మానవత్వం - లక్ష్మీ రాఘవ

    
కార్తిక్ ఆరోజు కాలేజి నుండి ఆలస్యంగా వచ్చాడు.

    "ఎందుకు లేటయ్యింది?" అమ్మ భారతి ఆరాటం!

    "క్లాసు అరగంట ఎక్కువగా తీసుకున్నారు" బాత్రూం వైపు వెడుతూ అన్నాడు కార్తిక్ .

    "హార్లిక్స్ కలిపి టేబులు మీద పెట్టాను చూడు" అని చెప్పి భక్తి ఛానల్ పెట్టుకుని  టి.వి ముందు కూర్చుంది భారతి.

    ఎస్.వి.బి.సి, భక్తి చానెళ్ళు వచ్చాక అవే చూడటం అలవాటు చేసుకుంది. తిరుమల దేవాలయ ప్రత్యక్ష ప్రసారాలను, అనేక ప్రవచనాలను ఇంట్లో కూర్చుని తీరిగ్గా చూసే అవకాశం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తుంది.

    కార్తిక్ హార్లిక్స్ తాగుతూ అమ్మ పక్కన  కూర్చున్నాడు.

    తను చూసే చానెల్స్ పెట్టుకోగానే పారిపోయే కార్తికేనా??  అని ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసింది.

    గ్లాసు కింద పెట్టి అమ్మ వొడిలో తలపెట్టుకు పడుకున్నాడు.

    "ఏరా నాన్న తలనొప్పిగా వుందా?" ఆప్యాయంగా అంది.

    "లేదమ్మా కాస్సేపు పడుకుంటా" అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతో ప్రేమతో కార్తిక్ తలపై చేయిపెట్టి జుట్టు నిమరసాగింది భారతి.
    
* * *

    కార్తిక్ అప్పుడప్పుడు కాలేజి నుండి ఆలస్యంగా రావడం జరుగుతోంది. అలా ఆలస్యంగా వచ్చినప్పుడల్లా కార్తిక్ డల్ గా వుండటం గమనించసాగింది. భర్త రామగోపాలంతో చెబుదామా వద్దా అని సంశయపడింది. తానే స్వయంగా అడిగి తెలుసు కోవడం మేలనిపించింది. అందుకే ఆలస్యంగా వచ్చిన రోజు "ఏమి కార్తిక్ ..స్పెషల్ క్లాసేనా?" అని అడిగింది.

    "కాదమ్మా లైబ్రరీకి వెళ్ళాను" కచ్చితంగా వచ్చిన జవాబు ఎలాటి డౌటు పడాల్సిన అవసరం లేదని అనిపించింది.

    అందుకే తనకు తోచిన విధంగా డీల్ చేద్దామని కార్తిక్ ఫ్రెండ్ రఘుకు  ఫోను చేసింది "కార్తిక్ కాలేజికి రెగ్యులర్‌గా వస్తున్నాడా?"అని

    "వస్తున్నడాంటి... ఎనీ ప్రాబ్లం?"

    "ఏం లేదు రఘూ... నేను నీకు ఫోను చేసినట్టు కార్తిక్‌కు చెప్పకేం"

    "సరే ఆంటి"

    రఘూతో మాట్లాడాక కాస్త తేలిగ్గా అనిపించింది. కార్తిక్  కాలేజికి సరిగ్గానే వెడుతున్నాడు కనుక ప్రాబ్లం లేదు అనుకుంది తృప్తిగా.

* * *

    ఇంకో నెలరోజుల తరువాత కూడా కార్తిక్ అప్పుడప్పుడూ ఆలస్యంగా రావటం.. నీరసంగా వుండటం జరుగుతూంది! గమనిస్తే కార్తిక్ పూర్వంలా గలగలా మాట్లాడ్డం లేదు. మాటలేకాదు ముఖంలో కాంతి కూడా తగ్గినట్టు కనిపిస్తూ౦ది.

    ఎందుకలా??

    ఆలోచిస్తే ఒక్కసారిగా ఫ్లాష్‌లాగా వచ్చిందా వుహ!!

    కార్తిక్ ఏమైనా ప్రేమలో పడ్డాడా?  ఆ ప్రేమించిన అమ్మాయి "నాకు  నువ్విష్టం లేదు" అని వుంటుందా? ఆపైన ఆలోచించడానికి భయం వేసింది భారతికి .

    వరంగల్లులో జరిగిన ఆసిడ్ దాడి ఒక్కసారిగా కళ్ళముందు కదలాడింది.

    కార్తిక్‌కి ఆ విధమైన ఆలోచనలు రావటం లేదు కదా??

    ఒక్కసారి తను కార్తిక్‌ని పెంచిన తీరుని గుర్తుకు చేసుకుంది. కార్తిక్కి మొదటి నుండి భగవంతుడి గురించి... మానవత్వపు విలువలగురించి...  మన సంస్కృతీసంప్రదాయాల గురించి చాలా విషయాలు చెబుతూ వుండేది. అందుకే కార్తిక్ ఇతర తోటి పిల్లల కంటే ఎంతో ఎదిగాడు అనిపించేది. ఎప్పుడూ తప్పుడు దోవలో పడడని గట్టి నమ్మకం వుంది. అయినా తను కార్తిక్‌ని జాగ్రత్తగా గమనించాలి.
 
    మళ్ళీ అనుమానం పెనుభూతం లాగే మనసును కలచి వేస్తూ వుంది. రఘును అడగటం బాగోదేమో... ఎలా తెలుసుకోవాలి???

    ఓసారి కాలేజీకి వెడితే? తెలిస్తే కార్తిక్ బాధ పడుతాడేమో...ఏమైనా కనుక్కోక తప్పదు.

    మరుసటి రోజు షాపింగ్ చేసుకుని కార్తిక్ కాలేజికి వెళ్ళింది. తన కొడుకు కార్తిక్ ఫలానా క్లాసు చదువు తున్నాడని... తన ప్రోగ్రెస్ గురించి తెలుసుకుందామని వచ్చానని ప్రిన్సిపాల్తో చెప్పింది.

    కార్తిక్ చదువులో ఏమాత్రం ప్రాబ్లం లేదని అటెండెన్స్ కూడా బాగుందని తెలుసుకుని హాయిగా గాలి పీల్చుకుంది భారతి.

    మరీ కార్తిక్ డల్‌గా వుండటానికి కారణం ఏమిటి?

    ప్రేమ వైఫల్యమా?? ఎలా తెలుసుకోవాలి??? నిలదియ్యాల్సిందే తప్ప గత్యంతరంలేదు  అన్న నిర్ణయానికి వచ్చింది.

    ఆ రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చిన కార్తిక్‌ని రూమ్‌లోకి తీసుకెళ్ళి తలుపు గడియ వేసి...

    "కూర్చో కార్తిక్" అని తన ఎదురుగా వున్న కుర్చీని చూపింది.

    "ఏమిటమ్మా" విసుగ్గా అన్నాడు కార్తిక్.

    "నీవు ప్రేమలో పడ్డావా?? నిజం చెప్పు" అంది.

    "నేనా... ప్రేమలోనా?? ఎందుకలా అనుకుంటున్నావు?" కోపంగా అడిగాడు కార్తిక్.

    "మరి ఏమనుకోవాలి? ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు... ఎప్పుడూ ఏదో యోచన చేస్తున్నట్టు వుంటావు. మాతో హాయిగా మాట్లాడవు... ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు వుంటావు... ఇది ప్రేమలో పడే వయసు కాదు కార్తిక్. నీకు ఎంతో జీవితం ఉంది... నిన్ను ప్రేమలో ఎవరైనా తిరస్కరించి వుంటే..."

    "అమ్మా... ఆపుతావా నీ సోది" గట్టిగా అన్నాడు కార్తిక్.

    "ఇక ఏం చెయ్యను చెప్పు... నిన్నెలా అర్థం చేసుకోను?" ఆవేదనతో అంటున్న అమ్మ భుజాలు పట్టుకుని "అమ్మ కూర్చో... చెబుతాను" అంటూ కూర్చో బెట్టాడు. 

    అతను ఏం చెబుతాడో అన్న ఆతృతో అతని ముఖం చూస్తూ కూర్చుంది.

    "అమ్మా ప్రేమా గీమా అన్నవి ఆలోచించేలా నీవు నన్ను పెంచలేదు. అలాటి ఉహ కుడా నాకు రాలేదు. నిజానికి నీతో ఒక విషయమై మాట్లాడాలని చాలా అనుకున్నాను. కాని ఎందుకో మనసు ఒప్పలేదు...”

    "ఇంకేమిటి నాన్నా" ఆప్యాయతతో అంది.

    "అమ్మ నీకు శేషు గుర్తున్నాడా??"

    "ఎందుకు లేదురా...ఎనిమిదేళ్ళు పక్క పక్క ఇళ్ళలో కలిసి ఉన్నాం కదా.. ఆ తరువాత వాళ్ళు దిల్సుఖ్‌నగర్లో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు కదా. మొన్నెప్పుడో కలిసానని అన్నావు కూడా. నాకు గుర్తు వుంది"

    "ఒకసారి కాలేజి ఫంక్షన్‌లో కలిసాడు... ఆతరువాత రెండుసార్లు అనుకోకుండా కలిశాం... చిన్నప్పటి సంగతులు తిరగ తోడుకున్నాం... హఠాత్తుగా అతను నాకు ఓ షాకు ఇచ్చాడు. ఏమిటో తెలుసా... అమ్మా" కళ్ళనీళ్ళతో చెప్పాడు.

    "ఏమిట్రా...చెప్పు త్వరగా..." ఆతృత ఆ గొంతులో ధ్వనించింది.

    "వాడికి కాన్సర్... బ్లడ్‌కాన్సర్. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాని నమ్మకంలేని పరిస్థితి అట! అందుకే వాడి ఇంటికి వెళ్ళి కొంచెం టైము స్పెండ్ చేస్తూ వున్నాను. వాడికి కాస్త రిలీఫ్‌గా వుంటుందని... నా వయసు వాడు ఇవ్వాళా రేపా... అంటూ వుంటే ఎలావుంటుందో చెప్పు అమ్మా... నీకెందుకు చెప్పలేక పోయానో తెలుసా? శేషు రిక్వెస్ట్ చేసాడు... తన విషయం ఎవరికీ తెలియడం ఇష్టం లేదని... తెలిసి ఎవరైనా  సింపతీతో పలకరిస్తే భరించలేనన్నాడు...నేను కూడా బాధ పడకూడదని... కాలేజిలో క్లాసులు ఎగ్గొట్టి రాకుడదని ఆంక్షలు పెట్టాడు... అందుకే నీకు కూడా చెప్పలేక పోయాను... వాడితో వున్నంతసేపు తనని ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడిని. ఇంటికి రాగానే వాడి పరిస్థితికి నాకే నీరసంగా  అనిపించేది... అయినా జీవితపు చివరి దశలో వాడిని ఆనందంగా వుంచడానికి కంపెని ఇవ్వాలనిపించి ఇలా చేస్తున్నాను... చిన్నప్పటినుండి  మానవత్వపు విలువల్ని నూరిపోసావు కదా అమ్మా... వాడికి సాయంగా వుండాలన్న నిర్ణయం అందువల్లనే జరిగింది... అంతే అమ్మా" ఏడుస్తూ చెబుతున్న కొడుకును చూసి ఒక్కసారిగా గట్టిగా హృదయానికి హత్తుక్కుంది భారతి.

    తనకంటే ఎంతో ఎత్తు ఎదిగిన కొడుకుని తృప్తిగా చూస్తూ అంది "సంతోషం కంటే  దుఃఖంలోనే పాలు పంచు కోవాలి. నీవు చేస్తున్న పని నాకెంతో గర్వంగా వుంది కార్తిక్... నీవు రోజూ తప్పక శేషుని చూసిరా. అతనికి మానసిక దైర్యం కలిగించు"

    అమ్మాయిల ఆకర్షణకు గురి కావాల్సిన వయసులో రోగంతో బ్రతుకు చివరి దశలో వున్న స్నేహితుడికి మానసికోల్లాసం కలిగించడానికి ప్రయత్నిస్తున్న కొడుకు మానవత్వానికి గర్వపడుతూ మనస్పూర్తిగా ఆశీర్వదించింది  భారతి.
Comments