ముళ్ళకంచె - వేంపల్లి ఆర్. సాయి తేజశ్రీ

    
"మా శీనూగాడేమన్నా కనిపించినాడామ్మీ" బోరింగు వద్ద నుండి వస్తున్న వసంతను అడిగింది సావిత్రమ్మ.

    "లేదు గదక్కా" నీళ్ళ బిందె బరువును నడుంమీద నుండి భుజం పైకి మార్చుకుంటూ బదులిచ్చింది వసంత.

    "కటికోళ్ళ రహీంగాడు, మీ శీనుగాడు ఇద్దరూ మసీదు ఎనకాల సందులో ఆడుకుంటూ ఉండారక్కా నేను చూస్తి" చెప్పాడు తన అక్క వసంతకు తోడుగా ఆమె వెనుకనే వస్తున్న వసంత తమ్ముడు రమణ.

    "ఈ కొంతేకాలం నా బట్టకు ఎన్నితూర్లు చెప్పినా పిల్లోళ్ళతో ఆటల్లో పడతండాడే గానీ, బిరీనా కొంపకు చేరుకునేటట్లు లేదు గదమ్మా" తనలో తనే అనుకుంటున్నట్లుగా బిగ్గరగానే అంటూ మసీదు వైపు వెళ్ళే సందు మలుపు తిరిగింది సావిత్రమ్మ.

    "శీనుగాడు ఆడున్నెట్లు నువ్వెందుకు చెప్పినావురా? ఇప్పుడు వాళ్ళమ్మ వాణ్ణి కొడుతుందేమో" తమ్ముడు రమణను మందలిస్తున్నట్లుగా అంది వసంత.

    "నీకు తెలీదులేక్కా ఆ శీనుగాడు భలే నా కొడుకుగానీ. ఆటలో నన్ను చేర్చుకోమంటే చేర్చుకోలా, అందుకే చెప్పేసినా" ఉక్రోషంగా అన్నాడు రమణ. 

    "రేయ్ శీనా మీయమ్మ వస్తావుంది చూడరా" దూరం నుండే సావిత్రమ్మ రాకను గమనించి శీనును హెచ్చరిస్తూ నేలమీద తిరుగుతున్న బొంగరాన్ని తీసుకుని జేజులో వేసుకుంటూ మెల్లగా అక్కడనుండి జారుకున్నాడు రహీం.

    పరుగులాంటి నడకతో వస్తున్న తల్లిని, ఆమె చేతిలోని బెత్తాన్ని చూడగానే ఆటను మధ్యలోనే వదిలి వేసి తను కూడా పరుగులంకించుకున్నాడు శీను.

    "ఆడనే ఉండరా నా బట్టా, నీ పని చెప్తా"నంటూ తరుముకుంటున్నట్లుగా తనుకూడా కొడుకు శీను వెంటబడింది సావిత్రమ్మ.

    "ఏందిమ్మే సావిత్రీ, పొద్దుగాని పొద్దులో యాడికో ఎల్లబారినట్లుండావే?" ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా తన ఇంటిముందే నిల్చుని ఉన్న మునెమ్మ ప్రశ్నించింది.

    "పొయ్యి ముట్టించుకునేదానికి అగ్గిపెట్టి కోసరం శెట్టి అంగడి కాడికి పంపిస్తే మా శీనుగాడు ఇంకా కొంపకు చేరలా. అందుకే వాణ్ణి ఎతుక్కుంటా ఇట్లొస్తి" చెప్పింది సావిత్రమ్మ క్షణాల్లోనే కళ్ళముందు నుండి మాయమైన కొడుకు కోసం వీధి చివరి వరకు దృష్టి సారిస్తూ.

    "శెట్టి అంగడి కూడా దాటుకొని వచ్చినావు. మీ వాడు ఆడ కనిపించలేదా?" రొంటిన దోపుకుని ఉన్న వక్కాకు సంచిని చేతిలోకి తీసుకుంటూ అడిగింది మునెమ్మ.

    "సాయిబుల పిల్లోడు రహీంగాని జతలో ఆటల్లో పడినాడత్తా, నన్నుజూసి ఇట్లనే పరిగెత్తుకుంటావొచ్చె" చెప్పింది సావిత్రమ్మ.

    "పిల్లోళ్ళంటే అంతే గదమ్మీ మరి. ఈ వయసులోనే గదా వాళ్ళు తులవపనులు జేసేది" వక్కపేడు నోట్లో పెట్టుకుంటూ అంది మునెమ్మ.

    "ఆడుకుంటే సరేగానీ, ఊర్లో ఉండే కొట్లాటలన్నీ యాడ ఇంటి మీదికి తెస్తాడోననే నా భయం" చెప్పింది సావిత్రమ్మ.

    "మల్లా చినుకులు రాలేటట్లుగా ఉండాయి. లోపలికి రామ్మీ కూచ్చుందాం"

    "ఇంగా సంగటి గూడా చేసుకోలేదు మునెమ్మత్తా. మా నా కొడుకు కొంపకు చేరినాడో, లేదో పొద్దవుతావుంది. ఈసారి తీరిగ్గా వస్తాలే" చెప్పి వెనుదిరగబోయింది సావిత్రమ్మ.

    "చాన్నాళ్ళనుండీ నీతో మాట్లాడాలనుకుంటావుండా, రెండడుగులు వచ్చిపోరాదా" మునెమ్మ మరోసారి పిలవడంతో ఇక తప్పదన్నట్లుగా ఆమె వెంట వరండాలోకి నడిచింది సావిత్రమ్మ ఏం మాట్లాడుతుందోనని ఆలోచిస్తూ.

    "నీ మొగుని బూములు బాగం ఇచ్చేది లేదని చెప్పినారంటనే నీ మరుదులు" సాలోచనగా చూస్తూ అడిగింది మునెమ్మ.

    "అవునత్తా. నా మొగుని రోగానికి ఆసుపత్రి కోసరం పెట్టిండే ఖర్చుకు 'చెల్లు'లేసుకున్నామని చెప్పిరి" భూముల పంపకాల్లో మరుదులు చేసిన మోసం గుర్తుకు రాగా సావిత్రమ్మ గొంతు పూర్తిగా బొంగురు పోయింది.

    "ఆ కిలాడీ నా కొడుకులు ముండగల్లురాలైకి ఇంత దగా జేస్తారనుకోలేదమ్మా. వాళ్ళకు వాంతీ బేదీ పెరకా" మెటికలు విరుస్తూ తన అక్కసు వెళ్ళగ్రక్కింది మునెమ్మ.

    "మాయదారి రోగంతో మొగుడే సచ్చిపాయె, ఇంగ ఈ బూములు వొస్తే ఎంత, రాకుంటే ఎంతలేత్తా" చనిపోయిన భర్తను తలుచుకుని నిట్టూరుస్తూ చెప్పింది సావిత్రమ్మ.

    "సల్లగా నీడపాడున కుచ్చోని సంసారం జేసుకునేదానివి, నిండా ముప్పై యేండ్లు దాటకుండానే ఆ బగమంతుడు నీకు ఎంత అన్యాయం జేసెనమ్మీ" ఓదార్చుతూ అంది మునెమ్మ.

    "అంతా మా కర్మ లేత్తా" ముక్కు చీదుకుంటూ చెప్పింది సావిత్రమ్మ.

    "ఇప్పుడు ఎట్ల జేస్తాండావుమ్మీ?" నోట్లోని వక్కాకు ఊటను ఉమ్మేస్తూ అడిగింది మునెమ్మ.

    "నీకు తెలీకుండా ఏముందత్తా. కూలికి పోతే కుండ గాలల్ల లేకుంటే పస్తుల్తో ఎండ గాలల్ల" బదులిచ్చింది సావిత్రమ్మ.

    "పిల్లోడు ఈ మద్దెన బడికిపోవడం లేదంటనే?" అడిగింది మునెమ్మ.

    "అవునత్తా నిజమే" చెప్పింది సావిత్రమ్మ.

    "పెండ్లిజేసే దానికి కూతుర్లు గూడా లేరు, ఉండేది ఒంటి కొడుకే గదా. నువ్వు సంపాదించేది ఇద్దరికీ సరిపోకనా?" సాలోచనగా అడిగింది మునెమ్మ.

    "వాడు సదివి ఎవుర్ని ఉద్దరించల్లలేత్తా?" అంది సావిత్రమ్మ.

    "అదేందమ్మీ అట్లాంటావు. మీ శీనుగాడు మా చంద్రప్ప కొడుకు జతగాడే గదా. పదో తరగతి సదువుతాండేటోన్ని బడి మానిపించేసినా వంటనే?" సావిత్రమ్మ ధోరణి ఏ మాత్రం నచ్చనట్లుగా అంది మునెమ్మ.

    "వాణ్ణి బడికి పంపిస్తే జరుగుబాటు ఉండల్ల గదత్తా?"

    "శీనుగాని సదువు నీకు అంత బరువుగా ఉంటే టౌనులో హాస్టల్‌లో చేర్పించరాదా. తిండీ, గుడ్డా, పుస్తకాల ఖర్చు గవుర్మెంటోల్లే భరించుకొనేటోల్లు గదా" సలహా ఇస్తున్నట్లుగా చెప్పింది మునెమ్మ.

    "బళ్ళో ఐవార్లు గూడా ఆ మాటే చెప్పినారత్తా. కానీ వాణ్ణి బడికి పంపడం కుదిరే పని కాదులే" అంది సావిత్రమ్మ. 

    "వాడు నాలుగు అచ్చరాలు నేర్చుకోని ఏందన్నా చిన్న పనికి కుదురుకుంటే ఎండనబడి, వాననబడి నువ్వు కూలి పనులకు పొయ్యే అగసాట్లు తప్పించి వాడే నిన్ను నీడపాటున కుచ్చోబెట్టి సాకుతాడు గదా" పెద్దరికంతో చెబుతున్నట్లుగా అంది మునెమ్మ.

    "వాని సదువు మాట అయ్యేపని, పొయ్యేపని కాదులే మునెమ్మత్తా"

    "పిల్లోన్ని గురించి నీ మొండితనం మానుకునేటట్లుగా లేవంటే నువ్వు మనిసిగా కనిపించడంల్యామ్మీ" మునెమ్మ మాటల్లో కాస్తంత కోపం ధ్వనించింది.

    "నువ్వు, బళ్ళో ఐవార్లు చెప్పినట్లుగా వాణ్ణి బడికి పంపిస్తే ఇప్పుడు కూటికి జరగల్ల గదా" సన్నగా రాలుతున్న చినుకుల వంక చూస్తూ అంది సావిత్రమ్మ.

    "అదేంది సావిత్రీ, ఇప్పుడు కూలీలు గూడా బాగానే పెరిగినాయి. నువ్వు కూలికి పోతే వచ్చే దుడ్డ్లు ఇద్దరికీ సరిపోవా?" ఆశ్చర్యంగా అడిగింది మునెమ్మ శీనుగాడు కూడా తోడు వచ్చి సంపాదించాలా అన్నట్లుగా చూస్తూ.

    "దుడ్లు సరిపోయినా నేను కూలికి పోవల్లగదా" సంభాషణ పొడిగించడం ఏమాత్రం ఇష్టం లేనట్లుగా అంది సావిత్రమ్మ.

    "మొగుడు సచ్చిన దిగులుతో నీకేమన్నా తిక్క పట్టిందామ్మీ. నువ్వు కూలికి పొయ్యేదానికీ, కొడుకును బడి మానిపించిందానికీ ఏం సంబంధమో నాకు అర్థంగాలా?" అనుమానంగా చూస్తూ అడిగింది మునెమ్మ.

    "మొగుడు పోవడం వల్లనే నేను ఒక్కదాన్నే అడుగు బయట పెట్టల్లంటే కష్టంగా ఉంది. ఊర్లో మగ నా బట్టల సూపులన్నీ నా మిందనే ఉండాయి. పెండ్లికి ఎదిగిండే కూతుర్లను ఇండ్లల్లో పెట్టుకుని ఉండేటోల్లుగూడా ఎప్పుడు 'వాటం' బడుతుందానని జూస్తాండారు" గొంతుకు అడ్డుపడుతున్న ఏడుపును ఆపుకుంటూ చెప్పింది.

    "పది నిమిషాలు కొంగుబరిస్తే సందేళకాడ దాకా కూలిపైని చెయ్యకుండానే 'లెక్క' ఇస్తానని ఒకడు, ఎవురికీ తెలీకుండా 'ఉంచుకుంటే' నీ కష్టం తప్పిస్తానని ఇంకోడు, పనికాడ మింద చేతులేసేటోళ్ళు, ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావ్? కడాకు తోటీ కూలోళ్ళకు కూడా నా బతుకు లోకువైపాయె గదా" కొనసాగింపుగా చెప్పింది వెక్కిళ్ళను ఆపుకుంటూ.

    "మీసాలు గూడా సరిగ రానోడు, శీనుగాడు నీ ఎనకంబడీ కూలికి వచ్చినంత మాత్రాన ఇవన్నీ ఉండవంటావా?" సావిత్రమ్మ పరిస్థితికి జాలిపడుతూనే అడిగింది మునెమ్మ.

    "చిన్నది గానీ, పెద్దది గానీ ఏపుగా కాసిండే పైరుకు ముండ్ల కంప అంటూ ఏదో ఒకటి అడ్డంగా ఉంటే గదా 'గొడ్లు' జొరబడకుండా ఉండేది" కొడుకు శీనును తన శీలం కాపాడే 'ముళ్ళకంచె'గా అర్థం చేసుకోమన్నట్లుగా చెప్పింది సావిత్రమ్మ.

    "ఎవురమ్మే ఆ నా బట్టలు నీ మింద కన్నేసింది?" కుతూహలంగానూ, కాస్తంత బాధగానూ చూస్తూ అడిగింది మునెమ్మ.

    "ఆ సంగతి ఎందుకులేత్తా. పేర్లు చెప్పి వాళ్ళ సంసారాల్లో ఎందుకు చిచ్చుబెట్టాలగానీ" అంటూ అప్పుడే వీధిలో నుండి ఇంట్లోకి అడుపెడుతున్న మునెమ్మ భర్త రామాంజులు వైపు అదోరకంగా చూస్తూ నెత్తిన చీరకొంగు కప్పుకుని ఇంటిదారి పట్టింది సావిత్రమ్మ.

(చిత్ర మాసపత్రిక అక్టోబరు 2009 సంచిక నుండి)  
Comments