మనిషి–దేవుడు - జి. ఉమామహేశ్వర్

    అంతవరకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో నడిచిన టాటా సుమో నత్తలా మొదటి గేర్ లో నడుస్తుంటే మెలకువొచ్చింది రామిరెడ్డికి.

    ఏమైందిరా కళ్ళు మూసుకునే ముందు కూర్చున్న డ్రైవర్ నుద్దేశించి ప్రశ్నించాడు. 

    తెలియదయ్యా ! ఈ కొంచమే ఎందుకో ట్రాఫిక్ ఉంది డ్రైవర్ చెప్పాడు.

    కళ్ళు తెరచి , విండో అద్దాలు దించి బయట నడుస్తూ పోయే ఒక పాదచారిని పిలిచి

    ఏం జరుగుతాందీడ, ఏమింత జనం?” రామిరెడ్డి అడిగాడు.

    దానికా పాదచారి - ఈడ తిక్కసామి ఆరాధన జరుగుతాంది. పోయి మొక్కో పోరి. మంచి జరుగుతాది  చూడు. గొప్ప మహత్యం గల మనిషి.న్నాడు.

    రామిరెడ్డికి ఏదో అదృశ్య శక్తి మాట్లాడినట్లే అనిపిస్తోంది. తను నిన్నంతా ఒక కాంట్రాక్ట్ పని మీద హైదరాబాద్ లో అందరి ఇళ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఈరోజే తిరుగు ముఖం పట్టాడు. ఏమనుకున్నాడో ఏమో, డైవర్ తో

     ట్రాఫిక్కంతా దాటుకోని ముందెక్కడన్నా ఆపుకో. నేను ఇదేందో చూస్కోని ఫోన్ చేస్తా అనిజెప్పి మనుషుల్లో కలిసి పోయాడు.

    కొద్ది దూరం పోయాక ఒక చిన్న పాక లాంటి ఇంట్లో ఒక సమాధి ఎదురుగా కూర్చుని ఒక సాధువు ధ్యానం చేస్తున్నాడు. జనమంతా ఒకరొకరుగా వచ్చి ఆ సమాధికి  మొక్కుతున్నారు. ఆ సమాధే తిక్కసామి అని చెప్పబడే వ్యక్తిది అయుండొచ్చని రామిరెడ్డి అనుకున్నాడు. కొంత సేపటికి జనం పల్చబడ్డారు. సద్దు మణిగింది . రామిరెడ్డి ఆ సాధువుని సమీపించి

    స్వామీ , ఎవరీ తిక్కసామి , ఈ హైవే మధ్యలో ఈ పల్లెలో ఈయనెలా వచ్చాడు? ఎందుకింత జనం పోగయ్యారు?” అని ప్రశ్నించాడు

    దానికా సాధువు ప్రశాంతమైన నవ్వుతో

    నాయనా, ఈయన పేరేమిటో నాకు తెలియదు. కనీసం నేనీ మహానుభావుడి దర్శన భాగ్యానికి కూడా నోచుకోలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ దారిలో వెళుతుంటే ఈ వూరి వ్యక్తే నాకు బస్సులో తారస  పడ్డాడు. ఈ పుణ్య పురుషుడు ఈ వూరి వాళ్ళను కరుణించాడు. ఎవరో తెలియదట, ఎక్కడి వాడో  ఎరుగరట, ఎవరి బంధువూ కాదట. ఎప్పుడూ పిచ్చి పిచ్చిగా, ఆకాశంలోకి  చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ, ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా గడిపేవాడట. స్నానం లేదు, వేళకు తిండి లేదు. ముందు ఏ డిటెక్టివో, గూఢచారో అయి వుండొచ్చని గూడ అనుకున్నారట. అయితే అతని ప్రవర్తన , అలవాట్లు గమనించి, తిక్కతనే అని నిర్ధారించుకున్నారట. ఊర్లో చాలా మందికి మేలు చేశాడని చెబుతారు. ఏమయినా ఈరోజుల్లో ఇంత నిరాడంరంగా, ఇహ లోకంలో వుంటూ దానితో నిమిత్తం లేకుండా వుండటం మామూలు మనుషులకు సాధ్యం కాదు, అది దైవ లక్షణం. అందుకే,ప్రయాణీకుడితో పాటే నేనూ బస్సు దిగి ఆ దివ్యస్వరూపుణ్ణి చివరిసారిగానైనా చూడగలిగాను. సరిగ్గా ఈ రోజుకి అతను పరపదించి సంవత్సరమౌతోంది. అందుకే మళ్ళీ వచ్చాను అని ముగించాడు.

    రామిరెడ్డికి  సందేహ నివృత్తి  కాలేదు. అయితే అతని మనసులోని భావాలను గ్రహించిన వాడి లాగా, ఆ ఊరి మనిషి ఒకతను అందుకున్నాడు

    అయ్యో, ఆయప్పేమన్నా మామూలు మనిషనుకుంటివా? మహాత్ముడు. ఒకతూరి గొల్లోళ్ళింట్లో పెండ్లాయితాంది. భోజనాలకని చాపలు గూడ పరిచినారు. యాడున్నాడో ఏమో, ఒక్కసారిగా, అందరూ వద్దు వద్దంటున్నా ఒక్కడే పోయి, పొయ్యి మీద కుత కుత ఉడుకుతున్న సాంబారు గిన్నె మొత్తం కిందకి వంపి అట్లే బయటికి పోయినాడు. ఏమిట్ల పని చేసినాడే  అని చూస్తే, దాంట్లో ఇంత పెద్ద బల్లి డి వుంది. తినింటే , పెండ్లి మందెల్ల సచ్చిందురు. ఒక రోగమొచ్చినా రొప్పొచ్చినా ఆయన యాడున్నాడో చూస్కోని మొక్కొన్నామంటే, అట్లనే తగ్గి పోతుండె. అంతెందుకు, నా కొడుక్కే, - ఇంటర్వ్యూకి పోయే ముందు ఒక సారి తిక్క సామికి మొక్కి పోరా, అని చెప్పినా. ఊర్లో ఎక్కడా కనపడలా! ఏమబ్బా ఇట్లయిందే అని దిగులుపడి, మనసులోనే మొక్కుంటి. ఎక్కట్నుంచి వచ్చినాడో ఏమో, మా ఇంటి ముందే పారాడి, నా కొడుకు బయటే కూర్చుంటే, భుజం మీద చేతితో కొట్టి పోయినాడు. నా దిగులు తీరిపాయ. మూడు నెలలకే మా వోనికి ఉద్యోగమొచ్చ

    ఈ మాటలకి రామిరెడ్డికి ఉత్సాహమొచ్చింది. ఆ సమాధి దగ్గరగా నిల్చుని కళ్ళు మూసుకుని, తన మనసులో ఉన్న కోరిక నెరవేర్చమని ప్రార్ధిస్తున్నాడు.

    ఇంకా ఆ సాధువు ఇందాక తను చెప్పిన మాటల దగ్గరే ఉన్నాడు - దానికి కొనసాగింపుగా,

    ఈ రోగాలు తగ్గించడాలు, ఉద్యోగాలు రావడాలు మామూలు మనుషులు చేసే పనులే నాయనా! తను గడిపిన నిరాడంబర జీవితము, కోర్కెలకు దూరంగా బతకడమూ, ప్రలోభాలకు లొంగక పోవడం, ఇవే ఆయన మనకు అందించిన సందేశాలు. ఆయనకు మనం అందించే నివాళి ఆయనలా బతకడానికి ప్రయత్నించడమే! అన్నాడు.

    రామిరెడ్డి చెవిలో ఈ మాటలు పడ్డాయో లేదో తెలియదు.

                                                                    * * *

     హలో రామిరెడ్డీ, ఆఁ ,ఆఁ , నాయుడే మాట్లాడుతున్నా, నక్కతోక తొక్కినావు పో !, నువ్వు అడిగిన కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసినారు. ఫ్లయోవర్ పని నీకే వచ్చింది. ఇప్పుడే బోర్డ్ మీటింగ్ అయింది. ముందు నీకే చెబుదామని ఫోన్ చేసినా అవతల పీఎస్సార్ నాయుడు చెప్పాడు.

    అవునా ? థాంక్యూ, థాంక్యూ, ఈసారి హైదరాబాదొచ్చినప్పుడు కలుస్తా. ఇంకేం సమాచారం?"  రామిరెడ్డి ఆనందంగా అన్నాడు.

    వారిద్దరూ వ్యాపారాల్లో మిత్రులు. ఒకరికొకరు సహాయం చేస్కుని ఇద్దరూ పైకొచ్చారు.

    ఉత్త థాంక్స్ కాదు, మంచి పార్టీ ఇయ్యాల. అది సరే గాని, సుబ్బిరెడ్డి ఇద్దరు మినిస్టర్ తో చెప్పించినాగూడ వానికి రాకుండ, నీకు ఒచ్చిందంటే, నీకేదో అదృష్టం కలిసొచ్చింది రెడ్డీ, అదేందో మాగ్గూడా చెప్పు” అన్నాడు నాయుడు.  

    హఠాత్తుగా రామిరెడ్డికి తిక్కసామి మొక్కు గుర్తొచ్చింది. ముఖం సంతోషంతో వెలిగి పోయింది.

    వెంటనే జరిగిన విషయమంతా నాయుడితో పంచుకున్నాడు.

    నాయుడు అయితే ఒక సారి పోయొద్దాము. మా రెండో పాప గూడ పెండ్లికి నిలిచింది. ఏ సంబంధమొచ్చినా ఏదో ఒక కారణంతో కుదరడం లేదు. చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో

* * * 

       ఏమిటండీ బండి ఇక్కడాపారు? ఇదేదో చిన్న పల్లెటూర్లా వుంది?” శారద అడిగింది.

    ఆమె పీఎస్సార్ నాయుడి భార్య. ఆ బండి అనబడే ఇన్నోవాలో ఆమెతో పాటు, నాయుడి చిన్న కూతురు, పెద్ద కూతురు, పెద్ద అల్లుడు , మనవరాలు వున్నారు .

    అందరూ దిగి, నాతో రండి నాయుడు చెప్పి, వాళ్లొచ్చే వరకూ  ఆగి, తిక్క సామి ఆశ్రమం వైపు నడవ సాగాడు.

    ఇంతకీ ఎక్కడికి?” నడుస్తూనే మళ్ళీ అడిగింది శారద.

    ఈ రోజు మనమ్మాయి పెళ్లి కుదిరి, మనం తాంబూలాలు తీస్కుని వస్తున్నామంటే, అదంతా మన గొప్పదనం కాదు. ఇదిగో ఈ మహానుభావుడి దయ. నేను, రామిరెడ్డి ఒక సారి హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు చూశాను ఈ ఆశ్రమాన్ని. ఇక్కడ మొక్కుంటేనే మన రామిరెడ్డికి ఆ ఫ్లయోవర్ కాంట్రాక్ట్ వచ్చింది. నేను గూడా మనమ్మాయి పెళ్లి కుదరాలని, కుదిరితే వెంటనే కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కున్నాను. అందుకే ఇక్కడకొచ్చామ్.

    అందరూ ఆశ్రమం అనబడే ఆ పాక లోకి వెళ్ళి నమస్కరించి బయటకొచ్చారు.

    నాయుడు మనవరాలు వాళ్ళమ్మని అడుగుతోంది

    అమ్మా, ఇక్కడ దేవుడెక్కడ వున్నాడు? దేవుడంటే కిరీటం, హారాలు, గద అన్నీ వుండాలి కదా?”

    నాయుడి అల్లుడు విసుక్కుంటూ ఏంటీ చాదస్తాలు? మొక్కోవాలంటే, ఎన్ని గుళ్ళు లేవు? ఎంతమంది దేవుళ్ళు లేరు?  ఈ మారు మూల పల్లెలో ఈ కంపు వాసనల మధ్య, కనీసమైన వసతులు గూడ లేని చోట, మీ నాన్న మొక్కోవడం, అందరూ ఆయన వెనకే క్యూ కట్టేయడం కేవలం భార్యకు మాత్రమే వినిపించే స్వరంతో అన్నాడు.

    నాయుడి పెద్ద కూతురు అమెరికాలో వుంటుంది. అల్లుడు ఐ‌బి‌ఎం లో పనిచేస్తాడు. చిన్న కూతురి నిశ్చితార్ధానికి నాయుడి అభ్యర్ధన మేరకు ఇండియా వచ్చారు.

    పెద్ద కూతురు చిన్నబుచ్చుకుంది. కూతురికి, భర్తకి సమాధానం చెప్పలేక మౌనం వహించింది.

    చిన్న కూతురు ఒక అడుగు ముందు ఆలోచించింది. నిశ్చితార్థమప్పుడే ఇక్కడకు తీసుకొచ్చిన నాన్న పెళ్లయ్యాక భర్తతో ఇక్కడకు తప్పకుండా తీసుకొస్తాడు. అప్పుడు అక్కయ్యకు ఎదురైన అనుభవమే తనకూ ఎదురవొచ్చు. ఏదో ఒకటి చెయ్యాలి.

    కారు దగ్గరికి వచ్చే వరకూ ఎవరూ మరి మాట్లాడలేదు. రాత్రి పదికెల్లా వూరు చేరుకున్నారు. నాయుడు టి‌వి చూస్తున్నాడు. పక్కనే చిన్న కూతురు తన మనసులోని మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే,

    పెద్ద కూతురొచ్చింది

    నాన్నా, మీ అల్లుడు గారికి ఆ ఆశ్రమం ఏమి నచ్చలేదు. మీరు మళ్ళీ దీని పెళ్లప్పుడు రమ్మంటారేమోనని ముందే చెబుతున్నాను తూటా పేల్చింది.

    ఇదే సందని చిన్న కూతురు, అవును నాన్నా, బావ లాంటి వాళ్ళు రావాలంటే, మనమే ఆ గుడిని బాగు చేయొచ్చు కదా ? అంటే మెయిన్ రోడ్డు నుండి ఆశ్రమం వరకూ మంచి రోడ్డేయిద్దాం. గుడి చుట్టూ ప్రహరీ గోడ కట్టిద్దాం. రోజూ వూడ్చి ముగ్గేయిద్దాం. ఒక వాచ్ మన్‌ను పెడదాం. ఇలా ఎన్నో చేయొచ్చు.

    నాయుడు చిన్న కూతురి దాతృత్వానికి మురిసి పోయాడు.

    నా బంగారు తల్లి.. నీదెంత చల్లని మనసమ్మా అని తల నిమిరాడు.

    పెద్ద కూతురంది -  నాన్నా , అందరూ ఆ సమాధికి మొక్కక పోతే, కనీసం ఆయనను చూసిన వాళ్ళతో ఒక బొమ్మ గీయించి , ఒక విగ్రహం పెట్టించి, దానికి పూజలు చేస్తే బాగుంటుంది కదా! అంతగా అయితే, నువ్వు దీని పెళ్ళికి నాకిస్తానన్న నగలు నేను ఆ స్వామీకే వేసేస్తా.

    నాయుడి ఆనందానికి హద్దుల్లేవు.

    పిచ్చి తల్లీ, ఇంత సంపాదించిందీ మీ కోసమేనమ్మా, నేను చేయిస్తాను కదా, రేపే, రామిరెడ్డి అంకుల్ తో మాట్లాడి, అన్నీ ఏర్పాట్లు చేస్తాను.

    ఇద్దరు కూతుళ్లూ తృప్తితో వెళ్ళి పడుకున్నారు.

 * * *

     రామిరెడ్డి , నాయుడు అనుకున్నట్టుగానే ఒక వారం లో కలిసి తిక్కసామి ఆశ్రమానికి బయలు దేరారు. అప్పటికే అక్కడ వీళ్ళ కోసం ఇద్దరు వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఒకతను భరత్ లాల్ , రెండవ వ్యక్తి సోమేశ్వర గుప్త. భరత్ లాల్ రామిరెడ్డి కి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పరిచయం. సోమేశ్వర గుప్త , నాయుడు బావ మరిది పక్క ఫ్లాట్ వోనర్.

    ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక భరత్ లాల్ చెప్పాడు

    రెడ్డీ సాబ్, మీర్ చేసిన సాహాయం మర్చిపోలెన్ సాబ్ అన్నాడు.

    ఆ సహాయమేంటో రెడ్డి విడమరిచి చెప్పాడు

    భరత్ లాల్ టైల్స్ వ్యాపారం చేస్తాడు. వాళ్ళది రాజస్థాన్. ఒక నెల కిందట వాళ్ళమ్మకి సీరియస్ వుంది , కోమాలోకి వెళ్ళే అవకాశం వుంది, త్వరగా వచ్చి చూసి వెళ్ళమని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. ఈయన చివరికి ఫ్లైట్ లో వెళ్ళినా ఒక రోజు పడుతోంది విషయం రెడ్డికి చెప్పి తను వెళ్ళే వరకూ వాళ్ళ అమ్మ స్పృహ లో  వుంటే బాగుండని కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు రెడ్డి తిక్కసామి గురించి చెప్పడం, అతను అలాగే మొక్కోవడం  , వాళ్ళ అమ్మ తిరిగి మాట్లాడటం జరిగి పోయాయి. దాంతో భరత్ లాల్ గూడ ఈ రోజు ఇక్కడ గుడికి సంబంధించిన అభివృధ్ధి కార్యక్రమాల్లో పలు పంచుకుంటానని వచ్చాడు.

    తన కొడుకు పరీక్ష గురించి తన కుటుంబం పడిన బెంగ ఈ దేవుడి వల్ల తీరిందని గుప్తా చెప్పాడు.

    నలుగురూ కలిసి ఆ వూరి సర్పంచ్ ను కలిశారు. తాము ఆ ఆశ్రమాన్ని గుడిలా మారుస్తామన్నారు. మొత్తం గుడికి కావలిసిన బండలు, టైల్స్ అన్నీ తానే ఇస్తానని భరత్ లాల్ చెప్పాడు. రెడ్డి ప్రహరీ గోడ కట్టించి మెయిన్ రోడ్డుకు దారి చేయిస్తానన్నాడు. ఆయనిప్పించిన కాంట్రాక్ట్ లో డబ్బులు ఆయనకే ఖర్చు పెట్టడం తన అదృష్టమన్నాడు. సమాధి పైనే ఒక విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక రూము లా కడదామని నాయుడు చెప్పాడు. గుప్తా తన వంతుగా రోజూ  పూజకయ్యే ఖర్చు , పూజారి జీతం, వాచ్ మన్ జీతం తానే భరిస్తానన్నాడు.

    సర్పంచ్ ఆనందించాడు. పాపం తిక్కసామి, బతికున్నన్ని రోజులు ఏమీ అనుభవించ లేక పాయె అని నిట్టూర్చాడు.

    ఆరు నెలలలో నాయుడు కూతురి పెళ్ళికి ముందే ఈ పనులన్నీ జరిగేలా ప్రణాళిక సిధ్ధం చేశారు.   

 * * * 

     అనుకున్నట్టే కార్యక్రమం ముగిసింది.

    ప్రస్తుతం గుప్తా గారింట్లో తిక్కసామి భక్తులందరూ సమావేశమయ్యారు. ఆశ్రమాన్ని గుడిగా మార్చినందుకు,  అందుకు సహకరించిన వారందరికీ, ఊరి సర్పంచ్ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాడు.

    తరువాత గుప్తా చెప్పాడు రెడ్డి గారూ , మన స్వామికి రోజూ రోజుకూ భక్తులు పెరిగి పోతున్నారు. ఎవరయినా అక్కడ వెళ్ళి ఉండాలంటే అక్కడ వుండడానికి వసతులు లేవు. మా బంధువుల్లోనే కొందరు అక్కడ రూములుంటే బాగుంటుందన్నారు. మనమేదైనా ట్రస్ట్ లాగా ఏర్పడితే ఆ ట్రస్ట్ పేరుతో  వాళ్ళు చందాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు

    అలా ఐతే ఆలస్యమెందుకు, అడిగేదేదో భక్తులందర్నీ అడిగితే ఇంకా గ్రాండ్ గా చేయొచ్చు కదా! ఒక భక్తుడు సెలవిచ్చాడు.

    అవునవును, నాకూ అట్నే అనిపిస్తుంది. మనమేమేమి పనులు చేయాలనుకుంటున్నామో ఒక పేపర్లో ప్రింటు చేసి, విరాళం ఇవ్వాలనుకున్న భక్తులు ట్రస్టుకు పంపమని విజ్ఞప్తి చేద్దాం. రెడ్డి అన్నాడు.

    నేను రెడ్డి గారి పేరును ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవికి ప్రతిపాదిస్తున్నాను గుప్తా చెప్పాడు.

    మనలో మనకు ఇవన్నీ ఎందుకబ్బా రెడ్డి మొహమాట పడ్డాడు.

    ఇవన్నీ మన గురించి కాదు రెడ్డి గారూ, భక్తుల కోసం, పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడం కోసం మళ్ళీ గుప్తానే వివరణ ఇచ్చాడు.

    అప్పటికప్పుడు, రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ గా , నాయుడు ప్రధాన కార్యదర్శిగా, గుప్తా కోశాధికారిగా మిగిలిన సభ్యులను వారే ఎన్నుకునేలా నిర్ణయమైంది.

    పేపర్లో ప్రకటనలివ్వాలి, కరపత్రాలు రాయించాలి, బుక్కులు కొట్టించాలి గుప్తా చెబుతుంటే, అతని భార్య కల్పించుకుని,

    నాదో చిన్న విన్నపం మనకు ఆ దేవుడంటే భక్తి వుంది, మంచి గురి ఉంది. కానీ, ఎవరితోనన్నా మాట్లాడుతున్నపుడు తిక్కసామి అని చెబితే, విటానికి అంత బాలేదు. ఎలాగూ పామ్ ప్లేట్ వేయిస్తున్నారు కదా , పనిలో పనిగా పేరు కూడా కొంచం మంచిది పెడితే బాగుంటుంది కదా! అన్నది.    

    రెడ్డి , నాయుడు ఏమి మాట్లాడలేదు కానీ అక్కడే వున్న కొత్త భక్తులు కొందరు ఉత్సాహంగా ఏం పేర్లు ఉండొచ్చో సూచించడం మొదలు పెట్టారు త్రిక స్వామి , త్రికేశ్వర స్వామి, త్రికానంద స్వామి ఇలా కొన్ని పేర్లు అనుకుని, వాటిలోనుండి త్రికేశ్వర స్వామి లో ఐతే  శివుడు కూడా కలిసి వస్తాడని అదే పేరు ఖాయం చేశారు.

 * * *

     కలియుగ మహా పురుషుడు, భక్తుల పాలిటి కామధేనువు శ్రీ శ్రీ శ్రీ త్రికేశ్వర స్వామి ఆరాధనోత్సవాలు నిన్న ఘనంగా జరిగాయి. ఉదయం సుప్రభాత హారతితో మొదలైపూజా కార్యక్రమాలు సాయంత్రం ఊరేగింపు సేవతో ముగిశాయి. ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ రామిరెడ్డి గారు మాట్లాడుతూ సంవత్సర కాలం లోనే తమ బోర్డ్ ఆలయ నిర్మాణం , వసతి గృహాలు , అన్నసత్రం ఏర్పాటు చేయ గలిగామని, భక్తుల ఆదరణ వల్లే ఇది సాధ్యమైందని , ఇలానే అందరూ తోడ్పాటునందిస్తే, వచ్చే ఆరాధనోత్సవాల్లో స్వామిని వెండి రధం పై ఊరేగిస్తామని , అటు సంవత్సరానికి బంగారు కిరీటం చేయిస్తామని చెప్పారు-సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. అన్న దాన కార్యక్రమం , భజన లతో ఆలయ ప్రాంగణమంతా భక్తి భావనలు వెల్లి విరిసాయి........

    బాగా కవర్ చేశారు సార్ కృష్ణమూర్తి అన్నాడు లోకల్ టి‌వి ఛానల్ వార్తలు చూస్తూ. 

    సమాధానంగా రెడ్డి నవ్వి వూరుకున్నాడు.   

    గుడికి రోజూ వందల సంఖ్యలో, వారాంతాల్లో వేలల్లో  భక్తులు రావడం, అర్చనలు, హారతులు, సేవలు బాగా పెరిగిపోవడం వల్ల ట్రస్ట్ కార్యక్రమాలు ఎక్కువవడంతో ఒక ఆఫీసును ఏర్పరచారు. కృష్ణమూర్తి దానికి మేనేజర్.

    మళ్ళీ అతనే, సార్, ఈ పుస్తకం చూసారా? మన అర్చకుడు శర్మ గారి బాబాయట  - త్రికేశ్వరాష్టకం , త్రిక అష్టోత్తరమ్, త్రిక సహస్ర నామాలు అన్నీ ఒకే పుస్తకంగా వ్రాశానని చెప్పాడు. ఖర్చు ఫరవాలేదనుకుంటే, స్థల పురాణం కూడా వ్రాస్తానని చెప్పాడు. పుస్తకం మీద పది  రూపాయలిస్తే చాలన్నాడు. ఇది ఇంకో పుస్తకం , స్వామి వారి మీద శతకం. 'శ్రీ త్రికేశ్వరుండు సిరుల నొసగు'  అనే మకుటంతో ఒక దాత విరాళంగా ఇస్తూ ఉచితంగా పంచమని చెప్పాడు

    రెడ్డికి వాటిని ఆస్వాదించే మనసు, సమయము లేవు.

    సరే, సరే, తొందరగా ఆ చెక్కులేవో సంతకం చేయాలంటివికదా, ఆవియ్యి ముందు. ఇవి మళ్ళా చూద్దాం. మధ్యాహ్నం కెల్లా తిరిగి  హైదరాబాద్ చేరుకోవాల. మూడు గంటలకు మినిస్టర్ గారిని కలవాలి తొందర పెట్టాడు రెడ్డి.

    ఇదిగో ఇస్తున్నా అని బీరువా తీస్తూ, అన్నట్టు ఐ‌సి‌ఐ‌సి‌ఐ వాళ్ళు, హెచ్‌డి‌ఎఫ్‌సి వాళ్ళు వచ్చి తిరిగి పోతున్నారు- కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించాలని. మిమ్మల్ని కలుస్తారేమో హైదరాబాద్ లో

    చెప్పాడు కృష్ణమూర్తి.

     రెడ్డి సాలోచనగా బయటకు చూస్తూ సరే అన్నాడు. చెక్కులు సైన్ చేసి ఒక అర్థ గంటలో నిష్క్రమించాడు రామిరెడ్డి.

    మధ్యాహ్నం మూడు గంటలకు మినిష్టర్ తో మీటింగ్ అయిపోయిన తరువాత తన ఆఫీసుకు వచ్చాడు రామి రెడ్డి..

    అప్పటికే అక్కడికి నాయుడు , గుప్తా వచ్చి రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు.

    ఏం రెడ్డీ, ఈసారి ఏం టెండర్ పెట్టావ్, మంత్రి గారికి?” సరదాగా అడిగాడు నాయుడు.

    రెడ్డి నవ్వుతూ ఏం లేదు, ఒక ట్రాన్స్ ఫర్ గురించి వెళ్ళాను. అవునూ , మీరిద్దరూ అనుకునే కలిసొచ్చినారా? వచ్చినాంక కలిసినారా? అడిగాడు.

    కలిసే వచ్చాం. మా అల్లుడు నిన్న మెయిల్ పంపించాడు. మన గుడి మీద ఒక డాక్యుమెంటరీ తీస్తాడట. అలాగే, ఒక వెబ్ సైట్ గూడ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. ఇంటర్నెట్ లో పెట్టి అందరికీ తెలియ చేద్దాము, ఇక్కడి డొనేషన్లు డాలర్లలో వస్తాయి కదా అని చెప్పాడు. మన వెండి రధం పధకానికి ఎలాగూ పెద్ద మొత్తాలే కావాలి గదా,సరే ఆని చెప్పాను. నాయుడు చెప్పాడు.

    రెడ్డి ముక్తాయింపుగా , అవున్లే, ఉండాల్లే అని

    గుప్తా, నువ్వెవరినో పట్టుకొస్తానంటివే, వచ్చినాడా ఆయన? గుప్తాని అడిగాడు.

    , వున్నాడు గదా, బయట వెయిట్ చేస్తున్నాడు. అని వాకిలి తీసి బయటకు తొంగి చూస్తూ,

    సార్,రండి అంటూ ఒక వ్యక్తిని లోపలికి పిలుచుకొచ్చాడు.

    మళ్ళీ తనే ఈయన వాస్తురత్న విజయ కుమార్ అని మంచి పేరున్న వాస్తు పండితుడు. ఆస్పత్రులు , గుళ్ళు , కాలేజీల వాస్తులో ఎక్స్ పెర్ట్ . మాటల్లో నేను మన గుడి గురించి చెబితే మన దేవాలయం ప్లాన్ చూసి కొన్ని సూచనలు చేస్తానన్నాడు. అన్నాడు

    రెడ్డి ప్లాన్ తెప్పించాడు. వాస్తు రత్న ఆ ప్లాన్ ను పరిశీలనగా చూసి,

    మీ గుడి పేరు త్రికేశ్వరాలయం, కానీ మీ ఆలయంలో ఈశ్వరుడి గుడి లేదు. ఇది ప్రథమ దోషం. తన నామధేయాన్ని ఇలా వాడుకుని అక్కడ గుడి కట్టించకుండా వుంటే, ఈశ్వర కృప మీ మీద ఎలా వుంటుంది?” మాటలాపి అందరి వేపు చూశాడు.

    తన విత్తనం మొలుస్తుందన్న నమ్మకం కలిగింది.

    ప్పుడైనా మించి పోయిందేమీ లేదు. ఈశాన్యంలో ఒక శివాలయం కట్టించండి. శివాలయం ఉన్న చోట నవగ్రహాలు ఉండటం మంచిది. ఎలాగూ మీరు ఈ మూలాన కొంత బరువు పెట్టాలి. ఇళ్లకైతే అలమరలో , గోడలో పెడతాం. ఇది గుడి కదా, అందుకే అక్కడ నవగ్రహాలు ప్రతిష్టించారనుకోండి, ఉభయతారకంగా ఉంటుంది. మీ గుడి గోపురాన్ని గమనించారా? ఐదు అంతస్తులే ఉన్నాయి, దానికి తోడు,శాలు మూడే ఉన్నాయి. దాన్ని వెంటనే ఏడు అంతస్తులకు, కలశాలను అయిదుకు పెంచండి. ఈ స్వామి పేరు బలానికి తగినట్టుగా గాలిగోపురం పశ్చిమానికి ఉండాలి. అది కట్టించడం చాలా ఖర్చు అనుకుంటే, గర్భగుడి ప్రధాన ద్వారం ఇప్పుడున్నట్టు కాకుండా, ఎడమ వైపుకు మార్చండి. ఇంతకంటే పెద్ద మార్పులేమీ అవసరం లేదు. స్వామి వారి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది, ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది అని ముగించాడు.

    కళ్యాణం అనే మాట వినగానే నాయుడు మొహం వెలిగింది. ఇందాకటి నుండీ తను ఏదో మర్చి పోయాను, ఏదో మర్చి పోయాను అనుకుంటున్నాడు ఇప్పుడు గుర్తొచ్చింది. తన చిన్నల్లుడు కళ్యాణ సేవ గురించి మాట్లాడమన్నాడు. పెళ్లి జరగాలని మొక్కు కునేవాళ్ళకు మొక్కు తీర్చుకునేందుకు మంచి ఆప్షన్స్ లేవని, అదే కల్యాణోత్సవం జరిపే అవకాశం ఉంటే బాగుంటుందని అన్నాడు. అల్లుడి మాటను మన్నించాలి కదా!  

    అన్నట్టు, మన గుళ్ళో కల్యాణోత్సవం పెడితే ఎలావుంటుంది? “ ప్రస్తావించాడు.

    ఎందుకు లేదో, ఆ మాత్రం తెలీదా?” అన్నట్టు చూశాడు రెడ్డి.

    ఐతే, రెడ్డి ఆలోచనల తల దన్నేట్టుగా వాస్తురత్న భేషుగ్గా వుంటుంది అన్నాడు. రెడ్డికి చిరాకేసింది. అసహనంగా మొహం పెట్టి, అమ్మవారెక్కడుంది?” అన్నాడు కొంచం కోపంగా.

    వాస్తురత్న ఏ మాత్రం తగ్గకుండా ప్రతిష్ట చేద్దాంఅన్నాడు, ఇది చాలా చిన్న విషయం అన్నట్టు.

    ఇందాకట్నుంచి అక్కడే సంభాషణంతా వింటున్న అర్చకులు శర్మ అవును రెడ్డి గారు , ఎలాగూ ఈశ్వరాలయం అనుకుంటున్నారు కదా, అలాగే, అమ్మవారికి గూడ గుడి కట్టించేస్తే అప్పుడు కళ్యాణం జరిపించే ఏర్పాటు సాధ్యమౌతుంది.అన్నాడు.

    అమ్మవారి పేరు త్రికాదేవి అని పెట్టండి. నామదోషం లేకుండా వుంటుంది వాస్తురత్న సూచించాడు.

    అందరికీ ఆమోదంగానే అనిపించింది. అందరూ రెడ్డి వైపే చూస్తున్నారు. అతను ఇంకా ఎందుకో కన్విన్స్ కాలేదు.

    ఇంతకీ కళ్యాణం ఎవరికి చేస్తారు ? కళ్యాణం జరగాలని మొక్కుకునేదేమో ఒక దేవునికీ కళ్యాణం  చేయించేదేమో వేరే దేవుళ్ళకు ? ఇదెట్ల కుదురుతుంది?” రామిరెడ్డి ప్రశ్నించాడు.

    ఇందులో తప్పేముందండి? ఇలాంటివి మన పురాణాల్లో కోకొల్లలు. ఐనా ఈ న్యాయమీమాంసల గొడవలో మనమెందుకు బుర్ర బద్దలు కొట్టుకోవడం, మా చిన్నన్న పండిత వెంకటరామశాస్త్రి గారికి ఫోన్ చేస్తాను అంటూ ఎవరైనా ఏదైనా మాట్లాడే లోపలే ఫోన్ మోగడం, మాట్లాడటం జరిగిపోయింది. ఆయన సూచన మేరకు శివ పార్వతుల (త్రికాదేవి పార్వతీ దేవి అవతారం!) కళ్యాణంలో వివాహ పెద్దగా త్రికేశ్వర స్వామి వ్యవహరిస్తాడు. తనే దగ్గరుండి కళ్యాణం జరిపిస్తాడు. దీనిని ఇంకోలా కూడా అన్వయించుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించేవాడు కాబట్టే తమ కళ్యాణం కూడా జరిపించగలడనే నమ్మకం మరింతగా కలుగుతుంది.

    అంత మందికీ  ఒప్పుదల అయినప్పుడు తను పట్టు పట్టడం బాగుండదని, ఏర్పాటు పెద్దగా అభ్యంతరంగా ఏమి లేదనిపించి అందరూ ఓ‌కే చెప్పడంతో రెడ్డి గూడా సరేనన్నాడు.

    అల్లుడి గారి కోర్కె తీర్చినందుకు నాయుడు ఆనందించాడు. వాస్తురత్నను ఆ దేవుడే పంపినట్లు భావించాడు. శర్మ గారు కూడా అలాగే భావించారు. ఎలాగోలా కృష్ణమూర్తి తో చెప్పించి, ఎక్కడో దీపారాధనకు కూడా నోచుకోని గుళ్ళో అర్చకుడిగా పని చేస్తున్న తన అల్లుడిని అమ్మవారి గుళ్ళో ఇరికించేస్తే సరి అనుకున్నాడు.

 * * *

     రెండేళ్ల కాలం గడిచింది.

    ఊరు మారింది, గుడి మారింది. ట్రస్ట్ బోర్డ్ మారలేదు.

    భక్తుసంఖ్య పెరిగింది. వారి కోర్కెలు పెరిగాయి. గుళ్ళో దేవుళ్ళు పెరిగారు. పబ్లిసిటీ పెరిగింది. వసతులు పెరిగాయి దేవాలయ ఆదాయం పెరిగింది. ఉత్సవాల ప్రాభవం పెరిగింది.

    ఈ రోజు స్వామి వారి నాలుగవ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. హైవే దగ్గర నుండి, గుడి వరకూ అంగళ్ళు వెలిశాయి. టెంకాయలమ్మే వాళ్ళు, పూలు పళ్ళు అమ్మే వాళ్ళు, తాత్కాలికంగా ఏర్పాటైన హోటళ్లు, భక్తి పుస్తకాలు అమ్మే స్టాల్స్, బొమ్మలు, ఆట వస్తువులు, విగ్రహాలు, ఫోటోలు అమ్మేవాళ్ళతో ఆ త్రోవంతా సందడి సందడిగా, హడావుడిగా వుంది. పిల్ల పాపలతో వచ్చే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు , మొక్కులు తీర్చుకునే వాళ్ళు బారులు బారులు గా జనం నడుస్తున్నారు. ఈ గోలకు రెట్టింపు స్వరంతో దేవుడి పాటలు ఆ ప్రదేశాన్ని హోరెత్తిస్తున్నాయి. పాపులరైన పాటల బాణీలతో త్రికేశ్వరుడి మహిమలను వర్ణిస్తున్నాయి. బంగారు లాంటి సామి, బ్రోవవయ్య,సామి, మా సామి, మాస్సామీ”, నిను మొక్కేటందుకే ఉన్నాము లే సామీఈఈఈ ….”, కోర్కె తీర్చే మా సామి కోసం, కొండలెక్కి వచ్చేశాలే రంగ రంగ రంగ రంగ రంగ రంగా రే, మొక్కు తీర్చే ఈ సామి కోసం పూలు పళ్ళూ తెచ్చేశాలే రంగ రంగ రంగ రంగ రంగ రంగా రే...

    అక్కడికి కొద్ది దూరంలో గుడికి బయట పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ రోజే త్రికేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని అలంకరించే రోజు. అనుకున్న పని సాధించినందుకు మొత్తం బోర్డ్ కు , మరీ ముఖ్యంగా రెడ్డికి చాలా సంతోషంగా వుంది. అందుకే ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్ గా చేయాలని సంకల్పించారు. స్వామివారి కిరీటధారణ కార్యక్రమానికి మంత్రి గారిని ఆహ్వానించారు. ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈ ఉత్సవాల గురించి కవరేజ్ రూపంలో , ప్రకటనల రూపంలో గత మూడు రోజులనుండి ప్రచారం జరిగింది. బోర్డ్ మెంబర్లందరూ వేదిక పైనే ఆశీనులై ఉన్నారు. ఎప్పటి లాగే మంత్రి గారి కోసం వెయిటింగ్.

    రెడ్డి ఫోన్ మోగింది. ఇంకో పావుగంటలో మంత్రి గారు వచ్చేస్తారు. ఈలోగా మిగతా కార్యక్రమాలు జరిపించమని పి‌ఏ ఫోన్ చేశాడు. రెడ్డి ఫోన్ కట్ చేసి ఈ విషయం అందరికీ చెప్పి జనం వైపు తిరిగాడు.

    తనకు ఎదురుగా జనం లో చివరి వరుసలో నిలుచున్న ఒక సాధువు ఎవరితోనో దేన్ని గురించో వాకబు చేస్తున్నట్టు గమనించాడు. కొంచం పరిశీలనగా చూసి, అతన్ని ఎక్కడో చూసినట్లనిపించి అలా అలా నాలుగేళ్ళు వెనక్కి వెళ్ళాడు. అవును. అతనే, మొట్ట మొదటి సారి తను ఈ గుడికి, కాదు కాదు ఆశ్రమానికి వచ్చినప్పుడు త్రికేశ్వరస్వామి విగ్రహానికి...  కాదు కాదు తిక్కసామి సమాధికి మొక్కుతూ తనకు పరియమైన సాధువు.

    వెంటనే కిందకు దిగాలనుకున్నాడు. కానీ మంత్రి గారు వచ్చినప్పుడు తను లేకపోతే బావుండదు. వెంటనే, తన ఆఫీస్ బాయ్ ని పంపి ఆ సాదువును ఈ వేదిక వెనుక వైపు తీసుకు రమ్మని చెప్పాడు. తను అక్కడ నిలబడి మాట్లాడితే, మంత్రి వచ్చినా ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. తను నాయుడుకు చెప్పి, కిందకు దిగుతున్నాడు. తనకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజుకు, ఈ రోజుకు ఎంత తేడా? తను తన మిత్రులు ఈ గుడిని ఎంత అభివృధ్ధి చేశారు! ఈ విషయాలన్నీ ఆ సాధువుకు చెప్పాలని మనసు ఉవ్విళ్లూరుతోంది.

    ఆఫీస్ బాయ్ , అతని వెనకనే సాధువు వచ్చారు.

    స్వామీ గుర్తు పట్టారా, మనం ఇక్కడే కలిశాం, సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఉద్విగ్నంగా  అడిగాడు రెడ్డి.

    ఏమీ అనుకోవద్దు నాయనా, నాకు అన్ని విషయాలు గుర్తుండడం లేదు. కానీ నేను నాలుగేళ్ల క్రితం ఈ ఊరు వచ్చిన విషయం గుర్తుంది. ఇక్కడ తిక్కసామి అని ఓ మహాపురుషుడి సమాధి వుండేది. ఆ మహానుభావుడి ఆరాధన శ్రావణ బహుళ సప్తమి. ఆ విషయం గుర్తుండే ఇలా వచ్చాను. అయితే, నేను దారి తప్పినట్లున్నాను. ఇక్కడేదో త్రికేశ్వర స్వామి కిరీట ధారణ మహోత్సవం జరుగుతున్నదని ఇప్పుడే తెలిసింది. ఇంతకూ మీరు ఎందుకు పిలిపించారో సెలవిస్తే నా దారిన నేను వెళతాను. అన్నాడు.

    ఆ సాధువు మాటలకు రెడ్డి పగలబడి నవ్వుతూ,

    మీరేమీ దారి తప్పలేదు స్వామీ.. మీరెక్కడికీ పోవాల్సిన అవసరం లేదు. మీరు మాకు అతిథి. ఈడనే మీకు కాబట్టినన్ని దినాలు ఉండొచ్చు అంటూ ఈ నాలుగేళ్లలో జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరించాడు.

    అంతా విన్నాక సాధువు ధీర్ఘంగా నిట్టూర్చాడు. రెడ్డి వైపు నిర్వికారంగా చూస్తూ

    నాయనా, ఆ మహనీయుడు మనిషిగా పుట్టినా, అరిషడ్వర్గాలను జయించి, పరోపకారమే పరమావధిగా, జీవించి తన జీవితాన్నే సందేశంగా అందించి, దేవుడుగా మారాడు. ఏ గుణాలకు దూరంగా వుండాలని ఆయన ఆచరించి చూపించి దేవుడయ్యాడో అవే గుణాలని మీరు ఆయనకు అంటగట్టారు. మీకున్న జాడ్యాల్ని , ఆడంబరాలని, వ్యామోహలని ఆ మహాత్ముడికి గూడా ఆపాదించి, మూడేళ్లలో ఆయనని మనలాంటి మనిషిని చేశారు.. మనుషులు మారరు. అని ఆవేదనతో జనంలోకి విసా విసా నడచుకుంటూ వెళ్ళి పోయాడు సాధువు.

    మైక్ లో అనౌన్స్ మెంట్ వినిపిస్తోంది శ్రీ శ్రీ శ్రీ త్రికేశ్వర స్వామి హిరణ్య కిరీట ధారణ మహోత్సవానికి విచ్చేయుచున్న మాన్య మంత్రివర్యులు

    రెడ్డికి ఈ సారైనా ఆ సాధువు మాటలు వినబడ్డాయో లేదో !


(నవ్య వీక్లి 23-11-2011 సంచికలో ప్రచురితం)

Comments