మౌన హింస! - రాధేయ,

    ఒక్కటే ఆలోచన్ల దొంతర.

    ప్రారంభమే కాని తుదిలేని ఆలోచన్ల కలివిడి.
    ఆలోచన్ల కుంపట్లో పడి మిడతలా కొట్టుకుంటున్న హృదయం.
    ఆరోజు ఆదివారం కావడమే ఒక ఆనందం. వారంలో ఆర్రోజులూ పడ్డ మానసిక, శారీరిక శ్రమకు కాస్త ఉపశమనం లభించే రోజు. నిత్యయాంత్రిక జీవితంలో ఈ ఒక్కరోజూ విశ్రాంతిగా ఫీలయ్యే రోజు.

    ఈ అమూల్య క్షణాలు నాకనుసన్నల్లోంచీ జారిపోకముందే జాగ్రత్తపడ్తూ 'శ్వేత రాత్రులు ' కథల సంపుటిని ఆత్రంగా చేతుల్లోకి తీసుకున్నాను.
    అంతవరకు దారాలుగా విస్తరించిన ఆలోచనన్నీ మళ్ళీ ఉండలుగా చుట్టుకు పోయాయి. 'పుస్తక పఠనం'లోకి పరకాయ ప్రవేశం చేసిన నేను జీవ సమాధిలో 'ధ్యానయోగి 'లా మారిపోతాను. పూర్తిగా చదివి మూసెయ్యగానే ప్రపంచాన్ని విశ్లేషించినంత సంతృప్తి.
    జీవితం గురించి స్వప్నం ఒకటైతే వాస్తవం మరొకటి.
    స్వప్నం దృశ్యాలను చూస్తే, వాస్తవం గాయాల్ని తడుముతుంది.
    మధ్యతరగతి ఆశాజీవులు నిరంతరం ఆర్థిక సంబంధాలతో సంఘర్షణ పడుతూనే ఉంటారు.
    "నాన్నా...నాన్నా... ఒక్క మాట" బయట నుండి హడావుడిగా పరుగులాంటి నడకతో దగ్గరికి వచ్చాడు సతీష్!

    మౌనభంగం పొంది చటుక్కన తలెత్తి వాడివైపు చూశాను. నా చూపుల్లో అంతరార్థం గ్రహించాడేమో గతుక్కుమని, మాటలు గొంతులోనే పూడుకుపోయాయి.

    "ఏం బాబూ! చెప్పు! ఆగిపోయావేం!..." వాడి మనసు చిన్న బోయిందని తెల్సుకొని ఆప్యాయంగా పల్కరించాను.

    వాడి ఉత్సాహం మళ్ళీ పుంజుకుంది. దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. వాడు స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుకొంటున్నాడు.
    "ఈరోజు మా క్లాస్ మాష్టారుగారు అందర్నీ ఒక ప్రశ్న వేశారు."
    "ఏమిటది చెప్పు! నీకు తెలియకుంటే నేను చెప్తానుగా..." అన్నాను.
    "అందరం అక్కడే చెప్పేశాం!"
    "ఇంతకీ ఏ విషయం?" ఆ విషయం పట్ల నాకు ఆసక్తి పెరిగింది.
    "ఏమంటే... మీరింతా బాగాచదివి పెద్దవాళ్ళయ్యాక ఎవరెవరు ఏం చేస్తారు? మీరెలాంటివారు కాదలచుకున్నారు? అన్నారు."
    మరి నీవేం సమాధానమిచ్చావ్.. అని అడిగే లోపే "మరేమో... నా ఫ్రెండ్స్ వాసు, రమేష్, దీపూ, పవన్, భాగ్య, సుభాషిణి వీరంతా డాక్టరు, ఇంజనీరు, లాయర్, డిటెక్టివ్, సైంటిస్టులూ అవుతామని అన్నారు. మరి నేనేమో... నీలాగా 'టీచర్' అవుతానని చెప్పాను." ఆమాటతో వాడి కళ్ళలో ఒక విధమైన 'గర్వం' తొణికిసలాడింది.
    "వెరీ గుడ్ బాగా చెప్పావ్!" సంతృప్తిగా బుగ్గపై చిటికె వేశాను.
    అంతే! ఆ మాటతో రెట్టింపు ఉత్సాహంతో క్రికెట్ బాట్‌తో బయటికి పరిగెత్తాడు!
    వంటగదిలో 'మిక్సీ'తో కుస్తీ పడుతునున్న శ్రీమతి తండ్రీ కొడుకుల సంభషణ విని కూడా నిర్లిప్తంగా తన పనిలో మునిగి పోయింది. తన ఆశలూ, కోరికలూ 'మిక్సీ'లో మెత్తగా ముద్దగా మారిపోతున్న ఆందోళన ఆమెది.

    "ఒక్క కొడుకు. వాడిలి ముందూ వెనకా ఆడపిల్లలే! వీడు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంటానంటే పడనియ్యకపోతివి. మూడోసారి మళ్ళీ ఆడపిల్లే! కొడుకూ కూతురు అయి వుంటే బావుండేది. ఒకరికి ఇద్దరు ఆడపిల్లలైపోయారు. నేనెంత చెప్పినా మీ మొండితనం మీది! వాడైనా ఏ డాక్టరో, ఇంజనీరో అవుతాడులే అని ఆశపడితే టీచరవుతాడట, టీచర్."ఆమె మౌనసంఘర్షణ మిక్సీ సౌండులో కల్సిపోయింది. 

    "సత్యా! చూశావా బాబు ఏమంటున్నాడో? నాలాగా టీచర్అవుతాడట" పుస్తకం మూసి అన్నాను.
    "ఆ... ఆ... విన్నానండీ మీ తండ్రీ కొడుకుల మాటలు! మీతోనే వేగలేకున్నాను. ఇంక వాడూ టీచరైతే అంతే... ఏమైతే ఏం లెండి! నాకూ ఈ చాకిరీకీ నిష్కృతి లేదు. ఇంక ఈ జీవితానికి తృప్తి లేదనుకుంటాను! అంతకన్నా నేను చేసేదేముంది."
    "అరె... అదేమిటి! నీ బాధకు కారణం ఏమిటో ఇప్పటికీ నాకర్థం కావడం లేదు! నువ్వు కోల్పోయిన స్వేచ్చ ఏమిటో చెప్పు మరి! 'టీచర్'వృత్తి పట్ల నీకెందుకింత నిరసన! ఇలా వచ్చి కాస్త చెప్పు! తెల్సుకుంటాను!"
    "ఏం చెప్పమంటారు? మా నాన్నా టీచరే! ఆయనకు నేనొక్కదాన్నే సంతానమైనప్పటికీ, ఆయన నన్నెంత ప్రేమగా పెంచినా అటు స్కూల్లో ఆయన విద్యార్థిగా, ఇటు ఇంట్లో కూతురిగా భయం భయంగా మసులుకునే దాన్ని! ఆయన సర్వీసంతా మారుమూల పల్లెల్లోనే గడిచిపోయింది! నా చదువు కూడా హైస్కూలుతోనే ఆగిపోయింది. చదవాలని ఆశవున్నా అవకాశం లేక్ అంతటితోనే సంతృప్తి పడ్డాను.
ఆ తర్వాత... వెతికి వెతికి మిమ్మల్ని భర్తగా తెచ్చారు. మీతోబాటు పన్నెండేళ్ళుగా పల్లెటూళ్ళలోనే జీవితం గడిచిపోయింది. ఇప్పటికైనా ఏదో ఒక విధమైన టౌనులో కాపురమున్నానని తృప్తి పడ్డానికి వీలు లేదు. మీరు రోజూ క్యారియర్‌తో, బస్సులకోసం ఎదురుచూపుల్తో నిలబడి పల్లెటూరికి పోయి రావల్సిందే. జీతానికీ, జీవితాలకూ లంకె కుదరని ఉద్యోగం. అవసరాలకు మించని సంపాదన. జీతమంతా కుటుంబ ఖర్చులకూ... పిల్లల స్కూలు ఫీజులకూ పోతే ఇంక ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మనలాంటి ఉద్యోగిని వెతికి తెచ్చుకోవాలన్నా శక్తి చాలని జీవితం. ఇలా ఎంత కాలం చెప్పండి! ఏదో మన బాబైనా ఏ డాక్టరో, ఇంజనీరో అవుతాడనే ఆశ. కనీసం వాడి జీవితం జీతం ఆశాజనకంగా ఉంటుందనే ఆశ. వాడి ద్వారానైనా మన ఆడపిల్లల జీవితాలు కుదుటపడకపోతాయా! అన్న ఆశ. మీరే! చెప్పండి. నాది దురాశ అంటారా? నేనేమైనా సంకుచితంగా ఆలోచిస్తున్నానంటారా? నావరకైతే ఈ తృప్తి చాలు! కానీ మన పిల్లలైనా ఈ నాగరిక ప్రపంచంలో తృప్తిగా బ్రతికితే నాకంతే చాలు!"
    ఆ కళ్ళలో పొంగే కన్నీటి జీరల్ని నాకు తెలియకుండానే తుడుచుకోవాలని ప్రయత్నం చేసింది. సాధ్యం కాలేదు!
    "ఛ.... ఛ.... ఎందుకు బధపడ్తావ్! నీ ఆశ దురాశ మాత్రం కాదు. నీ ఆవేదనకూ అర్థం ఉంది నేను కాదనను. కానీ నాకు తెలియకుండా నీలో ఇంతటి మానసిక సంఘర్షణ ఉందనుకోలేదు సుమా!"
    శ్రీమతి తన మనసులోని బాధను పైకి వెల్లడించి సేద తీర్చుకుంది!
    నాలో అంతస్సంఘర్షణ మళ్ళీ మొదలైంది!
    పుస్తకం చదవాలన్న ధ్యాస లేదు.
    నిజమే! సత్య ఆవేదనలో అర్థంలేకపోలేదు. మేమిద్దరం. మాకు ముగ్గురు. రోజూ ఇంటెడు చాకిరీ. మసక చీకట్లో ఐదు గంటలకే ఆమె దినచర్య ప్రారంభం. ఏడుగంటలకే నాకూ, పిల్లలకూ క్యారియర్లు రెడీ చెయ్యాలి. ఉదయం తినడానికి టిఫిన్లు, స్నానపానాలు. మేమంతా వెళ్ళిపోగానే మిగిలిన చాకిరీలో భాగంగా బట్టలు ఉతకటం వగైరాలతో మధ్యాహ్నం ఒంటిగంటదాకా ఒకటే హడావుడి. తర్వాత భోంచేసి కనీసం ఒక గంట రెస్టైనా తీసుకోకుండా ఉతికిన బట్టలు ఇస్త్రీ చెయ్యటం, ఊడిపోయిన బొత్తాలు, చేతి కుట్లతో కుట్టుమిషను పని సాయంత్రం ఐదు గంటలదాకా సాగుతుంది. ఐదుగంటలకు బయటకి వెళ్ళిన మేమంతా గృహప్రవేశం చెయ్యటం. తరువాయి కాఫీలు, చిరుతిండ్లు, రాత్రి వంటలు, కొళాయి నీళ్ళు వగైరాలతో భోజనాలయ్యే సరికి దాదాపు రాత్రి పది అవుతుంది. అప్పుడైనా కాస్త టీ.వీ.దగ్గర కూర్చుందామనుకుంటే ఈ దినచర్యలో అలసటతో కళ్ళు మూత పడ్తాయి. మేం చదువుకుంటూ, రాసుకుంటూ ఉండగా తాను నిద్రలోకి జారుకుంటుంది. మళ్ళీ మాకంటే ముందుగానే లేచి తన దినచర్యలో కల్సిపోతుంది. ఈ నిరంతర దినచర్యలో తానేం కోల్పోతున్నదీ కూడా తెలియని పరిస్థితి. ఆదివారాలైతే మరీ ఎక్కువ పని. అందరూ ఇంట్లోనే ఉంటారు కనుక అందరి అభిరుచుల్నీ తృప్తి పరచాలి తప్పదు!
ఇదంతా నా స్మృతి పథంలో మెదుల్తూనే ఉంది.
    దృశ్యాలు దృశ్యాలుగా నా కళ్ళముందు పర్చుకుంటున్నాయి.
    ఈ ఇంటెడు చాకిరీకి సహాయంగా మరొక పనిమనిషిని కుదుర్చుకుందామనుకుంటే నాకొచ్చే జీతానికి ఆ అవకాశమూ లేదు. పోనీ ఎలాగైనా అవకాశం కల్పించుకొని కుదుర్చుకుందామని ఆలోచించాను. ఆమెకిచ్చే జీతం కాక అన్నపానాలతో కలిస్తే కుటుంబ సభ్యుల సంఖ్య మరొకటి పెరుగుతుంది.
    మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటి?
    మరి ఈ చాకిరీకి నిష్కృతి ఏమిటి?
    మళ్ళీ నా ఆలోచన్ల దొంతర!
    తేనె తుట్టె కదిలింది.
    "సంకెళ్ళు తెగ్గొట్టినా పారిపోని పతివ్రత ఇల్లాలు!" ఏదో పుస్తకంలో లీలగా మెదిలిన ఈ వాక్యం తనను చూసినప్పుడల్లా గుర్తుకు వస్తుంది.
సగటు మనిషి ఆయుర్ధాయంలో సగం నిండుకుంటున్న పరిష్కారం దొరకని సమస్య .
    ఎన్నాళ్ళీ మౌన పోరాటం...
    ఎన్నాళ్ళీ మౌన హింస...భరిస్తుంది.
    "నాన్నా... నాన్నా... నా ప్రశ్నకు జవాబు చెప్పవూ?" ఎదురుగా నిలిచి సూటిగా ప్రశ్నిస్తున్న పదేళ్ళు నిండిన బేబి వైపు చూశాను.'సృజన' అని పేరు పెట్టినా ఇంటిల్లిదిపాదీ బేబి అని ముద్దుగా పిలిచే అలవాటు. అందరికంటే చిన్నదైనా మాటలు మాత్రం చలాకీగా మాట్లాడుతుంది. 'పిట్టకొంచెం కూత ఘనం' అంటుంటారు ఇరుగుపొరుగువారు.

    "ఏం బేబి ఏం కావాలి చెప్పమ్మా?"
    "మా తెలుగు వాచకం వెనుక 'ఇద్దరు పిల్లలు ఇంటికి అందం' అని ఉందిగదా! అంటే ఏమిటి నాన్నా!"
    "ఓస్! అదా! అంటే మాలాంటి అమ్మానాన్నలకు 'ఇద్దరు పిల్లలు మాత్రం చాలు' అని."
    "ఓహో! అలాగా... అందుకేనేమో అమ్మకు కోపమొచ్చినప్పుడల్లా నువ్వు వద్దన్నా పుట్టావ్! మీ నాన్న చెప్పితే విన్నాడు కాదు! అని నాపై విసుక్కుంటుందిగా."
    "అది తమాషాకు లేమ్మా! నిన్ను ఉడికించడానికి అలా అని వుంటుంది."
    "ఆ... అదేం లేదు... నువ్వు కూడా వాడికైతే అన్నీ బాగా కొనిస్తావ్! వాడెంత అల్లరి చేసినా కోప్పడవ్!"అంది బుంగమూతితో.
    "అక్కయ్యా! అన్నా! నువ్వూ! నాకు ముగ్గురూ ఒక్కటేనమ్మా! అలాంటి భేదాలుండవ్! నన్నుకూడా అన్న చదివే స్కూలులోనే నడువకుండా రోజూ రిక్షాలోనే పంపుతున్నాంగదా! నీవు అడిగినవన్నీ కొనిస్తూంటాంగదమ్మా!"

    "ఏమో మరి! నేనేదైనా పనికి పలుకకపోతే అమ్మ నన్ను బాగా కోప్పడుతుంది. వాడినైతే ఏమీ అనదుగా..."
    "నేను మీ అమ్మకు చెప్పానుగా మరి.. ఎప్పుడైనా అలసటతో అలా విసుక్కొంటుందే తప్ప మీ అమ్మకూడా చాలా మంచిది." ఈమాటతో తనకు బాగా నమ్మకం కుదిరినట్లయింది. మెరిసే కళ్ళతో ఆడుకునే వంటసామాగ్రితో హుషారుగా వెళ్ళిపోయింది!
    మళ్ళీ ఆలోచన్ల పరంపర...
    జవాబు దొరకని ప్రశ్నల దాడి!
    శ్రీమతి సంఘర్షణకు మూలం ఏమిటి?
    నాపట్ల అమితమైన విశ్వాసం!
    అచంచలమైన ప్రేమాభిమానాలు.
    పిల్లల పట్ల ఎనలేని వాత్సల్యం.
    కానీ తనపట్ల ఏ మమకారం లేదు. ఏమీ ఆశించదు. అందరికోసం తపన.
    తనలో నటన లేదు. ద్వేషంలేదు.
    తన మనసు నిండా పరిపూర్ణ విశ్వాసం. స్వచ్ఛమైన ప్రేమ.
    ఆ ప్రేమ గుర్తించే తీరికలేని యాంత్రిక జీవితం.
    ఆమెకు అప్పుడప్పుడూ వైరాగ్యం... నిర్లిప్తత... ప్రదానం చేసిందే తప్ప నేనేం చేశాను. నాభార్యగా, నాకు తోడూనీడగా నా సహచరిగా ఆమెకు నేనేమిచ్చాను ఓదార్పు సానుభూతి తప్ప!
    అలలు అలలుగా విస్తరించే ఆలోచనలు. నిశ్చలమైన తటాకంలోకి రాయి విసిరినట్లుగా వలయాలు వలయాలుగా కదులుతున్న ఆలోచనలు.
    నీటిలోకి విసరబడ్డ రాయి అడుగున కూర్చున్నా అలలు వ్యాపించడం మానలేదు. గట్టుకు తాకుతున్నాయి.
    "నాన్నా... వారం రోజుల్నుండీ మా మాష్టారు ట్యూషను డబ్బులు అడుగుతున్నాడు. ఇవ్వండి నాన్నా ఇచ్చేస్తాను...." పెద్దమ్మాయి సునీత అర్థింపుతో ఆలోచనలకు ఆనకట్ట పడింది.
    పెద్దమ్మాయి సునీత ప్రకాశం స్కూలులో టెంత్ క్లాస్ చదువుతోంది!
    ఎప్పుడూ స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటుంది. కోపతాపాలు ఆమడ దూరంలో ఉంటాయి. అందర్నీ కలుపుగోలుగా పల్కరించే మనస్తత్వం!
    "ఇప్పుడులేవులేమ్మా. వారం రోజుల్లో జీతం రాగానే ఇస్తానుగా... మీ మాష్టారుగారితో చెప్పు!"
    "అందరూ ఇచ్చారు! నేనొక్కదాన్నే మిగిలి పోయాను నాన్నా!"
    "అలాగే లేమ్మా! వారం రోజులు! నువ్వూ ఇచ్చేద్దువుగానీ!"
    "అలాగే నాన్నా! నేనిప్పుడు ట్యూషనుకే వెళ్తున్నాను! మాష్టారుగారికి చెప్తానులే."
    అదే కొలనులో మళ్ళీ రాయి... మరొకటి.. మరొకటి వరుసగా ఆగి పడ్తున్న రాళ్ళు!
    కలలన్నీ అలలు అలలుగా విస్తరించి విరిగి పడ్తున్నాయి. అయినా ప్రయత్నం ఆగదు. గట్టును ఢీకొంటున్నాయి. ఒరుసుకు పోతున్నాయి!
    ఆ అలల్లో కళ్ళుంచి మరీ దగ్గరగా చూస్తున్నాను. అవి అలలు కావు. ఒక సత్య, ఒక సునీత, ఒక బేబి.... మరెందరో..లు.
    అవును! నిజం!
    మధ్యతరగతి జీవితాలు మిథ్యా వలయాలు.
    తమకి తాము నచ్చజెప్పుకుంటూ జీవితాలను గడిపే విచిత్ర జీవులు!
    తలుపులు తెరిచే వుంచినా పంజరానికి అలవాటు పడ్డ పక్షులు.
    గంతలు విప్పేసినా ఆ గాడి చుట్టే పరిభ్రమించే విచిత్ర జీవులు!
    ఆలోచన అలల్లో కవిత్వం పరిభ్రమించింది! కవిత్వం జీవితమై పరిభ్రమిస్తున్నది!
(ఆహ్వానం 1995 ఆగష్టు సంచికలో ప్రచురితం)
Comments