలా వుంటుందో,భయం అంటే ఏమిటో మరిచిపోయాడు. కాలంతో పాటు ముందుకు పోతున్నాడు! పురోగమనం....? ప్రపంచమంతా కుగ్రామమైపోయిందిట! ఎక్కడినుంచి ఎక్కడికైనా సునాయాస ప్రయాణాలు సాధ్యమైపోయాయి! దొంగల భయం లేకుండా ఎన్నోరకాల సెక్యూరిటీ సిస్టమ్స్! ఎంత ఎత్తైనా క్షణాల్లో చేర్చే ఎలివేటర్స్! దారితప్పిపోతామేమో అనే సంకోచం లేకుండా జీ పీ ఎస్ అమర్చిన వాహనాలు. కౄరజంతువుల భయం మర్చిపోయి ఎంతకాలమైంది!ఇళ్ళనిండా ,ఆఫీసుల నిండా ఎన్నో రకాల ఆధునాతన సదుపాయాలు! ఆహా..మానవ్! ఎంత విలాస జీవితం ! తొంభై తొమ్మిదవ అంతస్తులో....పని ముగించుకుని ఒళ్ళువిరుచుకుంటున్న మానవ్ ఎంత అందంగా ఉన్నాడు!పొడవుగా పెంచిన జుట్టు.ఫాషనబుల్ గా కనిపిస్తున్న దుస్తులు.తన కేబిన్ తలుపులు మూసి,ముఖద్వారం వైపు నడిచాడు.కళ్ళను చూసి మనిషిని గుర్తించే మెషీన్ ముందు క్షణకాలం మొహాన్ని నిలిపాడు.తెరుచుకున్న తలుపుద్వారా ఎలివేటర్ చేరాడు! ఎంతో ఉన్నత స్థితిని చేరిన గర్వం...ఏదో 'ఇలేషన్ ' మనసంతా...అంతలోనే ఒక 'రెస్ట్ లెస్ నెస్ ' కొద్దిసేపట్లో గేటు దాటుతున్న కారులో తనతోపాటు మరో ముగ్గురు కుర్రాళ్ళున్నారు. గుర్రాలు,మకుటాలు వదిలి మోడర్న్ దుస్తుల్లో కారులో పోతున్న రాజకుమారులలా ఉన్నారు.అందరి కళ్ళలోనూ అన్నీ అందుతున్న జీవితం పట్ల ఏదో విసుగు ! 'బోర్ '!     కలగాపులగంగా వాళ్ళు మాట్లాడే మాటల అర్థం తనకు తెలుస్తోంది.తెలియకేం?తను మానవ్ ఆత్మ కాదూ?అబ్బే....అదెలా సాధ్యం?     "ఒరేయ్!మన ముహూర్తం ఇవాళెందుకు పెట్టానో తెలుసా?" తన పక్కనున్న రింగుల జుట్టు కుర్రాడు ప్రీతమ్ అడిగాడు. "తెలుసులే..ఏప్రిల్ ఫస్ట్ కదా' నిర్లక్ష్యంగా అన్నాడు తను."అందుక్కాదురా ఫూల్ !ఈ 'డేర్ డెవిల్ స్పోర్ట్ ' పుట్టినరోజురా ఇవాళ! " "ఓ ! అయితే ఈరోజు బర్త్ డే సెలబ్రేషన్ అన్నమాట"మిగిలిన ముగ్గురూ సన్నగా ఈలలేశారు. "నైన్‌టీన్ సెవెంటీనైన్ లో ఏప్రిల్ ఫస్ట్ న బంజీ జంపింగ్ పుట్టిందిరా.మనలాగే నలుగురు 'డేంజరస్ స్పోర్ట్స్ క్లబ్ ' మెంబర్స్ రెండొందల యాభై అడుగుల ఎత్తు నుంచి మొదటిసారిగా 'బంగీ జంపింగ్ ' చేశార్ట ! " హాలీడే ఏర్పాట్లన్నీ చేసిన ప్రీతమ్ ఉత్సాహంగా చెప్పాడు. "సర్లే...హిస్టరీ ఎవరిక్కావాలి? దీని రూల్స్ ఎండ్ రిస్ట్రిక్షన్స్ ఏమిటి?" వెనక సీట్లోంచి ప్రశ్న ...బొద్దుగా ఉన్న పొటేటో నుంచి. "బరువు ముప్ఫయ్యారు కేజీలు దాటాలిరా.వయసు పదేళ్ళు దాటితే చాలు" ప్రీతమ్ మాటలు పూర్తి కాకుండానే,     "వెయిట్ అప్పర్ లిమిట్ చెప్పరా బాబూ..మన పొటేటోకి ప్రాబ్లం ఉండదు కదా?" టోనీ మాటలకి ఘొల్లుమని నవ్వులు. "హే! రిస్కు సంగతి చెప్పరా లిల్లీపుట్" పొటేటో మంచి స్పోర్ట్! "ఓరినీ! రిస్క్ లేకపోతే థ్రిల్ ఏముందిరా ఫూల్! " పకా నవ్వాడు తను ఏక్సిలరేటర్ నొక్కుతూ. "సరిగా చెప్పరా టోనీ" అడుగుతున్న ఫొటేటో మొహం లో లీలగా భయం కనిపించింది. "ఎమైనా జరగచ్చురా బాబూ! నడుం విరగచ్చు.జాయింట్లు డిస్లొకేట్ అవచ్చు.ఒంటికీ కంటికీ గాయాలవచ్చు.ఎలాస్టిక్ రోప్ కడతారు కదా...దానివల్ల 'రోప్ బర్న్ ' అయే అవకాశం వుంటుంది. ఇవన్నీ కేలిక్యులేట్ చేసుకుని ఎడ్వెంచర్స్ కి వెళ్ళరురా ఎవరూ" ప్రీతం నిర్లక్ష్యం గా అన్నాడు.     టోనీ అందుకుంటూ "పొటేటోలా బరువెక్కువ ఉన్నవాళ్ళకి రోప్ ఎక్కువ సాగిపోయి నేలకి తగిలి, బుర్ర కొబ్బరికాయలా పగలచ్చు" అంతా పకపకా నవ్వారు. వింటున్న తనకి దిగులు ముంచుకొచ్చింది!మానవ్!ఎందుకిలాంటి పనులు? కోరి కొరివితో తలగోక్కుంటారా ఎవరైనా? భద్రత కోసం యుగాలుగా తపించిన తను ఎందుకిలా భయం గొలిపే క్రీడలో వందల డాలర్లు ఖర్చు పెట్టి పాల్గొనబోతున్నాడు? అనాదిగా మనిషి తపన భద్రత కోసం కాదూ? అయినా సుఖసౌఖ్యాలూ,సకల సదుపాయాలూ అందేసరికి తనలో ఇంత విసుగు జనించిందేం? ఇందులో తెలియనిదేముంది? మొనాటనీ నుంచి మార్పు కోసం! అభద్రత నుంచి జనించే థ్రిల్ కోసం! అవును...కేవలం థ్రిల్ కోసం! నరాల్లో ఎడ్రినలిన్ పరుగులు తీయడం కోసం! అదొక 'హై'. సహజంగా దొరకదు గనుక కృత్రిమంగా సృష్టించుకుంటున్నారు! లేని అపాయాన్ని సృష్టించుకుని,దాన్ని దాటి,ఏదో ఘన విజయం సాధించిన అనుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు! మానవ్ ! నీ తపన ఎంతో విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రశ్నలెన్నో రేకెత్తిస్తోంది! ఎత్తైన కొండ మీదికి చేరుకున్న ఆ నలుగురిలో తనని తాను చూసుకున్నాడు అఙ్ఞాత వ్యక్తిలా. తన కాళ్ళకి ఎలాస్టిక్ తాళ్ళు కట్టారు మడమల దగ్గర. ఎత్తైన శిఖరం మీంచి తనని కిందికి వదిలారు. ఆ సమయంలో తను తను కాడు!! శరీరమంతటా జలజలా ప్రవహిస్తున్న వేడి రక్తంతో ,తన సహజ మానసిక స్థితికి భిన్నంగా ఉన్నాడు! ఉద్వేగం వల్ల గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది! అంత ఎత్తునుంచి క్షణకాలంలో తన శరీరం గాలిలో తలకిందులుగా వేళ్ళాడుతూ కిందికి జారిపోయింది. నిరాటంకంగా కిందికి జారుతున్న తన తల నేలకి తగిలి బద్దలైపోతుందేమో అనే భయం వెన్నులో జరజరా పాకింది!! ఇంతలో తన మడమలకి బిగించి కట్టిన ఎలాస్టిక్ షాక్ కార్డ్ తన శరీరాన్ని ఒక్కసారిగా ఆపింది.తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది సాగుతున్న ఎలాస్టిక్ షాక్ కార్డ్ తో పాటు ఇంకా ఇంకా కిందికి దిగుతున్న శరీరం.క్షణాలు యుగాలుగా గడుస్తుంటే మూగపోయిన తన గొంతు నుంచి ఏదో ఆర్తనాదం వెలువడింది!
    తన చెవులకి అది వికృతంగా వినిపించింది. కిందికి దిగిన శరీరం నేలకి తాకక ముందే మళ్ళీ ఆకాశం లోకి లాగ బడింది. తన పొట్ట లోని కండరాలన్నీ అగాధం లోకి జారిపోతుంటే,తన శరీరం మాత్రం పైకి దూసుకుపోతునట్టు బాధాకరమైన వింత అనుభవం!     ఎంత వద్దనుకున్నా ఆగకుండా తన శరీరం వందల అడుగులు పైకీ కిందికీ ఊగుతోంది,కాళ్ళకి కట్టిన తాడు ఆధారంగా! తల నరాలు చిట్లిపోతున్న భావన!ఆగని తన అరుపు తననే చీల్చేస్తున్న అనుభూతి!అంతే...తనకింకేమీ తెలియదు. తను స్పృహ కోల్పోయాడు కాబోలు!     ఆవరించిన చీకటిలో ఉక్కిరిబిక్కిరి చేసే చెమట.ఏవో మాటలు మెల్లగా..... చల్లని గాలి వీచింది. తన శరీరం మీద ఎవరిదో స్పర్శ.మనసులో కమ్మని భద్ర భావం. సుపరిచితమైన కంఠం తనని పిలుస్తోంది! మెల్లగా కళ్ళు విప్పాడు తను! హా...తనింకా జీవించి ఉన్నాడు.నిజంగా జీవించి ఉన్నాడు! నరనరాల్లో విజయోత్సాహం!.....ఏం సాధించాడనో!
* * *
"మానవ్ ! మానవ్ !? నీకేం కావాలి? దేనికోసం నీ తపన?" తను అతనిలో కలిసిపోయేలోపు శక్తినంతా కేంద్రీకరించి నిశ్శబ్దంగా అడిగాడు. ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా అడిగినట్టే ఙ్ఞాపకం! 'కౄరమృగాల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం , ఇల్లూవాకిలీ ఏర్పాటుచేసుకున్నావు. రకరకాల మారణాయుధాలు రూపోందించావు. ఆహారం కోసం పొలం పుట్రా సంపాదించావు. దొంగల నుంచి భద్రత కోసం సెక్యూరిటీ సిస్టమ్స్! ఆరోగ్యంకోసం మందులూ,చికిత్సలూ కనిపెట్టావు. జీవితకాలాన్ని పెంచావు.దూరాలను కుదించావు.ఎత్తుల్ని అధిగమించావు.యుగాలుగా నువ్వు దేని కోసం తపించావు? అదే లభిస్తే నువు తృప్తిగా జీవిస్తావా? నువు కోరినవన్నీ తక్షణమే పొందగలిగే స్థితి లభిస్తే నువ్వేమైపోతావు మానవ్ ? ' మేలుకుంటున్న మానవ్ చెవిలో కొద్ది క్షణాల పాటు ఆ ప్రశ్న ప్రతిధ్వనించింది. మెల్లగా అతనికి పూర్తి మెలకువ వచ్చింది. మళ్ళీ అతని అవిశ్రాంత ప్రయాణం మొదలయ్యింది!

(రచన యింటింటి పత్రిక నవంబరు 2009 సంచికలో ప్రచురితం)
Comments