ముదిమనసు - కల్లూరు రాఘవేంద్రరావు

    "అయ్యా! బండి ఆపు..."     అప్పుడే ఆకాశంలో అతి కాంతివంతంగా మెరిసిన ఒక మెరుపురేఖ వెలుగులో బండి వాడు ఆమెను చూచాడు. ఆమె వయసు ముదిరిన స్త్రీ. ప్రయాణ బడలిక ఆమెలో బాగా కనిపిస్తూంది. ఆమె చంకలో పాత బట్టల పెద్ద మూట ఒకటి ఉంది.     లోకం చీకటితో స్నేహం చేయబోయే సమయ మది. కారు మబ్బులతో భయంకరంగా ఉంది ఆకాశం. అప్పుడప్పుడు మేఘగర్జనలు కూడా వినిపిస్తున్నాయి. గాలికూడా వేగంగా వీస్తూంది.     మబ్బులు వర్షించడం ప్రారంభించాయి.     "ఎక్కడిదాకా, తల్లీ? దౌనుండి వస్తుంటివి?...ఎక్కు...బండెక్కు. మబ్బు కురుస్తూంది" అన్నాడు బండి వాడు.

    జనసంచారం లేని ఆ బండి త్రోవలో నడిచి వస్తున్న ఆ ముసలిదాన్ని గమనించి, అలా ఒంటరిగా వదిలిపోవడానికి అతడికి మనసొప్పలేదు. ఖాళీగా ఉన్న బండిలోనికి మూటను గిరాటేసి, 'రామచంద్రా! అంతా నీ దయ...' అంటూ, "నూరేండ్లు బ్రతకరా, నాయనా!" అంటూ బండి వాణ్ణి ఆశీర్వదించింది ముసలావిడ. నవ్వుకొన్నాడు బండివాడు.
    "నూరేండ్లు బతికి నన్నేం సేయమంటావు, పెద్దమ్మా! నాకేం పిల్లా,పీచా...భూమీ బుట్రా - " చెలుకోలుతో ఎద్దుల్ని అదలిస్తూ అన్నాడు బండివాడు. ఎద్దులు చిరుగంటలను శబ్దం చేసుకుంటూ వేగంగా కదలిపోతున్నాయి.     'ఈ కాలానికి నీవే పుణ్యాత్ముడవయ్యా!' అంటూ అతణ్ణి మెచ్చుకొంది ముసలావిడ మనసులోనే.     ఇంతలోనే మేఘమొకటి గట్టిగా ఉరిమింది. మెరుపుతీగ ఉద్ధృతమైన కాంతితో తళుక్కున మెరిసి మాయమైంది. వృద్ధురాలి మనసు కలత చెందింది.

    "వానెక్కువైందే...త్వరగా బండి పోనీ, నాయనా! రైలు కెళ్ళాలి" అంది ఆకాశం వంక చూస్తూ ముసలావిడ. వీస్తున్న చలిగాలికి తట్టుకోలేక చీర కొంగును గట్టిగా తలకు చుట్టుకోగలిగిందే కాని, ముసురుతున్న ఆలోచనల్ని అదుపులో పెట్టుకోలేక పోతూంది ముసలావిడ. అవి చలిగాలికంటే అమితంగా ఆమెను వణికించేస్తున్నాయి. గుండె ఎందుకో కొట్టుకొంటూంది వేగంగా. ఒక్కొక్కసారి అన్నింటిని మరిచి, గుండె నిబ్బరం చేసుకొని, ఎంతో హుషారుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూంది. ఆ పాపపు పరిసరాలు దాటి తానెంత దూరంగా ఉంటే అంత మంచిదనుకొంటూంది ఆమె. సాధ్య మైనంత త్వరలో ఈ స్మృతులను మనసులోంచి తొలగించుకోవాలని, ప్రశాంతతను పొందాలని వివిధ రకాలుగా ఆవిడ ప్రయత్నిస్తూంది కాని, అవి వీడడం లేదు.

    "పెద్దమ్మా! నే రైలుకాటికే ఎలుతున్నా...అయ్యోరి కెరుకున్నోరు ఈ యాళ రైల్లో వత్తారు. ఆళ్ళను తోడుకురావాలి. ఇంకా పొద్దుంది రైలొచ్చేందుకు" అంటూ ఎద్దుల్ని కొంచెం అదిలించాడు బండివాడు.
    కొన్ని నిమిషాల్లో బండి రైలుస్టేషన్ చేరింది.

* * * * *
    ఒంటరిగా కూర్చుంటే తన్నిక ఈ ఆలోచనలు చంపుకు తినక మానవనే భయంతో అవ్వ ఆడవాళ్ళు కూర్చున్న వెయిటింగ్ రూములో ఒక మూల కూర్చుంది, బిక్కుబిక్కుమంటూ.
    అవ్వ కుమిలి కుమిలి ఏడుస్తూంది. ఆమె దుఃఖం ఆగడం లేదు. ఒక్కోసారి కోపంతో పళ్ళు పటపటలాడిస్తూంది. మనస్సు ఒకచోట కూర్చోనివ్వడం లేదు. కుతకుత లాడుతున్న మనసు నెంతగా కుదుట పరచుకొందామన్నా సాధ్యం కాకుండా ఉంది. చెప్పుకొందామన్నా నోరు పెగలడం లేదు. తన గోడు చెప్పినా వినేవారు లేదు. బిడ్డలను కన్న ప్రతి తల్లికి వచ్చే వేదన తుద కిదేనని తెలిసి ఉండి కూడా సంకటం తీరడం లేదు ఆమెకు. ఇంతకూ ఆమె కెవరున్నారని? కన్న బిడ్డలే కాదన్నప్పుడు - ఆమె గోడు వినే నాథుడెవడున్నాడు?
    వర్షం కుండపోతగా కురుస్తూంది. వెయిటింగ్ రూము రేకుల షెడ్డుపై పడ్డ వర్షపు ధారకు శబ్దం మరింత అధికమైంది. రూములో చిన్న పిల్లల గోల అధికమైంది. తల్లులు పలురకాలుగా సముదాయిస్తున్నారు. పై కప్పుకున్న చిల్లుల నుండి పడ్డ వర్షపు నీటికి గది పూర్తిగా తడిసిపోయింది. ఎక్కడ లేని గోల తయారయిందక్కడ. 

    "అవ్వా! ఆ మూలలో కారుతున్నా అలాగే బొమ్మలా కూర్చున్నావే... తడుస్తున్నా తెలివిరాలేదా? కొంత సర్దుకో. పరుపు తడిసిపోతూంది. తీసుకోవాలి" అంటూ ఒకావిడ అవ్వపై రుసరుసలాడింది.
    అప్పటికి కానీ తెలివిరాలేదావిడకు. అప్పటికే తన పక్కనున్న బట్టల మూట కాస్తా తడిసి ముద్దాయింది. ఒళ్ళు సగం నానింది. తన పరధ్యానానికి తానే విసుక్కొంది మనసులో ముసలావిడ.     "నాయనా! రైలింకా ఏ వేళ కొస్తుంది?" అంటూ పెట్టెలు, పరుపులు సర్దడంలో భార్యకు తోడ్పడుతున్న వ్యక్తిని ప్రశ్నించింది అవ్వ.     "వచ్చేవేళ కొస్తుంది. నీవు కొన్నావా? నేను కొన్నానా? అదొచ్చి ఆగినప్పుడు ఎక్కి వెళ్ళడం మన వంతు...అంతే...అంతకంటే మాకేం తెలియదు" అంటూ కసురుకొన్నాడా మనిషి కటువుగా.     'నిజమే, పిల్ల లొక వంక గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూంటే, ఒక పక్క పెట్టె, పరుపులు తడిసిపోతూంటే, పుడకలా అడ్డొచ్చిన నాకెక్కడ సమాధానం చెప్పగలడు? పాపం!' అంటూ తన మనసులోనే గొణుక్కొంటూ సమాధానపడింది ఆ ముసలావిడ.

    ఎక్కడి నుండి పరిగెత్తు కొచ్చిందో కుక్క, దాని పిల్లలతో బిలబిలమంటూ వచ్చి చలికి అవ్వ కూర్చున్న సిమెంటు బల్ల క్రిందికి చేరింది. ఆ కుక్కపిల్లలు తల్లి చుట్టూ చేరి, ఆ వెచ్చని చోట పాలు తాగుతున్నాయి ఆనందంగా.     అవ్వకెందుకో వాటిని చూస్తూంటే విసుగ్గా ఉంది.     "నీకెందుకే ఈ పాడు ప్రీతి? ఇవన్నీ నిన్నిలాగే చూస్తాయనుకొన్నావా?" అంటూ చీదరించుంటూ దూరంగా వెళ్లి కూర్చుంది.     ఆకలి కొక్కటే గోల చేస్తున్నారు పిల్లలు, వెయిటింగ్ రూములో. ఒకరి నొకరు కొట్టుకుంటున్నారు ఆకలితో. నానా రకాలుగా కుర్రాళ్ళను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులు. 'తెచ్చిన ఇడ్లీల పొట్లంలోని ఇడ్లీలు తలా ఒక్కటి కూడా రాలేదేమిటా?'అని నెత్తి బాదుకుంటున్నాడు తండ్రి. తమ కోసం తెచ్చుకొన్న వాటిని కూడా వాళ్ళకే పెట్టి, వాళ్ళ ఆకలి తీరితే చాలని సమాధానపడుతున్నారు తల్లిదండ్రులు.

    అవ్వ ఆ దంపతుల ఓర్పుకు సంతోషిస్తూ, 'నీ కడుపు నిండిందో, మాడిందో వారికి కాబట్టదురా నాయనా...! పన్నెండు మంది పిల్లలు తల్లికి భారమేమీ కాదు కానీ, ఒక తల్లి పోషణ అంతమందికి భారమే అవుతుంది' అంటూ ఆ పిల్లల గోలకు మండిపడుతూ, వారి వైపు చుర చుర చూసింది.
    అవ్వ కడుపు కరకర లాడుతూంది. తన చీర చెరుగులో ముడేసుకున్న చిల్లరకూడా ఎక్కువగా లేదు. ఆ కొంచెం డబ్బుతో ఎంత దూరం పోగలదు? దాన్ని ప్రయాణానికే వాడుకోవాలి, మరి. ఆకలి తీరేందుకు వీలేలేదు.
    ఎప్పుడో పొద్దున్న తిన్న అన్నం, కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి ముసలావిడకు. కొడుకు విషయం జ్ఞాపకానికొచ్చి ఒళ్ళుమండింది. పళ్ళు పటపటమని కొరికింది అప్రయత్నంగా. ఆవిడ కడుపెంత కరకరలాడుతూందో మనస్సంత కుతకుత లాడుతూంది. దుఃఖం ఆగలేక వచ్చేస్తూంది. ఆమెకిప్పుడు తోడెవ్వరూ లేరు. భర్త దూరమైన నాటి నుండి కొడుకు పంచలోనే పడి ఉంది. ఆ కొడుకు తండ్రి ఆస్తికి వారసుడు మాత్రమే అయ్యాడు. తల్లి పేరిట ఉన్న ఒక ఎకరా పొలం - ఆవిడకు పసుపు కుంకుమగా ఇచ్చింది కూడా తనకే ఇవ్వమంటూ నానా రభస చేస్తూంటాడు. ముసలావిడ ఏమో దాన్ని తన కూతురుకు పసుపు కుంకుమగా ఇవ్వాలని ఉద్దేశ్య పడింది. అది ససేమిరా కుమారునికి ఇష్టం లేదు. రోజూ ఈ విషయంగానే తల్లిని బాధిస్తూంటాడు కొడుకు. రోజురోజుకు ఈ వేదన మరింత ఎక్కువైంది. కొడుకు తల్లిని ఇంటి నుండి గెంటి వేసే దశకు వచ్చింది పరిస్థితి. ఆ హింసకు తట్టుకోలేక ఎటైనా వెళ్ళి పోదామని బయలుదేరింది, ముసలావిడ. ఆవిడకు సంతానంపై ఎనలేని ఏవగింపు కలిగింది. వారికెంత దూరమైతే అంత మేలని తలచింది ఆమె.     ముసలావిడ మస్తిష్కంలో లేస్తున్న సుడిగుండాలకు అంతే లేదు. ఆ వార్ధక్యమలా వేధిస్తూంది. వయసుకు, మనసుకు పొత్తు ఉండదు. మనసు విచక్షణను కోల్పోతుంది. మనసు పరిపరి విధాల పరిగెత్తుతుంది. గత విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా శరీరం కోస్తున్నంత బాధగా ఉంటుంది ఆమెకు. కుమారుల పురోభివృద్ధికి, శ్రేయస్సుకు తల్లితండ్రులు ఎంతగానో శ్రమించి, ప్రేమప్రదమైన పూలబాటలను వేస్తారు. తుదకు తాము ముళ్ళ బాటల్లో జీవితాన్ని సాగిస్తారు. "ఏమైనా తల్లితండ్రులుకూడా పుణ్యం చేసి ఉండాలి. లేకుంటే ఈ నరకయాతన తప్పదు" అంటూ ముసలావిడ ఓ నిట్టూర్పు విడిచింది.     ఆవిడ మనసులోని ఆలోచనలకు, కడలి లోని అలలకు అంతే లేదు.     స్టేషనులో గంట గణగణ మని మోగింది. వేచి ఉన్న వారి ముఖాల్లో ఆనందం తాండవమాడింది. అవ్వ బట్టలు సర్దుకుంది. తన దగ్గరున్న చిల్లరతో టిక్కెట్టు మాత్రం కొనగలిగింది. రైలు ఆగగానే బిలబిలమంటూ ఎవరి ఆత్రుత కొద్దీ వారు రైలెక్కారు. రైలు స్టేషన్ వదిలేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటింది. రెండు గంటలు ఆలస్యంగా వచ్చి చేరింది రైలు అక్కడికి. నిద్ర మత్తులో తూలుతున్నారు పెట్టెలలోని ప్రయాణీకులు. అవ్వ ఒక బల్లమీద కూర్చుని ఆకాశం వంక చూస్తుంది.

    మేఘాలు నిర్మలంగా ఉన్నాయి. తారలు మిణుకుమిణుకు మంటున్నాయి. ముసలావిడ మనసుకు కొంత నెమ్మది ఏర్పడింది. రైలు కూత తీసుకుంటూ అతి వేగంగా కలిసింది.
    పరధ్యానంలో ఉన్న అవ్వ తలపై కెత్తింది. బెర్తుపై పడుకున్న యువకుడెవడో మేల్కొని కిందికి దిగబోతూ కాళ్ళు తగిలించాడు.     'ఎంత పొగరు!' కోపంగా మనసులో తిట్టుకుంది ఆవిడ.     "క్షమించండి. పొరబాటు జరిగింది" అంటూ వినయంగా ప్రాధేయ పడ్డాడు కుర్రాడు, బెర్తు దిగుతూ చేసిన తప్పు తెలుసుకుని.     "ఫరవాలేదులే, నాయనా! నీవు ఒక రకంగా మంచివాడివే నా కాళ్ల కడ్డం ఎందుకు వచ్చావని కసురుకోలేదు నీవు" అంది ముసలావిడ నవ్వు ముఖంతో. అతని కళ్ళలో నిద్రమత్తు ఇంకా తేరలేదు. తూలుతున్నాడు.
    తువ్వాలు, సబ్బుపెట్టె తీసుకుని బాత్‌రూములోకి నడిచాడు. తరువాత, పది నిమిషాల కల్లా బయటికి వచ్చి, పెట్టె, పరుపు సర్దుకుంటూ దీర్ఘాలోచనలో ఉన్న అవ్వగారిని, "మీదే ఊరు?" అంటూ ప్రశ్నించాడతడు. ఊరి పేరు చెప్పింది అవ్వ.

    "నేను అక్కడే దిగాలి. నీకు తోడుంటాలే అవ్వా" అన్నాడతడు ఆవిడ ఆలోచన కనిపెట్టి.
    "అయ్యో! ఆ ఊరప్పుడే దాటిపోయిందే! నేనక్కడే ఎక్కాను" అంటూ ఆత్రంగా పలికింది ముసలావిడ యువకునితో.     ముసలావిడ మాటల కతను విస్తుపోయాడు. పక్క నున్న మరో ప్రయాణికుణ్ణి ప్రశ్నించాడు. నిజమేనని తేలింది తుదకు. తన నిద్ర మత్తుకు తానే నిందించుకున్నాడు మనసులో అతడు.

    "ఎంత పొరబాటై పోయింది! నా కోసం స్టేషనుకు బండి కూడా వచ్చి ఉంటుంది" అంటూ వాపోయాడా యువకుడు.
    "నిజమే, నాయనా! బండొకటి స్టేషనుకు వచ్చింది. నేను ఆ బండిలోనే స్టేషనుకు వచ్చాను. బండివాడు ఈ రైల్లో ఎవరో పెద్దాయన వస్తాడని అన్నాడు" అంది అవ్వ ఆశ్చర్యంగా.     "అవును. నన్ను ఆనందపాళ్యంలో కొత్తగా పెట్టిన అప్పర్ ప్రైమరీ స్కూలుకు హెడ్‌మాస్టరుగా వేశారు. నేనక్కడికే వెళ్ళాలి. ప్రెసిడెంటుగారు బండి పంపి ఉంటారు" అన్నాడతను.     "ఆ ఆనందపాళ్యానికి రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న చిన్న కోటలో మేము ఉన్నాం" అంది అవ్వ ఆనందంగా.     "ఆ ఊర్లో టీచర్ నారాయణరాజు మీకి తెలిసే ఉంటారు. వాడు నా బాల్యస్నేహితుడు. మీకు తెలిసే ఉంటాడతడు" అంటూ ఆత్రతగా అన్నాడతడు.     "తెలుసు" ముక్త సరిగా జవాబిచ్చింది అవ్వ.
    "నేను వాళ్ళ నాన్న దగ్గిరే చదువుకున్నా నవ్వా! ఆయన భార్య నన్ను కన్నతల్లి కంటే మిన్నగా చూచుకుంది. ఆవిడ అక్కడే ఉందా? ఆవిడ అక్కడే ఉందా? ఆవిడను నేను కలుసుకోవాలి. నేనింత వాడినయింది వారి ఆశీర్వాదంతోనే" అన్నాడతడు ఆనందంగా.

    "నాయనా! నీ పేరు?" అంది ముసలావిడ గద్గద కంఠంతో, ఆమె కళ్ళలో ఆనందభాష్పాలు నిండాయి.
    "రామాంజనేయులు" అన్నాడతడు.     "మీ నాన్నగారి పేరు?" మరొక్క సారి ప్రశ్నించింది ముసలావిడ ఆత్రతగా.     "రేణిగుంట రాఘవరావుగారు."     అంతవరకూ కల్లోలితమైన ఆవిడ మానస సరోవరంలో ప్రశాంతత ఏర్పడింది. సంతోషంతో గొంతు బొంగురుపోయింది.     "రామాంజీ! ఎన్నాళ్ళకు చూచాన్రా! ఆ దుర్మార్గపు నారాయణరాజు తల్లిని నేనేరా" అంది అతి దుఃఖంతో.     "అమ్మా! అంటూ పలికాడొక అమృతవాక్కు రామాంజనేయులు. ఆ తల్లి పాదాలకు అక్కడే నమస్కరించాడతను. నిండు హృదయంతో ఆనందంగా ఆశీర్వదించింది ముసలావిడ.     "...మీ ప్రయాణం ఎందాకా?" అన్నాడు రామాజనేయులు. ఆమె కళ్ళలో తిరుగుతున్న దుఃఖాశ్రువులు ఆనంద భాష్పాలుగా మారాయి.     "ఎక్కడికీ లేదు నాయనా! నీ జతలోనే దిగేస్తాను. నీతో ఊరికొచ్చేస్తాను" అంది ముసలావిడ నవ్వుతూ.     "అలాగే మీరెక్కడికీ వెళ్ళకండి. మీ ఋణం తీర్చుకోవాలనే మీ దగ్గరికి వస్తున్నాను" రామాంజనేయులు హృదయపూర్వకంగా తన కన్నీటితో తల్లి చరణాలు కడిగాడు. ముది మనసులోని వ్యథ తీరింది. గాఢంగా కుమారుణ్ణి కౌగిలించుకుంది.

(ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం 13-3-1977 సంచికలో ప్రచురితం)
Comments