మూడో మనిషి! - వింధ్యవాసిని

    ఉదయం వచ్చిన పేపరు మొదటి పేజీలో పడిన వార్త పరంధామయ్యను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. భార్య విశాలమ్మ తెచ్చి పెట్టిన కాఫీ చల్లారి పోతున్నదని కూడా మరిచిపోయి, ముందుకు చదివాడు. విషయం తెలిశాక ఇంకొకరితో పంచుకోకుండా ఉండలేకపోయాడు. మనుమరాలు అమృత ఇంకా నిద్రలేచినట్లు లేదని, "విశాలూ! ఇలా రా! నీకో సంగతి చెప్పాలి!" అని కేక వేసి వంట గదిలో ఉన్న భార్యను పిలిచాడు. 

    రాత్రి ఆలస్యంగా పడుకున్న అమృత వర్షిణికి ఇంకాస్సేపు అలాగే పడకలో ఉండాలనిపించింది. కానీ తనది కాస్త తేలిక నిద్ర కాబట్టి తాతయ్య అరుపులకు ఆమె నిద్ర చెడింది. లేచి నలిగిన బట్టలు సర్దుకుంటూ బయటికొచ్చింది. హాల్లో పేపరు వైపు చూస్తూ ఆదుర్దాగా మాట్లాడుకుంటున్న తాతయ్య, నాన్నమ్మలను చూసి కుతూహలంగా "ఏమయింది?" అంటూ వాళ్ళదగ్గరికి వెళ్ళింది.

    పరంధామయ్య ఏం మాట్లాడకుండా, తామిద్దరూ పేపర్లో చూస్తున్న వార్తను చూపించాడు. పేపర్ చేతికి తీసుకుని ఎరుపు అక్షరాలతో హెడ్‌లైను ఉన్న బాక్స్ ఐటం వైపు దృష్టిని సారించింది అమృత. 

    "హీరోనా ... జీరోనా" అన్న హెడ్‌లైన్ క్రింద ఉన్న ముఖ్య వివరాలు చదివింది. "వర్ధమాన హీరో ప్రతీక్ కుమార్ ఖూనీ చేసి పట్టుబడ్డాడని పోలీసు మూలాల ద్వారా తెలిసింది. అతను నటిస్తున్న కొత్త సినిమా "చంద్రుడు" ను తయారు చేస్తున్న ప్రొడక్షన్ కంపెనీ జయరాం ఎసోసియేట్స్ ప్రొడక్షన్ మేనేజరు సుమిత్ రస్తోగిని ఖూనీ చేసి ..." అమృత ఇంకా చదువుతుండగానే, పరంధామయ్య టీవీ ఆన్ చేశాడు. టివీ నైన్లో అదే వార్త వస్తోంది. 

    యాంకర్ చెప్తున్నాడు. ".... సుమిత్ రస్తోగి ఇంటి పనిమనిషి అనుమానించి ఫోన్ చేస్తే ఆయన ఇల్లు చేరిన పోలీసులకు ఆ ఇంటి హాల్లో చచ్చిపడి ఉన్న రస్తోగి కనిపించాడు. శవం పక్కనే చేతిలో బరువయిన కనకదుర్గ అమ్మవారి కంచు విగ్రహంతో బాటు వర్ధమాన హీరో ప్రతీక్ కుమార్ పోలీసులకు దొరికాడు. విగ్రహం మీద రక్తం గుర్తులున్నాయి. ప్రతీక్ ఆ విగ్రహంతో సుమిత్ రస్తోగిని కొట్టి చంపి ఉండాలని పోలీసుల అనుమానం! సోఫా పక్కన కింద పడి ఉండి దొరికిన కవర్లో యాభయి లక్షల రూపాయలు దొరకడం ప్రతీక్ మీద అనుమానాన్ని బలపరుస్తోంది!" చూస్తున్న కళ్ళను, చెవులతో వింటున్న మాటలను నమ్మలేకపోయింది అమృత. 

* * * 

    ప్రతీక్ అమృత కుటుంబానికి చాలా ఏళ్ళుగా తెలుసు. కర్నూల్లో వాళ్ళింటి ఎదురిల్లు ప్రతీక్ వాళ్ళది. ప్రతీక్‌కు చిన్నప్పట్నుంచీ అభినయంలో అభిరుచి. నాటకాలంటే పిచ్చి. 

    అమృత బాల్యంలోనే  కొడుకు కోడలు ఆక్సిడెంట్లో చనిపోతే పరంధామయ్య దంపతులే అమృతను పెంచి పెద్దచేశారు. ఆమె స్కూల్ ఫైనల్ అయ్యేసరికి ముగ్గురూ హైదరాబాదు చేరుకున్నారు. ఈమె డిగ్రీ ముగించి, ఎల్ఎల్‌బీ చేసి ఒక సీనియర్ లాయర్ దగ్గర ఎప్రెంటిస్ చేస్తోంది. రెండేళ్ళ క్రితంవరకూ ప్రతీక్ గురించిన వివరాలేం వీళ్ళకు తెలియవు. కానీ రెండేళ్ళ క్రితం ప్రతీక్ టీవీ అవకాశాల కోసం హైదరాబాదు చేరుకున్నప్పట్నుంచీ, అమృతతో అతని స్నేహం మళ్ళీ చిగురించింది.

    నిజానికి పరంధామయ్యకు ప్రతీక్ అన్నా, అతని నటనను తన వృత్తిగా చేసుకోవాలన్న ఆశయం అన్నా ఇష్టం లేదు. చిన్నప్పుడే తండ్రి పోయిన ప్రతీక్ తల్లి, చెల్లెళ్ళు అతని చిన్నాన్న ఇంట్లో ఉంటారు. వాళ్ళ బాధ్యత ఇతని మీదే ఉన్నా ఆ విషయాన్ని అతను సీరియస్‌గా తీసుకున్నట్లు ఆయనకు అనిపించదు. తమ మనుమరాలు, ప్రతీక్‌ల మధ్య ఒట్టి స్నేహం తప్ప ఇంకేం లేదని అయనకు తెలిసినా అమృత అతనికి దగ్గరవటం ఆయనకిష్టం లేదు. అందుకని ఇప్పుడీ వార్త తెలియగానే ఆమె ఎలా స్పందిస్తుందోననని కుతూహలంగా చూస్తున్నాడు. ఆయనకా క్షణం లో అమృత ఒక లాయర్ కూడా అన్న విషయం గుర్తు రాలేదు. 

    ఆయన అనుకుంటున్నదేమీ కాకముందే, టీవీ ప్రక్కన టేబుల్ మీదున్న ఫోను మోగింది. ఫోను పరంధామయ్యే తీసుకున్నాడు. శ్రీనగర్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచీ ఫోను. అమృత ప్రాక్టీసు క్రిమినల్ లా కాబట్టి పోలీసు స్టేషన్ కాల్స్ కొత్తేం కాదు. కానీ తనకు విషయం చెప్పి రిసీవర్ అందించినప్పుడు అమృత ముఖంలో కనిపించిన ఆశ్చర్యం ఆయనకు ఇదేదో ప్రస్తుతం పనిచేస్తున్న కేసు కాదని చెప్పింది. 

    "హలో" అన్న అమృతకు సమాధానంగా, "నేను ఇన్స్‌పెక్టర్ రఘురాం మేడం! అరెస్ట్ అయి మా స్టేషన్ లాకప్‌లో ఉన్న హీరో ప్రతీక్ కుమార్ మీకోసం అడుగుతున్నాడు."

    ఈసారి ప్రతీక్ స్వరం వినిపించింది బలహీనంగా. "వీళ్ళు నన్ను ఎరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నేనీ ఖూనీ చెయ్యలేదని ఎంత చెప్పినా నమ్మటం లేదు. నువ్వు ఒకసారి ఇక్కడికొస్తావా? నాకేం చెయ్యాలో తోచకుండా ఉంది."

    ఇది పెద్ద కేసు. తనకున్న అనుభవానికి తను స్వతంత్రంగా ఏమీ చెయ్యలేదు. అవసరమయితే తన సీనియర్ లక్ష్మణ మూర్తి తో చెప్పొచ్చు. ఆయనయితే ప్రతీక్‌కు బెయిల్ ఇప్పించగలరేమో? ఏమో చెప్పలేం, ఇదేమో "హై ప్రొఫైల్" కేసు. సినిమా హీరో, ఖూనీ! టీవీ చానల్స్‌కు కావలసిన మసాలా! అరక్షణంలో అన్ని ఆలోచనలూ అయిపోయి, ఏదేమయినా ఈపరిస్థితిలో తను వెళ్తే, ఏం చేయలేకపోయినా, ప్రతీక్‌కు ధైర్యంగా ఉంటుంది. అనుకుని ఒక నిర్ణయం తీసుకుంది, "ఒక గంట సేపట్లో నేనక్కడ ఉంటాను. నువేం కంగారు పడకు" అని చెప్పి పెట్టేసింది ఫోను.

    గబ గబా తయారయింది. ఆఫీసుకు ఫోన్ చేసి తనొచ్చేది లేట్ కావచ్చని, ఏదయినా అవసరమయితే తన మొబైలుకు ఫోన్ చెయ్యమనీ లక్షణ మూర్తికి మెసేజ్ పెట్టింది. అమృత మామూలుగా ఆఫీసుకు ఎక్కువగా వేసుకునే నలుపు జీన్స్ పాంటు, చిన్న గోధుమ రంగు చుక్కలున్న తెలుపు టీ-షర్ట్ తీసి ఆమె స్నానం చేసి రాగానే అందించింది విశాలమ్మ. టిఫిన్ ప్లేటు చేతికిచ్చి, కాఫీ చల్లార్చి ఇచ్చి, అమృత త్వరగా బయట పడటానికి సహాయం చేసిందామె. అరగంటలో అమృత హోండా ఆక్టివా స్కూటర్ శ్రీనగర్ కాలనీ పోలీసు స్టేషన్ వైపు వెళ్ళే మార్గంలో వేగం పుంజుకుంది. పరంధామయ్య మాత్రం జరుగుతున్నదేమీ తనకు రుచించనట్లు, ముఖం గంటు పెట్టుకోవడం తప్ప, ఆమెను ఆపేపని చెయ్యలేదు. ఆమె చేసే ఉద్యోగం, ఆ వృత్తి ధర్మం, తన స్నేహితులకోసం సహాయం చెయ్యటంలో వెనుకాడని మనుమరాలి మనస్తత్వం ఆయనకు తెలుసు!      

* * * 

    స్టేషన్ చేరే లోపల అమృత మనసంతా నిండుకున్న ఆలోచనలు! ప్రతీక్ తనకు చిన్నప్పట్నుంచీ తెలుసు. కాస్త దుడుకు స్వభావం. ఎవరి మీదయినా తనకు కోపం ఉంటే దాన్ని క్రియారూపంలో పెట్టనిది వదలడు. కావాలనుకున్నది సాధించే మంకు పట్టు. నటనే వృత్తిగా మార్చుకుని విజయం సాధించడం సులభం కాదని అతనికి తెలుసు. అందుకు తగినంత కాచుకోగల ఓర్పు, పట్టుదల అతనికున్నాయి. కానీ మామూలుగా "బిందాస్" గా ఉండే రకం. అతన్లోని ఆరూపమే తనకు ఇష్టం! మొదటిసారిగా వార్త తెలిసినప్పుడే తనకు తెలుసు అతడు ఈ ఖూనీ చేసి ఉండడని. మరయితే ఏం జరిగుండొచ్చు?

    ఈ గొడవ మధ్యలో తాతయ్యకు ప్రతీక్ అంటే ఎందుకో అంతగా పడదని గమనించింది. అభినయాన్ని జీవిత ధ్యేయంగా చేసుకోవడంలో తప్పేమిటో ఆమెకు అర్థం కాదు. అంతలో స్కూటర్ స్టేషన్ ముందు ఆగిందని గమనించింది. "తాతయ్య ఇష్టంతో పనేమిటి? నేనేం అతన్ని పెళ్ళి చేసుకోబోతున్నానా?" అనుకుని నవ్వుకుంటూ లోపలికెళ్ళి ఇన్స్‌పెక్టర్‌కు తనను తాను పరిచయం చేసుకుంది. లక్ష్మణ మూర్తి రఘురాంకు తెలుసు. కొన్ని సార్లు కోర్టులో కలిశాడు. అందుకని పరిచయాలు కాగానే, "మీరు ప్రతీక్ లాయరా?" అని అడిగాడు. 

    నిజానికి అమృత ఈవిషయం గురించి ఇంకా ఆలోచించలేదు. తన సీనియర్ తో మాట్లాడే వరకూ ఆమె ఏమీ చెప్పలేదు కూడా! అసలు ప్రతీక్‌కు ఏం కావాలో? వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు అతనికి వేరే ఏదయినా ఏర్పాటు చేస్తారేమో? కానీ "అవును" అంటే తను లాకప్ లోపలికెళ్ళి ప్రతీక్‌ను కలవొచ్చు. 

    ఒక కాన్స్‌టేబుల్ లాకప్ లోపల ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు. అమృత రాక గమనించి, ఒక మూలలో కూర్చుని దిగులుగా ఎటో చూస్తున్న ప్రతీక్ పెదవులు విచ్చుకున్నాయి. వెళ్ళి కుర్చీలో కూర్చుని, ధైర్యం చెప్తున్నట్లు అతని భుజం మీద తట్టి, "మొదట్నుంచీ అసలేం జరిగిందో చెప్పు," అని అడిగింది. 

* * * 

    జరిగిందానికి మూలం రెండ్రోజుల క్రితం కర్నూలు నుంచీ ప్రతీక్ అమ్మ సరస్వతి చేసిన ఫోన్ కాల్. చెల్లెలు అంకితకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఫోన్ చేసిన సరస్వతి సంబంధం వివరాలు చెప్తున్నవి ఇతడు వింటున్నా, అసలు విషయం డబ్బు గురించి వినడానికి కాచుకుని ఉన్నాడు. చివరికి చెప్పింది. "పది లక్షలు కట్నం అడుగుతున్నార్రా. ఇల్లమ్మి పెళ్ళి ఖర్చులు, బంగారు కొనటానికి సరిచెయ్యొచ్చు. నువ్వెలాగయినా ఈ డబ్బు చేరుస్తావన్న ధైర్యంతో ఒప్పుకున్నాను రా! మంచి సంబంధం. పోగొట్టుకుంటే కష్టం!"

    ప్రస్తుతం ప్రతీక్ దగ్గర పది లక్షలు కాదు గానీ పదివేలుండొచ్చు. "చంద్రుడు" ప్రతీక్ రెండో సినిమా.  కానీ హీరోగా మొదటి సినిమా! మొదటి సినిమా పారితోషికం ప్రొడ్యూసర్/డైరెక్టర్ కాశ్యప్ జయరాం ఇంకా ఇవ్వలేదు. ఆయనతోనే రెండో సినిమా చేస్తున్నందుకు, ఆయనకు వీలున్నప్పుడు ఇప్పిస్తాడని ఊరికే ఉన్నాడు ప్రతీక్. "చంద్రుడు" పూర్తి అయి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే వరకూ ఈ డబ్బు రాదు. తను ఇంకో నాలుగు సినిమాల్లో హీరోగా నటించేస్తే, పదిలక్షలు పెద్ద విషయం కాదు. కానీ అమ్మకు ఈ విషయం అర్థం కాదు. ఇప్పటికే అంకిత పెళ్ళికి ఆలస్యం అయిందంటుంది. 

    ఎప్పుడయినా సరే తన దగ్గర అంత డబ్బు ఉంటుంది అన్న ధైర్యంతో అమ్మకు ఇవ్వాల్సిన డబ్బు అప్పు చేద్దామనుకున్నాడు. సినిమా యూనిట్‌లో ప్రొడక్షన్ మేనేజరు సుమిత్ రస్తోగి దగ్గర అప్పు దొరకొచ్చని చెప్పుకుంటారు. నలభయి ఏళ్ళ పైన వయసున్న సుమిత్ యూనిట్‌లో అందరితో చనువుగా ఉంటాడు. ఆ వృత్తిలో తెలుగు, హిందీ సినిమా రంగాల్లో కలిపి ఇరవయి ఏళ్ళు పైనే అనుభవం ఉన్న సుమిత్‌ను కాశ్యప్ జయరాం కూడా గౌరవిస్తాడు. 

    ఒకసారి షూటింగ్ అయాక అవకాశం దొరికించుకుని సుమిత్‌ను డబ్బు అప్పడిగాడు ప్రతీక్. "రేపు సాయంత్రం షూటింగ్ అయాక, నాతో మా ఇంటికి రా. డబ్బు కాష్ ఇస్తాను," అని మాటిచ్చాడు. ఇద్దరూ మరుసటిరోజు, బుధవారం సాయంత్రం, శ్రీనగర్ కాలనీ దాటి కొత్తగా కట్టిన లక్జురీ ఎపార్ట్‌మెంట్స్ ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. "రెడ్‌వుడ్ హిల్స్" అనే బిల్డింగ్ లో సుమిత్ ఇల్లు పదో అంతస్తులో. పెంట్‌హవుస్ లో ఒక్కడే ఉంటాడు సుమిత్. అతను పెళ్ళి చేసుకోలేదని ప్రతీక్‌కు తెలుసు. అందుకని సుమిత్ తలుపు తాళం తీసి లోపలికి తీసికెళ్తున్నప్పుడు ప్రతీక్‌కు తెలుసు, లోపలెవరూ ఉండరని. సినిమా సెట్టింగ్‌లా అలంకరించి ఉన్న లివింగ్‌రూం లో కూర్చుంటే ఎంత హాయిగా ఉండొచ్చో అని అహ్వానిస్తున్నట్లుగా ఉన్న విశాలమయిన సొఫలో కూర్చోబెట్తుండగా లోపల్నుంచి పనిమనిషి ఒకావిడ, అప్పుడే, ఇంట్లో చేస్తున్న పని ముగించినట్లు బయటికి నడిచింది.

    లోపలికెళ్ళిన సుమిత్ రస్తోగి డ్రస్ మార్చుకుని పైజమా టీ-షర్ట్ వేసుకుని రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చాడు. సుమిత్‌తో ప్రతీక్‌కు అంత స్నేహమేం లేదు. తను డబ్బు తీసుకున్న విషయం యూనిట్లో అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ కాశ్యప్‌కు చెప్తాడేమోనని కాస్త భయం! ఎవరికీ చెప్పొద్దని ఇతనికి ఎలా అర్థమయేలా చెప్పడం అని లోలోపలే తర్జనభర్జనలు పడుతూ కూర్చుని ఉన్నందున, సుమిత్ లివింగ్ రూము కానీ, అందులో అందంగా అమర్చి ఉన్న ఫర్నిచర్ గాని, చుట్టూ షెల్ఫుల్లో, కిందా అలంకరించి ఉన్న వస్తువులు కానీ ప్రతీక్‌ను ఎక్కువగా ఆకర్షించలేదు. 

    ఇద్దరూ మర్యాద కోసం అన్నట్లుగా కొద్దిగా పిచ్చాపాటీ మాట్లాడుకున్న తర్వాత, సుమిత్, "డబ్బు తీసుకొస్తానుండు ప్రతీక్!" అని లోపలికి వెళ్ళాడు. అతను కొన్ని నిముషాలు లోపలికి వెళ్ళేసరికి, ఏమీ తోచక చుట్టూ పరికించి చూడ సాగాడు ప్రతీక్. అక్కడ వందల కొద్దీ అలంకార వస్తువులున్నా, అతన్నెక్కువ ఆకర్షించింది, ఎదురుగా ఉన్న షోకేసు పైన, మధ్యలో కూర్చోబెట్టి ఉన్న, కనక దుర్గ అమ్మవారి పది ఇంచీల ఎత్తు కంచు విగ్రహం. ఆ రోజే పాలిష్ చేసినఋట్లు మెరుస్తున్న విగ్రహం ఎంత బరువుండొచ్చని చేతిలోకి తీసుకుని చూశాడు. 

    అంతలో లోపల్నుంచీ సుమిత్ వచ్చిన అలికిడి అయి, ఉలిక్కిపడి, ఇటువైపు చూశాడు. కుడిచేతిలో పాకెట్ ఒకటి పట్టుకుని వస్తున్న సుమిత్ కాస్త తూలిపోతూ నడుస్తున్నట్లు కనిపించింది. అంతే కాక అతను ప్రతీక్ వైపు కాక ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు. "ఏమయిందితనికి? లోపలికెళ్ళి, డ్రింక్ ఏదయినా వేసుకుని వచ్చాడా?" అనుకున్నాడు ప్రతీక్. సోఫా దగ్గరికి కష్టం మీద నడుచుకొచ్చిన సుమిత్, దబ్బున విరుచుకుని పడిపోయాడు. ప్రతీక్‌కు ఏమీ అర్థం కాలేదు. దగ్గరికెళ్ళి కింద పడిన సుమిత్ రస్తోగి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. తెలిసిపోయింది, అతని ప్రాణం ఎప్పుడో పోయిందని. లోపలికెళ్ళినప్పుడు ఏమయిందో చూద్దామని వెళ్ళాడు. అక్కడెవరూ లేరు. డబ్బు తీసిన లాకర్ మాత్రం తెరిచే ఉంది. లోపల్నుంచీ ఇంకా కొంత డబ్బు, నగలు తొంగిచూస్తున్నాయి.  

    తను చూస్తుండగానే పని మనిషి వెళ్ళిపోయింది. తను చూడగా లోపలికెవరూ రాలేదు. మరి .... ఏమయింది?

    అంతలో కాలింగ్ బజర్ శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో తనేం చేయాలో నిర్ణయించుకోకుండా, తలుపు తీయడం మంచిది కాదని ఊరుకున్నాడు. బెల్ కొంచంసేపు మోగి ఆగిపోయింది. లోపల్నుంచీ ప్రతీక్ లివింగ్‌రూంకు వచ్చేలోపల, బెల్ మళ్ళీ మోగింది. ఈ సారి ఎక్కువసేపే! కానీ ప్రతీక్ తలుపు తియ్యలేదు. తర్వాత ఎంత సేపయిందో తెలీదు. ఎవరికయినా ఫోన్ చేసి విషయం చెప్దామా అనుకుంటే, ఎవరికి చేసినా ఉపయోగం ఉంటుందని అనిపించలేదు. ఒకర్ని కష్ట పెట్టడమో, లేక తన పేరుప్రతిష్ఠలను పోగొట్టుకోవటమో తప్ప ఏం ఒరుగుతుంది? పోనీ ఏ బెడ్‌రూం బాల్కనీ లోంచో తప్పించుకుని వెళ్ళిపోదామా అంటే మరణించిన మనిషిని వదిలేసి వెళ్ళాలంటే మనసొప్పటం లేదు.   

    ఏం చెయ్యాలో తెలీకుండా, పరధ్యానంగా సోఫాలో కూర్చుని, టీపాయ్ మీదున్న అమ్మవారి మూర్తిని చేతికి తీసుకున్నాడు. 

    సరిగ్గా అప్పుడే తలుపులో తాళం తిరుగుతున్న శబ్దం అయి అటు చూశాడు. పోలిసు ఇన్స్‌పెక్టర్, అతని వెంట నలుగురు కాన్‌స్టేబుళ్ళు, వాళ్ళ వెనక, అంతకు ముందు వెళ్ళిపోయిన పనిమనిషి, కింది నుంచీ వసున్నప్పుడు, లిఫ్ట్ దగ్గర చూసిన ఇద్దరు సెక్యూరిటిల్లో ఒకరు. 

    ఇన్స్‌పెక్టర్ రివాల్వర్ ప్రతీక్ వైపు గురిపెడ్తూ "డోంట్ మూవ్! అక్కడ్నుంచీ కదలొద్దు," అంటూ వచ్చి ప్రతీక్‌ను అరెస్ట్ చేశాడు. ప్రతీక్‌కు ఎందుకు ఏం జరుగుతున్నదీ అర్థం కాలేదు. బేడీలు వేస్తుంటే, గింజుకుంటూ, "ఇన్స్‌పెక్టర్! యు ఆర్ మిస్టేకన్! అతనే కింద పడి చనిపోయాడు, నేనేం చెయ్యలేదు. నన్ను నమ్మండి." అన్నాడు. తనచేతిలో ఉన్న అమ్మవారి మూర్తిని అటు ఇటూ తిప్పి జాగ్రతగా చూస్తున్న ఇన్స్‌పెక్టర్‌కు రెండు రక్తం మరకలు కనిపించాయి. అవి అక్కడికెలా వచ్చాయో మాత్రం ప్రతీక్‌కు అర్థం కాలేదు. కానీ బయటికి వెళ్తున్నప్పుడు తను అంతవరకూ గమనించనిదొకటి కనిపించింది. సుమిత్ కుడి కణతకు గాయమయి రక్తం కారి కింద చుక్కలుగా పడింది. 

* * * 

    ప్రతీక్‌ను కలిసిన తర్వాత, ఆఫీసుకు వెళ్ళి లక్ష్మణ మూర్తి కేబిన్లోకి వెళ్ళి కూర్చుంది. వచ్చేముందు ఒక విషయం స్పష్టం చేసుకుంది. అతనికి లక్ష్మణ మూర్తి సహాయం కావాలి. కాశ్యప్ జయరాంకు ప్రతీక్ కన్నా సుమిత్ రస్తోగి చాలా దగ్గర మనిషి. అతని ఖూనీకోరు ఎవరో వారిని శిక్షించడం తప్ప, ఆయనకు ప్రతీక్ ను ఈ నేరం నుంచీ తప్పించేందులో ఏ ఆసక్తీ ఉండకున్నా ఆశ్చర్యం లేదు. ప్రతీక్ నేరం నుంచీ బయట పడితే తప్ప, హీరోగా అతనికి భవిష్యత్తు లేదు. తనకు కాశ్యప్ ఏ సహాయం చెయ్యడని అతనికీ తెలుసు.

    అన్ని విషయాలు వివరంగా చెప్పినతర్వాత, "సర్! నాకెందుకో  మనం ఏదో మిస్ అవుతున్నామనిపిస్తోంది."

    "యస్ అమృత! ఇందులో ఉన్న మూడో మనిషి ఎవరో తెలుసుకోవాలి! పోలీసులు ఇల్లంతా గాలించారటనా?"
    "అవును. ప్రతీక్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళేముందు, ఇల్లంతా ప్రతీ ఇంచీ వెతికి చూశారట. ఇంకే సాక్ష్యం దొరకలేదు."

    ఏదో గుర్తొచ్చిన అమృత, "సర్! ప్రతీక్ చెప్తున్నట్లు సుమిత్ లోపలికెళ్ళినప్పుడు ఏదయినా తాగి వచ్చాడేమో!..."

    "ఏం తాగి వచ్చినా చచ్చిపోవడం సాధ్యమా? వాస్ హి ఎ డ్రగ్ అడిక్ట్? డ్రగ్ ఓవర్‌డోస్ ఏమయినా అయిందా? వాస్ హి ఎన్ అల్కహాలిక్?"

    ఆయన మాటలు అమృతలో ఆలోచనలు రేపాయి. "వెళ్ళి సినిమాలు, టాలీవుడ్‌కు సంబంధించిన వివరాలు మన సురేష్ ఎక్కువగా పరిశోధిస్తుంటాడు. అతన్నొకసారి, సుమిత్ రస్తోగి జాతక పత్రం తయారుచెయ్యమను. ఏదయినా ఆధారం దొరకొచ్చు."

* * * 

    చేతిలో అడ్రస్ పుచ్చుకుని బయలుదేరింది అమృత. తను కావలిస్తే ఆఫీసు కారు, డ్రైవరు ఉపయోగించవచ్చు. కానీ ఈ పనికి తన వాహనంలో వెళ్ళడమే మేలనిపించింది. 5, లక్ష్మి నగర్ కాలనీకి వెళ్ళాలి.  మెహెదీపట్నం దాటి రింగ్ రోడ్డు ఎక్సిట్ తీసుకుని, మొదటి ఎక్సిట్‌లో కుడివైపు తిరిగి రెండు ఫర్లాంగులు వెళ్ళాక కుడి వైపు క్రాస్‌రోడ్లో దొరికింది తనక్కావలసిన ఎడ్రస్!

    అదొక పాత ఎపార్ట్‌మెంటు బిల్డింగ్. వాచ్మన్ లాంటి వారెవరూ లేరు. కానీ గేట్ దాటగానే ఉన్న పాడుబడి, పాన్ మరకలతో నిండిన గోడలమధ్య ఉన్న ఒక సెట్ పోస్ట్ బాక్సుల మీద పేర్లు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. రజిషా ఎపార్ట్‌మెంటు మూడో అంతస్తులో ఉంది. పెద్దగా అశేం లేకపోయినా, మెట్లెక్కే ముందు, లిఫ్ట్ బటన్ నొక్కి చూసింది. వచ్చే సూచనలేం కనిపించలేదు. 

    నిదానంగా మెట్లెక్కి పైకి నడిచింది అమృత. అక్కడ వరసగా కనిపిస్తున్న ఇళ్ళ సంఖ్యలు చూసింది. అందరికన్నా, రజిషా ఇంటి ముందర కాస్త శుభ్రంగా ఉంది. కాలింగ్ బెల్ నొక్కింది.

    కొన్ని నిముషాలకు తలుపు తెరిచింది, ఒక మధ్యవయసు స్త్రీ. ఆమె కట్టుకున్న చీరె గబ గబా నైటీ తీసేసి చుట్టుకుని వచ్చినట్లుంది. చీరె స్థితి ఆమె ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. తలుపు తియ్యగానే ఉన్న చిన్నగదిలో రెండు బాగా మాసిపోయిన రెండు ఎరుపు ప్లాస్టిక్ కుర్చీలు ఒక దాన్లో తను కూర్చుని ఇంకొక దాని వైపు చెయ్యి చూపించింది అమృతను కూర్చొమ్మని.

    ఆరోజు ఉదయమే జయరాం ఎసోసియేట్స్‌కు ఫోన్ చేసి సుమిత్ ఖూనీ కేసును తను పరిశీలిస్తున్నట్లు నమ్మించింది. పోలీసుల పేరు చెప్తే, సినిమాల్లో ఎక్‌స్ట్రా గా పనిచేసే రజిషా మొబైలు నంబరు సులభంగానే దొరికింది. ఆమెకు ఫోన్ చేసి, ఈ రోజు పని ఏం లేక ఇంట్లోనే దొరుకుతుందని కనుక్కుని ఆ మధ్యాహ్నం అక్కడికొచ్చింది అమృత.
    రజీషే అడిగింది. "చెప్పండి మీకేం కావాలో." మూడురోజుల క్రితం పేపరు తీసి, సుమిత్ రస్తోగి ఖూనీ వార్త ఉన్న భాగాన్ని మడిచి ఆమె చేతికిచ్చింది అమృత. ముఖంలో ఏ భావమూ కనిపించనివ్వకుండా రజీష కళ్ళు పేపర్ మీద కొన్ని క్షణాలు కదిలాయి. "అయితే, ఏంటి?" అన్నట్లు అమృత వైపు చూసిందామె. 

    "మీకు సుమిత్ రస్తోగి తెలుసా?" అని అడిగింది అమృత.

    "రంగంలో ఉన్న అందరికీ తెలుస్తుంది సుమిత్ ఎవరో? అతను ఈ ఫీల్డులో చాలా ఏళ్ళుగా ఉన్నాడు."

    "అదికాదు. అందరిలా కాక, మీతో ఒకప్పుడు క్లోజ్‌గాఉండేవారా అని?"

    రెండు క్షణాలు నిశ్శబ్దం. మళ్ళీ, "నువ్వొక అమాయకుణ్ణి రక్షించే ప్రయత్నమని చెప్పినందుకు, నువు పోలీసుల తరఫు కాదనీ నమ్ముతున్నాను!"

    "ప్లీజ్! నన్ను నమ్మండి. సత్యానికి న్యాయం చేకూర్చడం నా ప్రయత్నం! అన్యాయంగా ఖూనీకోరుగా ఇరుక్కున్నతను నాస్నేహితుడన్న మాటకూడా నిజం!"

    "ఒకప్పుడు, మేమిద్దరం ముప్పయ్యయిదు వయసులోపల ఉన్నప్పుడు, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం."

    "మరి. ఏమయింది" కుతూహలం ఆపుకోలేకపోయింది అమృత.

    "సుమిత్‌కు అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్లయేది. అప్పుడు తను రోజుకు పదహారు గంటలు కూడా పనిచేసేవాడు. అందుకని అలసట వల్ల ఇలా అవుతుందేమోననుకున్నాం. కానీ పరీక్ష చేయిస్తే తేలింది, అతనికి మెదడులో ట్యూమర్ ఫస్ట్ స్టేజిలో ఉందని. అలాగే స్నేహం కొనసాగించడానికి నాకేం అభ్యంతరం లేకపోయింది కానీ, అతనికే నచ్చలేదు. పెళ్ళి కూడా మానేద్దాం అన్నాడు. తను బ్రతికేది కొన్నేళ్ళే కదా అని నాతో సంబంధ బాంధవ్యాలు కూడా తెంపుకున్నాడు."

    రజీష చెప్తున్న వివరాలతో, అమృతకు ఆరోజు సుమిత్ రస్తోగి చావుకు ముందు, ఏమయి ఉండొచ్చో ఊహించుకోగలిగింది. 

    "ఇంకొక విషయం. సుమిత్ పరీక్ష చేయించుకుంటున్న డాక్టర్ పేరుగానీ, ఆస్పత్రి పేరుగానీ గుర్తుంటే, చెప్తారా?" 

    రజీష ఒక ప్రైవేటు క్లినిక్ పేరు చెప్పి, "అప్పుడక్కడికి వెళ్లేవాడు. తర్వాత మార్చి ఉంటే తెలీదు."  

    రజీషకు ధన్యవాదాలు చెప్పి బయటపడింది, అమృత.

* * * 

    అమృత కోర్టు ఆర్డరు కాపీ తీసుకుని స్టేషన్‌కు వచ్చింది. జరుగుతున్న విషయాలు, తెలిసిన వివరాలు ఎప్పటికప్పుడు అమృత ద్వారా తెలుస్తూనే ఉన్నా, అంత త్వరగా ఆమె వచ్చి తనను విడిపించగలదని ప్రతీక్ అనుకోలేదు. 

    లక్ష్మణ మూర్తికి పోలీసు డిపార్ట్‌మెంటులో ఆఫీసర్లు, కోర్టు జడ్జిలు, మాజిస్ట్రేట్‌లు చాలా మందే తెలుసు. అందుకని తన కనెక్షన్లతో కేసును కోర్టుకు వెళ్ళకుండా ఆపించాడు. రజీష ద్వారా తెలిసిన సుమిత్ అనారోగ్యం వివరాలేకాక, మూడవరోజుకు వచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా, "బ్రెయిన్ హెమరేజ్" మొదట అయి అతను చనిపోయాడని, తర్వాత కిందపడి దెబ్బ తగిలిందని స్పష్టం చేయడంతో, లక్ష్మణ మూర్తి పని ఇంకా సులువయింది. 

* * * 

    ఆ రోజు సాయంత్రం పరంధామయ్య వాకింగ్‌కు వెళ్ళి వచ్చే సరికి ఇంటి దగ్గర అమృత స్కూటర్ పార్క్ అయిఉండటం చూసి, మనుమరాలు త్వరగా ఇల్లు చేరిందే అనుకున్నాడు. కాస్సేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చని ఉత్సాహంగా లోపలికెళ్ళాడు. ఆయన ఆశ నిరాశ చేసింది, విశాలమ్మ.

    "అమృత వచ్చిందా?"

    "వచ్చింది. ప్రతీక్‌తో బయటికెళ్ళింది. వాడు హీరోగా నటించిన సినిమా "చంద్రుడు" ఇవాళే రిలీజట! షో చూద్దామని తీసికెళ్ళాడు. నన్నూ రమ్మన్నారు. మీరుంటే, ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మీకు చెప్పకుండా ..." 
Comments