ముళ్ళకంచె - పాతూరి అన్నపూర్ణ

    "అబ్బబ్బ! ఈవిడ చాదస్తంతో చస్తున్నాం" సరోజ ఇలా విసుక్కోవడం వందోసారి.

    "ఎప్పుడో మొక్కుకుందట, కొండకు నడిచి వస్తానని. ఇప్పటిదాకా ఆ మొక్కు తీర్చుకోకుండా ఉండడం ఎందుకు? ఈ వయసులో మాతో వచ్చి మా ప్రాణం తీయడం ఎందుకు?" సణుగుతూనే వుంది సరోజ.

    అనంతరాముకి సరోజతో పెళ్ళయి నాలుగేళ్ళు కావస్తోంది. హైదరాబాద్‌లో ఓ పేరున్న కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు అనంత్. సరోజ డిగ్రీ చదువు కున్నది. పెళ్ళయ్యాక రెండేళ్ళకి సరోజకు బాబు పుట్టడం వాడిపనిలో, యింటి పనిలో సాయంగా ఉంటుందని వర్ధనమ్మని వీళ్ళ దగ్గరికి పంపుతామంటే సరే అన్నాడు అనంత్. అనంత్‌కి బామ్మ అంటే ఇష్టమే కానీ ఆవిడ డామినేటింగ్ నేచర్ అంటే భయం. వర్ధనమ్మ నోరు తెరిచిందంటే ఎంతటి వాళ్ళయినా పరార్ కావలసిందే.

    "నేను కూడా మీతో వస్తారా! నీకు పదేళ్ళప్పుడు టైఫాయిడు వస్తే తగ్గిపోవాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఆ మొక్కు ఇప్పటికీ తీరి చావట్లేదు" అంటూ పెట్టె సర్దుకొని ప్రయాణానికి బయలుదేరింది వర్ధనమ్మ.

    చేసేదేమీ లేక ’సరే’ అన్నాడు అనంత్.

    మెట్లు ఎక్కలేక అక్కడక్కడా కూర్చోవడం, ఆవిడ చేయి పుచ్చుకుని లేపడం  ఈ సపర్యలన్నీ చెయ్యలేక సరోజకి విసుగ్గా వుంది. ఏదో సరదాగా భర్తతో ప్రయాణం అంటే ఎగిరి గంతేసి బయలుదేరిన సరోజకి వర్ధనమ్మ వాళ్ళతో వస్తానని బయల్దేరగానే పొంగే పాలపై నీళ్ళు చిలకరించినట్లు అయింది.

    దానికి తగ్గట్లుగానే వర్ధనమ్మకి ఎక్కడా సర్దుకుపోయే మనస్తత్వం లేదు. ఆవిడ ఆగమన్న చోటల్లా ఆగాలి. ఎక్కమన్న చోటల్లా ఎక్కాలి. ఆఖరికి తినడానికికూడా ఆవిడ చెప్పిన అయిటమ్సే ఆర్డర్ ఇవ్వాలి. ప్రతి విషయానికీ ఆలోచించిగానీ అడుగెయ్యదు. ఏవస్తువైనా గీచి గీచి బేరం చేసి కొంటుంది. ఇదంతా సరోజకీ, అనంత్‌కీ తలనొప్పిలా తయారయ్యింది.

    బయటకి గట్టిగా అనలేక మొగుడిదగ్గర సణగడం తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నది సరోజ.

    "సరే సరోజా! ఆవిడ సంగతి తెల్సిందే కదా! సర్దుకుని పో!" అంటూ అనునయిస్తున్నాడు అనంత్.

    దర్శనం అయ్యాక విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్ళి కాసేపు రెస్టు తీసుకున్నాక ఆ రాత్రే హైదరాబాదుకి బయలుదేరారు అందరూ.

* * *

    వనస్థలిపురంలో ఓ కాలనీలో ఉంటున్నాడు అనంత్ ఇల్లు అద్దెకు తీసుకుని. ప్రస్తుతానికి ఏ బాదరబందీ లేదుకనుక అతనికి వచ్చే జీతంతో ఏలోటూ లేకుండా ఎంజాయ్ చేతున్నారు. అనంత్‌కి స్నేహితులు ఎక్కువ. ఇంట్లో ఉన్నంత సేపూ ఎవరో ఒకరు రావడం అనంత్‌ని బయటకు పిలుచుకెళ్ళడంతో గడిచి పోతుంది. ఆ ఫ్రెండ్స్ కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతాడు అనంత్.

    ఆ రోజు శెలవు కావడంతో శేషపాన్పుపైన విష్ణుమూర్తిలా రిలాక్స్‌డ్‌గా పడుకుని టి.వి.చూస్తున్నాడు అనంత్. వర్ధనమ్మ పేపర్ క్షుణ్ణంగా చదువుతున్నది. సరోజ వంట పనిలో మునిగిపోయింది.

    ఇంతలో అనంత్ స్నేహితులు ఓ నలుగురు బిలబిలా వచ్చారు "గురూ! బయటకెళ్దాం రాకూడదా! ఈ మధ్య పార్టీ చేసుకొని చాలారోజులయింది" అంటూ.

    "అబ్బ! ఈ రోజు హాయిగా ఇంటిపట్టున ఉండి రెస్టు తీసుకుందాం అని ఉందిరా" అన్నాడు అనంత్ వాళ్ళతో.

    "అదికాదు బాబాయ్! మనది రెస్టు తీసుకొనే వయసా? లే లే" అన్నాడు వాళ్ళలో ఒకడు.

    ఇదంతా గమనిస్తున్న వర్ధనమ్మ ఇక ఊరుకోదల్చుకోలేదు. "ఏమయ్యా రమేష్! ఒక్క రోజు శలవు వస్తే ఇంట్లో వుండి పిల్లా పాపలతో, పని పాటలతో పొద్దు పుచ్చక ఊరంటబడి ఈ తిరుగుళ్ళెందుకు మీరు చెడిపోవడం కాక మా వాడ్నికూడా చెడగొట్టడం ఎందుకు?" అని అడిగెసింది.

    "అబ్బే! అదికాదండీ! వారం అంతా పనిచేసి ఉంటాం కదా! ఏదో కాస్త రిలాక్స్ కోసం!" అంటూ నసిగాడు రమేష్.

    "రిలాక్సా! పాడా! హాయిగా ఇంటిపట్టున ఉండి ఇంత తిని ఏ వారపత్రికో, టి.వి.నో చూస్తూ గడిపితే రిలాక్స్ అవరూ?" అంటూ వర్ధనమ్మ సాగదీసేసరికి చేసేదేంలేక "సరే అనంత్! మేం వస్తాం రా!" అంటూ లేచారు అతని స్నేహితులంతా.

    "బామ్మా! మధ్యలో నీ గొడవేంటి? అన్నిట్లో తలదూర్చమాక" అన్నాడు అనంత్ కొంచెం కోపంగానే.

    ఈలోపల సరోజ అందరికీ టీ కలిపి తీసుకు వచ్చింది.

    "బాగుంది సంబడం! ఇట్లా అయితే వీళ్ళు కాపురం వెలగబెట్టినట్లే" గొణిగింది వర్ధనమ్మ.

    బామ్మ ఎదురుగ్గా కూర్చొని వీళ్ళందరినీ ఎగాదిగా చూస్తుంటే చేసేదేంలేక టీలు తాగి "వెళ్ళొస్తాం రా!" అంటూ బయలుదేరారు అనంత్ మిత్రబృందం.

    "బామ్మా! ఈ మధ్య నీకు నోరెక్కువయింది" అంటూ ఆవిడ వైపు మిర్రిమిర్రి చూశాడు అనంత్.

* * *

    "సరోజా!" అంటూ పక్కింటి రవళి వచ్చింది.

    "ఏంటి రవళీ" అంది సరోజ.

    "ఏంలేదు సరోజా! అర్జంట్‌గా మా కజిన్‌పెళ్ళికి వెళ్ళాల్సివుంది. నా నగలన్నీ బాంకులో ఉన్నాయి. బొత్తిగా మెళ్ళోకి ఏంలేకపోతే బాగుండదు కదా! అందుకని నీ మయూరి నెక్లెస్ ఇస్తే వేసుకెళ్తాను. ఓ రెండ్రోజుల్లో వచ్చేస్తాము. రాగానే ఇస్తాను" అంది రవళి.

    "అలాగే దాందేముంది. ఇస్తాలే తీసుకెళ్ళు" అంది సరోజా.

    "అదికాదమ్మాయ్! మొన్న తీసుకుపోయిన గిన్నెడు కందిపప్పు, నిన్న తీసుకెళ్ళిన గ్లాసుడు పంచదార తేవడం తెలీదుగానీ, మళ్ళీ ఈ రోజు నెక్లెస్ అంటూ వచ్చావా! అయినా ఇట్లా బంగారం బదులు ఇవ్వడంకానీ, బదులు తెచ్చుకోవడం కానీ మా ఇంటా వంటా లేదు" అంటూ వధనమ్మ మొహం మీదనే చెప్పేసరికి తెల్లబోయింది రవళి. 

    "సర్లే! నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే సరోజా! వస్తాను" అంటూ వెళ్ళిపోయింది రవళి.

    "అదేంటి బామ్మగారూ! రవళి ఏమనుకుంటుంది? అట్లా మొహం మీదే చెప్పేశారు" అంటూ తెగబాధ పడిపోయింది సరోజ.

    "అనుకోవడమా! పాడా! ప్రతిరోజూ ఏదో ఒక వస్తువు అప్పు అడగడానికి రాకుండా వుండదు కదా! అయినా బంగారపు వస్తువు తీసుకెళ్ళి తిరిగి ఇవ్వక పోతే ఏం చేస్తావు? 'ఏద్చు కోవడం తప్ప. అందుకే మొహమాటం లేకుండా చెప్పేశాను" అంది వర్ధనమ్మ.

    ఇంతలో "బామ్మా! రోజు రోజుకీ నీ గొడవ ఎక్కువైపోతున్నది" అంటూ లోనికి వచ్చాడు అనంత్.

    "ఏంట్రా!" అన్నది తాపీగా చిక్కుడు కాయలు వలుస్తున్న వర్ధనమ్మ.

    "ఏంటా! సి.డిలు తీసుకొచ్చిన రవిబాబుని వెళ్ళిపొమ్మన్నావంట" అన్నాడు కోపంగా అనంత్.

    "అవున్రా! అన్నాను. లేకుంటే రోజుకి రెండుమూడు సినిమాలు చూడాల్సిందేనా? టి.విలో వచ్చవి చాలవా?" అన్నది అంతే కోపంగా వర్ధనమ్మ.

    "అది కాదే! టి.విల్లో వచ్చేవన్నీ పాత సినిమాలు కదా! ఇవి కొత్తవి. అందుకని కొత్త సి.డి.లు రాంగానే ఇంటికి తీసికెళ్ళి ఇవ్వమని నేనే వాడికి చెప్పాను. నువ్వేమో వాడ్ని ఫుట్‌బాల్‌లా వెనక్కి పంపావు" అన్నాడు చిరాగ్గా అనంత్.

    "ఒరే పిచ్చి నాగన్నా! ఈ సినిమాలైనా నాలుగురోజులు ఆగితే ఆ టి.వి.లోనే వస్తాయిగా. రోజుకి ఓ వంద రూపాయలు తగలేసి ఆ వెధవ సినిమాలు, వెధవగంతులు చూడకపోతే నీకు, మీ ఆవిడకు తోచదు అనుకుంటా. పైగా ఆ సినిమాలు ఈ పిల్లవెధవ కూడా కళ్ళార్పకుండా చూడడం" అంది వర్ధనమ్మ కిరణ్‌ని చూపిస్తూ.

    ఏం మాట్లాడలేక పళ్ళు నూరుకున్నాడు అనంత్. 

    సరోజకి సినిమాల పిచ్చి. పిల్లాడితో బయటకు వెళ్ళడం కుదరదు కనుక ఇంటికే సి.డి.లు తెప్పించుకుని చూస్తున్నది ఈ మధ్య. 

    "అయినా ఈవిడకి ప్రతిదాంట్లోనూ వేలుపెట్టడం ఎక్కువైంది ఈ మధ్య" అని తిట్టుకున్నది ఇదంతా చూస్తున్న సరోజ.

* * *

    ఆ రోజు అనంత్ ఆఫీసుకు వెళ్ళగానే ఓ గంట తర్వాత సరోజ పన్లన్నీ ముగించుకుని వచ్చి హాలులో కూర్చుంది పేపర్ తిరగేస్తూ. చీరలు, ఇమిటేషన్ నగలు ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇచ్చే అతను వచ్చాడు "మాడమ్ శారీస్" అంటూ.

    "రా!రా! నీకోసమే వారం నుంచీ ఎదురుచూస్తున్నాను" అంటూ విప్పారిన మొహంతో చాపతెచ్చి పరిచింది సరోజ. అంతే కాక ఇరుగుపొరుగు వాళ్ళని కూడా ఫోన్లు చేసి మరీ పిలిచింది. 

    అందరూ వచ్చారు గలగలమంటూ. తలా ఒకటో, రెండో చీరలు, నగలు తీసుకున్నారు.

    "ఏరా అబ్బాయ్! ఒక్కో చీర మీద ఎంత ఎక్కువ వేసుకున్నావేంటి?" అని అడిగింది వర్ధనమ్మ.

    "ఎంతో ఎందుకు వేసుకుంటానండీ! టెన్ పర్సెంట్ తప్ప" అన్నాడు చీరలతను నవ్వుతూ!

    "అలా మగాళ్ళు ఇల్లు దాటగానే ఈ ఆడాళ్ళందరూ చీరలు, సినిమాలు, నగలు, బ్యూటీపార్లర్లు అంటూ డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. అందుకే మీలాంటి వాళ్ళు ఇళ్ళకు కూడా వచ్చి మరీ అంటగడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే కదా మీ బిజినెస్‌లు పెరిగిపోయాయి" అంటూ వర్ధనమ్మ అనగానే ఇరుగుపొరుగు వాళ్ళందరికీ కోపం వచ్చింది.

    "సరోజా! ఇకనుంచి చీరలతను వస్తే మా ఇళ్ళకు పంపిచు. ఇక్కడకు రమ్మని అందర్నీ పిలవద్దు. మీ బామ్మ చేత మాటలు అనిపించవద్దు..." అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు.

    సరోజకి అరికాలి మంట నెత్తికెక్కింది.

    "ఏంటిబామ్మా! ప్రతిదానికీ ఏదో ఒకటి మాట్లాడాల్సిందేనా! చూడు వాళ్ళందరూ ఎలా అని వెళ్ళిపోయారో" అంటు కళ్ళనీళ్ళు పెట్టుకుంది సరోజ.

    "వెళ్తేవెళ్ళారులే! ముందూ వెనకా చూసుకోకుండా ఉన్న నాలుగు రాళ్ళూ ఇలా ఖర్చుపెట్టుకుంటే సంసారం ఎలా జరుగుతుంది" అంది వర్ధనమ్మ తను మాట్లాడిందాంట్లో తప్పేమీ లేదన్నట్లుగా.

    "ఛ! ఈవిడతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ" అనుకొని విసురుగా లోపలికి వెళ్ళి పోయింది సరోజ.

    "ఆ రోజు రాత్రి బెడ్‌రూమ్‌లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ జరిగినదంతా అనంత్‌కి చెప్పింది సరోజ.

    "ఊర్కో సరూ! ఏడవకు. ఈవిడకు చాదస్తం మరీ ఎక్కువైంది. నన్ను అట్లాగే ప్రతివాడి ముందూ వెధవని చేస్తున్నది. ఇంటికి ఎవరైనా వచ్చారంటే మనం టెన్షన్‌తో చావాలి ఎవడిముందు ఏం మాట్లాడుతుందోనని" అన్నాడు అనంత్.

    "అవునండీ  దీనికి మీరే ఏదో ఒక మార్గం చూడకూడదూ" అంది సరోజ అనంత్‌ని తన చేతుల్తో చుట్టేస్తూ.

    "ఓ.కే! డార్లింగ్! ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం" అన్నాడు ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ అనంత్.

* * *

    "ఒరే భడవా! మమ్మీ! డాడీ! అంటూ ఆ పాడుపిలుపులు ఏంట్రా! హాయిగా అమ్మా! నాన్నా! అని చక్కగా పిలవకుండా" అంది కిరణ్తో వర్ధనమ్మ.

    "మరి మమ్మీనే అలా పిలవమని చెప్పింది బామ్మా" అన్నాడు అమాయకంగా ఆ మునిమనవడు.

    "ఔన్లే! ఇప్పటి కాలం తల్లి తండ్రులు అలా చెప్పక ఎలా చెప్తారు?" అనుకుంటూ సుందరకాండ చేతుల్లోకి తీసుకుంది చదవడానికి.

    ఇదంతా వింటూ సోఫాలో దిండు కవర్లని మార్స్తున్న అనంత్ "బామ్మా! ఈ వారం వీకెండ్‌లో నేను మనూరికి పోతున్నాను. నాన్నని అమ్మని చూసి చాలారోజులయింది. వస్తే నిన్ను కూడా తీసికెళ్తాను" అన్నాడు బామ్మకేసి చూస్తూ.

    "ఎట్లాగూ రేపు దసరాకి మనింట్లో నవరాత్రులకు వెళ్ళాలి కదరా! ఈ లోపల రైళ్ళకి తగలెయ్యడం దేనికి" అంది వర్ధనమ్మ.

    "అది కాదే. నాన్నకి నువ్వు కల్లో వస్తున్నావంట. నాతో పాటు నిన్నుకూడా తీసుకొని రమ్మని ఫోన్ చేశాడు. ఇక నీ యిష్టం" అంటూ సెంటిమెంట్‌గా మాట్లాడాడు.

    "అట్లా అయితే సర్లే! నాక్కూడా వాడిని చూడాలనే అనిపిస్తున్నది" అంది వర్ధనమ్మ సుందరకాండ పుస్తకం మూసి పక్కన పెడుతూ.

    "అమ్మయ్య! నా ప్లాన్ ఫలించింది" అనుకున్నాడు అనంత్. 
 
* * *

    "నాన్నా! ఇక్కడ బామ్మ గోల ఎక్కువైంది. ఇక ఈవిడని, ఇక్కడ అట్టిపెట్టుకునే ప్రసక్తే లేదు. తీసుకొచ్చి మనూళ్ళో దించేస్తాను" అంటూ అనంత్ తండ్రికి ఫోన్లో చెప్పాక "సరేరా! నీ యిష్టం! ఏదో మీకు పెద్దదిక్కుగా ఉంటుందని నీ దగ్గరకు పంపాను. నీకు అంత ఇబ్బందిగా ఉంటే తీసుకొచ్చి దింపెయ్యి" అన్నాడు రామారావు. 

    "సరేకానీ నాన్నా! ఇదంతా ఆవిడకు చెప్పమాక. ఆవిడని చూడాలని నువ్వే నాకు ఫోన్ చేసినట్లు చెప్పి ప్రయాణం కట్టించాను" అని చెప్పాడు తండ్రితో అనంత్.

    సరోజకి కూడా ఈ విషయం అంతా చెప్పాక "అమ్మయ్య! ఇకపైన నాకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది" అని ఎగిరి గంతేసింది.

    శనివారం రానే వచ్చింది. పెట్టే బేడా సర్దుకుని సిద్ధమైంది వర్ధనమ్మ. ఆవిడకున్న చీరలతో పాటు దేవుడి పుస్తకాలు, జపమాలలు కూడా సరుద్కుంది. "అమ్మాయ్! జాగ్రత్త. అందర్నీ ఇంటికి రానీయమాకు. నీకు ఏం తెలీదు" అంటూ సరోజకి వంద జాగ్రత్తలు చెప్పి అనంత్‌తో ఆటోలో ఎక్కి కూర్చుంది. 

    "అట్లాగే బామ్మగారు" అంటూ బుద్ధిగా తల ఊపి "అత్తయ్యను, మామయ్యను అడిగినట్లు చెప్పండి" అంది సరోజ.

* * *

    బామ్మని ఊర్లో దించి వచ్చాక పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు ఫీలవుతున్నారు అనంత్, సరోజ.

ఆ ఇద్దరి మధ్యలో మూడో మనిషి లేదు. నస లేదు. హాయిగా తలుపులేసుకుని సి.డి.పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ నెలరోజులు వాళ్ళకి రోజూ పండగలాగే ఉన్నది. ఇష్టం వచ్చింది చేసుకుని తినడం, బయట షికార్లకి వెళ్ళిరావడం. కిరణ్‌కి కూడా రోజూ బయటకు వెళ్ళాలంటే సంతోషంగా వుంది. ఐస్‌క్రీములూ, పిజ్జాలు అలవాటయ్యాయి వాడికి.

* * *

    "అమ్మో! బామ్మగారా! ఆవిడ్ని ఎవరు భరాయిస్తారండీ? అందుకే దించేసిరండి! అంటూ మావార్ని పోరు పెట్టాను" అంటూ అందరికీ చెప్పుకుంది సరోజ ఏదో ఘనకార్యం చేసినట్లు.

    అంతే! బామ్మ ఇక తిరిగిరాదని తెలుసుకున్న చుట్టుపక్కలవాళ్ళు మళ్ళీ యధేచ్చగా రాకపోకలు మొదలు పెట్టారు.

    తలుపులు వెయ్యడం ఆలస్యం ఎవరో ఒకరు రావడం, కాలింగ్ బెల్ల్ కొట్టడం "సరోజా అది ఉందా! ఇది ఉందా" అని అడగడం, తీసుకెళ్ళడం.

    మెహర్బానీకి పోయిన సరోజ "అయ్యో! దానికేం భాగ్యం" అంటూ అడిగిన వస్తువు ఇవ్వడం  జరుగుతున్నది.

    ఇక మధ్యాహ్నాలు అయితే ఇల్లే సినిమా హాలులా తయారయ్యింది. ఇక్కడే సినిమాలు చూడడం. "అబ్బ! నిద్ర ముంచుకు వస్తుంది సరోజా! మీ గదిలో ఆయితే ఏ.సి.ఉంటుంది. చల్లగా హాయిగా ఉంటుంది.  ఒక్కగంట పడుకుంటాను" అంటూ సరోజ స్నేహితుల్లో కొందరు ఇక్కడే నిద్రను కూడా లాగించేస్తున్నారు. తన బెడ్‌రూమ్ వేరేవాళ్ళు వాడుకోవడం ఇష్టం లేదు సరోజకు. కానీ వాళ్ళేమయినా అనుకుంటారని వద్దని చెప్పలేక పోతున్నది. ఇట్లా ఇల్లంతా ఏకం చేస్తున్నారు. ఇక పెద్దవాళ్ళతో వచ్చిన పిల్లలయితే మరీ గొడవ చెయ్యడం. అన్ని వస్తువులూ లాగి పెడుతున్నారు. వాళ్ళతో పాటు కిరణ్‌కూడా చేరి షోకేస్‌లో బొమ్మలన్నీ లాగి పాడు చేస్తున్నాడు.

    హాయిగా మధ్యాహ్నం నిద్రపోదామన్నా ఎవరో ఒకరు రావడం వాళ్ళకోసం నిద్ర ఆపుకుని వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవడం ఇలా సరోజకు తనకంటూ ఒక గంట సమయం కేటాయించుకోవడానికి కూడా కుదరడం లేదు.

    బామ్మ తిడుతుందనే భయంతోనైనా అనంత్ స్నేహితులతో మరీ ఎక్కువగా తిరుగుళ్ళు తిరిగేవాడు కాదు. మొదట్లో మొదట్లో వెళ్ళినా ఈవిడ పోరుపడలేక బాగా తగ్గించేశాడు. మళ్ళీ బామ్మ అనే పాత్ర ఎప్పుడు కనుమరుగయ్యిందో అప్పుడే బయట మందు పార్టీలు జల్సాలు ఎక్కువైపోయాయి అనంత్‌కి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా ఖర్చుపెట్టే అనంత్ చుట్టూ స్నేహితులకు కొదువలేదు. జీతం డబ్బులు 'నో సేవింగ్స్' పథకంలో ఖర్చయిపోతున్నాయి. 

    సరోజకి ఇదంతా చూస్తుంటే గుండెల్లో చెప్పలేని బాధ. "ఏంటి? అనంత్ రోజూ ఆఫీసునుండి లేట్‌గా వస్తున్నాడు. ఇదివరకు ఆరుగంటలకు ఆఫీసు అవగానే ఇంటికి బయల్దేరేవాడు. ఇప్పుడు పదిగంటలదాకా బయట తిరగడం, ఆ తర్వాత ఇల్లు చేరడం... రాగానే మొక్కుబడిగా ఇంత అన్నంతిని పడుకోవడంతో సరిపోతున్నది. అప్పటికే కిరణ్ తండ్రికోసం చూసి చూసి నిద్రపోతాడు."

    "ఏంటి అనంత్ త్వరగా వస్తాను, రెడీగా ఉండు. బజారు వెళ్దాం అని చెప్పావుగా" అని సరోజ అడిగితే

    "కుదర్లేదు సరోజా! ఆఫీసు అవగానే మా ఫ్రెండ్స్ వచ్చారు. అందరం కలిసి అట్నించి సినిమాకు వెళ్ళిపోయాం.సినిమా సగంలో ఉన్నప్పుడు నీకు వస్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. సారీ! రేపు వెళ్దాంలే!" అన్నాడు అనంత్.

    "సర్లెండి" అసహాయంగా అంది సరోజ.

* * *

    శెలవు రోజు రాకూడదు! అనంత్ స్నేహితులు అందరూ ఇంటికే వస్తున్నారు. వీళ్ళందరికీ టీలు, డ్రింక్‌లు కలపడంతో సరిపోతున్నది సరోజకి. వాళ్ళు రావడం బాతాఖానీ కొట్టడం ఆతర్వాత అనంత్‌ని కూడా వాళ్ళతో బయటకు తీసికెళ్ళడం. ఈ మధ్య తరచుగా ఇదే కార్యక్రమం జరుగుతున్నది.

    "తనూ అనంత్ కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోఉలయింది?" అనుకుంది సరోజ బాధగా. "ఇదివరకే నయం! బామ్మకి యిల్లు అప్పచెప్పి అప్పుడప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళం. ఏ గుడికో, గోపురానికో వెళ్ళాలంటే ఆవిడ కూడా వచ్చేది. ఇప్పుడు పడే బాధకన్నా ఆ బాధే నయం. అనంత్ ఇంటి పట్టునే ఉండేవాడు. ఇప్పుడు ఈయనకి ఏ భయం లేకుండా పోయింది"  అంటూ మనసులోనే కుమిలి పోతున్నది సరోజ.

    "ఏంటి సరోజా! నన్ను బయటకు వెళ్ళవద్దని సతాయిస్తావు. ఇంట్లో ఉన్నంతసేపూ నీ స్నేహితులో, పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో రావడం, సినిమాలు వేసుకుని చూడడం. లేదంటే వాళ్ళతో నిన్నూ చీరలకి, షాపింగ్‌లకి తిప్పడం. కేవలం నేనే బయట తిరుగుళ్ళు తిరిగి, లేట్‌గా ఇంటికి తిరిగి వస్తున్నట్లు మాట్లాడుతున్నావు" అన్నాడు విసుగ్గా అనంత్ సరోజతో.

    అనంత్‌ని గట్టిగా నిలదీసి అడిగినందుకు అతను ఇచ్చిన సమాధానంతో తల తిరిగిపోయింది సరోజకి.

    "అవును అనంత్! తప్పంతా నాదే. మొదట్నించీ నిన్ను కంట్రోల్‌లో పెట్టుకోలేదు. బామ్మగారు అడుగుతుంటే తప్పంతా అవిడదే అన్నట్లు నీమీద జాలిపడేదాన్ని. ఇప్పుడు తెలుస్తోంది బామ్మ గొప్పదనం. నెలయింది రవళి గాజులు తీసికెళ్ళి. ఇంతవరకూ తెచ్చి ఇవ్వలేదు. అదే ఆవిడ ఉంటే నన్ను ఇవ్వనిచ్చేది కాదు. బామ్మగారు మన మధ్య ముళ్ళకంచెలా, అడ్డుగోడలా ఉందని భావించామే కానీ ఆవిడ మనిద్దరి మంచి కోసం ఎంత తాపత్రయ పడేదో ఇప్పుడు అర్థం అవుతున్నది. కిరణ్‌కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఇదంతా వాడిని బయటకు వదిలేసినందువల్ల కలిగిన ఫలితం. ఇదంతా స్వయాపరాధం" అన్నది సరోజ తన మనసులోని బాధనంతా వెళ్ళగ్రక్కుతూ.

    "అదేంటి? ఉన్నట్లుండి అలా మాట్లాడుతున్నావు?" అన్నాడు అనంత్ ఆశ్చర్యంగా సరోజని చూస్తూ.      

        "అవునండీ! ఇదివరకు మీ జీతంలో ఖచ్చితంగా ఓ ఐదారువేలు సేవింగ్స్‌లో వేసేవారు. ఈ ఆరేడు నెలలనుండీ మీరు ఒక్క పైసా కూడా బ్యాంక్‌లో వెయ్యలేదు. ఎందువల్ల?" అని అడిగింది సరోజ అనంత్‌ని.

    "ఔను సరోజా! ఇదివరకు జీతం రాగానే బామ్మ నా దగ్గర డబ్బులు లాక్కుని మరీ బ్యాంక్‌లో వేయించేది. పాస్‌బుక్ తనకు చూపించే వరకు నమ్మేది కాదు. ఈ మధ్య ఫ్రెండ్స్‌తో తిరుగుళ్ళకి, పార్టీలకి పర్సు మొత్తం ఖాళీ అవుతున్నది" అన్నాడు అనంత్.

    "మనం ఖర్చులు తగ్గించుకోకపోతే కిరణ్‌ని మంచి స్కూల్‌లో వేసి చదువు చెప్పించలేం" అన్నది సరోజ కిరణ్ తల నిమురుతూ. 

    తననే అమాయకంగా చూస్తున్న కిరణ్‌ని చూస్తుంటే అనంత్‌కి తనమీద తనకే కోపం వచ్చింది.

    అంతే! ఆ రాత్రే ఓ నిర్ణయానికి వచ్చారు అనంత్, సరోజ బామ్మని మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని.

     
Comments