మాట - వి.రామలక్ష్మి

    చావు! చావంటే ఇలా ఉంటుందా?

    స్పృహపోవడం అంటే చావుతో సమానమే కదా! తెలివి తప్పిన తరవాత తన చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరేం అంటున్నారో, ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు నవ్వుతున్నారో ఏవీ... ఏవీ... తెలియవు కదా! అసలు తనకి తను గుర్తుంటుందా? ఏదీ గుర్తుండదు.

    నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు ఆలోచిస్తూ ఉంటంది. ఏవేవో కలలు వస్తుంటాయి. మధ్యలో శరీరావసరాలకు లేచి వెళ్లివస్తుంటాం. మెలకువ వచ్చేస్తే తిరిగి నిద్రపట్టదు. నిద్రపోయినా కూడా తనెవరో, ఏం జరుగుతుందో తెలుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చలి, ఎండ, వాన... అన్నీ మధ్యమధ్యలో అయినా తెలుస్తూ ఉంటాయి. 

    అదే... తెలివితప్పితే మాత్రం ఏవీ తెలియవు. అంటే చావుతో సమానమే కదా! ఎటొచ్చీ చవంటే ఇక తిరిగ బతకడం ఉండదు. అదే స్పృహ తప్పితే తిరిగి స్పృహ వస్తుంది. కాస్సేపటికో, కూస్సేపటికో, కొన్ని రోజులకో, కొన్ని సంవత్సరాలకో! అప్పుడు స్పృహ తప్పిన దగ్గర్నించీ తిరిగి స్పృహ వచ్చేదాకా గడిచిన మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. ఒక్కోసారి అరుదుగా... తిరిగి స్పృహ రాకుండానే ఆ వ్యక్తి మరణించవచ్చు. అప్పుడు స్పృహ తప్పిన దగ్గర్నించీ ఏం జరిగిందో ఆ వ్యక్తికి ఇంక ఎప్పటికీ తెలియదు.

    ఇవాళ పన్నెండు గంటలదాకా నాకు అన్నీ తెలుసు. తరువాత నాకు మెల్లగా స్పృహ తప్పింది. ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలయిందిట. ఇప్పుడే నాకు స్పృహ వచ్చింది. ఆ మూడు గంటలు ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆ టైములో నేను పూర్తిగా చచ్చిపోయినట్టేగా! మరి చచ్చిపోయిన వాళ్లకి మరణం తరువాత ఏం జరిగిందో తెలియదన్న మాటేగా!

    అదృష్టం... ఇవాళ శనివారం హాఫ్‌డే కావడంతో మామూలుగా సరళ మధ్యాహ్నం ఇంటికి వచ్చిందట. కాలింగ్ బెల్ నొక్కినా, చేతులతో తలుపులు బాదినా ఎంతకీ తలుపులు తీయకపోయేసరికి తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తలుపులు తీసుకుని లోపలికి వచ్చిందట. నన్ను చూసి గాభరాపడి "అమ్మా! అమ్మా!" అంటూ కుదిపిందట. అయినా మాట్లాడక పోయేసరికి, ఏడుస్తూ వెళ్లి పక్కింటి జలజని పిలిచిందట. ఆవిడ 108కి ఫోన్ చేసి, ఇద్దరూ కలిసి నన్ను తీసుకువచ్చి, ఈ హాస్పిటల్‌లో చేర్పించారట. సరళ ఒకటే ఏడుపుట. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదట. ఈ వివరాలన్నీ జలజ చెప్పారు. సరళ ఏమీ చెప్పలేదు. ఇప్పటిదాకా నాకు స్పృహ వస్తుందో రాదో నన్న టెన్షన్‌తో నిమిషం ఒక యుగంలో గడిపింది. ఇప్పుడు నాకు స్పృహ వచ్చాక ఆనందంతో నోట మాట రావడం లేదు. దానికి కళ్లమ్మట నీళ్లు కారిపోతుంటే మాటి మాటికీ చున్నీతో వత్తుకుంటూ, నా చేతి మీద చెయ్యి వేసి రాస్తోంది. తేట పడిన ముఖంతో, మనసుతో... నాకు కూతురిగా... కాదు కాదు... కన్నతల్లిలా నా తల నిమురుతూ నాకు సాంత్వననిస్తోంది.

    ఇంతలో సడన్‌గా గుర్తొచ్చింది. "టైమెంతయింది?" అని అడిగాను.

    "నాలుగు కావస్తోంది" అంది సరళ.

    "అయ్యో! నాలుగయిపోతోంది. నువ్వు అన్నం తిన్నావా?" అడిగాను ఆందోళనగా.

    "లేదండీ! నేనెంత బతిమిలాడినా అన్నం మాట అటుంచి, మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు మీ కూతురు" అన్నారు జలజ.

    "నువ్వు అన్నం తిని రామ్మా!" అన్నాను సరళ చేతిమీద చెయ్యివేసి.

    "నేనుంటాను అమ్మగారి దగ్గర. ఆరార కొబ్బరినీళ్లిస్తాను, నువ్విచ్చినట్టే. గమ్మున వెళ్లి అన్నం తిని రామ్మా సరళా!"

    ఆవిడ నేను మాటిమాటికీ చెప్పడంతో ఇంక తప్పదనుకుంది సరళ. బయలుదేరుతూ, జలజగారికి జాగ్రత్తలన్నీ చెప్పి చివరగా "జాగ్రత్త ఆంటీ! ఏ మాత్రం తేడాగా ఉన్నా నాకు వెంటనే ఫోన్‌చేయండి. ఇది అమ్మ సెల్. మీ దగ్గరుంచండి. నా సెల్ నెంబరు ఇస్తాను" అని హ్యాండ్‌బ్యాగ్‌లో వెతికి ఓ కాగితంమీద తన సెల్ నెంబరు వేసి ఇస్తూ "ఈ నెంబరుకు ఫోను చేయండి" అని చెప్పి వెళ్లలేక వెళ్లింది సరళ.

* * *   

    హాస్పిటల్ నించి ఇంటికి వచ్చిన దగ్గర్నించీ నా మనసు మనసులో ఉండటం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? తిరిగి అదే సమస్య నా బుర్రని తినేస్తోంది. డిశ్చార్జి చేసేముందు డాక్టరు మరీ మరీ చెప్పారు"మీరు ఎక్కువ ఆలోచించకండి. వర్రీ కాకండి. అందువల్లే మీకు హైబీపీ వచ్చి స్పృహపోయింది. ఇప్పుడంటే మిమ్మల్ని సేవ్ చెయ్యగలిగాం. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఏం జరిగేదీ చెప్పలేం!" అని. 

    నేనేం చెయ్యను? వర్రీ కాకుండా ఎలా ఉండను? నన్ను కాపాడుకోవడం కోసం సరళ చెయ్యని ప్రయత్నం లేదు. స్కూల్లో ఉన్నంతసేపూ అరగంటకోసారి ఫోను చేస్తోంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏవేవో కబుర్లు చెబుతుంది.  ఇంటికి వచ్చిన దగ్గర్నించీ నాకు మందులివ్వడం వరకు అన్నీ తనే చేస్తూ నాకు పూర్తి విశ్రాంతి ఇస్తోంది.తను చాలా సంతోషంగా ఉన్నట్టు నా ముందు నటిస్తోంది. నేనా విషయం ఎత్తబోతే, "అమ్మా! నువ్వు చెప్పినట్టే వింటాను. అస్సలు ఆ విషయాలు ఆలోచించకు. నీకు పూర్తిగా బలం రానీ. అప్పుడు నీ ఇష్టప్రకారం బావనే చేసుకుంటాను. సరేనా!" అని స్పష్టంగా చెబుతోంది. నేను దాని ముఖంలోకి పరీక్షగా చూసాను 'నిజంగానే అంటోందా? లేకపోతే నా కోసం త్యాగం చేస్తోందా?' అని.

    కాకపోతే, నాకు ఈ అనారోగ్యం రాకముందు 'అమ్మా! నువ్వు నాన్నగారికి మాటిస్తే ఇచ్చావు కానీ, నేను ఛస్తే బావని చేసుకోను. నా కొలీగ్ ప్రభాస్‌నే చేసుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే నేనసలు పెళ్ళే చేసుకోను' అని ఖచ్చితంగా చెప్పిన పిల్ల ఇప్పుడు సడన్‌గా ఎలా మారిపోయింది?

    నీరసంగా ఉన్నమీదట, కాస్త అన్నం తిని మాత్ర వేసుకునేసరికి నిద్రమత్తుగా ఉంది. నిద్రపోయాను.

* * * 

    ఊరినించి మీనాక్షి, శేఖర్ వచ్చారు.

    "అంత జబ్బు చేస్తే నాకు చెప్పలేదే వదినా? అంత పరాయిదాన్ని అయిపోయానా? అన్నయ్య పోయాడని నన్ను దూరం చేస్తావా?" అంటూ నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు మీనాక్షి.

    వాళ్ళ అన్నయ్యలాగే తను మంచి మనిషి. సున్నిత హృదయం. మంచి స్వభావంతో అందరి మనసుల్నీ ఆకట్టుకుంటుంది. లేకపోతే... అంత పెద్ద వ్యాపారం, అంత డబ్బుతో మసలిన మనిషి... వ్యాపారంలో భాగస్తులు మోసంచేస్తే, ఆస్తి అంతా హరించుకుపోతే, భర్తని ఏమాత్రం దూషించలేదు. అతన్ని అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఏదోలా బతకచ్చని ధైర్యం చెప్పింది. అతనేదో కంపెనీలో గుమాస్తాగా చేరితే, తను కాన్వెంటులో టీచర్‌గా చేరి సంసారాన్ని ఈడ్చుకొచ్చింది. ఒక్కగానొక్క కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు తనకి తగిన ఉద్యోగంలో ఉన్నాడు. అంత మంచి మనిషి కనకే వాళ్ళ అన్నయ్య తన గురించి అంతలా పాకులాడేరు. చనిపోయేటప్పుడు చివరి నిమిషంలో... 'మీనాక్షి కొడుక్కి సరళనిచ్చి పెళ్ళి చేసిన్శాశ్వతంగా తన చెల్లెలితో సంబంధం కలుపుకోమని నాతో మాట తీసుకున్నారు. చేతిలో చెయ్యి వేయించుకున్నారు. నాకు కూడా మీనాక్షితో సంబంధం ఇష్టమే. అయితే ఇలా జరుగుతుందని తను అనుకుందా?

    "వదినా! ఏంటి ఆలోచిస్తున్నవ్? మాట్లాడావేం?"

    మీనాక్షి మాటలతో ఈ లోకంలోకి వచ్చేను. "లేదమ్మా! నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను? నువ్వు నాకు తోబుట్టువుకన్నా ఎక్కువమ్మా!" అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాను.  

* * *

    సడన్‌గా మెలుకువ వచ్చింది. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. ఏడుపుతో పాటు విపరీతమైన దుఃఖంతో ఉన్న మాటలు. కలా,నిజమా అనుకునేంతలో ఆ గొంతు సరళదిగా గుర్తుపట్టి దిగ్గున లేచి కూర్చున్నాను. చప్పుడు చేయకుండా మంచం దిగి, జారేసిన తలుపు దగ్గరగా నడిచాను. కొద్దిగా తలుపు తీసి బయటికి చూశాను. 

    హాల్లో... ఆ చీకటిలోనే... సోఫాలో కూర్చుని సరళ ఫోనులో ఎవరితోటో మాట్లాడుతోంది.

    నేను చెవులు రిక్కించి వినడానికి ప్రయత్నం చేస్తున్నాను.

    "ప్రభాస్! నన్నర్థం చేసుకో ప్లీజ్! చనిపోయేవాళ్ళకి మాట ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టడానికి ప్రాణాలైనా పోగొట్టుకుంటారుకానీ ఇచ్చిన మాట తప్పరు. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించి చూడు. ఆ విషయం నిజమని నువ్వే ఒప్పుకుంటావు. నేను అమ్మని ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేసి ఫెయిలయ్యాను. బావతో నా పెళ్ళి జరక్కపోతే, నేను అమ్మాని చంపిన దాన్నవుతాను. నాన్న ఎలాగూ లేరు. ఉన్న అమ్మని కూడా పోగొట్టుకోమంటావా? అదే నాన్నగారు బతికుండి బలవంతంచేస్తే, ఖచ్చితంగా అమ్మానాన్నలను ఎదిరించి నిన్ను పెళ్ళాడి ఉండేదాన్ని. ఇప్పుడు అయామ్ హెల్ప్ లెస్. ప్లీజ్! ట్రైటు అండర్‌స్టాండ్ మై సిట్యుయేషన్. ప్లీజ్ ప్రభాస్! నువ్వర్థం చేసుకోకపోతే నేను చచ్చిపోతాను" చివరి మాటలు అనేసి ఫోను కట్‌చేసి సోఫాలో విసిరేసి, చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.

    ఇంతలో సెల్ మోగింది. గబుక్కున లేచి సెల్‌తీసి "హలో" అంది. అవతల ప్రభాస్ కాబోలు మాట్లాడుతున్నట్లున్నాడు. "సారీ ప్రభా! నిన్ను బాధ పెట్టేను" అంటోంది. అతను ఏం అంటున్నాడో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. "సరే ప్రభా! థాంక్యూ వెరీమచ్. నా బాధని ఎంత బాగా అర్థం చేసుకున్నావు! అందుకే నువ్వంటే నాకంత ఇష్టం. నిన్ను పొందలేకపోతున్నాను. నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకత్తి ఉండదు" ఆ మాటలు అంటున్నప్పుడు దాని గొంతు రుద్ధమయింది. ఒక్క నిముషం సంభాళించుకుని "సరే ప్రభా! ఉంటాను. ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటే అమ్మకి మెలకువ వచ్చేస్తుందేమో. రేపు మాట్లాడుకుందాం! బై!" అంటూ ఫోన్ ఆఫ్ చేసి దాన్ని అలాగే చేతిలో ఉంచుకుని చీకట్లోకి చూస్తూ కూర్చుంది.

    అల్లారుముద్దుగా, నడిస్తే కందిపోతుందేమోనన్నంత అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డ.చిన్నప్పటినించి అది ఏం అడిగితే అది నిమిషాల మీద కొనిచ్చాం.

    ఇప్పుడు అది నన్ను బతికించడం కోసం తన మనసుని చంపుకొని, తనైకి ఇష్టం అయినవాడిని వదులుకుని, ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అవుతోంది. తనకి తనే మరణశిక్ష వేసుకుంటోంది. శారీరకంగా మరణించకపోవచ్చు కానీ మానసికంగా చచ్చిపోయి, జీవచ్ఛవంలా జీవితాంతం ఉండాలనుకుంటోంది.

    ఎందుకు ఇలా?

    దాన్ని అక్కున చేర్చుకుని ఓదార్చాలని ఉంది. కానీ ఏమని ఓదార్చను?

    ఇంతట్లో అది లేచి నిలబడింది. నేను ఏమీ ఎరగనట్టు గబగబా చప్పుడు చేయకుండా వచ్చి నా పక్కమీద పడుకుని దుప్పటి కప్పుకొని నిద్ర నటించాను.

    సరళ లోపలికి నిశ్శబ్దంగా వచ్చి నా మంచం పక్క వేసుకున్న దివానుమీద పడుకుని దుప్పటి కప్పుకొంది.

    ఇంక నాకు నిద్రెలా పడుతుంది?

    'నా ప్రాణంలో ప్రాణం... నా కూతురు సరళకి నేను ఎంత దుఃఖాన్ని కలిగిస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? దాని ఇష్టాన్ని కాదని, బలవంతంగా దాని నెత్తిమీద ఇష్టంలేని పెళ్ళిని ఎందుకు రుద్దుతున్నాను? పోయేటప్పుడు ఆయనకి మాట ఇచ్చాననేగా? ఆ మాటను ఏది ఏమైనా అమలు జరపాలనేగా! అసలు ఎందుకు అమలు జరపాలి? పోయేవాళ్ళకి ఆ పరిస్థితుల్లో తప్పనిసరై మాట ఇచ్చి ఉండవచ్చు. లేకపోతే మనష్ఫూర్తిగానే ఇవ్వచ్చు. అయితే మాత్రం... తీర్చాలనేముంది? చనిపోయిన వాళ్ళకి, తరువాత ఏం జరిగినా తెలియదు కదా! చనిపోయేటప్పుడు... వాళ్ళ కోరిక తీరుస్తామంటే తృప్తిగా ప్రాణాలు విడుస్తాను. అందుకోసం... బతికున్నవాళ్ళు... తరవాత మా మాట నెరవేర్చలేని పరిస్థితులు ఎదురైతే... ఆ మాట తప్పకూడదా?

    ఏదిఏమైనా ఆ మాట నెరవేర్చి బతికున్నవాళ్ళ జీవితాలు పాడుచేయాలా? అలాకాకుండా, అప్పుడు మాట ఇచ్చినా తరవాత నెరవేర్చకపోతే ఏమవుతుంది? పోయేటప్పుడు మాట ఇచ్చినందుకు వాళ్ళూ తృప్తిగా చనిపోతారు. తరవాత ఆ మాట కోసం బతికున్నవాళ్ళ జీవితాలని బలి ఇవ్వకుండా... మాట తప్పితే తప్పేముంది? ఒక మనిషి జీఅవితానికి మంచి జరిగేటప్పుడు అలా ఎందుకు చేయకూడదు? ఏమిటి నేనిలా ఆలోచిస్తున్నాను? ఇలా ఎవరేనా ఆలోచిస్తారా?' అనుకుంటూ రకరకాల ఆలోచనలతో తెల్లవార్లూ జాగారం చేశాను.

    తెల్లవారేసరికి ఒక నిశ్చయానికి వచ్చాను. అప్పటికి కళ్ళమీదకి నిద్ర కమ్ముకొచ్చింది. 

    నిద్ర లేస్తూనే "సరళా!" అని పిలిచాను.

    "ఏంటమ్మా?" స్నానంచేసి వచ్చినట్టుంది, ఇస్త్రీ బట్టల్లో ప్రశాంతంగా దేవతలా కనబడింది.

    "ఇలా కూచో" కొంచెం జరిగి నా పక్కన కూచోబెట్టుకున్నాను.

    "సాయంత్రం నువ్వొచ్చేటప్పుడు ప్రభాస్‌ని కూడా తీసుకురా"

    నా మాటలు విని తెల్లబోయింది. "ఏంటమ్మా?" అంది.

    "నువ్వు సరిగ్గానే విన్నావు. నువ్వు స్కూలునించి వచ్చేటప్పుడు ప్రభాస్‌ని కూడా తీసుకురా! మీ ఇద్దరి పెళ్ళి గురించి అతనితో మాట్లాడాలి" అన్నాను.

నమ్మలేనట్టు చూసింది.

    తక్షణం నన్నల్లుకుపోతూ "నువ్వెంత గొప్పదానివమ్మా!" అంటూ ఏడ్చేసింది.

    వెంటనే "మరి నాన్నగారికిచ్చిన మాటా?" అంది భయంగా.

    "నిజమే. నాన్నగారికి మాట ఇచ్చాను. కానీ ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కదమ్మా! చనిపోయిన మీ నాన్నగారికి ఇచ్చిన మాటకన్నా నాకు నీ సుఖం, సంతోషం ముఖ్యమమ్మా!" అన్నాను.

    "అమ్మా! నువ్వింత ధైర్యంగా ఆలోచించగలవని నాకు తెలియదమ్మా! నిజంగా.. నిజంగా... నీలాంటి తల్లి కడుపున పుట్టడం నా అదృష్టం అమ్మా!" అంటూ కళ్ళమ్మట నీళ్ళు కారిపోతుంటే, సరళ వంగి నా కాళ్ళకి నమస్కరించింది. 

    మధ్యలోనే వారించి నా గుండెలకి హత్తుకుని, ప్రేమగా ఆమె శిరస్సుని ముద్దుపెట్టుకున్నాను. 

    'ఈ బిడ్డ జీవితం కోసం ఏమైనా చేస్తాను. చనిపోయిన నా భర్తకిచ్చిన మాట తప్పినందుకు, నా బంధువులందరిచేతా ఎన్ని మాటలు అనిపించుకుందుకైనా నేను సిద్ధమే. ఒకవేళ ఇది నిజంగా ఘోర పాపం అయితే, ఎంతటి పాపాన్ని అన్యినా మూట కట్టుకుందుకు సిద్ధమే. అందుకోసం ఒకవేళ నరకానికి పోవాల్సివచ్చినా, వెళ్ళడానికి సిద్ధమే.బతికుండగానేఇనా, చనిపొయాకైనా ఏది భరిచడానికైనా సిద్ధమే' అలా అనుకున్నాకే నా మనసు తేలిక పడింది.

(విపుల మాసపత్రిక అక్టోబరు 2011 సంచికలో ప్రచురితం)            
Comments