మిథ్యాబింబాలు - నవులూరి వెంకటేశ్వరరావు

    శైలు తండ్రికి ఉన్న భూ సంపద ఎంతో ఎకరాలలో చెప్పదలుచుకోలేదు. నాగుల దిన్నె బావి దగ్గర నిలబడి తూర్పుకు చుస్తే, కనుచూపు దాటి ఆకాశం అడ్డగించడం వలన ముందుకు వ్యాపించడం ఆగిపోయిన పొలాలన్నీ ఆయనవే. ఇటు పశ్చిమంగా, అల్లా చెరువు గట్టు ఇక చాల్లే అని ఆనకట్ట వేసిన మేరకు భూమంతా వారిదే. ఆ భూముల మీద వీచే గాలి, జీవించే పక్షీ, క్రిమికీటకాలు, పైన పరుచుకున్నా ఆకాశం, వీచే గాలి, కాచే ఎండ... అన్నీ ఆయనవే, ఆయనవే. అయితే మరణానంతరం కట్టెను చేరవేయడం మాత్రం వేరే చోట ఆయన స్థలంలో కాదు.

    అలాంటి పంటపొలాల్లో ఊరికే, ప్రాణం వచ్చిన బొమ్మలా, వన పట్టమహిషిలా, యాంత్రికంగా తిరుగుతోంది శైలు, ఒక స్నేహితురాలితో కలిసి. స్నేహితురాలు స్నేహితురాలిగా కాక చెలికత్తెలా వుంది. శైలు శైలుగా కాక యువరాణిలా వుంది. నాగులు దిన్నె బావి చేరింది. వర్షాకాలంగదా, సంపదలా స్మృద్ధిగా వుంది నీరు. త్రాగి ప్రాణం నిలబెట్టుకోవటానికి; ప్రాణం తీసుకోవటానికి; నీడను చూసుకోవడానికి; సంతోషాలు, దిగుళ్ళు, ఆనొదళనలు, కోర్కెలు, ఈర్ష్యలు లేని మనసులా ఉంది నీరు. వాల్చిన అద్దంలా వుంది నీటి ఉపరితలం. శైలు తొంగి చూసింది. చూసిన శైలు మ్రాన్పడిపోయింది. బావిలోని అందగత్తెతో, గట్టు పై అందగత్తె ప్రేమలో పడింది. "నీవు బావిని వదిలి వచ్చేట్లు లేవు" అంటూ స్నేహితురాలు ఒక బండ ఎత్తి బావిలో పడేసింది. కలలా చెదిరింది ప్రతిబింబం. అది మొదలు స్వీయ సౌందర్యారాధన జీవితార్థం అయి వూరుకుంది.

    వయసు వచ్చింది. వసంతంలా ప్రతి వారి జీవితంలో అది రాకా తప్పదు, పోకా తప్పదు.    

    "పెళ్లి చేస్తామమ్మా" అన్నారు కన్నవారు.

    "ఎందుకు?" అంది ఏకైక సంతానం.

    "ఎందుకంటుదేవిటి?" విస్తుపోయింది తల్లి.

    "అవసరం. పైగా నీ వయసు ఇరవై" అన్నాడు తండ్రి మీసాల్లోంచి.

    "సరే" అంది - తన వయసూ పెరుగుతుందా అని ఆశ్చర్యపోతూ, విచారిస్తూ.

    భళ్లున పెళ్లయి ఊరుకుంది.

    ధనంలో ధనదాహంలో అల్లుడు మామకన్నా ఒక రూపాయి ఎక్కువ. భూమండలమంతా అల్లుడి పేర రాసి రిజిష్టరు చేసినా చంద్రుడి కేసో, సూర్యుడి వేపో ఆశగా చూస్తాడు. ఆశపడడంలో తప్పేం లేదు. సాధ్యపడితే, శనిగ్రహాన్నైనా ఆక్రమించి సర్వేరాళ్ళు పాతుకోవచ్చు. అల్లుడుగారు తనకన్నా ఒక రూపాయి ఎక్కువ కావటం గమనించి అందులో తన ప్రమేయం లేకపోయినా అది గుర్తు కొచ్చినప్పుడల్లా కుడిచేయి మీసం  చేరుకోవడం, సున్నితంగా వేళ్ళు దాన్ని మెలివేయడం జరుగుతుంటుంది.

    ఒకే సంతానం, కుందనపు బొమ్మ పెళ్లయి వేరే చోటికి వెళ్లిపోతుంటే కళ్లకు వరదొచ్చింది. అదిపారి మీసాలు తడిసిపోయాయి. పవిట కొంగుతో మొహం కప్పుకుని భోరుమంది కన్నకడుపు. మీసాల, పవిటకొంగుల వునికికి మరో అర్థం లేదు. మునుపెన్నడూ వాళ్లలా ఏడవటం, నిజానికి ఎలానూ ఏడవటం శైలు ఎరుగదు. ఇప్పుడేం ఉపద్రవం వచ్చింది? తను దేశం వదిలిపోవడం లేదు. పక్క ఊళ్లోనే కాపురం. కబురంపటానికి కాకులపై కూడా ఆధారపడక్కర లేదు. ఆ పనికి ఫోన్లున్నాయి. తపాలా వారున్నారు. కొరియర్లున్నారు. కబురందిన వెంటనే తను వచ్చి వాళ్లను చూడగలదు. లేదూ, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వాళ్లే రావచ్చు. 

    "వెళ్లొస్తా నాన్నా" అంది; "పోయొస్తా అమ్మా" అంది - అడవికి పంపుతున్నట్లు బాధపడుతున్న తనవాళ్లతో. భర్తతో కలిసి బయటికి అడుగేసింది.

    కూతురు అడుగు బైటికి వేసినది మొదలు వారసుడి గురించి ఎదురు చూడడం మీసాలాయన జీవితార్థం అయి ఊరుకుంది.

    ఖాళీగా ఉండటం మహాపాపంగా భావిస్తాడు కోటేశ్వరం. అంత పెద్ద వ్యవసాయం అతన్ని ఊరుకోబెట్టలేక పోయింది. గాజు బొమ్మలాంటి భార్య సౌందర్యం అతన్ని కట్టిపడెయ్యలేక పోయింది. వ్యవసాయంలో ఒక కాలుంచి, వ్యాపారంలోకి రెండోదాన్ని పెట్టాడు. అతనికి మరోకాలు ఉండివుంటే దాన్నీ డబ్బు సంపాయించే మరో మార్గంలో ఉంచేవాడు. జీవితమే పెద్ద వ్యాపారం అన్నది అతని తత్త్వం.

    "దాంట్లోనే మునిగి తేలుతూ ఊపిరందక పోతే అలానే చస్తా. మరణం అలా సంభవించటమే నాకిష్టం. నా ఇష్టం నాది" అన్నాడు ఒకసారి భాగస్వామి వరరుచితో. వరరుచి వృత్తాంతం ముందు ముందొస్తుంది.

    భర్త ఇంటికి వచ్చినాక పడక గది ఎంతో నచ్చింది ఆమెకు. మంచం తలవైపు గోడకు పెద్ద బెల్జియం అద్దం. కాళ్లవైపు గోడకు అలాంటిదే మరో అద్దం. ఎటు తిరిగి పడుకున్నా, ఏం చేస్తున్నా తన అందం తను చూసుకుంటుండవచ్చు.

    అద్దంలో తనను తను చూసుకుంటూ నిద్రలోకి జారిపోయేది. జారి, కలలు కనేది. ఆ కలలూ తన అందానికి సంబంధించినవే. నిద్రలోకి జారుతున్నపుడు పెదవులు చిరునవ్వుపూచేవి. చిరునవ్వుతోనే కనులు తెరిచేది. ఆ చిరునవ్వు నగలా ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసేది. దినదినప్రవర్ధమానమవుతోంది అందం. పెరిగే వయసూ దాన్ని పెంచుతోంది.

    భర్త ఆమెను 'ఆ' ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ ఇబ్బంది పెట్టటానికి ఆమెను పెళ్లి చేసుకోలేదు. అలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరమూలేదు. దేశం స్త్రీలకు గొడ్డుపోలేదు. ఆమెకూడా అతన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. దేశం పురుషులకు గొడ్డుపోకపోవడం వలన కాదు. పైగా ఆ పని ఒక రోతలా తోచేది ఆమెకు.

    సౌందర్యానికి అది కళంకం అనిపించింది.

    ఒంటరితనం ఆమె ఏనాడూ అనుభవించలేదు. ఆమెలో ఇద్దరున్నారు. 

    చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం. ప్రహారిగోడ చుట్టు ఆకాశాన్నంటే చెట్లు. స్థాలాన్ని లక్షలు వెచ్చించి కొని, మరెన్నో లక్షలు ఖర్చు చేసి పెద్ద భవంతిని నిర్మించాడు కోటేశ్వరం.ఏగానీ ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేకుండానే ప్రకృతి తన అందాలని కనుచూపు మేర ప్రదర్శిస్తుంది. (అది తన అందాన్ని చూసుకొని మురసిపోతుందో లేదో తెలియదు.) కొనని వస్తువుకు విలువ లేదు. ఆమె కిటికీ దగ్గర అప్పుడప్పుడు నిలబడి చూసేదాని గురించి కాదు ఆలోచించేది. అద్దాన్ని మించిన అద్భుతమైన సృష్టి మరొకటేముందా అన్న ఆలోచన కలిగినపుడు కిటికీ దగ్గర నిలబడుతుంది. తనను చూసి ఆశ్చర్యపడే మనుషులు, తన అందాన్ని ప్రతిబింబించే అద్దాలు కావాలి శైలజకు.

    అలాంటి వ్యక్తులలో కోటేశ్వరం స్నేహితుడు వరరుచి ఒకడు. చాలా నమ్మకస్తుడు. ఒక వ్యాపారంలో అతను ఒక భాగస్వామి. పాలరాతి వ్యాపారం. అతను తరచు కోటేశ్వరం ఇంటికొస్తాడు, కోటేశ్వరం ఉన్నా లేకపోయినా. "మీ ఇంట్లో ఏదో శాంతిగా ఉంటుంది కోటీ" అంటుంటాడు. "ఎలాగూ ఒంటరివాడివేగా, మాతోనే ఉండిపో" అంటుంటాడు కోటి. స్నేహితులిద్దరూ కలిసినపుడు గంటలకొలది వ్యాపార వ్యవహారాల మీద చర్చించుకుంటారు. వేరో సోఫాలో శైలజ కూర్చుని మౌనంగా వింటుంటుంది.

    ఆ రోజూ అలాగే సంభాషణ సాగుతోంది, డాబా మీద.     

    "కోటీ, ఎన్నాళ్లిలా నష్టం భరించడం?"

    "రుచి, ఈ వ్యాపారంలో నీకు పూర్తి స్వేచ్ఛ నిచ్చా. అవునా, కాదా?"

    "ఒకపని చేద్దామని వుంది."

    "నీవు రెండు పన్లు చేసినా నేను వద్దనని తెలుసుగదా."

    "చందమామ కూడలి నుంచి కొట్టు మార్చేద్దాం."

    "మార్చెయ్, మార్చెయ్."

    "వై కూడలిలో పెడదాం."

    "పెట్టెయ్, పెట్టెయ్."

    "అటు ప్రాంతంలో వంద ఎకరాలలో లే అవుట్లకు అనుమతి ఇచ్చారు. బోలెడు ఇళ్లు ప్రారంభం కాబోతున్నాయి. పరిశ్రమ ఒకటి అటొస్తోంది. కొలది కాలంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అటుపక్క మరోపోటీ కొట్టు లేదు. అదంతా బలిసిన వాళ్ల ప్రాంతమే. రాజస్థాన్ రాయికి బహు గిరాకీ ఉండొచ్చునని నా భావన."

    "శుభస్య శీఘ్రం" అని కోటేశ్వరం అంటుండగా ఫోను మోగింది. "చూశావా ఈ శుభ సూచన" అంటూ ఫోను ఎత్తాడు. విన్నాడు. మాట్లాడాడు. లేచాడు.

    "వామనరావు హోటల్ నుంచి ఫోను చేస్తున్నాడు. దీని గురించి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నా. వస్తావా, ఉంటావా?"

    "ఆయన కాసేవు ఉండి వెళతారు లెండి" శైలజ.

    వెళ్లిపోయాడు కోటేశ్వరం. వ్యాపార సంబంధమైన ఆలోచనలు తప్ప అతని మనసుకు మరే విషయాలు పట్టవు. బాధించవు కూడా. మిగతావన్నీ అర్థరహిత జీవిత విషయాలు. బాధించవు కూడా. వెళ్లొస్తానని కూడా చెప్పకుండా వెళ్లిపోతున్న భర్తను చూస్తూ నిట్టూర్చింది. ఆమెలో పెళ్లి నాటి రాత్రి నుంచి బాధిస్తూ ఒక అసంతృప్తిగా మిగిలిన అంశం ఒహటి ఉంది. అది శారీరక కోర్కెకు సంబంధించినది కాదు. ఆమె అందాన్ని అతను పట్టించుకోక పోవటం.    

    ఆమె అందానికి అబ్బురపడుతూ, అంతటితో ఊరుకోక "దాన్ని అనుభవించాలి, చచ్చేలోపు" అన్న కోర్కెతో వేగిపోతున్నాడు వరరుచి. అతని మానసిక సున్నితత్వంలో ఒక వింత గుణం ఉంది. ఆమెతో శారీరక కలయికలో కొన్ని నీతులను అతిక్రమించటం ఉందన్న విషయం అతని మనసుకు బాధించదు. ఆమెతో ఏకాంతాలు దొరుకుతూ వస్తున్నాయి, ఆశాభంగాలు కలిగిస్తూ జారిపోతున్నాయి. తన ఉద్దేశాన్ని ఏనాడో బహిర్గతం చేశాడు. "ఈ దేవత ఎప్పుడు కనికరిస్తుంది" అనుకుంటూ వస్తున్నాడు. ఈ మాటలలో దేవత అన్న మాటలకు బదులు "దయ్యం" అనుకుంటున్నాడు ఈమధ్య. ఆ జడపదార్థం కరిగే మార్గం కానరావడం లేదు. 

    "వెన్నెల బావుంది కదూ" స్నేహితుడు ఖాళీ చేసిన కుర్చీలోకి కాళ్లు జాపి, రెండు తొడలమధ్య చేతులు ఇరికించుకుని, ఒళ్లంతా విరుచుకుంటూ అన్నాడు వరరుచి. అతని కళ్లనిండా ఆశ.

    రుచించవు అలాంటి మాటలు ఆమెకు. వెన్నల బాగుండక వేరేలా ఎలా చస్తుంది? అతని ఇలాంటి వెర్రితనాలు వింతగా ఉంటాయి. నవ్వు పుట్టిస్తాయి. ఆ నవ్వు చూసి వరరుచి మరీ వెర్రెత్తి పోతాడు. ఇలాంటి వెర్రి మాటలు వినటం కోసం కాదు "ఆయన కాసేపు ఉండి వెళతారులెండి" అని భర్తతో అన్నది.

    రాత్రి పక్షి ఏదో  దారి తప్పినట్లు ఎగురుతోంది ఒంటరిగా, మౌనంగా. మబ్బు తునకలు తేలుతున్నాయి ఆకాశంలో. అవిరాల్చిన నీటిబొట్టు అతని చేతి మీద పడింది.

    "ఒంటరి పక్షి ఎంత విచారంగా, వెన్నెట్లో వెదుకుతూ వెళుతోంది చూడు ఎండమావిలా ఊరిస్తూ, దొరకని సుఖం గురించి. గుబులు పుట్టట లేదూ దాన్ని చూస్తే. దాని కన్నీటి బొట్టు ఇదిగో" వెర్రితనాల తల ఒక పక్కకు వంచి, ఆ కోణం నుంచి ఆమె అందాన్ని చూస్తూ అన్నాడు.

    ఆమెకు కావలసిన మాటలు కావు అవి. "పక్షిని చూసి లేనిపోనివి ఊహించుకుంటూ గుబులు, జాలి పడుతున్నారంటే మీ గుండెలో ఏదో లోపం ఉంది. వైద్యుడ్ని చూడండి ఎందుకైనా మంచిది" అంటుంది గాజు కళ్లతో.    

    "నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా ఈ క్షణాన?"

    ఆమెకు కావలసిన మాటలు అవే. అతని నోటి నుంచి అవి వెలువడటం ఎంతో హాయినిస్తుంది... అద్దంలో, బావిలో ప్రతిబింబం చూసుకుంటున్నప్పటిలాంటిది. ఆ మాటలు అతని నోటి నుంచి దొర్లటం వందలసార్లు జరిగింది. అలా జరిగిన ప్రతిసారీ మొదటి సారిలా హాయి కలుగుతుంది.

    "ఈ ఒక్క క్షణాన్నేనా?" మత్తుగా నవ్వింది.

    "సతతం" మైకంగా అంటాడు.

    తన నవ్వు అతన్ని ఎప్పుడు కైపెక్కించటం మానేస్తుందో ఆమెకు తెలుసు. అందుకే అతన్ని ఆమె ముందుకు రానీయటం లేదు. "రేపు" అతనిలోని ఆశ చావకుండా పోషిస్తోంది.

    "మీ మాటలు మధురంగా ఉంటాయి"

    "అవి విని ఆనందించటమే గాని, ప్రతిఫలం ఇవ్వాలనిపించదా?"

    "ప్రతిదానికీ ప్రతిఫలాన్ని ఆశించాలా? అయినా ప్రతిఫలాపేక్షతో నన్ను ఉబ్బేయటానికి ఆ మాటలు అంటున్నారా? నిజానికి నాలో లేదా అందం?"    

    అలాంటి సంభాషణకు విరామ చిహ్నం ఉండదు. ఆ రెండు శరీరాల మధ్య దూరం కూడా కొనసాగవలసిందేనేమో.

    వెన్నెట్లో విహరించే విహంగాన్ని చూసి చలించి పోయే బలహీనమైన గుండె వరరుచిది. పైగా ఎండమావి దిశగా సాగిన పరుగు. గుండె ఆగింది అలసి, సొలసి.

    కోటేశ్వరం ఒక నమ్మకస్తుడైన భాగస్వామిని కోల్పోయినాడు. "స్నేహితుడిగా వరరుచి చోటు ఎవరూ భర్తీ చేయలేరు" అని భార్య దగ్గర ప్రకటించాడు.

    ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. వ్యాపారం దేని గురించి ఎవరి గురించి ఆగరాదు.

    భార్యకు సంబంధించినంత వరకు వరరుచి లేని లోటుని వరహాలు అతి తక్కువ కాలంలో భర్తీ చేశాడు. అతగాడిలో ఓపిక తక్కువ. ఆమెను చూసి చూసి, ఆమెతో ఏకాంతాలు గడిపి గడిపి, ఆమె అందాన్ని పొగడి పొగడి (ప్రయోజనం లేక) - ఆ పనులు ఇక చెయ్యలేక ఆమెను ఒదిలేసి సొంత భార్య అందంతో సరిపుచ్చుకున్నాడు. ఆమె అందాన్ని పొగడే పాత్ర వరహాలు వారసుడు మరొకడు అందుకుని మోసి మోసి ఆ పని చేయలేక చచ్చి సాధిస్తానని బెదిరిస్తూ వచ్చాడు. "చస్తే చావనీ. భట్రాజులకు కొదవా" అనుకుంది శైలజ. చావలేక ఆమెను వదిలేసి బతికి బట్ట కట్టాడు.    

    వరరుచి పోయి, వరహాలు వచ్చాడు. వరహాలు పోయి, మాణిక్యాలు వచ్చాడు. అతడూ వెళ్లిపోయాడు. వజ్రం వస్తాడు, లేకపోతే మరో మగ జంతువు. వాళ్లనించి ఆమె ఆశించేది ఒకటే. వాళ్లు ఆమె నుంచి ఆశించేది ఒకటే. ఆ రెండూ ఒకే లాంటివి మాత్రం కాదు. కాసేపు ఈ వ్యవహారం అలా ఉండనిద్దాం.

    ఏళ్లు గడిచినా కూతురి కడుపున కాయ కాయనందున ముసలి తల్లిదండ్రులు దిగులు పడ్డారు. నానా గడ్డీ కరిచి పోగేసిన సంపదలకు సార్థకత కావాలి. అదేంటయ్యా అంటే తరువాతి తరాల వాళ్లకు అనుభవించేందుకో, తగలేసేందుకు బదిలీ చెయ్యటం. వైద్యుడికి చూపించుకోండని అల్లుణ్ణి, కూతురుని శతపోరారు. "తొందరెందుకు మావగారూ - వయసేం మించలేదుగా" అంటున్నాడు అల్లుడు, వాళ్లకు అతను దొరికినపుడు.

     "మీ వయసు మీరిందో లేదో అటుంచండి అల్లుడుగారు. మనవణ్ణి చూడకుండా మేం పైకి చేరుకుంటామేమోనని దిగులు."

    "మీ గురించి మమ్మల్ని పిల్లలు కనమంటారా నాన్నగారూ? ఇపుడు వచ్చిన నష్టం ఏమిటి?" కూతురు అంటూ పిరుదులు తాకే నల్లతాచు జడను, జారుడు శిలాఫలకం లాంటి చదునైన పొత్తికడుపును, పొగరైన గుండెలను చూసుకుంటుంది అద్దంలో.   

    వారసుడు లేని జీవితం వృథా చృథా అనుకుని దిగులుపడి మీసాలాయన మంచం ఎక్కాడు. ఎక్కీ దిగులు పడటం మానలేదు. దిగులు లేకుండా పోవడానికి కాదు అతను మంచం ఎక్కింది. భార్య చేత సేవలు చేయించుకోవడానికి కాదు. అయినా ఆమె సేవలు చేస్తోంది. ఆయన మంచం మీద వెల్లకిల పడుకుని రోజులు లెక్కపెడుతున్నాడు, దిగులు పడుతూనే. ఆ సేవల వల్ల ముసలామెకు కాలక్షేపం అవుతోంది.    

    వెన్నెట్లోనో, చలిలోనో, వానలోనో - ఒంటరిగా దొరికీ దరి చేరనివ్వని అందాల బొమ్మకై ఒకరు ఖాళీ చేసిన చోటు మరొకరు ఆక్రమించుతుండగా, వ్యాపార వ్యవహారాలతో ఊపిరి తీసుకునే వ్యవధి లేక కోటేశ్వరం కొట్టు మిట్టాడుతుండగా, శైలజ శైలజ అందంతో ప్రేమను కొనసాగిస్తుండగా -

    గడవటం మాత్రమే తెలిసిన కాలం గడిచింది. కర్కోటక కాలకూట విషం కాలం. హృదయాల (ఇవి అందరికీ ఉండవేమో), శరీరాల (ఇవి అందరికీ ఉంటాయి) బాధలను, గాయాలను మాన్పే కాలమే ఆరెండింటిని శిథిలం చేస్తుంది. వార్ధక్యాన్ని చాపక్రింద నీరులా తెచ్చిపెడుతుంది. ఉన్నట్టుండి ఏదో ఒక మాయ రోగం సోకేట్లు చేస్తుంది, చావుకు నాంది ప్రస్తావనలా.

    శైలజమ్మ వైద్యశాల పాలయింది. వైద్యశాలలో నిలువుటద్దాలు లేవు. ఎవరికీ అంతుపట్టని రోగం అది. రోగకోశంలో లేని రోగమది. ఏవైద్య పరీక్షా నిర్థారించలేకపోయింది. వింత మనిషికి, వింతైనదే రోగం.

    ఆరు నెలలు పీడించి, ప్రాణాలతో వదిలి, దయతలచి (రోగిని, వైద్యులను కూడా) ఇక శలవు అంది.

    శైలజమ్మ ఇల్లు చేరింది. కారు దిగి మెట్లెక్కుతోంది. పరిసరాలలో మార్పన్నది లేదు. ఇంటి ముందు లాన్ పచ్చపచ్చగా, పట్టులా వుంది. ప్రహారీ గోడ దగ్గిరగా చుట్టూ వేసిన బోగన్‌విలా, అశోకా, యూకలిప్టసులు పురావస్తు ప్రదర్శనశాల కాపలాదారులావున్నాయి. ఏ నీటి మడుగులోనో ప్రతిబింబాన్ని చూసుకోవడానికన్నట్లు ఒంగిన నీలాకాశం. చెట్లపై భాగాల మీద ఆఖరి వెలుగు. మరి కొంతసేపటికి చీకటిలోనో, వెన్నెట్లోనో ఒంటరి పక్షులు అందని ఎత్తున వెళతాయి. మనసున్న పక్షో, ఆర్ద్రతవున్న మబ్బుతునకో వదలిన నీటి బొట్టో, కన్నీటి బొట్టో రాలుస్తుంది - అది తాకిన ఏ శరీరం నుంచో అయ్యో అన్నమాట వెలువడదా అన్నట్టు.    

    కొంతకాలంగా శైలజమ్మ గది తలుపులు మూసి ఉంచారు. ఈ రోజు ఉదయం శుభ్రం చేశారు. తెరలు మార్చారు. అద్దాలు తుడిచారు. జ్ఞానానికి ఆహ్వానం పలుకుతున్నట్లు కిటికీ రెక్కలు తెరచి ఉంచారు. అద్దం ముందు నిలబడదామనుకుంది.మనసు మార్చుకుంది. ఎందుకో ఆమెకే తెలియదు. తూర్పు కిటికీ దగ్గరికి వెళ్లింది. గాలి చెప్పే ఊసులు వింటున్నాయి ఏపుగా ఎదిగిన చెట్లు. సముద్రం మీదినించి వచ్చే సాయంసంధ్యా చల్లటి గాలి పరామశిస్తూ ఆప్యాయంగా తాకుతోంది శరీరాన్ని. ఒంటరిపక్షి, దాని కన్నీటి బొట్టు, వెన్నెల అన్నమాటలు మనసులో మెదిలాయి.

    అద్దం ముందుకు వెళ్లింది. "తన" ప్రతిబింబం కనబడటం లేదు. అద్దం అబద్ధం ఆడుతోంది. పాలరాతి నేల మీద కూలిపోయింది శైలజమ్మ.

(ప్రజా సంస్కృతి మాసపత్రిక అక్టోబరు 2002 సంచికలో ప్రచురితం) 

Comments