మరి, మీకెలా కనబడుతోందీ లోకం? - మల్లాప్రగడ రామారావు

    
"మంచి" అన్నది లోకంలో లేదని నా నిఖార్సైన అభిప్రాయం. "ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక ఏమిటా?" అని 
నేనెప్పుడూ ఆలోచించలేదు.  ఐతే, అనాలోచితంగానే నాకు, నేను అర్థమవడం జరిగింది.  అదెలా జరిగిందంటే... అది చెప్పేందుకే ఈ కథ.

    ఎండవేళ ఓ మధ్యాహ్నం   ఉస్సురనుకుంటూ ఆ ఊర్లో బస్ దిగాను. అక్కడికి మా వూరు సుమారు ఆరు ఫర్లాంగుల దూరం.

    పేరుకి మా ఊరే గాని నేనక్కడ పుట్టాలేదు. పెరగాలేదు. అంతెందుకు? నాకు పద్ధెనిమిదేళ్ళు నిండేవరకూ, నేనా ఊరే పోలేదు.

    మరి మా వూరెందుకయ్యిందీ అంటే, మాకక్కడ పొలాలున్నాయి. చెరువుగట్టునుంచీ, బోడిమెట్ట వరకూ,భూములన్నీ మావేనుట. ఇప్పుడు కాదనుకోండి. మా పూర్వీకుల హయాంలో.

    మా తాత గారి కాలం నాటికే మేం పట్నం తరలి వచ్చేసాము.  ఏటా ఓ రెండు నెలలు ఆ వూర్లో మకాం వెయ్యడం, కుప్పలు నూర్పించి,'మగతా' కొలిపించుకోవడం. ఆ ఊరికీ,మాకూ ఉన్న సంబంధమల్లా అదొక్కటే!

    కారణాలేవైతేనేం, మా నాన్నగారి తరానికొచ్చేసరికి వో పన్నెండెకరాల పొలం మాత్రం మిగిలింది. మళ్ళీ అందులో కొంత "బోగబందా" లో వుంది.

    నెల్లాళ్ళయింది -నాన్నగారు మా ఊరు వెళ్లి.  ఇంకా కుప్పలు నూర్చలేదుట. పట్నంలో నాకేమో డబ్బు ఇబ్బంది లావయింది. 

    దగ్గరుండి కుప్ప నూర్పించి, ధాన్యం అమ్మించి, కొంతయినా సొమ్ము తీసికెల్దామని ప్రయాణం పెట్టుకున్నాను.

    'ఎయిర్ బాగ్' ఊపుకుంటూ గోర్జి దారి పట్టాను. ఎఱ్ఱని ఎండకు ఇసుక మండుతూ వుండాలి. కాని, దారిన పొయ్యే వాళ్ళలో, ఒకరిద్దరికి తప్పించి, ఎవ్వరికీ చెప్పుల్లేవు. పాతదో, చింకిదో, గుడ్డముక్క కట్టుకుని,  భుజానో గుడ్డ వేసుకుని నడుస్తున్నారు చాలామంది. 

    గోర్జికిరువైపులా చేను కొయ్యగా, మొదళ్ళు మాత్రమే మిగిలివున్న పొలాలు. పొలం గట్లంట మేస్తున్న పశువుల్ని కాపలా కాస్తున్న 'సొమ్ముల గుంటలు' అక్కడక్కడా "పోలో"మని కేకులు వేస్తూ, పోతుల్నిఅదమాయిస్తూ.  కళ్ళాల్లో చేను మట్టిస్తున్న పాలేళ్ళు. 

    అన్నీ చూసుకుంటూ చెరువు గట్టెక్కాను. అక్కడనుంచీ మా ఊరు కొంచెం కనబడుతుంది- నాయుడుగారి మామిడితోట వెనకాల్నుంచి.

    చెరువు నిండా నీటిని కప్పేస్తూ తామరాకులు. నీటిలో ఈదుతూ వెళ్తున్నారు కొందరు - తామర తూళ్ళ కోసం.
అక్కడే చాకిరేవు.

    వీపు బాట వేపు వుంచి, వయసు నిండా రాని చాకలి పిల్ల ఎవరిదో ఉతికిన 'బ్రాసరీ' తొడుక్కుంటోంది.  గూనల్లోంచి వస్తున్న పొగ అమెచుట్టూ అల్లుకుంటోంది. 

    గట్టు దిగువన ఉలి మీద సుత్తి వుంచి, 'పిక్క' కోసం మందుపెట్టి పేల్చిన మెట్ట రాళ్ళను కొడుతున్న వంగిన శరీరాల మీది చెమట బిందువులు ఎండలో తళతళలాడుతున్నాయి.

    పొలంగట్టు పట్టాను. తిన్నగా వెళ్తే మఱ్ఱిచెట్టు వస్తుంది. దాన్నానుకునే నాయుడుగారి కళ్ళం. ఆ ప్రక్కనుంచే ఊర్లోకి దారి.

    నోట్లో చుట్ట పెట్టుకుని చెట్టు క్రింద కూర్చున్న దండాసి అంకమ్మ చుట్ట తీసి పలకరించింది. క్షణం చెట్టుక్రింద నిలబడి పరిశీలనగా వూరినోసారి చూసాను. అన్నాళ్ళ క్రిందట ఎలా వుందో, ఇప్పుడూ అలాగే వుంది.

    ఊరి మొదట మాలపేట. ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని, నేలని కరుచుకునివున్న గుడిసెలు. కొంచెం ఎడగా, ఆ వాసనే, త్రోవకు రెండు వైపులా పూరిల్లు. సంసారుల ఇళ్ళు. 

    మాలవాళ్ళ గడపలో పాతిక. రైతువారీ ఇళ్లో యాభై. కోమటి దుకాణం. ఊరి మంగలిదొకటి, కంసాలులవో నాలుగైదు పూరిళ్ళు కలసి మా వూరయ్యాయి.

    మరచిపోయాను.  వూరి మధ్యగా, దిబ్బ మీద, కూలిపోతున్న ఏకోపాధ్యాయ ప్రాధమిక పాఠశాల వుంది.    

    ఊరంతటికీ మునుపొక్కటే పెంకుటిల్లుండేది. నాయుడుగారిది. మేం ఎప్పుడిక్కడికి వచ్చినా, వారి ఇంట్లోని గదే ఒకటి కేటాయిస్తారు. ఇప్పుడా  పెంకుటిల్లు డాబా అయింది. వరసగా వున్న పూరిళ్ళ మధ్య మరో పెంకుటిల్లు లేచింది. నేను గుర్తించిన మార్పులివే. 

    పశువుల శాల ప్రక్కనుంచి నాయుడుగారింటి వేపు నడిచాను. నా పంట్లాం, బుష్‌షర్ట్ వేపు, చేతిలోని బ్యాగ్ వేపు పరిశీలనగా చూస్తూ "బాగున్నావా?", "ఇదేనేటి రావడం?","ఎండ పడొచ్చినావు. బేగి ఇంట్లోకెల్లు" అంటూ పలకరిస్తున్నవారికి సమాధానంగా చిరునవ్వు నవ్వుతూ మెట్లెక్కి తలుపు తట్టేను. 

    అమ్మ తలుపు తీసింది. కుశల ప్రశ్నలు కాగానే వచ్చిన పని చెప్పి, మాటల్లో పడ్డాం.
 
    సాయంకాలమవుతుంటే అలా ఏటివేపు బయల్దేరేను. ఎప్పుడోకాని ఈ వూరు రాను. ఎప్పుడొచ్చినా వెంటనే వెళ్లి పోవాలని వుంటుంది.

    ఆ మనుషులు, వారి దరిద్రం, అపరిశుభ్రత అన్నీ చికాకు కలిగిస్తాయి. 

    ఊరిమధ్య పునాదుల వరకూ లేచి ఆగిపోయిన రామాలయం, రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించి చేతులు కడుక్కున్న దేశాన్ని జ్ఞప్తికి తెస్తుంటుంది. తప్పదు. ఈ వ్యవస్థ బద్దలు కావలసిందే అనుకుంటూ నడిచాను. 

    లేకుంటే, గోచిపాత కట్టుకుని, నెత్తిన జంగిడి పెట్టుకుని వచ్చిన కోమటి వైకుంఠం, అప్పుడే ఐదెకరాల పొలం సంపాదించడమేమిటి? రెక్కలు ముక్కలు చేసుకుని, తాత ముత్తాతల నుండి భూమిని సాగుచేస్తున్న 'హరిజనులు' తమకు కేటాయింపైన బంజర్లను కూడా లోపాయకారీగా అమ్ముకోవడం ఏమిటి?

    కాడి ఏనాడూ పట్టుకోని నాయుడుగారి కళ్ళం ఒత్తుగా వేసిన కుప్పలతో పునిస్త్రీ ముఖంలా కళకళలాడుతువుండగా, ఒళ్ళు విరుచుకుని పనిచేసే వారి కంబార్లు కూటికి సరిపడా ధాన్యమైనా ఎరగకపోవడమేమిటి?

    ఏటిలో నీరు పాదాలు మునిగే మాత్రమే వుంది. ఏటి ఒడ్డున పనస తోట - అప్పుడెప్పుడో మాదేనుట -  కాపుకి వస్తోంది. ఆకాశం ఎరుపు కోల్పోయి, చీకటి చాపక్రింద నీరులా వస్తోంటే, ఇంటిదారి పట్టేను. 

    తెల్లవారితే కుప్ప నూర్పించి సాయంకాలానికి డబ్బు జతపరుస్తానన్నారు నాన్నగారు. ఆగాకరకాయ కూర, కొత్తిమీర చారు, చిక్కని మజ్జిగలతో అమ్మ పెట్టిన వేడివేడి అన్నం కడుపునిండా తిని, నిశ్చింతగా పడుకున్నాను.

    తొందర తొందరగా మనుష్యులు పరిగెడుతున్న ధ్వని, గాభరాగా వేస్తున్న కేకలు 'ఎం జరిగిందా?' అన్న భయంతో మెలకువ వచ్చేసింది.

    "నాయుడుగారి కళ్ళంలో కుప్పలంటుకున్నాయట్రా నాయనా!" అంది అమ్మ - భయం, ఆదుర్దా నిండిన గొంతుతో. వీధి అరుగుమీద ఖాళీగా వున్న మంచం చూసి నాన్నగారప్పుడే అక్కడికి వెళ్ళేరనుకున్నాను.  చీకటిలో తడువుకుంటూ మెట్లు దిగేను. 

    ఎంత రాత్రయ్యిందో తెలియదు. ఆకాశంలో ఒకటీ అరా నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఏ మబ్బు మాటున దాక్కున్నాడో చంద్రుడు. అయిపులేడు. శీతవాయువు మాత్రం వీస్తోంది. ఊరికి దాపునే నాయుడుగారి కళ్ళం. నిదానంగా అడుగులేస్తూ నడిచాను. కళ్ళం చుట్టూ చెట్లు.  కాల్తున్న కుప్పలనుంచి  ఎఱ్ఱని  మంటలు లేస్తున్నాయి. తెల్లని పొగ దట్టంగా అంతటా ఆవరించివుంది.  

    అంతా హడావుడి పడ్తున్నారు.  టార్చి లైట్ నాలుగు మూలకీ వేస్తూ నాయుడు చెప్తున్నాడు. "ఇక్కడే మంచం వాల్చుకు పడుకున్నాను. ఎందుకో మెలకువ వచ్చి చూస్తే, కుప్పల దగ్గిర అలికిడయింది. 'ఎవర్రా అది?' అని కేకవేస్తే జవాబు లేదు. టార్చి తీద్దామని వంగేను. మనిషి పరిగెత్తిన శబ్దం. అటుకేసి పరిగెత్తబోయేసరికి, కుప్ప కాలిన వాసన వేసింది. వెంటనే అప్పిగాడిని, భీముణ్ణి, అందరినీ లేపాను”. అంతలోనే కాల్తున్న కుప్పవంక నిస్సహాయంగా చూస్తూ  కేకలేస్తున్నాడు నాయుడు "ఆ నంజికొడుకులు మాలోల్లని లేపండ్రా.  తొంగున్నారిల్లల్లో. పరిగెత్తికెళ్ళి బట్టీ లోంచి నీళ్ళు తెండి" అని.

    నిప్పు. నిప్పు నార్పాలంటే నీరు కావాలి. ఊరికి దూరంగా వుంది నుయ్యి. అంతకంటే దగ్గరగా ఏటి నుండి తీసిన పంట కాల్వ పారుతోంది.  కడవలు పట్టుకు పరిగెత్తారటువేపు కొందరు. 

    కొందరు మండుతున్న కట్టల్ని లాగి దూరంగా విసిరేస్తున్నారు. చేతులతో వాటి మీద దబదబా బాది మంట ఆర్పాలని చూస్తున్నారు. 

    అంతటా కలయతిరిగి, అందరినీ గదమాయించడమే గాని, తానుగా మంటలనార్పడానికి ఏ ప్రయత్నమూ చెయ్యని నాయుడు వేపు చూస్తూ ఎడంగా నిల్చున్నాను - అతనికి లేని బాధ నాకెందుకు. 

    వెంకన్న, వాడి కుటుంబం, మరికొద్దిమంది మినహా, హరిజనులెవరూ మంటలార్పడానికి రాకపోవడం తలచుకుంటే మహాముచ్చటేసింది నాకు. అరవనీ నాయుడు. మిగతా నాయుళ్ళంతా మంటలనార్పాలని అటూ, ఇటూ, పరిగెత్తనీ. హరిజనులెందుకు రావాలి? ఏడాది పొడుగునా ఒళ్ళు మన్ను చేసుకుని కుప్పలు పేర్చి, గాదెలు నింపింది చాలక, ఉత్త పుణ్యానికి ఒళ్ళు కాల్చుకోవాలా? వాళ్ళంతా మౌనంగా వినిపించిన విప్లవ శంఖంలా తోచింది నాకది.

    అప్పుడు చూసాను. మంటల వెలుగులో ఆయన ముఖం ఉద్రేకంతో మెరుస్తోంది. కట్టుకొన్న తెల్ల మల్లుపంచ ఎగ్గట్టి, పొడుగు చేతుల తెల్ల చొక్కా విసురుగా విప్పేసి, యజ్ఞోపవీతం వెన్ను మీద తెల్లని చారలా వుండగా, కుప్పలెక్కుతున్నమాస్టారిని. 

    తరవాత ఓ పదిహేన్నిమిషాలు అంతటా ఆయన్నే చూసాను. బట్టీకి పరిగెత్తి నీళ్ళు తీసుకువస్తూ, కుప్పల మీదకి నీళ్ళందిస్తూ, మంటల్ని కుప్పలెక్కి ఆర్పాలని యత్నిస్తూ, కూడా ఉన్నవారిని హెచ్చరించి ప్రోత్సహిస్తూ, నలు దిశలా ఆయనే! ఆయన ప్రతి చర్యా వికృతంగా వుంది. బలహీనమైన శరీరం, అలవాటులేని, చేతకాని పనులు చేస్తూ  వుండడం  వలన వచ్చిన వికృతత్వమది. అసహ్యం వేసింది. 'ఈ బ్రాహ్మడు-సింగిల్ స్కూల్ టీచర్- నాయుడు గారి ప్రాపు కోసం ఎంత అవస్థ పడుతున్నాడూ' అని.  వెంటనే తిరిగి ఇంటికొచ్చేసాను. మనసు చిరాకుగా వుంది. అధికారం, ఐశ్వర్యం పాదాలు నాకే జాతి మనదనిపించింది.

    ఉదయాన్నే తెలివొచ్చింది. ఇంకా ఇంట్లో ఎవరూ లేచినట్లు లేదు. చెంబు పట్టుకుని ఏటి వేపు వెళ్తుంటే త్రోవలో ఎదురయ్యారు మాష్టారు. ముఖాన పిండికట్లు. తడిపంచ భుజం మీద. చేతిలో వున్న రాగి చెంబులో నీళ్ళు. ఏటి నుంచి స్నానం చేసి వస్తున్నట్టున్నారు. 

    తప్పుకు పోదామన్నా కుదిరింది కాదు. కాళ్ళు ఎత్తెత్తి వేస్తూ, 'ఉస్ ఉస్' అనుకుంటూ నడుస్తున్నారు. చేతిలో బొబ్బలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ముఖాన కొత్తగా కాలిన గుర్తొకటి. ఎడం కాలు వేళ్ళు రెండింటికి గుడ్డముక్క చుట్టివుంది. దానిమీద రక్తం మరకలు. 'తగిన పనైంద'నుకున్నాను.

    "నాన్న గారు చెప్పారు నువ్వొచ్చావని. చూసావా ఆఖరికెలాగాయిందో! ఇవాళ తొలి ఝామున ఆరంభించు దామనుకున్నాడు వెంకన్న నూర్పు. సాయంకాలానికి గాలిపట్టి, బస్తాలకెక్కించి, వైకుంఠం దుకాణానికి వప్పచెప్పి, డబ్బు నీకిద్దామనుకున్నారు నాన్నగారు. ఏ క్షణానికేమవుతుందో చెప్పలేం!".

    మాల వెంకడే మా పొలాన్ని మగతాకి సాగుచేస్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. మా వూర్లో మాకు పొలమే కాని కళ్ళం లేదు. ఎప్పుడొచ్చినా నాయుడుగారింట్లో దిగినట్టే, ప్రతి ఏటా పంట వారి కళ్ళం లోనే నూరుస్తాడు వెంకన్న.

    నా గుండె బేజారాయింది. స్ట్రెచ్ లాన్ పేంటింగ్స్ రెండు తీసుకున్నాను.  వాటికి సరిపడే ఇంపోర్టెడ్ షర్టింగ్స్ సంపాదించి వుంచుకున్నాను.

    అన్నిటికంటే ముఖ్యం. ఏడాది పొడుగునా జీతం సరిపోక చేసిన అప్పులు తీర్చాలి. నా ముఖంలో మారిన రంగుల్ని చూసినట్టున్నారు మాష్టారు.

    "నీకేం పరవాలేదులే! మిగతా కుప్పలు నూర్పించి వెంకడిచేత మగతా కొలిపిస్తారు నాయుడు గారు. ఒకటో, రెండో పుట్లు తక్కువవుతాయంతే."

    నాకు ధైర్యం వచ్చింది ఆ మాటలతో. పంట పోయినా, కుప్ప కాలినా, వెంకన్న మా మగతా కొలవాల్సిందే. ఎమన్నా పేచీ పెట్టినా నాయుడుగారున్నారు.

    "వేసంగి వచ్చేస్తోంది. కుప్పలట్టే పెట్టకురా అంటే విన్నాడుకాదు ఆ వెంకన్న. ఏడాది పొడుగునా పెళ్ళాం పిల్లలతో ఏం తిప్పలు పడతాడో..." అంటూ వెళ్ళిపోయారు మాష్టారు. అంత వరకూ నాకీ ఊహే రాలేదు. 

    'ఈ భూమి పగిలి తనలో ఇముడ్చుకుంటే బాగుణ్ణు' అని మగవాళ్ళకి అనిపించే క్షణం ఒకటి వుంటే, నా 
జీవితంలో ఆ క్షణం అలాంటిది.

    అప్పుడు ఆకస్మాత్తుగా నాకు నేను బోధపడ్డాను. 

    నిన్న రాత్రి మంటలార్పడానికి రాని వెంకడి కులస్థులూ బోధపడ్డారు. ఎటొచ్చీ బోధపదనిది మాష్టారే.  ఏదో ఒక 'మోటివ్'లేని మంచితనం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.

    లోకంలో మంచి అన్నది లేదని నా నిఖార్సయిన అభిప్రాయం. ఎందుకంటే నాలో ఆ మంచితనం లేదు  కాబట్టి, మంచితనం మీద నాకే నమ్మకం లేకపోబట్టీ - అని ఆ రోజు ఉదయం అలాగ తెలిసింది నాకు.

(ఆంధ్ర సచిత్ర వారపత్రిక, 24 - 2 - 1978 సంచికలో ప్రచురితం)   
Comments