మౌనమే నీ భాష - సి.ఉమాదేవి

    
"ఇప్పట్లో ఈ ముసురు వదలదు. ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి. చిన్నాడి యూనిఫాం ఇస్త్రీ చేస్తేకాని లాభం లేదు. అయ్యో! వాడి సాక్స్ పూర్తిగా ముద్దయిపోయాయి. ఇలా అయితే ఎలా?" తడుస్తున్న మనవడి బట్టలను హడావిడిగా లాగేస్తూ అన్నాడు అనంతం.

    "అబ్బబ్బ, ఏమవుతుంది మామయ్యా, కాస్త తడికే అంత హడావిడి చేస్తారు" విసుక్కుంది సుమ మామయ్య అనంతాన్ని.

    "లేదమ్మా.వాడికి జలుబు చేస్తుందేమోనని..." అంతవరకు హైరానా పడిన పెద్దమనిషి తన కేకలకు సంజాయిషీ చెప్పుకుంటూ ఈజీ ఛైర్‌లో కూలబడ్డాడు. మనసులో విరిసిన నవ్వులు, మబ్బుల చాటునుండి చంద్రుడు దాగకుండా బయటపడ్డట్టు అనంతం భార్య ముఖాన ప్రతిఫలిస్తూనే వున్నాయి.

    "సువర్చలా! నువ్వు ఆ ముసిముసి నవ్వులు మానెయ్యి" చిరాగ్గా అన్నాడు అనంతం.

    తనకెందుకన్నట్టు లేచి పెరటితోటలోకి వెళ్ళిపోయింది, సువర్చల నాలుగు రోజులప్పుడు నాటిన రోజా కటింగులకు నీళ్ళు పోయాలని.

    కాసేపు అటు, ఇటు తచ్చాడి భార్య వెనకే తోటలోకి వెళ్ళాడు అనంతం.

    "నువ్వు నీళ్ళు పోయడం దండగ."

    కఠినంగా వినబడ్డ భర్త గొంతు విని ఎందుకన్నట్టు భృకుటి ముడివేసింది సువర్చల.

    "ఆ కటింగులు అలాన్నేనా నాటేది? కత్తిరించిన కొమ్మలు నాటేటప్పుడు మట్టి ముద్దో, పేడ ముద్దో మూస్తే గద! ఎండి వరుగులైన కొమ్మలు చిగురిస్తాయా?"
    "పెట్టినా నిలవలేదు. ఎప్పుడో పడిపోయినట్లున్నాయి. మీరు చూసారా నాటేటప్పుడు? కోడలన్నట్లు విమర్శలు ఎక్కువే మీకు" సువర్చల విసుక్కుంది అలవాౠగా.     మారు మాట్లాడకుండా వెనక్కి మళ్ళాడు అనంతం.     అంతలో, "తాతయ్యా, నా క్రికెట్ బ్యాట్ చూసావా?" ఇల్లదిరేలా కేకలు వేస్తూ వెతుకుతున్నాడు పెద్ద మనవడు అజయ్.     "నాకేం తెలుసురా" అంటూనే "ఆ... అదిగో ఆ బల్ల క్రింద పెట్టాను చూడు - మరీ వసారాలో పారేసి వెళ్ళావుగా నిన్న!"     "అబ్బ! ఎక్కడ ఉండేది అక్కడ వుండనియ్యవు తాతయ్యా. నీతో అన్నీ గోలే!" చిరుబురులాడుతూ, సుమ "పాలు తాగి వెళ్ళు" అని అంటున్నా వినిపించుకోకుండా బ్యాట్ పుచ్చుకుని పరుగెట్టాడు అజయ్.     "నేను వుంచనా, ఎక్కడివక్కడ! ఎక్కడ పడేసినవి అక్కడే వుండనివ్వమనేమో" మనవడు వెళ్లిన వైనాన్ని వింతగా విశ్లేషించుకున్నాడు అనంతం.     'ఇక ఈ తరం ఇంతే' అనుకుంటూ కాసేపు ఏదైనా మంచి కార్యక్రమం చూద్దాం అని టి.వి. రిమోట్ నొక్కాడు అనంతం.     "ఏమిటీ సుత్తి తాతయ్యా,అవతల టామ్ అండ్ జెర్రీ అయిపోతుంది" రిమోట్ లాక్కున్నాడు చిన్న మనవడు విజయ్.     'అవి ఎప్పుడూ పరిగెత్తు తుంటాయి. వీడి కన్నులు వాటి వెంట పరిగెడుతున్నాయి' రిమోట్ విజయ్ కప్పచెప్పి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు అనంతం.     కొడుక్కు హార్లిక్స్ పట్టుకొచ్చింది సుమ.     "నా కొద్దు మమ్మీ" గారాలు పోతున్నాడు విజయ్.     దిక్కులు చూస్తున్న మామయ్య వంక ఇబ్బందిగా చూసింది సుమ. అర్థమైనట్టు లేచి వెళ్ళాడు అనంతం. వాడు హార్లిక్స్ తాగితే తప్ప తన కడుపులో కాఫీ చుక్క పడదని అతనికి తెలుసు.     "తాగు నాన్నా, అవతల అన్నయ్య కూడా పాలు తాగకుండానే వెళ్ళాడు, మీ తాతయ్య చేసిన నిర్వాకానికి. బ్యాట్ వెతుక్కునేసరికే ఆలస్యమైందని కోపం" - ఓ వైపు బాధ పడుతూ మరో వైపు చిన్న కొడుకును బ్రతిమాలుతోంది.     "ఆ... జెర్రీ నీళ్ళలో పడింది" అంటూ విజయ్ హార్లిక్స్ అందుకుని గటగటా తాగేసాడు ఆనందంగా.     "హమ్మయ్య" సుమ నిట్టూర్చి గ్లాసందుకుని వెళ్ళిపోయింది.

        తను వినాలనే అన్న కోడలి మాటలు వినబడ్డ అనంతం -
    "ఎక్కడి వస్తువులక్కడే వుండనీయమంటే చిందరవందరగా పడేసిన వాటిని ఎలా వున్నాయో అలాగే వుంచేస్తే ఎలా? ఇంటికి ఎవరైనా వస్తే రోతగా వుండదూ. ఈ పెద్దవాళ్ళకు పిల్లలను పెంచేది రాదనుకోరూ" సణుగుతున్నాడు విసుగ్గా.     "నీ కెందుకయ్యా. సాయంత్రమైతే అలా గాలికి వెళ్ళవచ్చు కదా" సాగదీసింది సువర్చల.     "అవున్లే 'గెటవుట్' అనలేక గాల్లోకే వెళ్ళమంటున్నావు."     "శివా శివా, ఏం మాటలండీ అవి" చెవులు మూసుకుంది సువర్చల.
        నాన్నకు ఏం పని లేదు, తోచడమూ లేదు. దానికి తోడు నాన్నకు చాదస్తం మరీ ఎక్కువయిందమ్మా. నువ్వేమి పట్టించుకోకు" అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన అనంతం కొడుకు రవి తల్లిననునయించాడు.

        'మీకు నేను పనిలేని చాదస్తపు వెధవలా కనబడుతున్నానా' మనసులోనే సణుక్కుంటూ, గొంతులో కోపం,బాధ మిళితమై మాటల విస్ఫోటనం జరగక మునుపే చెప్పుల్లో కాళ్ళు దూర్చి విసురుగా బయట కడుగేసాడు అనంతం.

        కాళ్ళు తెలియరాని వేదనతో వేగం పుంజుకుని అడుగులేస్తున్నాయి. ఎప్పుడు ఎవ్ళ్ళేచోటకే అవి అనంతాన్ని నడిపిస్తున్నాయి. 'నేను పనిలేని వాడినా? చాదస్తమా నాది? ఏమో!' అనంతం మనసు తనను తనే ప్రశ్నించుకుంటోంది.     "రావోయ్...రా...రా...ఈ మధ్య రావడం లేదేం?" ఆప్యాయంగా పలకరించాడు అనంతంతో పాటే రిటైరయిన చలపతి.     స్నేహితుడి మందహాసంతో కూడిన పలకరింపు, అంతవరకు పడ్డ బాధ చేతితో తీసేసినట్లు పటాపంచలయింది అనంతానికి.
        భుజాన కండువా తీసి గుడి మెట్లను దులిపి కూర్చున్నాడు అనంతం చలపతి ప్రక్కనే. మౌనంగా వున్న అనంతాన్ని ఒక్క క్షణం విస్మయంగా చూసాడు చలపతి.

        "ఈరోజు పేపర్ చూసావా?" చలపతే కదిపాడు మాటలను.     "చూడకేం! నిద్రపట్టక లేచి వసారాలో తిరుగుతున్నా. పేపరబ్బాయి పేపరుతో పాటు చెత్త వార్తలన్నీ విసిరికొట్టాడు. కనీసం పదిహేను చావులు, పాతిక ప్రమాదాలు, పది దొంగతనాలు మరో డజను మోసాలు. తాగునీరు లేనివారి కన్నీటి కడగండ్లు, రాజకీయ రణాలు" అంతకంటే ఏముంటుందన్నట్లుగా పెదవి విరుస్తూ నిర్లిప్తంగా అన్నాడు అనంతం.     "ఇవి షరా మామూలేగా! నువ్వు వద్దనుకుంటూనే క్రైం ప్రేజీకి అతుక్కుపోయుంటావ్. అందుకే ఆ వార్తలన్నీ ఏకరువు పెడ్తున్నావు. నేను అడిగేది మనకు సంబంధించిన అంశం గురించి చదివావా అని"     ఏమిటన్నట్లుగా చూసాడు అనంతం.     "సీనియర్ సిటిజన్స్ సమావేశం జరిగిందటోయ్ నిన్న"     "ఏముంది దాంట్లో - రొటీన్ సమస్యలేగా. ముక్తాయింపుగా కొన్ని నిర్దేశ సూత్రాలు, తీర్మానాలు. ఇవన్నీ రొటీన్‌గా జరిగే విశేషాలేగా."     "మన సమస్యలు సరే, అవి ఎలాగూ వున్నవే. సమస్యలను పరిష్కరించే దిశగా సమాజాభివృద్ధికి సీనియర్ సిటిజన్స్ పాటుపడాలని, వారు సమాజానికి ఆదర్శంగా వుండాలని చెప్పారు కద, సమాజాభివృద్ధికి తమ సమయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కూడా. స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలిట."     "స్వచ్ఛంద కార్యక్రమాలా?" భళ్ళున నవ్వాడు అనంతం.     "నవ్వుతావేం అనంతం! నిజమే కదా, మనం చేయడానికి పనులు మాత్రమేమున్నాయి? తినడం, నిద్రపోవడం మినహా. మనం వుద్యోగాలలో ఎలా వుండేవాళ్ళం? మనం ఆఫీసులో అడుగుపెట్టేలోగానే ఎవరికి వారు వారి సీట్లలో బుద్ధిమంతుల్లా పనిచేసుకునేవారు. మన మాట పెదవి దాటక మునుపే కనుచూపునర్థం చేసుకుని ఫైళ్ళ అప్‌డేటింగ్‌కాని, డ్రాఫ్టింగ్‌కాని, డిస్పాచ్‌గాని క్రమం తప్పక జరిగిపోయేవి. అంతెందుకు అటెండరు వీరయ్య బూజులు దులిపి, గదులు వూడ్చి, టీకప్పులు సైతం మిలమిల మెరిసేటట్లు తోమి టీ పట్టుకుని వచ్చేవాడు."
        "సరే చలపతీ అవన్నీ ఆ రోజులు. ఈ రోజుల్లో వినయం స్థానే అతి వినయం, భద్రత స్థానే అభద్రత. ఇక పని స్థానంలో తమ పనుల స్థానం పెరిగి ఆఫీసు అంటే పెండింగ్ ఫైళ్ళతో పాడుబడ్డ దివాణంలా దుమ్ము పేరుకుపోయిన ఫైళ్ళు, ఎర్రటేపులు, వూడి ఎర్ర నాల్కలు చాస్తూ అవినీతిని బాహాటంగా ప్రోత్సహిస్తున్నాయి. వీళ్ళంతా ఎవరు? సమాజంలో భాగమే. వీరిని మనం అభివృద్ధి చేయాలా? ముసలి వాళ్ళు రామా కృష్ణా అని మూల కూర్చోక ఈ సమాజోద్ధరణ ఏమిటి అని వెనుక నవ్వుకుంటారు" - అనంతం గొంతులో నిస్పృహ ధ్వనించింది.  

        "అలా ఆలోచిస్తావేం అనంతం! నెగటివ్‌గా ఆలోచించకు. అసలు సమాజమంటే ఎవరో కాదు. మనమే, మన కుటుంబమే. విలువలు శిలువలై పాతిపెట్టబడ్డాయి. మన కుటుంబంలోని చిన్నారులను మనం సన్మార్గంలో నడిపించడం కూడా సమాజాభివృద్ధే. మన అనుభవాలు వారికి పాఠాలు. దీనికి రాజకీయ రంగ ప్రవేశము, సాంస్కృతిక సంస్థలలో సభ్యుడిగా నమోదు చేసుకోనక్కరలేదు. ముందు మనింట్లో దీపం వెలిగించాలి. ఆ వెలుగు మార్గదర్శకమై మరిన్ని దీపాలు వెలుగుతాయి" ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు చలపతి.     "నువ్వెన్నయినా చెప్పు చలపతీ, మనం సీనియర్ సిటిజన్స్‌గా పిలువబడ్డా నేటి ఫాస్ట్ జూనియర్స్ ముందు మనం సబ్ జూనియర్స్‌మే! వారిలో సివిక్ సెన్స్ కన్నా సినీ సెన్స్ ఎక్కువ. బ్రతుకు ఛానెల్‌ను ఈదడం తెలియదు కాని టి.వి. ఛానెల్స్‌లో తలమునకలవగలరు. ఎందుకొచ్చిన సమాజోద్ధరణగాని పద వెళ్దాం. మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది. అసలే కోపంగా వచ్చేసాను" కోపం కరిగిన అనంతం శాంతంగా అన్నాడు.

    "అరె, ఏమయింది? చెప్పలేదేం?ఆఫ్‌కోర్స్ అది నీ పర్సనల్ అయితే వద్దులే. నేనడగటం సమంజసం కాదు" - అనంతం బాధ తెలుసుకోవాలనుకున్నా తన పరిమితిని తెలిసిన వాడు కనుక ఎక్కువ ప్రశ్నలు వేయకుండా మిన్నకుండి పోయాడు.     "నీ కన్నా నా మనసుకు దగ్గరయే స్నేహితుడెవరు. కాని..." ఆగాడు అనంతం.     'సమయం వచ్చినప్పుడు చెప్తాన'న్నా, ఏదో కుటుంబ విషయాలలో కలత చెందాడని మాత్రం అర్థమయింది చలపతికి.     ప్రసాదానికి అందరు సిద్ధమవుతున్నారు. దేవుడికో నైవేద్యం పెట్టి గంట మోగిస్తున్నారు. ఇహ బంధాలను మరచే ఆ ఒక్క క్షణం! హారతి కళ్ళ కద్దుకుని కళ్ళు మూసుకోవడం. సన్నని కాంతిరేఖ మనసులో ప్రవేశించి పురులు విప్పి కాంతి పుంజమై అనంతాన్ని గమ్యం దిశగా నడిపించడానికి వూతమైంది.
        'ఇక దొరకదనుకున్నదే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అలాగే మరిచిపోదామనుకున్నదే మరీ మరీ గుర్తుకువస్తుంది. చలపతి వెలిగించమన్న చిన్నదీపం వెలగటానికి వత్తి, నూనే కాదు అగ్నీ కావాలి. ఆ అగ్ని తనే కావాలి' - అనంతం ముఖంలో దరహాసరేఖ తృటికాలం రాజ్యమేలింది.

        "ఏమిటా ప్రొద్దుటే దరహాసాలు?" భార్య ప్రశ్నను విననట్లే వుండిపోయాడు అనంతం.     'ఏమిటీ మౌనం?' అనుకుంటూ లేచి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది సువర్చల. ఏదో మాట్లాడబోతుంటే, వూరుకోమన్నట్లు నోటి మీద వేలు వేసుకున్నాడు అనంతం. ఈ మౌన ప్రణాలిక ఏ మజిలీ వైపు అని ఆలోచనలో పడింది సువర్చల.     ఒక్కొక్కసారి నిశ్శబ్దం మాట్లాడుతుంది. మాట బాడీ లాంగ్వేజీకి అనుసంధానమైతే మౌనం మనసు లాంగ్వేజిని ఆవిష్కరిస్తుంది. అయితే ఇక్కడ అనంతంగారి మౌనం అందరికీ ఆటవిడుపే. కాలచక్రం ఆగదు. అవాంతరాలు ఎదురైనా గడియారపు ముళ్ళని తిప్పినట్లు కాలాన్ని అటు ఇటుగా సర్దేసుకుంటూ బ్రతుకు బండి పయనిస్తూనే వుంటుంది. అనంతంగారి కుటుంబమూ దానికి మినహాయింపు కాదు.     అనంతం రోజు గుడి దగ్గర స్నేహితుడైన చలపతిని కలుసుకుంటూనే వున్నాడు. తరాల అంతరాలు, యువతలోని అనుభవ శూన్యత, ఈజీ మనికై వేగిరపాటు, పైపెచ్చు ఎల్లెడలా జడలు వేసిన స్వార్థపుటాలోచనలు సీనియర్ సిటిజెన్స్‌కు మింగుడు పడటం లేదు. అయినా ఏదో పట్టుదల, మారుతున్న సమాజ విలువలలో నిబద్ధత లేని జీవితాలను చూచి వాళ్లిద్దరూ కలత చెందారు. క్రమశిక్షణతో మొదలైతేనే జీవితానికి తదుపరి నగిషీలు అందాన్నిస్తాయి. అయితే ఆ క్రమశిక్షణకు పునాది బాల్యంలోనే నన్నది వారిద్దరికీ తెలుసు. ఓ చిరు దివ్వెను వెలిగించగలిగితే మహా తేజస్సుకు నాంది పలుకుతుంది. అయితే అనంతానికి దొరకని సమాధానం ఒక్కటే! ఇన్నాళ్ళు తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చడంలో, కొడుకును తీర్చిదిద్దడంలో సామ, దాన, భేద దండోపాయాలన్నిటిని వినియోగించాడన్నది నిజం. అయితే ఈ ప్రయోగాలు నేటి బాలలకు ఫలిత శూన్యమే! మరయితే మార్పు ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? కిం కర్తవ్యం!? తనలో విరిసిన కాంతిరేఖ తేజోమయం కావాలి. మౌనంగా తనలో తనే ఆలోచించుకోసాగాడు అనంతం. అతని మౌనమే అతని దిశను నిర్దేశించింది.
        అనంతం మౌనముద్రలో వున్నా ఇంటిల్లిపాదినీ ఓ కంట కనిపెడుతూనే వున్నాడు. అందరు స్వాతంత్ర్యానంతరం సంబరాలు జరుపుకున్నట్లు మహ ఆనందంగా వున్నారు. పిల్లలు, పెద్దలు టీ.వీ. వీక్షణం పది, పదకొండు దాకా సాగుతోంది. శబ్దకాలుష్యం దృశ్య కాలుష్యంతో నరాలు చిట్లుతున్నా, కడుపులో దేవుతున్నా శివుడు హాలాహలం మ్రింగినట్లు మౌనం మాటున దావానలాన్ని మ్రింగుతున్నట్లున్నాడు అనంతం. ఎక్కడి వస్తువులక్కడే వున్నాయి స్థానభ్రంశం అనంతరం! తన బదులు కొడుకు కేకలు వినిపిస్తున్నాయి, అడపా దడపా, దారి కడ్డం వచ్చి ఏ చెప్పులో, పుస్తకమో, బ్యాటో, బంతో తగిలి తూలినప్పుడల్లా! ఇంట్లో అందరు ఎప్పుడు సి.బి.ఐ. లెవల్లో వెదుకుతూనే వుంటారు. దొంగ పట్టుబడ్తాడేమో కాని కావలసిన వస్తువు దొరకదు. అందరు ఓ మారు అనంతం వైపు చూస్తారు, తప్పంతా ఆయనదే అన్నట్లు. అనంతం మాత్రం ఉలకడు, పలకడు.

        తనెన్నుకున్న మార్గం సరియైనదేనా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు కదా? అనుకున్నాడు. 'కాదు' - నేటి పిల్లలు అర్భకమైన పిచ్చుకలు కాదు. తెలివైన రామచిలుకలు. తనకు తాను సమాధాన పరచుకున్నాడు అనంతం. తన మౌనం వారి మనసులకు లేపనమై పరివర్తన తెస్తే చాలు, తాను సీనియర్ సిటిజన్‌గా తన వంతు సమాజ సేవ చేస్తున్నట్లే.     ఉదయం లేచింది మొదలు 'సర్చ్' వారంటు జారీ చేసి తెగ వెదుకుతున్నా సైన్సు నోట్సు గల్లంతయింది కనబడ్డం లేదు. సైన్సు నోట్సులో గుండె బొమ్మ వేసుకురమ్మంది టీచర్. చూపకపోతే తన గుండెలు తోడేస్తుందన్నట్లుగా వెతుకుతున్నాడు అజయ్. 'ఇక నీల్ డౌన్ తప్పనిసరి' - ఏం చేయాలి అనుకుంటూ తాతయ్య వైపు చూసాడు.     'ప్చ్' తాతయ్య ఏది ఎక్కడుందో ఠక్కున చెప్పేసేవాడు. అరె, అసలు తాతయ్యకేమయింది? అయినా ఒకసారి అడుగుదాం అనుకుని, "తాతయ్యా నా సైన్స్ నోట్స్ తీసావా?" అనంతం మారు పలకలేదు. తాతయ్య వేపు వింతగా చూసి, "తాతయ్య, నాకు స్కూల్ టైం అయిపోతుంది, నా సైన్స్ నోట్సు తీ...అదే చూసావా అని అడుగుతున్నాను" అన్నాడు. తాతయ్య మౌన గంభీర్యానికి అజయ్ నీళ్లు నమలక తప్పలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది - ముందురోజు బెడ్ మీద హోమ్ వర్క్ చేసినప్పుడు పుస్తకాలు కొన్ని దిండు క్రింద, కొన్ని మంచం క్రింద పెట్టే తన దురలవాటుతో అలవాటుగా సైన్సు నోట్సును తనే మాయం చేసుకున్నట్లు. సైన్సు నోట్సును దొరకబుచ్చుకొని, తాతయ్య వేపు ఓరగా చూసి, "వుందిలే తాతయ్య, నువ్వు మళ్లీ వెతక్కు" అంటూ బ్యాగందుకుని స్కూలుకు పరిగెట్టాడు.

        సు బెరుగ్గా చూసింది మావయ్య వైపు, 'ఏమైనా అంటాడేమో నని'. మౌన వీణ శృతి చేయకనే పలుకుతోంది.     ఆ రోజు సాయంత్రం బ్యాటు, బంతి, పుస్తకాలు, బట్టలు, చెప్పులు వాటి స్థానాల్లో భద్రంగా బుద్ధిగా కూర్చున్నాయి. దేవుడి పూజ సువర్చలదే. దీపాలకు వత్తులూ సువర్చలే చేస్తుంది. అయితే ఆ పని తాను చేయడం మొదలు పెట్టాడు అనంతం.     "అబ్బ అన్ని వత్తులు దేనికండీ?" ఇక చాలన్నట్టుగా అంది సువర్చల.

        'ష్' తప్ప మరో మాటలేదు అనంతం నుండి.     "ఇది మరీ చోద్యం, మీకేదో అయింది. భాష మర్చిపోయారా? కన్నులతోనే మాట్లాడుతున్నారు."     "ఊ" ముక్తసరిగా అన్నాడు అనంతం.     "మీ మౌనం నిప్పులేకుండానే చురుక్కుమన్నట్లుగా వుంది"     
        "ఆహా" ఆశ్చర్యం ప్రకటించాడు అనంతం.     తాతయ్య మాట్లాడితే వినాలని టి.వి. వాల్యూమ్ కూడా తగ్గించేసాడు చిన్న మనవడు విజయ్.     "టీ.వీ.ఆపెయ్యనా తాతయ్యా, నువ్వు చూస్తావా?" నెమ్మదిగా అడిగాడు. వాడి గొంతులో దుఃఖం పొంగుతోంది. కార్టూన్ చూస్తూ తాను నవ్వితే తనను చూచి మైమరుస్తూ నవ్వే తాతయ్య ముఖంలో నవ్వులేదు. ఆ స్థానంలో కటుత్వం కూడా కనబడక ఇక ఆగలేక, "మాట్లాడు తాతయ్యా, టీ.వీ.చూడనులే తాతయ్యా" అంటూ తాతపొట్టలో ముఖం దాచుకున్నాడు విజయ్.     "మామయ్యా, కాఫీ, బిస్కెట్స్ డైనింగ్ టేబిల్ మీద పెట్టాను. ఇక్కడీకి తెమ్మంటారా?" వినయంగా అడిగింది సుమ.     'కాఫీకి పెట్టావా అమ్మాయ్' అని ఒకటి రెండు సార్లు అడిగితే 'ఛీ ఏమిటో ఈ కాఫీ యావ' అని విసుక్కొనేది మనస్సులో. కాఫీ కాదు కనీసం మంచినీళ్ళు త్రాగడానికి కూడా వంటింటి వైపు వెళ్ళడం లేదు అనంతం.     మామగారి మౌనం సుమలో కూడా జంకు కలిగిస్తోంది.     "నాన్నా, ఏమైయింది, అలిగావా? ఏం సాదిద్ధామని? రోజులాగే మా వెంటబడే సాధించు. మాకదే బాగుండేది" అని నవ్వుతూ, "ఈ మౌనవ్రతాలు వద్దు నాన్నా" అభ్యర్థనగా అన్నాడు రవి.     అప్పుడు పెదవి విప్పాడు అనంతం.

        "నా మాటకన్నా నా మౌనమే ఎక్కువ మాట్లాడిందని మీకు తెల్సు. పలుకు మనిషిని శాసిస్తే మౌనం హృదయాన్ని శాసిస్తుంది. నేను సీనియర్ సిటిజన్‌ని. వృత్తిలో రిటైర్ అయినా జీవితంలో రిటైర్ కాలేదు. నాకు కుటుంబం పట్ల, సమాజం పట్ల కొన్ని బాధ్యతలున్నాయి. నేను నాటిన మొలకలు మ్రానులై నిలబడాలని, తుఫాను తాకిడిని సైతం తట్టుకోవాలని కాంక్షిస్తాను. అందుకే ఎదుగుదలకు ఎరువు బాడినా చీడ పట్టినప్పుడు తగు మోతాదులో పెస్టిసైడ్ తప్పదు కదా! సామ, దాన, భేద, దండోపాయాలను మించింది మౌనం. కాదంటారా?" - అనుభవమైంది కదా అన్నట్టు అందరిని పరికించి చూసాడు అనంతం.     "తాతయ్య మాట్లాడుతున్నాడు" చప్పట్లు చరుస్తూ తాతయ్యను చుట్టుకున్నారు మనవళ్లిద్దరూ.     "నాన్నతో మాట్లాడావు కాని, మాతో మాట్లాడవా? మా జట్టు కటీఫా?" బేలగా అడిగారు. అనంతం అగ్నిలాకాక మంచు ముద్దలా మారిపోయాడూ. పిల్లలపై ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. సువర్చల సంబరంగా, సుమ, రవి విస్మయంగా చూస్తున్నారు ఆ అనురాగబంధాన్ని!     పెన్సిలు ఏది, పుస్తకమేది, ఎక్కడ నా షూలేస్, ఒకటే వుందే? - ఇలాంటివన్నీ చిన్న విషయాలుగా కనిపించినా కాల హరణంలో మాత్రం ముఖ్యపాత్ర పోషిస్తాయి. తాతయ్య మౌనంతో ఎక్కడి వస్తువులక్కడ పొందికగా అమర్చబడ్డాయి. ఎక్కడి వస్తువులక్కడ పెట్టడం, ఇంటి శుభ్రత పాటించడం, టీ.వీ.పట్ల వ్యామోహం తగ్గి అనుబంధాలకు శ్రద్ధ పెరగడం, చదువులో ముందంజ వంటి శుభపరినామాలకు నాంది పడింది.     "ఏమండీ నా కళ్లద్దాలు..." చప్పున నాలుక్కరచుకొంది సువర్చల. కళ్లద్దాలు సువర్చల కంఠసీమలో వేలాడుతున్నాయి.     మౌనం వీడిన అనంతం గలగలా నవ్వాడు. నవ్వుకు నవ్వులు జతకలిసాయి.

(రచన ఇంటింటి పత్రిక ఫిబ్రవరి 2008 సంచికలో ప్రచురితం)
Comments