మవునం మాట్లాడింది - సి.ఎస్.రాంబాబు

    ‘బాపు నేను చదువుకుంట. కొడిమ్యాలలో నన్ను ఇంటర్లో చేర్పించు. నడ్చుకుంట బోయి నడ్చుకుంట వస్త. టెన్త్‌లో నాకు మంచిగానే వచ్చినయి కదా మార్కులు

    నీకు చెప్తే సమజ్ గాదేమిరా రాజూ. ఇప్పటిదాకా ఎట్లనో చదివిపిచ్చిన. నీ ఎన్క ముగ్గురు పిలగాల్లున్నరు. నినే్న చదివిపించుకుంటూ కూసోనుంటే పిల్లగాల్లను ఎవడు సూస్కోవాలిరానాయన ఒప్పుకోకుండా అన్న మాటలు.

    ఏందయ్యా, పోరనికి మంచిగచ్చినయి మారుకులు. గోర్నమెంటు పీజులు గట్టింది. బువ్వ కూడా పెట్టింది. ఇప్పుడు గూడా ఆనికి గోర్నమెంటే పైసలు కడతది. నువ్వేమయినా కడతవ ఏంది. అయినా నువ్వు తాగుడు బందు జేస్తే ఆన్ని మా బాగా సదివిపించొచ్చుతల్లి తనకి అండగా మాట్లాడింది.

    నీకేమి ఎరుకనే సదువు గురించి. మా చెప్పొచ్చినవు. ఆనికి ఇద్దరు తమ్ముల్లున్నరు. సెల్లెలున్నది. ఆల్లని సదివిపియ్యాలనా వద్దా. నువ్వు ఊకే లొల్లి జేయకు. ఆడ్ని పట్నంల పెట్రోలు బంకులో కొలువుకు పెడుతున్న. మనూరాయనే సూపర్వైజర్ గున్నడు ఆయనకు చెప్పుంచిన

    బాపూ. గట్లనకు. నన్ను చదివిపియ్యి బాపూ. నేను చదివినంక తమ్ముల్లను, చెల్లిని నేను జూస్కుంటఎంతో బతిమాలాడు తను రోజు బాపుని.

    గీముచ్చట్లు నాకు జెప్పకు. రేపు పట్నం బోతున్నం. ఆడ పెట్రోలుబంకులో చేరుతున్నవు
అమ్మెంత మొత్తుకున్నదిసిన్న పోరడయ్యా వీడు. వీడితోటోల్లు మంచిగ సదువుకుంటుంటే, వీడ్ని కొలువుల పెడతనంట వేందయ్యా

    బాపు ఎవరి మాటన్నా, ఎప్పుడన్న యిన్నడా. బాపు మాటే నెగ్గింది. తనొచ్చి బంక్‌లో బడ్డడు. ఇప్పటికి ఆర్నెల్లు దాటిపోయింది. చదువుకునే పిల్లగాల్లను ఎవుర్ని జూసినా గుండె చెరువవుతున్నది.

    ఏంరా రాజూ ఇంకా అదే ఆలోచనలయితే ఎట్లరా. నువ్వు మీ ఊరొదిలేసినవ్. ఇక్కడ బంక్‌లో వున్నవని మరువకు. సార్ నువ్వు పెట్రోల్ పోస్తవేమోనని బండి నిలుపుకుని వున్నడు. ముందు సార్ సంగతి చూడు

    రాజు తేరుకున్నాడు. ఒక్క క్షణం సిగ్గుపడ్డాడు. బంక్‌లో రాజు వయసు వాళ్లు ఆరేడుగురున్నారు. అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అందరి జేబుల్లో సెల్ఫోన్లు, చెవుల్లో ఇయర్ ఫోన్లూ. ఒక్క కుర్రాడు మాత్రమే ఎందుకిలా ఉంటాడో అనుకున్నాను. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకోవడం నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటయింది. దీనిక్కారణం మేనేజర్‌తో ఏర్పడిన పరిచయం కావొచ్చు. ఇంటికి దగ్గరలో వుండటం కూడా కావచ్చు. కుర్రాడి పేరు రాజు అని నాకు తెలుసు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాడు. ముభావంగా ఉంటాడు. చాలామందికి కుర్రాడున్న చోట పెట్రోల్ నింపుకోవటం అంతగా ఇష్టముండదని నేను కొద్ది రోజులుగా గమనిస్తున్న విషయం.

    సార్ ఎంతకు పోయాలి

    రెండొందలు పోయ్ బాబు

    పర్స్‌లోంచి ఐదొందల రూపాయల నోటు తీశాను.

    పెట్రోల్ ముదురు గోధుమ రంగులో గన్నులోంచి పడుతోంది. చూస్తుండగానే పెట్రోల్ మీటరు రీడింగ్ ఐదొందల రూపాయలు చూపించసాగింది.

    బాబూ, నేనడిగింది రెండొందలు పోయమని. నువ్వు ఐదొందలు పోసేశావువిసుగ్గా అన్నాను.

    లేదు సార్. ఐదొందలన్నట్టు విన్పించింది సార్ఎప్పుడోగాని మాట్లాడకపోయినా, మాట్లాడినప్పుడు స్థిరంగా మాట్లాడాడు.

    ఎగసి వస్తున్న కోపాన్ని అణచుకుంటూ బండిని స్టార్ట్ చేశాను.

* * *


    
ఏమిటి సార్ మొహం వస్తూనే చిటపటలాడుతోంది. ఎవరితోనయినా గొడవా ఏమిటి?’ స్వప్న అడుగుతోంది.

    పిల్ల వెధవలు కూడా మోసం చేస్తున్నారు. ఇంకీ దేశం ఏం బాగుపడుతుందిచికాకుగా అన్నాను.

    అబ్బ అసలు విషయంలోకి వద్దురూజుట్టును చెరిపేస్తూ అడిగింది స్వప్న.

    అంతే అప్పటిదాకా వున్న కోపం ఠప్‌మని గాలి తీసేసిన బెలూన్లా చప్పబడిపోయింది. బంకులో జరిగిన తతంగం చెప్పాను. నా అనుమానాన్ని వ్యక్తపరిచాను. ‘అంతకు ముందు మీటర్ రీడింగ్ మూడొందలు ఉన్నదేమోనని నా అనుమానం. నేనడిగిన రెండొందల రూపాయల పెట్రోల్ పోసేసి ఐదొందలు తీసుకున్నాడని నా అనుమానం. అమాయకంగా, ఏదో బాధపడుతూ ఉంటాడనుకున్నాను. కానీ ముసుగేసుకుని మోసం చేస్తున్నాడనుకోలేదు. మేనేజర్ తెలిసినవాడే కదా కంప్లైంట్ ఇస్తాను. అప్పుడుగాని తిక్కకుదరదు వాడికికసిగా అన్నాను.

    కమాన్ డియర్! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి? మూడు నాలుగు రోజులాగండి. మీ బండే మీకు బోధపరుస్తుంది. అసలా అబ్బాయి ఎందుకంత ముభావంగా ఉంటాడో ముందర కాస్త ఎంక్వయిరీ చేయండి సార్జోకొట్టినట్టు మాట్లాడినా స్వప్న మాటల్లో విషయముంటుంది.

    పదండి సార్. ఆకలి దంచేస్తోంది. మీ కోసం చూసిచూసి పిల్లలు తినేసి పడుకున్నారు. ఇంకాసేపాగితే పడిపోయేట్టున్నానుస్వప్న తినలేదన్న విషయం బాధపెడుతుండగా తాత్కాలికంగా పెట్రో మంటను ఆర్పేశాను.

* * *
    
    ఆఫీసు వ్యవహారాల్లో పడిపోయి పది రోజులపాటు పెట్రోలు బంక్ వైపు వెళ్లలేదు. మీటరు రీడింగ్‌ని చెక్ చేస్తే ఐదొందల రూపాయలకు సరిపడా పెట్రోల్ పోశాడని అర్థమయింది. అనవసరంగా కుర్రాడిని అనుమానించినందుకు కించిత్ చింతించాను.

    నువ్వు చెప్పింది నిజమే. అబ్బాయి తప్పేమీ లేదుఅన్నాను స్వప్నతో.

    ఇంత చదువుకున్నవారు. ఇంత తెలిసినవారు. అంత కోపమయితే ఎలా సార్! కనీసం కుర్రాడిని అనవసరంగా అనుమానించినందుకు చిన్న గిఫ్టయినా ఇవ్వండి

    స్వప్న ఇచ్చిన సలహా నచ్చి దాన్నమలు చేయాలని నిశ్చయించుకుని దారిలో చిన్న గిఫ్ట్ ఒకటి కొని పెట్రోల్ బంక్‌కి వెళ్లాను.

    నమస్తే సార్, ఏమిటి మీ గాలి బంక్ మీదకు మళ్లింది. మేమేమయినా తప్పు చేయలేదు కదా!’ ఇబ్బందిని నటిస్తూ అన్నాడు మేనేజర్ మూర్తి.

    అబ్బే! అదేమీ లేదు. మీ బంక్‌లో రాజు అనే కుర్రాడు పెట్రోల్ తక్కువ పోశాడేమోనని అనుమానించి కేకలేశాను. అలా అనుమానించటం నేను చేసిన తప్పని తెలిసింది. కుర్రాడి నిజాయితీని శంకించినందుకు నాకు నేను వేసుకుంటున్న శిక్ష చిన్న గిఫ్ట్‌ని కుర్రాడికి అందజేయటం. మీరు కాస్త కుర్రాడిని పిలుస్తారేమోనని

    అందరూ మమ్మల్ని తిట్టేవారే. మా మీద కంప్లైంట్ ఇచ్చేవారే. మీలాంటి వారు కూడా ఉంటారని ఇవాళే తెలిసింది. ఉండండి మా సూపర్ వైజర్ని పిలుస్తాను. అతన్ది రాజుది ఒకటే ఊరు. మా సూపర్‌వైజరే అతన్నిక్కడ పెట్టాడుఅంటూ బెల్ నొక్కి సూపర్వైజర్ని, రాజుని తీసుకురమ్మని ఎవరికో పురమాయించాడు.

    సార్ పిలిచారాఅంటూ సూపర్వైజర్ అతని వెనుకే కుర్రాడు రాజు వచ్చారు.

    శంకర్రావుగారని సార్ మన బంకుకు రెగ్యులర్‌గా వస్తారు. అయితే మొన్నొక రోజు పెట్రోల్ పోయించుకున్నప్పుడు, మన రాజే పోశాడట. తక్కువ పోశాడేమోనని అనుమానపడి, మన రాజుని కోప్పడ్డారట. కానీ అలాంటిదేమీ జరగలేదని తెలుసుకుని, రాజుని అభినందిద్దామని వచ్చారు. కంగారు పడకండివిషయాన్ని చాలా సూక్ష్మంగా చెప్పేశారు మూర్తిగారు.

    బాబూ రాజూ సారీనయ్యా. నువ్వే కరెక్టు. నేను రాంగ్అనె్జప్పి మరీ సంభాషణని పొడిగించకుండా నేను తెచ్చిన గిఫ్టు ఇచ్చేశాను.

    వద్దు సార్.. వద్దురాజు బిడియపడుతుంటే సూపర్వైజర్ రాజుని ముందుకు తోసి గిఫ్టు తీసుకునేలా చేశాడు.

    మూర్తిగారు రాజుని వెళ్లమని సైగ చేయటంతో రాజు వెళ్లిపోయాడు. నేనా సూపర్వైజర్ని అడిగాను

    ఎందుకు కుర్రాడు రాజు అంత డల్‌గా, ఏదో బాధపడుతున్నట్లుంటాడు. అదే మిగిలిన బాయ్స్ అందరూ ఉత్సాహంగా తుళ్లుతూ ఉంటే

     రాజుది మా ఊరే సార్. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల దగ్గర చిన్న పల్లెటూరు. వాడికి మొన్న టెన్త్ పరీక్షల్లో 90 శాతం మార్కులొచ్చాయి. ఎట్లయినా చదువుకోవాలని వాడి కోరిక. వాడి నాయన కుదరదని బంకులో పెట్టించిండు. ఏందన్నా అంటే వీనెన్క ముగ్గురున్నరంటడు. రాజు నాయన తాగుబోతు సార్. రాజు అమ్మే కూలీ పనిచేసి అందర్నీ పోషిస్తుంది. చదువుకోలేకపోయినే్న అని వీడట్లయిపోయిండు సూపర్వైజర్ కూడా బాధపడ్డాడు.

    రాజు తోటి నేనొక్కసారి మాట్లాడొచ్చాఅభ్యర్థించాను.

    తప్పకుండా, రాజేష్ కుర్రాడ్ని పిలుమూర్తిగారు ఆర్డరేయబోయారు.

    వద్దొద్దు. నేనే వెళ్లి మాట్లాడతానుమూర్తిగారి దగ్గర సెలవు తీసుకుని, సూపర్వైజర్తో కలిసి రాజు దగ్గరకు వెళ్లాను.

* * *


    
రాజూ, సార్ నీతో మాట్లాడాలంటున్నారుఅని సూపర్వైజర్ చెప్పటంతో రాజు నా వంక కొంచెం భయం భయంగా చూశాడు.

    చెప్పు రాజూ. నీకు టెన్త్ క్లాసులో మంచి మార్కులొచ్చాయని మీ సార్లు చెప్పారు. నీకు చదువుకోవటం ఇష్టమని కూడా చెప్పారు. పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తూనే చదువుకుంటావా? అసలు ఏం చదవాలని అనుకుంటున్నావు?’ నెమ్మదిగా, అనునయంగా అడిగాను.

    కంప్యూటర్ చదువు చదవాలనుకున్నా సార్నెమ్మదిగా చెప్పినా, దృఢంగా చెప్పాడు.

    ఏదయినా కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో చేరి ఉద్యోగం చేస్తూ చదువుకుంటావా?’

    మౌనంగా తలూపాడు. మళ్లీ కలుస్తానని భుజం తట్టి బయల్దేరాను.

* * *


    
ఎంతదాకా వచ్చింది మీఆపరేషన్ రాజుషూస్ విప్పుకుంటుంటే కొంటెగా అడిగింది స్వప్న.

    నన్ను వేధించిన అపరాధ భావనను కొంతవరకు కడిగేసుకున్నాను. కుర్రాడు బ్రైట్ స్టూడెంట్. చదువుకోవాలన్న తపన ఉంది. తల్లి ప్రోత్సాహం ఉంది. కానీ తండ్రి అనేవాడు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. చాలా చోట్ల తండ్రులే కదా విలన్లు. ఏదయినా కంప్యూటర్ ట్రైనింగ్‌కు వెళతావా అంటే తలూపుతున్నాడు

    ఇంకేం మీ నాగభూషణాన్ని అడిగి చూడండి. అతనేదో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాడు కదా

    గుడ్ ఐడియా. నువ్వుకరణేషు మంత్రివోయ్. పురుషుడి విజయం వెనుక స్త్రీవి నువ్వేమెచ్చుకోలుగా అన్నాను.

    బావుంది సంబడం. మాటలు తప్పిస్తే కనీసం మల్లెపూలు కూడా రాల్చరు కదా. కాఫీ తెస్తానుండండి. అవతల మీ పుత్రుడు, సుపుత్రిక కోర్కెల చిట్టాతో మీ కోసం వేయి కళ్లతో చూస్తున్నారుఅంటూ లోపలికి వెళ్లింది స్వప్న.

    పనిలో పనిగా నాగభూషణానికి ఫోను కలిపాను.

    ఎస్ బాస్. ఊరక రారు మహానుభావులు నిన్నటి మాట. ఊరక ఫోన్ చేయరు మహానుభావులు ఇది ఇప్పటి మాట. ఏం సంగతిఆరా తీశాడు నాగభూషణం.

    విషయం వివరించాను.

    మూడు నెలల సర్ట్ఫికెట్ కోర్సుంది. ఆరు నెలల సర్ట్ఫికెట్ కోర్సులున్నాయి. ఎంఎస్ ఆఫీసు నుంచి ఒరాకిల్ వరకు అన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పిన కుర్రాడికి ఓపికుంటే ఆర్నెల్లు కోర్సులో చేర్పించు. ఇదేదో సామాజిక బాధ్యతలా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి పూర్తి ఫీజు మాఫీ గురించి నన్నడక్కు. గరిష్ఠంగా నేన్నీకు పదివేలు తగ్గించగలను. మిగిలిన ఇరవై వేలు నువ్వు పెట్టుకుంటావో, ఎవరిచేతయినా పెట్టిస్తావో నీ ఇష్టం. కొన్ని పుస్తకాలు ఉడతాభక్తిగా ఇవ్వగలను. అంతేనా ఇంకేమయినా ఉందా? రెండు రోజుల్లో కొత్త బ్యాచ్ మొదలవుతోంది. వెంటనే తీసుకొస్తే నాకూ మంచిది. కుర్రాడికీ మంచిదిఠక్కున ఫోన్ పెట్టేశాడు నాగభూషణం నాలుగు మాటలు చెప్పి. అతనెప్పుడూ ఇంతేకట్టె కొట్టె తెచ్చెవ్యవహారం.

    నాగభూషణంతో మాట్లాడేసినట్టున్నారు. ఆయనగారు కూడా డీల్ ఖరారు చేసినట్టున్నారు. అయ్యగారికి అంతగా నచ్చినట్టు లేదుకాఫీ కప్పు అందిస్తూ అంది స్వప్న.

    మనసుని స్కాన్ చేసి విషయాన్ని కనిపెట్టే ప్రావీణ్యం నీకెలా వచ్చింది స్వప్నా. నాగభూషణం ఇరవై వేలు కట్టాలంటున్నాడు. చూద్దాం ముందు పదివేలు కడదాం

    ఎప్పుడొచ్చారో పిల్లలిద్దరూ పిడుగుల్లాంటి మాటలొదిలారు.. ‘డాడీ నువ్వు మమ్మల్ని షాపింగ్‌కు తీసుకువెళ్తానని అమ్మ చెప్పింది. మా షాపింగ్ డబ్బులు కూడా తీసేసుకో డాడీ

    ఏమిటీ ట్విస్టుఅన్నట్టు స్వప్న వంక చూశాను.

    పిల్లలకు ఇవన్నీ ఇప్పటి నుంచే చెబితే వాళ్లకు కూడా బాధ్యతతో మెలగడం అంటే తెలుస్తుందినేనేమయినా అంటానేమోనని నెమ్మదిగా చెప్పింది.

    నాకు కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. ‘పిచ్చీఅంటూ దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకొన్నాను.

    పిల్లలున్నారు దూరం దూరంఅంటూ మాయాబజార్ సావిత్రిలా అభినయించింది నా స్వప్న సుందరి.

* * *


    సమస్య
ఎక్కడొచ్చిందంటే బంకులో పనిచేసే మిగిలిన బాయ్స్ రాజు మీద కోపం పెట్టుకోకుండా అతను షిఫ్టు కావాలంటే షిఫ్టుకు ఒప్పుకోవటం. మొత్తం బంకులో పదిమంది బాయ్స్ ఉన్నారు. రాజుకి క్లాసులు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు. వీళ్లకి ఒక్కొక్క వారం ఒక్కో డ్యూటీ ఉంటుంది. రాజుకి పొద్దున్న డ్యూటీ ఇవ్వాలంటే అందరూ ఎంతో కొంత త్యాగం చేయాల్సిందే. దీని గురించి బాయ్స్ అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపు వాళ్లు అతనికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తే రెండో గ్రూపు వాళ్లు అతని చదువుతో మాకేమిటి సంబంధం అన్నారు. అప్పటి వరకు ముభావంగా వుండే రాజులో ఇప్పుడో కదలిక వచ్చింది. తను కలలు కన్న కంప్యూటర్ కోర్సు చదువు కళ్ల ముందు నిలిచేసరికి అది అతనిలో ఉత్సాహాన్ని నింపింది. ఇది రెండో గ్రూపు అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసింది.

     క్రమంలో నాకు కొన్ని కొత్తకొత్త విషయాలు తెలిసాయి. బాయ్స్ అందరూ ఇంచుమించుగా అందరూ కలిసే ఉంటున్నారు. వంట వండుకోవటం దగ్గర్నించి బట్టలుతుక్కోవటం వరకు అంతా సామూహికమే. ఏర్పాటు పెట్రోలు బంకు యాజమాన్యమే చేసింది. ఉండేవాళ్లు ఉంటున్నారు. వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోతున్నారు. వారికొచ్చే కొద్దిపాటి జీతాన్ని అలా పొదుపుగా వాడుకుంటే కానీ ఇంటికి కాస్త డబ్బు పంపించటం వీలు కాదు. వారికి పెద్ద వినోద కార్యక్రమాలేవీ లేవు. అందుకనే పొద్దస్తమానం సెల్‌ఫోన్ హెడ్ ఫోన్లని చెవుల్లో ఇరికించుకుని ఎఫ్ఎమ్ రేడియోల పాటలు వింటారు. అందరివి ఒకటే కలలు. ఒకటే సంతోషాలు. ఒకటే దుఃఖాలు. అంతస్సూత్రమే వాళ్లని సర్దుకుపోయేలా చేస్తోంది. వారందరిలోకీ రాజు చిన్నవాడు కావటం, చదువుకుంటానన్నా బలవంతాన బంకులో చేర్పించటం వారికి తెలుసు కాబట్టి చాలామంది రాజు చదువుకుంటానంటే సంతోషంగా వీలయిన మేరకు తమ సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మాకేమిటి అన్న కొద్దిమందిని మిగిలిన వాళ్లు నచ్చజెప్పి ఒప్పించారు. మొత్తం వ్యవహారం పట్ల అసంతృప్తితో ఉన్నదెవరంటే రాజు నాయన ఓదేలు. ‘పిలగాణ్ణి మీరు చెడగొడుతున్రు సార్అంటూ నా మీద నిష్ఠూరాలాడుతూ ఉండేవాడు. రాజు తల్లి యాదమ్మ మాత్రం నాకు దండాలు పెట్టింది.

    కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి రోజున భయం భయంగా అడుగుపెట్టినా మూడు వారాలయ్యేసరికి రాజు తన బ్యాచ్ వారిలో ముందుకు దూసుకుపోయాడని నాగభూషణం చెప్పాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పట్ల రాజుకున్న ఆసక్తి, పట్టుదల ఇంకెవరిలోనూ తనెప్పుడూ చూడలేదని చెప్పాడు. దాంతో పాటు నాకు శుభవార్త కూడా చెప్పాడు. ఇరవై వేల కోర్సుకు నేను పదివేలే కట్టాను. అతని పట్టుదల చూసి రెండో పది వేలు మాఫీ చేస్తున్నట్టు నా చెవికి చల్లని కబురందించాడు. ఒక ఆర్నెల్ల కాలం ఒక వ్యక్తి జీవితంలో ఎంత మార్పయినా తీసుకురావచ్చని నాకు రాజుని చూశాకే అర్థమయింది. ఇప్పుడు రాజు శరీర భాష మారింది. బిడియం పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి రాజు ఒక మైనపు ముద్ద అయితే ఇప్పటి రాజు చెక్కిన శిల్పం.

    ఒకసారి నేనూ, స్వప్న ఇద్దరమూ పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడుహలో మేడం హౌ ఆర్ యూఅంటూ ఆశ్చర్యపరిచాడు. ‘కిడ్స్ కివ్వండిఅంటూ రెండు ఫైవ్‌స్టార్ చాక్లెట్లు తన చేతిలో పెట్టాడు.

    అది స్వప్నకు ఎంతానందాన్ని కలిగించిందంటే యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్అంటూ నన్ను ముద్దాడేంత.

    బంకులో మూర్తిగారు కానీ, సూపర్వైజర్ కానీ నన్ను చూస్తే పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. నాకు ఇబ్బందిగా అన్పించి వాళ్లకి కన్పించకుండా వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నాను. అయితే బంకులో బాయ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇది రాజు వల్ల నాకు కలిగిన అదనపు సౌకర్యం.

    అందరూ ఊహించినట్లుగానే రాజు వాళ్ల బ్యాచ్‌లోనే కాదు అంతకు ముందు బ్యాచ్ టాపర్లు కూడా స్కోర్ చేయని మార్కులు సాధించాడు. దాంతోటి నాగభూషణం ఆనందానికి హద్దుల్లేవు. అతని ఇనిస్టిట్యూట్‌కి సరికొత్త గుర్తింపు వచ్చింది. ఇనిస్టిట్యూట్‌కి రద్దీ పెరిగింది. ఇది నాగభూషణానికి రాజు వలన కలిగిన సౌకర్యం.

    రాజు గర్వంగా కోర్సు సర్ట్ఫికెట్ తీసుకుని బంకులోకి వచ్చిన రోజున బంకు మేనేజర్ మూర్తి కూడా ఉదారంగా రాజుని తమ కంప్యూటర్ ఆపరేటర్‌గా తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. చాలారోజులబట్టి పోస్టు ఖాళీగానే ఉంది. ట్రైనింగ్ కాలంలోనే రాజు కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు.

    అంతవరకూ బానే ఉంది. కానీ అతని జీతం పెంచడం గురించి మూర్తి మాట్లాడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే మాట స్వప్నతో అన్నాను. ‘ఇందులో ఆశ్చర్యపోవటానికేముంది హబ్బీగారూ రాజు చదువుకోవటానికి ఏర్పాటు చేశాం కాబట్టి కొంతకాలమయినా జీతం పెంచాల్సిన అవసరం లేదనుకుంది మేనేజ్మెంట్. రాజు తనంత తాను వెంటనే జీతం పెంచండి అని అడగడని కూడా వాళ్లకు తెలుసు

    నిజమే రాజునడిగాను. అదేమిటి నీకు మీ బంకు వాళ్లు జీతం పెంచలేదేమిటి అని. పోనె్లండి సార్. ఇవ్వాళ్ల కాకపోతే రేపు అంటున్నాడు. ఇంకా ట్రాన్స్‌లోనే ఉన్నాడా కుర్రాడు

    మీరేం కంగారుపడకండి. ట్రాన్స్‌లోంచి బయటకు వచ్చిన మరుక్షణమే తనేమిటో తెలుసుకుంటాడు. ఆపాటికి మీ నాగభూషణం తన ఇనిస్టిట్యూట్‌లో చేరమనే ఆఫర్‌తో సిద్ధంగా ఉంటాడు

    అప్పుడే ఫోన్ రింగయింది.

    నమస్తే సార్.. నేను బంకు మూర్తిని. ఏమిటి సార్ మీ రాజు ఇలా చేశాడు?’

    ఏం చేశాడు సార్?’

    మీరు కష్టపడి డబ్బులు కట్టి చదివించారా! మేం అతనిక్కావల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామా? అతను మాకు మాటన్నా చెప్పకుండా మీ నాగభూషణంగారి ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయాడు. తాపీగా రేపటినించి రాను అని ఇప్పుడు చెబుతున్నాడు. కొంచెమయినా మనిషికి కృతజ్ఞత లేకపోతే ఎట్లా సార్

    కేవలం కృతజ్ఞత కోసమో, గుర్తింపు కోసమో అతని కష్టంలో నేను పాలుపంచుకోలేదు. మీరూ అంతే అనుకుంటున్నా మాటలు చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాను.

    వెల్ సెడ్ డియర్స్వప్న వెనుక నించి నన్ను ముద్దు పెట్టుకొంది.


(ఆంధ్రభూమి దినపత్రిక 15-02-2015 సంచికలో ప్రచురితం)
Comments