మాతృన్యాయం - గంగా శ్రీనివాస్

 
    వీల్ చైర్‍లో కూర్చుని ఉన్న దుర్గాంబను విట్‍నెస్ బాక్సులో ప్రవేశపెట్టడానికి న్యాయమూర్తి అనుజ్ఞ నిచ్చారు.  ఆ కేసులో ఆమె చివరి సాక్షి. అంతవరకు విచారించిన సాక్షులంతా ఒక ఎత్తు, ఈ సాక్షి మాత్రమే ఒక ఎత్తు.
    
    రాష్ట్రంలో కొత్తగా అమలులోనికి వచ్చిన చట్టం కింద విచారణకు స్వీకరించిన మొట్టమొదటి కేసుగా అప్పటికే ఆ కేసుపై అన్ని టివీ ఛానెళ్ళు తలో కెమేరా ’కన్ను’ వేశాయి.
    
    వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దయతో చూడని సంతానాన్ని కోర్టుకీడ్చగల శక్తి ఉన్న ఆ కొత్త చట్టం కింద రాష్ట్రంలో నమోదయిన మొట్టమొదటి కేసు అది.
    
    కోర్టుహాల్‍లో ఆమె భర్త అనంతపద్మనాభం, ఆమె ఒక్కగానొక్క కొడుకు సాయికిరణ్, కోడలు దివ్య కూర్చుని ఉన్నారు.  ఆమె ముద్దుల మనుమడు, తేజ స్కూల్‍కి వెళ్ళిపోయాడు.  ఒక పక్కగా ఇంటి పనిమనిషి కరుణ ఉంది.
    
    క్లర్క్ అందించిన కేసు పేపర్లు సులోచనాల లోనుంచి సునిశితంగా చూస్తూ కళ్ళు పై కెత్తి దుర్గాంబను చూశారు, న్యాయమూర్తి సుధాకర్‍రెడ్డి.  ’క్రిమినల్ నెగ్లిజెన్స్’ అనే భావం ఆయన మనసులో మెదిలింది, ఆ తల్లిని చూడగానే.  చెప్పలేని వేదన ఆమె మొఖంలో గూడు కట్టుకుని ఉంది.  శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్నా ఏదో లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది ఆమెను చూసినవారికి.
   
    "ప్రొసీడ్" అన్నారు న్యాయమూర్తి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావును చూస్తూ.
    
    రాఘవరావు చాలా ఎఫిషియంట్ అడ్వకేట్‍గా పేరు తెచ్చుకున్నాడు.  పదునైన వాగ్దాటితో ముద్దాయిలను ముప్పు తిప్పలు పెట్టి న్యాయం తన వైపే ఉందని న్యాయమూర్తులను ఒప్పించి, కఠినమైన శిక్షలను పడేలా చేస్తాడని, అతనంటే నేర ప్రపంచంలో టెర్రర్.
    
    అంతేకాదు, రాఘవరావు సాయికిరణ్‍కి పొరుగునే ఉన్నాడు. అందువలన ఆ వృద్ధదంపతులు తమ కొడుకు ఇంట, కోడలి చేత పడుతున్న పాట్లు ఆయనకు బాగా తెలుసు.
    
    సామాజిక స్పృహతో చైతన్యవంతమైన న్యాయవవస్థ ద్వారా కావలిసిన దానికన్నా ఎక్కువే పబ్లిసిటీ పొందుతున్నాడు, తన ప్రవృత్తి, తన వృత్తికి సహకరిస్తుండటంతో.
    
    రాఘవరావు తన పేపర్లు తీసుకుని లేచి నిల్చుని ధర్మాసనానికి అభివాదం చేసి "మిలార్డ్ ముద్దాయి సాయికిరణ్ తల్లి గారైన దుర్గాంబను ప్రశ్నించటానికి అనుమతి కోరుతున్నాను" అన్నాడు.
    
    తల పంకించి తన ఆమోదాన్ని సూచించారు న్యాయమూర్తి.
    
    వీల్ చైర్‍లోనే కూర్చుని ఉన్న దుర్గాంబను కోర్టు గుమస్తా భగవద్గీత పై ప్రమాణం చేయించాడు.
    
    ఫ్రాథమిక ప్రశ్నల తర్వాత సూటిగా విషయంలోకి వచ్చాడు రాఘవరావు.
    
    "అమ్మా! మీ భర్త తన కుమారుడైన సాయికిరణ్ మీ ఇద్దర్ని సరిగా చూడకపోవటమే కాక, శారీరిక, మానసిక ఇబ్బందులు కలుగ చేస్తున్నాడని కోర్టువారికి ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలుసా?" అడిగాడు.
    
    "తెలుసు" నూతిలోనుంచి వచ్చినట్లు ఉంది ఆమె గొంతు.
    
    సాయికిరణ్ కి వ్యతిరేకంగా కేసుని బలంగా ప్రెజెంట్ చేస్తున్నాడు రాఘవరావు.  దానిలో భాగంగా ఆ వృద్ధదంపతులు కొడుకు పైనే ఆధారపడి ఉన్నారని, వారికి వేరే ఆధారం లేదు అని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు.
    
    "మీ వారు ఏం చేస్తారు?" అడిగాడు.
    
    "ఆయన టీచర్‍గా పనిచేసి రిటైర్ అయ్యారు" చెప్పింది.
    
    "మీ ఆస్తిపాస్తులు వివరాలు చెప్పండి?"
    
    "మా ఊరిలో ఒక పెంకుటిల్లు ఉంది" చెప్పింది దుర్గాంబ.
    
    "అది పాడు పడిపోయిందని, అందులో ఎవరూ ఉండటంలేదని, దాని వలన ఏ ఆదాయము లేదని మీ వారు చెప్పారు.  మీరు ..." అర్థోక్తిలో ఆపాడు.
    
    "అవును,ఏ ఆదాయము లేదు" బదులిచ్చింది దుర్గాంబ.
    
    "మీరు ఎక్కడ ఉంటారు ?" సూటిగా అడిగాడు.
    
    "మా అబ్బాయి సాయికిరణ్ దగ్గర."
    
    "మీకు అప్పులు ఉన్నాయా?"
    
    "అవి ఆయన రిటైర్‍మెంట్ అయ్యాక వచ్చిన డబ్బుతో తీర్చేశాం"
    
    "మీకు రెండెకరాల పొలం ఉండేదట. ఇప్పుడు ఉందా?"
    
    "లేదు.  అమ్మేశారు."
    
    "ఎందుకోసం?"
    
    "ఖర్చులు ఎక్కువవటం వలన"
    
    "ఆ ఖర్చులు మీ అబ్బాయి చదువుకోసం పెట్టినవేనా?"
    
    "అ..వు..ను."
    
    ప్రశ్నలు ఏ దిక్కుకు దారి తీస్తున్నాయో తలుచుకుని ఆమె గుండె గుబగుబలాడింది. ఒకసారి కొడుకు వైపు చూసింది. తలఒంచుకుని తన చేతివేళ్ళ గోళ్ళను పరిశీలనగా చూస్తున్నాడు అతను.  భర్త వైపు చూసింది.  అనంత పద్మనాభం కళ్ళజోడులోచి చుర చుర కాల్చేసే లాంటి చూపు తనకు తగిలి చటుక్కున తల ఒంచుకుంది మళ్ళీ.
    
    "ప్లీజ్ నోట్‍దిస్ పాయింట్, యువరానర్", డ్రమటిక్‍గా అన్నాడు రాఘవరావు.  "ఉన్న ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై తమ ఒక్కగానొక్క కొడుకుకి బంగారు భవిష్యత్ ఉండాలని తపించిన తల్లిదండ్రులు వీరు.  శరీరంలో శక్తి ఉన్నంతవరకు తమ కొడుకు అభివృద్ది కోసం నిరంతరం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకున్నారు.  చివరికి రిటైర్‍మెంట్ తర్వాత వచ్చే డబ్బులతోనైనా ఒక ఆధారం ఏర్పరుచుకోకుండా తమ కొడుకి చదువు సంధ్యల కోసం చేసిన అప్పులు తీర్చడానికి వినియోగించి, తనయుడే తప్ప వేరే ఆధారం లేక మిగిలిపోయారు."
    
    "కని పెంచి తననింతవాడిని చేసిన తల్లిదండ్రుల పై దయలేని పుత్రులను పుట్టలోని చెదలతో పోల్చాడు వేమన. ఈ నాటి వరకు ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి ’పుత్రరత్నాల’ నిర్లక్ష్యానికి బలయిపోయారు, పోతున్నారు కూడ.  నేటికైనా చట్టం అటువంటి అభాగ్యులను ఆదుకోవడనికి నడుం కట్టడం న్యాయవ్యవస్థకే గర్వకారణం."
    
    "ఇప్పటివరకు జరిగిన విచారణలో ముద్దాయి సాయికిరణ్, అతని భార్య దివ్య ఈ వృద్ధ దంపతులపై చూపిన నిర్లక్ష్యం, అంతకు మించి వారు పెట్టిన క్షోభ కోర్టువారి దృష్టికి తీసుకువచ్చాను."
    
    "ఇవన్నీ పరిశిలించి, ఇటువంటి ’పుత్రరత్నాల’కు గుణపాఠం కలిగేలా ముద్దాయిని కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను", ఒకసారి కోర్టు హాలునంతా తన చూపులతో చుట్టి, సుదీర్ఘ ఉపన్యాసం ముగిస్తూ, న్యాయమూర్తికి అభివాదం చేసి కూర్చున్నాడు రాఘవరావు.
    
    డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ లేచి నిల్చున్నాడు.
    
    కేసులో న్యాయం తమవైపు లేదనే విషయం మనసులో మెదులుతూ ఉంటే, డిఫెన్డ్ చేయలేని కేసు తీసుకున్న లాయర్‍లు ఎలా ఉంటారో అలానే ఉన్నాడు ప్రవీణ్.  తన చేతిలో ఏమి లేదు.  కేసు అప్పటికే ఒక ముగింపుకి వచ్చేసింది.
    
    నిరుత్సాహంగా ముందుకు నడిచి రొటీన్‍గా తను చేయవలసిన పనులు చేయడానికి, బలిపీఠం దగ్గరకు స్వయంగా వెళ్తున్న మేకపిల్లలా, వెళ్ళాడు.
    
    న్యాయమూర్తికి అభివాదం చేసి లలితమ్మను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఉపక్రమించాడు ప్రవీణ్.
    
    "మిమ్మల్ని మీ కొడుకు కోడలు బాగా చూసుకుంటారా?"
    
    "బాగా చూసుకుంటారు."
    
    ఈ జవాబు వినగానే ప్రవీణ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు.  అతను ఊహించినదానికి భిన్నంగా సమాధానం రావటంతో కేసు గెలవవచ్చునేమొ అని ఆశ కలిగింది.  తనకు లభించిన కొద్దిపాటి అడ్వాంటేజిని పూర్తి స్తాయి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
    
    "అంటే మీరు మీ కొడుకు ఇంట్లో సంతోషంగానే ఉంటున్నారు కదా!" అన్నాడు.
    
    దుర్గాంబ నోరు తెరిచే లోపే రాఘవరావు స్ప్రింగ్‍లా లేచాడు.
    
    "అబ్జెక్షన్ యువరానర్! కుశలప్రశ్నల రూపంలో సాక్షిని తప్పు దోవ పట్టిస్తున్నారు", అన్నాడు.
    
    "అబ్జెక్షన్ ఓవర్‍రూల్డ్" కూల్‍గా చెబ్తూ," డిఫెన్స్ వారు ఏం చెప్పదల్చుకున్నారో, ఆ విషయం వినండి" అన్నారు న్యాయమూర్తి సుధాకర్‍రెడ్డి.
    
    రాఘవరావు అంత వేగంగా స్పందిస్తాడని ఊహించక ఖంగు తిన్న ప్రవీణ్ న్యాయమూర్తి ఇచ్చిన ప్రోత్సాహంతో తెప్పరిల్లాడు.
    
    "సెప్టెంబర్ 26న మీ ఇంట్లో జరిగిన సంఘటనను కొంచెం వివరించండి" అన్నాడు ప్రవీణ్.
    
    రాఘవరావు గుంభనంగా నవ్వుకున్నాడు.  తను ప్రవీణ్‍ని డిస్టర్బ్ చేయగలిగాడు.  అందుకే అతను తన ప్రశ్నకు జవాబు ఆశించకుండా మరో ప్రశ్న వేశాడు.  ఈ కేసు చాలా ముఖ్యమైనది.  అందునా మీడియా "కళ్ళు" తమ వైపే ఉంటాయి.  కావలిసిన దానికన్నా ఎక్కువ లైమ్ లైట్.  రాఘవరావు చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నాడు, కేసులో విజయం సాధించాక ప్రెస్‍మీట్ లో ఏం మాట్లాడాలో ఊహించుకుంటూ.
    
    ప్రవీణ్ అడిగిన ప్రశ్న దుర్గాంబ జ్ఞాపకాల దొంతరను కదిలించింది.
    
    కొడుకు ఇంట్లో ఉంటున్నారన్న మాటేగాని కోడలు నిరంతరం సూటిపోటి మాటలంటుంటే పడుతు జైలులో ఉన్నట్లు రోజులు దుర్భరంగా గడుస్తుండేవి.  రిటైర్ అయిపోయి విశ్రాంతిగా ఇంటి పట్టున ఉంటూ ’రామా, కృష్ణా’ అనుకుంటూ ఉండాల్సిన అనంత పద్మనాభం బయటి పనులు చేసిపెట్టే పనివాడుగా మారాల్సి వచ్చింది.
    
    భర్తకు ఆ వయసులో తోడుగా ఉంటూ, ఇంట్లో పెద్ద దిక్కుగా నిలబడి సమయానుకూలంగా తగు సలహాలిస్తూ ఇంటి విషయాలు నడపవలిసిన దుర్గాంబ వంటపని చేసే వంటగత్తె అయింది.  అంతేగాక పనిమనిషి రాని రోజులలో అన్ని పనులు తానే చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ కాలం గడపాల్సివచ్చింది.
    
    మనుమడిని ఆడించుకుంటూ వాడికి కథలు కబుర్లు చెబ్తూ మన వారసత్వ సంపదైన అపురూపమైన సంస్కృతి జ్ఞానాన్ని పంచి ఇవ్వాలనుకున్న అనంత పద్మనాభం మనుమడికి పనులు చేసి పెట్టే పనివాడయ్యాడు.  వాడికి స్నానం చేయించడం, స్కూల్ యూనిఫాం వేసి, షూస్ పాలిష్ చేసి వాడికి తొడిగి, వాడిని సైకిల్ పై స్కూల్ దగ్గర దించి, వాడికి క్యారేజి తీసుకువెళ్ళి తినిపించి మళ్ళీ సాయంత్రం వాడిని స్కూలు నుంచి తీసుకురావటం అంతా ఆయన భాధ్యతే మరి.
    
    ఏ పనైనా గతిలేక చేస్తే మనసుకి అలసటగానే ఉంటుంది కదా!
    
    సెప్టెంబర్ 26, తేజ పుట్టిన రోజు. ఆ రోజు సంఘటనలను జీవితంలో మరచిపోలేదు, దుర్గాంబ.
    
    అప్పటికి మూడురోజుల నుంచి ఆమెకు బాగుండలేదు.  పనిమనిషి కరుణ తన తల్లి ఒంట్లో బాగోలేదని ఆమెకు సేవలు చేయడానికి అదే ఊరిలో ఉన్న పుట్టింటికి వెళ్ళటంతో అన్ని పనులు దుర్గాంబపైనే పడ్డాయి.
    
    అనంత పద్మనాభంకి భార్యంటే ఎంతో ప్రేమ.  చాలాసార్లు ఆయన భార్యను తీసుకుని స్వంత ఊరికి వెళ్ళిపోదామనుకున్నాడు.  తమ మందులు కొనడానికే ఎంతో ఖర్చవుతుండటంతో చాలీచాలని పెన్షన్ తో బ్రతుకు భారమై ఇష్టం లేకపోయినా, కష్టమనిపిస్తున్నా అభిమానం చంపుకుని కొడుకు ఇంట్లో కాలం వెళ్ళదీస్తున్నాడు.  ఆరోగ్యం బాగాలేని భార్యపై ఇంటి పనంతా వేస్తున్న కోడలిని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది ఆయనకు.
    
    ఆ రోజు తేజ స్కూల్‍కి బయల్దేరేముందు దివ్య చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  వాడి కోసమని గులాబ్‍జామూన్లు, పాయసం చేయించింది. తనే కొడుక్కి కొత్త బట్తలు తొడిగి స్వీట్స్ పెట్టింది.  స్కూల్‍లో పంచడానికి చాక్లెట్లు డబ్బాలో వేసి ఇచ్చింది. ఇదంతా అయ్యేటప్పటికి స్కూల్‍కి లేటయింది.  తాతగారితో సైకిల్‍పై బయల్దేరేటప్పుడు లేటయిపోయిందని తొందర పెట్టింది.
    
    తర్వాత ఒక గంటకి దెబ్బలు తగిలిన తేజతో ఆటోలో ఇంటికి వచ్చాడు బాగా ఏడుస్తూ వచ్చాడు తేజ.  వాడి కొత్త బట్టలు మట్టికొట్టుకుని ఉన్నాయి.
    
    అనంతపద్మనాభంకి కూడా దెబ్బలు తగిలాయి, అతని కళ్ళజోడు విరిగిపోయింది.
    
    తేజ అవతారం చూసి దివ్య తోక తొక్కిన తాచులా లేచింది.  ఆటో వాడున్నా కూడా పట్టించుకోకుండా మామగారిని చెడామడా తిట్టేసింది.  ఆయన చెప్పే మాటలు వినిపించుకోలేదు.
    
    చివరకు ఆటో వాడు కలుగచేసుకుని "మేడమ్, పెద్దసారు తప్పులేదు.  నేనే ఆటో సడన్‍గా తింపిన, సైకిల్ తగిలి ఏక్సిడెంట్ అయింది.  సైకిల్ నేను రిపేరు కిచ్చిన.  వీళ్ళను తోడుకుని ఇంటి దగ్గర దింపి వెళ్దమని వచ్చిన.  పెద్ద సారుని తిట్టకమ్మ, మంచిది కాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
    
    కొడుకు దెబ్బలకు మందు రాస్తూ ధారాపాతంగా అత్త, మామలపై తిట్ల వర్షం కురిపిస్తూనె ఉంది దివ్య.  అనంత పద్మనాభం దెబ్బలకు రాయటానికి కాస్త మందు తీసుకోబోయిన దుర్గాంబను ఒక్క తోపు తోసింది.  దానితో ఆమె బాలెన్స్ తప్పి గోడపైన పడింది.  విసురుగా తగలటంతో తలచిట్లి రక్తం కారుతూ సొమ్మసిల్లిపడిపోయింది.
    
    ఆ తర్వాత దుర్గాంబ కళ్ళు తెరిచేసరికి హాస్పటల్‍లో ఉంది.  అనంత పద్మనాభం పక్కనే కూర్చుని ఉన్నాడు.  ఎంతో ఆందోళన పడుతున్న భర్తను చూసి చాలా బాధ పడింది తను.  జరిగినదేదో జరిగి పోయింది, ఇక అన్ని విషయాలు మరిచిపోయి మామూలుగా ఉండాలనే అనుకుంది తను.  కాని ఇదిగో ఇలా జరిగింది.
    
    ఇప్పుడు ప్రవీణ్ కోర్టులో అడుగుతుంటే ఒక్కసారిగా అన్నిజ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి.
    
    "ఆ రోజు మా మనుమడి పుట్టినరోజు.  స్కూల్‍కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆటోకి తగిలి సైకిల్ నుండి పడిపోయాడు.  తేజకు దెబ్బలు తగిలాయి.  ఇంటికి వచ్చాక వాడిని చూసి అంతా బాధపడ్డాం " అని మాత్రం చెప్పింది.
    
    "మీ కోడలు దివ్య మీ పై చేయి చేసుకుందని, మీ అబ్బాయి అక్కడే ఉన్నా వారించలేదని, మీ భర్త చెప్పారు. మీరేమంటారు?" అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి అంతవరకు తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం పోయి దాని స్థానాన్ని బేలతనం ఆక్రమించుకుంది ప్రవీణ్లో.
    
    దుర్గాంబకు కూడా పరిస్థితి అర్థమయింది.  ఇప్పుడు తను చెప్పబోయే మాటలపైన ఒక పక్క తన భర్త పరువు, మరొక పక్క తన కొడుకి పరువు ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు.  ఒక్క పరువే కాదు, భర్త విషయంలో ఆయనతో తన అనుబంధం, అనురాగం, తనపై ఆయన చూపించే ప్రేమాభిమానాలు, మరొకవంక కొడుకు విషయంలో శిక్ష పడి అవమానపడతాడన్న బాధ ఆమెను ఎటూ తేల్చుకోనివ్వటంలేదు.
    
    "అయ్యా నేను ఓ నాలుగు మాటలు చెప్పవచ్చా?" న్యాయమూర్తి వైపు తిరిగి అభ్యర్ధనగా అడిగింది దుర్గాంబ.  న్యాయమూర్తి సాలోచనగా ప్రవీణ్ వైపు చూసి, అతనికి అభ్యంతరం ఉండదని గ్రహించి దుర్గాంబతో " చెప్పండి" అన్నారు.
    "తప్పు చేసిన వారిని దండించి చక్కదిద్దడానికేగా రాజ్యాంగం న్యాయస్థానాలను ఏర్పరచడం.  కొత్త కొత్త చట్టాలను చేసేటప్పుడు మీ లాంటి పెద్దలు అంతా ఆలోచించే చేస్తారు.  కాని సమాజంలో జరిగే తప్పుకు సమాజం భాధ్యత ఉండదా?"
    మాటలు కూడబెట్టుకుంటూ ఆలోచనలను ఒక తాటిపైకి తేవటం కోసం ఒక క్షణం ఆగింది దుర్గాంబ.
    
    న్యాయమూర్తి ఆమె వైపు ఒకింత ఆశ్చర్యంగా చూశారు. కోర్టుహాలులో అంతా ఆమె ఏం చెబ్తుందో అని శ్రద్ధగా వినసాగారు.
    
    కాస్త స్వగతంగా, కాస్త ప్రసంగంగా తన ధోరణిలో మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది దుర్గాంబ.
    
    "పిల్లలను బాగా చదవమని ఒత్తిడి చేస్తున్నాం.  చిన్నప్పటి నుంచి వాళ్ళలో కాంపిటీషన్ పెంచి ’ఎక్కువ మార్కుల ’ చదువే ప్రోత్సహిస్తున్నాం.  ఈ రోజుల్లో చదువు నేర్పడం తప్పితే సంస్కారం నేర్పే బడులున్నాయా? మాస్టార్లున్నారా?"
    
    "ఆ పిల్లలే పెరిగి పెద్దయ్యాక సమాజంలో సరిగా బ్రతక లేకపోతే దానికి సమాజం, అందులోనే ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రభుత్వాలు, భాధ్యత తీసుకోరా?" అడిగింది దుర్గాంబ.
    
    "అంటే ఈ చట్టం వలన ఉపయోగం లేదంటారా?" తన ఎదురుగా మాట్లాడుతున్న మహిళ విద్యావంతురాలు అన్న స్పృహ క్షణక్షణం బలపడుతుండటంతో ఆమె అభిప్రాయం విలువైనదన్నట్లు అడిగారు న్యాయమూర్తి.
    
    "చట్టానికి ఉపయోగం ఉందా లేదా అనేదానికంటే చట్టం ద్వారా ఎంత మార్పు వస్తుంది అనేది కూడ ముఖ్యం కదా? ’దట్ గవర్న్మెంట్ ఈస్ ద బెస్ట్ విచ్ గవర్న్స్ ద లీస్ట్’ అన్నారు రాజనీతిజ్ఞులు. స్వయంపాలనను సమర్ధిస్తూ ఎందరో ఉద్యమాలు కూడ చేస్తున్నారు.  ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మరి ’గృహపాలన’ లో జోక్యం చేసుకోవటం అంత అవసరమా?"
    
    "మా ఇంట్లోని పనిమనిషి కరుణను చూడండి.  ఆమె చదువుకోలేదు.  అయినా తల్లికి ఒంట్లో బాగోలేదంటే తన పని మానుకుని ఆమెకు సేవ చేయటానికి వెళ్ళింది".
    
    "అదే తమ తల్లిదండ్రులను హాస్పటలికి తీసుకెళ్ళాలంటే శలవు పెట్టి ఎంత మంది పిల్లలు వెళ్తున్నారు?  చదువుకుంటే సెంటిమెంట్స్ చచ్చిపోతాయా?"
    
    "మన పిల్లల పెంపకంలో పెద్దవాళ్ళపై ప్రేమ, ఆప్యాయతలు ఎంతవరకు కలిగిస్తున్నాము.  ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో పోయాయి.  కనీసం తాతయ్య, మామ్మలతో కులాసాగా గడిపే బాల్యం మన పిల్లలకు ఇస్తున్నామా?"
    
    "ఇవన్నీ ’గృహపాలన’వంటివి.  ఇవి సరిగా ఉంటే ఇటువంటి చట్టం చేయవలిసిన అవసరం కలుగుతుందా?"
    
    "అయినా ఇప్పటికైనా మేల్కొని మన సమాజం కుటుంబపాలనను సరిదిద్దుకుంటే ఎంత బాగుంటుంది?"
    
    దుర్గాంబ సంధిస్తున్న ప్రశ్నలు అందరి హృదయాలను సూటిగా తాకుతున్నాయి.  ఎవరికి వారు తమ గురించి తామే బేరీజు వేసుకుంటూ ఆమె ఇంకా ఏమి చెప్తుందో అని వినసాగారు.  కోర్టు హాలులో అందరూ చిత్తరువులు అయిపోయారు.
    
    "ప్రభుత్వం వాలంటరీ సంస్థల సహాయంతో వృద్ధాశ్రమాలు ఎందుకు పెట్టకూడదు? వాటి పాలన, అక్కడి వృద్ధులు తమకు తామె చెసుకోవచ్చు, లేదా తాము ఎన్నుకున్న వారితోనే జరిపేలా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది!"
    
    "టివి సీరియల్స్‍లో ప్రతిరోజు ఇంటింటా ఒకరినొకరు హింసించుకొనే అత్తాకోడళ్ళు ఎందుకు ఉండాలి? తాతయ్య చెప్పే నీతి కథలు, బామ్మలు పాడే పాటలు ఎందుకు ప్రసారం చేయరు?"
    
    "ఒక తల్లి శివాజీని తయారు చేయలేదా? పిల్లలకు అన్నం తామే తినిపిస్తూ మన వారసత్వపు కథలు చెప్తే పిల్లలు మంచి వ్యక్తిత్వం పొందరా? ఈ రోజు ఇంతమంది మేధావులు, న్యాయశాస్త్ర కోవిదులు ఇక్కడ ఉన్నారు.  వారి పిల్లలు రేపు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను చక్కగా గౌరవించేలా పెరుగుతున్నారా లేక పోటీ చదువులలో తలమునకలై పోయి ఆప్యాయతా, ఆత్మీయతలను తుంచుకుంటున్నారా?"
    
    "ఇంత చెప్పటం కాదు గాని మాలాంటి తల్లిదండ్రులు బొత్తిగా ఏమి తమకోసం ఉంచుకోకుండా అంతా పిల్లలకే ఇచ్చి చివరి కాలంలో వారి పైనే ఆధారపడడం కూడా ఒక విధంగా తప్పేకాదూ?"
    
    "అన్ని వయసులవారు, అన్ని వర్గాలవారు , ఆలోచించి మనముండే ఈ సమాజాన్ని మరింత ప్రేమగా, మరింత అందంగా, మరింత ఆప్యాయంగా మార్చుకునే దారులు కనుక్కోలేమా?"
    
    "ఇవన్నీ మీకు తెలియవని కాదు.  కాని పెద్దదాన్ని నా మనసులోని సంఘర్షణ ఇలా మాటలలో బయటకు వచ్చింది."
    
    "ఇక మా ఇంట్లో జరిగిన విషయం ఎవరి ఇంట్లోనైనా జరిగేదే.  అంతేకాని మా కోడలుగాని, కొడుకుగాని ఏదో నేరం చేయలేదు.  ఏదో ఆవేశపూరితమైన వాతావరణంలో జరిగిన కాకతాళీయ సంఘటనేగాని మరేమి కాదు."
    
    "ఎవరి మనసైనా నొప్పిస్తే మన్నించండి" కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ భర్త వైపు చూసింది దుర్గాంబ.  ఆమె మాటలు శ్రద్ధగా విన్న అనంత పద్మనాభం కొంచెం ప్రసన్నంగా కనిపించాడు.  ఆయన కూడ తన ఆవేశాన్ని నిందించుకుని పరితపించాడు.
    
    న్యాయమూర్తి తో సహా కోర్టుహాలు లోని అందరూ నోటమాట లేక నిరుత్తరులయి పోయారు.  కొంచెం తేరుకుని న్యాయమూర్తి తన తీర్పు చెప్పారు.
    
    "సాక్ష్యాధారాలను పరిశీలించాక మా ముందున్న ఫిర్యాదు లోని సంఘటనలు ఉద్దేశపూరితంగా జరిగినవి కావని కోర్టు విశ్వసిస్తుంది.  అయినా సాయికిరణ్, దివ్యలు తమ పెద్దలను మరింత ఆదరంగా చూసుకోవలిసిన అవసరం ఉంది.  జరిగిన సంఘటనపై వారు భాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు వారిని మందలిస్తూ, ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశిస్తున్నాము.  సాయికిరణ్ తన తల్లిదండ్రులతో సహా వారికి ఇష్టమైన యాత్ర చేసి కోర్టువారికి తగిన ఆధారాలు ఒక నెలలోగా చూపాలని కూడా ఆదేశిస్తున్నాము."
    
    కోర్టుహాలులో, రాఘవరావుతో సహా , అందరూ ఆ తీర్పు విని హర్షధ్వానాలు చేసారు.
    
    దివ్య, సాయికిరణ్ వచ్చి దుర్గాంబ పాదాలు తాకారు.  అనంత పద్మనాభం దుర్గాంబ తలనిమిరాడు.  కొడుకు, కోడలు పరివర్తన చెందారని వృద్ధ దంపతులు సంతోషించారు.
 
 *    *    *
 
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 12-11-2009 సంచికలో ప్రచురితం)

Comments