మంత్రాలకు చింతకాయలు రాలునా! - ఆలూరి పార్థసారథి

        
పాంచజన్య ఎవరితోనో ఘర్షణ పడుతున్నట్టు అనిపించి, "అబ్బాయ్ ఏఁవిటిరా ఆ గొడవ!" అన్నారు - పరంధామయ్యగారు, ఇంట్లోంచి బయట ఆవరణలోకి అడుగు పెడుతూ.     "మీరు లోపలికి వెళ్ళండి నాన్నగారు, తర్వాత చెప్తాను" అన్నాడు పాంచజన్య, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక.     ఇంతలోనే,ఆగంతకుడు నాగభూషణం - "ఇల్లు ఖాళీ చెయ్యం, ఏంచేస్తారో చేసుకోండి!" అని విసురుగా వెళ్ళిపోయాడు.     పరంధామయ్యగారు నీరు కారిపోయారు. ఒక్కగానొక్క ఇల్లు, తాతలనాటి ఆస్తి. బాల్యంనుంచి యవ్వనం వరకు, ఆ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడివేసుకొని ఉన్నాయి. చివరిదశలోనైనా ఆ ఇంటికి వెళ్ళిపోవాలని అతని చిరకాల వాంఛ. కుదిరేటట్టులేదని నిరుత్సాహపడ్డారు. ఈ వయసులో ఇక నేనేం చెయ్యగలను, భగవన్నామస్మరణ తప్ప, అని చప్పగా చల్లారిపోయేసరికల్లా, మెరుపులా జ్ఞాపకం వచ్చింది - చాలాసంవత్సరాల క్రితం, అతనికి గురువుగారు ఉపదేశించిన మంత్రం.     ఇంద్రమంత్రం !     "ఇది వేదమంత్రం. ఇందులో ఏ తంత్రం లేదు. క్షుద్రవిద్య అసలే కాదు. చిన్న మంత్రం కాని చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని, ఎవరైనా నీ ఆస్తిని అన్యాయంగా ఆక్రమిస్తే, వారిమీద ఉపయోగించవచ్చు. వారు నీ ఆస్తి నీకు విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి మాత్రమే ఉపయోగించు. వారి హాని కోరకు. మరీ అవసరైమైతే తప్ప, దీన్ని ప్రయోగించకు. దీని అవసరం నీకెప్పటికైనా కలగవచ్చని ఇది నీకిస్తున్నాను, నాయనా," అని అది ప్రయోగించే విధానాన్ని చెప్పారు - గురువుగారు అప్పుడు.     పరంధామయ్య గారికి ఆ విషయం జ్ఞాపకం రావడమే తడవు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వెంటనే, వాళ్ళ అబ్బాయితో అన్నారు "ఈరోజునించి 'ఇంద్రమంత్రం' జపిస్తాను. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. వాడంతట వాడే ఖాళీ చేస్తాడు." - దృఢంగా అని లోపలికి వెళ్ళిపోయారు. గురువుగారన్నా, అతను ఉపదేశించిన మంత్రమన్నా అంత నమ్మకం పరంధామయ్యగారికి.     "మంత్రాలకి చింతకాయలు రాలతాయా!" అని గొణుక్కుంటూ పాంచజన్య, లాయర్‌ని కలవడానికి బయటకి వెళ్ళాడు.
* * *

    పరంధామయ్యగారు, ఇంట్లో ప్రశాంతమైన జాగాలో కూర్చుని, ఉపాసన మొదలెట్టారు.     ప్రథమంగా సంకల్పం - తన పూర్వీకుల ఇంటిలో అద్దెకుంటున్నవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మనస్పూర్తిగా కోరుకుని, తన అభీష్టసిద్ధికొరకై సహాయపడమని వరుసక్రమంలో ఈ దేవతలని ప్రార్ధించారు -     కులదైవం ,     ఇష్టదేవత,     తల్లి,     తండ్రి,     గురువు,     ఆ తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్ధించి, 'ఇంద్రమంత్రం' జపించడం ప్రారంభించారు.     ఆ మంత్రాన్ని జపిస్తున్నంతసేపూ అతని మస్తిష్కంలో ఒక దృశ్యం మెదులుతోంది -     ఆకాశాన్నుంచి, ఇంద్రుడు, తన ఇంట్లో అద్దెకుంటున్నవాళ్ళ మీద మెరుపులు, ఉరుములు కురిపిస్తున్నాడుట , వారు ఆ మిరుమిట్లుగొలిపే మెరుపులకి, చెవులు దద్దరిల్లేలా పక్కనే పడుతున్న పిడుగులకి భయపడి ఇల్లు విడచి పారిపోతున్నారట.     అలా వారు పారిపోతున్న దృశ్యం ఎంతో ఆనందాన్నిస్తోంది పరంధామయ్యగారికి.     అలా పరంధామయ్యగారు ఉపాసనలో లీనమై ఉండగా, పాంచజన్య లాయరుగార్ని కలిసి, చేసేదేమీ లేక ఇంటిదారి పట్టాడు. తోవలో ఆలోచిస్తున్నాడు -     లీగల్ వే లో వెళితే వ్యవహారం అంత సునాయాసంగా, వేగంగా తెవిఁలేటట్టు లేదని , తాత్సారం చేస్తే, నాన్నగారి కోరిక తీరదేమోనని, వేరే ఏదైనా దారి ఆలోచించాలని అనుకుంటూ అడుగులు వేస్తున్నాడు.
* * *

    ఇంట్లో పరంధామయ్యగారి మంత్ర జపం నిరాటంకంగా సాగుతోంది. అతని మనస్సులో కదలాడుతున్న దృశ్యం ఇప్పుడు మరికొంచెం ముందుకు సాగింది.     మెరుపులు, పిడుగుల వర్షంతో భయపడి పారిపోతున్న వాళ్ళు కాస్తా ఒక్కసారి ఆగి, వారు విడిచిపెట్టిపోతున్న ఇంటిని కడసారి చూద్దామనే ఉద్దేశ్యంతో వెనక్కి చూస్తారట. అక్కడ ఇంటి ద్వారం దగ్గర, ఒక పెద్ద ఆదిశేషులాంటి సర్పం, బుసలు కొడుతూ మళ్ళీ వీరి రాకని ప్రతిఘటించటనికా అన్నట్టు ఉన్నదట.     అది చూసి వాళ్ళు హడలిపోయి మరి వెనక్కి చూడకుండా ఒకటే పరుగు లంఘించుకున్నారట.

* * *
    అదే సమయంలో యధాలాపంగా నడచి వస్తున్న పాంచజన్యకి ఎదురుగా తోవకి అడ్డంగా ఒక గజం దూరంలో ఏదో కదలినట్టై అటు చూసి ఉలిక్కిపడ్డాడు. ఒక పెద్ద పాము సరసరా పాక్కుంటూ వెళ్ళిపోయింది. తేరుకుని, వడి వడిగా అడుగులు వెయ్యటం మొదలెట్టాడు.     అప్పుడే తట్టింది అతనికో ఆలోచన. ఏ పాములవాణ్ణైనా పట్టుకుని ఒకటి-రెండు నాగుపాములని తాతగారి ఇంట్లో ప్రవేశించేలా చేస్తే, ఇంట్లో అద్దెకున్నవాళ్ళు హడలిపోయి ఇల్లు వదలి పారిపోరా అని. ఆలోచన వచ్చిందే తడవు, పాముల వాళ్ళుండే పేటకి బయల్దేరాడు.
* * *
    కొద్దిరోజులుగా పరంధామయ్యగారి జపం క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది.
* * *
    ఉలిక్కిపడి లేచింది ఆమె, కుడి చేత్తో పక్క తడిమి బాబు తన ప్రక్కనే హాయిగా నిద్రపోతున్నాడని తెలుసుకుని తృప్తిపడింది. అలా పడుకునే గోడమీదకి కొంచెం పైగా చెయ్యి పోనిచ్చి లైటు స్విచ్ వేసింది.     గది అంతా వెలుగు పరుచుకుంది. ఎడం చేతి వైపు గాఢ నిద్రలో వున్న నాగభూషణాన్ని లేపింది.     "ఏఁవండీ, ఈమధ్య మనింట్లో పాములు తిరుగుతున్నాయంటే మీరు నమ్మట్లేదు. ఇప్పుడు మాత్రం స్పష్టంగా వినిపించింది - ఇంటికప్పు మీద ఏదో జరజరా పాకి నాలుగిళ్ళవాకిట్లో రబ్బర్ ట్యూబ్‌లా టప్ మని జారి పడినట్టుగా! నాకు చాలా భయంగా ఉంది. అది ఎక్కడ దూరిందో ఏమో! మీ కళ్ళతో మీరే చూడండి. అప్పటిక్కాని నా మాట నమ్మరు." అంది.     విసుక్కుంటూ గది నలుమూలలా పరికించాడు,నాగభూషణం. ఒక మూల కనిపించింది, గోడకి ఆన్చి ఉంచిన కఱ్ఱ. అది తీసుకుని నేలమీద చప్పుడయేలా కొడుతూ, ఉస్ ఉస్ అని శబ్దం చేస్తూ, ఇల్లంతా లైట్లు వేశాడు, ఇంచి ఇంచీ పరిశీలించేడు. ఎప్పుడూలాగే ఏమీ లేదని నిర్ధారించుకుని తిరిగి బెడ్ రూమ్ చేరుకున్నాడు.     మంచం మీద బాసిం పట్టు వేసుకుని, పిల్లాణ్ణి ఒళ్ళో పెట్టుకుని కూర్చుని వుంది ఆమె.     "కనిపించిందా? ఎక్కడుంది?" అడిగింది.     "లేదు!" - అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. కఱ్ఱని మూలకి గిరాటేశాడు. ఉసూరుమని మంచం మీద కూలబడ్డాడు. చిరాకేస్తోంది అతనికి - రోజూ ఇలాగే ఏదో ఒక భుజంగ ప్రహసనం వల్ల తనకి సరయిన నిద్రలేకపోవడం, భార్య భయాందోళనల మధ్య మనసు దేనిమీదా సరిగా లగ్నం చేయలేకపోవడం జరుగుతోంది. ఇలా అట్టే రోజులు సాగవని, ఏదోవొకటి వేగంగా చెయ్యాలని అనుకున్నాడు.     "ఎవరికైనా హాని జరగకముందే ఈ పాడిల్లు వదిలేసి పోదాం. వేరే మంచి శ్లాబ్ ఇల్లు చూడండి. రేపే!" అన్నదామె.     భార్య మాటలు వింటూ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తలాడించేడు. మెల్లిగా నిద్రకుపక్రమించాడు.
* * *
    మర్నాడు ఉదయం - పరంధామయ్యగారు ఆరోజు జపం పూర్తిచేసుకుని, హాల్లోకి వచ్చేరు. అప్పుడే పాంచజన్యతో నాగభూషణం మాట్లాడి వెళ్ళాడు. పాంచజన్య, పరంధామయ్యగారికి శుభవార్త చెప్పాడు - "నాన్నగారూ, నాగభూషణం మన ఇల్లు ఖాళీ చేసేస్తున్నాడు, ఇవాళే! అది చెప్పడానికే వచ్చాడు. ఇన్నాళ్ళూ ఖాళీ చెయ్యనని ఏడిపించినవాడు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసా - వాళ్ళావిడకి ఈ మధ్యే స్నేక్ ఫోబియా పట్టుకుందిట.     ఆవిడకి తరచూ ఆ ఇంట్లో పాములు కనిపిస్తున్నాయిట. దాంతో అవిడ తెగ భయపడిపోతున్నాదిట. ఇల్లు మారిస్తే తప్ప ఆవిడ భయం పోదనీ, అవిడకి ట్రీట్ మెంట్ ఇప్పించడానికి వీలుగా వేరే ఇంటికి మారిపోతున్నాడుట. అతనికి మాత్రం ఎప్పుడూ పాములు కనిపించలేదుట అయినా మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు."     ఆ మాటలకి పరంధామయ్యగారు తలెత్తి మీదకి చూసి రెండు చేతులూ జోడించి -     "ఇదంతా ఆ భగవంతుడి దయ, మా గురువుగారు ఉపదేశించిన మంత్రం మహిమ! ఆ మహాత్ముడికి,నాకెప్పుడైనా ఇలాటి అవసరం కలగవచ్చని అనిపించడమేమిటీ, అతడు నాకీ 'ఇంద్రమంత్రం' మాత్రమే ఉపదేశించడమేమిటి!

    అది నాకిన్నాళ్ళూ స్ఫురణకి రాకపోవడమేమిటీ - వచ్చిన వెంటనే అనుష్ఠించడమేమిటి! నా ధ్యానంలో సర్పం మెదలడమేమిటీ - ఆ సర్పాలే ఇలా మన సంకల్పసిద్ధికి కారణభూతమవడమేమిటి ! ఇదంతా చిత్రంగా లేదూ!!     డైరెక్టుగా దేవేంద్రుడే సినిమాల్లోలాగా దిగి వచ్చి, స్వయంగా మనకి సహాయపడతాడనుకున్నావా? ఏదోవిధంగా ఎవరి మనసులోనో దూరి మనకి శుభం జరిగేలా చేస్తాడు. అదే మంత్రమహిమ.     "మంత్రాలకి చింతకాయలు రాలతాయా!" అని ఆరోజు సణిగావు, చింతకాయలే కాదు ఏమైనా రాలతాయి అని ఇప్పుడైనా నమ్ముతావా!     అది సరైన గురువు ఉపదేశించిన మంత్రమయి, నిర్దిష్టించిన రీతిలో అనుష్ఠించితే, ధర్మసమ్మతమయినదైతే, సత్సంకల్పంతో సంధించినదైతే, తప్పకుండా ఫలిస్తుంది. అసలు, మంత్రం అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు, ఎవడుపడితే వాడు నాలుగక్షరం ముక్కలు రాసి పారేస్తే అవి చూసి ఎవడికిష్టం వచ్చినట్టు వాళ్ళు పఠించెయ్యడం అనుకుంటున్నావా? కాదు!     అన్నిటికంటే ముఖ్యమైనది నమ్మకం. త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆ ధ్యానంలో బాహ్యప్రపంచాన్ని మర్చిపోయి లీనమయిపోవాలి. ఆ మంత్రం తప్ప మరే ధ్యాస లేకుండా ధ్యానించాలి, జపించాలి, తపించాలి - అప్పుడు ఫలిస్తుంది. ఫలించే వరకు అలా జపిస్తూనే ఉండాలి." అని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నారు పరంధామయ్యగారు.     పరంధామయ్యగారు అంత ఆవేశంగా మాట్లాడటం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు పాంచజన్య. తండ్రి అంటే చాలా గౌరవం అతనికి. అందుకనే ఆయన నమ్మకం గురించి ఇక చర్చించక, ఎవరి నమ్మకం వారిదని వదిలేశాడు. తను నమ్మిన పాములవాడి దగ్గరకు పారితోషికాన్నందిచడానికి ప్రయాణమయ్యాడు.
* * *
    పారితోషికాన్ని తిరస్కరిస్తూ పాములవాడు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు!     "మీరు సెప్పినట్టు పాముల్ని ఒగ్గల్లేదయ్యా నేను, ఇదంతా ఆ ఇంట్లో ఉన్న అమ్మగారి సలవ. నేను సెయ్యనంటే, మరో పాములోడి దగ్గరకెల్తారు మీరు. ఆ ఎదవ మీరు సెప్పినట్టు సేస్తే, ఉసూరుమని మూడు నిండు పానాలు పోవా!     సదువుకున్నోలు, మీరు మాత్రం అలా సేస్తారా, ఏదో ఆవేసంలో నాతో అలా అనీసేరు గాని!     ఏటి సెయ్యాలో తెలీక, ఆ యమ్మ దగ్గిరికే ఎల్లి మొత్తం కదంతా సెప్పీసినాను - మీ నాన్నగారి సివరాకరి కోరికా, ఆళ్ళు ఇల్లు కాళీ సెయ్యకపోడం, మీరు నన్ను పాములొగ్గమండం, అన్నీ. ఎలాగైనా ఆళ్ళాయన మనసు మార్సి, ఇల్లు కాళీ సేసేలా సెయ్యమని కూడా సెప్పేను. మరాయమ్మ ఏ మంతరం ఏసిందో ఏమో!" అన్నాడు.

    పాంచజన్యకి సిగ్గు వేసింది. తనమీద తనకే అసహ్యం వేసింది. పాములవాడికున్నంత ఇంగితజ్ఞానం కూడ తనకు లేనందుకూ, తనలో మానవత్వం నశించినందుకు. ఆ క్షణంలో పాములవాడు మహోన్నతమైన మానవతా మేరుపర్వతంలా, దాని ముందు తనో ధూళికణంలా అనిపించి, కుంచించుకుపోయాడు. ఆ ఔన్నత్యం ముందు ఇక నిలబడలేక, తలవంచుకుని అడుగులు వేసేడు - క్షమించమని అడగటానికి - ఆవిడ్ని.

* * *
    గుమ్మంలోనే ఎదురైంది ఆమె. చిరునవ్వుతో ఇంట్లోకి ఆహ్వానించింది. పాంచజన్యకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తోచలేదు. కంఠం రుద్ధమయింది, కళ్ళు చెమర్చాయి, ఆ దేవతామూర్తి చేసిన సహాయానికి కృతజ్ఞతగా -     "క్షమించండి! నేను మీ మీదకి విషకీటకాలని వదలుదాం అనుకున్నాను. అవి మీ ప్రాణాలు తీసినా తీసి ఉండేవి. అంత ఘాతుకానికి వడికట్టిన పాపాత్ముణ్ణి నేను. అయినా మీరు అవేవీ మనసులో పెట్టుకోక మేలు చేశారు. మా నాన్నగారి చిరకాల వాంఛ తీరేలా చేశారు. మీ ఋణం నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను." అని మాత్రం అతి కష్టం మీద అనగలిగాడు పాంచజన్య.     తేలిగ్గా, ఆమె ఒక్కటే అంది -     "ఆ పాములవాడు నేను ఏదోవొక పరిష్కారం తప్పకుండా చేస్తానని నా మీద పూర్తి నమ్మకం ఉంచి ఆడిన మాటలు, నాపై మంత్రాల్లా పనిచేసి ఒక తోవ చూపించాయ్! అంతే!!"
(స్వాతి సపరివార పత్రిక 29-08-2008 సంచికలో ప్రచురితం)
Comments